ఋతుక్రమం- సమస్యలు.4.
PMS లేక PMT అంటే ఏమిటి?:
PMS ( Pre Menstrual Syndrome ) లేక ప్రీ మేన్స్త్రువాల్ సిండ్రోం లేక PMT ( Pre Menstrual Tension ) లేక ప్రీ మెన్స్ట్రువల్ టెన్షన్ :
స్త్రీల లో ఋతు క్రమ సమయం లో కనిపించే వివిధ శారీరక , మానసిక లక్షణాలను పై విధం గా పిలుస్తారు.
ఖచ్చితం గా చెప్పాలంటే ల్యుటియాల్ దశలో కనిపించే లక్షణాలు ఇవి. అంటే అండాశయం నుంచి అండం విడుదల ఆయే సమయం లో కనిపించే లక్షణాలు. 85 శాతం స్త్రీలలో ఋతుక్రమ దశ లో స్తనాలు కొద్దిగా నొప్పిగా ఉండడం, కడుపు లో వాయువు నిండినట్లుగా ఉండడం అంటే బ్లోటింగ్ సెన్సేషన్ కలగటము , అనుభవం లో ఉంటాయి. కానీ ఇలాంటి లక్షణాల తీవ్రత ఎక్కువ అయి అవి ఆ స్త్రీల దైనందిన జీవితాన్ని కుంటు పరుస్తే అప్పుడు ఆ లక్షణాలను ‘ PMS లేక PMT ‘ అంటారు.
కేవలం వంద కు ఇద్దరి నుంచి అయిదుగురు స్త్రీలు మాత్రమే ఈ PMS to బాధ పడుతుంటారు.
ఈ లక్షణాలు ఏంటో తెలుసుకుందాము:
చీకాకు పడటం, తల నొప్పి, కడుపు నిండినట్టు ఉండడం, అలసట గా ఉండటం, కండరాల నొప్పులు, ప్రత్యేకించి కటివలయ ప్రాంతం లో కండరాలు మెలితిప్పినట్టు నొప్పులు ఉండి, తరచూ అవి భరింప లేనివి గా ఉండటం
మానసికం గా వత్తిడి గా ఉండటం, ఆందోళన పడటం, నిద్ర లేమి, కామ వాంఛ లో మార్పులు, స్వల్ప కారణాలకే దుఖ్హించడం, విచారకరం గా ఉండడం ఇలాంటివి.
సాధారణం గా ఈ లక్షణాలు ఋతు స్రావానికి ముందు కనీసం పది రోజుల నుంచి ఉంటుంటే, అలాగే ప్రతి నెలా ఋతు స్రావానికి ముందు ఇలాంటి లక్షణాలు వారిని బాధ పెడుతూ ఉంటే, అప్పుడు వైద్య సలహా తీసుకోవడం మంచిది.
కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఈ లక్షణాలు స్త్రీలలో ఎక్కువ గా భరింప లేనివి గా అవుతుంటాయి. ఈ పరిస్థితులు:
1. మానసిక వత్తిడి.
2. కుటుంబం లో మిగతా స్త్రీలు అంటే వారి తల్లి గానీ సోదరి గానీ గతం లో ఈ లక్షణాలు అనుభవించితే, వారికి కూడా ఇవి రావడానికి అవకాశం ఎక్కువ అవుతుంది.
3. ఋతు క్రమ సమయం లో ఎక్కువ గా కాఫీలు తాగుతే కూడా ఈ PMS లక్షణాలు ముదురుతాయి.
4. స్త్రీలు గతం లో డిప్రెషన్ తో బాధ పడినా ,
5. వయసు ఎక్కువ అవుతున్నా ,
6. వారు తినే ఆహారం లో విటమినులూ, ఖనిజాలూ తక్కువ అయినప్పుడు కూడా ఈ లక్షణాల తీవ్రత ఎక్కువ గా ఉంటుంది.
ప్రత్యేకించి విటమిన్ B6, D, E లోపిస్తే , అలాగే మెగ్నీషియం, మాంగనీసు లోపిస్తే కూడా PMS తీవ్రత ఎక్కువ అవుతుందని వివిధ పరిశోధనల వల్ల తెలిసింది.
PMS ను ఎలా కనుక్కోవాలి ? : PMS కనుక్కోవడానికి ప్రత్యేకమైన పరీక్షలు ఏవీ లేవు. స్త్రీలు తమ ఋతు క్రమాన్ని శ్రద్ధ తో గమనించాలి. ప్రత్యేకించి ఒక డయరీ ఏర్పాటు చేసుకుని వారి లో కలుగుతున్న లక్షణాలను నోట్ చేసుకోవాలి.
ఎందుకంటే ఈ లక్షణాలు సర్వ సాధారణం గా ఋతు స్రావానికి ఒక వారం పది రోజుల ముందర మొదలయి ఆ వారం పది రోజులూ తీవ్రం గా ఉండి ఋతుస్రావం పూర్తి అయిన తరువాత అంటే నాలుగు అయిదు రోజుల తరువాత , తగ్గు ముఖం పడతాయి.
ఇప్పటి వరకూ శాస్త్రజ్ఞులకు PMS కారణాలు ఖచ్చితం గా ఇవీ అని అంతు చిక్క లేదు. ఋతు క్రమ సమయం లో స్త్రీలో కలిగే హార్మోనుల మార్పు కారణమవ వచ్చు. ఒక పరిశీలన లో స్త్రీలలో ఈ ఋతు క్రమ సమయం లో బీటా ఎండార్ఫిన్ అనే రసాయనం తగ్గి ఉన్నట్టు తెలిసింది.
PMS కు చికిత్స ఏమిటి ? :
ఖచ్చితమైన ఒక్క చికిత్స ఏమీ లేదు. లక్షణాల తీవ్రత బట్టి , చికిత్సా విధానం మారాలి. పైన ఉదాహరించిన విధం గా వత్తిడి తగ్గించుకోవడం ( దీనికి మిగతా కుటంబ సభ్యుల సహకారం కూడా అవసరం ), సరియిన నిద్ర, విశ్రాంతి, సమతుల్య మైన ఆహారం అంటే విటమినులు, ఖనిజాల తో సంపూర్ణం గా ఉన్న ఆహారం తీసుకోవడం, వీలైనంత వ్యాయామం – ఇవన్నీ కలిసి PMS లక్షణాలను నియంత్రిస్తాయి. ముఖ్యం గా మిగతా కుటుంబ సభ్యులు వారి లక్షణాలను అర్ధం చేసుకుని వారికి మానసికం గా చేయూత నివ్వాలి, వారిని ఆ విధంగా డిప్రెషన్ కు దూరం గా ఉంచాలి.
ఈ లక్షణాల తీవ్రత పై జాగ్రత్తలు తీసుకున్నా తగ్గక పొతే , స్పెషలిస్టు వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం. ఆ సమయం లో తగిన రక్త పరీక్షలు కూడా చేయించుకుని, అవసరమయితే హార్మోనులు కూడా తీసుకోవలసి ఉంటుంది.
వచ్చే టపా లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !