అసాంఘిక వ్యక్తిత్వం. 11.
( పైన ఉన్న రెండు స్కాన్ చిత్రాలలో మొదటిది నార్మల్ మెదడు. రెండవది అసాంఘిక వ్యక్తిత్వం ఉన్న వారిది. దానిలో కేవం సెప్టం పెల్లూసిడం అనే ఒక మార్పు శాస్త్రజ్ఞులు గమనించారు. )
అసాంఘిక వ్యక్తిత్వం లేదా యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్, మానసిక రుగ్మతలు ఉన్న వారిలో మూడు నుంచి ముప్పై శాతం వరకూ కనిపిస్తుంది. మనం ఈ వ్యక్తిత్వం ఉన్న వారిని భారత దేశం లో సాధారణం గా ప్రతి చోటా చూస్తూ ఉంటాము. అంటే మనం ఎక్కడైనా క్యూ లలో నుంచుని ఉన్నప్పుడు , బస్ స్టాప్ లో నూ , సినిమా థియేటర్ వద్ద, రైల్వే స్టేషన్ వద్ద , ఇట్లా ఏ ప్రదేశం లోనైనా కనిపిస్తారు , ఈ వ్యక్తిత్వం ఉన్న వారు . ‘ పదండి ముందుకు , పదండి ముందుకు , పోదాం , పోదాం పై పై కి ‘ అని అన్న శ్రీ శ్రీ వాక్యాన్ని ఎట్టి పరిస్థితి లో నైనా ఆచారించాలనే కంకణం కట్టుకుంటారు వీరు. వీరు వెనక ఎక్కడో ఉన్నా, ముందు ఒక వంద మంది ఉన్నా లెక్క చేయకుండా , అతి లాఘవం గా గంటల తరబడి క్యూ లలో వేచి ఉన్న వారిని ఏమాత్రం లెక్క చేయకుండా , ముందుకు దూసుకు పోయి, క్యూ లో తమ స్థానాన్ని పదిలం చేసుకుంటూ , అభ్యంతర పెట్టిన వారిని డేగ కన్ను తో చూస్తూ , తమ పని జరుపు కుంటారు. ఈ నీటి ఎద్దడి సందర్భం గా , నీళ్ళ ట్యాంకు సరఫరా చేస్తున్న సమయం లో కూడా , ఈ అసాంఘిక వ్యక్తులు , ( ఇక్కడ లింగ భేదం లేక పోవడం స్పష్టం గా కనిపిస్తుంది ! ) వారి బిందెల తోనూ , బకెట్ల తోనూ చేసే ఘర్షణ, చూడలేక , పడలేక వాటర్ ట్యాంకు లోనుంచి ఏక ధారగా గంగా భవానీ, కన్నీరై , నేలమీద వృధాగా జాలువారుతుండడం కూడా మనకు సామాన్యం గా దర్శనీయమే ! ఈ సందర్భాలలో సామ, దాన , భేద , దండోపాయాలను , మానవులు, అంటే వివిధ వ్యక్తిత్వాలు ఉన్న మానవులు ఎట్లా ఉపయోగిస్తారో కూడా మనకు తెలియనిది కాదు. ఇక సిటీ బస్సులలో , రైళ్ళలో ప్రయాణం చేసే సమయం లో కూడా , ఈ రకమైన వ్యక్తులు పుష్కలం గా తారస పడుతుంటారు మనకు. ఇక బందులు, రాస్తా రోకో లు జరిగినప్పుడు వీరు చేసే ‘ తాండవం ‘ అంతా ఇంతా కాదు , ప్రతి దుకాణానికీ ఒక్కొక్కరూ తమకన్నా కాస్త పొడవాటి దుడ్డు కర్రలతో వెళ్లి , నానా హంగామా చేసి , షట్టర్లు మూయించి వేస్తారు వీరు. రాస్తా రోకో లు జరిపినప్పుడు కూడా , అనేక మంది అమాయక ప్రజలు విపరీతం గా, నానా రకాలు గా అవస్థలు పడుతుంటే , ఈ వ్యక్తిత్వం కలవారు , కాలర్లు ఎగరేసుకుని , మనకు స్వాతంత్రం సముపార్జించినంత విజయ గర్వం తో తిరుగుతూ కనిపిస్తారు. ఇక ఈ అసాంఘిక వ్యక్తిత్వం ఉన్న వారి లక్షణాలు ఇక్కడ నామ మాత్రం గానే మీకు వివరించడం జరుగుతుంది, ఎందుకంటే మీకు ఈ వ్యక్తిత్వం ఉన్న వారు తరచూ తటస్థ పడుతూ ఉంటారు కదా !
1.వీరు ఇతరుల చట్ట బద్ధమైన హక్కులు ఏమాత్రం గుర్తించడం కానీ , గౌరవించడం కానీ చేయరు. అంతే కాక, పదే పదే , తమను , అరెస్టు చేయదగిన తప్పిదాలు చేస్తూ ఉంటారు.
2. సమాజం లో సామాన్యం గా అమలు చేస్తున్న కట్టుబాట్లను కాల రాస్తూ ఉంటారు.
3.వారి స్వంత లాభాలకూ , స్వార్ధానికీ , వారి పేరును మార్చుకోవడానికీ , అబద్ధాలు చెప్పడానికీ, మోసాలు చేయడానికి కూడా వెనుకాడరు.
4.ఇతరుల భద్రత మీద కూడా వీరికి ఏమాత్రం పట్టదు. తాగి కార్లు , బస్సులు నడిపే వారు ఈ కోవకు చెందుతారు.
5. తరచూ చీకాకు పడుతూ , విసుగు చెందడం, పట్టరాని కోపం క్షణాలలో రావడం కూడా వీరి లక్షణాలు.
6.ఒక స్థిరమైన బాధ్యతా రహిత జీవితాలు గడుపుతూ ఉంటారు వీరు. అంటే తీసుకున్న అప్పులు ఎగ కొట్టడం , అమాయకులకు టోపీ పెట్టడం , ఉద్యోగం సరిగా చేయక పోవడం లాంటివి.
7. ఇంకో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే , ఈ అసాంఘిక వ్యక్తిత్వం ఉన్న వారు చేసే నీచమైన , కుటిలమైన పనులు, అన్నీ తెలిసి కూడా చేస్తూ ఉంటారు అంటే, అజ్ఞానం తో కాదు. అంతే కాక వీరికి వీరు చేసే పనుల గురించి కానీ , పరిణామాల గురించి కానీ , ఏమాత్రం చీకూ , చింతా , అపరాధ భావనా ఉండవు. దీనినే రిమోర్స్ లేకపోవడం అంటారు.
ఈ అసాంఘిక వ్యక్తిత్వం ఉన్న వారి ‘ ఆధునిక మహా ప్రస్థానం ‘ చదవండి:
కూలీ కూడు,
సిపాయి గూడు,
గనిలో ఇనుము,
జనం ధనము,
రైతు పొలం,
‘మందు’ బలం
నోటుకు ఓటు,
పదవుల ‘ మాటు ‘
బ్యాంకుల స్క్యాము ,
సాగని స్కీము,
ఎంతో ద్రోహం !,
అయినా తీరని దాహం !
కాదేదీ స్వాహా కనర్హం!
ఔనౌను మోసమనర్ఘం !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !