Our Health

Archive for the ‘Our Health’ Category

వ్యామోహం ( infatuation ) , క్రష్ ( crush ) ,  ఆకర్షణ (attraction )  , ప్రేమ ( love ) లకు తేడా ఏంటి ?! – 1.

In Our Health on ఫిబ్రవరి 24, 2022 at 9:39 సా.

 వ్యామోహం ( infatuation ) , క్రష్ ( crush ) ,  ఆకర్షణ (attraction )  , ప్రేమ ( love ) లకు తేడా ఏంటి ?! – 1.

1.  వ్యామోహం ( infatuation ) :

నీలిమ ఇంటర్మీడియేట్  విద్యార్థిని . క్రమం తప్పకుండా కాలేజీ కి వెళుతూ , 

శ్రద్ధగా చదువుకుంటుంది !  ప్రత్యేకించి తన ఫిజిక్స్ లెక్చరర్  క్లాస్ లో ఇంకా  శ్రద్ధ గా !

ఎందుకంటే,  ఆ లెక్చరర్   ఎప్పుడూ,  శుభ్రమైన , మడతలు లేని బట్టలు వేసుకుని , 

విద్యార్ధులందరితోనూ , చలాకీ గా మాట్లాడుతూ వారి సందేహాలు తీరుస్తూ ఉంటాడు ! 

కొన్ని సార్లు నీలిమ దగ్గరగా వచ్చి ఆమె కళ్ళలో చూస్తూ , సబ్జెక్ట్  లో సందేహాలు తీరుస్తాడు ! 

మిగతా చాలా మంది బాయ్స్ కన్నా , నీలిమకు ఆ లెక్చరర్ అంటే  విపరీతమైన వ్యామోహం ఏర్పడింది ! 

తరచూ  అతడి రూపం  తన మనసులో మెదులుతూ ఉంటుంది , ఇంట్లో ఉన్నా కూడా !

అతని మీద  ఎంతో ఆరాధనా భావం కలుగుతూ ఉంది , 

అతడి  సమీపం లో ఎంతో  వెచ్చదనం కలిగి , అభద్రతా భావం తొలగి పోతుంది ! 

అలాగని తాను తన చదువును అశ్రద్ధ చెయ్యట్లేదు ! ఏకాగ్రత తో  చదువుకుంటూంది !

ఆ లెక్చరర్ అంటే నీలిమకు వ్యామోహం ఏర్పడింది , యదాలాపం గా అతడిని తలుచుకోగానే కామోత్తేజం కలుగుతుంది !  తాను ఆ లెక్చరర్ ను  ప్రేమించడం లేదు, అని తనకు తానూ సర్ది చెప్పుకుంటుంది ! 

కానీ వ్యామోహాన్ని అనేకమంది అనేక రకాలు గా నిర్వచించారు ! 

కొందరు , ఇరువురి మధ్య ప్రేమ పుష్పం వికసించే సమయంలో మొగ్గ వంటిదే ‘ వ్యామోహం ‘ అని అన్నారు ! 

ఇంకో సైకాలజిస్ట్ ,  ఇరువురి మధ్య గాఢమైన అన్యోన్యత పెరిగే ముందు దశ అని అన్నాడు ! 

ఒక సెక్స్ సైకాలజిస్ట్ , ‘ ఎదుటి వ్యక్తి  సమీపం లో కలిగే నూతనోత్తేజం , ఇంకా ఒక పిసరు కామ వాంఛ కూడా ‘  అని ప్రబోధించాడు ! 

ఇక హార్మోనుల పరం గా చూస్తే , ఈ దశలో ‘ డోపమిన్  ‘ అనే హార్మోను ఆమె లో ఉవ్వెత్తున ఎగసి పడుతుంది ! 

బ్రౌన్ మహాశయుడు , ఈ వ్యామోహాన్ని  మూడు రకాలు గా తేల్చాడు. 

మొదటి రకం లో ‘ ఎదుటి వ్యక్తి మీద పిచ్చి ఆకర్షణ ఏర్పడుతుంది ! కానీ వారి మనసు వారి వశం లోనే ఉంటుంది ! 

రెండో రకం లో ,  వారి మనసు వారి వశం తప్పిపోతోంది ! తాము వ్యామోహ పడిన వ్యక్తి  ఆజ్ఞలు శిరసావహిస్తారు , ముందూ వెనుకా ఆలోచించకుండా ! 

ఇక మూడో రకమైన వ్యామోహం లో , తాము వ్యామోహపడిన వ్యక్తి  చెప్పిన ప్రతి విషయమూ వారికి వేద వాక్కు అయి , దానిని ఆచరణలో పెట్టి , తీవ్రమైన ప్రతికూల పరిణామాలను కూడా ఎదుర్కొంటారు ! అంటే , ఈ దశలో వారు వారికి ఏది మంచో చెడో  ఆలోచించుకునే  విచక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోతారు , నష్టపోతూ ఉంటారు ! 

2. క్రష్  ( crush ) :

ఈ రోజుల్లో చాలా మంది యువతీ యువకుల్లో వినబడే మాట ! 

స్నిగ్ధ  గ్రాడ్యుయేషన్ రెండో సంవత్సరం చదువుతూ ఉంది ! చాలా మంది ఆమె క్లాసు లో 

ఉన్న యువకులకు  ఆమె అంటే క్రష్ ! అందుకు కారణం లేకపోలేదు !

లేత చాకోలెట్ రంగులో నిగనిగ లాడే మేని వర్చస్సు , చిక్కటి నీలి మేఘాల ల  లాంటి అలల కురులు, తల తిప్పకుండా చూస్తూ ఉండాలనిపించే కళ్ళూ , ముఖమూ , పెదవులూ , 

ఉలి తో చెక్కినట్టుండే  వక్షస్థలం , సన్నటి నడుమూ , ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖమూ !

తరచూ సగం జారీ ఉండే పైట , కేవలం యాధృచ్చికమో  , లేదా లోపలి అందాలు కనిపించాలని , తానే  జారవిడుస్తుందో తెలుసుకోలేక , కుర్రాళ్లందరూ అయోమయం తో వెర్రెత్తి పోతారు ! 

మరి ఈ క్రష్ ( crush ) కు తెలుగులో సరైన అర్ధం కోసం చూస్తే ‘ నలిపివేయడం ‘ అని గూగుల్ లో కనిపించింది !  ఈ తెలుగు అర్ధం ఇక్కడ ఏమాత్రం వర్తించదు ! 

ఈ క్రష్  అంటే , విపరీతమైన భౌతిక ఆకర్షణకు లోనై ,భావోద్రేకం , కామోత్తేజం , ఇంకా  కామ పరమైన ఆలోచనలు కూడా కలగడం ! 

కొన్ని సార్లు  ఆ ఆకర్షణకు లోనైన  వ్యక్తి , క్రష్  ఉన్న అవతలి వ్యక్తి తో ప్రేమలో కూడా పడ వచ్చు , కానీ అరుదు గా మాత్రమే  అది గాఢమైన ప్రేమ గా మారుతుంది ! 

మిగతా సంగతులు వచ్చే టపాలో ! ఈ టపా మీద  మీ అభిప్రాయాలు ఏమిటో  ?! 

ఆగి ఉన్న లారీ ని ఢీ కొట్టిన వాహనం ! 

In Our Health on ఫిబ్రవరి 19, 2022 at 12:31 సా.

ఆగి ఉన్న లారీ ని ఢీ కొట్టిన వాహనం !

మనం ఏ తెలుగు పత్రిక చూసినా తరచూ కనిపించే వార్త  ! 

కేవలం ఢీ కొట్టడమే కాక,  చాలా సాధారణం గా ఆ వాహనాలలో ప్రయాణించే వారు  ప్రాణాలు కోల్పోవడమో  , లేదా తీవ్రం గా గాయపడడమో జరుగుతూ ఉంది !

ఈ వార్తలు చదువుతున్నప్పుడు ,  మరణించిన వారెవరూ మన బంధువులు కాకపోయినా ,

బాధ కలుగుతూ ఉంటుంది ! 

ఆగి ఉన్న వాహనాలను ఢీ  కొట్టడం , చాలా వరకూ నివారించగలిగే ప్రమాదం ! 

ఇక లోతు గా పరిశీలిస్తే :

రహదారుల మీద  లారీలు , ఇతర వాహనాలూ  అనేక కారణాల వల్ల ఆపి ఉండవచ్చు ! 

1. ఆ వాహనం యాంత్రిక లోపం వల్ల  ఆగి పోయి ఉండ  వచ్చు ! 

2. ఆ వాహన చోదకుడు ( డ్రైవర్ ) అలసిపోయి , ఆపి ఉండ వచ్చు ! 

3. మూడవ ముఖ్యమైన కారణం , ప్రధాన రహదారుల మీద  ప్రత్యేకించిన పార్కింగ్ బే  ఏదీ లేకపోవడం ! 

విదేశాలలో ప్రతి  ప్రధాన రహదారి మీదా , నియమిత దూరాలలో , వాహన పార్కింగ్ కు ప్రత్యేకమైన సదుపాయాలు తప్పనిసరిగా ఉంటాయి ! 

ఈ సదుపాయాలు ఎప్పుడూ ప్రధాన రహదారి మీద కాక , దానిని ఆనుకొని ఉంటాయి ! 

అంతే కాకుండా , ప్రధాన రహదారి మీద ఏ వాహనాన్నీ  , తగిన కారణం లేకుండా ఆపడం నేరం ! 

ఇక  ఆగి ఉన్న వాహనాలలోకి దూసుకు పోయే వాహనాలకు కారణాలు :

దీనికి ప్రధాన కారణం , ఆ  వాహన చోదకుడి ( డ్రైవర్ ) తప్పే ! 

ఈ తప్పిదానికి కారణాలు :

1. అతివేగం గా వాహనాన్ని నడపడం  ! ( దీనివల్ల , ఒక వేళ  ఆ డ్రైవర్ ముందు నిలిపి ఉన్న వాహనాన్ని చివరి నిమిషం లో గమనించినా  అతివేగం వల్ల ,  ఢీ కొట్టడాన్ని  నివారించ లేడు  ! )

2. మద్యం తాగి కానీ , ఇతర మాదక ద్రవ్యాలు తీసుకుని కానీ , ఆ  వాహనాన్ని నడపడం ! 

( దీనివల్ల ఆ వాహన చోదకుడిలో విపరీతమైన ధైర్యమూ, ఆత్మ విశ్వాసమూ పెరిగి , విచక్షణా జ్ఞానం నశిస్తుంది  ! ) 

3. నిద్రలేమి తో కానీ , పగలంతా అతిగా శ్రమ చేసి , తగిన విశ్రాంతి  తీసుకోక,  వాహనాన్ని నడపడం కానీ చేస్తే.

4. అనేక గంటలు గా  తగిన విశ్రాంతి తీసుకోకుండా వాహనాన్ని నడుపుతూ , ఏకాగ్రత కోల్పోవడం వల్ల  కానీ . 

5. పొగ మంచు లో , ఇంకా అత్యంత చీకటి లో ముందు ఆగి ఉంచిన వాహనాన్ని గమనించలేక పోవడం వల్ల కానీ. 

6. ముఖ్యం గా , వాహన చోదకుడికి డ్రైవింగ్ పై  అవగాహన లేక పోవడం వల్ల  కానీ . 

( ఇది సర్వ సాధారణం గా డ్రైవింగ్ నేర్చుకోకుండా , లైసెన్సు ను ‘ కొనుక్కోవడం ‘ వల్ల  జరిగే అనర్ధం ! )

7. చివరగా , తాము నడుపుతున్న వాహనం లో బ్రేకులు అకస్మాత్తుగా పనిచేయడం మానేస్తే ! ఇది చాలా అరుదుగా జరుగుతుంది ! 

పై విషయాలన్నీ గమనించి , తగిన జాగ్రత్తలు తీసుకుంటే , వాహన చోదకులు వారూ , వారితో  ప్రయాణం చేస్తున్న ఇతరులూ , వారి విలువైన జీవితాలను ,  ప్రమాదాలనుంచి  రక్షించుకోగలుగుతారు ! 

మీ అభిప్రాయాలను తెలియ చేయండి ! 

ఆల్కహాల్ పాయిజనింగ్ గురించి యువత ఎందుకు తెలుసుకోవాలి ? 4. అత్యవసరం గా చేయకూడని పనులు ఏంటి ?

In Our Health on ఆగస్ట్ 7, 2020 at 9:22 సా.
Am I Drinking Too Much Alcohol? | Beach House Recovery

క్రితం టపాలలో  ఆల్కహాల్ పాయిజనింగ్  జరిగిన వ్యక్తులలో , పాయిజనింగ్ లక్షణాలు ఏమిటో ,ఆ లక్షణాలు  గమనించాక , చేయవలసిన ప్రథమ చికిత్స ఏమిటో కూడా తెలుసుకున్నాం కదా ! 
ఇప్పుడు  అలాంటి  అత్యవసర పరిస్థితులలో,  చేయకూడని పనులేంటో కూడా తెలుసుకుందాం ! 
1. అతిగా తాగి నిద్ర పోతున్న  వారిని  నిద్ర పోనీయకూడదు ! అట్లా వారి ఖర్మ కు వారిని వదిలి వేయకూడదు . ఎందుకు ? :  అతిగా తాగిన వారిలో మొదట ఆల్కహాల్  వారి కడుపు లో ఉండి  నిదానం గా రక్తం లో కలుస్తూ ఉంటుంది ! అంటే ,  వారు మత్తు గా ఉండి  నిద్ర  పోతున్న సమయం లో కూడా , వారి రక్తం లో ఆల్కహాల్ శాతం క్రమేణా ఎక్కువ అవుతూ , ప్రమాదకర స్థాయి కి చేరుకుంటుంది . అప్పుడు వారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే , వారి ని అత్యవసర చికిత్స ఉన్న ఆస్పత్రి కి చేర్చాలి . 
2. వారికి కాఫీ ఇవ్వకూడదు , ఎందుకు ? : కాఫీ తాగడం వల్ల  , డీహైడ్రేషన్ అయి,   మెదడు కణాలు శాశ్వతం గా దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది . 
3. వారిని ఎప్పుడూ వాంతి చేసుకోమని ప్రేరేపించ కూడదు . ఎందుకంటే , క్రితం టపాల లో చెప్పుకున్నట్టు , వారిలో మింగడానికి అవసరమయే  కండరాలు పని చేయక , వారి వాంతి  వారి ఊపిరి తిత్తులలో ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. ఆ పరిస్థితిని చోకింగ్  అంటారు (choking ). 
4. వారిని ఎప్పుడూ నిలబెట్టి ,  ఎవరి సహాయం లేకుండా  నడప కూడదు. ఎందుకు ?: రక్తం లో ఎక్కువైన ఆల్కహాల్  మెదడులో చేరి ,  సహజం గా  నడక లో ఉండే సమతుల్యం అంటే బాలన్సు ( balance ) జరగక , వారు క్రింద పడి  ప్రమాదాలు జరిగే  అవకాశం ఉంది . 
5. ఎప్పుడూ వారిని చల్ల నీటి క్రింద ఉంచడం కానీ , వారి మీద చల్లటి నీటిని  పోయడం లేదా చల్లడం  గానీ చేయకూడదు . ఎందుకు ? :  ఆల్కహాల్ మితి మీరి తాగడం వల్ల వారి ఉష్ణోగ్రత అప్పటికే తగ్గి పోయి ఉంటుంది .  ఆ పైన చన్నీటిలో వారి దేహాన్ని తడిపితే  , ఉష్ణోగ్రత ఇంకా తగ్గి  , హైపోథర్మియా అనే అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది !
6. వారికి ఇంకా ఆల్కహాల్ త్రాగడానికి ఇవ్వకూడదు . ఎందుకు ?:  అట్లా చేస్తే వారి రక్తం లోని ఆల్కహాల్ ప్రమాదకర శాతానికి చేరుకొని ప్రాణాలు పోవచ్చు ! 


వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు . 

మీకున్న ప్రశ్నలూ , సందేహాలూ తెలియచేయండి ! 

ఆల్కహాల్ పాయిజనింగ్ గురించి యువత ఎందుకు తెలుసుకోవాలి ? 3. మరి లక్షణాలు గమనించాక వెంటనే ఏం చేయాలి ?

In Our Health on ఆగస్ట్ 1, 2020 at 8:52 సా.


1.వీలయితే,  వారిని కూర్చోబెట్టి , మాట్లాడిస్తూ , స్పృహ తప్ప కుండా , అప్రమత్తం గా ఉండేట్టు చూడాలి . అంటే ఎలర్ట్ గా ఉంచాలి వారిని . 
2.  త్రాగడానికి మంచి నీరు ఇవ్వాలి  . 
3.  ఒకవేళ వారు స్పృహ తప్పితే , వారిని రికవరీ స్థానం లో ఉంచాలి .  అంటే వారిని వెల్లికిలా కాకుండా  ఒక ప్రక్కకు ,  సామాన్యం గా ఎడం ప్రక్కకు  పడుకో బెట్టి వారి కుడి కాలిని మడిచి , ఎడమ కాలును నిటారు గా ఉంచాలి . వారి తలను కూడా ఎడమ ప్రక్కకు తిప్పి ఉంచాలి . ఇలా చేయడం ఎందుకు ?!

 క్రితం టపాలో తెలుసుకున్నట్టు , వారు స్పృహ తప్పినప్పుడు  కనుక వాంతి చేసుకుంటే , పైన చెప్పిన విధం గా పడుకో బెడితే , వారి వాంతి , వారి ఊపిరి తిత్తులలోకి పోవడాన్ని నివారించవచ్చు ! వారు శ్వాస తీసుకుంటున్నారో లేదో అని కూడా గమనిస్తూ ఉండాలి !

How to put someone into the recovery position – CPR Test

 పైన ఉన్న చిత్రం లో రికవరీ పొజిషన్ ఎట్లా ఉంటుందో గమనించండి ! 

4. ఆల్కహాల్ పాయిజనింగ్ అయిన వారి శరీర ఉష్ణోగ్రత తక్కువ అవుతుంది ( hypothermia ) కనుక వారిని ఏదైనా  bed sheet  అంటే దుప్పటి తో కానీ శాలువా తో కానీ కప్పి ఉంచాలి . 
5. సత్వర సహాయం అందే వరకూ వారి చెంత నే  ఉండి  , వారి శరీర పరిస్థితి ని గమనిస్తూ ఉండాలి . 


వచ్చే టపాలో , మరి ఈ పరిస్థితులలో చేయ కూడనిదేంటో  కూడా తెలుసుకుందాం ! 
మీకు ఈ  విషయం లో ఉన్న క్లిష్టమైన సందేహాలు అడగండి ! 

ఆల్కహాల్ పాయిజనింగ్ లక్షణాలు ఎట్లా కనిపిస్తాయి ? 2.

In Our Health on జూలై 23, 2020 at 6:41 సా.

 క్రితం టపాలో ఆల్కహాల్ పాయిజనింగ్ అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా !ఇప్పుడు ఆల్కహాల్ ఒకే సారి అతిగా తాగిన వారిలో కనిపించే లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం !

 ఈ విషయాలు తెలుసుకోవడం మీకు  మద్యం తాగే  అలవాటు లేక పోయినా కూడా , మీరు తెలుసుకుంటే , మీ స్నేహితులను కానీ , లేదా అతిగా తాగిన అపరిచిత వ్యక్తులు కానీ , మీకు తారస పడితే , మీరు వారి ప్రాణాలను క్షించ గలుగుతారు ! 

 క్రితం టపాలో చెప్పుకున్నట్టు , ఆల్కహాల్ తాగిన వారికి , ఆ తాగిన ఆల్కహాల్ ప్రమాద కరం గా మారడం అనేక విషయాల మీద ఆధార పడి ఉంటుంది ! ఇక లక్షణాల గురించి చెప్పుకుంటే , మీకు ఆ అతిగా తాగిన వ్యక్తి ,

1. వికారం గా కడుపు లో తిప్పిన వారి లాగా ప్రవర్తించడం , లేదా వాంతులు చేసుకోవడం ,

 2. మతి స్థిమితం కోల్పోయినట్టు అంటే  కంఫ్యూస్ అయినట్టు ఉండడం ,3. కళ్ళు తిరిగి పడి పోబోతున్నట్టు ఉండడం కానీ,

4. లేదా పడి పోవడం గానీ జరగొచ్చు !

5. అంతే కాకుండా వారికి మూత్ర విసర్జన మీద కంట్రోలు తప్పి వారు వేసుకున్న ప్యాంట్ లో కానీ ధోవతి లో గానీ , లేదా జీన్ ప్యాంట్ లో కానీ మూత్ర విసర్జన చేసుకుని , ఆ తడి ప్రాంతాలు బయటి వారికి స్పష్టం గా కనబడడం కానీ జరగ వచ్చు ! 

6. ఇంకో ప్రమాద సంకేతం ఏమిటంటే  వారి శ్వాస తీసుకోవడం కష్టం అవడం ! ఈ లక్షణం కనబడడానికి కారణం : అతిగా తాగితే , మన దేహం లో ప్రవేశించిన మద్యం శాతం ఎక్కువ అయి , అన్నవాహిక కూ , శ్వాసనాళానికీ మధ్య  కవాటం గా పని చేసే  నాలుక వెనుక భాగం  బలహీనం అవుతుంది . అప్పుడు నోటిలో ఉండే ( వాంతి  మిగతా ద్రవాలు ) నేరుగా శ్వాసనాళం ద్వారా ఊపిరి తిత్తులలో ప్రవేశిస్తాయి !  ఆ పరిస్థితి ని గొంతుకు ఏదైనా పదార్ధం అడ్డం పడడం  తో పోల్చుకోవచ్చు !ఇక వీరి రక్త పరీక్ష చేసి చూస్తే ,  మద్యం శాతం ఎక్కువ గా ఉండడం తో పాటుగా , వారి రక్తం లో చక్కర శాతం చాలా తక్కువ గా అయి , ఆ పరిస్థితి  మెదడు లోని నాడీ కణాలు నశించే ప్రమాదం ఉంటుంది ! 


వచ్చే టపాలో మరి  సహాయం చేసే వారి కర్తవ్యం  ఏమిటో కూడా తెలుసుకుందాం ! అంటే  ప్రధమ చికిత్స ! 
ఈ విషయం మీద మీకు  వచ్చే క్లిష్టమైన సందేహాలూ , ప్రశ్నలూ తెలియచేయండి ! 

ఆల్కహాల్ పాయిజనింగ్ గురించి యువత ఎందుకు తెలుసుకోవాలి ? 1.

In Our Health on జూలై 18, 2020 at 6:16 సా.

 మద్యం తాగడం ఈ రొజుల్లో   ఒక అలవాటు లేదా ఫ్యాషన్ గా మారుతోంది , భారత దేశం లో ! అనేక రకాలు గా మద్యం తాగడాన్ని  అన్ని వయసుల వారిలోనూ , ముఖ్యం గా యువత లోనూ ప్రేరేపిస్తున్నారు, వారికి ప్రజల మీద ప్రేమ ఉండి కాదు ! కేవలం , వారి స్వార్ధం కోసం !  మద్యం వ్యాపారం అనేక వేల కోట్ల వ్యాపారం !  ఈ వ్యాపారం చేసే వారికి , ప్రజలు ఎంత నిదానం గా దానికి బానిస అవుతూ , వారి ఇల్లూ , ఒళ్ళూ , బ్యాంకు ఖాతాలూ  గుల్ల చేసుకుంటూ ఉంటే , అంత మంచిది , అంత లాభ సాటి ! అతిగా మద్యం తాగడం,  అందులోనూ ఒకేసారి అంటే బింజ్  డ్రింకింగ్  ను కూడా యువత ఒక ఆట గా మార్చి పోటీలు పడి మరీ  తాగుతున్నారు ! ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే , అంతర్జాలం  గురించీ,  ప్రపంచం లో  వస్తున్న  అనేక రకాలైన సాంకేతిక మార్పులను కూడా అవలీలగా నేర్చుకునే చురుకు దనం  ఉన్న యువత కు  , తాగడం వల్లా , ఒకే సారి అతిగా తాగడం వల్ల  కలిగే ప్రమాదాల గురించి  జీరో అంటే సున్నా అవగాహన మాత్రమే ! 
ఒకే సారి అతిగా తాగడం అంటే ఏమిటి ? ( ఆల్కహాల్ పాయిజనింగ్  లేదా ఆల్కహాల్ టాక్సిసిటీ ) : ఎక్కువ పరిమాణం లో ఆల్కహాల్  తక్కువ సమయం లో తాగడం !కడుపులో ఆహారం అతి తక్కువ గా ఉన్న సమయం లో , తాగిన మద్యం అతి త్వరగా  మన రక్తం లో కలుస్తుంది ! సాధారణం గా  తాగే వారు , ఆఫీసులు మూసేశాక,  ఇంటికి వెళ్లే సమయం లో , తాగుతూ ఉంటారు ! విద్యార్థులు కూడా , కాలేజీలు , అయ్యాక ఇంటికి  వెళ్లే ముందు ( ఖాళీ కడుపు తో ) తోటి విద్యార్థులతో  సరదా గా తాగుతూ ఉంటారు ! ఆ సమయం లో,  సహజం గానే వారు ఆకలి తో ఉండి , అప్పుడు వారు  తాగే మద్యం త్వర త్వర గా రక్తం లో కలుస్తుంది ! ఇక్కడ గుర్తు ఉంచుకోవలసిన విషయం :  ఎంత మద్యం తాగితే అది  ప్రమాదం అవుతుంది ? అనే విషయం ఖచ్చితం గా  ఎవరికీ తెలియదు ! అంటే , మద్యం ప్రమాదకరం గా  కొన్ని పరిస్థితులలో అంటే ,  వయసు , వారు ఆకలి తో ఉన్నారా లేదా , వారి బరువు , వారు ఎంత తక్కువ సమయం లో తాగుతున్నారు ? అనే అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది ! 

Blood Alcohol Concentration | Aware Awake Alive


మద్యం శాతం అంటే గాఢత లేదా concentration  శరీరం లో ఎక్కువ అవుతే , ఏమౌతుంది ? !
1. మెదడు  ఆలోచించడం మందకొడి గా ఉంటుంది ! అంటే చురుకుదనం తగ్గుతుంది !

2. కడుపు లో మంటా ,వికారం గా అవడం , ఇంకా  కొందరిలో , వాంతులు చేసుకోవడం కూడా జరుగుతుంది !

3. గుండె కొట్టుకోవడానికీ , ఇంకా శ్వాస తీసుకోవడానికీ  కారణమయే  నాడులు  అతి మద్యం వల్ల  ప్రభావితమై , ఆ చర్యలు మందగించుతాయి ! 

4. డీహైడ్రేట్ అంటే శరీరం లో లవణాలు తక్కువ అవుతాయి . 

5. శరీర ఉష్ణోగ్రత తగ్గి  ప్రమాదకరం గా , హైపోథర్మియా అనే పరిస్థితి ఎదురవుతుంది !

6. శరీరం లో షుగర్ తగ్గి  స్పృహ తప్పే ప్రమాదం ఉంటుంది ! ఎందుకంటే , మన మెదడు లో తక్కువ షుగర్ పరిస్థితి ఏర్పడితే , మెదడు  లోని  నాడీ కణాలు దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది !
తరువాతి టపా లో , ఆల్కహాల్ పాయిజనింగ్ లేదా ఒకే సారి అతిగా తాగిన వారి లో ఏ లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం ! 

పై విషయం గురించి మీకున్న కష్టమైన సందేహం తెలియ చేయండి ! 

కరోనా కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు-2.

In Our Health on జూలై 11, 2020 at 2:17 సా.

క్రితం టపాలో కరోనా సమయంలో, మన శరీర ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు మనం మానసిక ఆరోగ్య విషయాల  గురించి తెలుసుకుందాం!

ఏదైనా తీవ్రమైన విపత్తు సంభవించినప్పుడు మానవుల ఆలోచన ఆలోచనా  ధోరణులు ,  బాల బాలికలలో  ఒక రీతిగా నూ , యుక్త వయస్కులలో ఇంకో రీతిగా నూ ,  ఇంకా వయోవృద్ధులలో  ఇంకో రకంగాను ఉంటాయి. ఏ వయస్సుకు చెందిన వారైనప్పటికీ ,మన పరిసరాలలో జరుగుతున్న మార్పులు తీవ్రంగా ఉన్నప్పుడు అవి  అందరినీ  ఆందోళనకు గురిచేస్తాయి.  ప్రత్యేకించి,  కరోనా అంటువ్యాధి, దాని పరిణామాలు స్పష్టంగా తెలియకపోవటం ,  వ్యాధి బారిన పడుతున్న వారు ఎక్కువ అవుతూ ఉండడం ,  ఇంకా మరణాల రేటు పెరుగుతూ ఉండటం కూడా ఆందోళన కలిగించడం  సహజమే ! 

 ఈ ఆందోళనలు  అనేక రకాలుగా బయటపడవచ్చు . యధాలాపంగా ఉండటమూ ,  ఆహారం సరిగ్గా తినకపోవడం, తగినంత నిద్ర పో లేకపోవటం , ఇంకా భయంకరమైన , ఆందోళన కలిగించే  కలలు  నిద్రాభంగం చేయడమో , అదేపనిగా తమ గురించి తమ బంధు మిత్రుల గురించి వారి యోగక్షేమాల గురించి ఆలోచించి తీవ్రమైన మానసిక వత్తిడి కి గురౌతూ ఉండడం కూడా  జరుగుతుంది. చీటికీ మాటికీ  అంటే స్వల్ప విషయాలకే , చీకాకు పడుతూ ఉండడం , ఉద్రేకం చెందడం , నిరాశా నిస్పృహ లకు లోనవడం లాంటి లక్షణాలు కూడా  గమనించ వచ్చు. 

ఈ లక్షణాలు మూడు వారాల కన్నా ఎక్కువ గా కనుక ఉంటే అది కుంగుబాటు గా మారవచ్చు . అంటే క్లినికల్ డిప్రెషన్.  ఈ క్లినికల్ డిప్రెషన్ ను  కనుక మొగ్గలోనే తుంచి వేయక పోతే , ఆ లక్షణాలు ఉన్నవారు తీవ్ర పరిణామాలు  ఎదుర్కోవచ్చు. అంటే, విపరీతంగా బరువు తగ్గిపోవడం తాము చదువుతున్న విద్యలో ఏకాగ్రత కోల్పోవడం జరగవచ్చు,  లేదా  ఉద్యోగస్తులు  , తాము చేస్తున్న ఉద్యోగంలో తగినంత శ్రద్ధ చూపకుండా పై అధికారుల విమర్శలకు, నిందలకు లక్ష్యం అవ్వచ్చు. ఇవన్నీ ఒక రకం అవుతే, కరోనా లక్షణాల మీద సరియైన అవగాహన లోపించి చిన్నపాటి జలుబు, జ్వరం రాగానే విపరీతంగా ఆందోళన చెంది బాధపడటం కూడా ఇంకొందరిలో కనబడుతుంది.  

చిన్నపిల్లల్లో కనపడుతున్న ఆందోళనలను తల్లిదండ్రులు ముందే  గమనించి ,  వారికి తగిన విధంగా సమాధానాలు చెబుతూ  ఉండాలి. వారు తీసుకోవలసిన జాగ్రత్తల మీద ఎక్కువ దృష్టి పెడుతూ  కరోనా వైరస్ మీద అవగాహన పెంచాలి.  ముఖ్యంగా తరచూ చేతులు కడుక్కోవడం, ముఖం మీద అశుభ్రమైన చేతులు పెట్టకొకపోవడం,  ఇంకా గుంపుల లోనూ సమూహాల లోను ఎక్కువగా తిరగకపోవడం లేదా ఆడకపోవటం  లాంటి జాగ్రత్తలను  తల్లిదండ్రులు వారికి  విడమరచి చెప్పాలి.  అంతేకాకుండా వారితో ఎక్కువ సమయాన్ని గడపటానికి ప్రయత్నం చేయాలి. ఇక యవ్వనులు కూడా లాక్ డౌన్ విధించటం మూలంగా వారి వివిధ కార్యక్రమాలు కేవలం ఇంటికే పరిమితమవ్వడం  వలన  ఎక్కువ సమయాన్ని ఇంటర్నెట్లో ఉపయోగించడము లేదా అతిగా తినడం నిద్రపోకుండా కంప్యూటర్ గేమ్స్ ఆడటం కూడా జరుగుతుంది.  ఆన్లైన్లో గేమ్స్ ఆడటం ఇంకా జూదం లేదా ఆన్లైన్ బెట్టింగ్ చేయటము కూడా యవ్వన వయస్కులలో అనేక రెట్లు ఎక్కువ అయినట్టు పరిశీలనలు తెలుపుతున్నాయి. 

అంతే  కాకుండా ,  కరోనా అంటువ్యాధి  సమయానికి  ముందే  మానసిక సమస్యలతో , లేక మానసిక వ్యాధులతో  ( అంటే కుంగుబాటు లేదా డిప్రెషన్ , ఇంకా స్కిజోఫ్రీనియా , మ్యానియా  అంటే పిచ్చి  లాంటివి ) సతమవుతున్న వారి వ్యాధులు  ఇంకా ఉధృతం అయే  ప్రమాదం కూడా ఉంటుంది , ఈ కరోనా కాలం లో . వారికి కరోనా వ్యాధి అంటక పోయినా కూడా !

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాం !

కరోనా కాలంలో జాగ్రత్తలు- 1

In Our Health on జూలై 3, 2020 at 9:52 సా.

కరోనా మహమ్మారి ( Covid 19 ) గత ఆరు నెలలుగా ప్రపంచమంతటా దాదాపుగా అన్ని దేశాలలో చేస్తున్న మారణహోమం అంతా ఇంతా కాదు. లక్షలాది అమాయక ప్రజలు కరోనా బారిన పడుతున్నారు, వేలల్లో చనిపోతున్నారు కూడా ! 

వివరాలు గమనిస్తే,  ఈ కోవిడ్ అంటువ్యాధి బాధితులు 90 శాతం పైగా కోలుకుంటున్నారు. కేవలం ఒక ఐదు పది శాతం ప్రజలు మాత్రమే , ఈ కరోనా  అంటువ్యాధి తో దీర్ఘకాలిక వ్యాధి పరిణామాలు అనుభవిస్తున్నారు, కొందరు వాటిని కూడా తట్టుకోలేక మరణిస్తున్నారు.  ఇక ఈ కాంప్లికేషన్స్ వచ్చినవారు ఎందుకు మరణిస్తున్నారు ? అని పరిశీలిస్తే ,అనేక రకాలైన కారణాలు కనిపిస్తున్నాయి.  అందులో ముఖ్యమైన కారణం, ఊపిరితిత్తులలో ప్రాణవాయువు మార్పిడి తగ్గి పోవడం. మనం తీసుకునే  శ్వాస లో ఉన్న ప్రాణ వాయువు ( అంటే ఆక్సిజన్ ) మన రక్తంలో కలిసేది ఊపిరితిత్తుల లోనే కదా !

ఈ కొవిడ్ అంటు వ్యాధి వల్ల ఆ రక్తంలో ప్రాణవాయువు  కలిసే ప్రక్రియ చాలా వరకు కుంటు పడి , తద్వారా మెదడుకి చేరవలసిన ప్రాణవాయువు క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. మన దేహం లో మిగతా అన్ని భాగాల కన్నా, మెదడుకు ప్రాణవాయువు అందక పోతే , మూడు నాలుగు నిమిషాల లోనే ,  మెదడు పని చేయటంలో అవకతవకలు కలుగుతాయి .  ఇది ఒక రకమైన సీరియస్ కాంప్లికేషన్ అవుతే ,రక్తనాళాల లో ఈ అంటు వ్యాధి వల్ల  మార్పులు కలిగి , తద్వారా రక్తం చిన్న చిన్న గడ్డలు గా  మారటం , ఆ మారిన గడ్డలు ( లేదా క్లాట్స్  ) మెదడులోకి ప్రవేశించి ,మెదడులోని రక్తనాళాలు మూసి పక్షవాతం రావటానికి కారణమవడం ఇంకో రకమైన సీరియస్ కాంప్లికేషన్ ( లేదా తీవ్ర పరిణామం ). ఇట్లా జరిగితే  పక్ష వాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. 

ఈ కోవిడ్ లేదా కరోనా వైరస్ మానవులకు జంతుజాలం ద్వారా సంక్రమించే ఒక కొత్త వ్యాధి అవటం మూలాన ఈ వైరస్ మానవులలో ఏ ఏ విధంగా హాని చేస్తుందో కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది . 

ఇక ఈ కరోనా  వైరస్ అంటువ్యాధి కి నివారణ కేవలం టీకా లేదా వ్యాక్సిన్  ద్వారా మాత్రమే.  ఈ వ్యాక్సిన్ను కనుక్కోడానికి కూడా ప్రపంచం అంతటా వివిధ దేశాలలో శరవేగంగా ప్రయత్నాలు ప్రయత్నాలూ  ,ప్రయోగాలూ  జరుగుతున్నాయి. ఇవన్నీ త్వరలోనే ఫలిస్తాయని ఆశిద్దాం ! 

ఈ కోవిడ్  వ్యాధి సంక్రమించిన వారిలో  , కొద్దిపాటి లక్షణాలతో కోలుకుంటున్న వారు 90 శాతానికి పైగా ఉన్నారని తెలుసుకున్నాం కదా ,  ఇట్లా కొద్దిపాటి లక్షణాలతో  కోలుకోవటానికి కూడా శాస్త్రజ్ఞులు అనేక కారణాలు కనుక్కున్నారు. వాటిలో ఒక  ముఖ్యమైన కారణం, కోలుకున్న వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉండటం.  ఈ రోగనిరోధకశక్తినే ‘ ఇమ్యూనిటీ ‘ అంటారు. 

అనాదిగా ( భారతదేశంలో ముఖ్యంగా )  సంప్రదాయంగా వస్తున్న ఆహారపు అలవాట్లు రోగ నిరోధక శక్తి ఇనుమడింప చేస్తాయి.  ఈ అలవాట్లే , సమతుల్యమైన ఆహారం తినటం,  మనసును ప్రశాంతంగానూ , ఉల్లాసంగానూ  ఉంచుకోవటం,  కంటికి తగినంత నిద్ర పోవటం మొదలైనవి .  ఇక్కడ సమతుల్యమైన ఆహారం అంటే తగినంత సూర్యరశ్మి తో పాటుగా  పోషక పదార్థాలు కూడా సమతుల్యంలో ఉండాలి , అంటే స్థూలపోషకపదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలు.  స్థూల పోషక పదార్థాలు అంటే మనం తినే మాంసకృత్తులు, పిండి పదార్థాలు, ఇంకా నూనె పదార్థాలు. ఇక సూక్ష్మపోషక పదార్థాలు అంటే మన దేహానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు. వీటిని సూక్ష్మ పోషక పదార్థాలు అని ఎందుకంటారంటే , మన దేహానికి కేవలం మిల్లీ గ్రాముల లోనే వీటి అవసరం ఉంటుంది. కానీ ఆ మిల్లిగ్రాముల లో అవసరం అయ్యే ఈ సూక్ష్మ పోషక పదార్థాలు కూడా ఏవైనా కారణాల వల్ల మన దేహానికి లభించకపోతే,  వాటి లోపం వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందువల్ల సహజంగా వివిధ రకాలైన వైరస్ లనూ , బ్యాక్టీరియాలనూ  నిరోధించే రోగ నిరోధక శక్తి పెరగటానికి మనం రోజూ సమతుల్య మైన ఆహారం తినాలి . 

అంతేకాకుండా , అధిక రక్త పీడనం ( అంటే హై బ్లడ్ ప్రెషర్ ) ఇంకా మధుమేహం అంటే డయాబెటిస్ ఇంకా ఆస్తమా లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా ఆయా వ్యాధులను సాధ్యమైనంత నియంత్రణలో ఉంచుకోవటానికి ప్రయత్నించాలి . రోజూ తగినంత సమయం వ్యాయామం కూడా చేస్తూ ఉంటే, రోగనిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనల ద్వారా తెలిసింది. 

ఇప్పటివరకూ  మనం,  శారీరకంగా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకున్నాం కదా ! వచ్చే టపాలో మానసికంగా ఏ రకమైన జాగ్రత్తలు ఈ కరోనా కాలంలో తీసుకోవాలో తెలుసుకుందాం !

 ఈ టపా మీద మీ అభిప్రాయాలు తెలుపగలరు ! 

అవసరమవుతేనే బయటకు వెళ్ళండి ! , ముఖానికి మాస్కు తొడుగుకోండి !, చేతులు తరచూ కడుక్కోండి సబ్బుతో !  క్షేమం గా ఉండండి , ఉంచండి ! 

సీక్రెట్ కెమెరా లను కనుక్కోవడం ఎట్లా ?! 

In Our Health on డిసెంబర్ 9, 2018 at 2:07 సా.

సీక్రెట్ కెమెరా లను కనుక్కోవడం ఎట్లా ?! 

Image result for secret hidden cameras

స్మోక్ డిటెక్టర్లు , పూల కుండీలు , పుస్తకాలూ, DVD  కేస్ లూ , ఎలెక్ట్రిక్ ఔట్లెట్ లూ , టెడ్డీ బేర్స్ , మనం ముఖం చూసుకునే నిలువెత్తు అద్దాలూ , ఇట్లా అనేక రకాలైన వస్తువులలో, మోసగాళ్లు  రహస్యం గా కెమెరాలు అమర్చ డం  జరుగుతుంది !
Image result for secret hidden cameras
ఒక స్క్రూ లో నూ , ఎయిర్ ఫ్రెషెనర్ లోనూ అమర్చిన రహస్య కెమెరా లను చూడవచ్చు పై చిత్రాలలో  ! 
ఈమధ్యే , ఒక అమెరికన్ యువతి , ఒక పెద్ద హోటల్ గ్రూప్ మీద ఆరువందల కోట్లకు దావా వేసింది ! ఆమె ఒక స్టార్ హోటల్ లో  నగ్నం గా ఉన్న వీడియో లను సీక్రెట్ గా చిత్రీకరించినందుకు !

ఈ రోజుల్లో , యువతులనూ , బాలికలనూ , సీక్రెట్ కెమెరాలు అమర్చి , వారి కదలికలనూ, బట్టలు వేసుకుంటున్న సమయం లోనూ , ఆడియో కానీ , వీడియో కానీ  రహస్యం గా రికార్డు చేయడం,తరచు గా వింటూ ఉన్నాం ! బాలికలూ , యువతులూ నివశించే వసతి గృహాల్లో కూడా ఇట్లాటి నేరాలు జరుగుతున్నాయి !

ముఖ్యం గా తలిదండ్రులు , ఈ విషయాలు తెలుసుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవడం, వారి పిల్లలను హెచ్చరించడం ఉత్తమం !

ఈ రహస్య ( సీక్రెట్ ) కెమెరాలను కనుక్కొని , వాటి  నుంచి తప్పించుకోవాలంటే ఈ క్రింది పద్ధతులు ఉపయోగ పడతాయి !

1. మీరు ప్రవేశించిన గది ని , ఒకసారి నిశితం గా పరిశీలించండి ! మీరు ఒక్కరే , గది లో ఉంటే , ఆ గది లో లైట్లు ఆఫ్ చేయండి. గదిలో ఉన్న కర్టెన్లు కానీ , కిటికీలు కానీ మూసి వేయండి ( వెలుగు రాకుండా ).
అప్పుడు , గదిలో అన్ని కోణాల్లో పరిశీలించండి , ఎరుపు లైటు కానీ ఆకు పచ్చ లైటు కానీ , ఎక్కడ నుంచైనా మినుకు మినుకు మంటుందేమోఅని.
2. మీ తో ఉన్న మీ మొబైల్ ఫోన్  , అత్యంత విలువైనది , ఈ సీక్రెట్ కెమెరా లు కనుక్కోడానికి !
మీ మొబైల్ ఫోన్ , లేదా సెల్ ఫోన్ ను రెండు రకాలు గా ఉపయోగించ వచ్చు !
A . మీరు ప్రవేశించిన గది లో మూల మూలలా తిరుగుతూ , మీ స్నేహితులకు కానీ , కుటుంబ సభ్యుల కు కానీ ఫోన్ చేయండి ! అప్పుడు , మీరు ఉన్న గది లో కానక సీక్రెట్ కెమెరా ఉంటే , మీ ఫోన్ లో సిగ్నల్ సరిగా అందదు  ( సీక్రెట్ కెమెరా ఉంటే , దానితోనూ , మీ సెల్ ఫోన్ తోనూ కలిగే  signal interference వల్ల )!
B. మీదగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఐఫోన్ కానీ ఉంటే , సీక్రెట్ కెమెరా లను డెటెక్ట్ చేసే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి . కనీసం ఒక వంద వరకూ ఇట్లాటి యాప్ లు ఉన్నాయి ! వాటిలో ఎక్కువ రేటింగ్ ఉన్న యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని , మీరు ప్రవేశించిన గది లో ఆన్ చేస్తే , అక్కడ సీక్రెట్ గా ఏర్పాటు చేసిన కెమెరా లను కనుక్కోవడం సులభం ! మీ ఫోన్ లో రెడ్ లైట్ ( ఎర్ర లైట్ ) ఫ్లాష్ అవుతుంది , కెమెరా ను కనుక్కున్నాక !
3.  professional hidden camera detector:  అధికారికం గా ఆమోదించ బడిన సీక్రెట్ కెమెరా డిటెక్టర్ లు మార్కెట్ లో అమ్ముతున్నారు . ఈ పరికరాన్ని కొని , మీరు ప్రవేశించిన గది లో ఆన్ చేస్తే , సీక్రెట్ కెమెరా లను వెంటనే పసి గడుతుంది !
4. మీరు ఉంటున్న గది లో మిర్రర్స్ అంటే  అద్దాలు కనుక ఏర్పాటు చేసి ఉంటే , ఆ అద్దాలు , బయటకు నార్మల్ గా మనం ముఖం చూసుకునే అద్దాల లానే కనబడతాయి కానీ , వాటి వెనుక కూడా సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి ఉండ వచ్చు !
మరి మీరు చూస్తున్న అద్దం అసలైనదో , లేదా సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసిన అద్దమో  ఈవిధం గా తెలుసుకోవచ్చు :
ఆ అద్దం  మీద మీ వేలు గోరు తో ( 90 డిగ్రీలలో ) టచ్ చేస్తే , మీ గోరు కూ, అద్దానికి మధ్య gap  కనుక ఉంటే , అది అసలైన అద్దం !
మీ వేటి గోరు కనుక , అట్లా కాకుండా , వేటి గోరు ప్రతిబింబాన్ని, డైరెక్ట్ గా , gap  లేకుండా  టచ్ చేస్తూ ఉంటే , ఆ అద్దం అసలైనది కాదని గ్రహించాలి !
5. మీదగ్గర టార్చ్ లైట్ ఉంటే , దాన్ని ఆన్ చేసి , మీరు ప్రవేశించిన గది లో అన్ని వైపులా ఫ్లాష్ చేస్తే , మినుకు మినుకు మంటున్న సీక్రెట్ కెమెరాల లైట్లు కనిపిస్తాయి !
మీ మొబైల్ (సెల్ ) ఫోన్ లో ఉన్న ఫ్లాష్ లైట్ తో కూడా ఇదే విధం గా , సీక్రెట్ కెమెరా లను కనుక్కోవచ్చు !
గమనిక : అత్యంత శక్తి వంతమైన , అత్యంత విలువైన సీక్రెట్ కెమెరాలు , ఒక ప్రత్యేకమైన సిగ్నల్స్ ను పంపిస్తాయి , వాటిని కనుక్కోవడం చాలా కష్టం ! కానీ , సామాన్యం గా , సీక్రెట్ కెమెరాలను అమర్చే మోసగాళ్లంతా , చవక రకం కెమెరాలు ఏర్పాటు చేస్తారు ! అందువల్ల , పైన చెప్పిన పద్ధతుల్లో వాటిని కనుక్కోవడం సాధ్యమే !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

నీటి గండం నిజమేనా ?4. నీటిలో ‘కనబడని ‘ ప్రమాదాలు !

In Our Health on మే 27, 2018 at 10:18 ఉద.

నీటి గండం నిజమేనా ?3. 

Related image

నీటిలో ‘కనబడని ‘ ప్రమాదాలు !
నీరు నిండిన కొలను కానీ , తటాకం కానీ, క్వారీ లో నిలువ ఉన్న నీరు కానీ , లేదా సముద్రపు నీరు ( బీచ్ ) కానీ , పైనుంచి చూడడానికి ఆహ్లాదకరం గా , ఆకర్షణీయం గా  కనబడుతుంది  అందరికీ !
చాలా మందికి , ముఖ్యం గా చిన్నారులకు , బడి కి వెళ్లే వయసు పిల్లలకూ , ఆ నీటి లో దిగి ఆడుకోవాలని అనిపిస్తుంది ! అంతేకాకుండా , చాలా మందికి , ఈదడం రాకపోయినా , ఆ నీటిలో దిగి ఈదాలని  కూడా అనిపిస్తుంది !
కానీ , ఆ నీటిలో పొంచి ఉన్న ప్రమాదాలను ఊహించకుండా , ఆ నీటిలో దిగడం , కేవలం ఆత్మ హత్యా ప్రయత్నమే అవుతుంది ! ఎందుకంటే :
1. ఆ నీటిలో అనుక్షణం కలిగే బలమైన ప్రవాహాలు, అలలూ  మన అంచనాకు అందవు ! ఆ ప్రవాహాల ప్రభావం మనకు కనబడక పోవడమే కాకుండా , ఒక సారి నీటి లో దిగాక , అతి బరువైన మనుషులను కూడా , ఒడ్డున ఉన్న వారిని కూడా , లోతైన లోపలి నీటిలోకి  విపరీతమైన శక్తి తో లాగి వేయ గలవు !
2. అతి శీతలమైన నీరు , ఒక్కసారిగా దేహానికి తాకి , మనలను షాక్ కు గురి చేయగలవు. ఆ పరిస్థితి లో మానవులు , ఏ ప్రయత్నమూ చేయలేక ఆ నీటిలో మునిగి పోయే ప్రమాదం ఉంటుంది !
3. నీటి ఒడ్డు  లోతు లేనట్టు అనిపించినప్పటికీ , ఆ ఒడ్డులో సాధారణంగా పెరిగే నాచు, ఇంకా  అక్కడ ఉండే బురదా , కాలు దించగానే సర్రున జార్చి ,  లోతైన ప్రాంతానికి  అంటే పదీ  , ఇరవై అడుగుల లోతుకు మనలను క్షణాలలో ముంచే ప్రమాదం ఉంది !
4. నిలువ ఉన్న నీటిలో ఎవరు ఎప్పుడు ఏరకమైన చెత్త పోస్తారో మనకు తెలియదు ! అంటే  విరిగిపోయిన గాజు సీసాలు , పెంకులు , వంకరలు తిరిగిన ఇనుప కమ్మీలూ , చెట్ల కొమ్మలూ , ఇవన్నీ కూడా నీటి అడుగున పడి  ఉన్నా , మనకు కనబడక , నీటి ఉపరితలం మాత్రం ప్రశాంతం గా , ఆకర్షణీయం గా కనిపిస్తుంది ! అట్లాటి  నీటిలో పడగానే , కొమ్మల మధ్య , ఇనుప చువ్వల మధ్య ఇరుక్కు పోయి , లేదా నీటి అడుగున ఉన్న ముళ్ళు, గాజు ముక్కలూ గుచ్చుకు పోయి , ఎంతో  బాగా ఈద గలిగిన గజ ఈతగాళ్లు కూడా , ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు !
5. ఈరోజుల్లో యువత  గ్రూపులు గా  నీటి కొలను దగ్గరకు  విహార యాత్రలకని బయలు దేరి , నీటి దగ్గరకు చేరుకోగానే , తమ వద్ద ఉన్న మద్యం సీసాలను తాగి ఖాళీ చేసి మరీ నీటిలో దిగుతున్నారు ! ప్రాణాలు కోల్పోతున్నారు కూడా ! నీటిలో పడితే , మద్యం ప్రభావం లేనప్పుడే , మన మెదడు షాక్ కు గురి అయ్యి , సరిగా పని చేయదు ! ఇక  మద్యం మత్తులో ఏ  మాత్రం పని చేయ గలదు !?
6. అంతే కాకుండా , నీటి తటాకాలలోని నీరు అత్యంత కలుషితమైనది !  ఆ నీటి చుట్టూ తిరిగే మనుషులు అన్ని రకాల మల మూత్ర విసర్జనలూ చేసే ప్రమాదం ఉంటుంది ! ఆ ప్రాంతాలలో తిరిగే ఎలుకలు , పందికొక్కులూ కూడా ! వాటితో కలుషితమైన నీరు నోట్లో పడగానే ,  గ్యాస్ట్రో ఎంటి రైటిస్ , అతి విరేచనాల వ్యాధులే కాకుండా , ప్రమాదకరమైన (Weil’s disease  లాంటి)వ్యాధులు సోకే ప్రమాదం కూడా !
 ఇంకొన్నివచ్చే టపాలో సంగతులు !
%d bloggers like this: