Our Health

Archive for జూన్ 24th, 2012|Daily archive page

స్థిత ప్రజ్ఞత కు, సప్త సూత్రాలు. 5.

In మానసికం, Our minds on జూన్ 24, 2012 at 10:28 ఉద.

స్థిత ప్రజ్ఞత కు సప్త సూత్రాలు.5.

సానుభూతి. ( ఎంపతీ లేదా empathy ) : 
స్థిత ప్రజ్ఞత అలవరుచు కావాలనుకునే వారికి ఉండవలసిన ఇంకో ముఖ్య లక్షణం – సానుభూతి. 
ఉత్తమ్ ఇంకా నవీన్  ఇద్దరూ ఇరుగు పొరుగు వారు. వారి కుటుంబాలతో  ఒక హౌసింగ్ కాంప్లెక్స్ లో ఉంటున్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు.
వారు బయట బస్ స్టాప్ లో కలుసుకున్నారు. వారిద్దరి మధ్యా జరిగిన ఈ సంభాషణ గమనించండి.
‘నవీన్ గారూ ,  నిన్న  ఆఫీస్ కు వెళ్ళ లేదా ? ఇక్కడ మీరు కనిపించలేదు’  ! 
‘ లేదండీ, మా  చిన్న బాబు సైకిల్ మీద నుంచి పడ్డాడు. హాస్పిటల్ కు తీసుకు వెళ్ళ వలసి వచ్చింది ‘ .
‘ అంతే నండీ నవీన్ గారూ , ఈ రోజుల్లో పిల్లలను ఏమీ అనటానికి వీలు లేదు,  జాగ్రత్త  గా ఉండమని ఎన్ని మార్లు చెప్పినా లెక్క చేయరు ‘.
‘ హాస్పిటల్ లో చాలా సేపు వెయిట్ చేయ వలసి వచ్చింది . ఎక్స్ రే  కూడా తీశారు’ 
‘ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్ళ లేదు కదా ! వెళితే మీ  గతి దేవుడికే ఎరుక ! ‘  నేను అందుకే ఎప్పుడూ  ఆ పొరపాటు చేయను ! 
‘ చేతి ఎముక ఒకటి చిట్లింది అన్నారు’ విచారం గా అన్నాడు నవీన్. 
‘ చాలా దూకుడు స్వభావం అయి ఉంటుంది. మీ వాడిది. నేను మా చిన్న వాళ్ళిద్దరినీ అసలు సైకిళ్ళు , రోలర్ స్కేట్లు, కొననివ్వను. ఝాయ్యి మని వేసుకుని పోతారు. పడి గాయాలు చేసుకుంటారు. ఇది ఉత్తమ్ గారి ‘   ఉత్తమ మైన  ‘ వ్యాఖ్య !  
‘ ప్లాస్టర్ వేశారు, చేయి కదల్చ లేక పోతున్నాడు. రాత్రి పూట కూడా అవస్థ పడుతున్నాడు. ‘ స్కూల్ కు వెళితే సరిగా రాయలేనని ఏడుస్తున్నాడు కూడా ! 
ఒక నాలుగో, ఆరో వారాలు ఉంచుతారనుకుంటాను ప్లాస్టర్.  అప్పటి దాకా మీకు ‘ అవస్థ  తప్పదేమో ! అదిగో నా బస్సు వస్తూంది.  వస్తాను నవీన్ గారూ ! అంటూ బస్సు కోసం పరిగెత్తాడు, ఉత్తమ్ ! 
ఇక్కడ  మనం విశ్లేషణ చేస్తే  రెండు మనస్తత్వాలు, అంటే ఇరువురు మానవుల స్వభావాలు, ఈ చిన్న  సంభాషణ లో  తెలుస్తున్నాయి. 
నవీన్:  ఒక స్వతంత్ర  మానవుడు.  కుటుంబ వ్యక్తి.  తన పిల్లలను చదివిస్తున్నాడు. వారిని మానసికం గానూ, భౌతికం గానూ పెరగనిస్తున్నాడు. ఎక్కువ ఆంక్షలు పెట్టట్లేదు ! చిన్న వాడికి సైకిల్ కావాలంటే కొనిచ్చాడు. ప్రమాద వశాత్తూ , క్రింద పడి గాయం చేసుకుంటే , తల్లడిల్లి పోయాడు. ఆఫీసు మానేసి , హాస్పిటల్ కు తీసుకువెళ్ళాడు. తగిన చికిత్స చేయించాడు. విచారం గా ఉన్నాడు , కొడుకు బాధ పడుతుంటే ! 
ఇక ఉత్తమ్ : ఒక స్వార్ధ మానవుడు. కుటుంబ వ్యక్తి. తన పిల్లలను చదివిస్తున్నాడు. వారిని తాను గీసిన లక్ష్మణ రేఖ దాట నివ్వడం లేదు.  వారిని వారి వయసులో తీసుకోవలసిన రిస్కులు తీసుకోనివ్వడం లేదు. వాటికి కారణాలను తనదైన రీతిలో వివరణ ఇచ్చుకుంటున్నాడు. ఇంకో ముఖ్యమైన లోపం. ఇతరుల మీదా , ఇతరుల సమస్యల మీదా , ఏమాత్రం సానుభూతి లేక పోవడం.  అంతే కాక , పుండు మీద కారం చల్లిన విధంగా ,  చిన్న పిల్ల వాడి చేయి విరిగింది అని చెప్పినా, ‘ కుంటి కూతలు కూస్తూ ‘ ‘ అసందర్భపు వ్యాఖ్యానాలు చేస్తూ,   స్వీయ అహంకార భావనను తెలియ చేస్తున్నాడు. (  అంటే ఇగో ).
సానుభూతి అంటే, తన భావావేశాలతో బాటు ఇతరుల భావావేశాలు అంటే ఎమోషన్స్ కూడా స్పష్టం గా , నిశితం గా గ్రహించి, తదనుగుణం గా ప్రవర్తించ గలిగే సామర్ధ్యం.  ఈ లక్షణం  స్థిత ప్రజ్ఞులలో ఎక్కువ గా ఉంటుంది. ఈ గుణం వల్ల రెండు ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి:  ఇతర మానవులతో సత్సంబంధాలు నెలకొల్పు కోవచ్చు. రెండు: అది మనకు సామాజిక సహాయం ఇస్తుంది. అంటే మనము క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా, మనకు మన పొరుగు వారినుంచి సహకారం, మనం వారికి ఇచ్చినట్టు గానే , మనకు లభిస్తుంది. 
మన ( ఆంధ్ర ) దేశం లో  నాయకులలో ఉండ వలసిన స్థిత ప్రజ్ఞాతా, సానుభూతులు , అనూహ్యం గా, అతి పేద ప్రజలలో ఎక్కువ గా ఉంటున్నాయి. అత్యంత సానుభూతి, ఆదరణ పొంద వలసిన పేద ప్రజానీకం, అత్యంత అవినీతి మయ మైన జీవితాలు గడుపుతూ, దేశాన్నీ , దేశ వనరులనూ, తర తరాలూ ,  పీల్చి  వేస్తూ , ఆవ గింజ అయినంతైనా కష్ట పడకుండానే స్వర్గ సౌఖ్యాలూ , భూలోకం లోనే  అనుభవిస్తూన్న  ‘ జలగల’  మీద, వారే సానుభూతి చూపుతున్నారు.  అందు వలననే, పేద ప్రజలలో ఉన్న ఈ గుణాలను  ‘ వోట్లు ‘ సొమ్ము ‘ చేసు కుంటున్నారు ( మన ) కుహానా నాయకులు.ఇది చాలా దురదృష్ట కర పరిస్థితి.
వచ్చే టపాలో మిగతా సంగతులు తెలుసుకుందాము ! 
 
 
 
%d bloggers like this: