క్యాన్సర్ నివారణ కు మనం తీసుకోగల జాగ్రత్తలు ఏమిటి ? :
క్రితం టపాలలో బ్యాక్తీరియాలూ, వైరస్ లూ , ఇంకా రసాయనాలూ , ఏ విధం గా మనలో క్యాన్సర్ కారకం అవవచ్చో , పటాల సహాయం తో తెలుసుకున్నాము కదా ! ఇవే కాక రేడియేషన్ ప్రభావం వల్ల కూడా క్యాన్సర్ రావటానికి అవకాశం ఉంది. ఉదాహరణకు తెల్ల గా ఉన్న వారు, చర్మ సౌందర్యం కోసం ఎండ లో వారి చర్మాన్ని ఎక్స్పోజు చేయడం చేస్తుంటారు. ఈ సన్ బేదింగ్ వల్ల సూర్య రశ్మి లో ఉండే యు వీ రేస్ ( UV rays or Ultra Violet rays ) వీరి చర్మ కణాలలో మార్పులు తెచ్చి మేలనోమా అనే చర్మ క్యాన్సర్ కు కారణమవుతాయి. అట్లాగే అతి గా ఎక్స్ రే లు తీయించుకున్నా క్యాన్సర్ రిస్కు హెచ్చుతుంది. మరి మనం ఈ విషయాలు అన్నీ తెలుసుకున్నాము కదా మనకు క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఏవైనా నివారణ చర్యలు వ్యక్తి గతం గా తీసుకో గలమా ? అని ప్రశ్నించుకుంటే కొన్ని సమాధానాలు దొరుకుతాయి. క్యాన్సర్ నివారణ లేదా ప్రివెన్షన్ అంటే క్యాన్సర్ మనకు వచ్చే అవకాశాన్ని వీలైనంతగా తగ్గించు కోవడమన్న మాట. ఈ టపాలో మనం తీసుకునే సాధారణ చర్యలు క్యాన్సర్ నివారణ లో ఎట్లా ఉపయోగ పడ గలవో చూద్దాము. క్యాన్సర్ నివారణలో మనం ముందుగా గుర్తుంచు కోవలసినది , క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గడానికీ , లేదా హెచ్చదానికీ , మన జన్యువులు అంటే జీన్స్ , మన జీవన శైలి , ఇంకా మన పరిసరాల ప్రభావాల కలగలసిన పరిణామమే ! క్యాన్సర్ నివారణ మీద అనేక పరిశోధనలు చేసిన అనేక మంది శాస్త్రజ్ఞులు ఈ ముఖ్య సూచనలు చేశారు.
1. క్యాన్సర్ కారక స్థితులను మనం సంపూర్ణం గా దాట వేయడమో అంటే ఎవాయిడ్ చేయడమో , లేదా వీలైనంత వరకు ఆ పరిస్థితులను , మనలను ఎక్కువ గా ప్రభావితం చేయకుండా నియంత్రించు కోవడమో చేయడం.
2.మన ఆహార నియమాలలోనూ , మన జీవన శైలి లోనూ మార్పులు తెచ్చుకోవడం. అంటే ,changes in diet and lifestyle.
3.క్యాన్సర్ కారక స్థితులను, అంటే ప్రీ క్యాన్సరాస్ కండిషన్స్ ను వీలైనంత తోలి దశలలో గుర్తించడం, ఇంకా అవసరమైనప్పుడు ఈ క్యాన్సర్ కారక స్థితులు , క్యాన్సర్ గా మారకుండా , తగు చికిత్స తీసుకోవడం.
ఇక్కడ రెండు శాస్త్రీయ పదాలను మనం పునశ్చరణం చేసుకుందాము. కార్సినోజెనిసిస్ అంటే క్యాన్సర్ జననం లేదా క్యాన్సర్ మొదలవడం. మ్యుటేషన్ అంటే మన జీవ కణాల జన్యువులలో లేదా జీన్స్ లో వచ్చే ఆకస్మిక మార్పులు.
మనలో క్యాన్సర్ రిస్కును ఏ ఏ పరిస్థితులు ఎక్కువ చేస్తాయి? :
1.సిగరెట్ స్మోకింగ్ : ఇప్పటి వరకూ చేసిన పరిశోధనల ఫలితం గా సిగరెట్ స్మోకింగ్ , లంగ్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ , మూత్రాశయ క్యాన్సర్ అంటే బ్లాడర్ క్యాన్సర్, ఇంకా పాంక్రియాటిక్ క్యాన్సర్, ఇంకా AML అనబడే ఒక రకమైన రక్త క్యాన్సర్ – వీటన్నిటికీ ప్రధానకారణం గా గుర్తించారు. ( స్మోకింగ్ ఎట్లా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందో , ఆసక్తి ఉన్న వారు ఆ టపాలను మళ్ళీ చూడ వచ్చు , బాగు ఆర్కివ్స్ లో )
2.ఇన్ఫెక్షన్: లివర్ క్యాన్సర్ కు కారణ మైన హెపటైటిస్ బీ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఒక టీకా మందు ను తయారు చేశారు. అట్లాగే సర్వికల్ క్యాన్సర్ కు కారణమైన పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ స్త్రీలలో సోకకుండా కూడా ఒక టీకా మందును తయారు చేశారు. ఇవి మానవులు, అంటే శాస్త్రజ్ఞులు ఈ రకమైన క్యాన్సర్ తగ్గించడం లో సాధించిన ప్ర్పగతి.! ( సర్వికల్ క్యాన్సర్ గురించి కూడా వివరం గా క్రిందటి టపాలలో వివరించడం జరిగింది , చదువరుల సౌకర్యం కోసం. ) అదే విధం గా జీర్ణాశయ క్యాన్సర్ కు కారణమైన హెలికో బ్యాక్తర్ పైలోరి అనే బ్యాక్తీరియం ఇన్ఫెక్షన్ ను కూడా ట్రిపుల్ థెరపీ తో రూపు మాపి క్యాన్సర్ రిస్కు ను తగ్గించు కోవచ్చు.
3.రేడియేషన్ : శాస్త్రజ్ఞులు కొన్ని రకాలైన థైరాయిడ్ క్యాన్సర్లూ , రొమ్ము క్యాన్సర్ , ఇంకా ల్యుకీమియా అనే ఒక రకమైన రక్త క్యాన్సర్ కు కూడా కారణ మవుతుందని కనుక్కున్నారు. ఈ క్యాన్సర్ లు వచ్చే అవకాశం , ఎక్కువ సార్లు , శక్తి వంతమైన రేడియేషన్ ప్రభావం శరీరాన్ని తాకినప్పుడు హెచ్చుతుంది. అందు వల్లనే, అత్యవసరం అయినప్పుడే ఎక్స్ రే పరీక్షలు జరిపించుకోవాలి
4. రోగ నిరోధక శక్తి తగ్గించే మందులు : ఈ మందులు కొన్ని సందర్భాలలో అనివార్యం అవుతాయి. ఉదాహరణకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్న వారికి. వీటి వల్ల వారిలో రోగ నిరోధక శక్తి తగ్గి , క్యాన్సర్ కారకమవుతాయి.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !