ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 9.
అందమైన వారే ప్రేమించ బడతారా?
సాధారణం గా అందమైన మానవులు స్త్రీలైనా , పురుషులైనా, ఎక్కువ ప్రేమకు పాత్రులని అందరూ అనుకుంటుంటారు.
మన ఇతిహాసాలలో కానివ్వండి , చరిత్ర లో కానివ్వండి, అనాది నుంచి ‘ అందం ‘ అనే రహదారి ద్వారా వెళితేనే ‘ ప్రేమ సామ్రాజ్యాన్ని ‘ చేరుకోగలరని వివరింప బడింది.
కృష్ణుడు, నీల మేఘ శ్యాముడు గా తన గోపికలనందరినీ వశ పరుచుకున్నాడనీ మనం అనేక సార్లు చదువుకున్నాము. అలాగే మిగతా అందరికీ అందం గా అనిపించకపోయినా మజ్నూ కు, లైలా ఎంతో అందమైనది గా అనిపించి ‘ నా కళ్ళు అరువు తీసుకుని చూడండి లైలా అందం, అప్పుడు మాత్రమే ఆమె అందం కనిపిస్తుంది మీకు !! ‘ అని అంటాడని మనకు తెలుసు.
అలాగే డాంటే , బియాట్రిస్ అందం చూడాలని తపించిపోయే వాడని మనకు తెలుసు.
మరి నిజంగానే అందమైన వారే ప్రేమ కు పాత్రులా ? ఈ కధా కమామీషు మనం కొంత తెలుసుకుందాము.
ప్రేమ, అందం కలగలిసి కామ వాంఛ ల అలలు రేపుతాయి మనలో !! గాఢమైన ప్రేమ, కామ పూరితమైన వాంఛ తో ముడి పడి ఉంటుంది. మన మెదడు లో కూడా ఆశ్చర్యకరంగా ప్రేమ, అందం ఒకే కేంద్రం లో ఉంటాయి. ఒక అందమైన ఆకర్షణీయమైన ముఖం, అలాంటి ముఖాన్ని చూస్తున్నామన్న అనుభూతి , ఆ అనుభూతి ద్వారా ఉత్పన్నమైయ్యే కామోద్దీపన ,అంటే ‘ sexual arousal ‘ ఈ మూడు అనుభూతులకూ మెదడు లో ‘ orbito frontal cortex ‘ అంటే ఆర్బిటో ఫ్రాన్ టాల్ కార్టెక్స్ ‘ అనే కేంద్రం ఉంటుంది.
మనం ప్రేమిస్తున్న వారి ముఖం చూసినప్పుడు కలిగే అనుభూతులకు మెదడు లో ఇంకో రెండు భాగాలు కూడా ప్రేరేపితమౌతాయి. వాటిని ‘ insula ‘ and anterior cingulate cartex’ అంటే ఇన్సులా మరియూ యాన్తీరియర్ సిన్గులేట్ కార్టెక్స్ అని అంటారు.
మనం పరిణామ రీత్యా చూస్తె , ఆందోళన పరిచే ఏ వ్యక్తినైనా, జంతువునైనా చూసినప్పుడు , మన మెదడు లో ఉన్న ఫ్రాన్ టాల్ కార్టెక్స్ , ఇంకా అమిగ్డలా ( అంటే ‘ frontal cartex and amygdala ‘ ) అనే భాగాలు ఎక్కువ క్రియాశీలమవుతాయి.
కానీ పరిశోధనలలో తెలిసిన విషయం. మనం మనకు ప్రియమైన వారిని చూసినప్పుడు సహజంగా ప్రేరేపితమయ్యే పైన చెప్పిన మెదడు లోని భాగాలు అసలు ప్రేరేపితం కావు.
దీనిని బట్టి తెలిసినదేంటంటే, మనకు ప్రియమైన వారిని చూసినప్పుడు, మనం ఏవిధమైన ఆందోళన కూ లోను కాకుండా ప్రశాంతం గా కామోద్రేకం ప్రేరేపించ బడే దిశలో ఉంటామని.
ఇంకో విధంగా చెప్పాలంటే, అందమైన ముఖం చూసి పొందే ప్రేమానుభూతి , కేవలం మన మెదడులో ఉండే .నాడీ వలయాలను ప్రతిబింబిస్తాయి.
ఈ నాడీ కేంద్రాలనూ, నాడీ వలయాలనూ క్రియాశీలం చేయటంలో మనకు అందం అంటే ఉన్న ఉద్దేశాలు, మన బాల్యం నుంచి మనకు అందం పైన ఉండే అవగాహన, మనం పెరుగుతున్నప్పుడు అందం మీద ఏర్పడ్డ భావాలు, మన సాంస్కృతిక, దేశ, ప్రాంత పరిస్థితులు, వేష ధారణ , ఇవన్నీ ప్రధాన పాత్ర వహిస్తాయి.
వచ్చే టపాలో మరికొన్ని విషయాలు చదవండి ప్రేమ గురించి !!!