దాట వేసే, లేదా ఆందోళన మయ వ్యక్తిత్వం.1.
ఈ రకమైన వ్యక్తిత్వాన్ని యాంక్షియాస్ లేదా ఎవాయిడెంట్ పర్సనాలిటీ డిసార్డర్ అని అంటారు శాస్త్రీయం గా !
ఉదాహరణ చూడండి: సుమ కాలేజీ లో చదువుకుంటుంది. పేరుకు తగ్గట్టే పూవు లా ఉంటుంది. తల్లి దండ్రులు ఆమెకు ఏ లోపం చెయ్యట్లేదు.తండ్రి , చాలా కెరీర్ కాన్షస్ . క్రమ శిక్షణ రవంత ఎక్కువే అని చెప్పాలి , మిగతా తల్లి దండ్రులతో పోలిస్తే ! సహజం గానే , అందరు తల్లిదండ్రుల లాగా, తన కూతురు , చదువులో , మిగతా సాంస్కృతిక కార్యక్రమాలలో బాగా రాణించాలని ఆశిస్తూ ఉంటాడు. సుమ కష్ట పడి చదువుతుంది. కానీ తన క్లాసులో మొదటి పది మంది లో మాత్రమె ఉంటుంది. లెక్కలలో సరిగా చేయలేక పోతుంది. దానితో ఎక్కువ సమయం లేక్కలకే కేటాయిస్తుంది ,ఇంట్లో కూడా ! సుమ స్నేహితులను కూడా కూడా వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు. వారిలో చాలా మంది తన క్లాస్ మెట్సే ! క్రమేణా , వారితో కలవడమూ , మాట్లాడడమూ తగ్గించింది. కాలేజీ లో మిగతా క్లాస్ మేట్స్ , తనతో స్నేహ పూర్వకం గా దగ్గర అవుదామని , మాట్లాడదామని చాలా సార్లు ప్రయత్నిస్తున్నా , తను అందుకు తగినట్టు రెస్పాన్స్ ఇవ్వలేక పోతుంది. ప్రత్యేకించి తనకన్నా బాగా మార్కులు తెచ్చుకుంటున్న వారు సమీపం లో ఉన్నప్పుడు, తనలో ఏదో వెలితి , ఆత్మ న్యూనతా భావం తొలిచివేస్తుంది. చదువులో , మొదటి ముగ్గురిలో ఎందుకు లేనా? అని ప్రశ్నించు కుంటూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కువ సమయం పుస్తకాల మధ్య గడిపినా , ఏకాగ్రత , ఇదివరకు లా ఉండట్లేదు. తల్లి దండ్రులు , ఈ విషయం గమనించారు. ఈ లోగా కాలేజీ యానివర్సరీ వస్తూండడం తో , వివిధ పోటీలకు , ప్రాక్టీసులూ, రిహార్సల్సూ చేసుకుంటూ , కాలేజీ స్టూడెంట్స్ అందరూ కాలేజీ వాతావరణాన్ని , ఒక పండగ లాగా మార్చేశారు. సుమ చక్కగా పాడ గలదు. కానీ, రిహార్సల్సు కొన్ని అటెండ్ అబ్యింది , పాడుతున్నప్పుడు, కొందరు ఆకతాయిలు , ‘ వచ్చిందిరా శ్రేయా ఘోషాల్ ‘ అని గేలి చేశారు. దానితో తనకు, ఆందోళన ఎక్కువ అయింది. చేతులూ , కాళ్ళూ, చివరకు తన స్వరం కూడా వణకడం ప్రారంభమైంది. ‘ శ్రేయా ఘోషాల్ కూ తనకూ పోలిక ఎక్కడ ?’ అనుకుంటూ విచార పడ్డది. ఫలితం గా మిగతా రిహార్సల్స్ కు పోలేదు, స్నేహితులు బలవంతం చేసినా ! క్రమం గా తల్లిదండ్రులు, తమ బంధువులను విజిట్ చేసే సమయం లో కూడా , ఏదో ఒక వంక చెపుతూ , తానూ వెళ్ళడం మానుకుంది. కాలేజీ కి వెళుతున్నప్పుడు కూడా ఏదో తెలియని ఆందోళన,ఆత్రుతా , ఏర్పడుతున్నాయి .
ఈ యాంక్షియాస్ లేదా ఎవాయిడెంట్ పర్సనాలిటీ లక్షణాలు ఏమిటి :
పైన ఉదహరించినట్టు , ఈ రకమైన వ్యక్తిత్వం కల వారిలో , తీవ్రమైన ఆత్మ న్యూనతా భావం ఉంటుంది. వారు వారిని, వారి ప్రవర్తనను కానీ, లేదా వారి పర్ఫామెన్స్ కానీ, ఇట్లా ఏ విషయం, సందర్భం లో ఇతరులు ఏ వ్యాఖ్యానం అంటే , కామెంట్ చేసినా , వారు విపరీతం గా స్పందిస్తారు. అంతే కాక , వారి ప్రత్యేకతలూ , ప్రతిభా, వారి విజయాలూ , లెక్క చేయక, వారు ఇంకా, ఇతరుల అంచనాలకు సమంగా , విజయాలు సాధించ లేదని విచార పడుతూ ఉంటారు. బిడియము , సిగ్గూ కూడా వారి ఫీలింగ్స్ తో కలిసి , సామాజిక కార్యక్రమాలకు, హాజరు అవటం తగ్గిస్తూ ఉంటారు. క్రమేణా , నలుగురు కలిసే స్థలాలకు వెళ్ళ కుండా దాట వేయడం అలవాటు చేసుకుంటారు. ఒక వేళ వెళ్ళినా , ఆందోళనా , ఆత్రుతా పడుతూ , తీవ్రమైన అసౌకర్యాన్ని అనుభవిస్తూ, ఆ ప్రదేశాల నుంచి ఎంత త్వరగా వెళ్లి పోదామా అనుకుంటూ , ముభావం గా , విచారం గా ఉంటుంటారు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !