Our Health

Archive for జూలై 15th, 2012|Daily archive page

క్యాన్సర్ కారక స్థితులు.1.

In Our Health on జూలై 15, 2012 at 6:36 సా.

క్యాన్సర్ కారక స్థితులు.1. 

క్యాన్సర్. దీనినే రాచ పుండు అనే వారు పూర్వ కాలం లో. అంటే  రాజులకు వచ్చే వ్యాది అని పూర్వ కాలం లో అనుకునే వారు. కాల క్రమేణా క్యాన్సర్ లేదా రాచ పుండు ను త్వరిత గతిని కనుక్కుంటున్నారు. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతూ , తోలి  దశలలోనే కనుక్కుని సరి అయిన చికిత్స చేసి , మానవుల జీవిత కాలాన్ని పొడిగిస్తున్నారు  వైద్య నిపుణులు.
ఇటీవల ప్రఖ్యాత క్రికెట్ ఆట గాడు , భారతీయులకు క్రికెట్ లో ప్రపంచ కప్పు సాధించడం లో కీలక పాత్ర వహించిన యువకుడైన  యువరాజ్ సింగ్ కు అకస్మాత్తు గా క్యాన్సర్ ను నిర్ధారించి, విదేశాలకు పంపి చికిత్స చేయించడం, అందరి హృదయాలలో ఒక ముద్ర వేసిన సంఘటన అయింది. క్యాన్సర్ అంటే భయపడడం మాని , దానిని అర్ధం చేసుకోవడానికీ, క్యాన్సర్ వచ్చిన వారికి చేయూత నీయడానికీ ప్రజలు ముందుకు వస్తున్నారు. ఎన్నో ధార్మిక కార్యక్రమాలలో ఉదారం గా పాల్గొంటున్నారు కూడా ! 
మరి సామాన్య జనానీకానికి క్యాన్సర్ గురించి ఏమాత్రం అవగాహన ఉంది ?  వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అంతా దైవాదీనమేనా?  మన చేతులలో ఏమీ లేదా ?  ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, మనం క్యాన్సర్ ఏవిదం గా వస్తుందో తెలుసుకోవాలి. అందుకే ఈ ప్రయత్నం. ఒక గమనిక : నేను క్యాన్సర్ స్పెషలిస్టును కాను. ఇక్కడి టపాలలో నాకు తెలిసిన జ్ఞానాన్ని టపాలలో తెలిపి , క్యాన్సర్ గురించి అవగాహన పెంచుదామనే. చదువరులు, తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి స్పెషలిస్టు ను సంప్రదించడం ఉత్తమం. 
అసలు విషయం: 
సామాన్యం గా మానవులలో ప్రతి క్యాన్సరూ కొంత కాలం, మన దేహం లో ఉన్న కణాలలో కొన్ని మార్పులు తెచ్చిన తరువాత , క్యాన్సర్ గా బయట పడుతుంది. క్యాన్సర్ గా బయట పడడానికి ముందు ఉండే స్థితిని  ప్రీ మాలిగ్నెంట్ కండిషన్  లేదా ప్రీ క్యాన్స రస్ కండిషన్ లేదా క్యాన్సర్ కారక స్థితి అనబడుతుంది. ఈ క్యాన్సర్ కారక స్థితి గురించి మనకు మంచి అవగాహన ఏర్పడితే , ఈ క్యాన్సర్ కారక స్థితి కూడా ఏర్పడకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. మనం ప్రత్యెక క్యాన్సర్లు చర్చించే సమయం లో , ఈ జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాము.
( ఉదాహరణకు: పొగాకు పీల్చితే, అంటే సిగరెట్ తాగితే లంగ్ క్యాన్సర్ వస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఎందు వల్ల సిగరెట్ తాగితే  క్యాన్సర్ వస్తుందో కొద్ది మందికి మాత్రమె అవగాహన ఉంటుంది ) 
ఇప్పుడు ఇంకో  ఉదాహరణ చూద్దాము : లివర్ క్యాన్సర్. దీనినే శాస్త్రీయం గా హెపాటిక్ సెల్ క్యాన్సర్. పైన ఉన్న చిత్రం గమనించండి. ఈ చిత్రం లో మొదట కనిపించే కణాలు హెపాటిక్ స్టెం కణాలు అనబడతాయి. వాటినుంచి హెపాటిక్ ప్రోజేనై టార్ కణాలు పుడతాయి. చివరగా కాలేయ కణాలు లేదా హెపాటిక్ సెల్స్ , హెపాటిక్ ప్రోజెనైటార్ కణాల నుంచి పుడతాయి.ఇంత వరకూ జరిగిన చర్యలు సహజం గా ప్రతి కాలేయం లో జరిగే చర్యలే ! కానీ క్యాన్సర్ కారక సంఘటనలు , అంటే మ్యుటేషన్ లాంటివి జరిగి హెపాటిక్ ప్రోజెనైటార్ కణాలకు బదులు క్యాన్సర్ ప్రోజెనైటార్ కణాలు ఉత్పన్నం అవుతాయి. కాలేయ క్యాన్సర్ విషయం లో కొన్ని రకాల వైరస్ లు, ఇంకా అఫ్లా టాక్సిన్ అనే విష పూరితమైన ఫంగస్, ఇంకా మద్యం అంటే ఆల్కహాలు –ఇవన్నీ సహజం గా జరిగే చర్యల రూటు మార్చి , కణాలలో మ్యుటేషన్ జరగటానికి దోహదమవుతాయి. మ్యుటేషన్ అంటే కణం లో వచ్చే సమూలమైన , ఆకస్మికమైన మార్పులు. ఈ మార్పులు సామాన్యం గా కణం లోని జన్యువులలో , అంటే జీన్స్ లో వస్తాయి. ఈ మ్యుటేషన్ ఒక సారి వచ్చిన తరువాత  పుట్టే కణాలు క్యాన్సర్ కణాలు అవుతాయి. ఈ విధం గా పుట్టిన క్యాన్సర్ కణాలు, ఒక పద్ధతంటూ లేకుండా ఎడా పెడా క్యాన్సర్ కణాలను ఉత్పన్నం చేస్తాయి. దానితో రాచ పుండు లేదా క్యాన్సర్ ఏర్పడుతుంది. చూశారు గా , పటం సహాయం తో , సహజమైన కాలేయ కణాలు , క్యాన్సర్ కణాలు గా మ్యుటేషన్ లేదా పరివర్తన ఎట్లా చెందుతాయో ! 
మరి  కాలేయ క్యాన్సర్ నివారణలో మన కర్తవ్యం ఏమిటి ?: 
1. వైరస్ ఇన్ఫెక్షన్ లు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం.
2. మద్యం ముట్టక పోవడం. 
3. అఫ్లా టాక్సిన్ అనే విషం మన ఆహారం లో లేకుండా చూసుకోవడం. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 
%d bloggers like this: