పాజిటివ్ సైకాలజీ – విశదమైన ఆశావాదం. 18.
మునుపటి టపాలో విశదమైన ఆశా వాదంలో ఆశావాదులు ( అంటే ఆప్టిమిస్ట్ లు ) , తమకు విఫలమైన సంఘటన ను ఎట్లా తాత్కాలికం గా భావిస్తారో , అదే విఫలమైన సంఘటన ను నిరాశా వాదులు ( అంటే పెసిమిస్ట్లు లు ) ఎట్లా వారి శాశ్వతమైన దురదృష్టం గా భావిస్తూ ఉంటారో తెలుసుకున్నాము కదా !
ఇప్పుడు రెండవరకం చూద్దాము . ఈ రకం లో , ఆశావాదులు అంటే ఆప్టిమిస్ట్ లు తమకు ఏదైనా అనుకోని సంఘటన సంభవిస్తే , దానిని కేవలం ఆ సంఘటనలో తమకు అనుకూలం గా పరిస్థితులు లేక పోవడం చేతనో లేదా ఆ ప్రత్యెక సంఘటనలో తాము సరిగా చర్యలు తీసుకోలేదని అనుకుంటారు. అదే పెసిమిస్ట్ లు అంటే నిరాశావాదులు తాము అనుకున్నట్టు గా ఏదైనా జరుగక పొతే , ఆ ఒక్క సంఘటనలో పొరపాటు జరిగిందని కాక , తమకు ఎప్పుడూ ఇట్లాగే జరుగుతుందనీ , తాము ఎప్పుడూ దురదృష్ట వంతులనీ అనుకుంటారు. ఉదాహరణ : రత్న ఇద్దరు పిల్లల తల్లి . చేస్తున్న ఉద్యోగాన్ని మాని పిల్లల సంరక్షణ చూసుకుంటుంది. చదువు బాగా చెపుతారని వారిని ఇంకో స్కూల్ లో చేర్పించింది కూడా. వారు కొద్దిగా వెనక పడ్డారు కొత్త స్కూల్ సిలబస్ అందుకోవడం లో. దానికి తోడు, చిన్నమ్మాయి స్కూల్ లో ఆటల్లో క్రింద పడి మోకాలు మీద గాయం చేసుకుంది. దానితో రత్న బాగా కలత చెందింది. ‘ నేను ఎప్పడూ ఇంతే, నేను మంచి తల్లిని కాను , పిల్లలిద్దరూ సరిగా చదవట్లేదు , ఇంకా గాయాలు కూడా , నా దురదృష్టం.నేను అనుకున్నవి అనుకున్నట్టుగా ఏవీ జరగవు ! అని నిరాశ గా ఆత్మ నింద చేసుకుంటుంది. ఇక్కడ రత్న తన పిల్లలు సరిగా చదవక పోయినా , లేక గాయ పడినా , అది తల్లిగా తన తప్పు అనుకోవడమే కాకుండా , తాను ‘ ఎప్పుడూ దురదృష్ట వంతురాలు’అని ఆ జరిగిన సంఘటనలను జెనరలైజ్ చేసి తనను విమర్శించుకుంటుంది. అదే స్కూల్ లో ట్రాన్స్ఫర్ మీద ఆ టౌన్ కు మారిన పుష్ప , తన ఇద్దరు పిల్లలనూ , తాను కూడా ఇంట్లో ఉండి చూసుకుంటుంది. వారు కూడా సరిగా చదవట్లేదు. అందులో రెండో వాడు దుడుకు. ఆటల్లో పడి చేయి కూడా విరిగింది. పుష్ప బాధ పడ్డది. కానీ ‘ వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకు వెళ్లి ఎక్స్ రే తీయించి బ్యాండేజ్ వేయించడం అదృష్టమే ! అందులో ఎముక లోపలే చిట్లింది, బయటకు గాయం అవలేదు , త్వరగా మానుతుంది అందువల్ల’ అని డాక్టర్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ,తన పిల్లలను ‘ శ్రద్ధగా చదువుకోండి ఈ సారి ఇంకా బాగా మంచి మార్కులు రావాలి అని ప్రోత్సహిస్తూ వారిని చూసుకుంటుంది. ఈ విషయాలలో పుష్ప తనను నిందించుకోవడం లేదు. తాను తల్లి గా బాధ పడుతున్నా , తనను నిందించుకోవడం కానీ , లేదా తనకు ఎప్పుడూ అదృష్టం బాగోదని అనుకోవట్లేదు.
డాక్టర్ రీవిచ్ ఈ మనస్తత్వాన్ని ‘ ఎవ్రీథింగ్ అండ్ నాట్ ఎవ్రీతింగ్ ‘ ( every thing and not every thing ) గా వర్ణించారు. అంటే నిరాశావాదులు తమ కు జరిగిన అనుకోని సంఘటనను, తమకు ‘ ప్రతిదీ ‘ అట్లాగే జరుగుతుందని పెసిమిస్టిక్ గా ఆలోచించుతారు. అదే ఆప్టిమిస్ట్ లు అంటే ఆశావాదులు తమకు ఒక సంఘటన తాము అనుకున్నట్టుగా జరగక పొతే ‘ ప్రతి విషయమూ అట్లా జరగదు ‘ అప్పుడు పరిస్థితులు బాగో లేవు లేదా ఆ సంఘటనలో తాము ఇంకో విధం గా చేసి ఉండాల్సింది ‘ అని అనుకుంటారు. అంటే వారి ఆలోచనా ధోరణి నాట్ ఎవ్రీతింగ్ ‘ అనుకునే విధం గా ఉంటుంది.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాం !