Our Health

Archive for ఫిబ్రవరి, 2012|Monthly archive page

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ – 2.

In Our Health on ఫిబ్రవరి 29, 2012 at 11:57 ఉద.
ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ –  శాస్త్రీయ విశ్లేషణ – 2.
ఆకర్షణ – లక్షణాలు.
The Call of the Prairie by Andrea T. Kramer
మొదటి దశ లో  ఆకర్షణ,   ప్రతి మానవ ప్రణయ జీవితంలోనూ ఒక ప్రత్యేకమైన అనుభూతి !!  ఆ అనుభూతి ఒక నూతన తేజాన్ని ఇస్తూంది జీవితానికి.
ఆమె అతనిలో అంతులేని ఆకర్షణ చూస్తూంది. అతడు ఆమెలో ఉండే అన్ని గుణాల వైపూ ఆకర్షించ పడతాడు. ఇద్దరూ ప్రపంచాన్ని ఒక కొత్త కోణం లో చూస్తారు.
సినీ గేయ రచయితలు ఈ ఆకర్షణ  లక్షణాలను రమణీయం గా వర్ణించి , పాటల రూపం లో మనకు అందించారు ( వారు ఏ  సర్టిఫికేట్ అవసరమూ లేని గొప్ప మానసిక విశ్లేషకులు  ఈ విషయం లో !! ).
కొన్ని ఉదాహరణలు చూద్దాము.
నా హృదయం లో నిదురించే చెలీ, కలలలోనే కవ్వించే సఖీ !! మయూరి వై నీవే నటనమాడినావే, నన్ను దోచినావే ……!!,
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే, పిలువక పిలిచే కనులలోన, నీ మనసు నాదనుకొంటి లే !!
కదిలీ కదలని లేత పెదవులా తేనెల వానలు కురిసేనులే !  రుస రుస లాడుతు, విసిరినా వాల్జడ, వలపు పాశమని తలచితిలే !!!
తొలివలపే, పదే పదే పిలిచే, మది లో తొందర చేసే !!!,
మనసు పరిమళించెనే, తనువు పరవసించేనే, నవ వసంత రాగము తో, నీవు చెంత నిలువగనే !!
రేపంటీ రూపం  కంటీ పూ వింటీ తూపుల వెంటా నా పరుగంటీ !!!,
మనసు పరవసించినే, తనువు పులకరించెనే , నవవసంత రాగము తో, నీవు చెంత నిలువగనే !!!,
తొలివలపే తీయనిది !, మది లో ఎన్నడు మాయనిది !!.
కనులు కనులతో కలబడుతుంటే, ఆ తగవుకు ఫలమేమి ?- కలలే, నాకలలో నీవే కనపడుతుంటే, ఆ చొరవకు బలమేమి ?, మరులే,  మరులు మనసు లో స్థిరపడితే ఆ పై జరిగిగేదేమి ?, మనువూ,
మనువై ఇద్దరు ఒకటైతే, ఆ మనుగడ పేరేమి ?, సంసారం !!
వలపు వలె తీయగా వచ్చినావు నిండుగా ! మెరుపు వలె తళుకు మని  మెరిసి పోయే తందుకా ?
దాచాలంటే దాగవులే, దాగుడు మూతలు సాగవులే, వలపుల సంకెల బిగిసే దాకా వదలను వదలను వదలనులే !!
చేను లో ఏముంది ? నీ మేను లో ఏముంది ? చేనులో బంగారం, నీ మేను లో సింగారం అంటూనే పాట చివర నేనులో నీవుంది, నీవులో నేనుంది అంటూ ప్రణయ ప్రపంచంలో ఐక్యమవుతారు ప్రేయసీ ప్రియులిద్దరూ ఈ ఆకర్షణ వలలో చిక్కి  !!
కన్నె పిల్లవని, కన్నులున్నవని , ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ?  !! చిన్న నవ్వు నవ్వి,  ఎన్నెన్ని కలలు రప్పించావే వయ్యారి !!, సంగీతం నువ్వైతే, సాహిత్యం నేనౌతా !!!
పదహారేళ్ళకు, నీలో నాలో,  ఆ ప్రాయం చేసే చిలిపి పనులకూ కోటి దండాలు !
వలపు ఏమిటి , ఏమిటి ఏమిటి ? వయసు తొందర చేయుట ఏమిటి ? మనసు ఊయల ఊగుట ఏమిటి ? ఎచట దాగెను రాగల పెనిమిటి?  అంటూ ఆమె మతి స్థిమితం కోల్పోయిన భ్రమరం లా  ఆడుతూ పాడుతుంది ఈ తొలి వలపు అనుభవాల ఉరవడి కోసం ఉబలాట పడుతూ !!
ఇలా తొలి వలపు, ఆకర్షణ తీవ్రత, ఎంతో బలంగా ఉండి  అతడి మనసునూ ఆమె మనసునూ ఆనంద  డోలలలో తేలించి ప్రణయ భావాలను మనసులో ఉప్పొంగ చేస్తుంది.
ఇక్కడ గమనించ వలసిన విషయాలు :
అతను సహజంగా ఎక్కువ చొరవ చూపి  ఆమె మీద తన అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాడు. తొలివలపు అంటే మొదటి దశలలో ఉండే ఆకర్షణ, మన సినీ కవులు రమ్యంగా వర్ణించి నట్టు, కనుల మీదా, పొందు మీదా , పెదవుల మీదా, వయసు మీదా, వయసు తో వచ్చే అందాల మీదా,  కేంద్రీకరించ పడ్డాయి. ఆమె చిరుకోపం తో తన వాలు జడను విసిరినా, దానిని, ఆమె ఆకర్షణ మోహంలో వలపు పాశం గా భావించుతూ, ఇంకా కవ్విస్తున్నాడు !!
ఇక ఆమె,  అత్యుత్సాహం తో పరవశించి పోతూ , అతనిని తన జీవిత సహచరునిగా ఊహించుకొంటూ, తమ ఇద్దరి పొందూ ఎంత అత్భుతంగా ఉంటుందో  అని స్వప్న మేఘాల పై తేలియాడు తుంటుంది.  ఆమె ప్రపంచం లో కేవలం ఆమె, అతడే !! ఆ క్షణాలలో ! ఇంకెవ్వరూ  ఆమె ఆలోచనలలోనూ, అనుభూతులలోనూ  ఉండరు ప్రముఖంగా !!
ఈ తొలి వలపుల ‘ సంకెల ‘  అంత బలీయమైనది అందుకే ! అంత నూతనమైనదీ, ప్రత్యేకమైనదీ నూ,  ప్రతి ఒక్కరికీ !!!
ఆకర్షణ గురించి మరికొన్ని ఆకర్షణీయ మైన విషయాలు వచ్చే టపాలో చదవండి !!
 ( ఈలోగా  మీ  ఈ టపా పై మీ అభిప్రాయం తెలియ చేయండి ! )

ఆకర్షణ, ప్రేమ , కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ – 1.

In Our Health on ఫిబ్రవరి 27, 2012 at 5:24 సా.
ఆకర్షణ, ప్రేమ , కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ – 1.
ఆకర్షణ :
ఆంగ్లం లో ‘ attraction ‘ , ‘ infatuation ‘ ,’ passionate , obsessive, or romantic love ‘ అని కూడా అంటారు. ఏ పేరు తో పిలిచినా ఆకర్షణ, కౌమారం  నుంచి మొదలై,  యువతీ యువకులు   స్త్రీ, పురుషులు గా ఎదిగాక కూడా ప్రతి ఒక్కరి జీవితం లో నూ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.
ఈ ఆకర్షణ ను ‘ కోరికల సుడిగాలి ‘ అనవచ్చు. ఇక్కడ కోరికలు అంటే, ఒకరి పొందు కోసం ఒకరు ‘ తహ తహ’ లాడటం, వారి స్పర్శ కోసమూ , ఆలింగనం కోసమూ తపించడం, వారితో సమయం గడపాలనుకోవటం, ఇలాంటివి. ఈ కోరికల ‘ సుడిగాలి ‘ లో పరవశించి, అత్యత్భుతమైన అనుభూతులు పొందని మానవులు ఈ ప్రపంచంలో  లేరంటే అతిశయోక్తి కాదు !!
జీవ పరిణామ శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన ఒక సర్వే  లో ప్రపంచం లో వివిధ ప్రాంతాలలో   ఉన్న    ‘ 166 ‘ సంఘాలలో స్త్రీ పురుషుల మధ్య సంబంధాలను అధ్యయనం చేశారు. ఆ సంఘాలలో ఎక్కువ శాతం ( 147 ) ఈ ఆకర్షణ ను వివిధ రూపాలలో వ్యక్తం చేశాయి. వారు వెతికిన ప్రతి సంఘం లోనూ, స్త్రీ పురుషులు ఆకర్షణను కేంద్రీకృతం చేస్తూ, ప్రేమ గీతాలు ఆలాపించటం, నృత్యం చేయడం, ప్రేమ రసం తయారు చేయటం ( అంటే ‘ love potions ‘ ), మొదలైన కార్యక్రమాలు చేసే వారు. దీనివల్ల ‘ ఆకర్షణ ‘ విశ్వ వ్యాప్త  మానవ అనుభూతి అని శాస్త్రీయం గా తెలిసింది.
మానవులలో నే కాదు, ఇతర స్తన్య జంతువులు  ( అంటే  mammals –  పిల్లలకు వారి స్తన్యం తో పాలు ఇచ్చి పెంచుతాయి కాబట్టి స్తన్య జీవులు అంటారు  )  పక్షులలో కూడా ఈ ఆకర్షణ గుణం ఉంటుంది.
జీవ పరిణామ పితామహుడు  డార్విన్  తన సహచరుడు బాతులలో గమనించిన ఒక సంఘటనను  ‘ 1871’ వ సంవత్సరం లో ఇలా వివరించాడు ‘  ఆ ఆడ బాతు, తన జాతి లో ఉన్న మగ బాతు తో పొందు మరచి పోయి, కొత్తగా వచ్చిన వేరే జాతి మగ బాతు చుట్టూ ఈదుతూ ,  ఆప్యాయం గా దాని పైన ఎంతో ఆసక్తి కన పరుస్తూ ఉంది ‘ ‘ అది మొదటి చూపులోనే ఉన్న ఆకర్షణ ‘.
డార్విన్ ఇంకా పరిశీలన చేసి  పక్షులు రంగు రంగుల ఈకలతోనూ , స్తన్య జంతువులు ఆకర్షణీయం గా కనపడటానికి రెండు కారణాలు చూపాడు. ఒకటి  తమ వ్యతిరేక లింగ పక్షుల తో సంపర్కం కోసం, రెండు, వాటిలోనే పోటీ పడి , పోట్లాడుకోవడం కోసం.( పోట్లాట లో నెగ్గిన వాటికి సంతాన ఉత్పత్తి కి  ఎక్కువ అవకాశాలు ఉంటాయి, జీవ పరిణామ రిత్యా !! ) ఈకారణాలు వాటిలో సంతానోత్పత్తి లక్షణాలు అభివృద్ధి చెందటం వల్ల కూడా. ( అంటే        ‘ secondary sexual characters ‘  అంటే బాల్యం నుంచి  కౌమారం దశ లో కి అడుగు పెట్టినప్పుడు ప్రతి వారి దేహం లోనూ వచ్చే  మార్పులు )
కానీ డార్విన్  తన కాలం లో వివరించలేక పోయిన  ఆకర్షణకు కారణమైన వివిధ జీవ రసాయన చర్యలు , డార్విన్ తరువాత జరిగిన  శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి లో  తెలిశాయి.
ఆకర్షణకు మూలమైన జీవ రసాయన చర్యలు తెలుసుకునే ముందు  ‘ ఆకర్షణ ‘ లక్షణాలు మనలో ఎలా ఉంటాయో  వివరం గా  వచ్చే టపా లో చూద్దాము !!
( మీకు తెలుసా :  బాగు డాట్ నెట్ ను మీరు గూగుల్ లో నేరు గా కూడా సర్చ్ చేసి చదవచ్చు  )

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.

In Our Health on ఫిబ్రవరి 26, 2012 at 7:25 సా.

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ –  శాస్త్రీయ విశ్లేషణ.

 
ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – ఇవి మానవ జీవితాలల్లో అతి ముఖ్య మైన అనుభూతులు.
మన జీవితాలల్లోని వేరు వేరు దశల్లో ప్రవేశించి,  మనలో పెన వేసుకు పోయి విడదీయరాని బంధాలు అవుతాయి మనకు.
ఈ అనుభూతుల ఉప్పెనలలో అలా తేలిపోతూ ఆనందించేవారు కొందరు,  కొట్టుమిట్టాడుతూ  జీవిత నౌకలో తికమక పడేవారు కొందరు, కొట్టుకు పోయే వారు ఇంకొందరు !.
ఈ అనుభూతులు సమ తుల్యం లో ఉంటే  అది సుఖ జీవన సోపానానికి నాంది అవుతుంది. 
తరచూ మనలో చాల మంది ఈ  సమతుల్యం ప్రాముఖ్యత తెలుసుకోలేము. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న యువతీ యువకులు. 
కేవలం అనుభూతుల లా కాకుండా శాస్త్రీయ మూలాల పైన పరిశోధనలు జరిగాయి, వీటి కదా కమామీషు తెలుసుకోడానికి.
వీటి ఫలితాలు తెలియ చేయడమే ఈ వ్యాసం ఉద్దేశం. 
ఇవి తెలుసుకోవడం అందరికీ అవసరమే,  ముఖ్యం గా  యవ్వనులకు ( టీనేజేర్స్ ) !.
 
ఆకర్షణ గురించి వచ్చే టపా లో చదవండి !

పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 15 . స్మోకింగ్ కంట్రోలు లో యువత పాత్ర.

In Our Health on ఫిబ్రవరి 25, 2012 at 1:48 సా.

పొగాకు కు ఋణం – ప్రాణం  పణం . 15.  స్మోకింగ్ ఆపటం లో యువత పాత్ర. 

ఇంతవరకూ  పోస్టు చేసిన టపా ల లో  పొగాకు గురించీ , పొగాకు పీల్చటం వల్ల మానవులలో జరిగే హానీ, మానవులు పొగ పీల్చుతూ, తమ చుట్టూ ఉన్న వారికి చేసే హాని గురించీ చాలా వివరంగా చర్చించటం జరిగింది. ఇంకా ఏవైనా విషయాలు  ఏవైనా ముఖ్యమైనవి ఇక్కడ పొందు పరచనివీ ఉంటే దయచేసి తెలియ చేయండి.
నేను గమనించిన విషయం : మన దేశం లో  యువత  చాలా శక్తి వంతమైనది గా ఎదుగుతుంది.  అనేకమంది యువకులు, అత్యంత ప్రతిభా సామర్ధ్యాలు ఉన్నా , మన దేశం లో వివిధ సేవా సంస్థలను స్థాపించి, అనేక వ్యయ ప్రయాసలను ఎదుర్కొంటూ, ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నారు.
అనేకమంది నిపుణులైన యువతీ యువకులు బహుళ జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ , కొందరు ఉద్యోగాలు త్యజించీ  తమకు తోచిన రీతిలో మానవ సేవ చేస్తున్నారు.
పొగాకు నిర్మూలనలో కూడా  మన  యువత పాత్ర ఎంతో ఉంది.
వివిధ పాశ్చాత్య దేశాలలో ప్రభుత్వాలు  పొగాకు అరిష్టాలు గుర్తించి, పొగాకు నిర్మూలనకు అనేక బిలియన్ల  డాలర్లు  ఖర్చు చేస్తున్నాయి. వారు కనిపెట్టి, ఉత్పత్తి చేసిన, చేస్తున్న సిగరెట్టులు చేస్తున్న  హాని వారినే  నిర్మూలిస్తూన్నందుకు చాలా ఆందోళన పడి అనేక చర్యలు తీసుకుంటున్నారు, వేగంగా.
ఇక మన దేశ పరిస్థితి: గత ఐదు సంవత్సరాలలో అక్షరాలా యాభయి వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, సహాయం మాట అటుంచి, కనీసం భారత పార్లమెంట్ లో చర్చ కూడా చేయలేదు ఇంతవరకూ అంటే మిగతా విషయాల పైన వారి ఉత్సాహం ఎంత ఉంటుందో ఊహించ వచ్చు.
అందులో పూర్తిగా స్వయంకృతమైన పొగాకు వాడకం మీద వారికి అంటే ప్రభుత్వానికీ , ‘ నాయకులకూ’ అసలే పట్టదు.
ఈ పొగాకు వాడకం వల్ల ఎక్కువ గా నష్ట పోయేది పేద ప్రజలే !  దానికి పేదరికం తో పాటు పొగాకు వల్ల కలిగే అనర్ధాలు వివరంగా వారికి తెలియని అజ్ఞానం వల్లనే.
ఇక్కడే మన యువత కర్తవ్యం  ఎంతో ఉంది. 
విజ్ఞానం కేవలం ఇంటర్నెట్ కో , గ్రందాలయాలకో , లేక విజ్ఞాన వంతుల మస్తిష్కాలకో పరిమితం కాకుండా నిజంగా కావలసిన వాళ్లకు పంచినప్పుడే దాని ప్రయోజనం.
అంకిత భావం కల విద్యావంతు లైన  యువత స్వయంగా కానీ, వివిధ సేవా సంస్థల లో చేరి  కానీ,   పొగాకు నిర్మూలనా యజ్ఞం లో భాగ స్వామ్యులు కావచ్చు.  వారం లో  కనీసం  ఒక రోజు మీరు పొగాకు నిర్మూలనా కార్యక్రమాలు చేపట్టి  పేద ప్రజలకు పొగాకు అనర్ధాలు తెలిపి , వారిచేత పొగాకు వాడకం మాన్పిస్తే  అది మహత్తర కార్యం అవుతుంది.
రెండో ప్రపంచ యుద్ధం లో అణు బాంబు వల్ల మరిణించిన జపనీయులు  మూడు లక్షల మంది. కానీ  పొగాకు అనర్ధాల వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా  కనీసం ఒక లక్ష మంది  మరణిస్తున్నారు,  ప్రతి వారమూ అంటే ప్రతి ఏడు రోజులకూ   !!!  ( currently  one lakh people are dying every seven days  around the world due to  cigarette smoking . according to the world health organisation report )  అంటే పొగాకు వాడకం  ఒక నిశ్శబ్ద బాంబు . ఈ ‘ బాంబు ‘ అణు బాంబు కన్నా ఎన్నో రెట్లు శక్తివంతమైనది. ఐతే ఈ ‘ బాంబు ‘  అతి నెమ్మది గా అనేక  లక్షలమంది చేత ‘ ఆత్మహత్య ‘ చేయించుతున్న  ‘ బాంబు ‘ !!! ఇతరుల ప్రమేయం లేకుండా !!!
క్రింద పొగాకు నిర్మూలన లో ఉత్సాహం ఉన్న యువతీ యువకుల కోసం కొన్ని వెబ్ సైట్లు పొందు పరచటం జరిగింది.
1.WWW.WHO.INT.tobacco/en.  ప్రపంచ ఆరోగ్య సంస్థ  వెబ్సైటు. పొగాకు కంట్రోలు కు వివిధ కార్యక్రమాలు  పొందు పరచ పడ్డాయి ఇందులో.
2. http://www.ash.org.uk. ( action for smoking and health ) పొగాకు వాడకం  పైన అన్ని వివరాలూ ఉన్న ఇంకో మంచి సైటు.
3. http://www.quit. org.uk ( quit organisation UK ) పొగాకు మానేద్దాము అనుకునేవారికి అన్నివిధాలా సహాయం చేసే  వెబ్సైటు.
4.www.tobaccocontrolgrants.org.  అమెరికన్ దాత ,  ‘ న్యూ యార్క్ మహానగర మేయరు అయిన  మైకేల్ బ్లూం బర్గ్ నెలకొల్పిన సేవా సంస్థ. ప్రధానం గా ఆయన దానం చేసిన నిధితో స్థాపించ పడ్డ సంస్థ. అంకిత భావమూ , ఉత్సాహమూ, పట్టుదలా, క్రుతనిశ్చయాలు కల యువతీ యువకులు. ఈ వెబ్సైటు కు వెళ్లి నేరుగా అప్లై   చేయవచ్చు,  గ్రాంటు కోసం.
మీకు తగిన ప్రావీణ్యత కూడా ఇస్తుంది ఈ సంస్థ, ఉచితంగా.  వారు నడిపే ఆన్ లైన్ కోర్సు  పూర్తిచేసి,  ( ఇది కూడా ఉచితమే ) పొగాకు కంట్రోలు కార్యక్రమం లో క్రియా శీలురవచ్చు ఎవరైనా !! .  ఈ సంస్థ ఆశయం  ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో పొగాకు వాడకం వీలైనంత తగ్గించాలనే. అందు వల్ల మీకు అవకాశాలు ఎక్కువ, తగిన అర్హతలు ఉంటే !! ప్రయత్నించండి.
ప్రపంచ చరిత్రలో అనేక మంది లో మార్పు తెచ్చింది అతికొద్ది మంది మానవులే కదా !!!  మీలో ఆ కొద్ది మంది ఉన్నారని నా సంపూర్ణ విశ్వాసం !!!
TRASH CIGARETTES !!! BEFORE THEY trash  (Y)OUR LIVES !!!
( TRASH =  Think Rationally And Stop Harming – yourselves and others )
 అత్యంత ప్రతికూల పరిస్థితులలో ,  కృతనిశ్చయం లో తన లక్ష్య నిర్దేశనం చేసికొని విజయానికి  అత్యున్నత శిఖరాలు అందుకొని , ఇటీవలే మరణించిన  యాపిల్ కంపెనీ అధినేత యువతకు ఇచ్చిన స్ఫూర్తి దాయకమైన  సందేశం చూడండి ! ఇందులో మన హిందూ వేదాంత ధోరణి కూడా సమ్మిళితమై ఉంది కదా !!!
 
ఈ   టపా   గురించి మీ అభిప్రాయాలు తెలుపండి !!!

పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 14. పొగాకు అలవాటు మానించే మందులు ఎట్లా పని చేస్తాయి?

In Our Health on ఫిబ్రవరి 23, 2012 at 6:25 సా.
పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 14. పొగాకు అలవాటు మానించే మందులు ఎట్లా పని చేస్తాయి?
ఇంతవరకూ టపా లలో  పొగాకు పీల్చడం మనలో తెచ్చే విషాదకర పరిణామాలు ఎట్లా ఉంటాయో రాత పూర్వకంగానూ, వీడియో ల ద్వారానూ తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను.
మీ అభిప్రాయాలను స్వేఛ్చ గా తెలపండి, అవి మంచివి అయినా, కాక పోయినా. అట్లాగే ఏవైనా  సాంకేతిక పరమైన లోపాలు ఉన్నా తెలియచేయండి, దయ చేసి.
ఇప్పుడు పొగాకు మానించే మందుల గురించి కొంత తెలుసుకుందాము.
ఇవి రెండు రకాలు.
1. నికోటిన్ రేప్లస్మేంట్ మందులు :
ఇవి, నోట్లో పెట్టుకుని చప్పరించే గం లేక బిళ్ళల  లాగా, ముక్కులో స్ప్రే చేసుకునే ఇన్హేలర్  లాగా , చర్మము మీద రోజూ అతికించుకునే ప్యాచ్ ల లాగా  మార్కెట్ లో లభ్యం అవుతాయి.
ప్రధానంగా వీటి ఉపయోగం, పొగాకు మానేశాక  వెంటనే  సాధారణం గా కలిగే క్రేవింగ్ లు (  క్రేవింగ్ గురించి  క్రితం టపా లో చదివారు కదా ! ) తగ్గించడానికి.
కొన్ని వారాలు, కనీసం వీటిని వాడుతూ క్రమంగా తగ్గించి ఆపెయ్యడం ఒక పధ్ధతి.
వీటి ఉపయోగం మీద చాలామంది  నిపుణులు సందేహాలు వ్యక్తం చేసారు. ఇటీవలి ఒక పరిశోధనలో కూడా ఈ  నికోటిన్ రిప్లస్మేంట్ మందులు, ఏ మందులూ తీసుకోకుండా పొగాకు మానేసిన వారితో పోలిస్తే ఏమాత్రమూ ఎక్కువ లాభాకారిగా లేవు అని తేలింది.
పైగా డబ్బు దండగ !!! ఇంకోవిధంగా చెప్పాలంటే ఇక్కడ కూడా మీరు  నికోటిన్ కు ఋణం ఉంటారు. మీకు డబ్బు బాగా ఉంటే, ఒక ఖచ్చితమైన పధకం తో వీటిని  తీసుకొని క్రమం గా మానేస్తే వాటి లక్ష్యం, మీ లక్ష్యం నెర  వేరినట్లే కదా !!!.
2. నికోటిన్ తో సంబంధం లేకుండా  క్రేవింగ్ తగ్గించే మందులు :
ఇవి బ్యూప్రోపియోన్ , వెరినిక్లిన్ అనే మందులు. ఇవి ప్రధానంగా క్రేవింగ్ తగ్గించే మందులు. వీటిని కనీసం ఒకటి రెండు వారాల ముందు నుంచే మొదలు పెట్టి ( పొగాకు మానేసే రోజుకు  ముందన్న మాట ) కనీసం ఆరు నెలల పాటు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈమందులు ఏవీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు కదా !!
మీ కృత నిశ్చయము అన్నిటికంటే మించిన మందు. ఎందుకంటే అది మీ మెదడు లోతులు అనండి , మీ హృదయపు లోతులు అనండి, అక్కడ నుంచి వస్తూంది. అదే  మీ అలవాటు లో మార్పుకు పునాది. కృత నిశ్చయం లోపించినప్పుడు, ఎన్ని మందులు తీసుకున్నా,అవి పని చెయ్యవు సరి కదా, మీకు ఆర్ధికంగా ఇంకో భారంగా పరిణమించవచ్చు.
మీరు పైన తెలిపిన వాటిలో ఏవి వాడుదామని అనుకున్నా, వైద్య నిపుణుడి  ని సంప్రదించి   సైడ్ ఎఫ్ఫెక్ట్స్ , లాభాలు వివరంగా చర్చించి తగు నిర్ణయం తీసుకోండి !!!.
 
తరువాతి టపాలో  పొగాకు మాన్పించడం లో యువత పాత్ర గురించి చదవండి !!!

పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 13. పొగాకు మానేశాక, క్రేవింగ్ లు ‘ cravings ‘ వస్తే ఏంచేయాలి ?

In Our Health on ఫిబ్రవరి 22, 2012 at 9:23 సా.
పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 13. పొగాకు మానేశాక,    క్రేవింగ్ లు ‘ cravings ‘  వస్తే  ఏంచేయాలి ?  
పొగాకు క్రేవింగ్  అంటే  రోజూ  ముప్పయ్యో , నలభైయ్యో , సిగరెట్టులు పీల్చి పారేసే వారిలో ఒక్కసారి గా పొగాకు  ( పీల్చడం ) మానేసిన మొదటి రోజుల్లో వచ్చే సైడ్ ఎఫ్ఫెక్ట్స్.
ఈ క్రేవింగ్ గురించి ఎంత మాత్రమూ భయ పడనవసరం లేదు. ఎందుకంటే ఒక సారి వాటి గురించి తెలుసుకున్నాక  చాలా శులభంగా వాటిని మానేజ్ చెయ్యగలరు ఎవరైనా !!
తెలియనప్పుడు ఏదో ఉత్కంథత ఉంటుంది, ఆందోళనా, భయమూ ఉంటాయి. మీరు క్రేవింగ్ లక్షణాల గురించి తెలుసుకున్నాక  ‘ ఇంతేనా ‘ అనిపిస్తుంది.
క్రేవింగ్ గురించి ఎప్పుడు తెలుసుకుందాము.
క్రేవింగ్ అంటే ‘ అదే ‘  కావాలనే తపన, ‘ అది’  పొందలేక పోతున్నందుకు  మనసులో , శరీరంలో వచ్చే తాత్కాలిక మార్పులు. ఆ ‘ అది ‘ సిగరెట్టే కావచ్చు, ఆల్కహాలే కావచ్చు, లేక మాదక ద్రవ్యాలే కావచ్చు ,  ఇక్కడ గుర్తు ఉంచుకోవలసినది, ఆ యా పదార్ధాలను మొదట మన శరీరం రుచి చూసి ఉంటుంది. అంటే మన మెదడు లో  ఉండే నాడీ కణాలు ఆ యా పదార్ధాలకు కనీసం కొన్ని రోజులో , వారాలో అలవాటు పడి ఉంటాయన్న మాట. ఈ క్రేవింగ్ నే  ‘ withdrawal symptoms ‘ అని కూడా అంటారు.
పొగాకు క్రేవింగ్ లో ఈ మార్పులు పలు విధాలుగా ఉండవచ్చు.  గుండె వేగంగా కొట్టుకోవడము,  రక్త పీడనం ఎక్కువ అవటము,  ఎక్కువ స్వేదం పట్టటము, నిద్ర లేమి, ఆందోళన అధికం అవటము, డిప్రెషన్ అనిపించటం , చిన్న విషయాలకు కూడా చీకాకు పడటము, కోపము, చుట్టూ ఉన్న వారిమీద  ఆ కోపము అకారణంగా చూపించడమో, ఇవన్నీ  క్రేవింగ్ లక్షణాలే !!!
ఈ క్రేవింగ్ కు కారణము, మన మెదడు లో ఉండే అనేక రకాల  నాడీ గ్రాహకాలకు అంటే ‘ receptors ‘ కు  అంత వరకూ  ఒక క్రమమైన డోసు లో అందు తున్న  నికోటిన్ అందకపోవడమే !
ఇలాంటి లక్షణాలు అనుభవం లోకి వచ్చినప్పుడు ముఖ్యం గా మీకు వీటి గురించి ముందు గా  అవగాహన ఉంటే  మీరు ఆందోళన పడకుండా వాటిని ఎదుర్కోవడానికి సన్న ద్దులు అవగలరు.
ఇక వాటిని ఎట్లా ఎదుర్కోవాలో చూద్దాము ఇప్పుడు:
మీలో భౌతికంగా వచ్చే మార్పులు:
ఎక్కువ గా చెమట పట్టడం, ఎక్కువ ఆకలి వేయటం,  నిద్ర తగ్గిపోవటం, గుండె వేగం గా కొట్టుకోవడం; ఈ లక్షణాలు  రెండు మూడు పర్యాయాలు చల్ల నీళ్ళతో నైనా , గోరు వెచ్చటి నీళ్ళ తో నైనా స్నానం చెయ్యటం,  ఎక్కువ సార్లు  రుచికరమైన ఆహారం తక్కువ మోతాదు లో ( small quantities ) తింటూ ఉండటం,  ప్రశాంతంగా నిద్ర పోవటం, ఇలాంటి చిట్కాల తో సరి చెయ్య వచ్చు.
ఎక్కువ గా సిగరెట్టు పీలుద్దామని అనిపించినప్పుడు, నోట్లో ఒక చూఇంగ్ గం నో పెప్పర్ మింటో పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉండవచ్చు.
ఇక మానసికం గా వచ్చే మార్పులు :
 ఎవరికి వారు మనసులో  పదే పదే ‘ నేను సిగరెట్టు మానేశాను ‘ మళ్ళీ తాగాను కాక తాగను,  ‘ నేను ఇప్పుడు స్మోకర్ ను కానే కాదు ‘ అని అనుకుంటూ ఉండాలి.
ఆందోళనా , టెన్షన్  ఎక్కువ గా ఉన్నప్పుడు, దీర్ఘ ఉచ్వాస, నిశ్వాస లు తీసుకుంటూ ఒకటి నుంచి పది లేక మీ ఇష్ట దైవాన్నో పది సార్లు ప్రార్ధన చేసుకోవడమూ చేస్తూ ఉండాలి.
మీరు పదే పదే గుర్తు చేసుకోవలసింది ఇంకోటి కూడా ఉంది. అది  ‘ ఈ క్రేవింగ్ లు  ఖచ్చితంగా తాత్కాలికమే , కొన్ని రోజులలో మటుమాయం అవుతాయి ‘ అనే యదార్ధం!!
అగరు వత్తులు, క్యాండిల్ వెలిగించి మీరు ఉంటున్న చోట సిగరెట్టు వాసనకు బదులు, వాటి సుగంధాలను వాసన చూడండి, మీకు సిగరెట్టు వెలిగించాలని తీవ్రమైన కోరిక కలిగినప్పుడు.
సిగరెట్టు పీల్చాలని అనిపించినప్పుడల్లా మీరు సిగరెట్టు వల్ల కలిగే, ఇంతకు ముందు తెలుసుకున్న విషాదకరమైన అనర్ధాలన్నీ సినిమా లో రీళ్ల లాగా మననం చేసుకోండి. గుర్తుకు తెచ్చుకోండి. అందు వల్లనే కదా నేను  చిన్న చిన్న వీడియో క్లిప్పింగులు ఈ బ్లాగు లో ఉంచినది !!! అవసరమనుకుంటే వాటిని వల్లె వేయండి ( learn by heart ).అవి మీ ఆరోగ్యాన్ని కాపాడ గలిగే ఆణి   ముత్యాలు !!!
వచ్చే టపాలో పొగాకు మాన్పించే మందుల గురించి తెలుసుకోండి !!

పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 12. స్మోకింగ్ ఆపిన తరువాత జాగ్రత్తలు :

In Our Health on ఫిబ్రవరి 21, 2012 at 11:24 ఉద.
పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 12.  స్మోకింగ్ ఆపిన తరువాత జాగ్రత్తలు :
మనం లక్ష్య నిర్దేశనం లో ‘ SMART ‘ లోని  ‘ R ‘ మరియూ ‘ T ‘ గురించి కొంత  తెలుసుకుని, స్మోకింగ్ ఆపాక తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా చూద్దాము.
‘ R ‘  అంటే రియలిస్టిక్  లేక  యదార్ధం గా లక్ష్యం ఉండాలి.  అంటే బాగా ఎక్కువ గా రోజూ  ‘ 40 ‘ నుంచి ‘ 60 ‘ సిగరెట్టులు  పీల్చే వాళ్ళు ఒక్క సారిగా మానేద్దామని నిర్ణయించు కోవడం ఒక సాహసమే.అట్లాంటి పరిస్థితులలో , ఒక నిర్ణీత కాలం లో ఖచ్చితంగా తగ్గించుకుంటూ వచ్చి , పూర్తిగా మానేయటానికి నిశ్చయించుకుంటే మంచిది. మీరు ఇక్కడ కూడా మరచి పోకూడనిది, మీకు  ఏదీ అసంభవం కాదని,
ఇక ‘ T ‘ అంటే  ఒక స్పష్టమైన సమయం మీకు మీరే నిర్దేశించుకోవడం, మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి.
ఇప్పుడు మీరు స్మోకింగ్ మానేశారనుకుని ఈక్రింద సూచించిన జాగ్రత్తలు గమనించి ఆచరిస్తారనుకుంటాను.
పొగాకు  మానేసిన తరువాతి రెండు మూడు రోజులు,  మీరు వీలైనంత ఎక్కువ సమయం, పొగాకు తాగకూడని , అంటే పొగాకు పీల్చటం నిషేధించిన బహిరంగ ప్రదేశాలలో గడపడం మంచిది. అంటే అవి గ్రంధాలయాలే కావచ్చు, ఆలయాలే కావచ్చు, సూపర్ మార్కెట్లే కావచ్చు.
మీకు ఇష్టమైన ఏ ప్రదేశం అయినా కావచ్చు. ఇక్కడ మీరు చేస్తున్నది, ఇంతకు ముందు పొగాకు పీల్చే వాతావరణం నుంచి బయట పడటం.
మీరు శీతల పానీయాలు, నీరు , తగినంత తాగుతూ ఉండి   మీ దేహం లో తగినంత నీరు ఎప్పుడు ఉండేట్లు జాగ్రత్త తీసుకోవాలి. టీలు , కాఫీలు ఎంత తగ్గిస్తే అంత మంచిది కారణం : పొగాకు మానేసిన మొదటి రోజుల్లో మీకు ఆందోళన అధికంగా ఉండి , స్వేదం అంటే చెమట ఎక్కువ పట్టవచ్చు , మీరు ఉండే వాతావరణం ఉష్ణ ప్రదేశం అయినా , లేక వేసవి లో పొగ తాగటం మానేసినా , త్వరగా ‘ dehydrate ‘ అయ్యే అవకాశం ఉంది.
మీ ఆహారాన్ని రెండు మూడు సార్లు ఎక్కువగా తినే బదులు నాలుకు ఐదు సార్లు తక్కువ ఆహారం రుచికరమైనది తినడం చేస్తూ ఉండండి.
మీకు బాగా అలవాటైన సిగరెట్టు మీ కోన వేళ్ళ మధ్య , మీ పెదవుల మధ్య లేకపోయినందుకు మీకు ఏదో వెలితి గా అనిపిస్తూంటుంది.  ఈ ఫీలింగ్స్ ను అధిగమించడానికి మీరు మీ చేతులలో ఏ పెన్నో , పెంసిలో  మీకు ఇష్టమైన దేవుడి లాకెట్ , ఉంచుకుంటే మంచిది.
అలాగే నోట్లో ఒక లవంగమో, యాలకులో , సిన్నామన్ చెక్క అంటే దాల్చిన చెక్క , పెట్టుకుంటే బాగా ఉపయోగంగా ఉంటుంది,  మీరు సిగరెట్టు ను కోల్పోయామనే  అనుభూతి అదృశ్యం అవడానికి.
ప్రలోభాలకు లొంగి పోకండి. అంటే , ‘ పొగ తాగే ప్రదేశాలను ఒకసారి చూసి వద్దాము , చాలా బోరు గా ఉంది , అనుకోవడమో, లేక నా ఆప్త మిత్రులను కలుసుకోవాలనుంది, వారు స్మోకింగ్ చేస్తున్నా సరే ‘ అనుకోని , మళ్ళీ ఆ వాతావరణంలోకి వెళ్లి , మీ నిర్ణయాన్ని మార్చుకోకండి.
అలాగే మీ అభిమాన నటుడు  అలవోకగా సిగరెట్టు పీలుస్తూ , అత్యంత విలాసవంతమైన కారు నడుపుతూ, ఇరవై మందిని ఒక్క సారే తన్నేస్తూ ఉంటే, చలించి పోయి మీరు అలా అనుకరిద్దామనుకోకండి. అవన్నీ కేవలం పబ్లిసిటీ స్టంట్లు. ఎందుకంటే  సిగరెట్టు కు లింగ భేదం, భాష భేదం, వయో భేదం,  పేద – గొప్ప భేదం , ఇవన్నీ ఉండవు కదా !! అది చేసే హాని దాన్ని వెలిగించి పీలుస్తున్నంత సేపు నిరాటంకంగా చేసుకుంటూ పోతుంది ఎవరైనా సరే  !!!. ప్రకటనల ప్రలోభానికి మీ జీవితాన్ని పణం గా పెట్టకండి.  మీ జీవితం విలువ ప్రకటన దారులకు ఏమి తెలుసు ?!!.
ప్రతి రోజూ మీ కృత నిశ్చయాన్ని మననం చేసుకోండి. సిగరెట్టు పీలుద్దామని అనిపించినప్పుడల్లా, మానెయ్యడం గురించి మీరు ఎంతగా అలోచించి, మీ జీవితం లో ఈ నిర్ణయం ఎంత ప్రదానమైనదో, ఆ నిర్ణయం ఎన్ని లాభాలకు మూలమో  గుర్తు తెచ్చుకోండి.
( సిగరెట్టు తాగని ) తోబుట్టువులతోను, బంధువులతోనూ సమయం గడపటానికి ప్రయత్నించండి.
మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవలసినది,  పొగ తాగటం మానేస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్ లు ఎక్కువ రోజులు ఉండవు అని.
మిమ్మల్ని మీరు అభినందిన్చుకోండి , రోజూ మీరు మీ నిర్ణయానికి కట్టు బడి ఉంటూ. వ్యాయామం క్రమంగా చేస్తూ ఆరోగ్యాన్ని అనుభవించడం మొదలు పెట్టండి. క్రితం వరకూ ఒక  ఫర్లాంగు కూడా ఆయాసం లేకుండా నడవలేని వారు , క్రమం గా ఎక్కువ ఎక్కువ దూరాలు నడవ గలుగుతారు ఏ ఆయాసం లేకుండా !!
రిలాక్స్ అవుతూ ఉండండి రోజూ, అంటే మానసికంగా నూ , భౌతికంగానూ , ఇందుకు మీరు మీకు ఇష్టమైన ఏ పద్ధతులు అనుసరించినా పరవాలేదు, లక్ష్యం రిలాక్స్ అవటం!!!
వచ్చే టపా లో మరికొన్ని వివరాలు చదవండి !!

పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 11. ‘ SMART’ వివరణ:

In Our Health on ఫిబ్రవరి 20, 2012 at 9:22 సా.
పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 11.  ‘ SMART’ వివరణ:
మనం క్రితం టపా లో  ‘ SMART ‘ లో మొదటి అక్షరం అయిన  ‘ స్పష్టత ‘ అంటే ఏమిటో చూసాము.
ఇప్పుడు ‘ M ‘ అంటే కొలవ తగిన లక్ష్యాలు  పొగాకు మానటం లో ఏమి ఉంటాయో చూద్దాము.
ఇవి పలు రకాలు గా ఉండ వచ్చు పొగాకు మానే వారి ఆలోచనలను బట్టి.
ఈ లక్ష్యం  ఎంత కాలం లో మీరు అధిగమించుదామని అనుకుంటున్నారు,  సంపూర్ణంగా  మానేద్దామని అనుకుంటున్నారా లేక పాక్షికంగా నా ? , పాక్షికమైతే  ఎన్ని సిగరెట్టులు తగ్గిద్దామని అనుకుంటున్నారు ?
ఈ విధంగా మీ లక్ష్యాన్ని  కొలవవచ్చు.
క్రితం టపాలలో తెలిపినట్లు, పొగ తాగటం మానేద్దామనే మీ లక్ష్యం ఎంత తక్కువ కాలం లో ఎంత సంపూర్ణంగా  అధిగమిస్తే అంత మంచిది కదా మీకు.
సాధారణంగా ఈ సమయాలు,  సంపూర్నాలూ, పాక్షికాలూ , ఇవన్నీ , సందిగ్ధావస్థ లో ఉన్న వారికి వర్తిస్తూంది.
సావధానం గా ఆలోచించి ధైర్యంగా పొగాకు మానేసే నిర్ణయం తీసుకున్న వారెవరూ నిరాశ చెందరు సరి కదా ,  మంచి ఫలితాలను త్వరగా అనుభవిస్తారు.
ఇక  ‘ A ‘ అంటే  సాధించ తగ్గ లక్ష్యం.  పొగాకు మానేయటం అనేది సంపూర్ణంగా సాధించ తగ్గ లక్ష్యమే కదా.  ఇక్కడ మానవ శక్తి మననం చేసుకోవాలి.
ఏది సాధించలేదు మానవులు ?!! ప్రతి మానవుడి లో నిద్రాణమైన శక్తులు ఉంటాయి. వాటిని వెలికి తీయటం లో కృత క్రుత్యుడైతే  ఎంతో సాధించ గలుగుతాడు.
అనుకున్నది  సాధిస్తారు. ‘ అనుకున్నది ‘ అంటే ఒక స్పష్టమైన లక్ష్యం. పొగాకు మానటం అనే లక్ష్యం కొద్ది గా కష్టం కావచ్చు కానీ అసాధ్యం మటుకు ఎంత మాత్రం కాదు. ఇది ఎవరికైనా వర్తిస్తూంది.
‘ ఒకసారి అలవాటైతే మానటం సాధ్య పడదు’ అనే వాక్యం కేవలం ఒక అపోహ మాత్రమే !!!
వచ్చే టపాలో మిగతా వివరాలు చూద్దాము !

పొగాకు కు ఋణం – ప్రాణం పణం . 10 . లక్ష్య నిర్దేశనం ( ‘ GOAL SETTING ‘ ) ఎట్లా చేసుకోవాలి ?

In Our Health on ఫిబ్రవరి 19, 2012 at 12:30 సా.

పొగాకు కు ఋణం – ప్రాణం పణం . 10 . లక్ష్య నిర్దేశనం (  ‘ GOAL SETTING ‘  ) ఎట్లా చేసుకోవాలి  ?

క్రితం టపాలో చూసినట్లు ,  మీ జీవితం ఎంత విలువైనదో గ్రహించాక,  మీరు  పొగాకు మానాలనే ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటే , 
ఇక మీ లక్ష్య నిర్దేశనం వైపు  అంటే గోల్ సెట్టింగ్  పై కేంద్రీకరించాలి మీరు.
ఏ లక్ష్యం అయినా  మీరు ‘ స్మార్ట్ ‘ గా  సాధించాలి. అంటే  మీరు ‘ SMART ‘ అనే ఆంగ్ల పదం గుర్తు పెట్టుకోండి.
పైన చిత్రం లో చూపినట్లు ,  ‘ S ‘ అంటే ‘ Specific ‘ అంటే ‘  స్పష్టమైన’ , ‘ M ‘ అంటే ‘ Measurable ‘ అంటే  కొలవ తగినవి గా, ‘ A’ అంటే  ‘ ‘ ‘ Achievable or Attainable ‘  అంటే మీరు సాధించ గలిగినవిగా ,  ‘ R ‘ అంటే ‘ Realistic ‘ అంటే  ‘ యదార్ధం’ గా , మరియూ   ‘ T ‘ అంటే ‘ Time bound ‘ అంటే  నిర్ణీత కాల వ్యవధి లో మీ లక్ష్యం సాధించడం.
పొగాకు మానేయడం లో మీరు మీ లక్ష్య నిర్దేశనం, స్మార్ట్ ( SMART )గా ఎలా చెయ్యాలో వివరిస్తాను.
1. Specific ( స్పష్టత ) : అంటే మీరు పొగాకు గురించి మీరు తీసుకునే నిర్ణయం స్పష్టం గా ఉండాలి.  అంటే మీరు  ‘ నాకు పొగాకు తాగితే కలిగే నష్టాలు తెలుసు కానీ చాలా మంది పొగ తాగు తున్నారు కదా , చూద్దాము ఏమవుతుందో,  లేక కొన్ని రోజులు మానేసి చూస్తాను, లేక ‘ మానేసి ఉండలేనేమో  అని  అనుకుంటూ  ఊగిస లాడకూడదు. ఇలా చేయడం మీ లక్ష్య నిర్దేశనం లో స్పష్టత లోపించడం వల్లనే !!
ఇట్లా స్పష్టత లోపించటం,  గమ్యం తెలియకుండా ప్రయాణం చేస్తూన్న విధం గా ఉంటుంది.
మీకు మునుపటి టపాలు అన్నీ పొగాకు విషయం లో మీకు మంచి అవగాహన ఏర్పడి,  తద్వారా మీ లక్ష్య నిర్దేశనం లో స్పష్టత ఏర్పడటం కోసమే కదా !!!
మిగతా వివరాలు తరువాతి టపాలో చూడండి !పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 9. స్మోకింగ్ మానే పధకం ఎట్లా వేసుకోవాలి ?

In Our Health on ఫిబ్రవరి 18, 2012 at 6:36 సా.

పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 9. స్మోకింగ్ మానే పధకం ఎట్లా వేసుకోవాలి ? 

మీరు మిమ్మల్ని ప్రేమించండి : ‘ love yourselves’ :
సాధారణం గా  యువత లో  ఆత్మవిశ్వాసం ఎక్కువ గా ఉంటుంది.  కానీ  అనేక కారణాల వల్ల,  బాల్యం లో నూ, యవ్వనం లోనూ, ఎక్కడో  మనసులో ఆత్మ న్యూనతా భావాలు (  పైకి కనిపించక పోయినా ) ఉండ వచ్చు. ఈ ఆత్మన్యూనత  వ్యక్తిత్వ వికాసానికి అవరోధం కావచ్చు. ఈ  రకమైన ‘ బలహీనత ‘ లను కప్పిపుచ్చు కోవడానికి  ఏదో ఒక దురలవాటు చేసుకుంటాము.  ఆ సమయం లో, ఆ వయసులో మనం కారణాలు అన్వేషించే స్థితి లో ఉండము.  ఫలితం గా బయటికి చక్కగా బట్టలు వేసుకుని, ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉన్నా   ‘ అంతరంగ మధనం ‘ అశ్రద్ధ’  చేస్తూ ఉంటాము మనము,  తరచూ.
ముందు గా చేయవలసినది: మీ జీవితం ఎంత విలువైనదో గ్రహించడం. విషాదకర గత స్మృతులు ఏవైనా ఉన్నా , ముందుకు సాగాలనే కృత నిశ్చయం తో  మీ ఆరోగ్యానికి  అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. మీ జీవితం ఎంత విలువైనదో మీకు స్పష్టంగా తెలియాలి.  వేల మైళ్ళ దూరం లో ఉండి, దశాబ్దాల తరబడి  పొగాకు దుష్ప్రబావాల పరిశోధనలలో తేలిన నిజాలను తొక్కి పట్టి , రోజూ కోట్ల కొద్దీ నికర లాభాలను ఆర్జిస్తూన్న  పొగాకు కంపనీలకు  మీ జీవితం విలువ ఎందుకు తెలియాలి , మీకే తెలియనప్పుడు ??? !!! లేక మీ దగ్గరలో ఉన్న కిళ్ళీ కొట్టు వాడికి ఎందుకు మీ జీవితం విలువ ??? !!!
పొగాకు పీల్చి  ఆయు క్షీణం అవుతున్నప్పుడు ఒక్క రోజు కూడా వారు మన జీవితాన్ని పోడిగించ లేరు  కదా వాళ్ళు !!! ???
మీరు ఈ విశాల ప్రపంచం లో  ఒకే ఒక్కరు. రెండో ‘ మీరు ‘ ఉండరు. మీకు ఒకటే జీవితం !!.  మీరు స్మోకింగ్ చేస్తూ ఉంటే , మీ గతం ఆనంద దాయకం కాక పోగా , పొగాకు దుష్ప్రభావాల వల్ల భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా  కష్టాల కడలి అవుతుంది మీకు !!.   ఇది   పరిశోధనల వల్ల తేలిన యదార్ధం  !!!
మీరు కొంత సమయం కేటాయించి , సావధానంగా  ఒక కాగితం మీద పొగాకు ( సిగరెట్టు ) తాగటం వల్ల  మీకు కలిగే నష్టాలు ఏమిటి?  మానేస్తే లాభాలు ఏమిటి అని  నోటు చేసుకోండి, సవివరంగా.
ఇలా చేయటానికి ఒక వారం పట్టినా నిరుత్సాహ పడవద్దు. మీకు ఖచ్చితమైన అవగాహన ఏర్పడాలి  స్మోకింగ్ వల్ల లాభ నష్టాల గురించి. ( అవసరమైతే  ‘  బాగు డాట్ నెట్ ‘  ను పలు సార్లు చూడండి , ‘ browse ‘ చేయండి. ఎందుకంటే దాని లక్ష్యం అదే కదా !! )
వర్తమానం లో,  అంటే ఇప్పుడు మీరు ఒక వారం పది రోజులలో   స్మోకింగ్ మానెయ్యాలని    తీసుకున్న నిర్ణయానికి , మీ కృత నిశ్చయం కూడా తోడు అవుతే , కనీసం పది పదిహేనేళ్ళ ఎక్కువ  ఆయుష్షు  ను ప్రసాదించు కున్నట్లే కదా మీ అమూల్యమైన జీవితానికి  !!
అందువల్ల త్వరగా నిర్ణయం తీసుకోలేక పోతున్నామని నిరుత్సాహ పడవద్దు. నిర్ణయాన్ని తీసుకున్నాక మార్చుకోవద్దు !!!
వచ్చే టపా లో లక్ష్య నిర్దేశనం గురించి చదవండి !!!
%d bloggers like this: