ACS లో ఏమి జరుగుతుంది ?.9.:
క్రితం టపాలో చూశాము కదా ! మనం అసలు ACS గురించి ఎందుకు తెలుసుకోవాలో !
ఇప్పుడు ACS లో ఏ ఏ మార్పులు జరుగుతాయో చూద్దాము. మీరు ఈ విషయాలు ఉత్సాహం తో తెలుసుకుంటున్న కొద్దీ మీకు మీ ఆరోగ్యం పైన శ్రద్ధ పెరుగుతున్నట్టే కదా !

మనం పైన ఉన్న పటం సహాయం తో ఈ మార్పులను గమనించ వచ్చు.
ఇప్పటి వరకూ మనం రక్త నాళాన్ని కేవలం ఒక గొట్టం లేక పైపు గానే అనుకుంటున్నాము కదా ! ఎందుకంటే మనం పైపు అనగానే మనకు నిత్య జీవితం లో మనం చూసే పైపు లేక పంపు స్పురణకు వస్తుంది. అలాంటి పైపు ఒకే ఒక లోహం తో చేయబడి ఉంటుంది. పైపును బట్టి దాని మందం మారుతుంది. కానీ మన దేహం లో ఉండే రక్త నాళాలు మూడు పొరలు గా నిర్మితం అయి ఉంటాయి.
ఈ పటం లో మొదటి ఎర్రటి వలయం ఒక కరోనరీ ధమని చిత్రం అంటే గుండెకు రక్త సరఫరా చేసే రక్త నాళం అని మనం తెలుసుకున్నాము కదా!
ఇందు లోని మూడు పొరలనూ చూడండి. బయటి పొరను అడ్వెంటి షియా పొర ( adventitia )అని అంటారు. ఇక మధ్య పొరను మీడియా ( media ) అంటారు. ఇక లోపలి పొరను ఇంటిమా ( intima ) అని పిలుస్తారు. ఈ లోపలి పొరలో ప్లేక్ ఫార్మేషన్ అటే కొవ్వు చేరుకుంటుంది. ఎందుకంటే ఈ లోపలి పొర కే కదా రక్తం నేరుగా తగిలేది. ఒక ఉదాహరణ ఊహించుకోండి. మనకు నీరు సరఫరా చేసే పంపు లలో నీరు లోపలి నుండే ప్రవహిస్తుంది కదా ! అట్లాగే రక్తనాళం అంటే ఇక్కడ కరోనరీ ధమని లో కూడా రక్తం ఇంటిమా కు ఆనుకునే ప్రవహిస్తుంది కదా !
అందుకనే, మనం తినే ఆహారం లో ఉన్న కొవ్వు , మన కడుపు లో జీర్ణమై ,చిన్న ప్రేగు లో నుంచి కైలోమైక్రానుల రూపం లో రక్తం లో కలుస్తుంది. ఇలా కైలో మైక్రానుల రూపం లోని కొవ్వు లో ఉండే చెడు కొవ్వు అంటే హాని కలిగించే LDL కొవ్వు , ఇలా ఇంటిమాకు అతుక్కొని ప్లేక్ ఏర్పడుతుంది. మనకు అర్ధమవడం కోసం ఈ మొదటి చిత్రం అంటే ధమని మధ్య లో తెల్లగా ఖాళీ గా చూపించారు. కానీ మన దేహం లో ఏ రక్త నాళమూ ఖాళీ గా రక్తం లేకుండా ఉండదు కదా ! ఇలా నార్మల్ గా అంటే సహజం గా ఉండే ధమని లో ప్లేక్ ఏర్పడి నప్పుడు ఎట్లా ఉంటుందో రెండో చిత్రం లో చూడండి. ఇలా చాలా కాలం తరువాత జరుగుతుంది. అంటే కొన్ని ఏళ్ళు పట్ట వచ్చు. రిస్కు ఫాక్తర్లు ఎన్ని ఎక్కువ అయి , అవి ఎంత తీవ్రత గా ఉంటే , అంత త్వర గానూ ఈ ప్లేక్ లేక చెడు కొవ్వు పెరుకోవడం జరుగుతుంది. ఈ రెండో చిత్రం లో చంద్రాకారం లో మొదట ఉన్న ధమని వ్యాసం కాస్తా అర్ధ చంద్రాకారం అయింది కదా ! అంటే ఆ ధమని లో సరఫరా అవుతున్న రక్తం లో మామూలు కన్నా సగం మాత్రమె ప్రవహిస్తున్నట్టే కదా ! ఇక్కడ గమనించ వలసినది ఈ రెండవ ధమని పూర్తిగా మూసుకు పోలేదని. ఈ పరిస్థితి ని ఫిక్సడ్ కరోనరీ అబ్స్త్రక్షన్ ( fixed coronary obstruction ) అంటారు. ఇలా జరగటం వల్ల గుండె ఆ ధమని చుట్టూ ఉన్న గుండె కండరాలకు సగం మాత్రమె రక్తం సరఫరా అయి, అది మనకు యాంజైనా లేక angina రూపం లో నూ, లక్షణాల తోనూ బయట పడుతుంది.
వచ్చే టపాలో మిగతా మార్పులు కూడా ఇదే పటం తో తెలుసుకుందాము !