పాజిటివ్ సైకాలజీ – మైండ్ ఫుల్ నెస్ ( mindfulness ) తో అధికానందం పొందడం ఎట్లా?. 7.
మనం క్రితం టపాలలో సేవరింగ్ ఆస్వాదన ద్వారా మన నిత్య జీవితాలలో అధికానందం పొందడం ఎలాగో అందుకు అయిదు కిటుకులు కూడా వివరం గా తెలుసుకున్నాము కదా !
ఇప్పుడు , ఆస్వాదన కాకుండా ఇంకో రెండు కిటుకులు ఉన్నాయి. అందులో ఒకటి మైండ్ ఫుల్ నెస్ అంటే మనసు లగ్నం చేయటం ( లగ్నం అంటే పెళ్లి అనుకోకండి ఇక్కడ, బహుశా ఈ పదం ఒకదానితో ఇంకోదానిని సంధానం చేయడం అనే అర్ధం లో వాడడం జరుగుతుంది. అంటే పెళ్ళిలో ఇరువురి మధ్య బంధాన్ని కూడా అందుకనే లగ్నం అంటారేమో ! నా అభిప్రాయం లో పొరపాటు ఉంటే, తెలియ చేయండి ! ).
మనం చాలా పనులు చేసేటప్పుడు , మనసు కేంద్రీకరించాకుండానే చేయగలుగుతాము. ఉదాహరణకు ,సైకిల్ కానీ స్కూటర్ కానీ, లేక కారు కానీ నడుపుతున్నప్పుడు మన మెదడు అప్రయత్నం గా ఆ క్రియలు చేయడానికి అలవాటు పడుతుది. అంటే ఆ సమయాలలో మనం సంగీతం వినడం కానీ , ఎవరితోనైనా సెల్ ఫోన్ లో మాట్లాడడం గానీ చేస్తుంటాము. ఇలా ఎట్లా సాధ్యం అవుతుందంటే, మన మెదడు లో మనం చేసే పని అంతకు ముందే అంటే మనం నేర్చుకున్నప్పుడే ‘ ప్రోసీజరల్ మెమరీ ‘ ( procedural memory ) గా నిక్షిప్తమయి ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండడం వల్ల కొన్ని ప్రయోజనాలతో పాటు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి.
ఈ ఉదాహరణ చూడండి : కుటుంబ రావు తన కుటుంబం తో సహా విహార యాత్రకు వెళ్ళాడు, ఇంకో సిటీకి. పిల్లలు ఆనందం తో కేరింతలు వేస్తున్నారు, సరదా గా. టాక్సీ లలో ఎక్కుతున్నారు, బస్సు కోసం వేచి ఉండడం ఎందుకని. వెళ్ళిన చోటల్లా స్టార్ హోటళ్ళలో పల హారాలూ , భోజనాలూ. షాపింగ్ కూడా సరదాగా చేస్తున్నారు. ఇష్టమైనవి కొనుక్కుంటున్నారు. భార్య , పిల్లల ఆనందం చూస్తూ , కుటుంబరావు కూడా సంతోష పడుతున్నాడు ఒక రకంగా , అంటే తన కుటుంబాన్ని ఇంత ఆనందం గా చూస్తూ ! కానీ తానూ సంపూర్ణం గా ఆనందించ లేక పోతున్నాడు. ఎందుకో ఊహించ గలరా ? కష్ట పడి పని చేసే స్వభావం కుటుంబరావుది. అతనికి తన జీతం కాక వేరే ‘ గీతం ‘ లేదు. అంటే ‘ పై సంపాదన ‘! . అందువల్ల కుటుంబరావు మైండ్ ఫుల్ నెస్ గా ఉన్నాడు, ఇంకో విషయం మీద , అంటే తాను భౌతికం గా నే తన కుటుంబం తో ఉన్నాడు. యాంత్రికం గా వారితో తింటున్నాడు , తిరుగుతున్నాడు , కానీ తన మనసు ఇంకో విషయం మీద పరి పరి విధాలుగా పోతుంది. కుటుంబరావు మనసు, ‘ అతని జేబు ను పదే పదే తడుముతూ ఉంది ‘, ( అవుతున్న ఖర్చుల మీద మనసు లగ్నం చేస్తూ , తానుగా ఎక్కువ గా ఆనందించ లేక పోతున్నాడు ) ( అంటే ఆ సందర్భాలలో , కుటుంబరావు ‘ సగం హృదయం తో ‘ అంటే హాఫ్ హార్టెడ్ గా ఉన్నాడు ! )
ఇక్కడ కుటుంబరావు కూడా అధికానందం పొందాలంటే ఒకటే మార్గం. తాను కూడా తన కుటుంబం తో పూర్తి గా మనసు కూడా లగ్నం చేసి ఆ విహార యాత్రను ఆస్వాదించడం, అధికానందం పొందడం.
అవసరమయితే ( ఇక్కడ అవసరం అనుకుంటాను ) ఉన్న ఊళ్లోనే ఒక చోటికి కుటుంబం తో వెళ్లి ఆనందించ వచ్చు. అప్పుడు మైండ్ ఫుల్ నెస్ ,అంటే మనసు పూర్తిగా లగ్నం చేయడానికి వీలవుతుంది కదా !
వర్తమానం లో మనసు లగ్నం చేయడానికి మెడిటేషన్ అంటే ధ్యానం ఉపయోగ పడుతుంది. అలా మనం , మనసా, వాచా , కర్మణ్యే, అన్న విధం గా వర్తమానం లో సమయాన్ని, క్షణాలనూ ఆస్వాదించడం అలవాటు చేసుకుంటే, అధికానందం పొంద గలగ టానికి వీలవుతుంది.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !