Our Health

Posts Tagged ‘ACS’

ఎ సి ఎస్ ( ACS ) గురించి ఎందుకు తెలుసుకోవాలి ?.8.

In Our Health on మే 1, 2012 at 11:38 ఉద.

ఎ సి ఎస్  ( ACS ) గురించి ఎందుకు తెలుసుకోవాలి ?.8.

ACS అంటే  ఎక్యూట్  కరోనరీ సిండ్రోం లేక (  Acute Coronary Syndrome ).
ఈ  వైద్య  సాంకేతిక నామం చూసి కంగారు పడనవసరం లేదు.  ఎక్యూట్  అంటే అకస్మాత్తు గా వచ్చేది. కరోనరీ అంటే గుండెకు సరఫరా చేసే రక్తనాళం ( దీనిని ఆర్టరీ లేక ధమని  అంటారు )  అని పేరు. సిండ్రోం  అంటే  కొన్ని లక్షణాల  సముదాయం.
గుండె పోటు లేక హార్ట్ ఎటాక్, గుండె నొప్పి  లేక యాంజైనా – ఈ రెండిటి నీ కలిపి వైద్య పరిభాష లో  ACS అంటారు. 
ఇప్పుడు పూర్తి గా తెలుగులో  ACS ను ‘  గుండె కు సరఫరా చేసే ధమనులలో మార్పుల వల్ల  వచ్చే లక్షణాల  సముదాయం ‘ అని చెప్పుకుందామా ?! వద్దు లెండి. క్లుప్తం గా ACS అనే అనుకుందాము.
ఎలా పిలిచినా అసలు కధ ఏమిటి ? మనం ACS గురించి ఎందుకు తెలుసుకోవాలి ?: 
హృదయం ఉన్న ప్రతి వారికీ ,  హృదయం లేక గుండె సరిగా పని చేయ లేక పోతున్నప్పుడు కలిగే లక్షణాలు తెలుసుకోవడం శ్రేయస్కరం. ( అంటే ఇక్కడ దయ చేసి పై వాక్యాన్ని శాస్త్రీయం గా చూడండి , సినిమాలో హీరో హీరోయిన్ ల మధ్య  ఒక డైలాగు లా కాక ! )
అందు వల్ల ఆ లక్షణాలు  త్వరగా గమనించి , తగు వైద్య సలహా, సహాయం తీసుకోడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.  వైద్య శాస్త్ర విజ్ఞానం ఎంతో అభి వృద్ధి చెంది , అనేక  చికిత్సా పద్దతులు  వాడుక లోకి వచ్చాయి కదా !  పేరు లోనే ఉన్నట్టు , గుండె లో  అకస్మాత్తు గా వచ్చే ఈ మార్పులను సరిచేయడం ఎంత తక్కువ సమయం లో జరిగితే అంత మంచిది. అందు వల్ల అందరూ  ACS గురించి తెలుసుకోవడం మంచిది.
ఇప్పుడు అసలు విషయం : 
క్రితం టపాలో చూశాము మనం రక్త నాళాలలో జరిగే మార్పులు ప్లాక్ ఫార్మేషన్ కు ఎలా కారణమవుతాయో ! ACS లో జరిగేదీ ఇదే !
అంటే గుండె కు సరఫరా చేసే  రక్త నాళం, దీనినే కరోనరీ ధమని అంటారు.  ఈ కరోనరీ ధమనులలో జరిగే మార్పుల తీవ్రత బట్టి , ఆ  మార్పు కు లోనైన ధమని పాక్షికం గా కానీ, పూర్తి గా కానీ ‘ పూడుకు ‘ పోతుంది.  అంటే బ్లాక్ అవుతుందన్న మాట.  ఇలా పూడుకు పోయినప్పుడు, గుండె కండరాలకు రక్తం సరఫరా కాక, గుండె సరిగా కొట్టుకోవడం జరగదు. మనకు తెలుసు కదా ! మన దేహం లో ఏ భాగం , ఏ కండరం పని చేయాలన్నా , ఆ భాగానికీ , ఆ కండరానికీ , రక్త సరఫరా సరిగా జరగాలనీ, ( ఇక్కడ రక్త సరఫరా లో ముఖ్యం గా జరుగుతున్నది, ప్రతి చోటా ఉన్న జీవ కణాలకు , ప్రాణ వాయువు అంటే , ఆక్సిజెన్ సరఫరా జరుగుతున్నదని అర్ధం చేసుకోవాలి మనం )
పై పటం లో గుండె కు సరఫరా చేసే ఒక ధమని పూడుకు పోవడాన్ని చూపించారు ఉదాహరణకు
( గుండె కు రక్తాన్ని సరఫరా చేసే ప్రతి ధమనికీ ఒక పేరు ఉంది. పై చిత్రం లో చూపించిన ధమనులు  రెండు. వాటిని లెఫ్ట్ యాన్టీరియర్  దిసేన్దింగ్  ఆర్టరీ అనీ రైట్ యాన్టీరియర్ దిసేన్దింగ్ ఆర్టరీ అనీ అంటారు.  ) 
 వచ్చే టపాలో  ACS  లో  ఏమి జరుగుతుందో తెలుసుకుందాము !
%d bloggers like this: