బీ పీ కంట్రోలు కాక పొతే ఏం ? :
బీ పీ గురించిన వివరాలు తెలుసుకునే ముందు రక్త పీడనం అంటే ఏంటో ప్రతి ఒక్కరూ కనీసం కొంత అయినా తెలుసుకోవాలి.
మనకందరికీ గుండె ఏమి చేస్తుందో తెలుసు కదా ! ( ఇక్కడ వీలైనన్ని తక్కువ సాంకేతిక పదాలు ఉపయోగించడానికి ప్రయత్నిస్తాను) , వీలైనంత ఎక్కువ మంది కి అర్ధం అవటం కోసం. గుండె మన శరీరం లోని ప్రతి భాగానికీ రక్తం సరఫరా చేస్తుంది, రక్త నాళాల ద్వారా. అలాగే మన దేహం లోని ప్రతి భాగం నుంచీ మళ్ళీ రక్తం తిరిగి గుండె కు చేరుకుంటుంది కూడా ! ఇలా జరగటానికి ఒక నిర్ణీతమయిన పీడనం అవసరం.
పీడనం అంటే ఏమిటి ?:
పీడనం అంటే వత్తిడి. ఉదాహరణ కు మనం నీటి పంపు కు ఇంకో పైపు ను కనెక్ట్ చేశామనుకుంటే , ఒక పదో ఇరవైయ్యో అడుగుల దూరం లో ఉన్న సన్న జాజి పూల మొక్కకు, పంపు ను కనీసం మధ్య వరకు తిప్పితే కానీ నీరు సరిగా అందదు కదా అలాగే, పూర్తిగా తిప్పితే ఆ వత్తిడికి కొన్ని పూలు రాలి పోతాయి కదా ! ఇక్కడ పంపు లో నీటి ధారను ఒక కవాటం ద్వారా మనం క్రమీకరిస్తున్నామన్నమాట !
కానీ మనం ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. భారత దేశం లో ఎడా పెడా, ఏ నిబంధనలనూ పాటించ కుండా నీటి పంపులు కనెక్షన్లు ఇవ్వటం వల్ల , మనం ఉంటున్న ఏరియా లో నీటి పంపు లోనుంచి సరఫరా రావడమే తక్కువ పీడనం తో వస్తూంది. ఇది చాలా సాదారాణం కదా !
( అందుకే ప్రజలు ‘ స్థానికం గా పేరున్న ‘ వారి ఇళ్ళకు తరువాత ఇళ్ళలో ఉండటానికి సందేహిస్తుంటారు. ముందు ఇళ్ళ లో పరవాలేదనుకుంటాను ! ) మనం పీడనం విషయం మాట్లాడుతున్నాము కదా ! ఇక్కడ మనకు తెలుస్తున్నది , పీడనం, ఉనికి అంటే సోర్స్ నుంచీ , అలాగే చివరల్లో కూడా క్రమీకరించ బడుతుంది అని !
ఇప్పుడు అధిక పీడనం పరిణామాలు ఎలా ఉంటాయో ఒక పోలిక చూడండి.
పైన ఉన్న రెండు పటాలు చూడండి. మొదటి పటం లో ఉన్న చక్కటి నమూనా. అది మీరు నిశితం గా పరిశీలించండి. ఆ నమూనా మార్బుల్ అంటే పాల రాయి మీద చెక్కినది. అలాగే రెండో నమూనా చూడండి. అది మెటల్ ను చెక్కి అందం గా తయారు చేసిన అశ్వం !
ఈ రెండిటికీ బీ పీ కంట్రోలు కూ సంబంధం ఏమిటి ?
పైన చూస్తున్న రెండు నమూనాలనూ కేవలం ఎక్కువ వత్తిడి తో పని చేసే నీటి ప్రవాహం తో కత్తిరించారంటే నమ్మ గలరా ? ఇది పూర్తిగా నిజం !
ఇలా విపరీతమైన వత్తిడి ఉన్న నీటి తో గ్రానైట్ ను కానీ లోహాన్ని కానీ కత్తిరించే పరికరాన్ని’ వాటర్ జెట్ కట్టర్ ‘ అంటారు !
పై ఉదాహరణ ఇవ్వటం ఎక్కువ వత్తిడి యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో మీకు వివరించేందుకే !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు చూద్దాము !