Our Health

Archive for ఏప్రిల్ 25th, 2012|Daily archive page

అధిక రక్త పీడనానికి అంటే హై బీ పీ కి రిస్కు ఫాక్టర్లు ఎట్లా కారణమవుతాయి?.2.

In Our Health on ఏప్రిల్ 25, 2012 at 8:33 సా.

 అధిక రక్త పీడనానికి అంటే  హై బీ పీ కి రిస్కు ఫాక్టర్లు  ఎట్లా కారణమవుతాయి?.2.

మనం క్రితం టపాలో చూశాం కదా పటం సహాయం తో కూడా, ప్రాధమిక అధిక రక్త పీడనానికి ఏడు రిస్క్ ఫాక్టర్స్ ఉన్నాయని.
అందులో మొదటి రెండింటిని మనం ఏవిధం గానూ మార్చలేము కదా. అంటే మనం మన వయసు పెరగటాన్ని ఆపాలంటే, మనం కాలాన్ని ఒక్క క్షణం కూడా ముందుకు పోనీకుండా ఆప గలగాలి. అలా కేవలం మన ఇంట్లో ఉన్న గడియారాలతో చేయ వచ్చు కానీ నిజం గా సమయాన్ని మనం ఆపలేము కదా ! అలాగే మనం ఏ వంశం నుంచి వచ్చామో దానినీ మార్చలేము కదా ! అంటే ఈ రెండు ఫాక్టర్లూ మన చేతిలో లేనే లేవు కదా ! 
కానీ ఇక మిగిలిన అయిదు రిస్కు ఫాక్టర్లూ మన చేతి లోనే ఉన్నాయి. అంటే మన నియంత్రణ లో ఉన్నాయి. 
ఇక్కడ గమనించ వలసినది ఏమిటంటే, రిస్కు ఫాక్టర్లు ఒక్కటి ఉండి మిగతా అన్నీ లేక పోయినా అధిక రక్త పీడనం వచ్చే అవకాశం ఉంటుంది.
మరి అతి కష్టం మీద మిగతా రిస్కు ఫాక్టర్లను మన జీవితాలనుంచి తొలగించితే ఒరిగేదేమిటి? అని చాలా మంది అనుకోవచ్చు.
ఈ సందేహం వచ్చిన వారికి  శాస్త్రీయ మయిన జవాబు ఇదే:  రిస్కు ఫాక్టర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, అధిక రక్త పీడనం లేక హైపర్ టెన్షన్ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. తదనుగుణంగా   పరిణామాలు కూడా తీవ్రం గా ఉంటాయి.  సూటి గా చెప్పాలంటే,  మెదడూ, గుండె, కళ్ళూ, మూత్ర పిండాలూ త్వరిత గతిని దెబ్బ తినే అవకాశం హెచ్చుతుంది. 
ఇప్పుడు ఈ మిగతా అయిదు రిస్కు ఫాక్టర్లూ  ఏ విధంగా అధిక రక్త పీడనానికి కారణ భూత మవుతుందో చూద్దాము.
1. మనం తినే ఆహారం లో ఉప్పు : 
మనకు ( అంటే పదకొండు ఏళ్ళ వయసు పై బడ్డ వారికి ) సామాన్యం గా రోజుకు ఆరు గ్రాముల ఉప్పు సరి పోతుంది.  అంటే daily six grammes of salt.
మరి అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? : 
ఉప్పుకు నీటిని చేర్చుకునే గుణం ఉంది. ఉదాహరణకు, మనం తినే ఉప్పు ఆహారం లో నుంచి మన రక్తం లో ప్రవేశించిన దనుకోండి. అప్పుడు ఆ పరిస్థితి వల్ల మన దేహం లో మిగతా భాగాలలో ఉండే నీరు రక్తం లోకి పీల్చ బడుతుంది. దాని వల్ల సామాన్యం గా అయిదు లీటర్ల వరకు ఉండే రక్తం పరిమాణం పెరిగి అయిదున్నర లేక ఆరు లీటర్ల కు అయిందనుకోండి.  అందు వల్ల రక్తాన్ని పంపు చేయవలసిన గుండె  ఎక్కువ గా పని చేయ వలసి ఉంటుంది.  అందు వల్ల రక్త పీడనం కాస్తా అధిక రక్త పీడనం గా మారుతుంది.
సాధారణం గా మన ఆహారం లో ఉన్న అధిక ఉప్పు మూత్ర పిండాల ద్వారా బయటకు విసర్జన కూడా జరుగుతుంది. కానీ మనం తినే ఉప్పు పరిమాణం పెరిగే కొద్దీ , కొంత మూత్రం ద్వారా విసర్జించ బడినా , మిగతా ఉప్పు ( అంటే ఎక్కువ గా ఉన్న ఉప్పు ) రక్త పరిమాణాన్ని పెంచి ముప్పు కలిగిస్తుంది.
ఉప్పు లేని కూడు చప్పిడి కూడు అని సామెత. కానీ మనలో చాలా మంది ఆ సామెత ను అడ్డం పెట్టుకుని, లేక సాకు గా పెట్టుకుని ఎక్కువ ఉప్పు ఆహారం లో వేసుకుని తింటూ ఉంటారు. కానీ  పరిశీలిస్తే ఆ సామెత లో తప్పు లేదు. ఎందు కంటే ఆ సామెత ఉప్పు లేని కూడు చప్పిడి కూడు అని చెప్ప బడిందే కానీ ‘ అధిక ఉప్పు లేని కూడు చప్పిడి కూడు ‘ అని లేదు.
మనం తినే కూరలూ పప్పులలో , ముఖ్యం గా  ఊరగాయలూ, పచ్చళ్లలో,  అతి శీతలం చేసిన అంటే ఫ్రోజెన్ ఫూడ్స్  లో నూ ఎక్కువ ఉప్పు ఉంటుంది.  
మిగతా వివరాలు వచ్చే టపాలో చూద్దాము !
%d bloggers like this: