డిస్మెనో రియా ‘ Dysmernorrhoea ‘ అంటే ఏమిటి:
ఋతుస్రావం సమయం లో నొప్పి కలిగి ( సాధారణం గా క్రింద ఉదర భాగం లో ), ఆ నొప్పి భరింప రానిది అయి స్త్రీల రోజు వారీ పనులను కుంటు పరుస్తూ ఉంటే, ఆ స్థితిని డిస్ మెనో రియా అంటారు.
రుతుస్రావ సమయంలో నొప్పులు చాలా సాధారణం. ప్రత్యేకించి ఋతుక్రమం మొదలైన కొన్ని నెలలు , అందులో ప్రత్యేకించి యుక్త వయసులో ఉన్న యువతులలో ఈ రకమైన నొప్పులు కనీసం వంద మందికి ఇరవై అయిదు మందిలో కనబడతాయి.
డిస్ మెనో రియా లో నొప్పి ఎలా ఉంటుంది ? :
ఈ స్థితి లో వచ్చే నొప్పి క్రింద ఉదర భాగం లో అంటే కటి వలయ లేక పెల్విక్ ప్రాంతం లో మొదలవుతుంది. ఇది పలు రకాలు గా స్త్రీలలో కనిపిస్తుంది.
సూదుల తో పొడిచినట్టు గానూ, మెలితిప్పినట్టు గానూ, మంట గానూ ఈ నొప్పులను స్త్రీలు అనుభవించ వచ్చు. కొన్ని సమయాలలో ఈ నొప్పి పెల్విక్ లేక కటి వలయ ప్రాంతం నుంచి క్రింద తొడల వరకూ లేక వెనుక వీపు లేక నడుము భాగాలకు ప్రాకినట్టు ఉండవచ్చు. ( పైన ఉన్న పటం చూడండి ) ఇంకొన్ని సమయాలలో ఈ నొప్పులు తీవ్రం గా ఉండి, వికారమూ, కడుపు లో తిప్పినట్టు ఉండటమూ, వాంతులూ , కలిగించవచ్చు.
కొందరిలో ఈ డిస్ మెనో రియా , మామూలు సమయం లో జరుగుతున్న రక్త స్రావం కంటే ఎక్కువ రక్త స్రావం కలిగించ వచ్చు. అప్పుడు ఈ పరిస్థితిని మెనో రేజియా అంటారు ( menorrhagia ).
సామాన్యం గా ఈ నొప్పులు ఋతుస్రావం సమయం లోనే ఉండి ఋతుస్రావం అయిపోగానే అంటే నాలుగు అయిదు రోజులకు తగ్గుతాయి.
డిస్ మెనో రియా మిగతా లక్షణాలు ఏమిటి ? :
పైన చెప్పిన లక్షణాలే కాక డిస్ మెనో రియా తో బాధ పడుతున్న వారిలో తల నొప్పి, తల తిప్పినట్టు ఉండడం, ఏ పని మీదా మనసు లగ్నం చేయలేక పోవడం, విపరీతమైన అలసట గా ఉండటమూ , కొద్ది శబ్దాలైనా , వెలుతురు అంటే కాంతి వంతమైన ప్రదేశాలలోనూ , వీరు ఎక్కువగా స్పందించి , ఆ పరిస్థితులను తట్టుకో లేక పోవడమూ, కొన్ని సమయాలలో స్పృహ తప్పి కింద పడటమూ కూడా జరుగుతుంటాయి.
కారణాలు ఏమిటి ? :
డిస్ మెనో రియా రెండు రకాలు. మొదటి రకాన్ని ప్రాధమిక లేక ప్రైమరీ డిస్ మెనో రియా అంటారు. రెండవ రకాన్ని ద్వితీయ లేక సెకండరీ డిస్ మేనోరియా అంటారు. ప్రాధమిక డిస్ మెనో రియా లో గర్భాశయ కండరాల సంకోచాలు అంటే కాన్త్రాక్షన్ అవుతాయి. అప్పుడు ఆ ప్రదేశం లో ప్రోస్టా గ్లాండిన్ లు అనే జీవ రసాయన పదార్ధాలు విడుదల అవుతాయి. గర్భాశయ కండరాలు విపరీతం గా సంకోచించడం వల్ల ఆ ప్రదేశం లో ప్రాణ వాయువు అంటే ఆక్సిజెన్ కూడా తగ్గుతుంది. ఈ కారణాలన్నీ కలిసి ,కండరాల నొప్పులు గా పరిణ మించుతాయి. ఈ నొప్పులనే క్రామ్ప్స్ అని కూడా అంటారు.
ప్రాదమిక లేక ప్రైమరీ డిస్ మెనో రియా కు ఏ కారణమూ కనపడదు. కానీ ద్వితీయ లేక సెకండరీ డిస్ మెనో రియా కు కారణాలు ఉంటాయి. అదే ఆ రెండు రకాలకూ ఉన్న తేడా !
వచ్చే టపాలో డిస్ మెనో రియా కు చేయ వలసిన పరీక్షలూ, చికిత్సా పద్ధతుల గురించి తెలుసుకుందాము !