లో బీ పీ కారణాలు ఏమిటి ?.15.
మనం హై బీపీ కి కారణాలూ లక్షణాలూ తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు లో బీ పీ అంటే అల్ప రక్త పీడనం, దీనినే హైపో టెన్షన్ ( hypotension ) అంటారు. గురించి కూడా తెలుసుకుందాము.
హై బీ పీ లానే అల్ప రక్త పీడనాన్ని కూడా సిస్టోలిక్ ఇంకా డయా స్టోలిక్ రక్త పీడనం లాగా చెపుతారు.
సాధారణం గా 90/60 mm Hg. కన్నా తక్కువ వుంటే అప్పుడు , అల్ప రక్త పీడనం లేదా లో బీ పీ అంటారు.
మంచి ఆరోగ్య వంతులైన యువతీ యువకులకు 115/75 mm Hg రక్త పీడనం ఉండ వచ్చు. ఇట్లా ఉన్నప్పుడు , కేవలం సిస్టోలిక్ కానీ డయా స్టోలిక్ కానీ 20 mm Hg. కన్నా తగ్గినా వారు లో బీపీ లక్షణాలు చూపిస్తారు.
లో బీపీ ఉంటే ఏమవుతుంది ? :
లో బీ పీ వల్ల మన శరీరం లో ని వివిధ భాగాలకు అందవలసినంత ఆక్సిజెన్ అంటే ప్రాణ వాయువు అందదు. దాని వల్ల తల తిప్పటము, వికారం గా అవటము, కళ్ళు తిరిగినట్టయి క్రిందకు వాలిపోవడమో , లేక క్రింద పడిపోవడమో జరగవచ్చు. దీనినే ఫెయింటింగ్ లేక fainting అంటారు. ఈ లక్షణము సాధారణంగా యుక్త వయసులో ఉన్న యువతులలో చూస్తుంటాము. వారు సాధారణంగా అతి నాజూకు గా ఉండి ఆహారం కూడా చాలా మితం గా తీసుకుని, ఉదయం సరిగా తినక, కాలేజీ కి వచ్చి , అతి ప్రయాస పడటం వల్ల ఇలాంటి లక్షణాలు కనపడ వచ్చు. అలాగే , ఋతుస్రావం ఎక్కువగా అయినా, ఆహారం అశ్రద్ధ చేసి కాలేజీలకూ, వారి కార్యాలయాలకూ , వచ్చి కష్ట పడటం వల్ల కూడా , ఈ ఫెయింటింగ్ జరగవచ్చు.
లో బీ పీ కి ఇంకో అతి సామాన్య కారణం : అతి సారం. అంటే డయేరియా. మన భారత దేశం లో అన్ని వయసుల వారినీ ఈ అతి సారం ( అంటే సాధారణం గా బాక్టేరియా లేక వైరస్, లేక ఫుడ్ పాయిజానింగ్ వల్ల ) ప్రాణాంతకం అవుతుంది. ఈ అతిసార వ్యాధి ప్రబలినప్పుడు, మన శరీరం లోని ద్రవం, లవణాలు, ఎక్కువ పరిమాణం లో అతి తక్కువ సమయం లో పోయి బీ పీ చాలా పడి పోయి , అతి ప్రమాదకరం గా మారుతుంది.
పైన ఉన్న పటంలో లో బీ పీ కి వివిధ కారణాలు చూడండి.
ఇందులో గుండె కు సంబంధించిన కారణాలలో గుండె సరిగా కొట్టుకోక పోవడమూ , లేక గుండె కవాటాలు ఏ కారణం చేతనైనా సరిగా పనిచేయక పోయినప్పుడు కానీ , లేక రక్తం పరిమాణం అకస్మాత్తుగా తగ్గి పోవడం ( అంటే ప్రమాదాలలో రక్త స్రావం అవడం, లేక అతిసార వ్యాధికి ఫ్లూయిడ్స్ తగ్గి పోవడం అంటే బ్లడ్ వాల్యూం తగ్గి పోవడం , ( అంటే డీ హైడ్రేషన్ జరగడం )లాంటి కారణాలున్నాయి.
కొన్ని సమయాలలో సెప్సిస్ ( sepsis ) జరిగినప్పుడు ( అంటే మన శరీరం లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల , విష పదార్ధాలు విడుదల అయి లో బీ పీ కలిగిస్తాయి ) అంటే అప్పుడు రక్త పరిమాణం తగినంత ఉన్నప్పటికీ ఇన్ఫెక్షన్ వల్ల జనించిన వివిధ విష పదార్ధాలు , వీటినే టాక్సిన్లు ( toxins ) అంటారు , అవి మన శరీరం లో ఉన్న రక్త నాళాలను తీవ్రం గా వ్యాకో చింప చేస్తాయి. దానితో లో బీ పీ ఏర్పడుతుంది. దీనినే సెప్టిక్ షాక్
( septic shock ) అని అంటారు.
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము.
మీ స్నేహితులకు www.baagu.net గురించి తెలియ చేస్తున్నారు కదూ !