Our Health

Archive for మే, 2012|Monthly archive page

పాజిటివ్ సైకాలజీ – అధికానందం , ఒకే మూస లో కాక !.8.

In మానసికం, Our minds on మే 23, 2012 at 10:19 ఉద.

పాజిటివ్ సైకాలజీ –  అధికానందం , ఒకే మూస  లో   కాక !.8.

మనం , సాధారణంగా ఒక రకమైన సంగీతం వింటూ ఉంటాము . ఒకే రకమైన ఆహారం తింటూ ఉంటాము. లేక  ఒకే చోటకే తరచూ వెళుతూ ఉంటాము. పరిచయాలు కూడా అంతకు ముందు తెలిసిన వారితోనే పెంచుకుంటూ ఉంటాము. అంత వరకూ బాగానే ఉంది కానీ   మన జీవితాలలో అధికానందం పొందాలంటే , నూతనత్వం ఉండాలి అని సైకాలజిస్టులు అభిప్రాయ పడుతున్నారు. 
ఎందుకంటే , మన మెదడు తో ఉన్న నాడీ కణాలు నూతనత్వానికి అనువు గా ఉన్నాయి. అంటే మనం ఎప్పుడూ  మన ఆనందం కోసం చేసే పనులకూ, అవి  కాక కొత్తగా చేసే పనులను రిసీవ్ చేసుకోవడానికి , అంటే  పాత, కొత్త పనులకు ప్రేరణ లేక స్టిమ్యులేట్ అవడానికి మన మెదడులో రెండు తరహాల నాడీ కణాలు ఉంటాయని , ఇటీవల జరిపిన పరిశోధనల వల్ల  స్పష్టమయింది. మనం ఈ రెండు రకాల కణాలనూ, ప్రేరణ చెందిస్తే ,  అధికానందం పొందటానికి వీలవుతుందన్న మాట. 
ఇంకో విధం గా చెప్పుకోవాలంటే ,  మనం ఒకసారి  ఒక పని చేసి కొంత ఆనందం పొందామనుకోండి.  మళ్ళీ మళ్ళీ అవే పనులు , తరచూ చేస్తుంటే ,  మనం పొందే ఆనందం తక్కువుఅవుతుందన్న మాట. 
మనం పాల్గొనే ఏ రిక్రి ఎషనల్ యాక్టివిటీ అయినా మళ్ళీ మళ్ళీ చేస్తున్నప్పుడు , క్రితం చేసినదానికంటే కొత్త గా ఉండాలని , ఏదో రకంగా కొత్తగా చేయాలని అనుకోని , చేస్తే , మనకు ఆ పనిలో అధికానందం ఉంటుందని మానసిక విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 
అలా తరచూ కొత్త ఆనంద కరమైన  కార్యక్రమాలు చేస్తూ మనల్ని ,  మన తోటి వారిని ఆశ్చర్య పరుస్తూ ఉంటే , మనం పొందే ఆనందం ఎక్కువ అవుతూ ఉంటుంది.
 ఈ నూతనత్వం ఇలా ఉండాలని ఏమీ నిబంధన లేదు. అధికానందం పొందటానికి ఎవరికీ ఇష్టమైన రీతిలో వారు ఈ నూతనత్వాన్ని అన్వేషించి , సంతృప్తి పొందడం ముఖ్యం. 
ఉదాహరణలు:  కొత్త ప్రదేశానికి వెళ్ళడం , కొత్త సంగీతం వినడం ,  నూతన పరిచయాలు ఏర్పరుచుకోవడం , లేక నూతన రిక్రి ఎషనల్ యాక్టివిటీస్  లో పాల్గొనడం, లేక కొత్త వాలంటరీ అంటే సేవా కార్యక్రమాలలో పాల్గొనడం , ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !

పాజిటివ్ సైకాలజీ – మైండ్ ఫుల్ నెస్ ( mindfulness ) తో అధికానందం పొందడం ఎట్లా?. 7.

In మానసికం, Our minds on మే 22, 2012 at 7:29 సా.

పాజిటివ్ సైకాలజీ –  మైండ్ ఫుల్ నెస్ ( mindfulness ) తో అధికానందం పొందడం ఎట్లా?. 7.

మనం క్రితం టపాలలో సేవరింగ్  ఆస్వాదన ద్వారా మన నిత్య జీవితాలలో అధికానందం పొందడం ఎలాగో  అందుకు అయిదు కిటుకులు కూడా వివరం గా తెలుసుకున్నాము కదా ! 
ఇప్పుడు , ఆస్వాదన కాకుండా ఇంకో రెండు కిటుకులు ఉన్నాయి. అందులో ఒకటి మైండ్ ఫుల్ నెస్  అంటే మనసు లగ్నం చేయటం ( లగ్నం అంటే పెళ్లి అనుకోకండి ఇక్కడ, బహుశా ఈ పదం ఒకదానితో ఇంకోదానిని సంధానం చేయడం అనే అర్ధం లో వాడడం   జరుగుతుంది. అంటే పెళ్ళిలో ఇరువురి మధ్య బంధాన్ని కూడా అందుకనే లగ్నం అంటారేమో ! నా అభిప్రాయం లో పొరపాటు ఉంటే, తెలియ చేయండి ! ).
మనం చాలా పనులు చేసేటప్పుడు , మనసు కేంద్రీకరించాకుండానే  చేయగలుగుతాము.  ఉదాహరణకు ,సైకిల్ కానీ స్కూటర్ కానీ, లేక కారు కానీ నడుపుతున్నప్పుడు మన మెదడు అప్రయత్నం గా ఆ క్రియలు చేయడానికి అలవాటు పడుతుది. అంటే ఆ సమయాలలో మనం సంగీతం వినడం కానీ , ఎవరితోనైనా సెల్ ఫోన్ లో మాట్లాడడం గానీ చేస్తుంటాము.  ఇలా  ఎట్లా సాధ్యం అవుతుందంటే,  మన మెదడు లో మనం చేసే పని అంతకు ముందే  అంటే మనం నేర్చుకున్నప్పుడే  ‘ ప్రోసీజరల్ మెమరీ ‘ ( procedural memory ) గా నిక్షిప్తమయి ఉంటుంది. ఇలా  జరుగుతూ ఉండడం వల్ల కొన్ని ప్రయోజనాలతో పాటు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి.
 ఈ ఉదాహరణ చూడండి :  కుటుంబ రావు  తన కుటుంబం తో సహా విహార యాత్రకు వెళ్ళాడు,  ఇంకో  సిటీకి. పిల్లలు ఆనందం తో కేరింతలు వేస్తున్నారు, సరదా గా. టాక్సీ లలో ఎక్కుతున్నారు, బస్సు కోసం వేచి ఉండడం ఎందుకని. వెళ్ళిన చోటల్లా  స్టార్ హోటళ్ళలో   పల హారాలూ , భోజనాలూ.  షాపింగ్ కూడా సరదాగా చేస్తున్నారు.  ఇష్టమైనవి కొనుక్కుంటున్నారు. భార్య , పిల్లల ఆనందం చూస్తూ , కుటుంబరావు కూడా సంతోష పడుతున్నాడు ఒక రకంగా , అంటే  తన కుటుంబాన్ని ఇంత ఆనందం గా చూస్తూ ! కానీ తానూ సంపూర్ణం గా ఆనందించ లేక పోతున్నాడు.  ఎందుకో ఊహించ గలరా ? కష్ట పడి పని చేసే స్వభావం కుటుంబరావుది.  అతనికి తన జీతం కాక వేరే  ‘ గీతం ‘ లేదు. అంటే ‘ పై సంపాదన ‘! . అందువల్ల కుటుంబరావు మైండ్ ఫుల్ నెస్ గా ఉన్నాడు, ఇంకో విషయం మీద , అంటే తాను భౌతికం గా నే తన కుటుంబం తో ఉన్నాడు. యాంత్రికం గా  వారితో తింటున్నాడు , తిరుగుతున్నాడు , కానీ తన మనసు ఇంకో విషయం మీద పరి పరి విధాలుగా పోతుంది.  కుటుంబరావు   మనసు, ‘ అతని జేబు ను పదే  పదే తడుముతూ ఉంది ‘, ( అవుతున్న ఖర్చుల మీద మనసు లగ్నం చేస్తూ ,  తానుగా ఎక్కువ గా ఆనందించ లేక పోతున్నాడు ) ( అంటే   ఆ సందర్భాలలో , కుటుంబరావు ‘  సగం హృదయం తో ‘  అంటే హాఫ్ హార్టెడ్ గా ఉన్నాడు  ! ) 
ఇక్కడ కుటుంబరావు కూడా అధికానందం పొందాలంటే  ఒకటే మార్గం.  తాను కూడా తన కుటుంబం తో పూర్తి గా మనసు కూడా లగ్నం చేసి ఆ విహార యాత్రను ఆస్వాదించడం, అధికానందం పొందడం. 
అవసరమయితే ( ఇక్కడ అవసరం అనుకుంటాను  ) ఉన్న ఊళ్లోనే ఒక చోటికి  కుటుంబం తో వెళ్లి ఆనందించ వచ్చు.  అప్పుడు మైండ్ ఫుల్ నెస్ ,అంటే  మనసు పూర్తిగా లగ్నం చేయడానికి  వీలవుతుంది కదా ! 
వర్తమానం లో మనసు లగ్నం చేయడానికి మెడిటేషన్ అంటే ధ్యానం ఉపయోగ పడుతుంది.  అలా  మనం , మనసా, వాచా , కర్మణ్యే, అన్న విధం గా వర్తమానం లో సమయాన్ని, క్షణాలనూ  ఆస్వాదించడం అలవాటు చేసుకుంటే, అధికానందం పొంద గలగ టానికి వీలవుతుంది. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !

పాజిటివ్ సైకాలజీ – సేవరింగ్ ( ఆస్వాదన ) తో జీవితం లో అధికానందం పొందడం ఎట్లా ?.6.

In మానసికం, Our minds on మే 21, 2012 at 8:29 సా.

పాజిటివ్ సైకాలజీ – సేవరింగ్ ( ఆస్వాదన )   తో     జీవితం లో  అధికానందం పొందడం ఎట్లా ?.6.

3.స్వీయాభినందన : సెల్ఫ్  కంగ్రాట్యులేషన్ :  అంటే మనల్ని మనం అభినందించు కోవడం. సాధారణం గా మనం మన జీవిత కాలం లో వివిధ దశలలో , విజయాలు సాధిస్తూ ఉంటాము. కానీ నిరాడంబరతకు సూచనగా, మనం ఆ విజయాలను ప్రకటిస్తూ ‘ దండోరా ‘ వేయించి అందరికీ  చెప్పము కదా ! కానీ మన విజయాలను చూసి మనకు మనం అభినందించు కోవడం , మన ఆత్మ విశ్వాసాన్ని ఇనుమడింప చేస్తుంది. ఎందుకంటే మనం సాధించే ప్రతి విజయమూ , మనల్ని ప్రగతి పధం లో ముందుకు తీసుకు వెళుతుంది కదా ! ఆ విజయాలు కేవలం పరీక్షలో ఉత్తీర్నతే  కానవసరం లేదు.  మనం చేసే నిర్మాణాత్మక పని ఏదైనా కావచ్చు. అది మన జీవితాలలో ఏదో ఒక  ఒక ముఖ్య మైన కార్యం  అవవచ్చు.
4.ఇతరులతో పంచుకోవడం :  అంటే షేరింగ్ విత్ అదర్స్ :  సైకాలజిస్టులు  సేవరింగ్ అంటే ఆస్వాదనలో అత్యంత ముఖ్యమైన కిటుకు గా దీనిని చెపుతారు.  మనం మనకానందం కలిగించే ఏ పని అయినా  ఇతతులతో పంచుకుంటే  అది అధికానందానికి దారి తీస్తుంది.
ఇక్కడ కూడా ఈ ఆనందం కలిగించే సంఘటనలు , సంగీతం, సినిమా, ఆట , ఆహారం, పార్టీ , ఇలా ఏవైనా కావచ్చు. ఒక విహార యాత్ర కావచ్చు. ఇలా ఈ సంఘటనలలో మనకు పరిచయమున్న వారితో పంచుకుంటే అంటే కలిసి ఈ పనులు చేస్తే , ఆనందం అధికమవుతుందని అనేక పరిశీలనలలో తెలిసింది.  అలాగే మనం ఆస్వాదించిన ఆ సమయాలను  ఇతరులతో పంచుకుంటే కూడా , అంటే వారికి , మనం  ఆయా సంఘటనలలో ఎంత ఆనందించామో ఇతరులతో చెపితే కూడా మనం అధికానందం పొందగలం.
5.స్మృతులు : మెమరీ బిల్డింగ్ : అంటే మనం ఆనందం గా ఆస్వాదించిన  క్షణాలను , పదిల పరుచుకోవడం. అంటే మన జ్ఞాపకాలలో పదిలం గా ఉంచుకోవడం.  ఆ జ్ఞాపకాలు, కేవలం జ్ఞాపకాలు గా కానీ , ఫోటోల రూపం లో కానీ, లేక రికార్డు చేసిన వీడియో ల రూపం లో కానీ, లేక ఏ ప్రదేశానికైనా వెళ్లి వస్తే , అక్కడ కొన్న సూవనీర్స్ కానీ, ఇలా మన ఆనంద సమయాన్ని పదిలపరుచుకుంటే కూడా అధికానందం పొందగలం.  ఇవన్నీ, తరువాత మనం ఇతరులతో  పంచుకునేందుకు, తద్వారా ఆనందం పొందేందుకు  సహాయం చేస్తాయి.
( సేవరింగ్ ‘ savouring’ అనే పదాన్ని చదువరుల సౌలభ్యం కోసం అలాగే వాడడం జరిగింది.మనకు తెలుసుకదా మనం సామాన్యం గా తినే ఆహారం లో రుచిని అధికం చేయడానికి వాడే పదార్ధాలను savouries ,సేవరీస్ అంటారు.అలాగే మన జీవిత రుచులను కూడా అధికం చేసుకోడానికి savouring లేక ఆస్వాదన అనే పదాన్ని ఉపయోగించారు.
మనం మామూలు గా ‘ రుచి చూడడం ‘ ఇంకా ‘ ఆస్వాదించడం ‘ అంటే ‘ tasting and savouring ‘ లకు ఉన్న తేడాను గ్రహించి , కేవలం రుచి చూడకుండా , ఆస్వాదన చేయడం అలవాటు చేసుకుంటే , మనం మన జీవితాలలో ఎక్కువ ఆనంద పడతాము. ( ఈ సేవరింగ్ లేక ఆస్వాదన ను అధికం చేసుకోవడానికే టపాలలో చెప్పిన అయిదు కిటుకులు. ఇవి శాస్త్రీయం గా ఋజువు చేయబడ్డాయి కూడా ! )
వచ్చే టపాలో ఇంకొన్ని కిటుకులు తెలుసుకుందాము !

పాజిటివ్ సైకాలజీ- సేవరింగ్ తో జీవితం లో అధికానందం పొందటం ఎట్లా ?.5.

In మానసికం, Our minds on మే 20, 2012 at 11:40 సా.

పాజిటివ్ సైకాలజీ- సేవరింగ్ తో  జీవితం లో అధికానందం పొందటం ఎట్లా ?.5.

క్రితం టపాలో పరిశీలించాము కదా !  మన దైనందిన జీవితం లో వివిధ  ‘ రుచులను ‘ మనం కేవలం మన కారణం వల్ల, సంపూర్ణం గా ఆస్వాదించలేక పోతున్నామో !
ఈ విషయం మీద విపరీతం గా పరిశోధన, పరిశీలనలు చేసి  ఫ్రెడ్ బ్రయంట్, జోసఫ్ వెరోఫ్ ( లోయోలా విశ్వ విద్యాలయం నుంచి ) ఒక అయిదు కిటుకులు మనకు సూచించారు. అంటే ఈ కిటుకులు  అర్ధం చేసుకుని , ఆచరిస్తే ,  మనం ‘ ఈ రుచులను’ సంపూర్ణం గా లేక చాలా వరకు సంపూర్ణం గా ఆస్వాదించ గలుగు తామన్న మాట !
ఇక్కడ మనం ‘ రుచులు ‘ అంటే కేవలం ఆహార పదార్ధాల రుచులనే అనుకో కూడదు.  ‘ టేస్త్స్ అఫ్ లైఫ్ ‘ అంటే ‘ జీవిత రుచులు ‘  అవి  ఒక మంచి సినిమా చూడడం కావచ్చు, సంగీతం వినడం అవవచ్చు. ఇతరులతో ఆడే ఆట కావచ్చు, ఇతరులతో గడిపే సమయం కావచ్చు, లేక  ఆమె అతడితోనో , అతడు ఆమెతోనో ‘ గడిపే’ సమయం కావచ్చు. లేక ఒక తండ్రి , ఒక తల్లి తమ చిన్నారులతోనో , లేక వారు పెరిగాక వారితో గడిపే సమయం కావచ్చు. ఇలాంటివన్నీ  మన జీవితాలలో అత్యంత  విలువైన , అమూల్యమైన సమయాలూ , క్షణాలూ ! 
ఇప్పుడు    ఆస్వాదన అంటే సేవరింగ్  లో ఉన్న కిటుకులు ఒకటొకటి గా  తెలుసుకుందాము !
1. మన  ఇంద్రియ జ్ఞానం  చురుకు గా ఉండడం : ( దీనినే షార్పెనింగ్ అవర్ పర్సెప్షన్  అంటారు ): 
మనకందరికీ తెలుసు మన ఇంద్రియాలంటే మన కళ్ళూ , చెవులూ, నాలుక అని. వాటితో పాటు స్పర్శ, అంటే మన చేతి స్పర్శ అంటే వేళ్ళతో తాకి  స్పృశించడం . అంటే మనం  మనం పొందుతున్న రుచులను బట్టి మన ఇంద్రియాలను సంపూర్ణం గా కేంద్రీకరించాలన్న మాట.  ఇక్కడ  ఈ ఉదాహరణలు చూడండి: 
 మీరు  ప్రయాణం చేస్తున్నారు. చెవులకు హెడ్ ఫోన్స్ లోనుంచి మీకు ఇష్టమైన పాట వింటున్నారు.  మిగతా  ‘విసిగించే ‘ శబ్దాలు మీకు వినపడవు. మీకు ఇష్టమైన పాట వింటూ , మిగతా శబ్దాలను జాగ్రత్త గా బ్లాక్ చేస్తున్నారు. ( దీనినే సెలెక్టివ్ అటెన్షణ్  అంటారు శాస్త్రీయం గా ). అలాగే  మీరు  ఒక  పార్టీ లో ఉన్నారు , మీ కొలీగ్స్ తో ఒక చిన్న గ్రూప్ లో మాట్లాడుతున్నారు , వారితో కరచాలనం అంటే షేక్ హ్యాండ్స్ చేస్తున్న్నారు. అంటే మీరు మీ స్పర్శ ను కూడా  ఉపయోగిస్తున్నారన్న మాట.
అలాగే మీకు నచ్చిన యువకుడి తో నో , యువతి తో నో  సమయం గడుపుతున్నారు. అప్పుడు మీ నయనాలూ, చెవులూ , మీ పరిచయాన్ని బట్టి ,  స్పర్శ , కూడా చాలా చురుకు గా ఉంటుంది కదా ! ( ఈ విషయం లో మనకు మన ఇంద్రియాల ఏకాగ్రత గురించి ఏ సైకాలజిస్టూ సలహా ఇవ్వ నవసరం లేదనుకుంటాను ! )( కామ  వాంఛ లో స్పర్శ ప్రాముఖ్యత  గురించి మునుపటి టపాలో సవివరం గా తెలపటం జరిగింది కదా వీలయితే ఒకసారి చూడండి ! )  అలాగే మీరు మీ ఇష్టమైన లేక పరిచయమయిన వారితో ఒక చోట మీకు ఇష్టమైన ఆహారం తింటున్నరనుకుంటే , అక్కడ కూడా, మీ ఇంద్రియాలన్నీ చురుకుగా ఉంచుకోవాలి కదా ! 
2. లీనమై పోవడం: (  దీనినే అబ్సార్ప్షన్ అంటారు అంటే అబ్సార్బ్ అయిపోవడం ):  ఇక్కడ మనం చేయవలసినది ఏమిటంటే  మనం మన ఇంద్రియాలను  చురుకు గా ఉంచుకొని , మనం ఆయా ఇంద్రియాలను  ‘ ఉపయోగిస్తున్నప్పుడు ‘  ఆ క్రియ లో సంపూర్ణం గా 
లీనమై పోవాలి.  క్రితం టపాలో ప్రకాశ రావు  ఎలా లీనమై పోయాడో చూశారా బ్రేక్ ఫాస్ట్ చేస్తూ , ఆ రుచులు ఆస్వాదిస్తూ !. ఇక్కడ కేవలం మన ఇంద్రియాలకే పని కల్పించాలన్న మాట, ఇతరం  ఏమీ ఆలోచించ కుండా !
పైన  మనం తెలుసుకున్న రెండు కిటుకులూ ఉపయోగించి మీ ఆస్వాదన లో తేడా కనిపించిందో లేదో తెలియ చేయండి ! ( మీ జీవిత రుచులలో వేటిలో నైనా ! ) ఎందుకంటే  ఈ సూత్రాలు మనం ఆచరించ దానికే కానీ , కేవలం బ్రౌజ్ చేయడానికి కాదు కదా ! 
పైన ఉన్న ఫోటో చూడండి. ఇనాగురల్  ఐ సి సి ప్రపంచ కప్పు ను భారత క్రికెట్ జట్టు గెలిచిన తరువాత , బొంబాయి వీధులలో యాత్ర చేస్తున్న దృశ్యం. గమనించ వలసినదేమిటంటే ఈ ఫోటోలో ఉన్న వేలాది ప్రజలూ , సమిష్టి గా , ఈ విజయాన్ని,  ప్రియం గా , ఆస్వాదిస్తూ ఉండడం !  సేవరింగ్ అంటే ఆస్వాదన లో  అధికానందం పొందాలంటే,  కంపెనీ అంటే  ఇతరులతో  ఆస్వాదించడం కూడా చాలా ముఖ్యం. అదే ఈ ఫోటోలో మనం చూస్తున్నది ! 
వచ్చే టపాలో మిగతా కిటుకులు తెలుసుకుందాము !

పాజిటివ్ సైకాలజీ తో అధికానందానికి సూత్రాలు.4.

In మానసికం, Our minds on మే 20, 2012 at 12:08 సా.

పాజిటివ్ సైకాలజీ తో అధికానందానికి సూత్రాలు.4.

మునుపటి మూడు టపాలలో , పాజిటివ్ సైకాలజీ అంటే ఏమిటి ? దానిని మన నిత్య జీవితం లో అనుసరిస్తే పొందే ప్రయోజనాల గురించి తెలుసుకున్నాము కదా ! 
ఇప్పుడు చదువరులంతా మరి పాజిటివ్ సైకాలజీ ని ఎట్లా అనుసరించాలి, ఆ పద్ధతులు ఏమిటో తెలుసుకోవాలని ఉత్సాహ పడుతున్నారు కదా ?! మరి తెలుసుకుందాం !
మనమందరం,  సామాన్యం గా మన జీవితాలలో ఆనందాన్ని పొందుతూ ఉంటాము. ఎంతో కొంత ! అది మనం చేసే పని ఏదయినా కావచ్చు. అంటే మనం తినే ఆహారం అయినా ఆడే ఆటలు , పాడే, లేక వినే సంగీతం అయినా , కామపరమైన సంబంధాలలోనైనా,   కుటుంబం,  లేక స్నేహితులతో , బంధువులతో గడిపే సమయం  అయినా ( బంధువులు ఒక నెల మన ఇంట్లో ‘తిష్ట ‘ వేస్తే, విషయం వేరుగా ఉంటుందనుకుంటాను ! ).
కానీ మనం రోజూ, లేక , తరచూ చేసే ఈ చర్యలలో,  కొంత ఆనందం మాత్రమె పొందుతూ ఉంటాము. ఇంకో విధం గా చెప్పాలంటే, సంపూర్ణం గా ఆనందం పొందలేక పోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంటుంది,  అలా మనం కావాలని చేయకపోయినా ! 
ఎందువల్ల ఇలా జరుగుతుందని  నిశితం గా పరిశీలిస్తే , కొన్ని స్పష్టమైన కారణాలు దర్శనమవుతాయి.
ఉదాహరణకు ,  ఉదయమే లేచి చక్కటి ఉపాహారం , అదే బ్రేక్ ఫాస్ట్ , తిందామని  అనుకోండి. మీకు ఇష్టమైనవి,  వేడి వేడి గా తయారయి, టేబుల్ మీద ప్రత్యక్షమవుతాయి. అది మీకు తెలిసేది మీ చుట్టూ వస్తూన్న వాసనల ద్వారానే,ఎందుకంటే, మీ ‘ దృష్టి ‘ మీ చేతులో ఉన్న సెల్ ఫోను వైపో, లేక , మాగజైన్ లోనో , లేక మీ ఆలోచనలు ,  మీరు చేరవలసిన గమ్యానికి వెళ్ళే దోవ లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో, ఎంత సేపవుతుందో, లేక మీరు చేయ వలసిన ఉద్యోగం లో వత్తిడుల గురించో ఇలా మనసు పరి పరి విధాల ‘ పరుగు ‘  తీస్తూ ఉంటుంది.  ‘తిన్నామనిపించి ‘ బ్రేక్ ఫాస్ట్  ‘ పూర్తి ‘ చేసి బయలు దేరుతారు.   
ఇంకో ఉదాహరణ తీసుకోండి:  ప్రకాశరావు ఇంటి  దగ్గరలో,   రెండు మైళ్ళ దూరం లో ఉన్న బడి లో టీచరు. ఉదయమే లేచి కాల కృత్యాలు ముగుంచుకుని,  టేబుల్ ముందు కూర్చున్నాడు. భార్య శుక్ర వారం అవటం తో  తడి ఆరని కురులు తన నయనాలకు అడ్డం వస్తుంటే సరి చేసుకుంటూ, స్టీం చేసిన ఇడ్లీల పళ్ళెం టేబుల్ మీద పెడుతుంటే , నిశితం గా పరిశీలిస్తున్నాడు, ‘ ఇవాళ నీలో ఏదో కొత్త అందాలు కనిపిస్తున్నాయోయ్ ! అన్నాడు కొద్దిగా తడిసిన ‘ ఆమె ను’  క్రీగంట  చూస్తూ ‘ . భార్య తడబడుతూ ‘ తన వైపు ‘ అప్రయత్నం గా క్షణం పాటు చూసుకుని, మందస్మిత వదనం తో ఆ గది లోంచి వెళ్ళింది.  ఇడ్లీ తింటూ, ‘ వెన్న లా కరిగిపోతున్నాయి నోట్లో,  చట్నీ కూడా , ఆవాలతో తాలింపు పెట్టావంటుకుంటాను, కమ్మ గా ఉంది , ఇంకో రెండు ఇడ్లీలు వేస్తావూ ‘ అని, తిని , సైకిల్ తీసుకుని  బయల్దేరాడు బడి వైపుకు. ( దీనంతటికీ కూడా ఎక్కువ సమయం అయి ఉండదు కదా ! ) 
పై ఉదాహరణలు మన ఆహారం విషయం లో, మనం  అదే ఆహారాన్ని వేరు వేరు పరిస్థితులలో ఎట్లా ఆస్వాదించ గలమో తెలుపుతున్నాయి కదా !  మీరు చెప్పగలరు కదా దేనిలో ఎవరు ఎక్కువగా ఆ సామాన్య రుచులను అధికం గా ఆస్వాదిస్తున్నారో ! 
మనం మన జీవితాలలో ఇలాంటి  ఆనంద కర సమయాలు రోజూ, లేక తరచూ ఎన్నో ఉంటాయి కదా ! ఈ సమయాలలో  అధికానందం పొందలేక పోవడానికి ముఖ్య కారణం   మనం ఆ  ‘ జీవిత రుచులను ‘ సరిగా , ఆస్వాదించలేక పోవడమే !
వచ్చే టపాలో   మన  జీవిత రుచులు  ఆస్వాదించడానికి చిట్కాలు లేక సూత్రాలు ఏమిటో తెలుసుకుందాము ! 

పాజిటివ్ సైకాలజీ, పాజిటివ్ థింకింగ్ కన్నా ఎందుకు ఉత్తమం ?. 3.

In మానసికం, Our minds on మే 20, 2012 at 7:48 ఉద.

పాజిటివ్ సైకాలజీ, పాజిటివ్ థింకింగ్ కన్నా ఎందుకు ఉత్తమం ?. 3.

 
పాజిటివ్ సైకాలజీ మన ప్రస్తుత సమాజం లో అన్ని రంగాలకూ సంబంధించినది గా అభివృద్ధి చెందుతూ ఉంది.
పాజిటివ్ సైకాలజీ కి అత్యంత ప్రతిభావంతులు అయిన సైకాలజిస్టు లతో వేసిన పునాది ఉంది. అంటే వారు చెప్పేది ‘ చెత్త ‘ గా కొట్టి పారేయ లేము. ఎందుకంటే వారు చెప్పేది ,అనేక సంవత్సరాలు , అనేక ప్రత్యక్ష , పరోక్ష పరిశీలనలు చేసిన అనుభవం తో. అంటే వారు కేవలం వివిధ గ్రంధాల ద్వారానే విజ్ఞానం సముపార్జన చేయడమే కాక వారు చూసిన అనేక మైన వ్యక్తుల మనస్తత్వాలు, పరిశీలించి ఆ సారాంశాన్ని  అందిస్తున్నారు.
వారు మనకు, మనం ఎట్లా జీవించాలి అనే విషయం గురించి చెప్పడం లేదు.  వారు గమనించిన వివిధ పద్ధతులూ కిటుకులూ మనకు ఎంత బాగా లాభ పడతాయో, అనుభవ పూర్వకం గా వివరిస్తున్నారు.
వారు ఏదో విధంగా పాజిటివ్ గా ఉండడం సులభం అనీ చెప్పటం లేదు. ఎందుకంటే మన మెదడులు శాస్త్రీయం గా చేసిన పరిశోధనలలో , నెగెటివ్ గా ఆలోచించడానికే అనుగుణంగా ఉన్నాయి. అంటే మనం నెగెటివ్ గానే ఆలోచిస్తూ ఉండమని దీని అర్ధం కాదు. కానీ మనం వివిధ  పద్ధతులను అవగాహన చేసుకొని వాటిని మన నిత్య జీవితం లో ఆచరిస్తే వాటి ఫలితాలను పొంది , ఆనంద జీవితం గడపగలమని వారు తెలియ చేస్తున్నారు.
ఇంకా పాజిటివ్ సైకాలజిస్టులు కేవలం వ్యక్తులనే కాక, తద్వారా , వ్యవస్థనూ , సమాజాన్నీ పురోగమించెట్టు చేసే ప్రయత్నం లో ఉన్నారు.
మరి పాజిటివ్ థింకింగ్ మాట ఏమిటి ?
పాజిటివ్ థింకింగ్ ను ప్రమోట్ చేసే వారు ఆ మాటను ఒక వినిమయ వస్తువు గా భావించి దానిని ఎక్కువగా ‘ అమ్ముదామని ‘ విపరీతం గా ప్రయత్నం చేస్తుంటారు.
వారి దగ్గర కొన్ని కిటుకులు మాత్రమె ఉంటాయి. వారు ఆ కిటుకులతో ‘ మీ జీవితం మారిపోతుంది ‘ ‘ మీరు ఒక నూతన ‘ మీరు ‘ అవుతారు. ‘ మీరు మీ భయాందోళనలు అన్నీ  పోగొట్టు కుంటారు ‘ అని అవాస్తవిక ‘ ప్రకటనలు ‘ ‘ భరోసాలు ‘ ఇస్తుంటారు.
పాజిటివ్ థింకింగ్ వాదం అరుదు గా శాస్త్రీయం గా నిరూపించబడుతుంది. ఈ వాదాన్ని ప్రచారం చేసే వారు, కొద్ది మంది వారి జీవితం లో సాధించిన విజయాల గురించి చెబుతూ , వారు చేసిన విజయ పధ ప్రయాణం వివరిస్తారు. మనం ఆ వ్యక్తులను, వారి విజయ రహస్యాలనూ అనుకరిద్దామని చేసే ప్రయత్నం లో , త్వరగా మంచి ఫలితాలను చూడలేము. దానితో మనము ‘ ఇంకా గట్టిగా కృషి చేయలేదేమో ‘ అని క్రుంగి పోయే అవకాశం ఉంది. దానితో నిరాశా నిస్పృహలు కూడా ఎక్కువ ఆవ వచ్చు.
పాజిటివ్ థింకింగ్ ను అమలు చేయమని చెప్పే వాదనలో శాస్త్రీయ మైన పునాదులు లేవు. ‘ మీరు అనుకున్నది ఏదైనా సాధించ గలరు ‘ ఈ కిటుకులు పాటిస్తే ‘ అని చెబుతుంటారు.
కానీ యదార్ధం దీనికి దూరం గా ఉంటుంది. కొందరు ఈ పాజిటివ్ థింకింగ్ బోధించే ‘గురువులు’  ‘ మీరు ఈ కిటుకులు పాటిస్తే , ఎక్కడైనా విజయం సాధించ గలరు, మీరు మీ కారు పార్కింగ్ చేసే సమయం లో కూడా , ( అంటే ఈ కిటుకులతో మీరు కారు పార్క్ చేసే స్థలం పొందటం లో విజయ వంతమవుతారు ) అంటూ ఈ పద్ధతిని హాస్యాస్పదం చేస్తున్నారు.
ఇలాంటి పాజిటివ్ థింకింగ్ ధోరణి ప్రపంచం లో  , తినటానికి తిండీ , ఉండడానికి వసతీ లేని కోట్లాది పేద ప్రజలను అవమాన పరిచే విధం గా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పాజిటివ్ థింకింగ్ , కేవలం పాశ్చాత్య  కోరికలకు అద్దం పట్టే రీతిలో  కేవలం ఒక సమస్య లేని కారు పార్క్ దొరికితేనో , ఒక మంచి ఇల్లు ఉంటెనో  సంతృప్తి పడే మనస్తత్వానికి ప్రతీక. 
ఇప్పుడు తెలుసుకున్నాము కదా పాజిటివ్ సైకాలజీ అంటే ఆశావాద మనస్తత్వానికీ , పాజిటివ్ థింకింగ్ , లేక ఆశావాద ఆలోచనలకూ తేడా ! 
ఇంత ఉపయోగ కరమైన , లాభదాయకమైన , మన జీవితాలను పరిపూర్ణం చేయగలిగే , పాజిటివ్ సైకాలజీ లేక ఆశావాద  మనస్తత్వం గురించి  వివరం గా వచ్చే టపా నుంచి తెలుసుకుందాం ! 

పాజిటివ్ సైకాలజీ ( positive psychology ).2.

In మానసికం, Our minds on మే 19, 2012 at 2:35 సా.

పాజిటివ్ సైకాలజీ ( positive psychology )( ఆశావాద మనస్తత్వం ).2.

  పాజిటివ్  సైకాలజీ ‘ పితా మహుడు ‘ మార్టిన్ సెలిగ్మన్ ‘ 
ముందుగా చదువరులు , సైకాలజీ ( psychology ) కీ , సైకియాట్రీ ( psychiatry ) కీ తేడా తెలుసుకోవాలి.
psyche అంటే మనసు లేక మెదడు కు సంబంధించిన అని అర్ధం లజీ ( logy ) అంటే శాస్త్రం లేక తర్కం అని. మనసు లేక మెదడు కు సంబంధించిన విషయాల వివరాలు  అన్న మాట.  మరి సైకియాట్రీ అంటే కూడా మెదడు కు సంబంధించిన వివరాలు అనుకోవచ్చు.
మరి తేడా ఏమిటంటే , సైకాలజీ లో కేవలం మానవుల ఆలోచనలు, అనుభూతులను, ప్రవర్తనను విపులం గా పరిశీలించి , మానవులు అలవాటు చేసుకున్న చెడు ప్రవర్తన, లేక చెడు ఆలోచనలకు, వారి నిరాశా వాద ధోరణులకు,  పరిష్కారం వారే తెలుసుకొని (  అంటే  సైకాలజిస్ట్  సహాయం తో ), వారి  ఆలోచనలూ, ప్రవర్తనలో మార్పులు తెచ్చుకొని , తద్వారా , వారు లబ్ది పొందగలగడం.  ఇక్కడ గమనించ వలసినది ఏమిటంటే, మన ఆలోచనా ధోరణి లో మార్పులే మందులు గా పని చేస్తాయన్న మాట.  అంటే సైకాలజిస్ట్  చేసేది  మానసిక పరివర్తన తో చికిత్స.
కానీ సైకియాట్రీ ను ప్రాక్టీసు చేసే సైకియాట్రిస్ట్  అలా కేవలం ప్రవర్తనలో మార్పే కాకుండా ,  అవసరమయిన మందులు కూడా ఇవ్వడం, లేదా కరెంటు చికిత్స ( దీనినే ఎలెక్ట్రో కన్వల్సివ్ తెరపీ లేక ECT అంటారు ) ద్వారా కూడా చికిత్స చేసి జబ్బు ను దూరం చేస్తారు. ఇక్కడ సైకియాట్రిస్ట్ చేసే చికిత్సలో  మానసిక పరివర్తన ప్లస్ మందులు ఉంటాయి.
ఒక ఉదాహరణ:  డిప్రెషన్ తీవ్రం గా లేనప్పుడు మందులు లేకుండా కూడా ఆ పరిస్థితి నుంచి బయట పడవచ్చు.  మానవులలో ఎక్కువ శాతం మంది డిప్రెషన్ ను వారి జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే వారే ! కానీ అందరూ మందులు తీసుకునే బాగవడం లేదు కదా !
ఇక అసలు సంగతి : ఈ పాజిటివ్ సైకాలజీ ఎలా ప్రారంభమయిందంటే : 1950 నుంచీ  ప్రపంచం లో ఉన్న ప్రముఖ  సైకాలజిస్ట్లులు  కేవలం మానసిక వ్యాధులను నయం చేసే లక్ష్యం తో నే కాకుండా , మానవులు  ఆనంద జీవితం గడపగలగటానికి  మార్గాలు అన్వేషించ సాగారు. అంటే శాస్త్రీయం గా .అలా పుట్టినదే  ఈ పాజిటివ్ సైకాలజీ : ఈ పాజిటివ్ సైకాలజీ కి పితా మహుడు , ఇరవైయ్యవ శతాబ్దం లో అత్యంత ప్రముఖ సైకాలజిస్ట్ లలో ఒకడు గా గుర్తించ బడుతున్న  మార్టిన్ సెలిగ్మన్ ( Martin Seligman ). ఇతనూ , ఇంకో సైకాలజిస్ట్ ‘ మిహాలీ ‘ కలిసి ఈ పాజిటివ్ సైకాలజీ అనే ప్రత్యెక విభాగానికి అంకురార్పణ చేశారు.  మన నిత్య జీవితం లో ఎంతో విలువైన ఈ పాజిటివ్ సైకాలజీ, అప్పటినుంచి అంచెలంచెలు గా విస్తరిస్తూంది. పాజిటివ్ సైకాలజీ కి  వారిద్దరూ ఇచ్చిన  నిర్వచనం : ‘ ఈ  ఆశావాద మనస్తత్వం అంటే  పాజిటివ్ సైకాలజీ మానవులను శాస్త్రీయం గా అవగాహన చేసుకోడానికీ, అలాగే తగు మార్పులు తెచ్చి , దానివల్ల  వ్యక్తులూ , కుటుంబాలూ , సంఘాలూ , అత్యంత ప్రయోజనం పొందేట్టు చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము ‘ 
పాజిటివ్ సైకాలజీ మానవులలో ప్రతిభనూ, సామర్ధ్యాలనూ  బయటకు తీసి వారిని  విజయ పధం లో పయనింప చేసి తద్వారా, సామాన్య జీవితాలను కూడా ఎంతో అర్ధ వంతం చేస్తుంది, కేవలం రుగ్మతలను మానించడమే కాక !
వచ్చే  టపాలో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము !

పాజిటివ్ సైకాలజీ అందరికీ ఎందుకు ?.1.

In మానసికం, Our minds on మే 19, 2012 at 12:03 సా.

పాజిటివ్ సైకాలజీ అందరికీ ఎందుకు ?.1.

మనం, నిత్య జీవితం లో ఎన్నో ఒడి దుడుకులు  ఎదుర్కొంటూ ఉంటాము. జననం నుంచీ, తుది క్షణాల దాకా , వయసు తో సంబంధం లేకుండా ,  అనేక అనుభూతులు ఆస్వాదిస్తూ  ఉంటాము.  సుఖాలు వచ్చినప్పుడు, ఆనందం తో పరవశులవుతాము. అలాగే కష్టాలు అనుభవం అవుతున్నప్పుడు ,  తల్లడిల్లి పోతాము. 

నిరాశా నిస్పృహలకు లోనవుతాము. ఆ కష్టాలు త్వరగా తీరిపోవాలని  కోరుకుంటూ ఉంటాము.  ఈ  ఆనంద విచార నిత్య ఘర్షణలో మనం విజయ వంతం ఎట్లా అవగలం?  విషాదం పైన విజయానికి సరిపడిన ‘ ఆయుధాలు ‘ మనకు ఉన్నాయా ? ఒకవేళ విషాదం అనివార్యమైతే , దానిని ఏ దృక్పధం తో  తీసుకోగలం ?  మరి మన జీవితాలలో  ఆనంద మయ సమయాన్ని ఏ విధం గా మనం ఎక్కువ చేసుకోగలం? 

మనం ఆచరిస్తున్న జీవన శైలి , ఆచార వ్యవహారాలూ , సంప్రదాయాలూ , మనల్ని నిజంగా ఆనంద పరుస్తున్నాయా ? మరి శాస్త్రీయం గా ఏమైనా  కిటుకులు ఉన్నాయా ?,  మన జీవితాలు ఎక్కువ ఆనందం గా ఉండటానికి ? 
వీటికి సమాధానాలు వెదకడం కోసమే  మనమందరం పాజిటివ్ సైకాలజీ  ( positive psychology )  గురించి తెలుసుకోవాలి. 
వచ్చే టపా నుంచి ఈ పాజిటివ్ సైకాలజీ వివరాలు తెలుసుకుందాము. 

హృదయం, లయ తప్పితే ఏ పరీక్షలు చేయించాలి?.38.

In Our Health on మే 19, 2012 at 9:52 ఉద.

హృదయం లయ తప్పితే  ఏ పరీక్షలు చేయించాలి?.38. 

హృదయం లేక గుండె, లయ అంటే ఏమిటి , లయ తప్పటం ఏమిటి , ఏ పరిస్థితులలో లయ తప్పుతుందో , మనం క్రితం టపాలలో వివరం గా చూశాము , తెలుసుకున్నాము కదా !
మరి ఏమి చేయాలి అట్లాంటి పరిస్థితులు ఏర్పడినా,  ఆ అనుమానం వచ్చినా? 
ఈ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి , కార్డియాలజిస్ట్  సలహా తీసుకోవడం ఉత్తమం.
సాధారణం గా  చేసే పరీక్షలు  ఇలా ఉంటాయి.
రక్త పరీక్షలు ( రక్తం లో లవణాలు , తయిరాయిడ్  హార్మోను ,  అలాగే గ్లూకోజు  ఎంత ఉందొ తెలుసుకుంటే కొన్ని కారణాలు  కూడా తెలుస్తాయి. )
అలాగే ECG అంటే ఎలెక్ట్రో కార్డియో గ్రాం అంటే గుండె ‘రాత ‘ కనుక్కుంటే  దానివల్ల కొన్ని కారణాలు తెలియ గలవు. 
కొన్న్ని సమయాలలో కేవలం ఒక సారి తీసిన ఈ సి జీ తో ఒక ఐడియా ఏర్పడక పోవచ్చు , అందు వల్ల 24 గంటల ఈ సి జీ అంటే దానిని Holter monitoring అంటారు. అది అవసరం కావచ్చు. ఎందుకంటే గుండె కొట్టుకోవడం లో అవకతవకలు 24 ఎప్పుడో కొంత సమయం లో రావచ్చు. ఆ సమయం ఒక్క సారి చేయించుకునే ECG అంటే ఈ సి జీ పరీక్ష తో ఏకీభ వించక పోవచ్చు. అందువల్ల ఒక మానిటరింగ్ ఆపరేటస్ ను శరీరానికి ఒక రోజంతా అంటే ఇరవై నాలుగు గంటలూ ‘ తగిలించి ‘ అందులో గుండె రాతలు అంటే ఎలెక్ట్రికల్ యాక్టివిటీ అఫ్ హార్ట్  పరిశీలించుతారన్న మాట. 
యాంజియో గ్రాం ఇంకా ఎకో కార్డియో గ్రాం కూడా అవసరం ఉండవచ్చు , ఉన్న కారణాన్ని బట్టి. 
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము ! 
 

హృదయం, లయ ఎప్పుడు తప్పుతుంది ?. 37.

In Our Health on మే 18, 2012 at 7:11 సా.

 హృదయం,  లయ ఎప్పుడు తప్పుతుంది ?. 37.

మునుపటి టపాలో చూశాము కదా !  గుండె లేక హృదయం రేటు , రిధం అంటే ఏమిటో!
ఇప్పుడు హృదయ  రిధం అంటే లయ  ఏ  ఏ  పరిస్థితులలో తప్పుతుందో తెలుసుకుందాము.
గుండె ధమనుల లో  రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు: దీనినే కరోనరీ హార్ట్  డిసీస్  అంటారు ( coronary heart disease )
రక్త పోటు, అంటే అధిక రక్త పీడనం అంటే హై బీ పీ ఉన్నప్పుడు: చాలా కాలం బీ పీ ఎక్కువగా , కంట్రోలు లో లేకుండా ఉన్నప్పుడు , హృదయం అంటే గుండె కండరాలు పెరుగుతాయి. అప్పుడు  ఆ ఎక్కువగా పెరిగిన గుండె కండరాల ద్వారా విద్యుత్  సంకేతాలు సరిగా ప్రసరించక  అవక తవకలు కలగవచ్చు. అప్పుడు లయ తప్ప వచ్చు అంటే రిధం మారుతుందన్న మాట.
తయిరాయిడ్  సమస్య  ఉంటె : తయిరాయిడ్ హార్మోను మనకు చాలా అవసరం. కానీ ఆ హార్మోను  అంటే వినాళ గ్రంధి అంటే ఎండోక్రయిన్  గ్రంధి నుంచి  ఒక నిర్ణీత పరిమాణం లోనే మన దేహం లో వస్తూ ఉండాలి. ఎక్కువ ఉన్నా , తక్కువ ఉన్నా సమస్యలు సృష్టించి, హృదయం అంటే గుండె లయ తప్పటానికి కూడా కారణం అవుతుంది. ఊబ కాయం అంటే , అధిక  బరువు ఉంటె , దానితో గుండెలో ఉత్పన్న మయే సమస్య ల వల్ల కూడా గుండె లయ తప్ప వచ్చు.
డయాబిటీస్ అంటే మధు మేహం ఉంటె: మధు మేహం  కంట్రోలు లో లేనప్పుడు, వారి  బీ పీ లో నూ గుండె లోనూ వచ్చే మార్పుల వల్ల , ఇంకా రక్తం లో తీవ్రం గా గ్లూకోజు పరిమాణం తగ్గితే ( ఈ పరిస్థితిని  హైపో , హైపోగ్లయిసీమియా లేక hypoglycaemia  అంటారు ) కూడా గుండె లయ బద్ధం గా కొట్టుకోక పోవచ్చు.
రక్తం లో ఎలేక్త్రోలయిట్స్  సమ తుల్యం లోపించినప్పుడు : మన రక్తం లో ఎలెక్ట్రో లయిట్స్ అంటే లవణాలు అంటే సోడియం, పొటాసియం , క్లోరయిడ్ , వంటి లవణాలు సమ పాళ్ళ లో ఉండాలి. ఎందుకంటే ఈ  లవణాలు అతి తక్కువ పరిమాణం లో ఉండి, మన శరీరం లో ఉండే అన్ని నాడులలో నుంచీ విద్యుత్  తరంగాలు అంటే  ఇంపల్స్  ను ప్రసారం చేస్తాయి.  అంటే  ఈ చర్య  మన నిత్య జీవితం లో  కరెంటు వైరుల గుండా ప్రసారం ఆయె  పధ్ధతి లో జరుగుతుంది. కానీ  విద్యుత్తు అంత శక్తి వంతం కాదు. అందువల్ల ఈ విద్యుత్తు ను మిల్లీ వోల్ట్ లలో చెపుతారు సాధారణం గా ( అంటే  మామూలు గా కొలిచే విద్యుత్ వోల్ట్ లో పది లక్షల వంతు ). ఈ విషయం ఎందుకు తెలుసుకోవాలంటే , గుండె  లయ బద్ధం గా కొట్టుకోవడానికి కూడా గుండె లో ఉన్న నాడులు ఒక క్రమ పధ్ధతి లో  ఇంపల్స్ ను పంపుతూ ఉండాలి.  ఆ చర్యకు అవసరమయిన లవణాలు సమ పాళ్ళ లో లేనప్పుడు కూడా  ఇంపల్స్ సరిగా అందక , గుండె లయ తప్పుతుంది.
అతిగా కాఫీ కానీ ధూమ పానం అంటే స్మోకింగ్  చేస్తూంటే : ఈ చర్యలు కూడా , లయ తప్ప టానికి కారణాలు.
కొన్ని రకాల మందులు  తీసుకుంటుంటే వాటి  సైడ్ ఎఫెక్ట్స్  వల్ల : కొన్ని మందులు వేరే సమస్యకు తీసుకుంటున్నప్పుడు, వారి ప్రభావం వల్ల కూడా ఎరిత్మియా  రావచ్చు అంటే గుండె , లేక హృదయం లయ తప్ప వచ్చు.
మద్య పానం అతిగా చేస్తుంటే : 
‘ తకిట  తధిమి, తకిట  తధిమి , తందానా, హృదయ  లయల ,జతుల, గతుల  తిల్లానా ,
అని  అభిమాన కధా నాయకుడు కమల్ హసన్  ‘ సాగర సంగమం’ సినిమా లో  మద్య పాన  మత్తులో  బావి మీద నృత్యం చేస్తూ పాడే పాట , తెలుగు చిత్రాల  పాటల చిత్రీకరణలో  ఒక మరుపు రాని చిత్రీకరణ !
కమల్ హసన్  అలా లయ బద్ధం గా నృత్యం చేయ గలిగాడు కానీ , అతిగా మద్య పానం చేస్తే,  హృదయం లయ తప్పడం మాత్రం తధ్యం.  ఈ పరిస్థితిని ‘ హాలిడే హార్ట్ సిండ్రోం ‘ ( holiday heart syndrome ) అంటారు. ఇక్కడ కూడా కారణం, అతిగా సేవించిన మద్యం ,అవసరమయిన విద్యుత్ ఇంపల్స్ లను అవక తవక గా ప్రసరింప చేసి, తద్వారా హృదయం లయ తప్పేట్టు చేస్తుంది. దీని పరిమాణం సాధారణం గా  ఎట్రిఎల్ ఫిబ్రి లేషన్స్ ( atrial fibrillations ) గా కనిపిస్తుంది వారిలో.
( పైన ఉన్న చిత్రం చూడండి. అందులో నార్మల్ గా  గుండె  లో ఇంపల్స్ లు ఉంటె ‘  గుండె రాత ‘ ఎట్లా ఉంటుందో , అదే  ఎట్రియల్ ఫిబ్రి లేషన్స్ ఉన్నప్పుడు , అంటే గుండె అవక తవకలు గా కొట్టుకుంటున్నప్పుడు , ‘ గుండె రాత ‘ కూడా అవక తవకలు గా ఎట్లా ఉందొ ఇలా గుండె లయ తప్పితే పరిణామాలు కూడా  ‘ లయ తప్పుతాయి ‘ అంటే  ఉదాహరణకు  ఎట్రియల్ ఫిబ్రి లేషన్స్ ను కంట్రోల్ చేయక పొతే ,   గుండె లోనుంచి  రక్తం గడ్డ కట్టి ఆ గడ్డలు మెదడు కు వెళ్లి పక్ష వాతం కలిగించ వచ్చు ! ) 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !
%d bloggers like this: