ఋతుక్రమం- సమస్యలు.2.
క్రితం టపాలో చూసినట్టు, ఋతుక్రమాన్ని, ముఖ్యంగా నాలుగు హార్మోనులు నియంత్రిస్తాయి.
ఈ నియంత్రణను పోల్చాలంటే ఈ ముఖ్యమైన హార్మోనులు ఒక రకమైన రిలే పరుగు లో పాల్గొంటాయి. అంటే ఈ హార్మోనులు , పలు దశలలో కీలకమైన పాత్ర వహించి ప్రకృతి లో మానవ జీవన పరుగు ను విజయ వంతం చేస్తాయి. ఎందుకంటే, ఈ హార్మోనులు వాటి క్రియలను ఏ దశ లో నైనా నిర్వర్తించక పొతే, అండాశయం నుంచి అండం విడుదల అవదు. కేవలం వీర్యకణాలు గర్భాశయం లో ప్రవేశించినా ( రతిక్రియ ద్వారా లేక artificial insemination ద్వారా అయినా ), పిండం ఏర్పడదు కదా ! దానితో మానవ సృష్టి ఆగి పోయినట్లే కదా !
ఋతు క్రమానికి స్త్రీ దేహం లో ఏ ఏ చోట్ల ఈ రిలే పరుగు జరుగుతుందో చూద్దాము :
మెదడు లో రెండు చోట్ల అంటే హైపో తలామస్ ఇంకా పిట్యు టరీ గ్రంధి – ఈ రెండు చోట్ల లో.
అలాగే గర్భాశయం లో రెండు చోట్ల అంటే గర్భాశయం కు చివరల్లో ఉన్న అండాశయం లో, ఇంకా ముఖ్యమైన గర్భాశయం లో !
క్రింద పటం చూడండి. ఆ పటం లో ఉన్న అంకె ల వారీగా వివిధ దశలలో జరిగే మార్పులు కూడా గమనించండి. ( సులభం గా అర్ధమవటానికి పటం లో చూపిన రంగులనే వివరణ అంకెలలో, వాక్యాలలో ఉపయోగించడం జరిగింది. ) ఆసక్తి కరం గా ఉండటానికి, ఈ క్రింద జరుగుతున్న మార్పులను , అంచెల వారీ గా ఒక చిన్న కధ లాగా చదవండి, మీకు ఇప్పుడు ఏ పరీక్ష అంటే టెస్ట్ లేదు కదా ! కంగారు పడ నవసరం లేదు ! )

1. మెదడులోని హైపో త లామాస్ GnRH అనే హార్మోనును విడుదల చేస్తుంది.
2. ఈ GnRH హార్మోను రక్తం ద్వారా పిట్యు టరీ గ్రంధి కి చేరి అక్కడ నుంచి FSH అనే హార్మోనును విడుదల చేయిస్తుంది.
3. FSH హార్మోను మళ్ళీ రక్త ప్రసరణ ద్వారా ( పిట్యు టరీ గ్రంధి నుంచి ) ఆండాశ యానికి చేరి అక్కడ అండం విడుదల చేసే కణ జాలాన్ని వృద్ధి చేస్తుంది.
4. అండాశయం లో వృద్ధి చెందిన కణ జాలం ( దీనినే గ్రాఫియన్ ఫాలికిల్స్ అని కూడా అంటారు ) ఈస్ట్రో జెన్ ను ఉత్పత్తి చేస్తాయి.
5. ఈ ఈస్త్రోజేన్ పిట్యు టరీ గ్రంధిని చేరి అక్కడ నుంచి FSH ను తగ్గించమని ఉత్తర్వు లిచ్చి అదే సమయం లో LH అనే ఇంకో హార్మోనును విడుదల చేయిస్తుంది, పిట్యు టరీ గ్రంధి చేత. ఈ స్ట్రోజెన్ సహాయం తో గర్భాశయం లోని రక్త నాళాలు కూడా గట్టి పడతాయి.
6. LH హార్మోను ఎక్కువ అవడం వల్ల అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. ఈ అండం గర్భాశయం చివరల నుంచి ప్రయాణం కొనసాగించి ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా ( మీరు వినే వుంటారు, పిల్లలు ఇక వద్దు అనుకునే స్త్రీలకు ఈ ఫాలోపియన్ ట్యూబ్ లను కత్తిరించి, అండం గర్భాశయం లోకి చేరకుండా చేస్తారు ) గర్భాశయం చేరుతుంది.
7. అండం విడుదల అయిన తరువాత, అండాశయం లో ఉన్న కణజాలం ( అంటే గ్రాఫియన్ ఫాలికిల్స్ ) ప్రోజేస్టిరాన్ అనే హార్మోను ను విడుదల చేస్తాయి. ఈ ప్రోజేస్టిరాన్ మళ్ళీ పిట్యు టరీ కి చేరుకొని దాని చేత ‘ LH ‘ ను ఆపించేస్తుంది.( ఎందుకంటే LH పని అంటే అండాశయం నుంచి , అండం విడుదల చేయించడం, జరిగింది కనుక )
8. గ్రాఫియన్ ఫాలికిల్స్ విడుదల చేసిన ఈ ప్రో జేస్టిరాన్ , గర్భాశయాన్ని శిశువు పెరగటానికి అనువుగా తయారు చేస్తుంది. అంటే గర్భాశయం ను ఒక అనువైన , సహజమైన ‘ ఊయల ‘ లేక ‘ పడక ‘ లాగా చేస్తుంది. అలాగే గర్భాశయం లో ఉన్న కణ జాలాన్ని,
మ్యుకస్ అంటే జిగట గా చేసి, ఆ ప్రదేశం వీర్య కణం, అండం చేరు కోడానికి చేసే ‘ ప్రయాణాన్ని ‘ సులువు చేస్తుంది. ఆశ్చర్యం గా ఉంది కదూ ఈ క్లిష్టమైన జీవ క్రియలన్నీ తెలుసు కుంటూంటే !
గర్భాశయం చేరిన అండం, వీర్య కణం తో కలవడానికి వేచి చూస్తూ ఉంటుంది కనీసం 24 నుంచి 48 గంటల వరకూ.
9. వీర్య కణం కనుక గర్భాశయం లో తన కొరకు వేచి చూస్తున్న అండాన్ని కలిస్తే స్త్రీ గర్భం దాల్చినట్టే ! అంటే ఇంకో జీవ సృష్టి జరిగినట్లే ! అప్పుడు ఏర్పడే ‘ పిండం ‘ అంటే ఎంబ్రియో ఇంకో హార్మోనును విడుదల చేస్తుంది. దీనినే HcG అంటారు ( స్త్రీలు గర్భం దాల్చారో లేదో తెలిపే అనేక పరీక్షలు అంటే pregnancy tests , ఈ HCG హార్మోను పరిమాణం బట్టి నిర్ణయించేవే ! )
ఈ ‘ HCG ‘ హార్మోను గ్రాఫియన్ ఫాలికిల్స్ చేత ప్రోజేస్టిరాన్ నూ , ఇంకా ఈస్త్రోజేన్ నూ ఉత్పత్తి చేయిస్తుంది. ఎందుకంటే ఆ హార్మోనులు కూడా పిండం పెరుగుదల కు అవసరం కాబట్టి.
10. ఒక వేళ వీర్య కణం కనుక అండం తో కలవలేక పొతే, అండాశయం నుంచి ప్రోజేస్టిరాన్, ఈస్త్రోజేన్ ఉత్పత్తి అవ్వక వాటి పరిమాణం తగ్గి , ఋతు స్రావం అవుతుంది. దానితో ఋతుక్రమం మొదలవుతుంది మళ్ళీ !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము.
.