పాజిటివ్ సైకాలజీ ( positive psychology )( ఆశావాద మనస్తత్వం ).2.
పాజిటివ్ సైకాలజీ ‘ పితా మహుడు ‘ మార్టిన్ సెలిగ్మన్ ‘
ముందుగా చదువరులు , సైకాలజీ ( psychology ) కీ , సైకియాట్రీ ( psychiatry ) కీ తేడా తెలుసుకోవాలి.
psyche అంటే మనసు లేక మెదడు కు సంబంధించిన అని అర్ధం లజీ ( logy ) అంటే శాస్త్రం లేక తర్కం అని. మనసు లేక మెదడు కు సంబంధించిన విషయాల వివరాలు అన్న మాట. మరి సైకియాట్రీ అంటే కూడా మెదడు కు సంబంధించిన వివరాలు అనుకోవచ్చు.
మరి తేడా ఏమిటంటే , సైకాలజీ లో కేవలం మానవుల ఆలోచనలు, అనుభూతులను, ప్రవర్తనను విపులం గా పరిశీలించి , మానవులు అలవాటు చేసుకున్న చెడు ప్రవర్తన, లేక చెడు ఆలోచనలకు, వారి నిరాశా వాద ధోరణులకు, పరిష్కారం వారే తెలుసుకొని ( అంటే సైకాలజిస్ట్ సహాయం తో ), వారి ఆలోచనలూ, ప్రవర్తనలో మార్పులు తెచ్చుకొని , తద్వారా , వారు లబ్ది పొందగలగడం. ఇక్కడ గమనించ వలసినది ఏమిటంటే, మన ఆలోచనా ధోరణి లో మార్పులే మందులు గా పని చేస్తాయన్న మాట. అంటే సైకాలజిస్ట్ చేసేది మానసిక పరివర్తన తో చికిత్స.
కానీ సైకియాట్రీ ను ప్రాక్టీసు చేసే సైకియాట్రిస్ట్ అలా కేవలం ప్రవర్తనలో మార్పే కాకుండా , అవసరమయిన మందులు కూడా ఇవ్వడం, లేదా కరెంటు చికిత్స ( దీనినే ఎలెక్ట్రో కన్వల్సివ్ తెరపీ లేక ECT అంటారు ) ద్వారా కూడా చికిత్స చేసి జబ్బు ను దూరం చేస్తారు. ఇక్కడ సైకియాట్రిస్ట్ చేసే చికిత్సలో మానసిక పరివర్తన ప్లస్ మందులు ఉంటాయి.
ఒక ఉదాహరణ: డిప్రెషన్ తీవ్రం గా లేనప్పుడు మందులు లేకుండా కూడా ఆ పరిస్థితి నుంచి బయట పడవచ్చు. మానవులలో ఎక్కువ శాతం మంది డిప్రెషన్ ను వారి జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే వారే ! కానీ అందరూ మందులు తీసుకునే బాగవడం లేదు కదా !
ఇక అసలు సంగతి : ఈ పాజిటివ్ సైకాలజీ ఎలా ప్రారంభమయిందంటే : 1950 నుంచీ ప్రపంచం లో ఉన్న ప్రముఖ సైకాలజిస్ట్లులు కేవలం మానసిక వ్యాధులను నయం చేసే లక్ష్యం తో నే కాకుండా , మానవులు ఆనంద జీవితం గడపగలగటానికి మార్గాలు అన్వేషించ సాగారు. అంటే శాస్త్రీయం గా .అలా పుట్టినదే ఈ పాజిటివ్ సైకాలజీ : ఈ పాజిటివ్ సైకాలజీ కి పితా మహుడు , ఇరవైయ్యవ శతాబ్దం లో అత్యంత ప్రముఖ సైకాలజిస్ట్ లలో ఒకడు గా గుర్తించ బడుతున్న మార్టిన్ సెలిగ్మన్ ( Martin Seligman ). ఇతనూ , ఇంకో సైకాలజిస్ట్ ‘ మిహాలీ ‘ కలిసి ఈ పాజిటివ్ సైకాలజీ అనే ప్రత్యెక విభాగానికి అంకురార్పణ చేశారు. మన నిత్య జీవితం లో ఎంతో విలువైన ఈ పాజిటివ్ సైకాలజీ, అప్పటినుంచి అంచెలంచెలు గా విస్తరిస్తూంది. పాజిటివ్ సైకాలజీ కి వారిద్దరూ ఇచ్చిన నిర్వచనం : ‘ ఈ ఆశావాద మనస్తత్వం అంటే పాజిటివ్ సైకాలజీ మానవులను శాస్త్రీయం గా అవగాహన చేసుకోడానికీ, అలాగే తగు మార్పులు తెచ్చి , దానివల్ల వ్యక్తులూ , కుటుంబాలూ , సంఘాలూ , అత్యంత ప్రయోజనం పొందేట్టు చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము ‘
పాజిటివ్ సైకాలజీ మానవులలో ప్రతిభనూ, సామర్ధ్యాలనూ బయటకు తీసి వారిని విజయ పధం లో పయనింప చేసి తద్వారా, సామాన్య జీవితాలను కూడా ఎంతో అర్ధ వంతం చేస్తుంది, కేవలం రుగ్మతలను మానించడమే కాక !
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము !