Our Health

Archive for జూన్, 2012|Monthly archive page

అబ్సెసివ్ వ్యక్తిత్వం.OCPD . 4.

In మానసికం, Our minds on జూన్ 30, 2012 at 10:26 సా.

అబ్సెసివ్ వ్యక్తిత్వం.OCPD . 4.

క్రితం టపాలో ఈ వ్యక్తిత్వం ఉన్న వారి లక్షణాలు కొన్ని తెలుసుకున్నాము కదా ! వీరు చేసే ప్రతి పనీ అత్యంత జాగరూకత తో చేయడమే కాక , ప్రతి విషయానికీ విపరీతం గా అనుమాన పడుతూ , అనేక రకాలైన సందేహాలు తెచ్చు కుంటూ ఉంటారు.  ప్రతి చిన్న విషయానికీ , అత్యంత శ్రద్ధ అంటే మెటిక్యులాస్ గా ఒక కాగితం మీద నోట్ చేసుకోవడమో. లేదా ఒక పుస్తకం లో వివరం గా రాసుకోవడమో చేస్తుంటారు. వీరు చేసే పనుల గురించీ , ఇతరులు చేసే పనుల గురించీ వీరికి రెండే రెండు అభిప్రాయాలు ఉంటాయి. అవి రైట్ అండ్ రాంగ్. అంటే సరైనది , లేదా తప్పు అయినది. ఇక మధ్యస్థం ఉండదు వీరి నిఘంటువులో ! 
అబ్సెసివ్ వ్యక్తిత్వ లక్షణాలకు కారణాలు :
1.జన్యువుల లోపం లేదా జీన్స్ లో లోపాలు : కొన్ని పరిశీలనల వల్ల ఒక ప్రత్యెక రకమైన జీన్స్ అంటే DRD3 అనే రకమైన జీన్  ఉన్న వారిలో ఈ అబ్సెసివ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 
2.పరిసరాల ప్రభావం : ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులు , వారి చిన్న తనం నుంచీ , తల్లిదండ్రుల ద్వారా కానీ, ఉపాధ్యాయుల ద్వారా కానీ ఈ వ్యక్తిత్వ లక్షణాలను తమకు తెలియకుండానో , తెలిసో , నేర్చుకుంటారు.  అత్యంత క్రమ శిక్షణ తో , చాలా కఠినం గా వారిని పెంచితే , ఆ లక్షణాలు వారికి అలవడుతాయి. అంతే కాక , బాల్యం లో భౌతికం గా కానీ , ఎమోషనల్ గా కానీ, కామ పరం గా  కానీ ఏ విధమైన  అబ్యూజ్ కు లోనైనా , క్రమేణా ఆ  విషాద కర అనుభవాలు ,  అబ్సెసివ్ వ్యకిత్వం గా పరిణితి చెందవచ్చు. అందువల్లనే , ఈ వ్యక్తిత్వం ఉన్న వారు , వారి ఆందోళనా , ఆత్రుతా , తమ అబ్సెస్సివ్ వ్యక్తిత్వ లక్షణాలతో తగ్గించు కున్నట్టు అనిపించినా , వారు చాలా టెన్షన్ కు కూడా లోనవు తుంటారు.
OCPD కీ OCD కీ తేడా ఏమిటి ?: 
అబ్సెసివ్ వ్యక్తిత్వం ( అంటే OCPD or Obsessive , compulsive, Personality disorder ) ఒక వ్యక్తిత్వ  రీతి. అంటే  వ్యక్తిత్వ లక్షణం. కానీ  OCD  అంటే  Obsessive Compulsive Disorder ఒక మానసిక వ్యాధి. అంటే OCD ఉన్న వారు , వారు చేసే పనులు చాలా వ్యధా , బాధా కలిగిస్తున్నా , వారు ఆ పనులు చేయక పొతే వారి మనసు శాంతించదు. ఉదాహరణకు , OCD ఉన్న వారు వారి చేతులను కనీసం ఒక యాభై సార్లైనా కడుగుతూ ఉంటారు రోజులో ! వారి చేతులు ఎర్రగా సబ్భు తో కడిగీ కడిగీ కండి పోయినా కూడా , వారు వారి చేతులకు , ఇంకా ఇన్ఫెక్షన్ ఉందేమో అని అనుమాన పడుతూ ఉంటారు. కానీ అబ్సెసివ్ వ్యక్తిత్వం ఉన్న వారు అంత విపరీతం గా ప్రవర్తించరు.
మరి ఈ అబ్సెసివ్ వ్యక్తిత్వం ఉన్న వారికి చికిత్స ఏమైనా ఉందా ?: 
మానసికం గా పరివర్తన తీసుకు వచ్చే , సైకాలజికల్ చికిత్స లు పలు విధాలు గా వీరికి చేయవచ్చు.
అంటే కాగ్నిటివ్ బిహావియర్  థెరపీ , బిహావియర్ థెరపీ , ఇంకా  కాగ్నిటివ్ అనలిటికల్ థెరపీ ( దీనినే మానసిక విశ్లేషణ చికిత్స అంటారు ) ఈ పద్ధతులలో ఏ ఒక్కటైనా ఉపయోగించి , వారి మనసులలో క్రమం గా మార్పు తేవచ్చు.  ఈ మార్పు కొన్ని సమయాలలో ఆలస్యం అవుతూ ఉంటుంది. అట్టి పరిస్థితులలో , మందుల సహాయం తో కూడా , ఈ వ్యక్తిత్వ లక్షణాలను కొంత వర కూ నియంత్రించ వచ్చు. 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

అబ్సెసివ్ వ్యక్తిత్వం.3.

In మానసికం, Our minds on జూన్ 29, 2012 at 11:57 సా.

అబ్సెసివ్  వ్యక్తిత్వం.3.

అబ్సెసివ్ వ్యక్తిత్వం  ఉన్న వారు నిరంతరమూ , తామూ , తమ పరిసరాలూ ,అతి  శుభ్రం గా ఉంచుకోడానికి తాపత్రయ పడుతూ ఉంటారు. ఈ తాపత్రయం ఎంత వరకూ పోతుందంటే , వారు చేపట్టిన పనులు, నిదానం గా చేస్తూ ఉంటారు. అంతే కాక , ఈ విధం గా నిదానం గా చేస్తూ ఉండడం వల్ల , పనులు కూడా పూర్తి చేయ లేక పోతారు.వారు చేస్తున్న పని మీద వారు అన్ని సమయాలలోనూ సంపూర్ణమైన నియంత్రణ ఉండాలని చూస్తారు.  వారు ప్రతి పనీ ఇట్లా చేస్తూ ఉండడం వల్ల , వారు పని చేస్తున్న ఏ చోట నైనా , ఇతరులతో సత్సంబంధాలు ఏర్పరుచుకోలేక పోతారు.కారణం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది.ఇతరులు వీరి పనిచేసే పధ్ధతి ని అంత శులభం గా ఆమోదించలేరు, సహించ లేరు కనుక. !  వారి పని చేసే తీరు రిజిడ్ గా అంతే అత్యంత కఠినం గా ఉండడం వల్ల, అంటే ఏమాత్రమూ ,రాజీ పడక పోవడం వల్ల కూడా, ఇతరులు వీరిని , వీరి పని తీరునూ అంగీకరించ లేరు. దీనితో, ఈ అబ్సెసివ్ వ్యక్తిత్వం ఉన్న వారు , ఎక్కువ మంది స్నేహితులూ , శ్రేయోభిలాషులు లేక, జీవితం లో చాలా వత్తిడి , లేదా టెన్షన్ అనుభవించుతూ ఉంటారు. అంటే వారి ప్రవర్తన వల్ల , వారితో స్నేహం చేయడానికీ, సహకరించడానికీ , ఇతరులు  అంత శులభం గా ఉత్సాహం చూపరు. ఈ వ్యక్తిత్వం కల వారు, ఒక పట్టాన రిలాక్స్ అవలేరు.అంటే మిగతా వారు ,తీసుకుంటునట్టు, పనిలో విరామం తీసుకోలేరు. అదే పని గా పని చేస్తూ ఉంటారు, రాటపాకుల లాగా ( ఈ పదం ఈ కాలం లో చాలా తక్కువ గా ఉపయోగిస్తూ ఉంటారు కానీ నిరంతరం పని చేసే వారిని కానీ , విరామం లేకుండా ఆడుతూ తిరిగే పిల్లలను కానీ  ‘ రాటపాకుల లాగా ‘ అంటారు. అంటే నూలు వడికే  రాట్నం తిరుగుతూ ఉంటే దానికి ఉన్న చక్రం కూడా నిరంతరం తిరుగుతూ ఉంటుంది కదా , ఆ విధం గా ) వారు ఎక్కడ పని చేస్తున్నా , ఆ పని యొక్క వివరాలు అన్నీ కాచి వడ పోస్తారు. అంటే ఆ పని నిబంధనలు అన్నీ కూడా వారికి కొట్టిన పిండి. అంటే ఒక అక్షరం కూడా పొల్లు పోకుండా నేర్చుకుని , ఆ పనిని అంతే జాగ్రత్త తో చేస్తూ ఉంటారు. వారు చేయవలసిన పనిని కూడా ఆ నిబంధనలకు తగిన విధం గా ఏ మాత్రం లోపం లేకుండా చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారిని ఒక విధం గా ‘ పర్ఫెక్షనిస్ట్ లు’  అనవచ్చు .’  రూలంటే రూలే ‘  ! అంటూ ఉంటారు.  ఈ రకమైన పర్ఫెక్షనిజం వల్ల వారు పనులను సకాలం లో పూర్తి చేయలేక పోతారు. వారు ఉండే ఇంటిలో కూడా వారు ఈ రకమైన పర్ఫెక్షనిజం వల్ల , ప్రతి పనినీ అతి జాగ్రత్తగా, అతి నిదానం గా  చేస్తూ ,  ఆ పనులకు అధిక సమయాన్ని వెచ్చిస్తూ కూడా ఉంటారు. వారికి ఉండే ఇంకో లక్షణం ఏమిటంటే , వారి ఇంటిలో ప్రతి వస్తువుకూ , ఒక ప్రత్యేకతను ప్రతి పాదించి, అంటే సెంటిమెంటల్ వ్యాల్యూ తో చూస్తూ , ఏ వస్తువు నూ పార వేయకుండా ,ఇంట్లో పోగు చేస్తూ ఉంటారు ( ఈ లక్షణాన్ని హోర్డింగ్  అంటారు, ఆంగ్లం లో ) అంటే వారు, వారికి ఏమాత్రం ఉపయోగం లేని వస్తువులను కూడా , ఇంట్లోనే ఉంచుకుని , ఇల్లంతా ఇరుకు అవుతున్నా ఏమాత్రం లెక్క చేయరు.  వారు ఆర్ధికం గా ఖర్చు పెట్టగలిగే పరిస్థితిలో ఉన్నా కూడా ,’  పిల్లికి బిచ్చం పెట్టడు’ అని ఇతరులతో అనిపించుకుంటారు.అంటే పరమ లోభి గా ఉంటారు. 
 వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

దాట వేసే లేదా ఆందోళన మయ వ్యక్తిత్వం . 2. కారణాలు, చికిత్స .

In మానసికం, Our minds on జూన్ 28, 2012 at 11:23 సా.

దాట వేసే లేదా  ఆందోళన మయ  వ్యక్తిత్వం . 2. కారణాలు.

క్రితం టపాలో చూశాము , ఈ వ్యక్తిత్వ లక్షణాలు కొన్ని. సాధారణం గా ఈ వ్యక్తిత్వం ఉన్న వారు , వారి ప్రతిభా పాటవాలను , వారే తక్కువగా  అంచనా వేసుకుని , తీవ్ర అసంతృప్తి కీ, ఆత్మ  న్యూనతకూ  లోనవు తుంటారు.  తరచూ ఇతరులతో తాము పోల్చుకుని , తామే ఎప్పుడూ , ఇతరుల కన్నా తక్కువగా ,ప్రతి విషయం లోనూ ఉన్నామని, ఇన్ఫీరియారిటీ  కాంప్లెక్స్   తో ఉంటారు. ఈ విధమైన  ఆలోచనలతో వారు ఇతరులను కూడా దూరం గా ఉంచుతూ , తాము ఉంటూ ఉంటారు.  వారు వారి భావావేశాలను , ఎమోషన్స్ ను సహజం గా అందరూ చూపే విధం గా వ్యక్తం చేయలేక  మధన పడుతూ ఉంటారు, లో లోపల . వారు అనుభవించే ఈ  ఆత్మ న్యూనతా భావం కారణం గా ఇతరుల  తో భౌతికం గా కూడా దూరం గా ఉంటారు. అంటే  చేతులు కలపడమూ , లేదా స్నేహ పూర్వకం గా కౌగిలించడం , ఇట్లాంటి సహజమైన  ఎమోషన్స్ ను వ్యక్తం చేసే రీతులకు కూడా వారు దూరం అవుతూ వ్యధ చెందుతూ ఉంటారు. వారికై వారు అప సవ్య  మైన  ఆలోచనలతో ఏర్పరుచుకున్న  ‘ లక్ష్మణ  రేఖ  ‘ ల వల్ల  తమ ఇంటి లో నుంచి బయట కు కాలు పెట్టడానికి కూడా శంకిస్తూ ఉండి, తప్పని సరి పరిస్థితులలో , బయట కు వెళ్ళడం ,  బహిరంగ ప్రదేశాలలో తిరగడం వంటి పనులు చేయాలంటే విపరీతం గా భయం , ఆందోళనా చెందుతారు. దీనినే ‘అగారో ఫోబియా  ( agorophbia ) అంటారు ( అగారో అంటే బహిరంగ ప్రదేశాలు  , ఫోబియా అంటే భయం ) ( దీని గురించి ముందు ముందు టపాలలో తెలుసుకుందాము ). అంతే కాక ఎక్కువ కాలం ఇంట్లోనే గడపడం అలవాటు చేసుకోవడం వల్ల , వారిలో వారు , ఫాంటసీ అనుభూతులలో అంటే ఊహా లోకం లో విహరిస్తూ ఉంటారు ఎక్కువ సమయం. 
ఈ రకమైన వ్యక్తిత్వానికి కారణాలు ఏమిటి ? :  ప్రధానం గా ఈ వ్యక్తిత్వానికి , జన్యువులలో ఉన్న మార్పులు , వారు పెరుగుతున్న వాతావరణం , వారు వారి పైనా , ఇతరుల పైనా ఏర్పరుచు కున్న అభిప్రాయాల వల్ల నూ అధికం గా ప్రభావితం అవుతుందని పరిశోధనల వల్ల విశదం అయింది. అంటే , ఈ రకమైన వ్యక్తిత్వం, మన కు మన తల్లిదండ్రులు ఇచ్చిన జీన్స్ అంటే జన్యువుల వల్ల మనకు సంక్రమించ వచ్చు . కానీ  మన జన్యువులలో నిక్షిప్తమై ఉన్న ఆ లక్షణాలు , మనం పెరుగుతూ ఉన్న వాతావరణం , అంటే మన తల్లి తండ్రులు , తోబుట్టువులూ , లేదా మన స్నేహితులూ , స్కూల్ లో మిగతా పిల్లలూ , మనతో ప్రవర్తించే తీరు ,  ఇంకా మనం మన పరిసరాల వల్ల ప్రభావితం అయి , తదనుగుణం గా మార్చుకున్న లేదా మారుతున్న ఆలోచనా దృక్పధం వల్ల విపరీతం గా ప్రభావితం అవుతాయి. క్రమేణా ఆ రకమైన వ్యక్తిత్వం మనకు అలవడుతుంది. 
ఈ రకమైన వ్యక్తిత్వం లక్షణాలు ఎక్కువ కాలం ఉంటే దాని పరిణామాలు ఏమిటి ? :  ఈ రకమైన , వ్యవహారాలనూ , పనులనూ దాట వేసే , లేదా ఆందోళన మయ మైన వ్యక్తిత్వ లక్షణాలు దీర్ఘ కాలం ఉండడం వల్ల , పరిస్థితి ఒక తక్కువ పరిధి ఉన్న ముళ్ళ కంచెలో ఇరుక్కున్న విధం గా ఉంటుంది.  ఈ పరిణామం డిప్రెషన్, యాంగ్జైటీ, అగారో ఫోబియా, లాంటి రుగ్మతలకు దారి తీయ వచ్చు. 
మరి ఈ వ్యక్తిత్వం ఉన్న వారికి ఏ రకమైన  చికిత్స అయినా ఉందా ? : 
ప్రధానం గా , ఈ వ్యక్తిత్వ లక్షణాలు ఉన్న వారు , సోషల్ స్కిల్స్ లో ప్రావీణ్యత పొందితే ఎక్కువ గా లాభ పడతారు.  అంతే కాక కాగ్నిటివ్ థెరపీ అంతే  జ్ఞాన చికిత్స తో కూడా  అధికం గా ప్రయోజనం పొందుతూ , వారి ఆలోచనా రీతులను మార్చుకోగలరు.
మందులు కూడా కొంత వరకు ఉపయోగ పడతాయి వారికి. కానీ మందుల వాడకం మిగతా పద్ధతులు ఏ ఫలితం చూపక పొతేనే చేయాలి.  సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ , ఇంకా కాగ్నిటివ్ థెరపీ – ఈ రెండూ వెంటనే ఫలితాలు చూపవు. ఎందుకంటే , ఈ వ్యక్తిత్వ లక్షణాలు కూడా ఒక రోజు లో కాక దీర్ఘ కాలం గా ఏర్పరుచుకున్న అవక తవక ఆలోచనా ధోరణి వల్ల కదా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

దాట వేసే, లేదా ఆందోళన మయ వ్యక్తిత్వం.1.

In మానసికం, Our minds on జూన్ 27, 2012 at 7:59 సా.

దాట వేసే, లేదా  ఆందోళన మయ  వ్యక్తిత్వం.1.

ఈ రకమైన వ్యక్తిత్వాన్ని  యాంక్షియాస్  లేదా ఎవాయిడెంట్  పర్సనాలిటీ డిసార్డర్  అని అంటారు శాస్త్రీయం గా ! 
ఉదాహరణ చూడండి:  సుమ  కాలేజీ లో చదువుకుంటుంది.  పేరుకు తగ్గట్టే  పూవు లా ఉంటుంది. తల్లి దండ్రులు ఆమెకు ఏ లోపం చెయ్యట్లేదు.తండ్రి , చాలా కెరీర్  కాన్షస్ . క్రమ  శిక్షణ  రవంత  ఎక్కువే అని చెప్పాలి , మిగతా తల్లి దండ్రులతో పోలిస్తే ! సహజం గానే , అందరు తల్లిదండ్రుల లాగా, తన కూతురు , చదువులో , మిగతా  సాంస్కృతిక  కార్యక్రమాలలో బాగా రాణించాలని   ఆశిస్తూ ఉంటాడు. సుమ కష్ట పడి చదువుతుంది. కానీ తన క్లాసులో మొదటి పది మంది లో మాత్రమె ఉంటుంది.  లెక్కలలో సరిగా చేయలేక పోతుంది.  దానితో ఎక్కువ సమయం లేక్కలకే కేటాయిస్తుంది ,ఇంట్లో కూడా ! సుమ    స్నేహితులను కూడా   కూడా వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు.  వారిలో చాలా మంది తన క్లాస్ మెట్సే ! క్రమేణా , వారితో కలవడమూ , మాట్లాడడమూ తగ్గించింది. కాలేజీ లో మిగతా క్లాస్ మేట్స్ , తనతో స్నేహ పూర్వకం గా దగ్గర అవుదామని , మాట్లాడదామని చాలా సార్లు ప్రయత్నిస్తున్నా , తను  అందుకు తగినట్టు రెస్పాన్స్  ఇవ్వలేక పోతుంది. ప్రత్యేకించి తనకన్నా బాగా మార్కులు తెచ్చుకుంటున్న  వారు సమీపం లో ఉన్నప్పుడు, తనలో ఏదో వెలితి , ఆత్మ న్యూనతా భావం తొలిచివేస్తుంది. చదువులో ,  మొదటి ముగ్గురిలో ఎందుకు లేనా?  అని ప్రశ్నించు కుంటూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కువ సమయం పుస్తకాల మధ్య గడిపినా , ఏకాగ్రత , ఇదివరకు లా ఉండట్లేదు. తల్లి దండ్రులు , ఈ విషయం గమనించారు.  ఈ లోగా కాలేజీ యానివర్సరీ  వస్తూండడం తో , వివిధ  పోటీలకు , ప్రాక్టీసులూ, రిహార్సల్సూ చేసుకుంటూ , కాలేజీ స్టూడెంట్స్ అందరూ కాలేజీ వాతావరణాన్ని , ఒక పండగ లాగా మార్చేశారు. సుమ చక్కగా పాడ గలదు. కానీ, రిహార్సల్సు కొన్ని అటెండ్ అబ్యింది , పాడుతున్నప్పుడు, కొందరు ఆకతాయిలు , ‘ వచ్చిందిరా శ్రేయా ఘోషాల్ ‘ అని గేలి చేశారు. దానితో తనకు, ఆందోళన ఎక్కువ అయింది. చేతులూ , కాళ్ళూ, చివరకు తన స్వరం కూడా వణకడం ప్రారంభమైంది. ‘ శ్రేయా ఘోషాల్ కూ తనకూ పోలిక ఎక్కడ ?’ అనుకుంటూ విచార పడ్డది. ఫలితం గా  మిగతా రిహార్సల్స్ కు  పోలేదు, స్నేహితులు బలవంతం చేసినా !  క్రమం గా  తల్లిదండ్రులు, తమ బంధువులను విజిట్ చేసే సమయం లో కూడా , ఏదో ఒక వంక చెపుతూ , తానూ వెళ్ళడం మానుకుంది. కాలేజీ కి వెళుతున్నప్పుడు కూడా ఏదో తెలియని ఆందోళన,ఆత్రుతా , ఏర్పడుతున్నాయి .
ఈ యాంక్షియాస్ లేదా ఎవాయిడెంట్ పర్సనాలిటీ లక్షణాలు ఏమిటి : 
పైన ఉదహరించినట్టు , ఈ రకమైన వ్యక్తిత్వం కల వారిలో , తీవ్రమైన ఆత్మ న్యూనతా భావం ఉంటుంది. వారు వారిని, వారి ప్రవర్తనను కానీ, లేదా వారి  పర్ఫామెన్స్ కానీ, ఇట్లా ఏ  విషయం, సందర్భం లో ఇతరులు ఏ వ్యాఖ్యానం అంటే , కామెంట్ చేసినా , వారు విపరీతం గా స్పందిస్తారు. అంతే కాక , వారి ప్రత్యేకతలూ , ప్రతిభా, వారి విజయాలూ , లెక్క చేయక, వారు ఇంకా, ఇతరుల అంచనాలకు సమంగా , విజయాలు సాధించ లేదని  విచార పడుతూ ఉంటారు.  బిడియము , సిగ్గూ కూడా వారి ఫీలింగ్స్ తో కలిసి , సామాజిక కార్యక్రమాలకు, హాజరు అవటం తగ్గిస్తూ ఉంటారు.  క్రమేణా , నలుగురు కలిసే స్థలాలకు వెళ్ళ కుండా దాట వేయడం అలవాటు చేసుకుంటారు. ఒక వేళ వెళ్ళినా , ఆందోళనా , ఆత్రుతా పడుతూ , తీవ్రమైన  అసౌకర్యాన్ని అనుభవిస్తూ, ఆ ప్రదేశాల నుంచి ఎంత త్వరగా వెళ్లి పోదామా అనుకుంటూ , ముభావం గా , విచారం గా ఉంటుంటారు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

( అప సవ్య ) వ్యక్తిత్వ రీతులు. ( personality disorders ):

In మానసికం, Our minds on జూన్ 26, 2012 at 9:05 సా.

     ( అప  సవ్య ) వ్యక్తిత్వ రీతులు. ( personality disorders ):

మనం, జననం నుంచీ  ఒక   వ్యక్తి  గా పరిణితి చెందే వరకూ ,  మనకైన  కొన్ని ప్రత్యెక  లక్షణాలు  మనలో , అభి వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ  లక్షణాలు భౌతికం గా  మనకు కనిపించేవి అవవచ్చు.  లేదా మానసికం గా మన ఎదుగుదల  ఆవ వచ్చు.ఈ  మానసిక పరిణితి నే  ‘ మన  వ్యక్తిత్వం ‘ లేదా  పర్సనాలిటీ అంటారు.  ఈ  వ్యక్తిత్వం , భౌతిక  లక్షణాల లాగా, అంటే ఎత్తు , బరువు , రంగు లాంటి లక్షణాలతో కొలవ లేము కదా !  అందువల్ల  ఈ  వ్యక్తిత్వం, మన  మెదడులో  మన  ఆలోచనల  కు అనుగుణం గా , మన ప్రవర్తన లో కనిపిస్తూ ఉంటుంది.   ఈ రకమైన వ్యక్తిత్వం మనకంటూ ఒకటి ఏర్పడే వరకూ , అంటే, మనం బాలల  నుంచి వ్యక్తులు గా పరిణితి చెందే వరకూ,  ఈ  వ్యక్తిత్వ  లక్షణాలు మనకు  పూర్తిగా తెలిసి కానీ , లేదా మనకు తెలియకుండా కానీ , మనలో ఒకటొకటి  అభివృద్ధి చెందుతూ ఉండి , మనలను సంపూర్ణం గా వ్యక్తిత్వం కలిగిన  అంటే ఒక పర్సనాలిటీ కలిగిన  వ్యక్తులు గా తయారు చేస్తాయి. మనం సాధారణం గా అనుకునే పర్సనాలిటీ కీ , వ్యక్తిత్వానికీ  మనం తేడా గమనించాలి. మనం మన తెలుగు భాషలో ఆంగ్ల పదమైన  పర్సనాలిటీ ని చాలా  తరచూ  ఉపయోగిస్తూ ఉంటాము. కానీ ఈ  పదాన్ని  కేవలం ఒక  స్త్రీ భౌతిక  లక్షణాలు , లేదా పురుషుల  భౌతిక లక్షణాలూ వివరించడానికే  వాడుతూ ఉంటాము.( ఉదాహరణకు మనం సర్వ సాధారణం గా సినిమా యాక్టర్ల   ‘ పర్సనాలిటీ ‘ని వివరించే సమయం లో ) కానీ యదార్ధానికి  పర్సనాలిటీ , లేదా వ్యక్తిత్వం  ప్రధానం గా మన మనసును లేదా మెదడు ను, ఆలోచనలనూ , క్రియా రూపం లో ఉన్న  మన ఆలోచనలను అంటే మన ప్రవర్తనను  ప్రతి బింబిస్తూంది.
మరి పర్సనాలిటీ డిసార్డర్ అంటే ఏమిటి ? :  అప సవ్య వ్యక్తిత్వం అన వచ్చు నేమో దీనిని. అంటే మనకు పైన చెప్పిన విధం గా కాల క్రమేణా మనకంటూ ఏర్పడిన వ్యక్తిత్వం , ఎప్పుడూ వంద శాతం మంచిగా సవ్యం గా ఏర్పడాలనే నిబంధన ఏదీ లేదు కదా ! అంటే మనం, మనకై , ప్రత్యేకం గా ఏర్పరచుకునే వ్యక్తిత్వం , అనేక కారణాల వల్ల, సవ్యమైనది కాక పోవచ్చు. వైద్య శాస్త్ర రీత్యా  డిసార్డర్ అని మనం ఎప్పుడు అంటామంటే , మనకు ఉన్న లక్షణాలూ , లేదా లక్షణాల సముదాయం, మన రోజు వారీ కార్యక్రమాలకు, అవరోధం అయి, తద్వారా మన వ్యక్తిగత వికాసాన్నీ , అభివ్రుద్ధినీ  కుంటు పరుస్తూ ఉన్నప్పుడు. ఆ రీత్యా చూస్తీ , ఈ  ‘ అప సవ్య  వ్యక్తిత్వ రీతులు లేదా పర్సనాలిటీ డిసార్డర్ లు  మానసిక వ్యాధులు ఉన్న వారిలో,    40  నుంచి 60   శాతం మందికి  ఉంటాయని ఒక పరిశీలనలో తెలిసింది. 
ఈ అపసవ్య వ్యక్తిత్వ రీతుల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి ?: 
ముఖ్యం గా , మనం వ్యక్తిత్వ రీతుల గురించి తెలుసుకుంటే, మనలో మనకు తెలియకుండా ఉన్న ,  అపసవ్య లేదా , అనవసరమైన లక్షణాలను, మనం ఆది లోనే  గమనించి , మన ఆలోచనా రీతులలో , ప్రవర్తనలో మార్పులు తెచ్చుకుని, వ్యక్తిత్వ వికాసం పొందడం కోసం. అంతే కాకుండా , ప్రధానం గా , మనం సంఘ జీవులం కదా ! భిన్న వ్యక్తిత్వాలు ఉన్న  మనుషులతో మనం నిరంతరం,  సంబంధాలు ఏర్పరుచు కుంటూ ఉంటాము కదా !  ఆ సమయాలలో, మనకు తెలిసిన ఈ వ్యక్తిత్వ రీతులతో, ఇతరులతో సంభంధాలు, అంటే,  సత్సంబంధాలు  శులభం గా ఏర్పరుచుకో గలుగుతాము !  అంతే కాకుండా , మనం  చాలా సందర్భాలలో ‘ వాడి సంగతేంటో అంతు పట్టట్లేదు ‘ అని అనుకుంటూ ఉంటాము. అట్లాంటప్పుడు, మనకు ‘ వాడి ‘ గురించి కొంతైనా అవగాహన ఏర్పడుతుంది, మనం వ్యక్తిత్వ రీతుల గురించి ముందే తెలుసుకుని ఉంటే  !   మరి ఇంత ముఖ్యమైన ఈ వ్యక్తిత్వ రీతుల గురించి తెలుసుకోవాలని ఉత్సాహం గా ఉందా !  అయితే ఇక  ఈ టపాలను ఫాలో అవండి ! 
వచ్చే టపాలో  ఈ వ్యక్తిత్వ రీతులు  ( అపసవ్య వ్యక్తిత్వాలకు మారు గా   ‘ వ్యక్తిత్వ రీతులు ‘ అనే పదం ఉపయోగించడం జరుగుతుంది. ) లేదా పర్సనాలిటీ డిసార్డర్ ల గురించి  ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము ! 

స్థిత ప్రజ్ఞత కు, సప్త సూత్రాలు . 6.

In మానసికం, Our minds on జూన్ 25, 2012 at 9:38 సా.

స్థిత ప్రజ్ఞత కు సప్త సూత్రాలు .  6.

 
స్థిత ప్రజ్ఞత  కు కావలసిన ఇంకో ముఖ్య లక్షణం –  తెగింపు లేదా రిస్క్ తీసుకునే స్వభావం. 
అంటే మనం, మన జీవితాలలో, అవసరమైన లేదా సరి అయిన సమయం లో , సరి అయిన నిర్ణయాలు, తీసుకోవడం. అట్లా తీసుకునే ముందు కొన్ని కష్టాలు ఉంటాయని ముందే తెలిసినా ధైర్యం గా తెగింపు చేసి, కొంత రిస్కు తీసుకుని , చేపట్టిన కార్యం లో కృతకృత్యులు కాగలగడం. అంతే కాకుండా, ఇట్లా తెగింపు చేసే స్థిత ప్రజ్ఞులలో, ఓటమి, జీవితం లో ఒక భాగం గా పరిగణించే స్వభావం ఎక్కువ గా ఉంటుంది. ఒక విధం గా చెప్పాలంటే  ప్రతి జీవితమూ, గెలుపు , ఓటముల ఆట. అంటే, మనం అన్ని ఆటలూ గెలవాలనుకోవడం అత్యాశే అవుతుంది. గెలుపూ ఓటములు దైవాధీనాలు కాకపోయినా,  ఓటమి జీవితం లో ఒక భాగం అవడం అసాధారణం కాదు. అట్లాగే స్థిత ప్రజ్ఞత  కలిగిన వారు , వారి గడ్డు కాలం లో, ఇతరులతో సహాయం తీసుకోవడానికి కూడా వెనుకాడరు. అంటే మొండి ధైర్యం చేసి, అంతా తామే ఎదురీత ఈదరు. సహాయాన్ని , తల్లి దండ్రుల నుంచి అయినా, తోబుట్టువుల నుంచీ , స్నేహితుల నుంచీ కూడా తీసుకో వచ్చును. అదే విధం గా, వారి కి కూడా సహాయం చేయ వచ్చు. 
మిగతా గుణాలు, అంటే ఆశావాద దృక్పధం, స్వీయ సామర్ధ్యం  కూడా స్థిత ప్రజ్ఞత కు కావలసిన లక్షణాలే. వీటి గురించి వివరం గా క్రితం టపాలలో తెలుసుకోవడం జరిగింది కదా ! అందువల్ల ఇక్కడ పునశ్చరణం చేయడం లేదు. కాక పొతే ఇక్కడ ఒక విషయం: కొందరు ఆశావాదులు , తాము చేబట్ట బోయే ఏ కార్యం అయినా , పూర్వా పరాలు ఆలోచించ కుండా, కేవలం ఆశావాదాన్ని నమ్ముకుని , యదార్ధానికి దూరం గా ‘ తమకు, ఎప్పుడూ , అంతా మంచే జరుగుతుంది ‘ అనే గుడ్డి నమ్మకం కలిగి ఉంటారు. కానీ ,  స్థిత ప్రజ్ఞత కలిగిన వారు, యదార్ధమైన ఆశావాదులు. వారు సమస్య మీద పూర్తి అవగాహన కలిగి ఉండి, తదనుగుణం గా తమ విజయావకాశాలను సరిగా అంచనా వేసుకోగలరు.  మనం, తెలుసుకున్న లక్షణాలు అన్నీ , స్థిత ప్రజ్ఞత ను పటిష్టం చేయ గలిగినవి. అంతే కాక, ఇవన్నీ  సులభం గా నేర్చు కో గలిగినవే ! ఆచరణ యోగ్యం అయినవే !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

స్థిత ప్రజ్ఞత కు, సప్త సూత్రాలు. 5.

In మానసికం, Our minds on జూన్ 24, 2012 at 10:28 ఉద.

స్థిత ప్రజ్ఞత కు సప్త సూత్రాలు.5.

సానుభూతి. ( ఎంపతీ లేదా empathy ) : 
స్థిత ప్రజ్ఞత అలవరుచు కావాలనుకునే వారికి ఉండవలసిన ఇంకో ముఖ్య లక్షణం – సానుభూతి. 
ఉత్తమ్ ఇంకా నవీన్  ఇద్దరూ ఇరుగు పొరుగు వారు. వారి కుటుంబాలతో  ఒక హౌసింగ్ కాంప్లెక్స్ లో ఉంటున్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు.
వారు బయట బస్ స్టాప్ లో కలుసుకున్నారు. వారిద్దరి మధ్యా జరిగిన ఈ సంభాషణ గమనించండి.
‘నవీన్ గారూ ,  నిన్న  ఆఫీస్ కు వెళ్ళ లేదా ? ఇక్కడ మీరు కనిపించలేదు’  ! 
‘ లేదండీ, మా  చిన్న బాబు సైకిల్ మీద నుంచి పడ్డాడు. హాస్పిటల్ కు తీసుకు వెళ్ళ వలసి వచ్చింది ‘ .
‘ అంతే నండీ నవీన్ గారూ , ఈ రోజుల్లో పిల్లలను ఏమీ అనటానికి వీలు లేదు,  జాగ్రత్త  గా ఉండమని ఎన్ని మార్లు చెప్పినా లెక్క చేయరు ‘.
‘ హాస్పిటల్ లో చాలా సేపు వెయిట్ చేయ వలసి వచ్చింది . ఎక్స్ రే  కూడా తీశారు’ 
‘ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్ళ లేదు కదా ! వెళితే మీ  గతి దేవుడికే ఎరుక ! ‘  నేను అందుకే ఎప్పుడూ  ఆ పొరపాటు చేయను ! 
‘ చేతి ఎముక ఒకటి చిట్లింది అన్నారు’ విచారం గా అన్నాడు నవీన్. 
‘ చాలా దూకుడు స్వభావం అయి ఉంటుంది. మీ వాడిది. నేను మా చిన్న వాళ్ళిద్దరినీ అసలు సైకిళ్ళు , రోలర్ స్కేట్లు, కొననివ్వను. ఝాయ్యి మని వేసుకుని పోతారు. పడి గాయాలు చేసుకుంటారు. ఇది ఉత్తమ్ గారి ‘   ఉత్తమ మైన  ‘ వ్యాఖ్య !  
‘ ప్లాస్టర్ వేశారు, చేయి కదల్చ లేక పోతున్నాడు. రాత్రి పూట కూడా అవస్థ పడుతున్నాడు. ‘ స్కూల్ కు వెళితే సరిగా రాయలేనని ఏడుస్తున్నాడు కూడా ! 
ఒక నాలుగో, ఆరో వారాలు ఉంచుతారనుకుంటాను ప్లాస్టర్.  అప్పటి దాకా మీకు ‘ అవస్థ  తప్పదేమో ! అదిగో నా బస్సు వస్తూంది.  వస్తాను నవీన్ గారూ ! అంటూ బస్సు కోసం పరిగెత్తాడు, ఉత్తమ్ ! 
ఇక్కడ  మనం విశ్లేషణ చేస్తే  రెండు మనస్తత్వాలు, అంటే ఇరువురు మానవుల స్వభావాలు, ఈ చిన్న  సంభాషణ లో  తెలుస్తున్నాయి. 
నవీన్:  ఒక స్వతంత్ర  మానవుడు.  కుటుంబ వ్యక్తి.  తన పిల్లలను చదివిస్తున్నాడు. వారిని మానసికం గానూ, భౌతికం గానూ పెరగనిస్తున్నాడు. ఎక్కువ ఆంక్షలు పెట్టట్లేదు ! చిన్న వాడికి సైకిల్ కావాలంటే కొనిచ్చాడు. ప్రమాద వశాత్తూ , క్రింద పడి గాయం చేసుకుంటే , తల్లడిల్లి పోయాడు. ఆఫీసు మానేసి , హాస్పిటల్ కు తీసుకువెళ్ళాడు. తగిన చికిత్స చేయించాడు. విచారం గా ఉన్నాడు , కొడుకు బాధ పడుతుంటే ! 
ఇక ఉత్తమ్ : ఒక స్వార్ధ మానవుడు. కుటుంబ వ్యక్తి. తన పిల్లలను చదివిస్తున్నాడు. వారిని తాను గీసిన లక్ష్మణ రేఖ దాట నివ్వడం లేదు.  వారిని వారి వయసులో తీసుకోవలసిన రిస్కులు తీసుకోనివ్వడం లేదు. వాటికి కారణాలను తనదైన రీతిలో వివరణ ఇచ్చుకుంటున్నాడు. ఇంకో ముఖ్యమైన లోపం. ఇతరుల మీదా , ఇతరుల సమస్యల మీదా , ఏమాత్రం సానుభూతి లేక పోవడం.  అంతే కాక , పుండు మీద కారం చల్లిన విధంగా ,  చిన్న పిల్ల వాడి చేయి విరిగింది అని చెప్పినా, ‘ కుంటి కూతలు కూస్తూ ‘ ‘ అసందర్భపు వ్యాఖ్యానాలు చేస్తూ,   స్వీయ అహంకార భావనను తెలియ చేస్తున్నాడు. (  అంటే ఇగో ).
సానుభూతి అంటే, తన భావావేశాలతో బాటు ఇతరుల భావావేశాలు అంటే ఎమోషన్స్ కూడా స్పష్టం గా , నిశితం గా గ్రహించి, తదనుగుణం గా ప్రవర్తించ గలిగే సామర్ధ్యం.  ఈ లక్షణం  స్థిత ప్రజ్ఞులలో ఎక్కువ గా ఉంటుంది. ఈ గుణం వల్ల రెండు ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి:  ఇతర మానవులతో సత్సంబంధాలు నెలకొల్పు కోవచ్చు. రెండు: అది మనకు సామాజిక సహాయం ఇస్తుంది. అంటే మనము క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా, మనకు మన పొరుగు వారినుంచి సహకారం, మనం వారికి ఇచ్చినట్టు గానే , మనకు లభిస్తుంది. 
మన ( ఆంధ్ర ) దేశం లో  నాయకులలో ఉండ వలసిన స్థిత ప్రజ్ఞాతా, సానుభూతులు , అనూహ్యం గా, అతి పేద ప్రజలలో ఎక్కువ గా ఉంటున్నాయి. అత్యంత సానుభూతి, ఆదరణ పొంద వలసిన పేద ప్రజానీకం, అత్యంత అవినీతి మయ మైన జీవితాలు గడుపుతూ, దేశాన్నీ , దేశ వనరులనూ, తర తరాలూ ,  పీల్చి  వేస్తూ , ఆవ గింజ అయినంతైనా కష్ట పడకుండానే స్వర్గ సౌఖ్యాలూ , భూలోకం లోనే  అనుభవిస్తూన్న  ‘ జలగల’  మీద, వారే సానుభూతి చూపుతున్నారు.  అందు వలననే, పేద ప్రజలలో ఉన్న ఈ గుణాలను  ‘ వోట్లు ‘ సొమ్ము ‘ చేసు కుంటున్నారు ( మన ) కుహానా నాయకులు.ఇది చాలా దురదృష్ట కర పరిస్థితి.
వచ్చే టపాలో మిగతా సంగతులు తెలుసుకుందాము ! 
 
 
 

స్థిత ప్రజ్ఞత కు, సప్త సూత్రాలు. 4.

In మానసికం, Our minds on జూన్ 23, 2012 at 10:49 ఉద.

స్థిత ప్రజ్ఞత కు సప్త సూత్రాలు. 4.

 
స్థిత ప్రజ్ఞత కు సప్త సూత్రాలు.4. కారణ విశ్లేషణ:
ఇంత వరకూ మనం, స్థిత ప్రజ్ఞత కు అవసరమైన వాటిలో ముఖ్య మైన  రెండు లక్షణాల గురించి తెలుసుకున్నాము కదా! ఇప్పుడు మూడో ముఖ్యమైన లక్షణం గురించి తెలుసుకుందాము.అది కారణ విశ్లేషణ. దీనిని ఆంగ్లం లో కాజల్ అనాలసిస్ ( causal analysis )అని అంటారు.(  causes = కారణాలు, analysis = విశ్లేషణ )ఇది కూడా స్థిత ప్రజ్ఞతను అలవరచుకున్న వారిలో ఉండే ఒక ముఖ్య లక్షణం.  మనం తీసుకోబోయే ప్రతి నిర్ణయాన్నీ , చేయ బోయే ప్రతి పనినీ, సవివరం గా విశ్లేషించి, ఆ పని పూర్వా పరాలూ ,  మంచీ , చెడులు కూడా తెలుసుకొని, తగిన నిర్ణయం తీసుకోవడం. అంటే ఆ పని యొక్క సాధ్యా సాధ్యాలు, ఆ పని లో ఉండే సాధక బాధకాలు, ఆ పని చేయడానికి, మనం ఉపయోగించే శక్తి యుక్తులు,  వెచ్చించ వలసిన సమయం – ఈ విషయాలన్నీ కూలంకషం గా మనం విశ్లేషించు కోవాలి. అందుకు కొంత సమయం అయినా సరే ! మనం మనం చేయ బోయే ప్రతి కార్యాన్నీ సంపూర్ణం గా, అంటే వందకు వంద శాతం మన నియంత్రణలో ఉంచుకోలేము కదా ! కానీ మనకు ఉన్న వనరులు అంటే రిసోర్సెస్ ఉపయోగించి, ఈ రకమైన విశ్లేషణ జరపటం నేర్చుకోవాలి. దీని వల్ల , మనం చేయబోయే పని లో లేదా తీసుకోబోయే నిర్ణయం లో ఎదురయే సమస్యలు కూడా ముందే మనం ఊహించుకోవడం జరుగుతుంది. 
ఉదాహరణ : దయాకర్  ఒక కార్పోరేట్ సంస్థ లో ఉద్యోగం చేస్తాడు. కుటుంబం తో ఒక అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఎప్పుడూ  పని ధ్యాసే,  ఇంటికి వస్తే భార్యా పిల్లలతో సమయం గడుపుతాడు. ఎంత కాలం అద్దె కొంపలో ఉండడం , తమకై ఒక ఇంటిని ఏర్పరుచు కుందామనుకొని, స్థలాలు వెదకడం మొదలెట్టాడు. ఫలానా  ఏజెంట్  మంచి స్థలం ఉంది, పది లక్షలు ఒకసారి కడితే , డాక్యుమెంట్లు మీ చేతిలో ఉంటాయి మూడు నెలలలో అన్నాడు. కొంత  సేవింగ్స్,  కొంత బ్యాంకు లోన్, కలిపి , పది లక్షలూ ఇచ్చాడు, ఏజంటు కు , దయాకర్ , అనేక ఆనందమయ  స్వప్నాలు వస్తున్నాయి దయాకర్ కు. తానూ తన కుటుంబం ,  ప్రశాంత వాతావరణం లో చక్కటి ఇల్లు,  ఒక చిన్న తోట , తనకంటూ ఒక ప్రత్యేకమైన గది …………..ఇట్లా ప్రతి రోజూ, తన ఆలోచనలూ, ఊహలూ , కలలూ , మధురం గా ఉంటున్నాయి.  ఏజంటు రశీదు ఇచ్చి , స్థలం డాక్యు మెంట్  కూడా ఇచ్చాడు. తన వరకు తను, బాగా ఆలోచించి , తాను స్థలం కోసం తీసుకున్న లోన్ తీర్చివేసి ,  ఆ డాక్యుమెంట్ బ్యాంకు కు తీసుకు వెళ్ళాడు రెండేళ్ళ తరువాత, ఇల్లు కట్టడానికి లోన్ కోసం !  బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వడానికి వీలు పడదు అని చెప్పారు . ఈ రెండేళ్లలో , ఆ ఏజంటు , దయాకర్ కు అమ్మిన స్థలాన్ని , ఇంకొకరికి కూడా అమ్మాడు. వారి పేరు మీద ఉంది ప్రస్తుతం ఆ స్థలం. అందువల్ల  బ్యాంకు లోన్ ఇవ్వలేము ‘ అని ఖచ్చితం గా చెప్పారు.  ఇప్పుడు దయాకర్ పరిస్థితి మీ ఊహకే వదిలేస్తాను.  దయాకర్ చేసిన పని, చాలా బాగా ఆలోచించి, చేసినదే. కానీ , ఏజంటు ను పూర్తి గా నమ్మి , తీసుకున్న డాక్యుమెంట్ ను  వెరిఫికేషన్ ఏదీ చేయించ కుండా భద్రం గా  దాచి పెట్టుకున్నాడు. అంటే కారణ విశ్లేషణ సంపూర్ణం గా చేయలేదు. 
ఇంకో ఉదాహరణ:  మధు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కాకపొతే ఉద్యోగ రీత్యా ,తరచూ తిరిగే జాబ్ అవడం వల్ల, ఒక స్థిమితం ఏర్పడ్డాక ,  పెళ్లి సంగతి ఆలోచించ వచ్చు అనుకున్నాడు. ఒక సారి మద్రాస్ కు వెళ్ళాడు అట్లా ! బస చేస్తున్న హోటల్ లో ఏ సి రూం. డిజిటల్ టీవీ. మినీ బార్.  మధు , బీర్ మాత్రమె తాగుతాడు , కానీ ‘  మధువును గ్రోలటానికి ‘ ఉబలాట పడుతున్నాడు. అతడి లో కామ వాంఛ , ఉత్తుంగ కెరటాలై , అలజడి రేపుతుంది. ఇక కావలసినది , ఒక ‘ చక్కని చుక్క ‘. ‘ వెంటనే అందుబాటు లో ఉంది’  అన్నాడు హోటల్ బాయ్. నిజం గానే చాలా అందం గా ఉంది అమ్మాయి. అన్నీ కలిసి,   చాలా  ఆనంద మయం అయింది ,  ఆ అనుభవం,  మధుకు.  . ఒక రెండేళ్ళు అట్లాగే  టూర్ లకు వెళ్ళాడు. కానీ క్రమేణా, ఆరోగ్యం గా  దృ ఢము  గా ఉండే మధు , బరువు తగ్గుతున్నాడు. ఎక్కువగా అలసి పోతున్నాడు. దానితో ఒక సీరియస్  శ్వాస సంబంధ  ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. ఆఫీసు వాళ్ళు వెంటనే ఒక కార్పోరేట్ హాస్పిటల్ లో చేర్పించారు. అత్యంత ఆధునాతన పరీక్షలు చేయించారు, అన్ని కోణాలలో నుంచీ చూస్తున్నారు, మధు లక్షణాలకు కారణం. చివరికి , ఎయిడ్స్  అని తేల్చారు. ఇక్కడ జరిగింది, అంత ప్రతిభావంతుడైన మధు , తాను చేయ బోయే రతి క్రియ    గురించి ఇసుమంతైనా కారణ విశ్లేషణ చేయలేక పోయాడు. ఆ కారణ విశ్లేషణ లోపానికి , అతని క్షణి కోద్రేకం  కూడా తోడైంది. జీవితాంతం, ఆనంద మయం గా ఉండవలసిన మధు జీవితం ( కొన్ని మధురమైన రాత్రులతోనే ? ! )  ‘ వాడి పోయింది’ ! 
వచ్చే టపాలో మిగతా లక్షణాలు తెలుసుకుందాము ! 

స్థిత ప్రజ్ఞత కు సప్త సూత్రాలు. 3.

In మానసికం, Our minds on జూన్ 22, 2012 at 11:24 ఉద.

స్థిత ప్రజ్ఞత కు సప్త సూత్రాలు. 3. క్షణికో ద్రేక నియంత్రణ.

 ( పైన ఉన్నది, స్థిత ప్రజ్ఞత తీవ్రం గా లోపించి, క్షణి కో ద్రేకానికి బానిస అయిన  ఒక ‘ అపర ధర్మ రాజు ‘  కార్టూను !  )

క్రితం టపాలో, స్థిత ప్రజ్ఞత కు, మన ఎమోషన్స్ ను,  అంటే మన భావావేశాలను ఎప్పటికప్పుడు గుర్తించు తూ, వాటిని ఏ విధంగా మనం నియంత్రించు కోవాలో తెలుసుకున్నాము కదా ( అంటే రూలర్ ‘ RULER ‘ కిటుకు ఉపయోగిస్తూ ).
ఇప్పుడు రెండో సూత్రం గురించి తెలుసుకుందాము.  
2. క్షణి కొద్రేక నియంత్రణ అంటే  ఇంపల్స్ కంట్రోల్ ( impulse control ): సైకాలజిస్ట్ లు  ఈ గుణాన్ని delayed gratification, will power, self control  అని కూడా పిలుస్తారు. ఈ ఆసక్తి కరమైన పరిశీలన  చదవండి : దీనిని స్టాన్ ఫర్డ్  విశ్వ విద్యాలయం లో  ప్రొఫెసర్ వాల్టర్ మిచెల్  ( 1972 లో ) చేశాడు.  ఆయన  నాలుగు   సంవత్సరాల వయసు ఉన్న పిల్లలను పిలిచి, ఒక్కొక్కరికీ ఒక  ఒక మిఠాయి ఇచ్చి , ‘ మీరు మీకిచ్చిన మిఠాయి ఇరవై నిమిషాలు తిన కుండా చేతిలోనే ఉంచుకుంటే, మీకు ( ఇరవై నిమిషాల తరువాత ) రెండు మిఠాయిలు ఇస్తాను ‘ అన్నాడు. సహజం గానే, కొందరు పిల్లలు ఇరవై నిమిషాలు ఆగ లేక, మొదట ఇచ్చిన మిఠాయి ని తినేశారు. మిగతా పిల్లలు, ప్రొఫెసరు గారి సలహా ఆచరించి, ఇరవై నిమిషాలూ ఆగి, ఇంకో రెండు మిఠాయిలు కూడా తీసుకున్నారు. ఆ ప్రొఫెసరు గారు ఆ రెండు రకాలు గా ప్రవర్తించిన ( నాలుగు ఏళ్ల  ) పిల్లలను, వారు పెరిగి పెద్ద వారయే వరకూ పరిశీలించారు. ఫలితం గా తెలిసినదేమిటంటే , ఆయన మాటలు విని ఇరవై నిమిషాలు ( ఇంపల్స్ కంట్రోల్ చేసుకుని ) వేచి ఉన్న పిల్లలు, చదువు లో ఎక్కువగా మార్కులు తెచ్చుకుని,కాలేజీలో బాగా రాణించారు. అంతే కాక , వారు అతి తక్కువ మానసిక రుగ్మతలతో ఆరోగ్యం గా ఉన్నారు ( ఇరవై నిమిషాలూ ఆగలేక ఇచ్చిన మిఠాయి ని మింగేసిన  ‘ అల్లరి పిడుగు’ ల కంటే ! ) 
మనం నిత్యం, అనేక క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. కొన్ని నిర్ణయాలు మనం, ముందూ, వెనుకా  చూసుకోకుండా తీసుకుంటాము. అంటే  ఆ నిర్ణయాల పూర్వా పరాలు ఆలోచించ కుండా తీసుకునే ఈ నిర్ణయాలు సామాన్యం గా, మనకు వ్యధ, బాధా కలిగిస్తాయి. మన జీవితాంతం ఆ నిర్ణయాల దుష్ఫలితాలు మనలను వెన్నాడు తుంటాయి. గమనించ వలసినదేమిటంటే, మనం తీసుకునే ఈ నిర్ణయాలు, క్షణికో ద్రేకం లో అంటే  ఆ క్షణాలలో, అంటే అతి తక్కువ సమయం లో తీసుకునేవే ! దీనికి కారణం మన ‘ దూకుడు ‘ మనస్తత్వం.  ఇక్కడ తీసుకునే నిర్ణయం బాగోగులకన్నా , నిర్ణయం ఎంత త్వరగా తీసుకున్నామనే విషయం పైన నే మనం కేంద్రీకరిస్తాము. మానసికం గా ఈ క్షణి కో ద్రేకం , విషమించితే, విపరీత పరిస్థితులకు దారి తీసి, అది అనేక మానసిక రుగ్మతలకు కూడా కారణమవ వచ్చును. ఉదాహరణకు : చాలా మందికి  చేతి వేళ్ళ గోళ్ళు , అంటే nails  కొరుక్కునే అలవాటు ఉంటుంది. కొన్ని పరిస్థితులలో వారు గోళ్ళు ,వాటి చిగురు అంటే వరకూ కొరుక్కుంటూ ఉంటారు. కొందరు వారి  తల మీద ఉన్న వెంట్రుకలను, తరచూ వారే పీక్కుంటూ ఉంటారు. ఇంకొందరు ఇంకా ముందుకు పోయి, వారు పీక్కున్న వెంట్రుకలను వారే తింటూ ఉంటారు. ( ఇట్లా తిన్న వెంట్రుకలు అరగక , కడుపులో పేరుకు పోయి, పెద్ద వెంట్రుకల ఉండలు అయి పేగులకు అడ్డుకొని , తిన్న ఆహారం లోపలి పోక , ఆపరేషన్ చేసి తీయ వలసిన పరిస్థితి రావడం నేను చూశాను ) ఈ  ఉదాహరణలు క్షణి కో ద్రేకం  తెలియచేసే కొన్ని .
ఇంకొన్ని క్షణి కో ద్రేక నిర్ణయాలు,  ఇంకా తీవ్రం గా , మానవులను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు  జూదం లేదా గాంబ్లింగ్ : ఇది ఆధునిక మానవ జీవితం లో ఒక ప్రముఖ ఇంపల్స్ కంట్రోల్ డిసార్డర్. ( impulse control disorder ). జూదం, మానవులు, క్షణి కో ద్రేకం లో చేసే పొరపాట్లకు , తీవ్ర పరిణామాలు అనుభవించే ఒక వ్యసనం. ఈ క్షణి కో ద్రేకం లో కేవలం తాత్కాలిక లాభం కోసం, దీర్ఘ కాలిక లాభాలను, సౌఖ్యాలనూ త్యజిస్తున్నారు. జూదం లో ఒక బంగారపు నిబంధన ఉంది అంటే గోల్డెన్ రూల్. అది. ‘  జూదం ఆడేవారు ఎప్పుడూ నష్ట పోతూ ఉంటారు, ఆడించే వారు ఎప్పుడూ లాభ పడుతుంటారు ‘  అని. ఇట్లా  జరగటం, కేవలం క్షణి కో ద్రేకం వల్ల నే. అంటే ముందూ వెనుకా చూడక ఆ క్షణాలలో తీసుకునే నిర్ణయాల వలననే ! 
స్థిత ప్రజ్ఞత ను ఎక్కువగా అలవరచు కున్న వారు, పైన ఉదాహరించిన క్షణి కో ద్రేక  సంఘటనలే కాక,  ఏ విషయమైనా, ఆచి, తూచి, పూర్వా పరాలు ఆలోచించి, అంటే వాటి పరిణామాలు ( consequences ) కూడా నిశితం గా పరిశీలించి, నిర్ణయాలు తీసుకో గలుగుతారు. అంటే వారి నిఘంటువు లో క్షణి కో ద్రేకం అనే పదం ఉండదు.  
ఈ సందర్భం లో మనం సుమతీ శతక కారుడు వ్రాసిన ఈ పద్యం మననం చేసుకోవచ్చు.
వినదగు ఎవ్వరు చెప్పిన,
వినినంతనె, వేగు పడక, వివరింప తగున్ 
కని, కల్ల, నిజము తెలిసిన 
మనుజుడే పో నీతి పరుడు ,మహిలో సుమతీ ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సూత్రాలు తెలుసుకుందాము !

స్థిత ప్రజ్ఞత కు సప్త సూత్రాలు. 2.

In మానసికం, Our minds on జూన్ 21, 2012 at 3:43 సా.

స్థిత ప్రజ్ఞత కు సప్త సూత్రాలు. 2.

క్రితం టపాలో స్థిత ప్రజ్ఞత అంటే ఏమిటో చూశాము కదా ! నవీన మానవ జీవితం లో, స్థిత ప్రజ్ఞత ప్రాముఖ్యత ఇంకా ఎక్కువ అయింది. అనేక  రకాలైన వత్తిడులనూ తట్టుకొని, మానవులు ప్రతికూల పరిస్థితులలో జీవనం సాగిస్తున్నారు. ఇంకో విధం గా చెప్పాలంటే, ప్రతికూల పరిస్థితులూ, అననుకూల పరిస్థితులూ, ఘర్షణా,ప్రస్తుత  మానవ జీవితాలలో అను నిత్యం ఉంటున్నాయి , కారణాలు ఏమైనప్పటికీ ! మరి ఈ ఘర్షణ మయ జీవిత సాగర మధనం చేస్తూ,  అందులో నుంచి  అమృత మయ మైన ఆనందాన్ని పొందడానికి  స్థిత ప్రజ్ఞత ఎంతగానో ఉపయోగ పడుతుంది మనకు. ఎక్కడో తపో వనాలలో కూర్చుని, ధ్యానం చేసే మునీశ్వరులకు స్థిత ప్రజ్ఞత తో అంత అవసరం ఉండక పోవచ్చు. ఎందుకంటే,  సంసార సుఖాలను త్యజించిన వారికి, ఇక ఘర్షణ ప్రస్తావన ఎందుకు ఉంటుంది కనుక ?!  మరి ఈ స్థిత ప్రజ్ఞత కు సప్త సూత్రాలు వివరం గా తెలుసు కుందాము ! ఈ సప్త సూత్రాలనూ డాక్టర్ కారెన్ రీవిచ్ అనే ( స్త్రీ ) సైకాలజిస్ట్ ( అమెరికా )  పొందు పరిచారు. 
1. భావావేశాలను, గుర్తించి,  నియంత్రించు కోవడం : అంటే మనం, ప్రతి పరిస్థితి లోనూ, ప్రత్యేకించి, ప్రతి కూల లేదా, అననుకూల పరిస్థితులలో, మన హావ భావాలను ఎప్పటి కప్పుడు మన జ్ఞాన ‘ సూచీ ‘ తో కనుక్కుంటూ ఉండడం. అట్లాగే ఆ భావావేశాలు అధికం లేదా అనవసరం కానీ అప్రస్తుతం కానీ , అయినప్పుడు, వాటిని తదనుగుణం గా నియంత్రించు కోవడం. మనలో సహజ మైన హావ భావాలు, అంటే, ఆనందం, విచారము , భయం,యాంగ్జైటీ లేదా ఆందోళన – ఇలాంటివి కలిగినప్పుడు, వాటిని  మనసులో అణుచుకోకుండా, బహిర్గతం చేయడం. స్థిత ప్రజ్ఞత ను అలవరుచుకున్న వారు, ఈ రకమైన హావ భావాలనూ, భావావేశాలనూ బహిర్గతం చేయడలో నైపుణ్యం చూపిస్తారు. స్థిత ప్రజ్ఞత అంటే, ముఖం లో ఏ విధమైన భావావేశాలూ కనపడనీయకుండా ప్రవర్తించడం కాదు. ఎందుకంటే మానవ సహజమైన ఈ ఎమోషన్స్ ను ఎప్పటికప్పుడు మనం మన మనసులలో, లేదా మస్తిష్కాలలో దాచేసుకోవడం ( bottling up  అంటారు ఆంగ్లం లో ) చేయక, బయటకు  తెలియ చేస్తూ ఉండాలి.  కాక పొతే స్థిత ప్రజ్ఞులు కాని వారు, వారి ఎమోషన్స్ ను ఎప్పుడు, ఎట్లా నియంత్రించుకోవాలో తెలియక, తికమక పడుతూ ఉంటారు. ఇట్లా జరిగితే,  సంబంధిత ఎమోషన్స్ లేదా భావావేశాలు, దీర్ఘ కాలికం గా వారిని ఇబ్బంది పెడుతూ , అనేక రుగ్మతలకు దారి తీస్తూ, వారి జీవన గమనాన్ని కుంటు పరుస్తాయి. క్లుప్తం గా చెప్పాలంటే  ‘ ఈ ఎమోషన్స్ లేదా భావావేశపు ‘ గతుకులలో ‘ ఇరుక్కు ‘ పోకూడదు మనం. ప్రొఫెసర్ మార్క్ బ్రాకెట్ ( యేల్ విశ్వవిద్యాలయం, అమెరికా ) ఈ ఎమోషన్స్ ను  ఎట్లా నియంత్రించుకోవాలో , సులభం గా గుర్తు పెట్టుకోవడానికి ,ఒక కిటుకు సూచించారు. అదేంటంటే,  ఆంగ్ల పదం ‘ రూలర్ ‘ ( RULER . అంటే R= Recognize, అంటే మన ఎమోషన్స్ ను మనం గుర్తించ గలగటం,U= Understand, అంటే ఆ ఎమోషన్స్  ఏమిటో  మనం స్పష్టం గా అర్ధం చేసుకోవడం. మనం చూస్తూ ఉంటాము, మన నిత్య జీవితం లో, కొందరు వ్యక్తులు, వారి భావాలను తెలియ చేస్తున్నప్పుడు, వారు నవ్వుతున్నారో ( ఆనందిస్తున్నారో ), ఏడుస్తున్నారో ( విచారిస్తున్నారో ) తెలుసుకోవడం అతి కష్టం ! , అట్లా కాకుండా !, L –  Labelling, అంటే ఒక సారి  అర్ధం చేసుకున్న  ఎమోషన్స్ ను మనం సరిగా గుర్తించి  ఆ  పేరు పెట్టడం లేదా లేబెలింగ్ . E = Express, అంటే మనసులో దాచుకోకుండా బహిరంగ పరచడం, లేదా బయటకు తెలియ చేయడం,  R= Regulate, అంటే క్రమీకరించుకోవడం, లేదా నియంత్రించు కోవడం, స్థిత ప్రజ్ఞత  ఎక్కువ గా ఉన్న వారికీ , తక్కువ గా ఉన్న వారికీ తేడా తెలిసేది ముఖ్యం గా ఈ విషయం లోనే ! ( ఈ విధం గా ‘ RULER ‘ తో మన ఎమోషన్స్ ను నిరంతరం కొలుచుకొని, నియంత్రించుకో గలగటం స్థిత ప్రగ్నత లో ప్రధమ సూత్రం ! ) 
వచ్చే  టపాలో మిగతా సూత్రాలు తెలుసుకుందాము !