క్యాన్సర్ కారక స్థితులు. 2. బ్యాక్టీరియా లు క్యాన్సర్ కలిగిస్తాయా ?:
క్రితం టపాలో మనం ఒక సామాన్య జీవ కణం, జన్యువు లో మార్పు వల్ల క్యాన్సర్ కణం గా పరివర్తనం చెందుతుందో తెలుసుకున్నాము కదా !
మరి ఇట్లా జన్యువుల లో పరివర్తన తేవడానికి , బ్యాక్తీరియాలూ, వైరస్ లూ , వివిధ రసాయన పదార్ధాలూ కారణ మవుతాయి. మన కు అంటే మానవులకు కలిగే కొన్ని క్యాన్సర్ లలో ఈ బ్యాక్టీరియా లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కడుపు లో క్యాన్సర్ కు ఈ బ్యాక్టీరియా లు ఎట్లా కారణం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వివరాలు తెలుసుకుంటే మనం స్టమక్ క్యాన్సర్ లేదా జీర్ణాశయ క్యాన్సర్ నివారణకు ఏమి చేయ వచ్చో కూడా విశద పడుతుంది.
జీర్ణాశయ క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్ ఎట్లా వస్తుంది?:
జీర్ణాశయ క్యాన్సర్ దక్షిణ భారత దేశం లో ఎక్కువ గా వస్తున్నట్టు పరిశోధనల వల్ల తెలిసింది ముఖ్యం గా మన ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కారకం అవుతాయి.ఇక్కడ వివిధ పరిశీలనల లో శాస్త్రీయం గా తెలుసుకున్న ఫలితాలు చూద్దాము. బొంబాయి లో జరిపిన ఒక పరిశీలనలో ఎండ బెట్టిన చేపల తో చేసిన వంటకాలు తింటున్న వారిలో స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని తెలిసింది. కానీ టీ అంటే తేయాకు, ప్రత్యేకించి పాలు కలుపుకోకుండా తాగే టీ – తాగుతున్న వారిలో స్టమక్ క్యాన్సర్ తక్కువ గా వస్తున్నట్టు తెలిసింది. త్రివేండ్రం లో చేసిన ఇంకో పరిశీలనలో , ఎక్కువ అన్నం అంటే రైస్ తినే వారిలో , ఎక్కువ వేడిగా ఉన్న ఆహారాలు తినే వారిలో , ఎక్కువ స్పైసీ ఫుడ్ తినే వారిలో, ఎక్కువ కారం తినే వారిలో , స్టమక్ క్యాన్సర్ ఎక్కువ గా వస్తున్నట్టు తెలిసింది.
( Sinha et al : Cancer risk and Diet in India ) ఫ్రైడ్ ఫుడ్ అంటే వేపుడు కూరలు, అవి కూరగాయలతో కానీ మాంసం తో చేసిన కూరలు కానీ , వేపుడు కూరలు ఎక్కువ గా తింటున్న వారిలో కూడా స్టమక్ క్యాన్సర్ ఎక్కువ గా వస్తున్నట్టు గమనించారు.
మరి వేపుడు కూరలు ఎందుకు మనకు హానికరం? : క్యాన్సర్ కారకాలైన హెటిరో సైక్లిక్ అమీన్ లు మన ఆహారాన్ని ఎంత వేయిస్తూ ఉంటే అంత ఎక్కువ గా తయారవుతూ ఉంటాయి. ఇంకో విధం గా చెప్పాలంటే , వేపుడు కూరలలో , క్యాన్సర్ కారక విష పదార్ధాలు ఎక్కువ గా ఉంటాయి. ఈ విష పదార్ధాలు జీర్ణాశయ గోడలలో ఉండే కణజాలం లో , ఇంకా ఖచ్చితం గా చెప్పుకోవాలంటే కణాలలోని జన్యు పదార్ధం లో అంటే జీన్స్ నిర్మాణం లో పరివర్తన తీసుకువచ్చి ఆ సహజ కణాలను అసహజమైన క్యాన్సర్ కణాలు గా మారుస్తాయి.ఒకసారి క్యాన్సర్ కణాలు ఈ విధం గా ఏర్పడ్డ తరువాత , తమ లాంటి క్యాన్సర్ కణాలనే అధిక సంఖ్య లో ఉత్పత్తి చేసి క్యాన్సర్ కు కారణమవుతాయి.

స్టమక్ క్యాన్సర్ బ్యాక్టీరియా వల్ల వస్తుందా ? : ఒకటి రెండు దశాబ్దాల క్రితం వరకూ , స్టమక్ అల్సర్ లు కేవలం, కడుపులో ఉండే ఆమ్లాలు ఎక్కువ గా ఉత్పత్తి అయి ఆ ఆమ్లాలు లేదా యాసిడ్ లు కడుపు అంటే జీర్ణాశయ గోడలను తిని వేయడం వల్ల స్టమక్ అల్సర్ లు ఏర్పడతాయి అని భావించ బడుతూ ఉండేది. అందుకే అల్సర్ ఉన్న చాలా మందికి ఆపరేషన్ చేసి ,యాసిడ్ ఎక్కువ గా ఉత్పత్తి చేస్తున్న వేగస్ నాడి ని కత్తిరించే వారు. క్రమేణా , స్టమక్ అల్సర్ ఏర్పడడానికి ప్రధాన కారణం హెలికో బాక్టర్ పైలోరి అనే బ్యాక్త్రీరియం కారణమని ఒక ఆస్త్రేలియన్ వైద్యుడు కనుక్కొన్నాడు. ఆ తరువాత ఈ బ్యాక్తీరియాన్ని హతమార్చడానికి ట్రిపుల్ తిరపీ అనే మూడు రకాల యాంటీ బయాటిక్స్ ఒక వారం వాడి ఈ బ్యాక్టీరియాలను మన దేహం నుంచి సమూలం గా నిర్మూలించి తద్వారా అల్సర్ ను కూడా నయం చేస్తున్నారు వైద్యులు. తరువాత చేసిన, చేస్తున్న పరిశోధన లలో ఈ హెలికో బ్యాక్తర్ పైలోరి అనే బ్యాక్తీరియం మనకు చేస్తున్న హాని ఇంతా అంతా కాదని తెలిసింది. ప్రత్యేకించి , స్టమక్ క్యాన్సర్ రావడానికి కూడా ఈ బ్యాక్టీరియం ‘ కుట్ర ‘ పన్నుతూ ఉంటుంది.
మరి ఈ హెలికో బ్యాక్టార్ పైలోరి క్యాన్సర్ ఎట్లా కలిగిస్తుంది?: ఈ బ్యాక్టీరియాల వల్ల జీర్ణాశయ గోడలలో ఉన్న కణాలలో మార్పులు, ప్రత్యేకించి ఆ కణాల జన్యువులలో మార్పులు తీసుకు వచ్చి వాటిని క్యాన్సర్ కణాలు గా మారుస్తాయి. మనం మన వంటలలో ఉపయోగించే పసుపు కొంత వరకు మనకు స్టమక్ క్యాన్సర్ రాకుండా రక్షకం గా పనిచేస్తుంది. పసుపులో హెలికో బ్యాక్టార్ పైలోరి ను హరించే గుణం ఉందని తెలిసింది.
జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే రిస్కు ను మనం ఏవిదం గా తగ్గించుకోవచ్చు ?:
మనం తినే ఆహార పదార్ధాలను వండుకునే విధానాలలో మార్పులు తీసుకు రావడం ద్వారా మనం రిస్కు తగ్గించు కోవచ్చు. అంతే కాక స్టమక్ అల్సర్ లు కనక వస్తే అశ్రద్ధ చేయకుండా ట్రిపుల్ తిరపీ వాడి హెలికో బ్యాక్తీరియాన్ని దాని ఇన్ఫెక్షన్ నూ నిర్మూలించుకుంటే , ఆ బ్యాక్తీరియం మనకు ఎక్కువ హాని చేయకుండా , అంటే క్యాన్సర్ కారకం కాకుండా నివారించుకోవచ్చు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !