Our Health

Archive for మార్చి, 2012|Monthly archive page

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.18.

In Our Health on మార్చి 31, 2012 at 8:21 సా.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.18.

పురుషులలో అనార్గాస్మియా : 
పురుషులలో సుఖ ప్రాప్తి, దీనినే ఆర్గాసం లేక క్లయిమాక్స్ పొందలేక పోవడం, ముందు టపా లలో చూసినట్లు, స్త్రీలలో కంటే తక్కువ గా ఉంటుంది. ప్రపంచం లో ఈ విషయం పైన ఖచ్చితమైన గణాంకాలు లేవు కానీ ఒక అంచనా ప్రకారం కనీసం పది లక్షల నుంచి ఒక కోటి మంది వరకూ ఈ సమస్య తో బాధ పడుతున్నారు.
కారణాలేమిటి?:  పురుషులలో  అనార్గాస్మియా కు కూడా భౌతిక కారణాలు, మానసిక కారణాలు అని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు.
కాక పొతే తొంభయి శాతం  సమస్యలు మానసికమైనవే అని వేరు వేరు చోట్ల చేసిన పరిశోధనలు తెలుపుతున్నాయి. 
మానసిక కారణాలలో ముఖ్యమైనది, రతి క్రియ ముందు ఉండే ఆత్రుత  దీనినే  పర్ఫామెన్స్  యాంగ్ సైటీ,  ( performance anxiety  ) అని అంటారు ఆంగ్లంలో.  ఈ పర్ఫామెన్స్  యాంగ్ సైటీ కేవలం  అంగ స్తంభన లేక స్ఖలనం మీద ఆందోళన కాదు. దీనికి ముఖ్య కారణం కేవలం మానసికం గా సంసిద్ధత లేక పోవడం. దీనితో ఆత్రుత ఎక్కువ అయి అది ఒక  క్లిష్టమైన వలయం  లా తయారవుతుంది. అంటే ఒకసారి మానసికం గా సంసిద్ధత లేక ఆత్రుత పడుతుంటే,ఆ ఆత్రుత వారి ని   సంపూర్ణం గా రతిక్రియలో పాల్గోననీయక వారిని విముఖులను చేస్తుంది. ఈ విముఖత వల్ల వారు కామోచ్చ దశ పొందలేరు. దానితో వారి ఆత్రుత ఇంకా ఎక్కువ అవుతుంది. 
రతిక్రియ ముందు తీవ్రమైన వత్తిడి కి లోనవటం కూడా ఒక సాధారణం గా కనిపించే కారణం. ఇది తాత్కాలికం మాత్రమే. వత్తిడి కలిగించే సంఘటనలు పరిష్కారం చేసుకుంటే, మామూలు గా కామోచ్ఛదశ పొంద గలరు.
అలాగే, సెక్స్ అంటే చిన్నతనం లో జరిగిన సంఘటనల వల్ల, విముఖత కలిగితే కూడా వారు పెరిగాక  సుఖ ప్రాప్తి ని ప్రభావితం చేయ వచ్చు.
ప్రేయసి పై ఇష్టం కోల్పోవడమూ, ఎప్పుడూ కొత్తదనం లేక పోవడమూ, దాంపత్యం లో కలతలూ,  తమ ( శృంగార ) జీవితం పైన విసుగు కలిగినా కూడా అది  సుఖ ప్రాప్తి పొందలేక పోవడానికి దారి తీయ వచ్చు. 
కొన్ని రకాల మందులు కూడా రతి సామర్ధ్యాన్ని ప్రభావితం చేయ వచ్చు. నిద్ర మాత్రలూ, డిప్రెషన్ కు తీసుకునే మందులు కూడా ఈ కోవ కు చెందినవే.
అలాగే మద్య పానం కూడా !  మద్య పానం ఎక్కువ  మోతాదు లో , చాలా కాలం చేస్తుంటే, అది  కామ వాంఛ ను ఎక్కువ చేస్తుంది కానీ రతి సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది
( excessive alcohol use increases the sex drive but decreases performance  ) . ఈ విషయం మద్య పాన ప్రియులందరూ గమనించాలి.
వెన్ను పూస కు ఏమైనా ప్రమాదం లో దెబ్బ తగిలితే, ఇంకా  మధు మేహం ముదిరితే, ఇంకా కొన్ని రకాలైన నాడీ సంబంధ వ్యాధులు కూడా  పురుషులలో ఆర్గాసం ను ప్రభావితం చేయ వచ్చు.
 
వచ్చే టపా లో ఇంకొన్ని విషయాలు చూద్దాము !

హార్ట్ అటాక్ నివారించేందుకు త్వరలో టీకా మందు !

In Our Health on మార్చి 31, 2012 at 1:28 సా.

హార్ట్ అటాక్ నివారించేందుకు త్వరలో టీకా మందు !

ప్రపంచం లో  గుండె జబ్బు ల ద్వారా సంభవించే మరణాలు చాలా ఎక్కువ. అందులో హార్ట్ అటాక్ వల్ల సంభవించే మరణాలు కూడా ఎక్కువే.
అయితే అందరికీ ఒక ఆశా జనకమైన వార్త !
స్వీడన్  లోని లుండ్ విశ్వ విద్యాలయం లోని శాస్త్రజ్ఞులు ప్ర ప్రధమం గా హార్ట్ అటాక్ ను నివారించడానికి ఒక మందు కనిపెట్టారు. 
ఈ మందు టీకా రూపం లో కానీ ఇన్హేలర్ రూపం లో కానీ వచ్చే అయిదేళ్ళలో మార్కెట్ లో లభించ వచ్చు. 
ఇంత వరకూ మానవులలో గుండె జబ్బు , హార్ట్ అటాక్ ను నివారించడానికి, కొలెస్టరాల్  తగ్గించుకోవడానికి మందులు వేసుకోవడమూ, ఇంకా  అధిక రక్త పీడనం అంటే హై బీపీ  తగ్గించడానికీ మందులు వాడడం జరుగుతున్నది.
కొలెస్టరాల్ ను తగ్గించుకోవడం ఎందుకంటే ,  ఒక రకమైన కొలెస్టరాల్ ( అంటే మనకు ప్రత్యేకించి మన రక్త నాళాలకు , హాని కలిగించే కొలెస్టరాల్ , దీనిని LDL కొలెస్టరాల్ అంటారు ) రక్త నాళాలలో పేరుకు పోయి క్రమేణా వాటిని పూడ్చి వేస్తుంది.  ( పై చిత్రం చూడండి )
అలా గుండెకు సరఫరా చేసే రక్తనాళాలు పూడుకు పోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఇలా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, ప్రస్తుతం ఉన్న చికిత్సా విధానాలలో,  ఆ ‘ పూడిక ‘ ను కరిగించడానికి లేక పూడుకు పోయిన రక్తనాళాలను తప్పించి కృత్రిమంగా చిన్న  ట్యూబ్ లను ఆ రక్తనాళాలకు అమర్చడమూ చేయడం జరుగుతున్నది.
ఇలా రక్తనాళాలు పూడుకు పోకుండా నివారించడం  లో యాంటీ బాడీస్ కూడా పాత్ర వహిస్తాయి. ఇక్కడ మనం యాంటీ బాడీస్ అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. మన దేహం లో ఉండే రోగ నిరోధక శక్తి దానినే ఇమ్యూ నిటీ అంటారు. మనం చిన్న తనం లో వచ్చే జబ్బులు, మంప్స్ , మీసిల్స్ , డిఫ్తీరియా లాంటి జబ్బులు నివారించడానికి టీకాలు వేయించడం చేస్తుంటాము. ఇలా చేయడం వల్ల మన దేహం లో  సహజం గానే ఉన్న రోగనిరోధక శక్తి టీకా ల వల్ల ఇంకా ఎక్కువ అయి, ఆ జబ్బులు రాకుండా కాపాడుతుంది.
ఈ స్వీడిష్ శాస్త్రజ్ఞులు,  ఒక మందు కనుక్కొన్నారు. ఈ మందు  గుండె కు సరఫరా చేసే రక్తనాళాలలో కొలెస్టరాల్ పేరుకు పోకుండా నివారించే యాంటీ బాడీస్ ను ఎక్కువ గా ఉత్పత్తి చేసేటట్టు , మన రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూ నిటీ ని ప్రేరేపిస్తుంది. అంటే స్టిమ్యులేట్ చేస్తుందన్న మాట.
లుండ్ విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ నిల్సన్  ఇలా అన్నాడు ‘ ప్రస్తుతం వాడకం లో ఉన్న  అధిక రక్త పీడనకు, ఇంకా అధిక కొలెస్టరాల్ కూ మందులు కేవలం నలభై శాతం మాత్రమే తగ్గిస్తున్నాయి గుండె జబ్బులను. మిగతా అరవై శాతం గుండె జబ్బులు సంభవిస్తూ నే ఉన్నాయి ప్రపంచం లో వాటిని కూడా నివారించడానికే ఈ ప్రయత్నం ‘  ఆయన ఆధ్వర్యంలో ఎలుకల మీద  జరిగిన పరిశోధనలో   వాటి రక్త నాళాలలో కొవ్వు అంటే కొలెస్టరాల్ పూడుకు పోవడం అరవై నుంచి డెబ్బయి శాతం వరకూ  తాము కనుక్కొన్న మందు తగ్గించిందని కనుగొన్నారు. కెనడా లోనూ , అమెరికా లోనూ మానవులమీద కూడా పరిశోధన జరుగుతూ ఉంది ప్రస్తుతం. ఈ పరిశోధనలు ఇప్పటివరకూ ఆశా జనకం గా ఉన్నాయి.
శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం వచ్చే అయిదేళ్ళలో  టీకా మందు ఒక ఇంజెక్షన్ రూపం లోనో లేక ముక్కులో వేసుకునే స్ప్రే  రూపం లోనో లభించనున్నది. అయితే ఈ మందు  చాలా ప్రియమైనది. అందు వల్ల హై రిస్క్ కు చెందిన వారికే ఈ మందు రికమెండ్ చేస్తారు.
కొస మెరుపు :’  ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ‘  నివారణకు తీసుకునే  చర్యలు (  అంటే మందులు లేకుండా జీవన శైలి లో మార్పు అంటే  life style changes ) ఉత్తమం, చౌక కూడా !! 
( డైలీ టెలిగ్రాఫ్ సౌజన్యం తో )

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.17.

In Our Health on మార్చి 30, 2012 at 9:02 ఉద.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.17.

 

 
అనార్గాస్మియా నివారణోపాయాలు:
 
సెక్స్ థెరపీ: ప్రత్యేక మైన  ట్రైనింగ్ పొందిన సెక్స్ తెరపిస్ట్ ల తో సంప్రదించి వారి సలహా పాటించడం కూడా మందులు లేకుండా అనార్గాస్మియాను నివారించడానికి ఎంతో సహాయ పడుతుంది.
సెక్స్ తెరపిస్ట్ లు సాధారణంగా కొన్ని సెషన్స్ అంటే పన్నెండు సార్లో లేక పదహారు సార్లో వారి క్లినిక్ లో మీకు అంటే జంటలకు , తగిన తరిఫీదు ఇస్తారు, అనార్గాస్మియా నివారణకు.
క్లై టోరల్ వాక్యుం పంప్ : ఈ పరికరం వాడకం వల్ల స్త్రీలలో ముఖ్య కామోత్తేజ స్థానాలైన వజైన ఇంకా క్లై టో రిస్ కు రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. దానితో వారికి ఎక్కువ ప్రేరణ కలిగి రతిక్రియ లో  ఆర్గాసం పొందుతారు. 
ఈ పరికరం వాడకం చాలా శులభం. అయితే  స్పెషలిస్ట్ ను సంప్రదించాకే  ఈ పరికరం ఉపయోగించాలి.
క్రింద ఫోటో చూడండి.
 
 
2. మందులతో అనార్గాస్మియా నివారణ:
ఈస్ట్రోజెన్  తో నివారణ:  ఈస్ట్రో జెన్  వివిధ రకాలు గా అంటే చర్మము మీద అతికించే పాచ్ ల రూపం లోనూ,  నోటిలో వేసుకునే బిళ్ళల రూపం లోనూ లేక జననాంగం పైన పూసుకునే ఆయింట్మెంట్ రూపం లోనూ వాడితే, అది అనార్గాస్మియా నివారణలో ముఖ్య పాత్ర వహిస్తుందని శాస్త్రీయంగా తెలిసింది. ఈస్ట్రో జెన్ వాడకం వల్ల స్త్రీల జననాంగం లో రక్త సరఫరా ఎక్కువ అయి వారిలో కామ వాంఛ అంటే డిసైర్ కూడా ఎక్కువ అవుతుంది. సాధారణం గా ఈస్ట్రో జెన్ ను ఇంకో హార్మోన్ ప్రాజె స్టిరాన్ అంటారు దానితో కలిపి వాడమని సలహా ఇస్తారు నిపుణులైన వైద్యులు.
దీనికి కారణం: కొందరు స్త్రీలలో ఈస్ట్రో జెన్ ఉత్పత్తి సరిగా లేకపోతే వారి మానసిక స్థితి కామోత్తేజ దిశ గా పోదు. కొన్ని వారాలు ఈస్ట్రో జెన్ వాడకం జరిగితే, వారు మానసికంగా ఉల్లాసవంతులై , తగినంత కామోత్తేజం పొంది, రతిక్రియలో సుఖప్రాప్తి చెందుతారు. ఆర్గాసం పొందుతారు.
అలాగే  తెస్తోస్టిరాన్ వాడకం కూడా :  టేస్తోస్టిరాన్ పురుషుల లో ఉండే హార్మోన్ అయినప్పటికీ తక్కువ మోతాదు లో స్త్రీలలో కూడా ఉండి, వారిలో కామవాంచ నూ తద్వారా కామోత్తేజము, క్లైమాక్స్ లేక ఆర్గాసం నూ చెప్పుకో తగినంతగా ప్రభావితం చేస్తుందని శాస్త్రీయ పరిశోధనల వల్ల తెలిసింది. టేస్తో స్టిరాన్ వాడకం, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగించ వచ్చు వాడుతున్నవారిలో అంటే మొటిమలు రావడం, వెంట్రుకలు తలమీద కాక మిగతా ప్రదేశాలలో ఎక్కువ గా పెరగటం, ఇలాంటివి. కనుక టేస్తోస్టిరాన్ వాడకం స్త్రీలలో ప్రత్యేక పరిస్థితులలోనే, అంటే వారు ఈస్త్రోజేన్, ప్రో జేస్టిరాన్ వాడినా కూడా తగిన ఫలితాలు లేక పోతేనే , లేక వారికి అండాశయం అంటే ఓవరీలు  ( ovaries ) తీసివేయటం కానీ జరిగినప్పుడే జరగాలి,
ఏవిధమైన హార్మోనుల వాడకమైనా తగిన నిపుణులతో సంప్రదించి వారి పర్యవేక్షణలో జరగటం ఉత్తమం.
ముఖ్యంగా సెకండరీ అనార్గాస్మియా లేక ద్వితీయ అనార్గాస్మియా కు  ట్రీట్మెంట్ మూల కారణం బట్టి ఉంటుంది.  కారణం కనుక్కుని తగువిధంగా నివారణోపాయాన్ని అమలు పరచాలి.
ఇలాంటి పరిస్థితిలో కూడా స్పెషలిస్టు తో సంప్రదించి వారి సలహా తీసుకోవాలి.
 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.16.

In Our Health on మార్చి 29, 2012 at 9:41 ఉద.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.16.

అనార్గాస్మియా నివారణోపాయాలు:
అనర్గాస్మియా  నివారణకు ముందు ఆ స్థితి లక్షణాలు  సవివరంగా తెలుసుకోవాలి. నిపునిడైన వైద్యుడితోనో లేక సెక్స్ తెరపిస్ట్ తోనో సంప్రదించి తమ పరిస్థితిని వివరించాలి ఏ సంకోచమూ లేకుండా.
అనార్గాస్మియా ట్రీట్మెంట్  స్థూలంగా రెండు రకాలు: 
1.మందుల అవసరం లేకుండా  తీసుకునే ఉపాయాలు.2. మందుల సహాయం తో తీసుకునే నివారణోపాయాలు.
1.మందుల అవసరం లేని నివారణోపాయాలు :
ఎక్కువ మంది స్త్రీలలో కీలకమైన నివారణోపాయం, జీవన శైలి లో మార్పులు. ప్రియుడి తో  లేక భర్త తో సంబంధం మెరుగు పరుచుకోవడం.
నవీన మానవ జీవితం వత్తిడి తో కూడినది. ఎక్కువ మంది స్త్రీలు, ఉద్యోగాలు చేస్తూ, వత్తిడి కి తట్టుకుంటూ, ఇంట్లో సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూ సతమతమవుతుంటారు.
దానితో మానసికం గా ఒక స్తబ్దత ఏర్పడి అది కామ వాంఛ నూ తద్వారా క్లయిమాక్స్ నూ ప్రభావితం చేయ వచ్చు.  అందు వల్ల దైనందిన జీవితం లో వత్తిడులు ఏవిధం గా తగ్గించుకోవచ్చో అవసరం అయితే తమ ప్రియుని సహాయం తో  చర్చించి  వాటిని అమలు చేయాలి. ఇక్కడ జరుగుతున్నది మనసును ఏ చీకాకులూ వత్తిడి చేయకుండా కామోత్తేజం కలిగించే దిశ లో మరల్చుకోవడం! 
అలాగే ప్రియుడితోనూ, లేక భర్త తోనూ, తమ సంబంధం  ఒక ప్రేమానురాగబంధం గానూ, స్నేహ పూర్వకం గానూ ఉంచుకోవాలి. దీనికి ఇరువురి సహకారమూ అవసరమని వేరుగా చెప్ప నవసరం లేదు కదా ! ఒక వేళ చిన్న చిన్న కలతలూ, వాగ్వివాదాలూ సంభవించినా, వెంటనే  పట్టుదలలు పెంచుకుని, తమ మధ్య అగాధాలు సృష్టించు కోకూడదు.
కొన్ని సమయాలలో పరిష్కారం జటిలమని అనిపించినప్పుడు, అనుభవజ్ఞులైన వారితో లేక నిపుణుడి సలహా అంటే కౌన్సెలింగ్ తీసుకోవడం ఉత్తమం.
మీ దేహాన్ని మీరు అర్ధం చేసుకోండి : శాస్త్రజ్ఞులు ప్రతి వారినీ తమ దేహం పైన మంచి అవగాహన ఏర్పరుచు కొమ్మని సలహా ఇస్తారు. అంటే మీ దేహం యొక్క అనాటమీ ( మానవ శరీర శాస్త్రము ) తెలిసి ఉండాలి మీకు . ఇందుకు మీరు పుస్తకాల సహాయం లేక వీడియో ల సహాయం తీసుకోవచ్చు.
స్వయం ప్రేరేపణ కూడా ఒక పధ్ధతి మీలో ఏ స్థానాలు ఎక్కువ కామోత్తేజ స్తానాలో తెలుసుకోవడానికి.  ఇలా స్వయం ప్రేరేపణ మీకు  నచ్చనప్పుడు మీ ప్రియుడి తోనో భార్తతోనో సంభాషించి వారి సహకారం తీసుకోవడం అనువైన ఉపాయం.
ఎక్కువ కామోత్తేజం కలిగించుకోవడం ఎలా? : చాలా మంది అనార్గాస్మియా  అనుభవిస్తున్న స్త్రీలు కామోత్తేజం పొందడం లో విఫలమవు తుంటారు. మాస్టర్స్ అండ్ జాన్సన్  సెక్స్ వలయం లో మనం చూసినట్లు  కామోత్తేజ స్థానాలను ప్రేరణ చేసుకోవడం ఎంతో కీలకమైన చర్య, రతి క్రియ లో. ప్రత్యేకించి ఆర్గాసం పొందటానికి.
స్త్రీలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ యోని కీల  అంటే  క్లై టోరిస్  ప్రేరేపణ అంటే స్టిములేట్ అవటం ముఖ్యం. ఈ చర్య ప్రాముఖ్యత అందరు స్త్రీలూ, పురుషులూ గ్రహించరు.
క్లై టో రిస్ ప్రేరేపణ, మనం క్రితం టపాలో చదివినట్లు, రతిక్రియా సమయం లో ప్రేయసీ ప్రియుల అమరిక అంటే కాయిటల్ అలైన్మెంట్ టెక్నిక్ ద్వారా కూడా ఎక్కువ చేయ వచ్చు.
కాయిటల్ ఎలైన్మెంట్ టెక్నిక్ ఏమిటి ? : 
ఈ కిటుకు లేక టెక్నిక్ లో  క్లై టో రిస్ కు అత్యంత ప్రేరణ కలిగించి తద్వారా స్త్రీ క్లై మాక్స్ లేక ఆర్గాసం పొందుతుంది. అనర్గాస్మియా తో అవస్థ పడుతున్న  స్త్రీలకూ, జంటలకూ ఈ టెక్నిక్ చాలా ఉపయోగకరమైనదని శాస్త్రీయంగా తెలిసింది.
సాధారణంగా ఎక్కువమంది జంటలు ఆచరించే రతిక్రియ స్థానాన్ని లేక పోసిషన్ ను మిషనరీ పోసిషన్ అంటారు. అంటే ఈ అమరిక లో ఆమె మీద అతడు పురుషాంగం తో యోనిలోకి పైనుంచి క్రిందకు అంటే పడక  దిశ గా ఊపు కలిగిస్తాడు. కానీ కాయిటల్ ఎలైన్మెంట్ టెక్నిక్ లో  అతను ఆమె మీద తన పూర్తి భారం వేయకుండా, ఆమె తో పాటు తన కటివలయ ప్రాంతాన్ని అంటే పెల్విక్ ఏరియా ను  లయ బద్ధంగా ఊపుతాడు. అంటే  ఆమె ( యోని ) లో ప్రవేశించే ఊపు పడక దిశలోనూ, రెండవ ఊపు ఆమె  యోనికీల దిశలోనూ అంటే పై దిశ గానూ చేస్తాడు.
ఇలా రెండవ ఊపు పడక దిశలో కాక పైదిశగా చేయటం వల్ల యోని పైభాగం లో ఉన్న యోని కీల కు లేక క్లై టోరిస్ కు అత్యంత వత్తిడి కలిగి ఆమె ఆర్గాసం పొందుతుంది. ఇక్కడ జరుగుతున్నది , మొదటి ఊపు లో ఆమె ఎక్కువ యాక్టివ్ గా అయి తన పెల్విస్ ను పైకి లయ బద్ధంగా ఊపుతుంది. రెండవ ఊపు లో అతను ఎక్కువ యాక్టివ్ అయి పురుషాంగాన్ని యోని పై దిశగా పోనిస్తాడు.ఇలా ఇరువురూ యాక్టివ్ గా రతి లో పాల్గొంటూ ఉండటం వల్ల ఎక్కువ కామోత్తేజం కలిగి ఇరువురూ ఆర్గాసం పొందుతారు.
క్రింద పటం చూడండి  దృశ్య వివరణ కోసం:
మరికొన్ని విషయాలు వచ్చే టపాలో తెలుసుకుందాము!

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.15.

In Our Health on మార్చి 28, 2012 at 10:55 ఉద.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.15.

 
స్త్రీలలో అనార్గాస్మియా :
anorgasmia లేక అనార్గాస్మియా అంటే ఏమిటి ?
అనార్గాస్మియా ను కాఫ్లాన్ సిండ్రోం (  Coughlan’s  syndrome)   అని కూడా అంటారు. అవసరమైన ప్రేరేపణ అంటే  స్టిములస్ అందించినా ఆర్గాసం పొందలేక పోవడాన్ని, ఇంకో విధంగా చెప్పాలంటే కామోచ్ఛ దశ లేక క్లయిమాక్స్ కు చేరుకోలేక పోవడాన్ని అనార్గాస్మియా అంటారు.
ఈ అనార్గాస్మియా స్త్రీలలోనూ, పురుషుల్లోనూ ఉంటుంది. కానీ పురుషులతో పోలిస్తే, స్త్రీ లలో ఎక్కువ గా కనిపిస్తుంది ఈ స్థితి. అందువల్ల మనం స్త్రీలలో అనార్గాస్మియా గురించి తెలుసుకుందాము.
స్త్రీలలో అనార్గాస్మియా  ను రెండు రకాలు గా చెప్పుకోవచ్చు.
మొదటి రకం : ప్రాధమిక అంటే  ప్రయిమరీ అనార్గాస్మియా : ఈ రకమైన అనార్గాస్మియా లో  స్త్రీలు  వారి జీవితం లో మొదటి సారి  కామోచ్ఛ దశ కోసం వేచి చూస్తుంటారు. అంటే వారు ఒక సారి కూడా  క్లయిమాక్స్  అనుభవించి ఉండరు. ఈ స్థితి కూడా స్త్రీలలో, పురుషులకంటే ఎక్కువ గా కనిపిస్తుంది.  ఈ స్థితి లో స్త్రీలు సాధారణం గా  పొందే క్లయిమాక్స్ మధురానుభూతి చాలా తక్కువ గా పొంది,  విసుగు , మనసు స్థిమితంగా లేక పోవటం, అంటే రెస్ట్ లెస్ నెస్, ఇలాంటి రుగ్మతలకు బాధితులవుతుంటారు. వారిలో కటివలయ ప్రాంతంలో నొప్పులు అంటే పెల్విక్  పెయిన్స్ కూడా  తరచూ వస్తుండ వచ్చు.
తరచూ, ఈ ప్రాధమిక అనార్గాస్మియా కు ప్రత్యేకించి ఇదీ అని ఒక కారణం ఉండక పోవచ్చు. ఇలాంటి పరిస్థితులలో స్త్రీలు,  తమకు ఏవిధమైన మెడికల్  కండిషన్స్ లేవనీ , తమ భర్త లేక ప్రియుడు చాలా మంచివాడనీ, రతిక్రియలో మెళకువలు తెలిసినవాడనీ, తమకు  తగినంత ఏకాంత సమయం కూడా లభిస్తుందనీ, అయినా తాము కామోచ్ఛ దశ కు చేరుకో లేక పోతున్నామనీ చెబుతారు. ఇక్కడ గమనించ వలసిన విషయం: రతిక్రియకు కేవలం ప్రియుడు ‘ అన్నీ ‘ తెలిసిన వాడయినంత మాత్రాన ప్రియురాలు సుఖ ప్రాప్తి లేక ఆర్గాసం పొందలేక పోవచ్చు
కొందరు సాంఘిక శాస్త్రజ్ఞులు, స్త్రీలలో ఆనార్గాస్మియా కు కారణం, వారికి  గల కామ వాంచలను వారు అణుచుకోవడమే, ఎందుకంటే వారు సాధారణంగా సెక్స్ అంటే ఒక తప్పు అనే అభిప్రాయాన్ని వారి చిన్నతనం నుంచీ ఏర్పరుచు కోవడం వల్ల కొంత విముఖత కలిగి  అది అవరోధం గా పరిణమించవచ్చు ,  వారు పెరిగాక ‘ అని అభిప్రాయ పడతారు. కానీ ఈ వాదనకు శాస్త్రీయంగా  సరియిన రుజువులు లేవు. 
ఇక రెండవ రకం  ‘ ద్వితీయ లేక సెకండరీ అనార్గాస్మియా ‘ : 
కొంత కాలం సాధారణ  దాంపత్య జీవితం అనుభవించి లేక  రతి క్రియలో సహజంగా పొందే కామోచ్ఛ దశ పొంది, తరువాత వైద్య పరమైన కారణాల వల్ల ఆ కామోచ్ఛ దశను తిరిగి పొందలేక పొతే ఆ పరిస్థితిని సెకండరీ లేక ద్వితీయ అనార్గాస్మియా ‘ అంటారు.  దీనికి కారణాలు  డయాబెటిస్ అవవచ్చు, లేక వారు  డిప్రెషన్ కు తీసుకునే మందులవ వచ్చు, లేక శిశు జనన సమయం లో  వారికి అయిన గర్భాశయ సంబంధ ఆపరేషన్లు కావచ్చు. అతిగా మద్య పానం చేసినా, వారు  అత్యాచారానికి గురి అయినా కూడా అనార్గాస్మియా కలిగే అవకాశం ఉంది.
అట్లాగే తీవ్రమైన విషాద కర సంఘటనలు వారి జీవితాలలో సంభవించినప్పుడు కూడా తాత్కాలికంగా వారు కామోచ్ఛ దశను అంటే క్లయిమాక్స్ ను పొందలేక పోవచ్చు .
 
వచ్చే టపాలో అనార్గాస్మియాను ఎట్లా సరిచేయ వచ్చో తెలుసుకుందాము !
 

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 14.

In Our Health on మార్చి 27, 2012 at 9:52 ఉద.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 14.

 
స్త్రీలలో ఆర్గాసం మూలాలు :
మాస్టర్స్ అండ్ జాన్సన్  ( హ్యూమన్  సెక్సువల్ రెస్పాన్స్ సైకిల్ ను ప్రతిపాదించిన శాస్త్రజ్ఞులు, దీని గురించి మీరు కామ వాంఛ మొదటి విశ్లేషణ ల లో  చదివి ఉంటారు కదా ! )
కూడా తాము  జరిపిన పరిశోధనలలో కిన్సే ప్రతిపాదించిన  క్లై టో రల్ ఆర్గాసం ను సమర్ధించుతూ, రుజువులు కనుగొన్నారు.
ఇంకొక పరిశోధనలో ( by Shere Hite ) డెబ్బయి నుంచి ఎనభై శాతం స్త్రీలు కేవలం  ప్రత్యక్షంగా  ‘ యోని కీల ‘ అంటే క్లై టో రిస్  ను ప్రేరేపితం అంటే ‘  స్టిములేట్’  చేయగానే  ఉచ్చ దశకు అంటే క్లైమాక్స్ కు చేరుకుని ఆర్గాసం అనుభవించారు.
స్త్రీల కామోచ్చ దశ లేక ఆర్గాసం పైన అనేక పరిశోధనలు చేసిన మేయో క్లినిక్ ఇలా తెలిపింది ”  స్త్రీలలో ఆర్గాసం  యొక్క  ఫ్రీక్వెన్సీ   మారుతూ ఉంటుంది. ఇది  ‘  క్లై టో రిస్ ను  ఎంత తీవ్రత తో    స్టిములేట్ ‘ చేయ వచ్చు అనే  అంశం మీద ఆధార పడి ఉంటుంది. సాధారణం గా క్లై టోరిస్  అత్యంత సెన్సిటివ్ స్థానం. ఎందు కంటే పురుషులలో పురుషాంగం ఎంత సెన్సిటివ్ అవునో, స్త్రీలలో క్లై టో రిస్ అంత సెన్సిటివ్.  దీనికి కారణం యోనికీల మొన అంటే ‘ tip of the clitoris ‘ ( also called glans as in males ) లో  సుమారు 8,000 nerve endings అంటే  ఎనిమిది వేల నాడీ తంత్రుల చివరలు లేక మొనలు ఉంటాయి. ఇవి అత్యంత స్వల్ప ప్రేరేపణ లేక స్టిములస్ కు కూడా ఎంతో రెస్పాండ్ అవుతాయి.  ఇలా మానవ దేహం లో ఏ భాగం లోనూ ఇన్ని నాడీ తంత్రుల చివరలు ఒకే చోట కేంద్రీకృతం కాలేదు కేవలం ఒక్క యోని కీల లేక క్లై టో రిస్  మొన లో తప్ప !
అందువలనే క్లై టో రల్   స్టిములేషన్ ద్వారా అనుభవించే ఆర్గాసం స్త్రీలలో చాలా సులువు.   అంతే కాకుండా ఈ క్లై టో రిస్ లేక యోని కీల నుంచి అత్యంత సెన్సిటివ్ నాడీ తంత్రులు ఇరు ప్రక్కలా వ్యాపిస్తాయి. ఆంటే  ఒక గుర్రపు నాడా ( గుర్రపు నాడా మీకు తెలిసే ఉంటుంది, గుర్రపు డెక్క  పరుగెత్తేటప్పుడు ఎక్కువ అరగకుండా తొడిగే  మెటల్ నాడా, ఇది తలక్రిందులు గా ఉన్న ఆంగ్ల అక్షరం ‘ U ‘ ఆకారం లో ఉంటుంది దీనినే ఆంగ్లం లో  ‘ horse shoe ‘ అంటారు ) ఆకారం లో ! వజైన  యొక్క పెదవులకూ, ఇంకా కొద్దిగా వ జైన లోపలి స్థానానికీ వ్యాపిస్తాయి ఈ నాడీ తంత్రులు. ఈ స్థానం లో  వ జైన లో ఉన్న ‘ G ‘ spot ‘ కూడా ఉంది ( జీ స్పాట్ గురించి కూడా పటం ద్వారా తెలుసుకున్నారు మీరు మునుపటి టపాలో )
ఇక్కడ గమనించ వలసిన విషయం: మనం క్రితం టపాలలో వివరం గా చూసినట్లు, కామోత్తేజ స్థానాలు శరీరమంతా వ్యాపించి ఉన్నా , కొన్ని స్థానాలలో నాడీ తంత్రులు అత్యంత సంఖ్య లో ఉండటం వలన ఆ స్థానాలు ఎక్కువ గా ప్రేరేపితం అవుతే ఎక్కువ ఆర్గాసం లేక సంపూర్ణమైన ఆర్గాసం  అనుభవించ వచ్చు.
కేవలం పురుషాంగం వజైన లేక యోని లో ప్రవేశించి నంతనే సంపూర్ణ కామోచ్ఛ దశ ను అనుభవించడం జరుగక పోవచ్చు. ఇలాంటి పరిస్థితులలో, క్లై టో రల్ స్టిములేషన్  లోపించవచ్చు.
సంప్రదాయక  సంగమ పద్ధతులలో ( పధ్ధతి అనవచ్చేమో ) పురుషాంగం ద్వారా  క్లై టో రిస్ కూ ఆంటే యోని కీలకూ, యోని లోపలి పెదిమ ( labia minora )  కూ  సరియైన ప్రేరణ కలగక పోవచ్చు.
( యోని లేక వ జైన ఇరుప్రక్కలా అతి సున్నితమైన కండరాల పొరలను యోని పెదవి లేక లేబియా అంటారు. ఈ  లేబియా రెండు పొరలు గా ఉంటుంది ఇరుప్రక్కలా ఈ లేబియా లేక పెదవులు పుష్పము లోని ఆకర్షక పత్రముల  లాగా అంటే petals లాగా అమరి ఉంటాయి. ఈ రెండు సున్నితమైన కండరాల పొరలనూ లేబియా మేజోరా ఇంకా లేబియా మైనోరా అంటారు వైద్య పరిభాషలో. ఈ లేబియా మైనోరా లో యోని కీల నుంచి అంటే క్లై టో రిస్ నుంచి నాడీ తంత్రులు వ్యాపించి ఉంటాయి.) తద్వారా ఆర్గాసం కలుగదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి  శాస్త్రజ్ఞులు ‘  కాయిటల్ ఎలైన్మెంట్ టెక్నిక్ ‘ అని ఒక ప్రత్యేకమైన ( రతి సమయం లో ప్రేయసీ ప్రియుల  అమరిక ) సూచించారు. దీనిని గురించి ముందు ముందు తెలుసుకుందాం ) 
 
ఇంకొన్ని విషయాలు వచ్చే టపాలో చూద్దాము !

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.13.

In Our Health on మార్చి 26, 2012 at 4:28 సా.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.13.

స్త్రీలలో క్లైమాక్స్ లేక ఆర్గాసం : 
స్త్రీలలో క్లైమాక్స్ లేక ఆర్గాసం  రెండు రకాలు గా చెప్పుకోవచ్చు. ఒకటి యోని కీల ద్వారా జనించే ఆర్గాసం. దీనిని క్లై టో రల్ ఆర్గాసం అని కూడా అంటారు. రెండవ రకం యోని ద్వారా జనించే ఆర్గాసం. దీనినే వజైనల్ ఆర్గాసం అని కూడా అంటారు.
విపుల్, పెర్రీ ఇంకా లాడాస్ అనే ముగ్గురు, మూడు రకాల ఆర్గాసం ను ప్రతిపాదించారు స్త్రీలలో. ఇవి టెన్టింగ్ టైపు, ( tenting type ) ( ఇది యోని కీల ను ప్రేరేపించటం ద్వారా  జనించిన ఆర్గాసం ) 
రెండవది : ‘ A ‘ frame type   అంటే ఇది ‘ G spot ‘ స్తిములేషన్ ద్వారా జనించినది ( మనం G spot అంటే ఏమిటో వివరం గా  పటం సహాయం తో  తెలుసుకున్నాము మునుపటి టపాలో ). మూడవది ‘ బ్లెన్ డెడ్ ‘ టైపు  అంటే ఈ మూడో రకం లో ఆర్గాసం  యోని కీల ను అంటే  క్లైటోరిస్ ను , యోనిని అంటే వజైన  ను , రెండిటినీ స్టిములేట్ చేయటం వలన జనించే ఆర్గాసం. 
ఆర్గాసం ను స్త్రీలలో రెండు రకాలు గా అంటే క్లై టో రల్  ఆర్గాసం గానూ, వజైనల్ ఆర్గాసం గానూ మొదట ప్రతిపాదించినది సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి మీరు తెలుసుకునే ఉంటారు.
మానసిక శాస్త్రం లో అనేక పరిశోధనలు, అనేక ప్రతిపాదనలూ చేశాడు ఆయన.  ఆయన ప్రతిపాదన ప్రకారం, క్లై టో రల్ ఆర్గాసం అంటే యోని కీల ద్వారా జనించిన ఉచ్చ దశ, రజస్వల అయిన తొలి రోజులలో యువతులలో ఉండే లేక యువతులు పొందే ఉచ్చ దశ లేక ఆర్గాసం. క్రమేపీ , యవ్వన దశ నుంచి ప్రౌఢ దశ కు యువతులు చేరిన తరువాత, యోని ద్వారా జనించే ఆర్గాసం, వజైనల్ ఆర్గాసం గా పరిణామం చెందుతుందని. అంటే ఫ్రాయిడ్ ప్రతిపాదనలో ప్రౌఢ దశ లో క్లై టో రల్  అర్గాసం ఉండదు.కేవలం  పురుషాంగము , యోని అంటే వ జైన లో ప్రవేశించినంతనే , స్త్రీ కామ పరంగా ఉచ్చ దశ లేక క్లై మాక్స్ కు చేరుకుంటుందని. కానీ ఫ్రాయిడ్ ఈ ప్రతిపాదన ఏ విధమైన  రుజువు లేక పరిశోధన లేకుండా చేశాడు. తరువాత వచ్చిన శాస్త్రజ్ఞులు పలు పరిశోధనలలో,  స్త్రీలు కేవలం  వజైనల్  స్తిములేషన్ ద్వారా అంటే రతిక్రియలో కేవలం పురుషాంగం యోనిలో వెళ్ళడం ద్వారానే సంపూర్ణమైన ఆర్గాసం పొందలేక పోయారు అని తేల్చారు. 
 ఆల్ఫ్రెడ్ కిన్సే అని ఇంకో మానసిక శాస్త్రజ్ఞుడు తరువాత అనేక వేలమంది స్త్రీలలో పరిశీలన చేసి ఫ్రాయిడ్ ప్రతిపాదనను తీవ్రంగా విమర్శించాడు. కిన్సే  పరిశీలనలో చాలామంది స్త్రీలు కేవలం వజైనల్ ఆర్గాసం అంటే యోని ద్వారా సంపూర్ణమైన  సుఖ ప్రాప్తి లేక ఆర్గాసం పొందలేక పోయారు, రతి లో.
కిన్సే,  కామోచ్ఛ దశ లో  అంటే స్త్రీలలో ఆర్గాసం,లేక క్లై మాక్స్ కు యోని కీల లేక క్లై టో రిస్  అతి కీలకమైనదని, ఇంకా రతి క్రియ లో ప్రధాన పాత్ర వహిస్తుందని  తేల్చి చెప్పాడు.
ఆయన ఇంకా, స్త్రీలు, పురుషాంగము యోనిలో ప్రవేశించినప్పుడు వారు పొందే  కామ పరమైన అనుభూతి ఆర్గాసం కాదనీ అది కేవలం మానసికమైన అనుభూతి అని, క్లై టోరల్ స్తిములేషన్ తో పొందిన సుఖ ప్రాప్తి లేక ఆర్గాసమే  నిజమైన ఆర్గాసం లేక క్లై మాక్స్ అనీ చెప్పాడు.
మరి కొన్ని విషయాలు వచ్చే టపాలో చూద్దాము ! 

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.12.

In Our Health on మార్చి 25, 2012 at 9:35 సా.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.12.

ఆర్గాసం లేక క్లైమాక్స్ లేక కామోచ్ఛ దశ  అంటే ఏమిటి ?:

 
ఆర్గాసం  రతి క్రియ లేక సంభోగ క్రియ లో అత్యున్నత దశ. ఈ దశలో  నిగూఢమైన కామ పరమైన వత్తిడి ఒక్క సారిగా విడుదల అవుతుంది. ఇలా జరగటం తో పెల్విక్ ఏరియా అంటే కటివలయ ప్రాంతం అంతా ఒక లయ బద్ధమైన  బిగువు కు లోనవుతూ ఉంటుంది అంటే ‘  రిధమిక్ కాన్త్రాక్షన్ ‘  కు లోనవుతుంది. ఈ లయ బద్ధమైన పెల్విక్ ‘ బిగువుల తో పాటు ఒక  అత్యంత ఆనంద కరమైన అనుభూతి కలుగుతుంది. 
ఈ రకమైన ఆర్గాసం ను స్త్రీలూ, పురుషులూ పొందగలరు. ఈ ఆర్గాసం, అనియంత్రిత చర్య ఇది మెదడు లోని భాగమైన లింబిక్ వ్యవస్థ కు అనుసంధానమై ఉంటుంది. ఇంకా దేహం లో మిగతా భాగాలలో కూడా కండరాలు కూడా బిగువు చెంది మనసంతా ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. కొందరిలో ఈ అనుభూతి గొంతులోనుంచి మాటల రూపం లోనూ, కామోత్తేజం తో కూడిన శబ్దాల రూపం లోనూ బయట పడ వచ్చు.  
ఈ ఆర్గాసం ను పూర్తిగా అనుభవించిన తరువాత,  ‘ యధా స్తితి ‘ లేక రిఫ్రాక్టారీ  పిరియడ్  ఉంటుంది. అంటే ఈ దశలో  చాలా రిలాక్సింగ్ అనుభూతి కలుగుతుంది. ఈ రిఫ్రాక్టారీ దశ లో మళ్ళీ రతిక్రియ కు వెంటనే సంసిద్దులవలేరు. ప్రత్యేకించి పురుషులలో ఈ రిఫ్రాక్టారీ దశ, స్త్రీల లో కంటే ఎక్కువ సమయం ఉంటుంది. ఈ దశ కు ఆక్సీ టోసిన్, ప్రోలాక్టిన్ విడుదల అవటం కారణమని భావించ బడుతుంది.
మనకు గుండె కొట్టుకునేటప్పుడు తరంగాలు ఈ సి జీ  లేక  ECG రూపం లో రికార్డు చేయవచ్చు. అలాగే  మెదడు లో తరంగాలు కూడా రికార్డు చేయ వచ్చు. ఈ విషయం తెలుసుకోవడం ఎందుకంటే , ఆర్గాసం అనుభవిస్తున్నప్పుడు , మెదడు లో లింబిక్ వ్యవస్థ ఎక్కువ క్రియాశీలం గా అయి మిగతా మెదడు భాగాల కంటే ఎక్కువ  మెటబాలిక్ చర్యలు జరుగుతుంటాయని పరిశోధనల వల్ల తెలిసింది.  ఈ చర్య స్త్రీలలోనూ , పురుషుల్లోనూ సమానం గా జరుగుతుంది. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే స్త్రీలు, పురుషులు సమానం గా ఆర్గాసం అనుభూతి చెందుతారు.
ఆర్గాసం గురించి ఇంకొన్ని విషయాలు వచ్చే టపాలో చూద్దాము !

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ – 11.

In Our Health on మార్చి 24, 2012 at 11:35 సా.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ – 11.

‘ లవ్ హార్మోన్ ‘ అంటే ఏమిటి?: 

ఆక్సీ టోసిన్ ( oxytocin )  ను ‘  లవ్ హార్మోన్ ‘ లేక ‘  ప్రేమ హార్మోన్’  అంటారు. ఆక్సీ టోసిన్ కూడా ఒక హార్మోనే ! ఇది స్త్రీలలో అనేక రకాల  జీవ రసాయన చర్యలకు కారణం. ఇటీవల జరిపిన పరిశోధనలలో చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి ఆక్సీ టోసిన్ గురించి. ఆక్సీ టోసిన్  స్త్రీల ప్రత్యుత్పత్తి సమయం లో విడుదల అవుతుంది. స్త్రీలు గర్భ ధారణ సమయం లోనూ, తరువాత శిశువు జన్మించే సమయంలోనూ  అనేకమైన కీలకమైన క్రియలు నిర్వర్తిస్తూంది. తరువాత , మానవ శరీరం లో అనేక హావ భావాలకూ ఎమోషన్లకూ, అంటే అనుభూతులకు కూడా ఈ ఆక్సీ టోసిన్ కారణ భూతమని విశదపడ్డది. ఆకర్షణ,ప్రేమ,  ఆప్యాయత, ఆనందం, వత్తిడి తరువాత  కలిగే విముఖత –  ఈ అనుభూతులన్నిటిలోనూ, ప్రత్యక్షంగానో, పరోక్షం గానో ఆక్సీ టోసిన్ పాత్ర ఎంతో ముఖ్యమైనదని తెలిసింది. పురుషులలో ఆక్సీ టోసిన్ : ఇటీవల జరిపిన పరిశోధనలలో  పురుషులలో కూడా ఆక్సీటోసిన్ తన ప్రభావం చూపి వీర్య స్ఖలనం జరిగే చర్యకు కారణ భూతమవుతుందని తెలిసింది. మనం ఇంతకు ముందు టపాలలో చూశాము, కామోత్తేజం కలిగినప్పుడు ఆక్సీ టోసిన్ స్థనం నుంచి విడుదల అవుతుందని.అలాగే ఆక్సీ టోసిన్ తల్లి,  పాలు తాగించేప్పుడు కూడా చనుబాలు ఎక్కువ స్రవించ డానికి కూడా ఆక్సీ టోసిన్ మహిమే ! కొందరు స్త్రీలలో కనిపించే అతి దుడుకు స్వభావము, కపటత్వము, సానుభూతి చూపలేక పోవడము, అసాంఘిక ప్రవర్తన, ఈ స్వభావాలన్నిటికీ వారిలో ఆక్సీ టోసిన్ సరిగా స్రవించక పోవడం కారణమని భావించడం జరుగుతుంది. మెదడులో ఆక్సీ టోసిన్ ప్రభావం: వివిధ పరిశోధనల ద్వారా ఆక్సీ టోసిన్,  కామోత్తేజం కలిగించి, తద్వారా కామోచ్చ అంటే ఆర్గాసం కూ , పేర్ బాండింగ్ లేక  పురుషునితో జంటగా చేరడం లో ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాగే,  రొమాంటిక్  అటాచ్మెంట్ ప్రవర్తనకు , మాతృ భావనలకూ ఆక్సీ టోసినే కారణం. ఇంకా ఆక్సీ టోసిన్, గర్భాశయ  కండరాలు గట్టిగా అంటే కాంట్రాక్ట్ అవటానికీ, గర్భ ద్వారం అంటే సర్విక్స్  ( శిశు జనన సమయం లో ) కండరాలు రిలాక్స్ అవటానికీ తోడ్పడుతుంది.  గాయం మానటానికి కూడా ఆక్సీ టోసిన్ ఉపయోగ పడుతుందని తెలిసింది. సాంఘిక ప్రవర్తన లో కూడా ఆక్సీ టోసిన్ పాత్ర ఉందని తెలిసింది  ఇతర వ్యక్తుల తో ప్రవర్తించే సమయం లో బిడియం తగ్గి, నమ్మకం పెంచుకునే దిశలో ఆక్సీ టోసిన్ సహాయ పడుతుందనీ, అలాగే బెట్టింగ్ అంటే పందాలు కాసే సమయం లో ఆక్సీ టోసిన్  risk taking behaviour  అంటే రిస్కు తీసుకునే స్వభావాన్ని తగ్గిస్తుందనీ తెలిసింది.

వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు చూద్దాము !

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.10.

In Our Health on మార్చి 24, 2012 at 12:31 సా.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.10.

కామ వాంఛ లో జీవ రసాయనాల పాత్ర:
మనం ఈ వ్యాసం మొదటి భాగం లో చూసినట్లు,  మనలో మెదిలే కామ వాంఛలకూ , తద్వారా పాల్గొనే రతిక్రియ లోనూ , మన శరీరం లో తయారయే జీవ రసాయనాలు మూల కారణాలు.
ఈ జీవ రసాయనాలు హార్మోనుల రూపం లోనూ, నాడీ వాహక రసాయనాలు గానూ మన దేహం లో వాటి  జీవ క్రియలు నిర్వర్తించుతాయి.
ఈ హార్మోనులూ, నాడీ వాహక రసాయనాలూ ఏ విధంగా  కామ వాంచను, రతిక్రియ నూ ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాము.
హార్మోనులు ( harmones ) కూడా జీవ రసాయనాలే కానీ వారి నిర్మాణము నాడీ వాహక రసాయనాల కంటే క్లిష్టంగా ఉంటుంది. హార్మోనులకు, నాడీ వాహక రసాయనాల తో ఉన్న సంబంధము చాల జటిలమైనది. సాధారణం గా హార్మోనులు విడుదలైనప్పుడు అవి నాడీ వాహక రసాయనాలను ప్రభావితం చేస్తాయి. అప్పుడు నాడీ వాహక రసాయనాలు నాడీ కణాల ద్వారా ప్రయాణించి వాటి చివరల ఉన్న భాగాన్ని క్రియాశీలం చేస్తాయి.
ఒక ఉదాహరణ చూద్దాము: 
టేస్తో స్టిరాన్ ( testosterone ) : ఈ రసాయనము ఒక హార్మోను. ఈ హార్మోను  ఎక్కువ శాతం పురుషులలో వృషణాల నుంచి  , కొద్ది శాతం  మూత్రపిండాల మీద టోపీ లాగా ఉండే ఒక గ్రంధి
 (  దానిని ఎడ్రినల్ గ్రంధి అంటారు ) నుంచి,  విడుదల అవుతుంది.
స్త్రీలలో కూడా టేస్తోస్టిరాన్ విడుదల అవుతుంది స్వల్పంగా అండాశయాల నుంచీ  ఎడ్రినల్ గ్రంధి నుంచీ. కానీ స్త్రీలు  ఈ టేస్తోస్టిరాన్ కు ఎక్కువ సెన్సిటివ్ గా ఉంటారు, పురుషుల కన్నా !
 ( పురుషుల  దేహం లోని వివిధ భాగాల పైన టేస్తో స్టిరాన్ ఏ విధంగా పనిచేస్తోందో పైన ఉన్న  పటం చూసి గమనించండి )
టేస్తోస్టిరాన్  మెదడు లో ఉన్న హైపో తలామాస్ , లింబిక్ సిస్టం లో ఉన్న , డోపమిన్ , నార్ ఎడ్రినలిన్, మెలకార్టిన్ ఇంకా ఆక్సీటోసిన్  – ఈ రసాయనాలను ( వీటిని న్యూరో పెప్టైడ్లు అని కూడా అంటారు ) ప్రభావితం చేస్తుంది. ఇలా ప్రభావితం చేయటం వల్ల  మెదడు లో ఏకాగ్రత పెరిగి, కామ వాంఛ, రతిక్రియలో ఉత్సాహమూ పెరుగుతాయి.
ప్రత్యేకించి   న్యుక్లియస్ అక్కంబెంస్ అనే స్థానం లో  డోపమిన్ ప్రభావం వల్ల , కామోత్తేజము,  ఎరౌసల్, ఇంకా రతిక్రియలో పాల్గొనాలనే మనో వాంఛ కూడా జనిస్తాయని  శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. 
అలాగే కామ వాంచను తగ్గించే రసాయనాలు కూడా మన దేహం లో ఉంటాయి. ఈ జీవ రసాయనాలను, ‘ ఓపి యా ఇడ్లు ,  ఎండో కన్నబినాయిడ్ లు , సీరో టోనిన్ లు ‘ అంటారు   .
 ఇవి క్రియాశీలం అయినప్పుడు కామ వాంఛ తగ్గుతుంది.  రతిక్రియలో తృప్తి పొందిన తరువాత కూడా ఈ రసాయనాలు విడుదల అవుతాయని పరిశోధనల వల్ల తెలిసింది.
మేలనో కార్టిన్ లాంటి కృత్రిమ మందులు, అంగ స్తంభనం సమస్యలు ఉన్నవారికి ఇస్తే వారిలో ఆ సమస్య పరిష్కారమవుతుందని  కూడా తెలిసింది.
మరికొన్ని విషయాలు వచ్చే టపాలో చూద్దాము.
%d bloggers like this: