కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.18.
పురుషులలో అనార్గాస్మియా :
పురుషులలో సుఖ ప్రాప్తి, దీనినే ఆర్గాసం లేక క్లయిమాక్స్ పొందలేక పోవడం, ముందు టపా లలో చూసినట్లు, స్త్రీలలో కంటే తక్కువ గా ఉంటుంది. ప్రపంచం లో ఈ విషయం పైన ఖచ్చితమైన గణాంకాలు లేవు కానీ ఒక అంచనా ప్రకారం కనీసం పది లక్షల నుంచి ఒక కోటి మంది వరకూ ఈ సమస్య తో బాధ పడుతున్నారు.
కారణాలేమిటి?: పురుషులలో అనార్గాస్మియా కు కూడా భౌతిక కారణాలు, మానసిక కారణాలు అని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు.
కాక పొతే తొంభయి శాతం సమస్యలు మానసికమైనవే అని వేరు వేరు చోట్ల చేసిన పరిశోధనలు తెలుపుతున్నాయి.
మానసిక కారణాలలో ముఖ్యమైనది, రతి క్రియ ముందు ఉండే ఆత్రుత దీనినే పర్ఫామెన్స్ యాంగ్ సైటీ, ( performance anxiety ) అని అంటారు ఆంగ్లంలో. ఈ పర్ఫామెన్స్ యాంగ్ సైటీ కేవలం అంగ స్తంభన లేక స్ఖలనం మీద ఆందోళన కాదు. దీనికి ముఖ్య కారణం కేవలం మానసికం గా సంసిద్ధత లేక పోవడం. దీనితో ఆత్రుత ఎక్కువ అయి అది ఒక క్లిష్టమైన వలయం లా తయారవుతుంది. అంటే ఒకసారి మానసికం గా సంసిద్ధత లేక ఆత్రుత పడుతుంటే,ఆ ఆత్రుత వారి ని సంపూర్ణం గా రతిక్రియలో పాల్గోననీయక వారిని విముఖులను చేస్తుంది. ఈ విముఖత వల్ల వారు కామోచ్చ దశ పొందలేరు. దానితో వారి ఆత్రుత ఇంకా ఎక్కువ అవుతుంది.
రతిక్రియ ముందు తీవ్రమైన వత్తిడి కి లోనవటం కూడా ఒక సాధారణం గా కనిపించే కారణం. ఇది తాత్కాలికం మాత్రమే. వత్తిడి కలిగించే సంఘటనలు పరిష్కారం చేసుకుంటే, మామూలు గా కామోచ్ఛదశ పొంద గలరు.
అలాగే, సెక్స్ అంటే చిన్నతనం లో జరిగిన సంఘటనల వల్ల, విముఖత కలిగితే కూడా వారు పెరిగాక సుఖ ప్రాప్తి ని ప్రభావితం చేయ వచ్చు.
ప్రేయసి పై ఇష్టం కోల్పోవడమూ, ఎప్పుడూ కొత్తదనం లేక పోవడమూ, దాంపత్యం లో కలతలూ, తమ ( శృంగార ) జీవితం పైన విసుగు కలిగినా కూడా అది సుఖ ప్రాప్తి పొందలేక పోవడానికి దారి తీయ వచ్చు.
కొన్ని రకాల మందులు కూడా రతి సామర్ధ్యాన్ని ప్రభావితం చేయ వచ్చు. నిద్ర మాత్రలూ, డిప్రెషన్ కు తీసుకునే మందులు కూడా ఈ కోవ కు చెందినవే.
అలాగే మద్య పానం కూడా ! మద్య పానం ఎక్కువ మోతాదు లో , చాలా కాలం చేస్తుంటే, అది కామ వాంఛ ను ఎక్కువ చేస్తుంది కానీ రతి సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది
( excessive alcohol use increases the sex drive but decreases performance ) . ఈ విషయం మద్య పాన ప్రియులందరూ గమనించాలి.
వెన్ను పూస కు ఏమైనా ప్రమాదం లో దెబ్బ తగిలితే, ఇంకా మధు మేహం ముదిరితే, ఇంకా కొన్ని రకాలైన నాడీ సంబంధ వ్యాధులు కూడా పురుషులలో ఆర్గాసం ను ప్రభావితం చేయ వచ్చు.
వచ్చే టపా లో ఇంకొన్ని విషయాలు చూద్దాము !