నార్సిసిస్టిక్ వ్యక్తిత్వం. 8.
దీనినే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఆంగ్లం లో అంటారు.మేగాలో మానియా అని కూడా ఈ వ్యక్తిత్వం పిలవ బడుతూ ఉంటుంది. నార్సిసిస్టిక్ వ్యక్తిత్వం అనే పేరు ఎందుకు వచ్చిందంటే , గ్రీకు ఇతిహాసాలలో నార్సిస్సస్ అని ఒక వేట గాడు ఉండే వాడు.ఆ వేట గాడు అందం గా అంటే హ్యాండ్సం గా ఉండి తన అందం చూసుకుని అతి గర్వ పడే వాడు. నెమిసిస్ అనే దేవత ఈ అంద గాడయిన నార్సిస్సస్ ను ఒక కొలను దగ్గరికి తీసుకు వెళ్లి ఆ కొలను లో అతడి ప్రతిబింబాన్ని చూపించింది. దానితో , నార్సిస్సస్ ఆ ప్రతిబింబాన్ని చూసుకుంటూ , కొలను దగ్గరే ఉండి, కొంత కాలమైన తరువాత తనువు చాలించాడు.
నార్సిసిస్టిక్ వ్యక్తిత్వ లక్షణాలు ఏమిటి ?:
ఈ రకమైన వ్యక్తిత్వం ఉన్న వారు , వారి పైన ఏ విమర్శలు చేసినా, విపరీతమైన , అవమానం చెంది , క్రోధం తో స్పందిస్తారు. వారు ఇతరులను తమ స్వంత లాభానికి ఉపయోగించు కుందామని సర్వదా ప్రయత్నిస్తూ ఉంటారు.వారి ప్రాముఖ్యతనూ , ప్రతిభా పాటవాలను , ఉన్న వాటికంటే ఎక్కువ చేసి అందరికీ తమ ‘ గొప్ప ‘ లు చెపుతూ ఉంటారు. వారు అవాస్తవికమైన ఊహా ప్రపంచం లో విహరిస్తూ ఉంటారు. అంతే కాక వారు, అధిక సామర్ధ్యం కలవారుగానూ , అధిక శక్తి మంతులు గానూ , చాలా తెలివైన వారిగానూ, రొమాంటిక్ గానూ ఊహించుకుంటూ ఉంటారు. శులభం గా ఇతరులను చూసి అసూయ చెందుతూ ఉంటారు. ఇతరులు తమను నిరంతరం పొగుడుతూ, సద్విమర్శలు చేస్తూ ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఇతరుల పట్ల సానుభూతి చాలా తక్కువ గా ఉంటుంది వీరిలో.ఎంత సేపూ సొంత డబ్బా కొట్టుకుంటూ , స్వార్ధ పూరితమైన ప్రవ్రుత్తి కలిగి ఉంటారు. వారు చాలా గట్టి వారు , ఎమోషన్స్ ఎక్కువగా లేని వారు గా కనిపిస్తూ ఉంటారు. అవాస్తవికమైన లక్ష్యాలను నిర్దేశించు కుంటూ ఉంటారు, వారి జీవితాలలో. అంటే అన్ రియలిస్టిక్ గోల్స్. వారికి ప్రతిదీ అత్యుత్తమమయినదే కావాలని తాపత్రయ పడుతూ ఉంటారు. ఈ రకమైన మనస్తత్వం వల్ల, ఇతరులతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడం లో తరచూ విఫలం అవుతూ ఉంటారు.
విపరీతమైన ఆత్మ విశ్వాసం కలవారికి కూడా పైన చెప్పిన లక్షణాలలో చాలా ఉంటాయి. కానీ గమనించ వలసినది ఏమిటంటే , నార్సిసిస్టిక్ వ్యక్తిత్వం ఉన్న వారు, వారి సెల్ఫ్ ఇమేజ్ తక్కువ గా కలిగి ఉంటారు.అంటే వారికై వారు చాలా ఆత్మ న్యూనతా భావం కలిగి ఉంటారు. దానితో ఇతరులు తమ మీద చేస్తున్న విమర్శలు వారు హుందా గా స్వీకరించక, అతి గా స్పందించడమే కాకుండా , ఇతరులను బాగా కించ పరుస్తూ ఉంటారు.
వర్తమానం లో ఈ వ్యక్తులు మనకు ఎక్కడ తారస పడతారు?: మన రాజకీయ నాయకులు పైన ఉన్న లక్షణాలకు ప్రత్యక్ష సాక్షులు. ఆనూహ్యం గా ఈ రకమైన వ్యక్తిత్వం కలవారు, భారత దేశ రాజకీయాలలో ఎక్కువ గా కనిపిస్తారు. మనం పని చేసే ప్రదేశాలలోనూ , మన బంధువులలో కూడా మనం తరచూ గమనిస్తూ ఉంటాము , ఈ వ్యక్తిత్వం కల వారిని. మీకు తెలిసిన వారెవరైనా ఈ వ్యక్తిత్వం కలిగి ఉంటే తెలియచేయండి.
మిగతా సంగతులు వచ్చే టపా లో చూద్దాము !