Our Health

Archive for ఏప్రిల్, 2012|Monthly archive page

ఒబీసిటీ అంటే అధిక బరువు తో , గుండె జబ్బులు కూడా ఎట్లా వస్తాయి ?.7.

In Our Health on ఏప్రిల్ 29, 2012 at 1:57 సా.

ఒబీసిటీ అంటే అధిక బరువు తో , గుండె  జబ్బులు కూడా ఎట్లా వస్తాయి ? 

( పై చిత్రం వివరణ : ఇక్కడ మనకు లోపల జరుగుతున్న మార్పులను అర్ధం చేసుకోవడానికి ఒక రక్త నాళాన్ని కోసినట్టు చూపించారు. అందులో క్రింది భాగం లో కుడి వైపున మీరు చూస్తున్నది. పొరలు గా ఉన్న రక్త నాళం లో ఒక పొరను చీల్చుకు పోయిన చెడు అంటే హాని కలిగించే  కొలెస్టరాల్ ( దీనినే LDL Cholesterol అంటారు ) పేరుకు పోతుంది. ఈ క్రియను  ప్లేక్ ఫార్మేషన్ ( Plaque formation ) అంటారు, ఇట్లా ప్లేక్ (  లేక ‘ పాచి ‘ అనవచ్చునేమో తెలుగులో)ఏర్పడితే  ఆ ప్రదేశం నుంచి మన రక్తం లో ఉన్న రక్షక కణాలు అన్నీ చేరి దానిని తొలగించడానికి తీవ్రం గా ప్రయత్నిస్తాయి.  దీనివల్ల కొన్ని రక కణాల సముదాయం అంటే గుంపు గా ఏర్పడి  క్లాట్ ఫార్మేషన్ కు దారి తీస్తుంది ( clot formation ) ఇలా  రక్తము ‘ గడ్డ ‘ కట్టడము, ‘ పాచి ‘ లేక ప్లాక్ ఏర్పడటమూ కలిసి   హార్ట్ ఎటాక్ , లేక ‘  గుండె పోటు’ కు కారణమవుతాయి. )

పై విషయం విపులం గా తెలుసుకునే ముందు, ఏ పరిస్థితిని ఒబీసిటీ, లేక ఊబ కాయం అంటారో , ఏ పరిస్థితిని , అధిక బరువు అంటారో మనం తెలుసుకోవాలి.
శాస్త్రజ్ఞులు BMI  Body Mass Index లేక  బాడీ మాస్ ఇండెక్స్ అని ఒక  ఫార్మ్యులా తో  మనం  అధిక బరువు కలిగి ఉన్నామో లేదో కనుక్కుంటారు.
ఇది క్లుప్తం గా మన బరువును కిలో గ్రాములలో వేసి దానిని మన ఎత్తు ( మీటర్లలో )తో భాగ హారం చేస్తే వచ్చే ఫలితాన్ని చూసి  తెలియ చేస్తారు.
మరి  మామూలు గా  ఎంత BMI ఉండాలి ?:
18.5 కంటే తక్కువ ఉంటే అది  అల్ప బరువు లేక బిలో నార్మల్ వెయిట్  అంటారు. ( ఈ పరిస్థితి సర్వ సాధారణం గా  మోడల్స్  లో కనిపిస్తుంది కదా ! ) 
18.5 నుంచి  25 మధ్య ఉంటే అది నార్మల్ బరువు క్రింద లెక్క.
25  నుంచి 29.9 మధ్య ఉంటే అది అధిక బరువు.
30 మించి ఉంటే   ఆ పరిస్థితి  ఊబకాయం లేక ఒబీసిటీ  అవుతుంది. 
ఇంకో పధ్ధతి ద్వారా కూడా మన  బరువు అధికమో లేదో చెప్ప వచ్చు. అది నడుము చుట్టూ కొలత ( లేక waist circumference ‘ వెఇస్ట్ సర్కంఫరెంస్ ‘ ) అది ముప్పై అయిదు అంగుళాలకు మించి స్త్రీలలోనూ , నలభై అంగుళాలకు మించి పురుషుల్లోనూ ఉంటే , అది అధిక బరువు క్రింద లెక్క.
మనం ఈ అధిక బరువునూ , ఊబ కాయాన్నీ ఎందుకు పట్టించుకోవాలి ?: 
ఇప్పుడు ఈ క్రింద వేసిన అంకెల వారీ పరిణామాలు చూడండి. ఈ పరిణామాలు ఒక క్రమ పధ్ధతి లో పొందు పరచ బడ్డాయి.  అంటే మొదట ఉన్నవి, తరువాతి పరిణామాలకు కారణ మావుతాయన్న మాట ! 
1. రక్తం లో చెడు కొవ్వు లేక కొలెస్టరాల్ ఎక్కువ గా చేరుకుంటుంది.  దానితో ఆ కొలెస్టరాల్  రక్తనాళాల  లోపలి భాగాలలో మందం గా ఒక పోర లాగా ఏర్పడుతుంది.  
2. దాని వల్ల   అధిక రక్త పీడనం అంటే హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది.
3. గుండె కు సరఫరా చేసే రక్త నాళాలు అతి సూక్ష్మం గా ఉంటాయి కదా ! అవి త్వరగా పూడుకు పోయి, యాన్జైనా( angina ) కూ , హార్ట్ ఎటాక్ ( heart attack ) కూ దారి తీయ వచ్చు.  ( క్రింద ఉన్న చిత్రం లో ఈ మార్పుల వివరణ చూడండి. )
4. పైన చెప్పిన ( 1), ( 2 ) కారణాలు కలిసి  stroke లేక పక్ష వాతానికీ  కారణమవ వచ్చు. 
 ( పైన వివరించినవి అధిక బరువు గుండె , రక్త నాళాల పైన చూపే ప్రభావాలు మాత్రమే ! )
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

అతి గా సేవించే మద్యం, గుండె జబ్బును కూడా ఎట్లా త్వరితం చేస్తుంది?.6.

In Our Health on ఏప్రిల్ 29, 2012 at 10:42 ఉద.

 అతి గా సేవించే మద్యం, గుండె జబ్బును కూడా ఎట్లా త్వరితం చేస్తుంది?.6.

చాలా మంది కి తెలుసు. అతిగా సేవించే మద్యం  కాలేయాన్ని అంటే లివర్ ను ఎట్లా పనికి రాకుండా చేస్తుందో ! ఈ విషయం లో లివర్ ను ‘ త్యాగ శీలి ‘ గా చెప్పుకుందామా , లేక మనల్ని మోసం చేసే ఒక అవయవ భాగం గా చెప్పుకుందామా?
ఎందుకంటే, లివర్  లేక కాలేయం, అతి గా మద్యం సేవించే వారి కి ఏ విధమైన  లక్షణాలూ కనిపించ  నీయదు. ఇక్కడ గుర్తు ఉంచుకోవలసిన విషయం. అతి గా మద్యం ఎంత ఎక్కువ కాలం తాగుతుంటే, అంత  తీవ్రం గానూ , లివర్  కూడా పాడవుతూ ఉంటుంది. కానీ  లివర్  లేక కాలేయం  తన లో  అయిదు వంతులు పాడయి పోయినా  ఆ  లక్షణాలు ఏమాత్రం బయటకు జబ్బు రూపం లో కనపడ నీయదు. దానితో ‘ మందు ప్రియులు ‘ ‘ తాము ఇంకా చక్క గా , ఆరోగ్య వంతులు గా ఉన్నామని భ్రమ  పడుతూ  మద్య పానం నిరాటంకం గా చేస్తుంటారు.  ఇక  ఆరో వంతు లివర్ కూడా పాడయినప్పుడు,  లివర్  ఫెయిల్యూర్  లక్షణాలు  ప్రస్ఫుటం గా బయటకు కనిపిస్తాయి. అప్పటికి  చాలా ఆలస్యం అయి వుంటుంది. అంటే అప్పుడు , అంత గా చెడి పోయిన  లివర్ ను సరిచేయడం అసాధ్యం. అందుకే అన్నాను మొదట మనం ఈ  విషయం లో లివర్  ను  ‘ త్యాగ  శీలి ‘  అందామా లేక  ‘  మన జీవితాలను మందుకు త్యాగం చేయిస్తుంది ‘ అని అందామా అని ! 
మరి గుండె, రక్త ప్రసరణ ల పైన అతి మద్యం ప్రభావం ఏమిటి ? : 
మితి మించి  మద్యం ఎక్కువ కాలం తాగటం వల్ల  ,   మన రక్తం లో చెడు అంటే హాని కలిగించే  కొవ్వు లేక కొలెస్టరాల్ ను ఎక్కువ చేస్తుంది ( ఈ కొలెస్టరాల్ సంగతులు వివరం గా ముందు ముందు టపాలో తెలుసుకుందాము ).
అధిక రక్త పీడనం కూడా దీనితో చేరి , పక్ష వాతాలు రావడానికి  కారణ మవుతుంది. 
ఇంకో హాని నేరుగా గుండె కండరాలకు చేస్తుంది.  అతి మద్యం గుండె కండరాలను పెంచి, గుండె ను అతి గా వ్యాకోచింప చేస్తుంది. ఈ పరిస్థితిని   Dilated Cardiomyopathy  అంటారు. 
ఈ పరిస్థితి వస్తే గుండె పని చేయడం కుంటు పడుతుంది. అంటే హార్ట్ ఫెయిల్యూర్  ‘ Heart Failure ‘ అన్న మాట ! 
కొన్ని పరిశోధనల వల్ల  మితం గా మద్యం సేవిస్తే  కొన్ని  మన శరీరం లో కొన్ని లాభాలు కూడా ఉన్నాయని తేల్చారు. కానీ ప్రపంచ  ఆరోగ్య సంస్థ  కు చెందిన  ఒక   ప్రముఖ  వైద్యుడు                          ఈ  పరిశోధనల  ఫలితాలను కొట్టి పారవేశాడు. ఆయన , ప్రపంచం లో మద్యం ఉత్పత్తి,  వాడకం ఎక్కువ చేయడం కోసం, బడా కంపెనీలు ఆడుతున్న ‘ నాటకం ‘ అని చెప్పాడు. ‘ మితం గా తాగితే  లాభాలు ఉంటాయని  ప్రజలకు మద్యం తాగడాన్ని ప్రోత్సహించడం,  హాస్యాస్పదమూ , ప్రమాదకరమూ కూడా ! ‘  అని అన్నాడు. 
పైన ఉన్న పటం చూడండి. ఈ పటం లో  ఇంత వరకూ జరిగిన పరిశోధనలూ, పరిశీలనల వల్ల ,  దీర్ఘ కాలం మద్యం సేవిస్తే , మన దేహం వివిధ భాగాలలో కలిగే పరిణామాలు సూచింప బడ్డాయి.
అందులో కుడి ప్రక్క మితంగా మద్యం సేవిస్తే కలిగే లాభాలు కూడా ఆకు పచ్చ రంగు లో తెలుప బడ్డాయి.
ఇక్కడ ఒక విషయం ఎప్పుడూ గుర్తు ఉంచుకోవాలి. నూటికి తొంభై  తొమ్మిది మంది, ‘ అతి గా అంటే శరీరానికి హాని కలిగించే రీతిలో మద్యం తాగుతూ, వారు  ‘ మితం ‘ గా తాగుతున్నామని అనుకుంటారు.  అంటే వారికి వారు తమకు అనుకూలం గా  అమితం గా లేక మితం గా మద్యం తాగటాన్ని  అన్వయించుకుంటారు ! అది ముమ్మాటికీ   మద్యం హానికరమైన పరిమాణం లో తాగుతున్న నిజాన్ని ఒప్పుకోలేక పోవడమే.  ఇది మద్య పాన ప్రియులలో చాలా సాధారణం గా కనిపించే లక్షణం. దీనిని  శాస్త్రీయం గా డినైయాల్   Denial  అంటారు.
ఇక ఎడమ ప్రక్క ఎరుపు రంగు లో సూచించిన పరిణామాలు, తీవ్రమైనవీ, ప్రమాదకరమూనూ !  (   ఇక్కడ  ‘ కుడి ‘  ‘ ఎడమైతే ‘   పొరపాటు చాలా ఉంటుందోయ్ ! ‘ )  అసలు ఈ ‘ కుడి ‘ ఎడమ’ లు రెండూ పట్టించుకోకుండా,  అంటే మద్యం ‘ ముట్టుకోకుండా ‘                                                     నేరుగా జీవిత గమనం లో సాగి పోవడం ఉత్తమమంటారా ? ! మీ అభిప్రాయలు తెలపండి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

టైపు ‘ ఏ ‘ వ్యక్తిత్వం ( Type A personality ) లో గుండె జబ్బులు ఎక్కువవుతాయా ?.5.

In Our Health on ఏప్రిల్ 28, 2012 at 7:38 సా.

టైపు ‘ ఏ ‘ వ్యక్తిత్వం లో ( Type A personality ) గుండె జబ్బులు ఎక్కువవుతాయా ?.5.

మానవులను తమ వ్యక్తిత్వాలను బట్టి కొన్ని రకాలు గా మానసిక విశ్లేషకులు చెప్పుకుంటారు. అందులో టైపు ఏ  వ్యక్తిత్వం ఒకటి.
ఈ వ్యక్తిత్వం లక్షణాలు:
1. తాము  ఆశ తో అంటే  ( ambitious ) అంటే  నిరంతరం  ముందుకు ‘ ఉరకాలనే ‘ ప్రయత్నం చేస్తుంటారు.
2. వారు చేస్తున్న పని ఏదైనా వారు ఏర్పరుచుకున్న  నిబంధనలకు లోబడి చాలా మొండి గా ఆ నిబంధనలను  తు.చ. తప్పకుండా ఎప్పుడూ ఆచరిస్తుంటారు.
3.సమయ పాలన ను అన్ని వేళలలోనూ  చేస్తుంటారు. అంటే పది నిమిషాలు ఏ పని కైనా వారు ఆలస్యం అవుతే విపరీతం గా ఆందోళన చెందుతారు.
4. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయటానికి వెనుకాడరు.
5. workaholics: సాధారణం గా ఈ వ్యక్తిత్వం ఉన్న వారు ,  విజయ పధం లో ముందుకు పోతుంటున్న అచీవర్స్.
మరి ఈ టైపు ఏ వ్యక్తిత్వం ఉన్న వారికి గుండె జబ్బులు ఎక్కువ గా వచ్చే అవకాశం ఉందా? : 
సుమారు యాభయి ఏళ్ళ క్రితం ఈ వ్యక్తిత్వం ఉన్నవారి పైన పరిశోధనలూ , పరిశీలనలూ జరిగి, వీరికి గుండె జబ్బులు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. కానీ ఇటీవల జరిపిన అనేక పరిశోధనలలో, ఈ టైపు ఏ వ్యక్తిత్వానికీ, త్వరగా గుండె జబ్బులు రావటానికీ, స్పష్టమైన సంబంధం లేదని  నిర్ణయించడం జరిగింది. అంటే, ఈ అభిప్రాయాన్ని చాలా జాగ్రత్త గా అర్ధం చేసుకోవాలి.  కేవలం ఈ వ్యక్తిత్వం ఉండగానే గుండె జబ్బులు ఎక్కువ గా రావని.
కానీ ఈ వ్యక్తిత్వం ఉన్న వారు మిగతా గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఫాక్టర్లు కలిగి ఉంటే మాత్రం, వారికి గుండె జబ్బులు ఎక్కువ అవుతాయని. 
మానసిక వత్తిడి అంటే stress అనేది మానవ పరిణామ దృష్ట్యా   ఒక  ప్రతిక్రియ అంటే ‘ response’. క్రిందటి టపాలో ఉన్న పటం మళ్ళీ చూడండి. ఈ ప్రతి క్రియ లో మన దేహం లో అనేక రకాలయిన జీవ రసాయనాలు విడుదల అయి, అవి మన దేహం లోని అనేక భాగాల మీద వివిధ రకాలు గా పని చేస్తాయి ఇప్పుడు పైన ఉన్న పటం కూడా చూసి, రెండు పటాలూ పోల్చి చూడండి . దీనికంతటికీ మూల కారణం, మానవులను, తమకు ప్రతి కూల పరిస్థితులు ఏర్పడ్డప్పుడు  వారిని సమాయత్తం చేయడానికే. అందుకే  ఈ పరిణామాల నన్నిటినీ  Fight or flight response , ‘ ఫైట్ లేక ఫ్లయిట్ రెస్పాన్స్’ లేక ‘ పోరు  లేక పరుగు  ప్రతిక్రియ’  అంటారు. అంటే ఇలా ప్రతి కూల పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మనలో కలిగే వివిధ మార్పులు మనలను, ఆ ప్రతి కూల పరిస్థితులను ఎదుర్కొని పొరాడ డానికైనా , లేక ‘ తోక ముడిచి ‘ పారి పోడానికినా , సిద్ధ పరుస్తాయన్న మాట ! 
ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. ఈ పరుగు లేక పోరు ప్రతిక్రియ సాధారణం గా స్వల్ప కాలమే ఉంటుంది. 
కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి ?:  
నవీన  నాగరికత లో  మానవులకు  ‘ ఈ పరుగు లేక పోరు  ప్రతి క్రియ ‘ స్వల్ప కాలం కాక , నిరంతరం అయింది.  అయింది అనడం కన్నా మనం చేసుకుంటున్నాము అని అంటే స్పష్టం గా ఉంటుందేమో ! కారణాలు ఏమయినప్పటికీ , ఈ పరిస్థితి ( అంటే, స్వల్ప కాలం కాక , నిరంతరం పోరు లేక పరుగు ప్రతి క్రియ  ) అనేక విపరీత పరిణామాలకు దారి తీసి ఆ ప్రభావాన్ని మన ఆరోగ్యం పైన కూడా చూపిస్తుంది. మన గుండె, రక్త ప్రసరణ లో జరిగే మార్పులు మొత్తం మార్పులలో కొన్ని మాత్రమే అని పైన ఉన్న పటం చూస్తే తెలుస్తుంది కదా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ! 

Stress, అంటే మానసిక వత్తిడి తో గుండె జబ్బులు ఎట్లా వస్తాయి?.4.

In Our Health on ఏప్రిల్ 28, 2012 at 1:37 సా.

Stress, అంటే మానసిక వత్తిడి తో గుండె జబ్బులు ఎట్లా వస్తాయి?.4.

గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ కాలం నుంచి మన  మనో భావాలకు కేంద్రకం మన హృదయం లేక గుండె అని భావించ బడేది. మన పురాతన హిందూ గ్రంధాలలో కూడా అలాగే గుండె కు మన ఎమోషన్స్  అంటే భావోద్వేగాలకు  సంబంధం ఉందని వ్రాయ బడ్డది.
రోమన్   తత్వవేత్త  సెల్సస్ కూడా మనం తీవ్రం గా భయ పడినప్పుడు కానీ , మనకు విపరీతం గా కోపం వచ్చి నప్పుడు కానీ, లేక ఏ ఇతర ఏవిధమైన భావోద్వేగాలకు లోనైనా, వాటి పరిణామాలు మన నాడి లేక పల్స్
( pulse ) ను ఉత్తేజ పరుస్తాయని మొదటి సారిగా  ప్రపంచానికి తెలియ చేశాడు.
మానవులలో రక్త ప్రసరణ గురించి పరిశోధనలు మొదట గా చేసిన విలియం హార్వే  1628 A.D. లో ఇలా వ్రాశాడు.
మానవుల మస్తిష్కాలలో  ఉద్భవించే ప్రతి భావోద్వేగమూ ,  అది క్రోధం కానీ, భయం కానీ, బాధ కానీ, సంతోషం కానీ , ఆశ కానీ – వారి గుండె కు అంటే హృదయానికి , ఒక విధమైన ఆందోళన లేక యాజి టేషన్ ( agitation ) రూపం లో పాకుతుంది ‘ 
జాన్ హంటర్ అని ఇంకో శాస్త్ర వేత్త కు యాన్జైనా  ( angina ) ఉండేది. ఈ విషయం కనీసం రెండు వందల ఏళ్ళ క్రితం మాట. తన ఆరోగ్యం గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నాడు ‘ నా ఆరోగ్యం  నన్ను కోపం విసిగించి , హేళన చేసే ఎవరో ఒక  వెధవ  చేతిలో ఉంది ‘ 
ఇలా అన్న కొన్ని ఏళ్లకు  నిజంగానే  తన సహచరుడి తో ఒక సందర్భం లో తీవ్ర వాగ్వివాదానికి దిగి , తీవ్ర మైన గుండె పోటు వచ్చి మరణించాడు.
క్యారెక్టర్ యాక్టర్ గా పేరుపొందిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఒక సారి ఇలా అన్నారు. ‘ గత నలభై సంవత్సరాల నుండి నేను సినిమాలలో ‘ చస్తూ ‘ బతుకుతున్నా ! ‘  ( ఆయన తండ్రి పాత్రలలో , ప్రత్యేకించి అమ్మాయి లకు తండ్రిగా అత్భుతం గా నటించే వారు. అలాగే తీవ్ర మైన భావోద్వేగానికి లోనైనట్టూ ,  గుండె పోటు ను అనుభ విస్తున్నట్టూ  నటించడం లో ప్రసిద్ధి ).
మనం ఇక లేటెస్ట్  అంటే తాజా గా జరిగిన లేక జరుగుతున్న పరిశోధనల వల్ల మనకు  ఎంత వరకు తెలిసింది ?, 
 
Type A Personality traits  టైపు ఏ వ్యక్తిత్వం లక్షణాలు ఏమిటి ?  ఈ లక్షణాలకూ గుండె జబ్బులకూ సంబంధం ఏమిటి అనే విషయాన్ని వచ్చే టపాలో చూద్దాము ! 

In Our mind on ఏప్రిల్ 27, 2012 at 9:51 సా.

వ్యాయామం ( ఎక్సర్సైజ్ ) గుండె జబ్బును ఎట్లా నివారిస్తుంది ?.3.

In Our Health on ఏప్రిల్ 26, 2012 at 7:28 సా.

 వ్యాయామం ( ఎక్సర్సైజ్ )  గుండె జబ్బును ఎట్లా నివారిస్తుంది ?.3. 

 
ఇప్పటి వరకూ జరిపిన అనేక శాస్త్రీయ  పరిశోధనలూ, పరిశీలనల వల్ల, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ( Regular exercise )  అంటే క్రమం గా వ్యాయామం చేస్తే, కేవలం గుండె జబ్బుల నివారణే కాక , మిగతా  ఏ ఏ లాభాలు ఎంతెంత ఉంటాయో  ఈ క్రింద వివరణ చూడండి.
1.  గుండె జబ్బులూ, పక్ష వాతం అంటే  ‘ stroke ‘  వచ్చే అవకాశం 35 % అంటే ముప్పై అయిదు శాతం తగ్గుతుంది.
2. Type 2 Diabetes , టైపు టూ మధుమేహం వచ్చే అవకాశం  , 50 % అంటే యాభయి శాతం తగ్గుతుంది.
3. Colon cancer , కోలన్ క్యాన్సర్ అంటే  పెద్ద పేగు లో వచ్చే క్యాన్సర్ వచ్చే అవకాశం  50 % అంటే యాభయి శాతం  తగ్గుతుంది. 
4. Breast cancer, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము , లేక స్థన క్యాన్సర్ వచ్చే అవకాశం 20  % లేక ఇరవై శాతం తగ్గుతుంది.
5. 30 % Lower risk of early death. అంటే అల్ప ఆయుష్హు 30 % అంటే ముప్పై శాతం తగ్గుతుంది. అంటే  దీర్ఘ కాలం జీవించే అవకాశం ముప్పై శాతం హెచ్చుతుందన్న మాట.
6.Osteoarthritis, ఆస్టియో ఆర్త్రైటిస్  అంటే కీళ్ళ నొప్పులూ, వాపు, వచ్చే వకాశం 83 % అంటే ఎనభై మూడు శాతం తగ్గుతుంది.
7. Hip fracture risk is reduced by 68 %. హిప్ ఫ్రాక్చర్ అంటే తుంటి ఎముక విరిగే అవకాశం
68 % అంటే అరవై  ఎనిమిది  శాతం తగ్గుతుంది.
8. 30 % reduction in falls అంటే వృద్ధులలో క్రింద పడి పోయే అవకాశం 30 % ముప్పై శాతం తగ్గుతుంది.
9. Depression, డిప్రెషన్ లేక మానసికం గా క్రుంగి పోయే వ్యాధి వచ్చే అవకాశం 30 % అంటే ముప్పై శాతం తగ్గుతుంది.
10.Dementia, డిమెన్షియా  లేక వృద్ధుల లో వచ్చే మతి మరుపు వ్యాధి వచ్చే అవకాశం కూడా 30 % అంటే ముప్పై శాతం తగ్గుతుంది. 
 
ఎంత వ్యాయామం అవసరం ? :
19 నుంచి 64 సంవత్సరాల మధ్య ఉన్న వారికి కనీసం వారానికి రెండున్నర గంటల వ్యాయామం చేస్తే లాభకరం గా ఉంటుందని తెలిసింది. 
 
వ్యాయామం గుండె కు ఎట్లా లాభాకారి?:
 
క్రమం గా వ్యాయామం చేయడం వల్ల గుండె కండరాలు బల పడి తక్కువ సంకోచాలతోనే ఎక్కువ రక్తాన్ని పంపు చేయ గలుగుతుంది.
వ్యాయామం చేయటం, మన బరువును తగ్గిస్తుంది.
వ్యాయామం , మన మానసిక వత్తిడి ని కూడా తగ్గిస్తుంది.
మన బరువు, క్రమమైన వ్యాయామం తో నియంత్రణ లో ఉండటం వల్ల రక్త పీడనం కూడా నియంత్రణ లో ఉంటుంది. అంటే కంట్రోలు లో ఉంటుంది.
అలాగే , రక్తం లో చెడు కొవ్వు అంటే కొలెస్టరాల్  కూడా తగ్గుతుంది.  మధుమేహాన్ని కూడా నివారించడం వల్ల, గుండె జబ్బులు కూడా నివారింప బడతాయి. 
 

మరి ఆలస్యం ఎందుకు వ్యాయామానికి ? కట్టు బడి ఉందాం ఈ నియమానికి ! 

 
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు చూద్దాము. 
 

అధిక రక్త పీడనానికి అంటే హై బీ పీ కి రిస్కు ఫాక్టర్లు ఎట్లా కారణమవుతాయి?.2.

In Our Health on ఏప్రిల్ 25, 2012 at 8:33 సా.

 అధిక రక్త పీడనానికి అంటే  హై బీ పీ కి రిస్కు ఫాక్టర్లు  ఎట్లా కారణమవుతాయి?.2.

మనం క్రితం టపాలో చూశాం కదా పటం సహాయం తో కూడా, ప్రాధమిక అధిక రక్త పీడనానికి ఏడు రిస్క్ ఫాక్టర్స్ ఉన్నాయని.
అందులో మొదటి రెండింటిని మనం ఏవిధం గానూ మార్చలేము కదా. అంటే మనం మన వయసు పెరగటాన్ని ఆపాలంటే, మనం కాలాన్ని ఒక్క క్షణం కూడా ముందుకు పోనీకుండా ఆప గలగాలి. అలా కేవలం మన ఇంట్లో ఉన్న గడియారాలతో చేయ వచ్చు కానీ నిజం గా సమయాన్ని మనం ఆపలేము కదా ! అలాగే మనం ఏ వంశం నుంచి వచ్చామో దానినీ మార్చలేము కదా ! అంటే ఈ రెండు ఫాక్టర్లూ మన చేతిలో లేనే లేవు కదా ! 
కానీ ఇక మిగిలిన అయిదు రిస్కు ఫాక్టర్లూ మన చేతి లోనే ఉన్నాయి. అంటే మన నియంత్రణ లో ఉన్నాయి. 
ఇక్కడ గమనించ వలసినది ఏమిటంటే, రిస్కు ఫాక్టర్లు ఒక్కటి ఉండి మిగతా అన్నీ లేక పోయినా అధిక రక్త పీడనం వచ్చే అవకాశం ఉంటుంది.
మరి అతి కష్టం మీద మిగతా రిస్కు ఫాక్టర్లను మన జీవితాలనుంచి తొలగించితే ఒరిగేదేమిటి? అని చాలా మంది అనుకోవచ్చు.
ఈ సందేహం వచ్చిన వారికి  శాస్త్రీయ మయిన జవాబు ఇదే:  రిస్కు ఫాక్టర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, అధిక రక్త పీడనం లేక హైపర్ టెన్షన్ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. తదనుగుణంగా   పరిణామాలు కూడా తీవ్రం గా ఉంటాయి.  సూటి గా చెప్పాలంటే,  మెదడూ, గుండె, కళ్ళూ, మూత్ర పిండాలూ త్వరిత గతిని దెబ్బ తినే అవకాశం హెచ్చుతుంది. 
ఇప్పుడు ఈ మిగతా అయిదు రిస్కు ఫాక్టర్లూ  ఏ విధంగా అధిక రక్త పీడనానికి కారణ భూత మవుతుందో చూద్దాము.
1. మనం తినే ఆహారం లో ఉప్పు : 
మనకు ( అంటే పదకొండు ఏళ్ళ వయసు పై బడ్డ వారికి ) సామాన్యం గా రోజుకు ఆరు గ్రాముల ఉప్పు సరి పోతుంది.  అంటే daily six grammes of salt.
మరి అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? : 
ఉప్పుకు నీటిని చేర్చుకునే గుణం ఉంది. ఉదాహరణకు, మనం తినే ఉప్పు ఆహారం లో నుంచి మన రక్తం లో ప్రవేశించిన దనుకోండి. అప్పుడు ఆ పరిస్థితి వల్ల మన దేహం లో మిగతా భాగాలలో ఉండే నీరు రక్తం లోకి పీల్చ బడుతుంది. దాని వల్ల సామాన్యం గా అయిదు లీటర్ల వరకు ఉండే రక్తం పరిమాణం పెరిగి అయిదున్నర లేక ఆరు లీటర్ల కు అయిందనుకోండి.  అందు వల్ల రక్తాన్ని పంపు చేయవలసిన గుండె  ఎక్కువ గా పని చేయ వలసి ఉంటుంది.  అందు వల్ల రక్త పీడనం కాస్తా అధిక రక్త పీడనం గా మారుతుంది.
సాధారణం గా మన ఆహారం లో ఉన్న అధిక ఉప్పు మూత్ర పిండాల ద్వారా బయటకు విసర్జన కూడా జరుగుతుంది. కానీ మనం తినే ఉప్పు పరిమాణం పెరిగే కొద్దీ , కొంత మూత్రం ద్వారా విసర్జించ బడినా , మిగతా ఉప్పు ( అంటే ఎక్కువ గా ఉన్న ఉప్పు ) రక్త పరిమాణాన్ని పెంచి ముప్పు కలిగిస్తుంది.
ఉప్పు లేని కూడు చప్పిడి కూడు అని సామెత. కానీ మనలో చాలా మంది ఆ సామెత ను అడ్డం పెట్టుకుని, లేక సాకు గా పెట్టుకుని ఎక్కువ ఉప్పు ఆహారం లో వేసుకుని తింటూ ఉంటారు. కానీ  పరిశీలిస్తే ఆ సామెత లో తప్పు లేదు. ఎందు కంటే ఆ సామెత ఉప్పు లేని కూడు చప్పిడి కూడు అని చెప్ప బడిందే కానీ ‘ అధిక ఉప్పు లేని కూడు చప్పిడి కూడు ‘ అని లేదు.
మనం తినే కూరలూ పప్పులలో , ముఖ్యం గా  ఊరగాయలూ, పచ్చళ్లలో,  అతి శీతలం చేసిన అంటే ఫ్రోజెన్ ఫూడ్స్  లో నూ ఎక్కువ ఉప్పు ఉంటుంది.  
మిగతా వివరాలు వచ్చే టపాలో చూద్దాము !

హై బీ పీ రకాలూ, కారణాలూ.1.

In Our Health on ఏప్రిల్ 24, 2012 at 11:31 సా.

హై బీ పీ రకాలూ, కారణాలూ.1.

మనం క్రితం టపాలలో బీ పీ అధికం గా ఉండి , చాలా కాలం కంట్రోలు లో లేక పొతే పరిణామాలు ఎట్లా ఉంటాయో పటం సహాయం తో తెలుసుకున్నాము. 
ఈ టపాలలో ఒక పటం సాధారణ రక్త పీడనం, ఇంకా అధిక రక్త పీడనం ఎంత ఉంటుందో సంఖ్య ల ద్వారా ఇవ్వటం జరిగింది కదా ! 
ఇక ఈ అధిక రక్త పీడనానికి కారణాలు చూద్దాము.  
రక్త పీడనం లో రెండు రకాలుంటాయి. మొదటి రకాన్ని ప్రాధమిక అధిక  రక్త పీడనం లేక ప్రైమరీ హైపర్ టెన్షన్  అంటారు ( primary hypertension or essential hypertension ) ( 90 % ). 
రెండవ రకాన్ని ద్వితీయ లేక సెకండరీ హైపర్ టెన్షన్  అంటారు ( secondary hypertension ) ( 10 % )  .  నూరు మందిలో అధిక రక్త పీడనం ఉంటే అందులో, తొంభయి మంది ఈ ప్రాధమిక అధిక రక్త పీడనం తో బాధ పడతారు. మిగతా పది మంది లో సెకండరీ అధిక రక్త పీడనం ఉంటుంది. 
ప్రాధమిక అధిక రక్త పీడనం లేక ప్రైమరీ హైపర్ టెన్షన్ ముందు చెప్పుకున్నట్టు, తొంభై శాతం కేసులలో ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ ఈ ప్రాధమిక అధిక రక్త పీడనానికి కారణం ఖచ్చితం గా తెలియలేదు. 
కానీ చాలా ఇతర కారణాలు ఉంటే, ఈ కారణాల వల్ల ప్రాధమిక అధిక రక్త పీడనం రావటానికి కారణం అవుతాయి. అందువల్ల వీటిని రిస్కు ఫాక్టర్స్   ( risk factors ) అంటారు. 
ఈ కారణాలు ఇవి : 
1. మన వయసు మీరుతున్న కొద్దీ , ఈ రకమైన అధిక రక్త పీడనం రావడానికి అవకాశం ఎక్కువ అవుతూ ఉంటుంది.
2. సాధారణంగా ఇది వంశ పారంపర్యం గా ఉంటుంది. అంటే మన వంశంలో పూర్వీకులకు ప్రైమరీ హైపర్ టెన్షన్ ఉంటే మనకూ  రావటానికి అవకాశాలు ఎక్కువ.
3. మన ఆహారం లో మనం తినే ఉప్పు ( ప్రత్యక్షం గా కానీ, పరోక్షం గా కానీ ) ఎక్కువ అవుతున్న కొద్దీ , అధిక రక్త పీడనం రావడానికి అవకాశం హెచ్చుతుంటుంది. 
4. తగిన వ్యాయామం లేక పోవడం. అంటే ఎక్సర్సైజ్ లేక పోవడం.
5.టొబాకో పొగ తాగటం ( అంటే సిగరెట్, బీడీ, లేక చుట్ట – వీటిలో వేటి పొగ అయినా తాగటం, పీల్చడం లేక ) స్మోకింగ్ చేయడం .
6. ఎక్కువ పరిమాణం లో ఎక్కువ కాలం మద్యం సేవించడం.
7. స్త్రెస్స్     , లేక మానసిక వత్తిడి ( stress ). 
ఈ విషయాలను వివరం గా చూద్దాము వచ్చే టపాలలో ! 
 

బీ పీ కంట్రోలు కాకపొతే ?.4.

In Our Health on ఏప్రిల్ 24, 2012 at 10:14 ఉద.

బీ పీ కంట్రోలు కాకపొతే ?.4.

మునుపటి టపాలో పటం ద్వారా మనం క్లుప్తం గా తెలుసుకున్నాము కదా బీ పీ కంట్రోలు కాక పొతే వచ్చే ప్రధాన పరిణామాలు.
ఇప్పుడు ఆ ఆంగ్ల పదాలను తెలుగు లో వివరించడానికి ప్రయత్నిస్తాను.
అదే పటాన్ని మళ్ళీ ఇక్కడ  పోస్ట్ చేయడం జరుగుతుంది, చదువరులు వెనకటి టపా చూడనవసరం లేకుండా !
మీరు పటం లో చూస్తున్న శీర్షిక ‘ మెయిన్ కాంప్లికేషన్స్ అఫ్ పర్సి స్టెంట్  హై బ్లడ్ ప్రెషర్ ‘ అని ఉంది. అంటే అందులో చాలా అర్ధం ఉంది.
దీనిని తెలుగులో చెప్పాలంటే  ‘ అధిక రక్త పీడనం, ఎక్కువ కాలం ఉంటే  జరిగే ప్రధాన  విపరీత పరిణామాలు ‘ అని.  ఇక్కడ గుర్తు ఉంచుకోవలసినది, ‘ చాలా కాలం ‘ కంట్రోలు లో లేని అధిక రక్త పీడనం అన్న మాట ! 
ఇక మిగతా ఆంగ్ల పదాలు చూద్దాము.
మెదడు లో పరిణామాలు :
Cerebro vascular accident or CVA :  సెరిబ్రో వాస్క్యులార్  యాక్సిడెంట్  అంటే  ‘  మెదడు లోని రక్త ప్రసరణ లో జరిగే ప్రమాదం’ దీనినే  స్ట్రోక్  అంటారు ( stroke ) తెలుగులో పక్ష వాతం అని కూడా ఉంటారు. దాని గురించి ముందు ముందు మనం తెలుసుకుందాము.
రెండో ప్రధాన పరిణామం : Hypertensive encephalopathy : ‘ హైపర్ టేన్సివ్ ఎంకేఫలో పతీ ‘   లేక అధిక రక్త పీడనా మస్తిష్కం ‘ అనవచ్చు నేమో తెలుగు లో దీనిని ( ఇంకా మంచి పదాలు తెలుగు లో ఉంటే తెలియ చేయండి )! 
ఈ పరిస్థితి ఏర్పడితే , విపరీతమైన తల నొప్పి గా ఉండటమూ, Confusion , కన్ఫ్యు షన్ అంటే మతి స్థిరం గా లేక పోవడమూ జరిగి, అధిక రక్త పీడనం అలాగే కంట్రోలు కాకుండా ఉంటే ,  మూర్చ లేక ఫిట్స్ రావడం జరుగుతుంటుంది. ఇంగ్లీషు లో convulsion    (కన్వల్స్హన్  అంటారు )
కంటిలో పరిణామాలు : Hypertensive retinopathy : హైపర్ టేన్సివ్ రేటినో పతీ  అంటే  అధిక రక్త పీడనం వల్ల ( ఇక్కడ కూడా మనం  పర్సిస్ టెంట్  అనే మాట గుర్తుంచు కోవాలి, అంటే దీర్ఘ కాలం అధిక రక్త పీడనం ఉంటే ) కంటి లోని అతి ముఖ్య మైన రెటీనా అనే భాగం లో వచ్చే మార్పులు, జరిగే పరిణామాలూ.  
Heart , లేక గుండె లో ప్రధానం గా జరిగే పరిణామాలు :
1. Myocardial Infarction, మయో కార్దియల్ ఇన్ఫార్క్షన్, దీనినే తెలుగు లో గుండె పోటు అంటారు కదా ! దీనికే ఆంగ్లం లో ఇంకో పేరుంది, అది  Heart Attack ( హార్ట్  ఎటాక్ ) . దీని గురించి మనం కూడా మనం ముందు ముందు వివరం గా తెలుసుకుందాము.
2.Hypertensive Cardiomyopathy : హైపర్ టేన్సివ్ కార్డియో మయోపతీ. అంటే అధిక రక్త పీడనం వల్ల గుండె కండరాలలో జరిగే మార్పులూ , వాటి పరిణామాలూ !
3. Heart failure: గుండె విఫలం అనవచ్చేమో ఈ పరిస్థితిని. ఇక్కడ గుర్తు ఉంచుకోవలసిన విషయం. గుండె విఫలం అవగానే ప్రాణాలు పోవు అని. గుండె విఫలం కూడా కొన్ని దశలలో జరుగుతుంది, ఉంటుంది.  చాలా మంది ఈ పరిస్థితి అనుభవిస్తున్న వారు చాలా కాలం జీవించ గలుగుతున్నారు, ఆధునాతన చికిత్సా పద్ధతులతో?
Kidneys: మూత్ర పిండాలలో జరిగే ప్రధాన పరిణామాలూ, మార్పులు : 
1. Hypertensive nephropathy: హైపర్ టేన్సివ్ నెఫ్రోపతీ, అంటే మూత్ర పిండాలలో రక్త పోటు. 2. Chronic renal failure: క్రానిక్ రీనల్  ఫెఇల్యుర్  అంటే  దీర్ఘ కాలిక మూత్ర పిండాల విఫలం అవడం. ఇక్కడ కూడా విఫలం అంటే ‘ సరిగా పని చేయకపోవడం అనే గుర్తు ఉంచు కోవాలి, అంటే  పూర్తిగా విఫలం అయినట్టు కాదు. 
రక్తం లో వచ్చే మార్పులు : Elevated blood sugars. అంటే ఎలివేటేడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే రక్తం లో చెక్కెర  శాతం పెరుగుదల.
చూశారా ఈ ఒక్క పటం లో ఎంత సమాచారం ఉందొ ! అందు వల్లనే దీనిని రెండో సారి పోస్టు చేయడం జరిగింది, మీరు ఎప్పుడూ  గుర్తు ఉంచుకోడానికీ, మీకు ఉపయోగ పడటానికీ !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

బీ పీ కంట్రోలు కాకపొతే ?.3.

In Our Health on ఏప్రిల్ 23, 2012 at 11:11 సా.

బీ పీ కంట్రోలు కాకపొతే ?: 

క్రిందటి టపాలో మనం , మనలో రక్త పీడనాన్ని ఎలా కొలుస్తారు, సాధారణ రక్త పీడనం ఎంత ఉంటుంది ? ,  హైపర్ టెన్షన్ లో  ( అంటే రక్త పీడనం లేక రక్త పోటు లో ) ఎంత ఉంటుంది? అనే విషయాలు పటం ద్వారా తెలుసుకున్నాము కదా !.
ఈ టపా లో రక్త పీడనం ఎక్కువ అయినప్పుడు మన దేహం లోని వివిధ భాగాలమీద, ఈ అధిక రక్త పీడనం ప్రభావం ఎట్లా ఉంటుందో పరిశీలిద్దాము.
ఇక్కడ ముఖ్యం గా గమనించ వలసినది ఏమిటంటే,  అధిక రక్త పీడనం లేక, రక్త పోటు లేక హైపర్ టెన్షన్ పరిణామాలు, ఆ అధిక రక్త పీడనం లేక హైపర్ టెన్షన్, ఎంత ఎక్కువ గా ఉంది ? , ఎంత కాలం నుంచి ఉందీ ? ఎంత కాలం నుంచి కంట్రోలు లో లేదు ? అన్న విషయాల మీద ఆధార పడి ఉంటుంది. 
చాలా ఎక్కువ రక్త పీడనం ఉంటే, పరిణామాలు వెంటనే కనిపించ వచ్చు కూడా ! 
ఇంకో ముఖ్య విషయం: ఈ అధిక రక్త పోటు, లేక అధిక రక్త పీడనం లేక ( hypertentsion ) లేక హైపర్ టెన్షన్ పరిణామాలు మన దేహం లో  కళ్ళు, మెదడు, మూత్ర పిండాలూ, గుండె, వీటి మీద ఎక్కువ గా ఉంటాయి. 
ఈ క్రింద పటం చూడండి పరిశీలన గా !
వచ్చే టపాలో వీటి వివరాలు చూద్దాము !
%d bloggers like this: