ఋతుక్రమం- సమస్యలు.7. అస్తవ్యస్త ఋతు స్రావం.
అస్తవ్యస్త ఋతుస్రావం: దీనినే డిస్ ఫంక్షనల్ యుటి రైన్ బ్లీడింగ్ అంటారు.
ఆ పేరు లోనే ఉన్నట్టు ఈ సమస్య ఉన్న స్త్రీలలో ఋతు స్రావం అస్తవ్యస్తం గా ఉంటుంది. అంటే మునపటి టపాలలో మనం వివరం గా తెలుసుకున్నాము, ఋతు క్రమం లో ప్రత్యేకించి ఫాలిక్యులర్ దశలో ఋతు స్రావం అవుతుందనీ అది సహజం గా జరిగే ఋతుస్రావం అనీ.
కానీ అస్తవ్యస్త ఋతుస్రావం జరుగుతున్న స్త్రీలలో , నూటికి తొంభై మంది స్త్రీలలో అండాశయం విడుదల కాకుండానే జరుగుతుంది. దీనినే యనో వ్యులేటరీ డిస్ఫంక్షనల్ యుటి రైన్ బ్లీడింగ్ అని అంటారు.
మిగతా పది శాతం మంది స్త్రీలలో ఇలాంటి అస్తవ్యస్త ఋతు స్రావం అండాశయం విడుదల అయే సమయం లో జరుగుతుంది. అందు వల్ల ఈ ఋతు స్రావాన్ని ఒవ్యు లేటరీ డిస్ ఫంక్షనల్ యుటి రైన్ బ్లీడింగ్ అని పిలుస్తారు.
ఈ అస్తవ్యస్త ఋతు స్రావానికి ఎలాంటి కారణాలూ కనిపించవు అంటే వివిధ పరీక్షల ఫలితాలలో ఏ కారణమూ కనిపించదు. అలా కారణం కనిపిస్తే అప్పుడు ఆ పరిస్థితిని అస్తవ్యస్త ఋతుస్రావం లేక డిస్ ఫంక్షనల్ యుటి రైన్ బ్లీడింగ్ అని పిలవరు.
అందు వల్లనే ఇలాంటి పరిస్థితిని గుర్తించి నిర్ధారణ చేసే ముందు, అన్ని పరీక్షలు జరిపించుకుని , అస్తవ్యస్త ఋతు స్రావానికి ఇతర కారణాలు ఉన్నాయో లేదో కనుక్కోవాలి.
ఇత మిద్ధం గా ఇదీ అని కారణం తెలియ నప్పటికీ, ఈ అస్తవ్యస్త రుతుస్రావానికి హార్మోనులు కారణమని విశద పడుతున్నది. ఎందుకంటే, సాధారణం గా హార్మోనుల చికిత్స తో ఈ పరిస్థితి చాలా వరకు సరి అవుతుంది. మనం క్రితం టపాలలో చూశాము ఋతుక్రమం లో హార్మోనుల ప్రాముఖ్యత ఏమిటో. అందు వల్లనే ఈ విషయం పైన రాసే ముందు హార్మోనుల గురించీ, ఆ హార్మోనులు, తమ రిలే పరుగు ద్వారా ఋతు క్రమాన్ని ఎలా నియంత్రిస్తాయో వివరించడం జరిగింది. ( మీకు పునశ్చరణ కావాలనుకుంటే ఋతు క్రమం పైన రాసిన మొదటి టపాలు మరొక మారు చూడండి )
ఒవ్యులేటరీ డిస్ఫంక్షనల్ యుటి రైన్ బ్లీడింగ్ : ముందు తెలుసుకున్నట్టు , ఈ రకమైన అస్తవ్యస్త ఋతుస్రావం వంద మంది లో పది మందికి ఉంటుంది.
ఈ రకం లో అండాశయం విడుదలకూ, ఋతు స్రావానికీ సంబంధం ఉన్నది. అందు కే ఆ పేరు వచ్చింది. ఋతు క్రమం లో ఉన్న ల్యూటియల్ దశలో ఇలాంటి అస్తవ్యస్త ఋతు స్రావం ఈస్త్రోజేన్ లోపం వల్ల కావచ్చు. అలాగే ఋతు క్రమంలో చివరి రెండు వారాలలో అంటే ప్రాలిఫరేటివ్ దశలో ఇలాంటి ఋతుస్రావం ప్రో జేస్తి రాన్ లోపం వల్ల కావచ్చును.
ప్రో జేస్తి రాన్ లోపం ఉంటే, తద్వారా ‘ PGF2 alfa ‘ అనే ఇంకో జీవ రసాయనం కూడా లోపించి ఋతు స్రావానికి కారణం అవుతుంది. అలాగే ఇంకో రసాయనం ‘ TPA’ అంటారు దానిని, అది కూడా లోపిస్తుంది. అప్పుడు సహజం గా గడ్డ కట్టే రక్తం ఎక్కువ సమయం తీసుకుంటుంది గడ్డ కట్టడానికి, అందు వల్ల కూడా ఋతు స్రావం ఎక్కువ గా ఉంటుంది. ( రక్తం గడ్డ కట్టడాన్ని బ్లడ్ క్లాటింగ్ అంటారు శాస్త్రీయం గా ).
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !