Our Health

Archive for మే, 2012|Monthly archive page

హృదయం ‘ లయ’ తప్పితే, లక్షణాలు ఎలా ఉంటాయి ?.36.

In Our Health on మే 17, 2012 at 8:05 సా.

హృదయం ‘ లయ’ తప్పితే లక్షణాలు ఎలా ఉంటాయి ?.36.

 
మనం క్రితం టపాలో చూశాము కదా ! హృదయం లయ అంటే రిధం అంటే ఏమిటో !
మరి అలా ‘ లయ ‘ తప్పినప్పుడు  ఏ లక్షణాలు ఉంటాయి ? :
సాధారణం గా మనం గమనించే అంత స్పష్టంగా లక్షణాలు కనిపించక పోవచ్చు.  డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు చేసే పరీక్షలలో బయట పడ వచ్చు.
కొందరు  వారిలో సాధారణ వేగం కన్నా ఎక్కువ వేగం తో గుండె కొట్టుకోవడం గమనించ గలుగుతారు. ( ఇలా వేగం గా గుండె లేక హృదయం కొట్టుకోవడాన్ని , ట్యాకీ కార్దియా లేక tachy cardia అంటారు. కంగారు పడవద్దు ట్యాకీ అంటే వేగం అని , కార్డియా అంటే గుండె అని అర్ధం ) అలాగే మరి కొందరు వారిలో గుండె ఎప్పటి కంటే నిదానం గా కొట్టుకోవడం కూడా గమనించ గలుగుతారు. ఈ పరిస్థితిని  బ్రాడీ కార్దియా లేక brady cardia అంటారు. బ్రాడీ అంటే  నిదానం లేక స్లో  అని , కార్దియా అంటే గుండె అనీ అర్ధం. ఈ రెండు పరిస్థితులూ సాధారణం గా  థయిరాయిడ్  ( thyroid ) గ్రంధి సరిగా పని చేయక పోవడం వల్ల కలగ వచ్చు.  ఇలా  ఎవరికి వారు వారి వారి గుండె కొట్టుకోవడం  ఫీల్ అవుతే  అప్పుడు వారికి పాల్పిటే షన్స్  ( palpitations ) వచ్చాయి అంటారు.
ఇలా సాధారణం గా తీవ్రం గా భయ పడినప్పుడు, లేదా ,  సరిగా  ప్రిపేరు  అవకుండా పరీక్ష రాద్దామని పరీక్ష హాలు లోకి ప్రవేశించి నప్పుడు, లేదా బాగా ప్రిపేరు  అయి కూడా ,  పేపరు ఎట్లా వస్తుందో అని విపరీతం గా ఆందోళన పడుతున్నప్పుడు కూడా జరగ వచ్చు.
ఇక్కడ ఒక అనుభవం. కాలేజీలో  ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి.  క్లాసు లోని అందమయిన యువతులలో ఒక యువతి . పరీక్షల ముందు ఆందోళన పడడం  ఆమె నైజం. చక్కగా చదువుతుంది కూడా ! కానీ ఆందోళన పడడం కూడా మానదు.
ఇలా ఒక పరీక్ష రోజున, పేపరు అందుకోగానే   కళ్ళు తిరిగి పడిపోయారు అమ్మాయి గారు.  వెంటనే ఒక అసిస్టెంటు ప్రొఫెసరు గారు ఆ అమ్మాయి గారి ప్రధమ చికిత్స కోసం వచ్చారు. అందరి లోనూ తీవ్రమైన ఉత్కంటత. ముఖ్యం గా మా అందరిలో( యువకులలో  ) ఆ సమయం లో పేపరు ఎట్లా ఇచ్చారో అనే విషయం గమనించే స్థితి లో ఉంటే కదా !
వెంటనే ఆయన, ఆ అమ్మాయి ముఖం మీద చల్లని నీరు చల్లి , తుడిచి , మెల్లిగా లేపి కూర్చో పెట్టారు. కొన్ని నిమిషాల వరకూ సరిగా మాట్లాడ లేదు ఆమె. ఎవరి సహాయం లేకుండా ఆ ప్రొఫెసరు గారు  ఆమె సున్నితమైన నడుము చుట్టూ తన చేతులు పోనిచ్చి , ఆమెతో ఆలింగనం చేసుకుంటున్న రీతిలో ఆమెను లేవనెత్తి  బయటకు నడిపించుకు పోయాడు. హాలు అంతటా  అంత నిశ్శబ్దం లోనూ ,  యువకులందరి దీర్ఘ ఉచ్వాస నిశ్వాస లు ఒక్క సారి వినిపించాయి !  ఆమె అలా అర్ధ నిమీలిత నేత్రాలతో వాడి పోయిన తామర పూవు లా ఆయన గారి మీద వాలి పోయి ప్రధమ చికిత్స అయిన తరువాత మళ్ళీ పరీక్ష రాశారు.   (  అలా పడిపోయిన సమయం లో ఆమె హృదయం ఎంత వేగం తో కొట్టుకుందో లేదో ఎవరికీ  తెలియదు ! కానీ  పరీక్ష హాలు లో ఉన్న యువకులందరి హృదయాలు మాత్రం  లయ తప్పాయి ఆ కొన్ని క్షణాలూ ! ) పరీక్ష అయి పోయిన తరువాత  యువకులందరిలో  తీవ్రమైన చర్చ.  ఆ చర్చల సారాంశం ఒకటే ! ఆ అసిస్టెంట్ ప్రొఫెసరు  చాలా చాలా అదృష్ట వంతుడని.  అప్పుడే జరిగిన పరీక్ష గురించి ఒక్కడు మాట్లాడితే ఒట్టు !
ఇలా ! కొందరు కొన్ని నిమిషాలు స్పృహ తప్పి పడి  పోవచ్చు.కొంత మంది లో తల తిరిగినట్టు అవడం , కళ్ళు తిరుగుతున్నట్టు  అవడం కూడా జరగవచ్చు.
అలాగే కొందరిలో ఊపిరి తీసుకోవడం కష్ట మనిపించ వచ్చు. ఇంకొందరిలో గుండె నొప్పి  కలగ వచ్చు ,
వచ్చే టపాలో  హృదయం లయ తప్పటానికి కారణాలూ లేక రిస్కు ఫ్యాక్టర్ల గురించి తెలుసుకుందాము !

హృదయం ‘ లయ తప్పటం ‘ అంటే ఏమిటి .35.

In Our Health on మే 17, 2012 at 10:22 ఉద.

హృదయం ‘ లయ తప్పటం ‘ అంటే ఏమిటి .35.

మానవులందరి లో సహజం గా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందని మనకందరికీ తెలుసు కదా ! దీనిని హార్ట్ రేట్ ( heart rate ) అంటారు. ( గుండె యాభై నుంచి వంద సార్లు ,నిమిషానికి కొట్టుకోవడాన్ని నార్మల్ హార్ట్ రేట్ అంటారు. అంటే యాభై కంటే తక్కువ సార్లు కానీ , వంద కంటే ఎక్కువసార్లు కానీ కొట్టుకుంటుంటే అది అసాధారణం అనబడుతుంది. అప్పుడు వైద్య సలహా తీసుకోవాలి )
అంటే అరవై సెకండ్లకు రమారమి డెబ్బయి రెండు సార్లు కొట్టుకుంటుంది. కానీ ఈ డెబ్బయి రెండు సార్లూ ఒక లయ బద్ధం గా కొట్టుకుంటుంది. దీనినే రిధం ( Heart Rhythm ) అంటారు.
రిధం ( rhythm ). అంటే , ఈ అరవయి సెకండ్లలో మొదటి పది సేకనులూ ముప్పయి సార్లు కొట్టుకొని , మిగతా యాభయి సేకండ్లూ నలభయి రెండు సార్లు కొట్టుకోవడం జరగదు. ఒక లయ తో డెబ్బై రెండు సార్లూ , సమానం అయిన అంతరాయం అంటే interval తో కొట్టుకుంటుంది.
ఇది ఆరోగ్య వంతమైన మానవులలో. చాలా ఆరోగ్య వంతమైన అథ్లెట్ లకు, గుండె తక్కువసార్లు కొట్టుకోవడం సహజం. అది ఏమీ జబ్బు అనబడదు అప్పుడు. ( ఉదాహరణ కు టెన్నిస్ ఆటలో అత్యంత ప్రముఖులలో ఒకడైన స్వీడిష్ ఆట గాడు జార్న్ బోర్గ్ కు నిద్ర లేచినప్పుడు 50, మద్యాహ్నానికి 60 సార్లు కొట్టుకునేది ట , గుండె, ( నిమిషానికి ).
అలాగే మనం ఆతురుత తో ఉన్నప్పుడు గుండె వేగం గా కొట్టుకుంటుంది. అంటే మన హార్ట్ రేట్ ఎక్కువ అవుతుందన్న మాట. అప్పుడు కూడా హార్ట్ రిధం మారదు. అంటే ఎక్కువ సార్లు కొట్టుకున్నా మొదటి ఇరవయి సేకండ్లూ నిదానం గా కొట్టుకోవడం , లేక మిగతా నలభై నిమిషాలూ వేగం గా కొట్టుకోవడం లాంటిది జరుగదు, ఆరోగ్య వంతులలో !
అలా కాక హృదయం లయ తప్పితే అంటే దాని రిధం మారితే, లేక రిధం అవకతవక గా అయితే ఆ పరిస్థితిని హార్ట్ ఎరిత్మియా ( Heart or Cardiac arrythmiya ) అంటారు.
ప్రేమ లో హృదయం లయ తప్పుతుందా ?:
ప్రేమలో ‘ పడితే ‘ , గుండె ఒక్కోసారి ఎక్కువ గా కొట్టుకుంటున్నట్టు అనిపించ వచ్చు. లేదా ‘ ఒక బీట్ మిస్సవుతున్నట్టు కూడా అనిపించవచ్చు ! ఇది కూడా సహజమే ! అంటే ప్రేమలో ‘ ఇరుక్కు పొతే ‘ తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతాము మనం. దాని ఫలితమే ‘ హృదయం లయ తప్పడం ‘ అంటే హార్ట్ రేట్ కానీ రిధం గానీ మారడం. కానీ ఈ మార్పులన్నీ తాత్కాలికం మాత్రమే ! అంటే ప్రేమించడం మానితే ఆగి పోతాయని అర్ధం చేసుకోకండి ! ప్రేమ కంటిన్యూ అవుతున్నా , ఈ తీవ్ర భావోద్వేగాలు నిరంతరం ఉండవు గా !అందువల్ల. అలాగే హృదయం ‘ లయ ‘ తప్పని వాళ్ళు ప్రేమించడం లేదనీ అర్ధం చేసుకో కూడదు. ప్రేమిస్తున్నప్పుడు అలా జరిగితే కంగారు పడవద్దు ‘ ప్రేమ ‘ శృతి మించి ‘ ‘ రాగాన ‘ లేక ‘ మధుర రాగాల ‘ పాకం ‘ లో పడుతుందని మాత్రమే అనుకోవాలి మరి !
ప్రేమికులు తమ అనుభవాలు తెలియ చేయండి ‘ హృదయ పూర్వకం గా ‘ !

ఇలా హృదయం లయ తప్పితే ఏమవుతుందో వచ్చే టపాలో తెలుసుకుందాము !

కరోనరీ బైపాస్ ఆపరేషన్ అంటే ఏమిటి ?.34.

In Our Health on మే 16, 2012 at 8:00 సా.

కరోనరీ బైపాస్  ఆపరేషన్  అంటే ఏమిటి ?.34.

మనం క్రితం టపాలలో యాంజైనా కు చికిత్స లో భాగం గా  గుండె పనిచేయడానికి అవసరమైన  రక్తాన్ని సరఫరా చేసే , కరోనరీ ధమనులు పాక్షికం గా పూడుకు పొతే, వాటిని  యాంజియోప్లాస్టీ అనే ప్రొసీజర్ తో ఎట్లా సరి చేస్తారో  తెలుసుకున్నాము కదా !
అలాగే  బెలూన్ తో  కరోనరీ ధమని లో పూడిక తీసివేశాక  మళ్ళీ పూడుకు పోవడం కానీ, లేక  ముడుచుకు పోవడం కానీ జరగకుండా  ఆ ధమని లో కి స్టెంట్  పెట్టడం గురించి కూడా  తెలుసుకున్నాము కదా !
ఇంత వరకూ బాగానే ఉంది.  కానీ , కొన్ని పరిస్థితులలో ,  చెడు కొలెస్టరాల్ పేరుకుపోయి , గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ధమనులు చాల భాగం పూడుకు పోతాయి. అట్టి పరిస్థితి లో  ఆ ధమనులను  రిపేరు చేయడం అసాధ్యం. మరి అప్పుడు గుండె సరిగా కొట్టుకుంటూ ఉండడానికి  , గుండె కు కూడా , ఆక్సిజెన్ సరఫరా ,  రక్తం ద్వారా జరగాలి కదా ! మరి రక్తం సరఫరా చేయడానికి రక్త నాళాలు ఏవి ?  కరోనరీ ధమనులు  బ్లాక్ అయి ఉన్నాయి కదా !
అట్లాంటి పరిస్థితులలో చేసే ప్రొసీజరు ను కరోనరీ బైపాస్ ఆపరేషన్  అంటారు.  బైపాస్ అంటే  ఇంకో దోవ ( another route ) ద్వారా రక్త సరఫరాను మళ్ళీ ఏర్పరుచుతారన్న మాట.
అంటే కరోనరీ ధమని కొంత భాగం వరకు పూడుకు పొతే ,  ఆ భాగాన్ని వదిలి వేసి , చివర భాగానికి, ఇంకో ధమనిని  కానీ , అంటే artery , లేక ఇంకో సిర ను కానీ (  అంటే  vein )  మన శరీరం లో ఇంకో భాగం నుంచి తీసి అక్కడ జత చేస్తారు.
అలా జత చేయడం వల్ల, ఆ భాగం లోని గుండె కండరాలకు , మళ్ళీ రక్త సరఫరా సరిగా అంది ,  గుండె నొప్పి రాకుండా ఉంటుంది. అంటే గుండె పోటు కూడా కొన్ని దశాబ్దాల వరకూ రాదన్న మాట.
సాధారణం గా ఇంకో ధమని ని మన రొమ్ము మీద నుంచి తీసి కరోనరీ ధమని కి జత చేస్తారు. ( అంటే Internal mammary artery ) అలాగే సిర ను సాధారణం గా మన కాలికి ఉన్న సిర ( Saphenous vein ) ను తీసి, జత చేస్తారు.
ఇలా మన శరీరం లో ఇంకో చోటనుంచి పూడిక ఏమీ లేని సిర ను కానీ , ధమని ని కానీ తీసి , గుండె  ధమని కి  జత చేసి , గుండె రక్త సరఫరా  ‘ ఇంకో దోవ ‘ ద్వారా మళ్ళీ పునరుద్ధరించే  ప్రొసీజర్ మొత్తాన్ని , కరోనరీ బైపాస్ ఆపరేషన్ అంటారు.
మీలో ఎంత మందికి యు ట్యూబ్  వీడియో చూసే అమరిక ఉందొ , మీ కంప్యుటర్ లలో. వీలు కనక ఉంటె పైన ఉన్న వీడియో చూడండి , ఇది నాలుగు భాగాలు గా ఉంది. ఈ వీడియో నిజం గా జరుగుతున్న ఆపరేషన్ ను తీసిన వీడియో ఇది.
చూసి , మీ అభిప్రాయం తెలపండి.

యాంజియో ప్లాస్టీ లో స్టెంట్ వేయడం అంటే ఏమిటి ?.33.

In Our Health on మే 15, 2012 at 9:03 సా.

యాంజియో ప్లాస్టీ లో స్టెంట్ వేయడం అంటే ఏమిటి ?.33.

మనం క్రితం టపాలో చూశాము , గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనుల పూడికను ఒక క్యాతెటార్ ద్వారా  చిన్న బెలూన్ ను ధమని లోకి ప్రవేశ పెట్టి  ఆ బెలూన్ ను  లాగుతూ ఆ పూడికను లేక ప్లేక్ ను అక్కడనుంచి తీసి వేయడం.
అట్లా ధమనిలో ఏర్పడ్డ  పూడికను అంటే పార్షి యల్  బ్లాక్ ను తీసివేసిన తరువాత , ఆ ధమని  మళ్ళీ రక్త సరఫరా ను మామూలు గా గుండె కండరాలకు సరఫరా చేస్తుంది. కానీ  కొన్ని పరిస్థితులలో  ఆ ధమని మళ్ళీ పూడుకు పోవడం కూడా జరుగుతుంటుంది. 
ఇలా మళ్ళీ  కరోనరీ ధమనులు పూడుకు పోకుండా  ఒక స్టెంట్ ను ప్రవేశ పెడతారు. ఈ స్టెంట్ సాధారణం గా ఒక సున్నితమైన లోహం తో చేసిన జాలీ  లాగా ఉంటుంది. కానీ ఈ జాలీ లేక వల లాగా ఉన్న  స్టెంట్  ఒక గొట్టం ఆకారం లో ఉంటుంది.  అతి సున్నితం గా ఈ స్టెంట్ , లోహం పోగులతో చేసిన వల లా ఉన్నప్పటికీ , చాలా గట్టిగా ఉండి అది ఉన్న ప్రదేశం లో ధమని ని కొలాప్స్  అవకుండా అంటే ముడుచుకు పోనీకుండా  ఉంచుతుంది. అలా ఉంచడం వల్ల రక్త ప్రసరణ సరిగా అందుతుంది , ఆ ధమని ద్వారా ! 
పైన ఉన్న మొదటి పటం చూడండి అందులో క్యాతెటార్  ద్వారా ప్రవేశ పెట్టిన బెలూన్ ఇంకా  స్టెంట్, మొదట ముడుచుకు పోయి ఉంటాయి. పాక్షికం గా పూడుకుపోయిన కరోనరీ ధమని లో ప్రవేశించిన తరువాత , బెలూన్ ను పెద్దగా చేసి దాని ద్వారా అక్కడ ఉన్న పూడిక అంటే ప్లేక్ ను పెకిలించుతారు. అలా పెకిలించిన తరువాత బెలూన్ తో పాటు ప్రవేశ పెట్ట బడిన స్టెంట్ ( అప్పటి వరకూ ముడుచుకు పోయి ఉంటుంది ) అప్పుడు తెరుచుకుని  ఆ ధమని ని మళ్ళీ పూడుకు పోకుండా, ముడుచుకు పోకుండా   ఉంచుతుంది. 
 
ఇక రెండో పటం లో ఒక వేలు మీద ఉంచిన  రెండు స్టెంట్ లను చూడండి వాటి నిజమైన పరిమాణం ఎంతో అవగాహన ఏర్పడడానికి ( అవి సాధారణం గా కరోనరీ ధమని ఎంత వ్యాసం తో ఉంటాయో తెలియ చేస్తున్నాయి కదా ! ) 
 
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు చూద్దాము ! 

యాంజియో ప్లాస్టీ కధ ఏమిటి ?.32.

In Our Health on మే 15, 2012 at 7:39 సా.

యాంజియో ప్లాస్టీ  కధ ఏమిటి ?.32.

మనకందరికీ తెలుసు , సాధారణం గా  యాంజైనా  అంటే గుండె నొప్పి వచ్చిన వాళ్లకు  యాంజియో ప్లాస్టీ అనే   ప్రొసీజర్ చేస్తారని.
కానీ దాని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము.మనం మునుపటి టపాలలో తెలుసుకున్నాము కదా యాంజైనా అంటే గుండె నొప్పి రావడం గుండెకు సరఫరా చేసే రక్త నాళాలు ( అంటే కరోనరీ ధమనులు )  పాక్షికం గా  కొవ్వు చేరి పాక్షికం గా పూడుకు పోవడం వల్ల, గుండె కండరాలకు ఆక్సిజెన్ సరిగా అందక , గుండె నొప్పి వస్తుందని.
మరి కేవలం మందులతోనే ఈ పూడిక తెరుచుకోదు కదా ! అందు వల్ల అప్పుడు యాంజియో ప్లాస్టీ  అనే ప్రొసీజర్  చేస్తారు.
ఈ పద్ధతిని మొదట  కనుక్కోన్నది ,  అమెరికా డాక్టరూ , రేడియాలజీ స్పెష లిస్టూ అయిన  చార్లెస్ డాటర్.    ( Dr.Charles Dotter ). ఇది 1964 లో జరిగింది.  Dr.డాటర్  ఒక 82 సంవత్సరాల  స్త్రీ కి  తొడ భాగం లో ఉన్న ధమని ( అంటే ఫీమోరల్ ఆర్టరీ ) పూడుకు పోయి , ఆమె తన కాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది.  ఆ స్త్రీ కాలు తీసివేయడానికి ఒప్పుకోలేదు. అప్పుడు డాక్టర్ డాటర్ ఒక ప్రయత్నం గా , ఎక్స్ రే సహాయం తో చూసుకుంటూ , ఒక  క్యాతెటార్ ద్వారా ( అంటే catheter ) ఒక బెలూన్ ను  ఫీమోరల్ ధమని లోకి ప్రవేశ పెట్టాడు . తరువాత , ఆ బెలూన్ ను కొంత పీడనం తో నింపి , ఆ బెలూను ను క్రిందకూ పైకీ ,  పూడిక ఉన్న ధమని లో లాగటం వల్ల , ఆ పూడిక పోయింది.  ఆ స్త్రీ కాలిలో రక్త ప్రసరణ తిరిగి వచ్చి ,  కాలు సవ్యం గా అయింది. ( డాక్టర్ డాటర్ కు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఈ  విజయానికి )
కానీ మానవుల గుండె కు ఈ యాంజియో ప్లాస్టీ మొట్ట మొదటి సారి చేసినది జర్మన్ డాక్టర్  గ్రుంజిగ్ ( Andreas Gruentzig ) September 1977 లో.
పైన ఉన్న పటం లో గమనించండి, గుండె కు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమని లో  ముందుగా ఎలా క్యా తెటార్ ను ప్రవేశ పెట్టి , దానితో ఉన్న బెలూన్ ను  నింపి  , ఆ బెలూన్ ను క్రిందకూ మీదకూ కదల్చడం వల్ల  ప్లేక్ అంటే  చెడు కొవ్వు తో  ధమని గోడలలో ఏర్పడిన పెచ్చు  ఊడి పోతుంది. దానితో  ఆ కరోనరీ ధమని మామూలు గా గుండె కు రక్త సరఫరా చేయగలుగుతుంది. అంటే రక్తం తో పాటు ఆక్సిజెన్ కూడా గుండె కండరాలకు అంది, గుండె నొప్పి   తగ్గి పోతుంది. 
యాంజియో ప్లాస్టీ అంటే రక్త నాళాన్ని రిపేరు చేయడం.  ఈ పద్ధతిని  మన దేహం లో ఎక్కడ ఉపయోగిస్తే, ఆ రక్త నాళం పేరు తో దానిని పిలుస్తారు.
ఉదాహరణకు :
కరోనరీ యాంజియో ప్లాస్టీ ( Coronary angioplasty ) : గుండె ధమనుల రిపేరు.
కేరాటిడ్ యాంజియోప్లాస్టీ ( Carotid angioplasty ) : మెడలో ఉండే ప్రముఖ ధమని ని కేరాటిడ్ ధమని అంటారు. ఇందులో పూడిక వస్తే మెదడు కు రక్త సరఫరా సరిగా అందక  పక్షవాతం లేక స్ట్రోక్  రావచ్చు, అందువల్ల ఇక్కడ కూడా ధమనిని రిపేరు చేస్తారు.
రీనల్ యాంజియోప్లాస్టీ  ( Renal angioplasty ) : అంటే మూత్ర పిండాలకు సరఫరా చేసే ధమని ని రిపేరు చేయడం. ఇలా చేయక పొతే , పూడిక మూత్ర పిండాలకు రక్త సరఫరా అందక , కిడ్నీ ఫెయిల్యూర్ అవవచ్చు.
మనం గుర్తు ఉంచుకోవలసినది ,  ఈ పూడికలు ఎక్కడ ఏర్పడినా ,  అందుకు  ప్రధాన విలన్  పేరు ‘  LDL కొలెస్టరాల్ ‘ ( లేక ప్లేక్ ) !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ! 

ఏస్ ఇన్హిబిటార్ మందులు హై బీ పీ ని ఎట్లా తగ్గిస్తాయి ? .31.

In Our Health on మే 14, 2012 at 10:34 సా.

ఏస్ ఇన్హిబిటార్ మందులు  హై బీ పీ ని ఎట్లా తగ్గిస్తాయి ? .31. 

మనం క్రితం టపాలో చూశాము. మొదటి దశలో కొత్తగా అధిక రక్త పీడనం కనుక్కొన్నప్పుడు ,  A అంటే ఏస్ ఇన్హిబిటార్ వాడమని సలహా ఇస్తారని.
ఈ ఏస్ ఇన్హిబిటార్  55 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారికి వాడమని సలహా ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఏస్ ఇన్హిబిటార్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాము.
క్రింద పటం గమనించండి. 
మన రక్త నాళాలు నార్మల్ గా  అంటే సాధారణం గా   వెడల్పు అయినప్పుడు ,  అంటే వాటి వ్యాసం పెరిగినప్పుడు  రక్త పీడనం తగ్గుతుంది.  అప్పుడు  వాటి గోడలలో ఉన్న కండరాల కణాలకు యాంజియో టేన్సిన్ అనే రసాయనం అతుక్కుంటుంది.
( మనం చూశాము కదా , మునుపటి టపాలో , మన రక్త నాళాలు లోహం తో చేసిన పంపు ల లా కాక , కండరాల పొరతో చేసిన పంపులని.  రక్త నాళాలలో ఈ కండరాలు ఉబ్బెత్తుగా మనకు సహజం గా కనిపించే  చేతి, కాళ్ళ  కండరాలు గా కాక  పలుచటి పొరలు లాగా అమరి ఉంటాయి. ఉదాహరణ కు  మనం పొడవాంటి బూర అంటే బెలూన్ , ఊదక ముందు అంటే గాలి నింపక ముందు , కుంచించుకు పోయి ఉంటుంది కదా. కానీ అది , దాని లోకి గాలి ఊదినప్పుడు , వ్యాకోచించు తుంది కదా !  అలా వ్యాకోచించడం పలుచటి పొర ద్వారానే అవుతుంది కదా ! అలాగే మన రక్త నాళాలు వ్యాకోచించి ఉన్నప్పుడు , వాటిలో రక్తం ఉన్నా , విశాలం గా ఉండడం తో రక్త పీడనం తగ్గుతుంది )
ఒకసారి యాంజియో టేన్సిన్  అనే జీవ రసాయనం  కండరాల కణాలకు అతుక్కొగానే,  ఆ కండరాలు సంకోచిస్తాయి అంటే బిగుతు గా అయి తద్వారా,  రక్త నాళాల వ్యాసం  తగ్గిస్తాయి. ఇలా వాటి వ్యాసం తగ్గటం వల్ల రక్త పీడనం పెరుగుతుంది.
మనం తీసుకునే ఏస్ ఇన్హిబిటార్ మందు  యాంజియో టేన్సిన్ అనే రసాయన పదార్ధాన్ని తయారు కాకుండా అడ్డుకుంటుంది.(  అందువల్లనే  ఈ మందులకు ACE inhibitors అనే పేరు వచ్చింది. ( A C E అంటే  Angiotensin  Converting Enzyme ) ఆ ఎంజైం ను ఆపి తద్వారా  యాంజియో టేన్సిన్ తయారు కావడం తగ్గించడం వల్ల ఈ మందులకు యాంజియోటేన్సిన్ కన్వర్టింగ్ ఎంజైం ఇంహిబిటర్స్ అని పేరు వచ్చింది ). అలా  యాంజియో టేన్సిన్ అనే రసాయనం తయారు కాక పోవడం వల్ల  లేక దాని తయారీ తగ్గి పోవడం వల్ల  , రక్త నాళాలు వ్యాకోచ స్థితి లోనే ఉండి అధిక రక్త పీడనం తగ్గిస్తాయి.  పైన ఉన్న పటం లో రెండవ చిత్రం లో ACE inhibitors యాంజియో టేన్సిన్ రక్త నాళాల కండరాలకు అతుక్కోకుండా చేయడం వల్ల , రక్త నాళం వ్యాకోచ స్థితి లోనే  ఉండడం గమనించండి.
ఇట్లా  అందరిలోనూ రక్తనాళాల వ్యాకోచ సంకోచ  క్రియలు జరుగుతూ ఉంటాయి. కానీ అందరిలోనూ  అధిక రక్త పీడనం ఉండదు. దానికి కారణం స్పష్టం గా ఇంతవరకూ తెలియదు. కానీ తీవ్రమైన వత్తిడి కూడా ఈ పరిస్థితికి కారణం అవుతుందని కూడా భావించ బడుతున్నది. అంటే మనం నిత్యం వత్తిడి గా ఉంతే  అప్పుడు రక్త    రక్త నాళాలలో  కండరాల పొర ఎక్కువ సంకోచించి , తద్వారా అధిక రక్త పీడనం కలిగించ వచ్చు. అందువల్ల నే  వత్తిడి తగ్గించుకునే , రిలాక్సేషన్ , లేక మెడిటేషన్ , లేక యోగా ప్రక్రియలకు ప్రాముఖ్యం చాలా ఉంది, అధిక రక్త పీడనం కంట్రోలు చేయడం లో.
మరి ఏస్ ఇన్హిబిటార్  రోజూ వేసుకోవాలా ?:
రక్త నాళాలు  సంకోచం , వ్యాకోచాలు రోజూ  జరుపుతుంటాయి కదా !  అందువల్ల రోజూ  ఈ మందు తీసుకోవడం మానకూడదు.
ఇంకో గమనిక : ఈ ఏస్ ఇన్హిబిటార్  మందుల పేర్లన్నీ  ‘ ప్రిల్ ‘ లేక  pril  అనే  చివరి అక్షరాలతో  ఉంటాయి గమనించారా ! అంటే క్యాప్టో ప్రిల్, ఏనాలాప్రిల్, రామిప్రిల్,  లిసినోప్రిల్.. ఆలా !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

హై బీ పీ కి నైస్ ( NICE ) ( ఇంగ్లండు ) వారు ఏ మందులు వాడమంటున్నారు ?.30.

In Our Health on మే 14, 2012 at 9:51 ఉద.

హై బీ పీ కి నైస్ ( NICE ) ( ఇంగ్లండు ) వారు ఏ మందులు వాడమంటున్నారు ?.30.

 
నైస్ అంటే  నేషనల్ ఇన్స్టిట్యూట్  అఫ్ క్లినికల్ ఎక్సేల్లెన్స్ . వీరు అధిక రక్త పీడనం కొత్తగా కనుక్కున్న వారికి మందులతో చికిత్స ఒక పధ్ధతి లో చేయాలని సూచించారు. 
ఆ పధ్ధతి నమూనా పట్టీ క్రింద చూడ వచ్చు మీరు. 
ఈ విషయాలు అందరం ఎందుకు తెలుసుకోవాలి? :
ఎందుకంటే ,  మనం సాధారణంగా చూస్తుంటాము.  అధిక రక్త పీడనానికి , వేరు వేరు మందులు రాస్తుండటం.  అది మనకు చాలా సందేహాలకు మూలం అవుతుంది.  భారత దేశం లో ప్రత్యేకించి , ఏ డాక్టరు కూ , వివరం గా వారు ఇస్తున్న మందుల గురించి వారి పేషంట్లకు చెప్పే  పెషన్సూ అంటే ఓపికా , సమయమూ ఉండదు. కొందరికి సమయం ఉన్నా ,  ఎప్పుడూ , చాలా చాలా బిజీగా ఉన్నట్టు ఉంటారు. అందువల్ల  మొదట ఏ వయసులో  ఏ మందులు  ఇస్తారో ఒక అవగాహన ముందుగా , ఆ మందులు తీసుకునే  మనకు కలిగితే, అప్పుడు , ఆ  మందులు ఇస్తున్న డాక్టరు ను అడిగి అనుమానాలు తీర్చుకోవచ్చు కదా !
 ఈ విషయాలన్నీ మనకు ఎందుకు ముఖ్యం అంటే , సరిగా కంట్రోలు అవని అధిక రక్త పీడనం మన జీవితాలలో సృష్టించే అనారోగ్య తుఫానుల గురించి చాలా వివరం గా మునుపటి టపాలలో తెలుసుకున్నాము కదా ! 
ఇప్పుడు క్రింద  ఉన్న టేబుల్  పటం చూడండి. 
 
 
 
ఈ పటం లో పైన ఉన్న వయసు తరగతులు రెండూ మీకు అర్ధమవుతాయి కదా ! అంటే  వయసు  55  సంవత్సరాల కన్నా తక్కువ వయసు వారు,  అంతకు మించి ఉన్న వారు అని. 
తరువాత  పటం కుడి భాగాన  నాలుగు స్టెప్స్  అంటే నాలుగు  దశలలో మందులు, మార్చి ఇవ్వడం జరుగుతుంది.  ఇక్కడ మీరు గుర్తు ఉంచుకో వలసినది  ఇంగ్లీషు అక్షరాలు , ఏ , సి , ఇంకా డీ  ( A,C,D )
A = ACE inhibitor. లేక ఏస్ ఇన్హిబిటార్ .
C= Calcium channel blocker. లేక క్యాల్సియం చానెల్ బ్లాకర్.
D= Thiazide- type diuretic. లేక తయజైడ్ టైపు డయురెటిక్ .
 
వీటి వివరాలు మనం వచ్చే టపాలో చూద్దాము !. ( మీరు గమనించి ఉంటారు, టపాలు చిన్నవి గా ఉంటున్నాయి కదా ! దానికి కారణం  అనేక పేజీల అర్ధం కాని , లేక అర్ధం చేసుకోలేని  వివరాలు ఇచ్చి మీ రక్త పీడనాన్ని అధికం చేయడం నా ఉద్దేశం ఏ మాత్రం కాదు కనుక !  మీకు సమయం ఉంటే రెండు మూడు సార్లు ఇదే టపా చదివి బాగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి , అనుమానాలు, సందేహాలు ఉంటే తెలియ చేయండి , తప్పకుండా ! )
 
 
 
 
 
 

హై బీ పీ కి మందులతో చికిత్స గురించి ఏమి తెలుసుకోవాలి ?. 29.

In Our Health on మే 13, 2012 at 9:58 సా.

హై బీ పీ కి మందులతో చికిత్స గురించి ఏమి తెలుసుకోవాలి ?. 29.

మనం క్రితం టపాలలో మన ఆహార నియమాలలో మార్పులు తీసుకు వచ్చి, అధిక రక్త పీడనాన్ని , ఎట్లా తగ్గించుకోవాలో, తగ్గించు కొవచ్చో శాస్త్రీయం గా  తెలుసుకున్నాము కదా !
ఇప్పుడు, అల్లోపతిక్  మందులు ఏవిదం గా , అధిక రక్త పీడనానికి వాడ బడతాయో చూద్దాము.
అధిక రక్త పీడనానికి వాడ బడే అల్లోపతిక్ మందులు చాలా , మనకు మార్కెట్ లో లభ్యం అవుతాయి.
చాలా మంది ,  సాధారణంగా  తమ  బంధువులు ఏవైనా మందులు, అధిక రక్త పీడనం తగ్గించడానికి వేసుకుంటుంటే ,  ఆ మందులు గుర్తుంచుకొని , అవే మందులు తమకు బీ పీ  ఎక్కువ అయినప్పుడు కూడా  వేసుకుందామని అనుకుంటుంటారు.
కొందరు ఇంకా సాహసించి , ఊళ్ళో ఉన్న మెడికల్ షాపు వాడిని అడిగి , డాక్టర్ దగ్గరకు కూడా పోయి మళ్ళీ ఫీజు ఇచ్చుకోవడం దేనికని , ఏవో ఒక తరగతి కి చెందిన  యాంటీ హైపర్ టేన్సివ్ మందులు వేసుకుంటూ ఉంటారు.
ఇలా మందుల షాపు వాళ్ళు డాక్టర్లు గా మారడం భారత దేశం లో చాలా సాధారణం.  ఇంగ్లండు లో దేశం మొత్తం మీద ఎక్కడా డాక్టరు  చేత రాయ బడ్డ ప్రిస్క్రిప్షన్  లేక పొతే,  మందులు అసలు అమ్మరు.  ఒక వేళ అమ్మినట్టు తెలిస్తే , వారి లైసెన్స్ వెంటనే రద్దు చేయడం జరుగుతుంది.  అంతే కాక , జరిమానా విధించ డమో, లేక  చెరసాల పాలు చేయడమో కూడా జరుగుతుంది. ( ప్రపంచం లో వివిధ దేశాలలో ఉంటున్న తెలుగు వారు , వారి అనుభవాలు కూడా చెప్పండి.)
ఈ విషయం ఇక్కడ ఎందుకు తెవాల్సి వచ్చిందంటే,  అధిక రక్త పీడనానికి మందులు చాలా ఉన్నాయి కానీ,  వయసు ను బట్టీ , వారికి ఉన్న ఇతర జబ్బుల బట్టీ, లేక , హైపర్ టెన్షన్ తీవ్రతను బట్టి , ప్రత్యేకించి , అది ఏ దశలో ఉన్నదో కనుక్కుని , తదనుగుణం గా , ఆ మందులు ఇవ్వ వలసి ఉంటుంది. అంతే కాక , ఆ మందులు అన్నీ అందరికీ ఒకే విధం గా సరిపడవు కదా.  అందువల్ల  ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్త గా ఉండాలి తమ ఆరోగ్యం విషయం లో.
ఇక  పాశ్చాత్య దేశాలలో , ప్రతి వ్యాధికీ , దానికి సంబంధించిన నిపుణులు చాలామంది కలిసి , కొన్ని గైడ్ లైన్స్ అంటె మార్గ దర్శక సూత్రాలు ఏర్పరుచుతారు.  మిగతా డాక్టర్లు అందరూ అలాంటి సూత్రాలను పాటించాలి, తాము మందులు పేషంట్లకు ఇస్తున్నప్పుడు.అలాంటి గైడ్ లైన్స్ ఇచ్చే సంస్థ ఒకటి ఇంగ్లండు లో ఉంది. దాని పేరు నైస్ ( NICE  అంటె National Institute of Clinical Excellence ). వారు అధిక రక్త పీడనానికి రూపొందించిన మార్గ దర్శక సూత్రాల పట్టీ .
 వివరాలు వచ్చే టపాలో తెలుసుకుందాము.

డ్యాష్ ( DASH ) డైట్ సంపూర్ణ వివరాల పుస్తకం ఉచితం !. 28.

In Our Health on మే 13, 2012 at 10:07 ఉద.

డ్యాష్ ( DASH ) డైట్  సంపూర్ణ వివరాల పుస్తకం ఉచితం !. 28.

మనం ఇంత వరకూ,  అనేక పరిశోధనలు చేసి శాస్త్రీయం గా   అమెరికన్ డిపార్ట్మెంట్ అఫ్ హెల్త్ వారిచే  రికమెండ్ చేయబడిన  డ్యాష్ ( DASH ) అంటే   ( Dietary Approaches to Stop Hypertension ), గురించి మనం తెలుసుకున్నాము కదా !
ఇక మీరంతా  ఈ డైట్ ప్లాన్  ను అనుసరించడానికి ఉత్సాహం చూపుతున్నా రనుకుంటున్నాను.
ఈ డ్యాష్ డైట్ మీద   నేషనల్ ఇంస్టి ట్యుత్ అఫ్ హెల్త్ ( అమెరికా ) వారు ప్రచురించిన పుస్తకం లో ఈ డైట్ గురించి  సంపూర్ణ వివరాలు పొందు పరచడం జరిగింది.
ఇందులో  ముందు మాట,  హై బీ పీ అంటే ఏమిటి , డ్యాష్ ఈటింగ్ ప్లాన్ అంటే ఏమిటి,  
ఒక వారం రోజులు మీరు ఎలా , ఏమి తిని, క్యాలరీలు కంట్రోలు చేసికొని , ఇంకా సోడియం ను కూడా కంట్రోలు చేసుకుని ,  అధిక రక్త పీడనాన్ని తగ్గించుకోవచ్చో కూడా చక్కగా వివరించ బడింది.
మన గుండె ఆరోగ్యం గా ఉండటానికి  ఉదాహరణకు శాస్త్రీయం గా  తయారు చేసిన కొన్ని శాక హార, ఇంకా మాంస హార వంటకాలను కూడా పొందు పరచడం జరిగింది. 
ఈ అమెరికన్ డైట్ ప్లాన్ మనకు అంటే తెలుగు వారికి అన్వయించుకోవచ్చా ? :
ఈ ప్రశ్న సహజం గా మనందరికీ కలుగుతుంది కదా !  దానికి సమాధానం ఒకటే. ఈ డైట్ ప్లాన్ ప్రత్యేకించి ఆసియా వాసులకు కూడా అన్వయించు కోవచ్చు. మనకు మిగతా వారికన్నా , గుండె జబ్బులు , మధుమేహం వచ్చే అవకాశం హెచ్చు కనక.
మొదటిలో మీకు కొద్ది గా ఇబ్బంది గా ఉండవచ్చు. మీరు వివరాలన్నీ వివరం గా తెలుసుకుని , ఆచరించడం లో ఒక నెల  సమయం తీసుకున్నా పరవాలేదు. ఎందుకంటే, దీర్ఘ కాలికం గా ఈ డైట్ ప్లాన్ ఎంతో ఉపయోగం.
ఇప్పుడు మీరు చేయ వలసినదేమిటి ? :
చాలా శులభం.  ఒక్క క్లిక్కు తో ,   క్రింద  వెబ్ సైట్ లోకి  ప్రవేశించడమే !  
అందులో ప్రవేశించిన తరువాత  ‘ Your guide to lowering blood pressure with DASH ‘ అనే పుస్తకం కోసం వెతకండి.
ఆ పుస్తకం  మీకు ఉచితం గా అందుబాటు లోకి వస్తుంది.  మీరు ఆన్ లైన్ లో చదవచ్చు , లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఉచితం గా.
ఇక మీరు చేయవలసినదల్లా  ఆ పుస్తకాన్ని వివరం గా చదివి , ఆచరించడమే.
మన ( భారత )దేశం లో కూడా నేషనల్ ఇన్స్టిట్యుట్ అఫ్ నుత్రిషణ్  ( National Institute of Nutrition ) ఉన్నది కానీ అది  హై బీ పీ ని  డైట్ ద్వారా తగ్గించే  పుస్తకాన్ని , ప్రచురించిందో లేదో తెలియదు. మీకు తెలిస్తే, తెలియచేయండి.
ఈ టపా నచ్చితే మీ స్నేహితులకు  తెలపండి. http://www.baagu.net. గురించి .
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము !

డ్యాష్ ( DASH ) డైట్ లో క్యాలరీల కధ.27.

In Our Health on మే 12, 2012 at 9:02 సా.

డ్యాష్ ( DASH ) డైట్ లో క్యాలరీల కధ.27.

క్రితం టపాలో మనం చూశాము కదా. క్యాలరీలు మనకు నిత్యం ఏ మాత్రం అవసరమో, అవి, కార్బో హైడ్రే టులూ , ప్రోటీనులూ, ఇంకా కొవ్వు పదార్ధాల రూపంలో రమారమి ఏ నిష్పత్తి లో ఉండాలో !
మన తెలుగు ఇళ్ళలో , లేక తెలుగు వారి ఆచార వ్యవహారాల ననుసరించి చూస్తే , మనం  సాధారణం గా   మొదట , అన్నం లో ఒక పచ్చడి వేసుకుని తింటాము , మళ్ళీ కొద్దిగా అన్నం లో కూర వేసుకుని తింటాము , మూడో సర్వింగ్ గా మళ్ళీ అన్నం లో పప్పు కానీ, చారు కానీ వేసుకుని తింటూ ఉంటాము.  మళ్ళీ చెప్పనవసరం లేదు కదా, అన్నీ రుచికరం గానూ ఉంటాయి కూడా కదా ! చివరగా పెరుగు కానీ,  మజ్జిగ కానీ వేసుకుని మళ్ళీ కొద్దిగా అన్నం పెట్టుకుని తింటాము.
ఇది సాధారణం గా శాక హారుల ఇళ్ళలో  భోజనం చేసే విధానం.  ఇక శాక హారులు కాని వారు కూడా , అన్నం లో , పచ్చడి వేసుకునీ, లేక చేపలో , కోడి కూరో వేసుకునీ, పెరుగు వేసుకునీ  కనీసం రెండు మూడు పర్యాయాలు అన్నం తో తినటం జరుగుతుంది.
ఇక్కడ  నేను ఏ విధంగానూ , ఆ ఆచార వ్యవహారాలకు వ్యతిరేకం గా  ఏ విమర్శా చేయడం లేదు. ఎందుకంటే , నేనూ తెలుగు వాడినే, విదేశాలలో ఉంటున్నా కొంత వరకైనా  తెలుగు సంప్రదాయాలు తెలిసునని అనుకుంటున్నాను. అంతే కాక నేనూ అలాంటి భోజనం , చేస్తుంటాను , కానీ అప్పుడప్పుడు మాత్రమే ! ( వేరే గా చెప్ప నవసరం లేదనుకుంటాను , ఇష్టం గా తింటానని ! ) 
పైన నేను చెప్పిన ఆహార నియమాలలో , మన రాష్ట్రం లోనూ, మన దేశం లోనూ, లేక ఈ ప్రపంచంలోనూ , వివిధ ప్రాంతాలలో ఉంటున్న తెలుగు వారి లో కొన్ని కొన్ని మార్పులూ చేర్పులూ కూడా ఉండ వచ్చు . అది సహజమే కదా ! అవి మీకు తెలియ చేయాలని అనిపిస్తే , నిరభ్యంతరం గా మీ అభిప్రాయం లో తెలపండి.
ఇక్కడ ఉదాహరణకు పై విధంగా చెప్పిన ఆహారం లో , అన్నం ప్రతి ముద్దకూ  సర్వింగ్స్ చేసుకోవడం వల్ల , కార్బో హైడ్రేటు ల  శాతం లేక నిష్పత్తి విపరీతం గా పెరిగి పోతుంది. అలాగే , మనం చేసుకునే, లేక కొన్న ఊరగాయల్లో లేక   పచ్చళ్లలో అంటే ( pickles and chutneys ) లో ఉప్పు శాతం ఎక్కువ గా ఉంటుంది. దానికి తోడు, కూరలలోనూ, చారులోనూ, సాంబారు లోనూ , ఇంకా పెరుగు, మజ్జిగ ,లేక చల్ల లోనూ వేసుకునే ఉప్పు అంతా కలిసి  మనకు రోజూ అవసరమయే  ఆరు గ్రాములు మాత్రమే ఉంటుందో లేదో మీ ఊహ కు వదిలేస్తాను.  అందు వల్ల , మనం  రెండు విధాలు గానూ మన శరీరానికి రిస్కు ఎక్కువ చేస్తున్నాము .ఒకటి   అధిక ఉప్పు వల్ల అధిక రక్త పీడనం ముప్పూ , అలాగే , అధిక కార్బోహైడ్రేటు ల వల్ల   మనం మన దేహం లో  సహజం గా ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అయే ఇన్సులిన్  కు రెసిస్తేన్స్ ( insulin resistance ) ఎక్కువ అయి మధుమేహం వచ్చే రిస్కు కూడా ఎక్కువ చేసుకుంటున్నాము. ( పైన ఉదాహరించిన ఆహారం లో స్వీట్స్  అంటే  చెక్కెర వేసి చేసిన  పదార్ధాలను గురించి ప్రత్యేకం గా చెప్పలేదు కానీ మనకు తెలుసు కదా అవి కూడా ‘ మన నోట్లో రోజూ ఎంతో కొంత  , ఏదో ఒక సమయంలో పడుతుంటాయని ! ) అందు వల్ల , ప్రతి ( తెలుగు ) వారూ , వారు ఎక్కడ ఉంటున్నా , వారి ఆహార నియమాలను , ఆరోగ్య కరమైన ఆహార నియమాలు గా మలుచుకునే అవసరం ఎంతైనా ఉంది. 
క్రింద పటం  వివరణ  చూడండి.
ఇక్కడ మనం రోజూ తీసుకునే క్యాలరీలను మూడు తరగతుల వారీగా చెప్పారు.  అధిక బరువు తగ్గించు కావాలనుకునే వారు, లేక శారీరిక శ్రమ చాలా తక్కువ గా చేసే వారికి రోజు వారి క్యాలరీలు 1600 అంటే పదహారు వందలు ఉండవచ్చు. అలాగే ఒక మాదిరిగా రోజూ శారీరిక శ్రమ చేసి ఇంట్లో ఒక మాదిరిగా పని చేసి, బయటకు వెళ్లి చదువుకోవడమో, లేక ఆఫీసు పనో చేసే వారు , రెండు వేల ఆరు వందల క్యాలరీలు ( అంటే 2,600 calories per day ), తీసుకోవచ్చు . ఇక శారీరిక శ్రమ ఉదయం నుంచి సాయింత్రం వరకూ చేసే వారికి ఎక్కువ శక్తి అంటే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం అవసరం . అందు వల్ల వారికి  మూడు వేలకు పైగా క్యాలరీలు ఉన్న ఆహారం కావలసి ఉంటుంది. ( అంటే రమారమి 3,100 calories per day ).
ఈ  మూడు తరగతుల క్యాలరీలకు చెందిన ఆహారం రోజూ ఎన్నెన్ని సర్వింగ్స్ లో తిన వచ్చో , ఈ క్రింద వివరింప  బడింది. ఇది కూడా శాస్త్రీయ డ్యాష్ డైట్ లో భాగమే !
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము !
ఈ టపా నచ్చితే మీ స్నేహితులకు తెలియ చేయండి http://www.baagu.net. గురించి !