Our Health

ఆల్కహాల్ పాయిజనింగ్ గురించి యువత ఎందుకు తెలుసుకోవాలి ? 3. మరి లక్షణాలు గమనించాక వెంటనే ఏం చేయాలి ?

In Our Health on ఆగస్ట్ 1, 2020 at 8:52 సా.


1.వీలయితే,  వారిని కూర్చోబెట్టి , మాట్లాడిస్తూ , స్పృహ తప్ప కుండా , అప్రమత్తం గా ఉండేట్టు చూడాలి . అంటే ఎలర్ట్ గా ఉంచాలి వారిని . 
2.  త్రాగడానికి మంచి నీరు ఇవ్వాలి  . 
3.  ఒకవేళ వారు స్పృహ తప్పితే , వారిని రికవరీ స్థానం లో ఉంచాలి .  అంటే వారిని వెల్లికిలా కాకుండా  ఒక ప్రక్కకు ,  సామాన్యం గా ఎడం ప్రక్కకు  పడుకో బెట్టి వారి కుడి కాలిని మడిచి , ఎడమ కాలును నిటారు గా ఉంచాలి . వారి తలను కూడా ఎడమ ప్రక్కకు తిప్పి ఉంచాలి . ఇలా చేయడం ఎందుకు ?!

 క్రితం టపాలో తెలుసుకున్నట్టు , వారు స్పృహ తప్పినప్పుడు  కనుక వాంతి చేసుకుంటే , పైన చెప్పిన విధం గా పడుకో బెడితే , వారి వాంతి , వారి ఊపిరి తిత్తులలోకి పోవడాన్ని నివారించవచ్చు ! వారు శ్వాస తీసుకుంటున్నారో లేదో అని కూడా గమనిస్తూ ఉండాలి !

How to put someone into the recovery position – CPR Test

 పైన ఉన్న చిత్రం లో రికవరీ పొజిషన్ ఎట్లా ఉంటుందో గమనించండి ! 

4. ఆల్కహాల్ పాయిజనింగ్ అయిన వారి శరీర ఉష్ణోగ్రత తక్కువ అవుతుంది ( hypothermia ) కనుక వారిని ఏదైనా  bed sheet  అంటే దుప్పటి తో కానీ శాలువా తో కానీ కప్పి ఉంచాలి . 
5. సత్వర సహాయం అందే వరకూ వారి చెంత నే  ఉండి  , వారి శరీర పరిస్థితి ని గమనిస్తూ ఉండాలి . 


వచ్చే టపాలో , మరి ఈ పరిస్థితులలో చేయ కూడనిదేంటో  కూడా తెలుసుకుందాం ! 
మీకు ఈ  విషయం లో ఉన్న క్లిష్టమైన సందేహాలు అడగండి ! 

ఆల్కహాల్ పాయిజనింగ్ లక్షణాలు ఎట్లా కనిపిస్తాయి ? 2.

In Our Health on జూలై 23, 2020 at 6:41 సా.

 క్రితం టపాలో ఆల్కహాల్ పాయిజనింగ్ అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా !ఇప్పుడు ఆల్కహాల్ ఒకే సారి అతిగా తాగిన వారిలో కనిపించే లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం !

 ఈ విషయాలు తెలుసుకోవడం మీకు  మద్యం తాగే  అలవాటు లేక పోయినా కూడా , మీరు తెలుసుకుంటే , మీ స్నేహితులను కానీ , లేదా అతిగా తాగిన అపరిచిత వ్యక్తులు కానీ , మీకు తారస పడితే , మీరు వారి ప్రాణాలను క్షించ గలుగుతారు ! 

 క్రితం టపాలో చెప్పుకున్నట్టు , ఆల్కహాల్ తాగిన వారికి , ఆ తాగిన ఆల్కహాల్ ప్రమాద కరం గా మారడం అనేక విషయాల మీద ఆధార పడి ఉంటుంది ! ఇక లక్షణాల గురించి చెప్పుకుంటే , మీకు ఆ అతిగా తాగిన వ్యక్తి ,

1. వికారం గా కడుపు లో తిప్పిన వారి లాగా ప్రవర్తించడం , లేదా వాంతులు చేసుకోవడం ,

 2. మతి స్థిమితం కోల్పోయినట్టు అంటే  కంఫ్యూస్ అయినట్టు ఉండడం ,3. కళ్ళు తిరిగి పడి పోబోతున్నట్టు ఉండడం కానీ,

4. లేదా పడి పోవడం గానీ జరగొచ్చు !

5. అంతే కాకుండా వారికి మూత్ర విసర్జన మీద కంట్రోలు తప్పి వారు వేసుకున్న ప్యాంట్ లో కానీ ధోవతి లో గానీ , లేదా జీన్ ప్యాంట్ లో కానీ మూత్ర విసర్జన చేసుకుని , ఆ తడి ప్రాంతాలు బయటి వారికి స్పష్టం గా కనబడడం కానీ జరగ వచ్చు ! 

6. ఇంకో ప్రమాద సంకేతం ఏమిటంటే  వారి శ్వాస తీసుకోవడం కష్టం అవడం ! ఈ లక్షణం కనబడడానికి కారణం : అతిగా తాగితే , మన దేహం లో ప్రవేశించిన మద్యం శాతం ఎక్కువ అయి , అన్నవాహిక కూ , శ్వాసనాళానికీ మధ్య  కవాటం గా పని చేసే  నాలుక వెనుక భాగం  బలహీనం అవుతుంది . అప్పుడు నోటిలో ఉండే ( వాంతి  మిగతా ద్రవాలు ) నేరుగా శ్వాసనాళం ద్వారా ఊపిరి తిత్తులలో ప్రవేశిస్తాయి !  ఆ పరిస్థితి ని గొంతుకు ఏదైనా పదార్ధం అడ్డం పడడం  తో పోల్చుకోవచ్చు !ఇక వీరి రక్త పరీక్ష చేసి చూస్తే ,  మద్యం శాతం ఎక్కువ గా ఉండడం తో పాటుగా , వారి రక్తం లో చక్కర శాతం చాలా తక్కువ గా అయి , ఆ పరిస్థితి  మెదడు లోని నాడీ కణాలు నశించే ప్రమాదం ఉంటుంది ! 


వచ్చే టపాలో మరి  సహాయం చేసే వారి కర్తవ్యం  ఏమిటో కూడా తెలుసుకుందాం ! అంటే  ప్రధమ చికిత్స ! 
ఈ విషయం మీద మీకు  వచ్చే క్లిష్టమైన సందేహాలూ , ప్రశ్నలూ తెలియచేయండి ! 

ఆల్కహాల్ పాయిజనింగ్ గురించి యువత ఎందుకు తెలుసుకోవాలి ? 1.

In Our Health on జూలై 18, 2020 at 6:16 సా.

 మద్యం తాగడం ఈ రొజుల్లో   ఒక అలవాటు లేదా ఫ్యాషన్ గా మారుతోంది , భారత దేశం లో ! అనేక రకాలు గా మద్యం తాగడాన్ని  అన్ని వయసుల వారిలోనూ , ముఖ్యం గా యువత లోనూ ప్రేరేపిస్తున్నారు, వారికి ప్రజల మీద ప్రేమ ఉండి కాదు ! కేవలం , వారి స్వార్ధం కోసం !  మద్యం వ్యాపారం అనేక వేల కోట్ల వ్యాపారం !  ఈ వ్యాపారం చేసే వారికి , ప్రజలు ఎంత నిదానం గా దానికి బానిస అవుతూ , వారి ఇల్లూ , ఒళ్ళూ , బ్యాంకు ఖాతాలూ  గుల్ల చేసుకుంటూ ఉంటే , అంత మంచిది , అంత లాభ సాటి ! అతిగా మద్యం తాగడం,  అందులోనూ ఒకేసారి అంటే బింజ్  డ్రింకింగ్  ను కూడా యువత ఒక ఆట గా మార్చి పోటీలు పడి మరీ  తాగుతున్నారు ! ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే , అంతర్జాలం  గురించీ,  ప్రపంచం లో  వస్తున్న  అనేక రకాలైన సాంకేతిక మార్పులను కూడా అవలీలగా నేర్చుకునే చురుకు దనం  ఉన్న యువత కు  , తాగడం వల్లా , ఒకే సారి అతిగా తాగడం వల్ల  కలిగే ప్రమాదాల గురించి  జీరో అంటే సున్నా అవగాహన మాత్రమే ! 
ఒకే సారి అతిగా తాగడం అంటే ఏమిటి ? ( ఆల్కహాల్ పాయిజనింగ్  లేదా ఆల్కహాల్ టాక్సిసిటీ ) : ఎక్కువ పరిమాణం లో ఆల్కహాల్  తక్కువ సమయం లో తాగడం !కడుపులో ఆహారం అతి తక్కువ గా ఉన్న సమయం లో , తాగిన మద్యం అతి త్వరగా  మన రక్తం లో కలుస్తుంది ! సాధారణం గా  తాగే వారు , ఆఫీసులు మూసేశాక,  ఇంటికి వెళ్లే సమయం లో , తాగుతూ ఉంటారు ! విద్యార్థులు కూడా , కాలేజీలు , అయ్యాక ఇంటికి  వెళ్లే ముందు ( ఖాళీ కడుపు తో ) తోటి విద్యార్థులతో  సరదా గా తాగుతూ ఉంటారు ! ఆ సమయం లో,  సహజం గానే వారు ఆకలి తో ఉండి , అప్పుడు వారు  తాగే మద్యం త్వర త్వర గా రక్తం లో కలుస్తుంది ! ఇక్కడ గుర్తు ఉంచుకోవలసిన విషయం :  ఎంత మద్యం తాగితే అది  ప్రమాదం అవుతుంది ? అనే విషయం ఖచ్చితం గా  ఎవరికీ తెలియదు ! అంటే , మద్యం ప్రమాదకరం గా  కొన్ని పరిస్థితులలో అంటే ,  వయసు , వారు ఆకలి తో ఉన్నారా లేదా , వారి బరువు , వారు ఎంత తక్కువ సమయం లో తాగుతున్నారు ? అనే అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది ! 

Blood Alcohol Concentration | Aware Awake Alive


మద్యం శాతం అంటే గాఢత లేదా concentration  శరీరం లో ఎక్కువ అవుతే , ఏమౌతుంది ? !
1. మెదడు  ఆలోచించడం మందకొడి గా ఉంటుంది ! అంటే చురుకుదనం తగ్గుతుంది !

2. కడుపు లో మంటా ,వికారం గా అవడం , ఇంకా  కొందరిలో , వాంతులు చేసుకోవడం కూడా జరుగుతుంది !

3. గుండె కొట్టుకోవడానికీ , ఇంకా శ్వాస తీసుకోవడానికీ  కారణమయే  నాడులు  అతి మద్యం వల్ల  ప్రభావితమై , ఆ చర్యలు మందగించుతాయి ! 

4. డీహైడ్రేట్ అంటే శరీరం లో లవణాలు తక్కువ అవుతాయి . 

5. శరీర ఉష్ణోగ్రత తగ్గి  ప్రమాదకరం గా , హైపోథర్మియా అనే పరిస్థితి ఎదురవుతుంది !

6. శరీరం లో షుగర్ తగ్గి  స్పృహ తప్పే ప్రమాదం ఉంటుంది ! ఎందుకంటే , మన మెదడు లో తక్కువ షుగర్ పరిస్థితి ఏర్పడితే , మెదడు  లోని  నాడీ కణాలు దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది !
తరువాతి టపా లో , ఆల్కహాల్ పాయిజనింగ్ లేదా ఒకే సారి అతిగా తాగిన వారి లో ఏ లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం ! 

పై విషయం గురించి మీకున్న కష్టమైన సందేహం తెలియ చేయండి ! 

%d bloggers like this: