Our Health

Archive for మే 15th, 2012|Daily archive page

యాంజియో ప్లాస్టీ లో స్టెంట్ వేయడం అంటే ఏమిటి ?.33.

In Our Health on మే 15, 2012 at 9:03 సా.

యాంజియో ప్లాస్టీ లో స్టెంట్ వేయడం అంటే ఏమిటి ?.33.

మనం క్రితం టపాలో చూశాము , గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనుల పూడికను ఒక క్యాతెటార్ ద్వారా  చిన్న బెలూన్ ను ధమని లోకి ప్రవేశ పెట్టి  ఆ బెలూన్ ను  లాగుతూ ఆ పూడికను లేక ప్లేక్ ను అక్కడనుంచి తీసి వేయడం.
అట్లా ధమనిలో ఏర్పడ్డ  పూడికను అంటే పార్షి యల్  బ్లాక్ ను తీసివేసిన తరువాత , ఆ ధమని  మళ్ళీ రక్త సరఫరా ను మామూలు గా గుండె కండరాలకు సరఫరా చేస్తుంది. కానీ  కొన్ని పరిస్థితులలో  ఆ ధమని మళ్ళీ పూడుకు పోవడం కూడా జరుగుతుంటుంది. 
ఇలా మళ్ళీ  కరోనరీ ధమనులు పూడుకు పోకుండా  ఒక స్టెంట్ ను ప్రవేశ పెడతారు. ఈ స్టెంట్ సాధారణం గా ఒక సున్నితమైన లోహం తో చేసిన జాలీ  లాగా ఉంటుంది. కానీ ఈ జాలీ లేక వల లాగా ఉన్న  స్టెంట్  ఒక గొట్టం ఆకారం లో ఉంటుంది.  అతి సున్నితం గా ఈ స్టెంట్ , లోహం పోగులతో చేసిన వల లా ఉన్నప్పటికీ , చాలా గట్టిగా ఉండి అది ఉన్న ప్రదేశం లో ధమని ని కొలాప్స్  అవకుండా అంటే ముడుచుకు పోనీకుండా  ఉంచుతుంది. అలా ఉంచడం వల్ల రక్త ప్రసరణ సరిగా అందుతుంది , ఆ ధమని ద్వారా ! 
పైన ఉన్న మొదటి పటం చూడండి అందులో క్యాతెటార్  ద్వారా ప్రవేశ పెట్టిన బెలూన్ ఇంకా  స్టెంట్, మొదట ముడుచుకు పోయి ఉంటాయి. పాక్షికం గా పూడుకుపోయిన కరోనరీ ధమని లో ప్రవేశించిన తరువాత , బెలూన్ ను పెద్దగా చేసి దాని ద్వారా అక్కడ ఉన్న పూడిక అంటే ప్లేక్ ను పెకిలించుతారు. అలా పెకిలించిన తరువాత బెలూన్ తో పాటు ప్రవేశ పెట్ట బడిన స్టెంట్ ( అప్పటి వరకూ ముడుచుకు పోయి ఉంటుంది ) అప్పుడు తెరుచుకుని  ఆ ధమని ని మళ్ళీ పూడుకు పోకుండా, ముడుచుకు పోకుండా   ఉంచుతుంది. 
 
ఇక రెండో పటం లో ఒక వేలు మీద ఉంచిన  రెండు స్టెంట్ లను చూడండి వాటి నిజమైన పరిమాణం ఎంతో అవగాహన ఏర్పడడానికి ( అవి సాధారణం గా కరోనరీ ధమని ఎంత వ్యాసం తో ఉంటాయో తెలియ చేస్తున్నాయి కదా ! ) 
 
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు చూద్దాము ! 

యాంజియో ప్లాస్టీ కధ ఏమిటి ?.32.

In Our Health on మే 15, 2012 at 7:39 సా.

యాంజియో ప్లాస్టీ  కధ ఏమిటి ?.32.

మనకందరికీ తెలుసు , సాధారణం గా  యాంజైనా  అంటే గుండె నొప్పి వచ్చిన వాళ్లకు  యాంజియో ప్లాస్టీ అనే   ప్రొసీజర్ చేస్తారని.
కానీ దాని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము.మనం మునుపటి టపాలలో తెలుసుకున్నాము కదా యాంజైనా అంటే గుండె నొప్పి రావడం గుండెకు సరఫరా చేసే రక్త నాళాలు ( అంటే కరోనరీ ధమనులు )  పాక్షికం గా  కొవ్వు చేరి పాక్షికం గా పూడుకు పోవడం వల్ల, గుండె కండరాలకు ఆక్సిజెన్ సరిగా అందక , గుండె నొప్పి వస్తుందని.
మరి కేవలం మందులతోనే ఈ పూడిక తెరుచుకోదు కదా ! అందు వల్ల అప్పుడు యాంజియో ప్లాస్టీ  అనే ప్రొసీజర్  చేస్తారు.
ఈ పద్ధతిని మొదట  కనుక్కోన్నది ,  అమెరికా డాక్టరూ , రేడియాలజీ స్పెష లిస్టూ అయిన  చార్లెస్ డాటర్.    ( Dr.Charles Dotter ). ఇది 1964 లో జరిగింది.  Dr.డాటర్  ఒక 82 సంవత్సరాల  స్త్రీ కి  తొడ భాగం లో ఉన్న ధమని ( అంటే ఫీమోరల్ ఆర్టరీ ) పూడుకు పోయి , ఆమె తన కాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది.  ఆ స్త్రీ కాలు తీసివేయడానికి ఒప్పుకోలేదు. అప్పుడు డాక్టర్ డాటర్ ఒక ప్రయత్నం గా , ఎక్స్ రే సహాయం తో చూసుకుంటూ , ఒక  క్యాతెటార్ ద్వారా ( అంటే catheter ) ఒక బెలూన్ ను  ఫీమోరల్ ధమని లోకి ప్రవేశ పెట్టాడు . తరువాత , ఆ బెలూన్ ను కొంత పీడనం తో నింపి , ఆ బెలూను ను క్రిందకూ పైకీ ,  పూడిక ఉన్న ధమని లో లాగటం వల్ల , ఆ పూడిక పోయింది.  ఆ స్త్రీ కాలిలో రక్త ప్రసరణ తిరిగి వచ్చి ,  కాలు సవ్యం గా అయింది. ( డాక్టర్ డాటర్ కు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఈ  విజయానికి )
కానీ మానవుల గుండె కు ఈ యాంజియో ప్లాస్టీ మొట్ట మొదటి సారి చేసినది జర్మన్ డాక్టర్  గ్రుంజిగ్ ( Andreas Gruentzig ) September 1977 లో.
పైన ఉన్న పటం లో గమనించండి, గుండె కు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమని లో  ముందుగా ఎలా క్యా తెటార్ ను ప్రవేశ పెట్టి , దానితో ఉన్న బెలూన్ ను  నింపి  , ఆ బెలూన్ ను క్రిందకూ మీదకూ కదల్చడం వల్ల  ప్లేక్ అంటే  చెడు కొవ్వు తో  ధమని గోడలలో ఏర్పడిన పెచ్చు  ఊడి పోతుంది. దానితో  ఆ కరోనరీ ధమని మామూలు గా గుండె కు రక్త సరఫరా చేయగలుగుతుంది. అంటే రక్తం తో పాటు ఆక్సిజెన్ కూడా గుండె కండరాలకు అంది, గుండె నొప్పి   తగ్గి పోతుంది. 
యాంజియో ప్లాస్టీ అంటే రక్త నాళాన్ని రిపేరు చేయడం.  ఈ పద్ధతిని  మన దేహం లో ఎక్కడ ఉపయోగిస్తే, ఆ రక్త నాళం పేరు తో దానిని పిలుస్తారు.
ఉదాహరణకు :
కరోనరీ యాంజియో ప్లాస్టీ ( Coronary angioplasty ) : గుండె ధమనుల రిపేరు.
కేరాటిడ్ యాంజియోప్లాస్టీ ( Carotid angioplasty ) : మెడలో ఉండే ప్రముఖ ధమని ని కేరాటిడ్ ధమని అంటారు. ఇందులో పూడిక వస్తే మెదడు కు రక్త సరఫరా సరిగా అందక  పక్షవాతం లేక స్ట్రోక్  రావచ్చు, అందువల్ల ఇక్కడ కూడా ధమనిని రిపేరు చేస్తారు.
రీనల్ యాంజియోప్లాస్టీ  ( Renal angioplasty ) : అంటే మూత్ర పిండాలకు సరఫరా చేసే ధమని ని రిపేరు చేయడం. ఇలా చేయక పొతే , పూడిక మూత్ర పిండాలకు రక్త సరఫరా అందక , కిడ్నీ ఫెయిల్యూర్ అవవచ్చు.
మనం గుర్తు ఉంచుకోవలసినది ,  ఈ పూడికలు ఎక్కడ ఏర్పడినా ,  అందుకు  ప్రధాన విలన్  పేరు ‘  LDL కొలెస్టరాల్ ‘ ( లేక ప్లేక్ ) !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ! 
%d bloggers like this: