Our Health

Archive for జూలై 5th, 2012|Daily archive page

బార్డర్ లైన్ వ్యక్తిత్వం. 10.

In మానసికం, Our minds on జూలై 5, 2012 at 8:24 సా.

బార్డర్ లైన్ వ్యక్తిత్వం. 10.

బార్డర్ లైన్ వ్యక్తిత్వం పాశ్చాత్య దేశాలలో రెండు శాతం ఉంది. అంటే ప్రతి వంద మంది లోనూ , ఇద్దరు ఈ రకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. దీనిని గురించి మనం తెలుసుకునే ముందు ఈ వ్యక్తిత్వం ఎందుకు అలవడుతుందో తెలుసుకుంటే, దాని అవసరం కూడా మనకు  బోధ పడుతుంది. 
బార్డర్ లైన్ వ్యక్తిత్వానికి మూల కారణాలు ఏమిటి ?: మిగతా మానసిక వ్యాధుల లాగానే , ఈ వ్యక్తిత్వానికి కారణాలు కూడా , ఇత మిద్ధం గా చెప్పలేని , క్లిష్టమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యం గా బాల్యం లో అనుభవమయే  క్లిష్ట పరిస్థితులు,  అంటే దురానుభావాలు , బాల్యం లో ఉన్న చిన్నారులను తీవ్రం గా కలత చెందించే సంఘటనలు ,తల్లి తండ్రులు తమ పిల్లలను సరిగా చూసుకోక పోవడమూ , వారి పెంపకం లో తీవ్రమైన అశ్రద్ధ చేయడమూ, లేక బాల్యం లో  వారు , ఎవరి చేతనైనా , మానసికం గా కానీ , భౌతికం గా కానీ , లేదా కామ పరం గా కానీ హింసించ బడడం. ఈ కారణాలన్నీ ,వారు పెరిగి పెద్దయిన తరువాత , బార్డర్ లైన్ వ్యక్తిత్వం ఏర్పడడానికి దోహదాలు.  కొంత వరకూ , వారి జన్యువుల అంటే జీన్స్ లో లోపాలు ఉన్నా, లేదా , పరిసరాల ప్రభావం వల్ల , లేదా మెదడు లో సహజం గా ఉండే జీవ రసాయనాల సమతుల్యం లోపించడం వల్ల కూడా ఈ రకమైన వ్యక్తిత్వం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. 
 ఈ వ్యక్తిత్వం భారత దేశం లో వారు, ముఖ్యం గా తల్లి దండ్రులు ఎందుకు తెలుసుకోవాలి ?: 
పాశ్చాత్య నాగరికత , మన దేశ నాగరికతా పునాదులను కదిలిస్తూ ఉంది. వేగం గా జరుగుతున్న ప్రపంచీకరణ కూడా ఇందుకు కారణం. యుక్తా యుక్త విచక్షణ లేకుండా , మన భౌతిక అవసరాలతో పాటు , మన ఆలోచనలను కూడా దిగుమతి చేసుకుంటున్నాము. ఓపెన్ మైండ్ దృక్పధం మంచిదే కానీ , దురలవాట్ల కూ , చెడు ఆచార వ్యవహారాలకు కూడా ఓపెన్ మైండ్ ఉండడం సమంజసం కాదు. కానీ ఇదే ప్రస్తుతం జరుగుతుంది, భారత దేశం లో! దీని పరిణామాలు మన సాంఘిక కట్టు బాట్ల మీద, కుటుంబ వ్యవస్థ మీదా పడుతున్న్నాయి. పర్యవసానం గా పిల్లలు, అశ్రద్ధ చేయ పడడమూ , గృహ హింస , లేదా అబ్యూజ్ కు గురి అవడమూ తరచూ జరుగుతున్నాయి. ఈ టపా రాస్తున్న సమయం లోనే ఎన్డీ టీవీ లో ఒక వార్త ! మన ఆంద్ర ప్రదేశం లో ఒక తల్లిదండ్రుల జంట తమ కూతురు ( ఒక బాలిక ) ను పది వేల రూపాయలకు అమ్మితే ఆ బాలికను కొన్న వారు , ఆ అమ్మాయిని చిత్ర హింస కు గురి చేసి , ఆ తరువాత ఆమెను కాల్చి వేసి, ప్రాణం తీశారని. మనం అప్పుడప్పుడూ వింటున్న, లేదా చూస్తున్న వార్తలు కేవలం ‘  టిప్ అఫ్ ది ఐస్ బర్గ్ ‘మాత్రమె !  పాఠం ఏమిటంటే , బార్డర్ లైన్ వ్యక్తిత్వం ఏర్పడడానికి అవసరమయే అన్ని పరిస్థితులూ మన భారత దేశం లో పుష్కలం గా ఉంటున్నాయి, అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కూడా ! దానితో ఈ వ్యక్తిత్వం ఉన్న వారు కూడా రానున్న తరం లో ఎక్కువ అవుతారనడం లో  సందేహం లేదు. 
మరి ఈ వ్యక్తిత్వ లక్షణాలు ఎట్లా ఉంటాయి?:
1. వారికంటూ ఒక వ్యక్తిత్వం లేక పోవడం.2. తమ నిజ జీవితం లో కానీ , ఊహా జీవితం లో కానీ, ఎడబాటు ను, ఎట్టి పరిస్థితులలోనూ సహించ లేక పోవడం. 3.దీర్ఘ కాలం గా తమలో ఏదో అసంతృప్తి, వెలితి అనుభవిస్తూ ఉండడం. 4.ఎమోషనల్ గా అంటే భావావేశాలు ఒక సమతుల్యం లో లేక పోవడం దీనినే ఎమోషనల్ లెబిలిటీ అంటారు. 5. ఇంపల్సి విటీ అంటే  దుడుకు స్వభావం అంటే వెనకా ముందూ ఆలోచించ కుండా , ఏ క్షణం లో ఏ ఆలోచన మెదిలినా వెంటనే  ఆ పని చేయడం.( ఉదాహరణకు , దుర్వ్యసనాలకు ఏ మాత్రం విచక్షణ లేకుండా అలవాటు పడడం, లేక అలవాటు చేసుకోవడం , కామ పరం గా కూడా విశృంఖలం గా ప్రవర్తించి, ఒకరి కంటే ఎక్కువ మంది తో కామ పరం గా సంబంధాలు ఏర్పరుచు కోవడం ).  6. చీటికీ మాటికీ చీకాకు పడడం, కోపం తెచ్చుకోవడం. 7. ఇతరుల మీద సదభిప్రాయం లేక పోవడం , లేదా ఇతరులను విపరీతం గా అనుమానించడం, అంటే పారనాయిడ్ ఫీలింగ్స్ ఉండడం. 8. స్వీయ హింస, అంటే , నిద్ర టాబ్లెట్ లు మింగి కానీ , చేతులు కోసుకోవడం కానీ చేసుకొని , ప్రాణాల మీదకు తెచ్చుకోవడం , అంతే కాక ప్రాణాలు కూడా తీసుకునే ప్రయత్నాలు చేయడం. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 
%d bloggers like this: