Our Health

Archive for జూలై, 2012|Monthly archive page

ప్ర.జ.లు.4. రొమ్ము క్యాన్సర్ కు, మిగతా స్క్రీనింగ్ పద్ధతులు ఏమిటి ?:

In ప్ర.జ.లు., Our Health on జూలై 30, 2012 at 7:09 సా.

ప్ర.జ.లు.4. రొమ్ము క్యాన్సర్ కు,  మిగతా స్క్రీనింగ్ పద్ధతులు ఏమిటి ?: 

ప్రశ్న :  రొమ్ము క్యాన్సర్ కు,  మిగతా స్క్రీనింగ్ పద్ధతులు ఏమిటి ?:  

జవాబు; క్రితం టపాలో మనం స్తనాల స్వీయ పరీక్ష , రొమ్ము క్యాన్సర్ నివారణ లో ఎట్లా ఉపయోగ పడుతుందో తెలుసుకున్నాము కదా! ఇప్పుడు మిగతా స్క్రీనింగ్ పరీక్షలు ఏమిటో అవి కూడా తెలుసుకుందాము.
1. మామోగ్రాం : స్తనాల ఎక్స్ రే నే మామోగ్రాం అంటారు. అంటే కొద్ది మార్పులతో తీసే చాతీ ఎక్స్ రే నే ! కాక పొతే స్త్రీ స్తనాలను పరిశీలించడానికి ఉపయోగ పడే ఎక్స్ రే. ఈ మామోగ్రాం ఎంత ఉపయోగ పడుతుందో , అది తీసే రేడియాలజిస్ట్ సామర్ధ్యం బట్టీ, అంతే కాక పెరుగుతున్న ట్యూమర్ లేదా కంతి యొక్క పరిమాణం బట్టీ , స్తనాల పరిమాణం స్తనాలలో ఉండే కణ జాలం యొక్క సాంద్రత ను బట్టీ మారుతూ ఉంటుంది. ప్రత్యేకించి స్తనాలలో ఒక వేళ కంతి ఏర్పడితే , అది యాభై సంవత్సరాలకు పైబడ్డ వారిలో నే స్పష్టం గా కనిపిస్తుంది,  యాభయి ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారి కంటే. ఇట్లా ఎందుకు జరుగుతుందంటే ,  వయసు తక్కువ ఉన్న వారిలో ఎక్కువ స్తనం పరిమాణం అంటే స్తనాలలో , హార్మోనుల ప్రభావం ఎక్కువ గా ఉండి , కణ జాలం కూడా ఎక్కువ గా ఉంటుంది.ఈ స్తన కణ జాలం ఎక్స్ రే లో కంతి లాగానే తెల్ల గా కనపడుతుంది. దాని వల్ల , క్యాన్సర్  కంతి లేదా ట్యూమర్ కూ , సహజ స్తన కణ జాలానికీ తేడా తెలుసుకోవడం కష్టమవుతుంది. ( ఆ పరిస్థితులలో అవసరాన్ని బట్టి , మిగతా స్క్రీనింగ్ పరీక్షలు కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. ) 
2. MRI scan  లేదా ఎమ్మారై స్కాన్ : ఈ పరీక్ష మామోగ్రాం కన్నా సున్నితమైనది. అంటే , ఈ పరీక్షలో క్యాన్సర్ కనుక్కునే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కాక పొతే , ఈ పరీక్ష ఎక్కువ ఖర్చు తో కూడినది.  MRI కి పూర్తి నామం మ్యాగ్నేటిక్ రిసోనాన్స్ ఇమేజింగ్.అంటే  అయస్కాంత ప్రభావం  స్తనాల మీద చూపించడం. తరువాత ఆ అయస్కాంత తరంగాలను కంప్యూటర్ ద్వారా విశ్లేషించడం.  పెరుగుతున్న కంతులను ఒక  నిర్ణీత సమయం లో మళ్ళీ మళ్ళీ పరిశీలించడానికి కూడా ఈ  ఎమ్మారై స్కాన్ ఎంతో ఉపయోగకరం.ఎందుకంటే , మామోగ్రాం లాగా స్తనాల మీద ఎక్స్ రే ల ప్రభావం ఈ ఎమ్మారై స్కాన్ వల్ల ఉండదు కదా ! 
3. FNA, NA and DL : ఎఫ్ ఎన్ ఏ అంటే ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ , ఎన్ ఏ అంటే నీడిల్ యాస్పిరేషన్ : ఈ పద్ధతులలో స్తన కణజాలం లోకి ఒక సున్నితమైన సూది ని పంపి ఆ సూది ద్వారా స్తన కణ జాలాన్ని తీసి  దానిని పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో సహజ స్తన కణజాలం లో  క్యాన్సర్ ను కలిగించే మాలిగ్నంట్ కణ జాలం ఉంటే తెలుసుకోవచ్చు.  ఇక డీ ఎల్ , DL అంటే  డక్ టాల్ లావాజ్  అంటే స్తనాలలో ఉన్న పాలు స్రవించే సూక్ష్మ నాళికలు ఈ నాళికలలో ఉన్న కణ జాలాన్ని కూడా పరీక్ష చేసి అసహజ కణాలను అంటే క్యాన్సర్ కణాలను గుర్తించ డమన్న మాట !  
మరి ఈ స్క్రీనింగ్ టెస్ట్ ల పరిమితులు ఏమిటి ? :  ఏ స్క్రీనింగ్ పరీక్ష అయినా  మానవులే కదా చేసేది అందువల్ల , కొన్ని సమయాలలో  క్యాన్సర్ కణ జాలం ఉన్నా, పరీక్షలో కనబడక పోవచ్చు. అట్లాగే సహజ కణ జాలం కూడా కొన్ని సమయాలలో క్యాన్సర్ కణ జాలం గా కనిపించ వచ్చు. అంతే కాకుండా, తరచూ మామోగ్రాం లు చేయిస్తూ ఉంటే స్తనాల మీద రేడియేషన్ ప్రభావం ఎక్కువ అయి, అప్పుడు కొత్త సమస్యలు కూడా ఉత్పన్న మవవచ్చు. ఇంకా కేవలం క్యాన్సర్ ను కనుక్కున్నంత మాత్రాన మనం ఆ స్త్రీ యొక్క ఆయుష్షు పెంచలేక పోవచ్చు. ఇట్లా ఎందుకు జరుగుతుంటూ ఉంటుందంటే , అన్ని క్యాన్సర్లూ ఒకే వేగం తో పెరగవు. కొన్ని చాలా నిదానం గా పెరుగుతాయి. అప్పుడు చికిత్స కూడా శులభ మవుతుంది. కొన్ని చాలా వేగం గా పెరుగుతాయి. అప్పుడు చికిత్స జటిలం అవుతుంది.
క్రింద ఉన్న వీడియో లో మామోగ్రఫీ చేసే విధానం చక్కగా వివరింప బడ్డది. చూడండి. 
 
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు.! 

ప్ర.జ.లు.3. రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కు, స్తనాల స్వీయ పరీక్ష అంటే ఏమిటి?

In ప్ర.జ.లు., Our Health on జూలై 27, 2012 at 11:59 ఉద.

ప్ర.జ.లు.3.  

రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కు  స్తనాల స్వీయ పరీక్ష అంటే ఏమిటి? 
జ:  క్యాన్సర్ screening  లేదా స్క్రీనింగ్  అంటే క్యాన్సర్ లక్షణాలు పూర్తిగా బయట పడక ముందే  క్యాన్సర్ ను కనుక్కోవడం అన్న మాట. ఈ విధం గా  స్క్రీనింగ్ ద్వారా అత్యంత తోలి దశల లోనే క్యాన్సర్ ను కనుక్కొంటే , చికిత్స త్వరగానూ , చాలా సంతృప్తి కరం గా నూ చేయించు కోవచ్చు. అప్పుడు చికిత్స ఫలితం ఎక్కువ గా కనిపిస్తుంది కూడా !  రొమ్ము క్యాన్సర్ లో కూడా అదే విధం గా స్క్రీనింగ్ చేయించుకుంటే ఫలితాలు బాగా ఉంటాయి.
ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి వివరం గా తెలుసుకుందాము. సామాన్యం గా స్క్రీనింగ్ అంటే ఒక్క పరీక్ష కే పరిమితం కాదు. అనేక రకాల పరీక్షలు చేసి, క్యాన్సర్ ను తొలిదశలో గుర్తించడానికీ, లేదా కనుక్కోవడానికీ అవకాశాలు ఎక్కువ గా ఉంటాయి.
ఈ స్క్రీనింగ్ లో ముఖ్యమైన పధ్ధతి , రొమ్ము లేదా స్తనాల స్వీయ పరీక్ష. దీనినే BSE లేదా Breast Self Examination అంటారు.  రజస్వల అయిన తరువాత నుంచీ , ప్రతి స్త్రీ కూడా క్రమం గా  తమ స్తనాల స్వీయ పరీక్ష చేసుకుంటూ ఉంటే , స్తనాలలో వచ్చే ఏ మార్పులను అయినా తోలి దశ లోనే గుర్తించడానికి వీలు ఉంటుంది. ఈ స్వీయ స్తన పరీక్ష , అంటే ఎవరికీ వారు చేసుకునే ఈ స్తన పరీక్ష చాలా శులభ మైనదే కానీ, చాలా మంది స్త్రీలు, ఈ స్వీయ స్తన పరీక్షను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అంతే కాక , కొన్ని సమయాలలో తోలి దశలలో మార్పులు గుర్తించక , క్యాన్సర్ ముదిరిన తరువాత , తమ స్తనాలలో కంతి లేక ట్యూమర్ ఏర్పడడం కొంత కాలం మునుపే గుర్తించామనీ , కానీ దానంతట అదే తగ్గి పోతుందని అనుకున్నామనీ చెపుతూ ఉంటారు తమ వైద్యులకు. కానీ అప్పటికే , ఆ కంతి తోలి దశను దాటి పోయే ప్రమాదం ఉంది. అందు వల్ల నే , స్వీయ స్తన పరీక్ష అత్యంత ముఖ్యమైన  స్క్రీనింగ్ పరీక్ష. 
మరి ఈ స్వీయ స్తన పరీక్ష ఎట్లా చేసుకోవాలి ? :
స్త్రీ సందర్శకుల సౌకర్యార్ధం , స్వీయ స్తన పరీక్ష చేసుకునే పధ్ధతి , వివరం గా రెండు విధాలు గా పొందు పరచడం జరుగుతూంది ఇక్కడ. ఒకటి క్రింద ఉదాహరించిన వీడియో చూడడం.
రెండవది. స్వీయ స్తన పరీక్ష పధ్ధతి గురించిన వివరాలు ఒక పుస్తకం రూపం లో ఆన్ లైన్ లో చదివి అనుసరించడం లేదా అవకాశం ఉంటే ప్రింటు చేసుకోవడం లేదా ఫోను లో ఇంటికి టపా ద్వారా తెప్పించు కోవడం. ( టపా ద్వారా ఇంటికి తెప్పించుకోవడం కేవలం అమెరికా దేశం లో ఉన్న వారికే పరిమితం అనుకుంటాను ). అంతా ఉచితం గానే ! 
స్వీయ స్తన పరీక్ష వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://youtu.be/yw8Gx2LKWhA
 పైన చూపించిన పుస్తకం ఉచితం గా ఆన్ లైన్ లో చదువుకోవచ్చు లేదా  టపా ద్వారా తెప్పించుకో వచ్చు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు . 

ప్ర.జ.లు. 2.

In ప్ర.జ.లు., Our Health on జూలై 25, 2012 at 7:55 సా.

ప్ర.జ.లు. 2.

ప్రశ్న  : రొమ్ము క్యాన్సర్   నివారణకు రక్షణ  ఉపాయాలను అనుసరించడం, అంటే ప్రొ టేక్టివ్  చర్యలు ఎట్లా అధికం చేసుకోవచ్చు? :
 
జవాబు : 
1. వ్యాయామం లేదా ఎక్సర్సైజు : క్రమం తప్పకుండా , వారానికి కనీసం నాలుగు గంటలు తీవ్ర వ్యాయామం చేసే స్త్రీలలో హార్మోనులు తక్కువ అయి , తద్వారా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అవుతాయి అని పరిశోధనల వల్ల తెలిసింది. కాక పొతే , ఇక్కడ ఒక తిరకాసు ! ఈ వ్యాయామం చేయడం వల్ల వచ్చే లాభాలు , కేవలం ఉండ వలసిన బరువు కన్నా తక్కువ కానీ, ఉండ వలసిన బరువు ఉన్న వారు కానీ అయి ఉండాలి. అంతే కాక వారిలో ఋతుక్రమం జరుగుతూ ఉండాలి. ఆ స్త్రీలలోనే ఈ లాభాలు ఉంటాయి.
2.ఈస్త్రోజేన్: ఈ ఈస్త్రోజేన్ హార్మోను స్త్రీలందరికీ ముఖ్యమైన హార్మోను అయినప్పటికీ, స్త్రీలలో, ఎంత ఎక్కువ కాలం , ఈ ఈస్త్రోజేన్ హార్మోను వారిని ప్రభావితం చేస్తే , వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం అంత హెచ్చుతుంది. ఉదాహరణకు ,  గర్భవతులలోనూ, శిశువులకు , తమ స్తన్యం తో పాలు పట్టే స్త్రీలలోనూ , ఆలస్యం గా రజస్వల అయే స్త్రీలలోనూ , అట్లాగే త్వరగా ఋతుస్రావం ఆగి పోయే స్త్రీలలోనూ , ఈస్త్రోజేన్ హార్మోను వల్ల వారి స్తన్యాలు , తక్కువ సమయం ప్రభావితం అవుతాయి. అంటే ఈస్త్రోజేన్ యొక్క హానికర ( క్యాన్సర్ కారక ) ప్రభావాలు తక్కువ అవుతాయి. 
3. SERM  లు : ఇవి ఒక రకమైన మందులు. ఈ మందులు ఈస్త్రోజేన్ ను ఎక్కువగా స్తన్యం మీద ప్రభావం చూపకుండా  చేస్తాయి. టమాక్సి ఫెన్ ఇంకా రాలోక్సి ఫెన్ అనే మందులు ఈ రకానికి చెందుతాయి. కానీ దీర్ఘ కాలం ఈ మందులు తీసుకుంటే , రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది కానీ , ఇతర క్యాన్సర్ లు, సమస్యలూ , అంటే  గర్భాశయ క్యాన్సరూ , రక్తం త్వరగా గడ్డ కట్టడమూ , కంట్లో శుక్లాలూ , పక్షవాతం – ఇవి రావడానికి అవకాశం హెచ్చుతుంది. ఈ రకమైన సమస్యలు , ఈ మందులు తీసుకునే వారి వయసు యాభై కి పై బడిన కొద్దీ ఎక్కువ అవుతుంటాయి. 
4.యారో మాటేస్ ఇన్హి బిటర్ మందులు : ఈ మందులు ఈస్త్రోజేన్ తయారు చేసే ఒక ఎంజైము ను నివారిస్తాయి. దానితో ఈస్త్రోజేన్ దేహం లో ఎక్కువ గా ఉత్పత్తి అవదు. దానితో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కాక పొతే ఈ మందులు ఋతుక్రమం ఆగి పోయిన స్త్రీలలో వాడుతారు. వీటి వల్ల ఎముకలు బలహీన పడడమూ, మెదడు మునుపటి లాగా చురుకు గా లేక పోవడమూ జరగవచ్చు. 
5. ముందు గానే  అండా శ యాలనూ , స్తనాలనూ ఆపరేషన్ చేసి తీయించు కోవడం: ఇది అనువంశికం గా రొమ్ము క్యాన్సర్ ఉన్న కుటుంబాలలో పుట్టిన స్త్రీలకూ రికమెండ్ చేస్తారు. ఎందుకంటే , వీరి జన్యువులలో క్యాన్సర్ కలిగించే జన్యువులు ఎక్కువ శాతం ఉంటాయి. అందువల్ల ముందు గానే  వారి అండా శ యాలనూ అంటే వోవరీస్ నూ , స్తన్యాలనూ ఆపరేషన్ ద్వారా తీసి వేసి , వారిలో క్యాన్సర్ రాకుండా నివారించుతారు. ఈ లాభం ఉన్నప్పటికీ, వీరిలో డిప్రెషన్ , ఆందోళనా, వారి సౌందర్యం గురించి వారికి న్యూనతా భావం అధిక మవుతాయి.
6.ఫెన్ రేని టైడ్ : ఈ మందు కూడా రొమ్ము క్యాన్సర్ నివారణలో ఉపయోగ పడ గలదు అని తెలిసింది. నిపుణుల సలహాతో నే ఈ మందులను వాడాలి.
వచ్చే టపాలో ఇంకొన్ని  ప్ర.జ.లు. ! 

ప్ర.జ.లు.1.

In ప్ర.జ.లు., Our Health on జూలై 23, 2012 at 9:04 సా.

ప్ర.జ.లు.1.

 
1. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ? :
ముఖ్యం గా స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ నివారణకు రెండు రకాల రిస్కు ఫ్యాక్టర్ లు ఉన్నాయి.
మొదటి రకానికి చెందిన రిస్కు ఫ్యాక్టర్ లను దాట వేసి , రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను నివారించు కోవచ్చు.రెండవ రకానికి చెందిన రిస్కు ఫ్యాక్టర్ లను ఆచరించడం ద్వారా నివారణ అవకాశాలను ఎక్కువ చేసుకోవచ్చు. 
మొదటి రకం రిస్కు ఫాక్టర్ లు ఏమిటో తెలుసుకుందాము ( ఇవి సాధ్య మైనంత వరకు ఎవాయిడ్ చేయ గలిగిన రిస్కు ఫ్యాక్టర్ లు ) : 
1.ఈస్త్రోజేన్ ( ఎన్దోజినస్ ఈస్త్రోజేన్ ) : స్త్రీలలో ఈస్త్రోజేన్ అనే హార్మోను ఎంత ఎక్కువ కాలం వారిలో ఉంటే , అంత గా రిస్కు పెరుగుతుంది. దీనినే మనం ఇంకో విధం గా చెప్పుకోవచ్చు. అతి తక్కువ వయసు అంటే పదకొండు సంవత్సరాలకూ , అంతకు ముందూ , రజస్వల అయినవారిలో , బహిష్టు లేదా ఋతు క్రమం ఆలస్యం గా ఆగి పోయిన వారిలోనూ, ఇంకా , ముప్పయి అయిదు సంవత్సరాల వయసు దాటాక సంతానం కలిగిన వారిలోనూ , లేదా అసలు సంతానమే లేని స్త్రీలలోనూ , ఈ ఈస్త్రోజేన్ హార్మోను ప్రభావం, వారి స్థనాల మీద హాని కరంగా ఉంటుంది.
2. గర్భ నిరోధానికి వేసుకునే హార్మోను మందులు: ఈ మందులలో ప్రధానం గా ఈస్త్రోజేన్ హార్మోనూ , ప్రోజేస్తోజేన్ హార్మోనూ కలిపి ఉన్న మందులు వాడు తున్న వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం అధికం గా ఉన్నట్టు అనేక పరిశోధనల వల్ల వెల్లడి అయింది.
3.రేడియేషన్ కు అతిగా ప్రభావితం కాకుండా ఉండడం: చాతీ ఎక్స్ రే తీయించు కోవడం కూడా , స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను అధికం చేస్తుంది. ప్రత్యేకించి , స్త్రీలకు ఇరవై సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసులో కనక చాతీ ఎక్స్ రే తీయించుకుంటే !
4.ఒబీసిటీ లేదా ఊబ కాయం: అతి బరువు ఉండే స్త్రీలలో , ప్రత్యేకించి బహిష్టు ఆగి పోయి అంటే ఋతు క్రమం పూర్తిగా ఆగి పోయిన, ఇంకా హార్మోనులు వాడని స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం అధికం గా ఉన్నట్టు గుర్తించారు.
5. ఆల్కహాలు లేదా మద్యం సేవించడం: ఆల్కహాలు తాగే స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం , వారు తాగుతున్న ఆల్కహాలు పరిమాణం బట్టీ , వారు ఎంత కాలం నుంచి తీసుకుంటున్నారు అనే విషయం బట్టీ ఆధార పడి ఉంటుంది. అంటే, ఎక్కువ కాలం , ఎక్కువ మోతాదు లో కనుక స్త్రీలు మద్యం సేవిస్తూ ఉంటే , వారిలో రొమ్ము క్యాన్సర్ అధికం గా వస్తుందని విశదమైంది.
6.అనువంశికమైన రిస్కు: BRCA1 and BRCA2  అనే జీన్సు అనువంశికం గా  సంక్రమించి నట్టయితే , ఆ స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం హెచ్చుతుంది. అంతే కాక ఈ  జీన్సు లేదా జన్యువులు కనుక సంక్రమించితే , వారిలో రొమ్ము క్యాన్సర్  వారి వయసు తక్కువ గా ఉన్నప్పుడే వస్తుంది.
మిగతా జాగ్రత్తలు వచ్చే టపాలో ! 
( ప్ర.జ.లు .( ప్ర = ప్రశ్నలూ , జ= జవాబులూ ) అనే కొత్త శీర్షిక లో సాధారణమైన వైద్య సమస్యలకూ , సందేహాలకూ , సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. ‘బాగు ‘ ఉద్దేశం, చదువరులకు వైద్య విజ్ఞాన పరంగా ఎక్కువ అవగాహన కలిగించడానికే. వారికి చికిత్స చేయడానికి కాదు. చదువరులు వారి సమస్యలనూ , సందేహాలనూ  పంప వచ్చు. వీలు ను బట్టి సమాధానం ఇవ్వడం జరుగుతుంది.
బాగు.నెట్ లో 200 వందల టపాలు పూర్తిచేసుకున్న సందర్భంగా బాగు ను ఆదరిస్తున్న( ఇంత వరకూ 17,506 హిట్స్ ) సందర్శకులకు.కృతఙ్ఞతలు.)
 
 

క్యాన్సర్ నివారణ కు, మనం తీసుకోగల జాగ్రత్తలు ఏమిటి ? :

In Our Health on జూలై 22, 2012 at 11:46 ఉద.

 క్యాన్సర్ నివారణ కు  మనం తీసుకోగల జాగ్రత్తలు ఏమిటి ? :

క్రితం టపాలలో బ్యాక్తీరియాలూ, వైరస్ లూ , ఇంకా రసాయనాలూ , ఏ విధం గా మనలో క్యాన్సర్ కారకం అవవచ్చో , పటాల సహాయం తో తెలుసుకున్నాము కదా ! ఇవే కాక  రేడియేషన్ ప్రభావం వల్ల కూడా క్యాన్సర్ రావటానికి అవకాశం ఉంది. ఉదాహరణకు తెల్ల గా ఉన్న వారు, చర్మ సౌందర్యం కోసం ఎండ లో వారి చర్మాన్ని ఎక్స్పోజు చేయడం చేస్తుంటారు. ఈ సన్ బేదింగ్ వల్ల సూర్య రశ్మి లో ఉండే యు వీ రేస్ ( UV rays or Ultra Violet rays ) వీరి చర్మ కణాలలో మార్పులు తెచ్చి మేలనోమా అనే చర్మ క్యాన్సర్ కు కారణమవుతాయి. అట్లాగే  అతి గా ఎక్స్ రే లు తీయించుకున్నా క్యాన్సర్ రిస్కు హెచ్చుతుంది. మరి మనం ఈ విషయాలు అన్నీ తెలుసుకున్నాము కదా మనకు క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఏవైనా నివారణ చర్యలు వ్యక్తి గతం గా తీసుకో గలమా ? అని ప్రశ్నించుకుంటే కొన్ని సమాధానాలు దొరుకుతాయి. క్యాన్సర్ నివారణ లేదా ప్రివెన్షన్ అంటే క్యాన్సర్ మనకు వచ్చే అవకాశాన్ని వీలైనంతగా తగ్గించు కోవడమన్న మాట. ఈ టపాలో మనం తీసుకునే సాధారణ చర్యలు క్యాన్సర్ నివారణ లో ఎట్లా ఉపయోగ పడ గలవో చూద్దాము. క్యాన్సర్ నివారణలో మనం ముందుగా గుర్తుంచు కోవలసినది , క్యాన్సర్  వచ్చే అవకాశం తగ్గడానికీ , లేదా హెచ్చదానికీ , మన జన్యువులు  అంటే జీన్స్ , మన జీవన శైలి , ఇంకా మన పరిసరాల ప్రభావాల కలగలసిన పరిణామమే ! క్యాన్సర్ నివారణ మీద అనేక పరిశోధనలు చేసిన అనేక మంది శాస్త్రజ్ఞులు  ఈ ముఖ్య సూచనలు చేశారు.

1. క్యాన్సర్ కారక స్థితులను మనం సంపూర్ణం గా దాట వేయడమో అంటే ఎవాయిడ్ చేయడమో , లేదా  వీలైనంత వరకు ఆ పరిస్థితులను , మనలను ఎక్కువ గా ప్రభావితం చేయకుండా నియంత్రించు కోవడమో చేయడం.
2.మన ఆహార నియమాలలోనూ , మన జీవన శైలి లోనూ మార్పులు తెచ్చుకోవడం. అంటే ,changes in diet and lifestyle.
3.క్యాన్సర్ కారక స్థితులను, అంటే ప్రీ క్యాన్సరాస్ కండిషన్స్ ను వీలైనంత తోలి దశలలో గుర్తించడం, ఇంకా అవసరమైనప్పుడు ఈ క్యాన్సర్ కారక స్థితులు , క్యాన్సర్ గా మారకుండా , తగు చికిత్స తీసుకోవడం.
ఇక్కడ రెండు శాస్త్రీయ పదాలను మనం పునశ్చరణం చేసుకుందాము. కార్సినోజెనిసిస్ అంటే క్యాన్సర్ జననం లేదా క్యాన్సర్ మొదలవడం. మ్యుటేషన్ అంటే మన జీవ కణాల జన్యువులలో లేదా జీన్స్ లో వచ్చే ఆకస్మిక మార్పులు. 
మనలో క్యాన్సర్ రిస్కును ఏ ఏ  పరిస్థితులు ఎక్కువ చేస్తాయి? :
1.సిగరెట్ స్మోకింగ్ : ఇప్పటి వరకూ చేసిన పరిశోధనల ఫలితం గా సిగరెట్ స్మోకింగ్ , లంగ్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ , మూత్రాశయ క్యాన్సర్ అంటే బ్లాడర్ క్యాన్సర్, ఇంకా పాంక్రియాటిక్ క్యాన్సర్, ఇంకా AML అనబడే ఒక రకమైన రక్త క్యాన్సర్  – వీటన్నిటికీ ప్రధానకారణం గా గుర్తించారు. ( స్మోకింగ్ ఎట్లా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందో , ఆసక్తి ఉన్న వారు ఆ టపాలను మళ్ళీ చూడ వచ్చు , బాగు ఆర్కివ్స్ లో  )
2.ఇన్ఫెక్షన్: లివర్ క్యాన్సర్ కు కారణ మైన హెపటైటిస్ బీ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఒక టీకా మందు ను తయారు చేశారు. అట్లాగే సర్వికల్ క్యాన్సర్ కు కారణమైన పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ స్త్రీలలో సోకకుండా కూడా ఒక టీకా మందును తయారు చేశారు. ఇవి మానవులు, అంటే శాస్త్రజ్ఞులు ఈ రకమైన క్యాన్సర్ తగ్గించడం లో సాధించిన ప్ర్పగతి.! ( సర్వికల్ క్యాన్సర్ గురించి కూడా వివరం గా క్రిందటి టపాలలో వివరించడం జరిగింది , చదువరుల సౌకర్యం కోసం. ) అదే విధం గా జీర్ణాశయ క్యాన్సర్ కు కారణమైన హెలికో బ్యాక్తర్ పైలోరి అనే బ్యాక్తీరియం ఇన్ఫెక్షన్ ను కూడా ట్రిపుల్ థెరపీ తో రూపు మాపి క్యాన్సర్ రిస్కు ను తగ్గించు కోవచ్చు. 
3.రేడియేషన్ : శాస్త్రజ్ఞులు  కొన్ని రకాలైన థైరాయిడ్ క్యాన్సర్లూ , రొమ్ము క్యాన్సర్ , ఇంకా ల్యుకీమియా అనే ఒక రకమైన రక్త క్యాన్సర్ కు కూడా కారణ మవుతుందని కనుక్కున్నారు. ఈ క్యాన్సర్ లు వచ్చే అవకాశం , ఎక్కువ సార్లు , శక్తి వంతమైన రేడియేషన్  ప్రభావం శరీరాన్ని తాకినప్పుడు హెచ్చుతుంది. అందు వల్లనే, అత్యవసరం అయినప్పుడే ఎక్స్ రే పరీక్షలు జరిపించుకోవాలి 
4. రోగ నిరోధక శక్తి తగ్గించే మందులు : ఈ మందులు కొన్ని సందర్భాలలో అనివార్యం అవుతాయి. ఉదాహరణకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్న వారికి. వీటి వల్ల వారిలో రోగ నిరోధక శక్తి తగ్గి , క్యాన్సర్ కారకమవుతాయి.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 
 

క్యాన్సర్ కారకాలు. 5. కెమికల్స్ , ఏ విధం గా క్యాన్సర్ కలిగిస్తాయి?:

In Our Health on జూలై 21, 2012 at 12:35 సా.

క్యాన్సర్ కారకాలు. 5. కెమికల్స్  క్యాన్సర్ ఏ విధం గా కలిగిస్తాయి?:

మరి ఏ ఏ రసాయన పదార్ధాలు , ప్రధానం గా మానవులలో క్యాన్సర్ కారకాలు అవుతాయి ? : 
వీటి వివరాలు క్రింది చిత్రం లో చూడండి. 

మనం క్రితం టపాలలో , బ్యాక్తీరియాలూ , వైరస్ లూ మానవులలో ఎట్లా క్యాన్సర్ కలిగించ గలవో తెలుసుకున్నాము కదా! ఇపుడు వివిధ  ( విష పూరిత ) రసాయన పదార్ధాలు , మన జీవ కణాలను ఏ విధం గా ప్రభావితం చేయ గలవో తెలుసుకుందాము. సామాన్యం గా మన కందరికీ, మనం నిత్య జీవితం లో తెలిసో, తెలియకో , వివిధ రసాయన పదార్ధాలు మన దేహం లో ప్రవేశిస్తూ ఉంటాయి. వాటి గురించి  ‘ చాలా కెమికల్స్ ఉన్నాయి , మన దేహానికీ , ఆరోగ్యానికీ మంచిది కాదు ‘ అని మాత్రమే అనుకుంటాము కానీ ఆ రసాయన పదార్ధాలు , లేదా కెమికల్స్ ఖచ్చితం గా ఎట్లా మనకు హాని కలిగిస్తాయో, ఆ అవగాహన కొంత మందికి మాత్రమె ఉంటుంది. ఆ విషయాలు, ఆసక్తి ఉన్న వారు ఎవరైనా తెలుసుకోవచ్చు. అది బ్రహ్మ విద్య ఏమీ కాదు. ఆ వివరాలు చూద్దాము.
పైన ఉన్న చిత్రం గమనించండి. కెమికల్స్  జీవ కణాలను రెండు దశలు గా ముట్టడి చేసి, వాటిలో మార్పులు తెచ్చి , ఆ సహజ మైన జీవ కణాలను ట్యూమర్ కణాలు గా మారుస్తాయి. ట్యూమర్  మొదలయ్యే దశ , ట్యూమర్ పెరిగే దశ, వీటినే ట్యూమర్ ఇనిషి ఏషన్ దశ , ఇంకా ట్యూమర్ ప్రొమోషన్ దశ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండు దశలూ, పైన ఉన్న చిత్రం లో వివరింప బడ్డాయి.
ట్యూమర్ ఇనిషి ఏషన్ దశలో , బెంజ్ పైరీన్ అనే విష పూరిత రసాయనం , లోహం అయానుల తో కలిసి,
( ఉదాహరణకు నికెల్ అనే లోహ అయానులు ) జీవకణాలలో జన్యు పదార్ధ జీన్స్ , ప్రత్యేకించి క్యాన్సర్ జీన్స్ అయిన P53 and RAS  జీన్స్  లో మ్యుటేషన్ అంటే సమూలమైన మార్పులు తెస్తాయి. ఈ మార్పులు చెందిన జీన్స్ అంటే జన్యువులు, క్యాన్సర్ కణాలనే ఉత్పత్తి చేస్తూ పోతాయి, సహజ కణాలు కాకుండా !  దానితో క్యాన్సర్ మొదలవుతుంది.
ట్యూమర్ ప్రొమోషన్ దశలో  కొన్ని విష రసాయన పదార్ధాలు ఉదాహరణకు  డయాక్సిన్ లు ఇంకా బెంజ్ పైరీన్ లు ( వీటి గురించి మనం,  మీ ఆసక్తి ని బట్టి ! , ముందు ముందు తెలుసుకుందాము ) AhR అనే రిసెప్టార్ తో కలిసి, కనీసం నాలుగు అయిదు రకాలు గా జన్యు పదార్ధం లో మార్పులు తెస్తాయి. దానితో , క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవడానికి , సహజ జీవ కణాలు ప్రోగ్రాము  అవబడతాయి. 
ప్రాధమికం గా, ఏ రసాయనం అయినా క్యాన్సర్ పైన వివరించిన  విధం గా సహజ మైన జీవ కణం లోని జన్యువు లలో మార్ప్లు తెచ్చి , అసహజ క్యాన్సర్ కణాలు ఉత్పత్తి చేసే విధం గా జన్యువుల సాఫ్ట్ వేర్ ను ప్రోగ్రాం చేస్తాయన్న మాట ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాం ! 

క్యాన్సర్ కారక స్థితులు. 4. వైరస్ లతో క్యాన్సర్ వస్తుందా ? :

In Our Health on జూలై 20, 2012 at 6:25 సా.

క్యాన్సర్ కారక స్థితులు. 4. వైరస్ లతో క్యాన్సర్ వస్తుందా ? : 

 

మనం క్రితం టపాలలో మానవులలో క్యాన్సరు కు కారణ భూతమైన బ్యాక్టీరియాలను గురించి తెలుసుకున్నాము. మరి  వైరస్ లతో క్యాన్సర్ రిస్క్ ఎట్లా వస్తుందో తెలుసుకుందాము.
వైరస్ నిర్మాణం మొట్ట మొదటి సారిగా 1892 లో రష్యన్ శాస్త్రజ్ఞుడు ఇవానోవ్స్కీ  కనుక్కున్నాడు.తరువాత బైజరింక్ అనే శాస్త్రజ్ఞుడు టొబాకో మొజాయిక్ వైరస్ నిర్మాణాన్ని ప్ర ప్రధమం గా ప్రపంచానికి తెలియ చేశాడు ( 1898 ). మనకు సర్వ సాధారణం గా వచ్చే జలుబు  ఫ్లూ వైరస్ వల్ల వస్తుంది. దీనినే ఇన్ఫ్లూ ఎంజా  వైరస్ అంటారు. వైరస్ లు లేని చోటంటూ లేదు. పైన ఉన్న చిత్రం చూడండి, ఒక సాధారణ ఫ్లూ వైరస్ యొక్క నిర్మాణం తెలుసుకోవడం కోసం. 
కేవలం సాధారణ ఇన్ఫెక్షన్ లే కాకుండా , వైరస్ లు కూడా క్యాన్సర్ కలిగిస్తాయని మీకు తెలుసా?  వైరస్ నిర్మాణం లో ఆర్ ఎన్ ఏ వైరస్ లూ , డీ ఎన్ ఏ వైరస్ లూ అని రెండు రకాలు ఉన్నాయి. వీటినే DNA tumour virus, RNA tumour virus లు అని కూడా అంటారు.
DNA ట్యూమర్ వైరస్ లు : 
పాపిలోమా వైరస్ లు : వీటిలో ఒక వంద రకాలు ఉన్నాయి.కానీ అన్నీ క్యాన్సర్ ను కలిగించవు. కానీ అన్ని క్యాన్సర్ లలో పది శాతం ఈ పాపిలొమా వైరస్ లు కలిగిస్తాయి.HPV కలిగించే సర్వికల్ క్యాన్సర్ గురించి వివరం గా ఇంత కు ముందు టపాలలో రాయడం జరిగింది. ఆసక్తి ఉన్న వారు ఆ టపాలు చూడ వచ్చు. 
పాలియోమా వైరస్ : ఈ వైరస్ లు మానవులలో పోలియో కు కారణమవుతాయి. ఇటీవల పరిశోధనల ఫలితాల వల్ల పాలియోమా వైరస్ BK అనే రకానికి చెందినది, మానవులలో ప్రోస్టేట్ క్యాన్సర్ కు కారణ మవుతుందని కూడా తెలిసింది. అంతే కాక కొన్ని రకాలైన పోలియో వైరస్ లు ఒక అరుదైన చర్మ క్యాన్సర్ ను కూడా కలిగిస్తాయని పరిశోధనల వల్ల తెలిసింది.
హెర్పిస్ వైరస్: EBV ( Epstein Barr Vairas )  ఈ వైరస్  హెర్పిస్ DNA వైరస్ రకానికి చెందినది. ఈ వైరస్ మానవులలో బర్కిట్ లింఫోమా అనే  లింఫ్ గ్రంధుల క్యాన్సర్ కలిగిస్తుంది. ఈ క్యాన్సర్ ఆఫ్రికా లోని అతి పేద దేశాలలో ఎక్కువ గా కనిపిస్తుంది. ఈ ప్రాంత ప్రజలలో మలేరియా కూడా ఎక్కువ గా ఉండడం శాస్త్రజ్ఞులు గమనించారు. అందువల్ల మొదట మలేరియా వచ్చి, రోగ నిరోధక శక్తి చాలా తగ్గి పోయిన వారికి ఈ EBV వైరస్ సోకి వారిలో లింఫ్ గ్రంధుల క్యాన్సర్ కు కారణమవుతుందని భావించడం జరుగుతుంది. కపోసీస్ సార్కోమా అనే కండరాల క్యాన్సర్ కూడా ఈ హెర్పిస్ రకానికి చెందిన వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల నే వస్తుంది.
అంతే కాక లివర్ లేక కాలేయ క్యాన్సర్ కు కారణమైన హెపటైటిస్ బీ , హెపటైటిస్ సి రకాలకు చెందిన వైరస్ లు కూడా  DNA వైరస్ లే ! 
RNA ట్యూమర్ వైరస్ లు :వీటిని రిట్రో వైరస్ లు అని కూడా అంటారు.  ఈ తరగతిలో ముఖ్యమైనది HTLV1 అనే వైరస్. ఈ వైరస్ లింఫ్ గ్రంధుల క్యాన్సర్ కలిగిస్తుంది. 
పైన ఉన్న చిత్రం చూడండి. రిట్రో వైరస్ అందం గా కనిపిస్తుంది కదూ !  అందం గా కనిపించే వైరస్ లు మానవులకు ప్రమాద కరమైనవి కూడా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !  

క్యాన్సర్ కారక స్థితులు.3. బ్యాక్టీరియాలు కలిగించే మిగతా క్యాన్సర్లు.

In Our Health on జూలై 18, 2012 at 7:39 సా.

క్యాన్సర్ కారక స్థితులు.3. బ్యాక్టీరియాలు కలిగించే మిగతా క్యాన్సర్లు. 

( reproduced from Young et al. courtesy: Macmillan publishers  Ltd.) 

క్రితం టపాలో , హెలికో బాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియం, జీర్ణాశయం లో అల్సర్ లు ఏర్పడడానికీ, జీర్ణాశయం లో క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్ ఏర్పడడం లో ప్రధాన పాత్ర ఎట్లా వహిస్తుందో తెలుసుకున్నాము కదా !  కేవలం హెలికో బాక్టర్ పైలోరి నే కాకుండా , మిగతా బ్యాక్టీరియాలు కొన్ని కూడా మానవులలో క్యాన్సర్ రావడానికి కారణమవుతాయి.
సాల్మొనెల్లా టైఫి ( పిత్తాశయ క్యాన్సర్ కలిగింస్తుంది ) : ( పైన ఉన్న చిత్రం చూడండి . పైన ఉన్న చిత్రం లో మొదట సాల్మొనెల్లా టైఫి మ్యూరియం అనే బ్యాక్తీరియం ప్రేగు గోడల ( కణాల ) లోకి చొచ్చుకు పోవడం, తరువాత బీ కణాలు, టీ కణాల ద్వారా లింఫ్  గ్రంధి లోకి వెళ్ళడం చూప బడింది.  అదే చిత్రం లో కుడి వైపున సాల్మొనెల్లా టైఫి అనే ( ఇది కూడా టైఫాయిడ్ కారక ) బ్యాక్టీరియం కూడా ప్రేగు కణాల గోడల లోకి చొచ్చుకు వెళుతుంది.తరువాత బీ కణాల లోకీ , టీ కణాల లోకీ వెళుతుంది. అక్కడ నుంచి ఎముకల మూలుగ అంటే బోన్ మారో లోకీ, ప్లీహం లోకీ అంటే స్ప్లీన్  లోకీ వెళ్లి పైత్యాశయం లేదా గాల్ బ్లాడర్ ను చేరుకుంటుంది. అక్కడ ఈ బ్యాక్టీరియాలు వృద్ధి అయి , నిలువ ఉండి, గాల్ బ్లాడర్ లేదా పిత్తాశయ క్యాన్సర్ కు కారణమవుతుంది.  ) ఈ బ్యాక్టీరియం సాధారణం గా మానవులలో టైఫాయిడ్ కలిగిస్తుంది. టైఫాయిడ్ జ్వరం కొందరిలో సరిగా మానక , ( దీనికి కారణం యాంటీ బయాటిక్ లు క్రమం గా తీసుకోక పోవడం వల్ల కానీ , లేదా కొన్ని పరిస్థితులలో చికిత్స సంపూర్ణం గా తీసుకున్నా , కొందరు క్రానిక్ క్యారియర్ స్థితి కి చేరుకుంటారు. అంటే వారు కొన్ని సంవత్సరాల తరబడి , వారి మలం లో టైఫాయిడ్ బ్యాక్టీరియాలను విసర్జించుతూ ఉంటారు. అంటే వారు టైఫాయిడ్ జ్వర లక్షణాలు ఏవీ కనబరచక పోయినా , టైఫాయిడ్ బ్యాక్టీరియాలు మాత్రం వారిలో కొంత నిర్ణీత సంఖ్య లో ఉత్పత్తి అవుతూ ఉండి, వారి మల మూత్రాదుల ద్వారా బయటకు వచ్చి , ఆరోగ్య వంతులైన మిగతా వారిని , ముట్టడి చేసి , వారిలో టైఫాయిడ్ లక్షణాలనూ , టైఫాయిడ్ నూ కలిగించ గలవు. అంతే కాకుండా , ఈ సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియాలు, గాల్ బ్లాడర్ లో అంటే, మన దేహం లో పైత్య రసాలు నిలువ చేసే ఒక సంచి లేదా తిత్తి , ఈ భాగం లో దాక్కుంటాయి. ఇట్లా సంవత్సరాల తరబడి పైత్యాశయం లేదా పిత్తాశయం లో దాక్కున్న సాల్మొనెల్లా టైఫి బ్యాక్టీరియాలు, ఆ పిత్తాశయం లోనే క్యాన్సర్ కలిగిస్తాయని పరిశోధనల వల్ల తెలిసింది.
స్త్రెప్తో కాకస్ బోవి  (పెద్ద ప్రేగు క్యాన్సర్ కలిగిస్తుంది ) : ఈ బ్యాక్టీరియం స్త్రెప్తో కొకై అనే రకానికి చెందిన బ్యాక్టీరియం. సామాన్యం గా మానవుల పెద్ద ప్రేగు లో ఉంటుంది. కానీ ఈ బ్యాక్టీరియం కూడా పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చిన వారిలో నలభై నుంచి అరవై  శాతం మందిలో  క్యాన్సర్ కారకం అని నిర్ణయించారు, వివిధ పరిశీలనలలో.  ఈ స్త్రెప్తో కాకస్ బోవి అనే బ్యాక్టీరియం మహా చెడ్డది !  దీని ఇన్ఫెక్షన్ సామాన్యం గా  గుండె లోపలి గోడల లోనూ , ఇంకా గుండె కవాటాలనూ పాడు చేస్తుంది.ఇట్లా గుండె ఇన్ఫెక్షన్ సోకిన చాలా సంవత్సరాల తరువాత , పెద్ద ప్రేగులో క్యాన్సర్ కలిగించడం కూడా గమనించారు. 
క్లామీడియా న్యుమోనియే (ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా లంగ్ క్యాన్సర్ కు కారణమవుతుంది )  : ఇది ఇంకో గ్రామ్ నెగెటివ్ బ్యాసిల్లస్ బ్యాక్టీరియం. అమెరికాలో ఈ బ్యాక్టీరియం కనీసం యాభై శాతం మందిలో, వారి జీవిత కాలం లో ఎప్పుడో ఒక సారి న్యుమోనియా ఇన్ఫెక్షన్ అంటే ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ సామాన్యం గా ఫ్లూ లాగా ఉండి కొన్ని రోజులలో తగ్గి పోతుంది. కానీ  కొందరిలో  క్రానిక్ ఇన్ఫెక్షన్ అంటే దీర్ఘ కాలికం గా ఈ బ్యాక్టీరియాలు వారి ఊపిరి తిత్తులలో ఉండి , ఒక రకమైన ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తాయి. దీనిని క్లామీడియాల్ హీట్ షాక్ ప్రోటీన్ 60 అంటారు. ఈ ప్రోటీన్  అత్యంత రోగనిరోధక శక్తి ని మానవులలో కలిగిస్తుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్ దీర్ఘ కాలికం గా ఉండి, దాని పరిణామాలు దీర్ఘ కాలిక వ్యాధి రూపం లో కనిపిస్తూ ఉంటుంది. ఒక సారి ఈ బ్యాక్టీరియా కలిగించిన దీర్ఘ కాలిక ఇన్ఫెక్షన్ వల్ల  లంగ్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు హెచ్చుతాయి. 
ఈ బ్యాక్టీరియాలు ఏ విధం గా క్యాన్సర్ కలిగిస్తాయి? : 
బ్యాక్టీరియాలు అన్నీ కొన్ని విష పదార్ధాలను విడుదల చేస్తాయి. వీటిని బ్యాక్టీరియల్ టాక్సిన్ లు అంటారు. ఈ టాక్సిన్ లు మన దేహం లోని జీవ కణాలలో ఉన్న డీ ఎన్ ఏ  అంటే జన్యు పదార్ధాన్ని ముట్టడి చేస్తాయి. అంతే కాక  ఆ సహజమైన ఆరోగ్యమైన జన్యు పదార్ధాన్ని శాశ్వతం గా , అసహజం గా  మార్చి వేస్తాయి. దానితో ఆ అసహజమైన జన్యు పదార్ధం ఉన్న జీవ కణాలు ఒక నియంత్రణ ఏమీ లేకుండా కణ విభజన జరిపి , లక్షలూ , కోట్ల సంఖ్య లో అసహజమైన క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేస్తాయి, ఆ అసహజ , క్యాన్సర్ కణాల సముదాయమే కంతి లేక ట్యూమర్ అని అంటాము. 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

క్యాన్సర్ కారక స్థితులు. 2. బ్యాక్టీరియా లు క్యాన్సర్ కలిగిస్తాయా ?

In Our Health on జూలై 17, 2012 at 10:27 సా.

 క్యాన్సర్ కారక స్థితులు. 2. బ్యాక్టీరియా లు క్యాన్సర్ కలిగిస్తాయా ?:

క్రితం టపాలో మనం ఒక సామాన్య జీవ కణం, జన్యువు లో మార్పు వల్ల క్యాన్సర్ కణం గా పరివర్తనం చెందుతుందో తెలుసుకున్నాము కదా ! 
మరి ఇట్లా జన్యువుల లో పరివర్తన తేవడానికి , బ్యాక్తీరియాలూ, వైరస్ లూ , వివిధ రసాయన పదార్ధాలూ కారణ మవుతాయి.  మన కు అంటే మానవులకు కలిగే కొన్ని  క్యాన్సర్ లలో ఈ బ్యాక్టీరియా లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కడుపు లో క్యాన్సర్ కు ఈ బ్యాక్టీరియా లు ఎట్లా కారణం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వివరాలు తెలుసుకుంటే మనం స్టమక్ క్యాన్సర్ లేదా జీర్ణాశయ క్యాన్సర్ నివారణకు ఏమి చేయ వచ్చో కూడా విశద  పడుతుంది. 
జీర్ణాశయ క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్ ఎట్లా వస్తుంది?: 
జీర్ణాశయ క్యాన్సర్  దక్షిణ భారత దేశం లో ఎక్కువ గా వస్తున్నట్టు పరిశోధనల వల్ల తెలిసింది  ముఖ్యం గా మన ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కారకం అవుతాయి.ఇక్కడ వివిధ పరిశీలనల లో శాస్త్రీయం గా తెలుసుకున్న ఫలితాలు చూద్దాము. బొంబాయి లో జరిపిన ఒక పరిశీలనలో ఎండ బెట్టిన చేపల తో చేసిన వంటకాలు తింటున్న వారిలో స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని తెలిసింది. కానీ టీ అంటే తేయాకు, ప్రత్యేకించి పాలు కలుపుకోకుండా తాగే టీ – తాగుతున్న వారిలో స్టమక్ క్యాన్సర్ తక్కువ గా వస్తున్నట్టు తెలిసింది. త్రివేండ్రం లో చేసిన ఇంకో పరిశీలనలో , ఎక్కువ  అన్నం అంటే రైస్ తినే వారిలో , ఎక్కువ వేడిగా ఉన్న ఆహారాలు తినే వారిలో , ఎక్కువ స్పైసీ ఫుడ్ తినే వారిలో, ఎక్కువ కారం తినే వారిలో , స్టమక్ క్యాన్సర్ ఎక్కువ గా వస్తున్నట్టు తెలిసింది.
( Sinha et al : Cancer risk and Diet in India )  ఫ్రైడ్ ఫుడ్ అంటే వేపుడు కూరలు, అవి కూరగాయలతో కానీ మాంసం తో చేసిన కూరలు కానీ , వేపుడు కూరలు ఎక్కువ గా తింటున్న వారిలో కూడా స్టమక్ క్యాన్సర్  ఎక్కువ గా వస్తున్నట్టు గమనించారు.
మరి వేపుడు కూరలు ఎందుకు మనకు హానికరం?  : క్యాన్సర్ కారకాలైన హెటిరో సైక్లిక్ అమీన్ లు మన ఆహారాన్ని ఎంత వేయిస్తూ ఉంటే అంత ఎక్కువ గా తయారవుతూ ఉంటాయి. ఇంకో విధం గా చెప్పాలంటే , వేపుడు కూరలలో , క్యాన్సర్ కారక విష పదార్ధాలు  ఎక్కువ గా ఉంటాయి. ఈ విష పదార్ధాలు జీర్ణాశయ గోడలలో ఉండే కణజాలం లో , ఇంకా ఖచ్చితం గా చెప్పుకోవాలంటే కణాలలోని జన్యు పదార్ధం లో అంటే జీన్స్ నిర్మాణం లో పరివర్తన తీసుకువచ్చి ఆ సహజ కణాలను అసహజమైన క్యాన్సర్ కణాలు గా  మారుస్తాయి.ఒకసారి క్యాన్సర్ కణాలు ఈ విధం గా ఏర్పడ్డ తరువాత , తమ లాంటి క్యాన్సర్ కణాలనే  అధిక సంఖ్య  లో  ఉత్పత్తి చేసి క్యాన్సర్ కు కారణమవుతాయి.  
స్టమక్ క్యాన్సర్ బ్యాక్టీరియా వల్ల వస్తుందా ? : ఒకటి రెండు దశాబ్దాల క్రితం వరకూ , స్టమక్ అల్సర్ లు కేవలం, కడుపులో ఉండే ఆమ్లాలు ఎక్కువ గా ఉత్పత్తి అయి ఆ ఆమ్లాలు లేదా యాసిడ్ లు కడుపు అంటే జీర్ణాశయ గోడలను తిని వేయడం వల్ల  స్టమక్ అల్సర్ లు ఏర్పడతాయి అని భావించ బడుతూ ఉండేది. అందుకే అల్సర్ ఉన్న చాలా మందికి ఆపరేషన్ చేసి ,యాసిడ్ ఎక్కువ గా ఉత్పత్తి చేస్తున్న వేగస్ నాడి ని కత్తిరించే వారు. క్రమేణా , స్టమక్ అల్సర్ ఏర్పడడానికి ప్రధాన కారణం హెలికో బాక్టర్ పైలోరి అనే బ్యాక్త్రీరియం కారణమని ఒక ఆస్త్రేలియన్ వైద్యుడు కనుక్కొన్నాడు. ఆ తరువాత ఈ బ్యాక్తీరియాన్ని హతమార్చడానికి  ట్రిపుల్ తిరపీ అనే మూడు రకాల యాంటీ బయాటిక్స్ ఒక వారం వాడి ఈ బ్యాక్టీరియాలను మన దేహం నుంచి సమూలం గా  నిర్మూలించి తద్వారా అల్సర్ ను కూడా  నయం చేస్తున్నారు వైద్యులు. తరువాత చేసిన, చేస్తున్న పరిశోధన లలో  ఈ హెలికో బ్యాక్తర్ పైలోరి అనే బ్యాక్తీరియం మనకు చేస్తున్న హాని ఇంతా అంతా కాదని తెలిసింది. ప్రత్యేకించి , స్టమక్ క్యాన్సర్ రావడానికి కూడా ఈ బ్యాక్టీరియం ‘ కుట్ర ‘ పన్నుతూ ఉంటుంది.
 మరి ఈ హెలికో బ్యాక్టార్ పైలోరి క్యాన్సర్ ఎట్లా కలిగిస్తుంది?: ఈ బ్యాక్టీరియాల వల్ల జీర్ణాశయ గోడలలో ఉన్న కణాలలో మార్పులు, ప్రత్యేకించి ఆ కణాల జన్యువులలో మార్పులు తీసుకు వచ్చి వాటిని క్యాన్సర్ కణాలు గా మారుస్తాయి. మనం మన వంటలలో ఉపయోగించే పసుపు కొంత వరకు మనకు స్టమక్ క్యాన్సర్ రాకుండా రక్షకం గా పనిచేస్తుంది. పసుపులో హెలికో బ్యాక్టార్ పైలోరి ను హరించే గుణం ఉందని తెలిసింది. 
జీర్ణాశయ క్యాన్సర్  వచ్చే రిస్కు ను మనం ఏవిదం గా తగ్గించుకోవచ్చు ?: 
మనం తినే ఆహార పదార్ధాలను వండుకునే విధానాలలో మార్పులు తీసుకు రావడం ద్వారా మనం రిస్కు తగ్గించు కోవచ్చు. అంతే కాక స్టమక్ అల్సర్ లు కనక వస్తే అశ్రద్ధ చేయకుండా ట్రిపుల్ తిరపీ వాడి హెలికో బ్యాక్తీరియాన్ని  దాని ఇన్ఫెక్షన్ నూ నిర్మూలించుకుంటే , ఆ బ్యాక్తీరియం మనకు ఎక్కువ హాని  చేయకుండా , అంటే క్యాన్సర్  కారకం కాకుండా నివారించుకోవచ్చు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

క్యాన్సర్ కారక స్థితులు.1.

In Our Health on జూలై 15, 2012 at 6:36 సా.

క్యాన్సర్ కారక స్థితులు.1. 

క్యాన్సర్. దీనినే రాచ పుండు అనే వారు పూర్వ కాలం లో. అంటే  రాజులకు వచ్చే వ్యాది అని పూర్వ కాలం లో అనుకునే వారు. కాల క్రమేణా క్యాన్సర్ లేదా రాచ పుండు ను త్వరిత గతిని కనుక్కుంటున్నారు. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతూ , తోలి  దశలలోనే కనుక్కుని సరి అయిన చికిత్స చేసి , మానవుల జీవిత కాలాన్ని పొడిగిస్తున్నారు  వైద్య నిపుణులు.
ఇటీవల ప్రఖ్యాత క్రికెట్ ఆట గాడు , భారతీయులకు క్రికెట్ లో ప్రపంచ కప్పు సాధించడం లో కీలక పాత్ర వహించిన యువకుడైన  యువరాజ్ సింగ్ కు అకస్మాత్తు గా క్యాన్సర్ ను నిర్ధారించి, విదేశాలకు పంపి చికిత్స చేయించడం, అందరి హృదయాలలో ఒక ముద్ర వేసిన సంఘటన అయింది. క్యాన్సర్ అంటే భయపడడం మాని , దానిని అర్ధం చేసుకోవడానికీ, క్యాన్సర్ వచ్చిన వారికి చేయూత నీయడానికీ ప్రజలు ముందుకు వస్తున్నారు. ఎన్నో ధార్మిక కార్యక్రమాలలో ఉదారం గా పాల్గొంటున్నారు కూడా ! 
మరి సామాన్య జనానీకానికి క్యాన్సర్ గురించి ఏమాత్రం అవగాహన ఉంది ?  వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అంతా దైవాదీనమేనా?  మన చేతులలో ఏమీ లేదా ?  ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, మనం క్యాన్సర్ ఏవిదం గా వస్తుందో తెలుసుకోవాలి. అందుకే ఈ ప్రయత్నం. ఒక గమనిక : నేను క్యాన్సర్ స్పెషలిస్టును కాను. ఇక్కడి టపాలలో నాకు తెలిసిన జ్ఞానాన్ని టపాలలో తెలిపి , క్యాన్సర్ గురించి అవగాహన పెంచుదామనే. చదువరులు, తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి స్పెషలిస్టు ను సంప్రదించడం ఉత్తమం. 
అసలు విషయం: 
సామాన్యం గా మానవులలో ప్రతి క్యాన్సరూ కొంత కాలం, మన దేహం లో ఉన్న కణాలలో కొన్ని మార్పులు తెచ్చిన తరువాత , క్యాన్సర్ గా బయట పడుతుంది. క్యాన్సర్ గా బయట పడడానికి ముందు ఉండే స్థితిని  ప్రీ మాలిగ్నెంట్ కండిషన్  లేదా ప్రీ క్యాన్స రస్ కండిషన్ లేదా క్యాన్సర్ కారక స్థితి అనబడుతుంది. ఈ క్యాన్సర్ కారక స్థితి గురించి మనకు మంచి అవగాహన ఏర్పడితే , ఈ క్యాన్సర్ కారక స్థితి కూడా ఏర్పడకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. మనం ప్రత్యెక క్యాన్సర్లు చర్చించే సమయం లో , ఈ జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాము.
( ఉదాహరణకు: పొగాకు పీల్చితే, అంటే సిగరెట్ తాగితే లంగ్ క్యాన్సర్ వస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఎందు వల్ల సిగరెట్ తాగితే  క్యాన్సర్ వస్తుందో కొద్ది మందికి మాత్రమె అవగాహన ఉంటుంది ) 
ఇప్పుడు ఇంకో  ఉదాహరణ చూద్దాము : లివర్ క్యాన్సర్. దీనినే శాస్త్రీయం గా హెపాటిక్ సెల్ క్యాన్సర్. పైన ఉన్న చిత్రం గమనించండి. ఈ చిత్రం లో మొదట కనిపించే కణాలు హెపాటిక్ స్టెం కణాలు అనబడతాయి. వాటినుంచి హెపాటిక్ ప్రోజేనై టార్ కణాలు పుడతాయి. చివరగా కాలేయ కణాలు లేదా హెపాటిక్ సెల్స్ , హెపాటిక్ ప్రోజెనైటార్ కణాల నుంచి పుడతాయి.ఇంత వరకూ జరిగిన చర్యలు సహజం గా ప్రతి కాలేయం లో జరిగే చర్యలే ! కానీ క్యాన్సర్ కారక సంఘటనలు , అంటే మ్యుటేషన్ లాంటివి జరిగి హెపాటిక్ ప్రోజెనైటార్ కణాలకు బదులు క్యాన్సర్ ప్రోజెనైటార్ కణాలు ఉత్పన్నం అవుతాయి. కాలేయ క్యాన్సర్ విషయం లో కొన్ని రకాల వైరస్ లు, ఇంకా అఫ్లా టాక్సిన్ అనే విష పూరితమైన ఫంగస్, ఇంకా మద్యం అంటే ఆల్కహాలు –ఇవన్నీ సహజం గా జరిగే చర్యల రూటు మార్చి , కణాలలో మ్యుటేషన్ జరగటానికి దోహదమవుతాయి. మ్యుటేషన్ అంటే కణం లో వచ్చే సమూలమైన , ఆకస్మికమైన మార్పులు. ఈ మార్పులు సామాన్యం గా కణం లోని జన్యువులలో , అంటే జీన్స్ లో వస్తాయి. ఈ మ్యుటేషన్ ఒక సారి వచ్చిన తరువాత  పుట్టే కణాలు క్యాన్సర్ కణాలు అవుతాయి. ఈ విధం గా పుట్టిన క్యాన్సర్ కణాలు, ఒక పద్ధతంటూ లేకుండా ఎడా పెడా క్యాన్సర్ కణాలను ఉత్పన్నం చేస్తాయి. దానితో రాచ పుండు లేదా క్యాన్సర్ ఏర్పడుతుంది. చూశారు గా , పటం సహాయం తో , సహజమైన కాలేయ కణాలు , క్యాన్సర్ కణాలు గా మ్యుటేషన్ లేదా పరివర్తన ఎట్లా చెందుతాయో ! 
మరి  కాలేయ క్యాన్సర్ నివారణలో మన కర్తవ్యం ఏమిటి ?: 
1. వైరస్ ఇన్ఫెక్షన్ లు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం.
2. మద్యం ముట్టక పోవడం. 
3. అఫ్లా టాక్సిన్ అనే విషం మన ఆహారం లో లేకుండా చూసుకోవడం. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 
%d bloggers like this: