Our Health

Archive for ఏప్రిల్ 6th, 2012|Daily archive page

ఋతు క్రమం – సమస్యలు.3.

In Our Health on ఏప్రిల్ 6, 2012 at 8:37 ఉద.

 ఋతు క్రమం – సమస్యలు.3.

ఋతు స్రావం లేక  మెన్ స్ట్రు ఎషన్: 
క్రితం టపా లో చూసినట్లు ఋతు స్రావం మొదలవటం, స్త్రీ గర్భం దాల్చలేదని తెలపడమే. ఈ   ఋతు స్రావం జరిగే సమయం లో   వీర్యకణం తో కలవని అండం తో పాటు గర్భాశయ పొర  అంటే  లైనింగ్ కు ఉన్న కణ జాలం  కూడా యోని ద్వారా గర్భాశయం  నుంచి  బయటకు వస్తాయి.సాధారణం గా ఋతుస్రావం నాలుగు రోజులు జరుగుతుంది. కొంత రక్త  స్రావం కూడా జరుగుతుంది (  రమారమి  10 నుంచి 80 మిల్లీ లీటర్ల రక్త స్రావం అవుతుంది, సగటున 35, మిల్లీ లీటర్లు ) ఈ సమయంలో.  కానీ ఈ రక్తం లో ప్లాస్మిన్ అనే పదార్ధం ఉండటం  వల్ల   గడ్డ కట్టదు.
ఇలా ఋతు స్రావం, స్త్రీ రజస్వల అయినప్పటి నుంచి, అంటే ప్యుబర్టీ నుంచి ( 8 నుంచి  18  ఏళ్ళ లోపు ) ఋతు క్రమం ఆగి పోయే వరకూ అంటే మెనో పాజ్ వరకూ ( 40 నుంచి 50 ఏళ్ళ మధ్య )   ఋతుక్రమం లో వస్తూ ఉంటుంది.
ఈ రక్త స్రావం సాధారణంగా అనీమియా కు దారి తీయదు. ఒక పరిశోధనలో సుమారు  85 శాతం మంది స్త్రీలలో   కడుపులో మంట, అల్సర్లు ఉండటం గమనించారు. అంటే అనీమియా కు కేవలం ఋతు స్రావమే కారణం కాదని తెలిసింది.
కానీ  శాక హారులూ , బక్క పలచ గా ఉన్న యువతులలో ఋతుస్రావం,  అనీమియా గా  కనపడటానికి ఎక్కువ అవకాశాలున్నాయి.
ఋతుస్రావం జరిగే సమయం లో జరిగే శారీరిక మార్పులు :  చాలా మంది స్త్రీలు, అలసట, కడుపులో తిప్పినట్లు ఉండటం,  సెక్స్ పట్ల కోరిక లో మార్పులు ,  స్తనాలలో నొప్పిగా ఉండటం,  పెల్విక్ భాగం లో అంటే కటివలయ భాగం లో క్రామ్ప్స్  లేక కండరాల నొప్పులు ,  కొద్దిగా నీరు చేరి శరీరమంతా బరువు ఎక్కువైనట్లు, ఇలాంటి లక్షణాలు, అన్నీ కానీ , కొన్ని కానీ  గమనిస్తారు.
ఋతు స్రావం సమయం లో కండరాల నొప్పులు ఎందుకు వస్తాయి.? :  మనం ముందు తెలుసుకున్నట్లు,  ఋతుస్రావం సమయం లో అండం కనుక వీర్య కణం తో కలవక పోయినట్లయితే, దానిని , దానితో పాటు గర్భాశయ లైనింగ్ కణ జాలాన్నీ వదిలించుకోడానికి  గర్భాశయ కండరాలు గట్టి గా వ్యాకోచము, సంకోచము జరుపుతాయి. ఇలా జరిగుతున్నప్పుడు , స్త్రీలు ఆ ప్రాంతమంతా మెలి తిప్పినట్టు నొప్పి అనుభవిస్తారు. కొందరిలో ఈ నొప్పులు తీవ్రం గా, భరింప లేనివి గా ఉంటాయి.  
ఇలా కండరాలు వ్యాకోచ, సంకోచాలు జరిపినప్పుడు ప్రోస్టా గ్లాండిన్స్ ఎక్కువ గా విడుదల అవుతాయి.
మానసిక మార్పులు :  ఋతుస్రావ సమయం లో జరిగే హార్మోనుల మార్పులు, తద్వారా గర్భాశయం లో జరిగే మార్పుల వల్ల స్త్రీలు సాధారణం గా, అలసి పోతుంటారు. అలాగే చీటికి  మాటికి చీకాకు పడటం ,  కళ్ళ లో నీరు నిండడం ( అంటే చిన్న కారణాలకే తట్టుకోలేక ఏడవడం ) , ఇలాంటి లక్షణాలు కూడా అనుభవిస్తూ ఉంటారు. 
 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ! 
 
 
 
%d bloggers like this: