ఫోటో కర్టెసీ : http://www.ecology.com.
Every life is very precious! yours’ too! Live happily and enjoy yourselves!always!!!
ప్రతి జీవితమూ అమూల్యమైనది, మీది కూడా! జీవిత మాధుర్యాన్ని అనుభవించండి, ఆనందించండి, ఎప్పుడూ !!
డిప్రెషన్ ఆత్మకథ – 5 . ( ముందు జాగ్రత్తలు ):
ఈ డిప్రెషన్ మానవ జీవితాల్లోకి తరచుగా వస్తూంటుంది. ముందు జాగ్రత్తలు జీవితం ఆరంభ దశ నుండీ తీసుకోవాలి.
అంటే బాల్యం నుంచీ. తల్లితండ్రులు పిల్లలను మానసికంగా కానీ, శారీరకంగా కానీ హింసించకూడదు. ఏ తల్లీ , ఏ తండ్రీ కావాలని ఈ పని చేయరు కదా !
కానీ ఎన్ని కుటుంబాలలో తల్లితండ్రులు వారి పిల్లలను ఆరోగ్యకరమైన గృహ వాతావరణం లో పెంచుతున్నారో అవలోకనం చేసుకోవాలి ఒకసారి. ఆరోగ్యకరమయిన గృహ వాతావరణానికి ఎక్కువ ధనం అవసరం లేదు, ప్రేమానురాగాలు తప్ప. ఈ విషయాన్ని గృహస్తులు కాబోతున్న యువతీ యువకులంతా గుర్తుంచుకోండి.
తల్లి తండ్రుల మధ్య తీవ్ర వాగ్వివాదాలకూ , కోప తాపాలకూ తారచూ వారి పిల్లలు తరచూ ప్రత్యక్ష సాక్షులు గా ఉంటారు. వారు ఏమీ చెప్పలేరు కానీ మనసు లో పలురకాల ఆందోళనలకు లోనవుతుంటారు. ఆ బాల్య వాతావరణము వారు పెరిగి పెద్దవుతూన్నప్పుడు ఏదో రూపం లో కనిపించవచ్చు. అంటే వారు అతి సున్నిత మనస్కులు గానూ, ఆత్మ విశ్వాసం తక్కువ కలవారు గానూ పరిణితి చెందే అవకాశం ఉంది. ఈ వ్యక్తిత్వ బలహీనతల వల్ల వారు ముఖ్యమైన జీవిత సంఘటనలు జరిగే సమయం లో ( life events ) తీవ్రమయిన వత్తిడి కి లోనవుతారు. అప్పుడు తొంగి చూస్తున్నఈ డిప్రెషన్ కాస్తా జీవితాలలలో ప్రవేశిస్తూంది.
దైనందిన కార్యక్రమాలు ఒక క్రమంలో ఉండటం కూడా మానసిక ఆరోగ్యం చక్కగా ఉండటానికి దోహద పడుతుంది. అంటే ఒక సమయానికే నిద్ర పోవడమూ, లేవడమూ, రోజూ వ్యాయామం చేయడమూ , ఆరోగ్య కరమైన ఆహారం తినడమూ , చేసే పనిని బాధ్యతా యుతంగా చేస్తూ , ఉత్సాహమూ , ఆనందమూ పొందడమూ, ఇవన్నీ ఆ కోవకు చెందినవే! మీరు ఏ మతానికి చెందినప్పటికీ , ఆ మతాన్ని క్రమంగా ఆచరించడం కూడా చాల విలువైన రక్షణ గా ఉండి, నన్ను మీనుంచి దూరంగా ఉంచుతుంది.
మీ బాగు కోరే మంచి మిత్రులు, బంధువులూ ఉంటే కూడా వారు మీ జీవితాలలలో ఒడుదుడుకులకు ఆసరాగా నిలిచి మీకు చేయూతనివ్వగలరు.
మీ జీవితాలల్లో ఎక్కువ వత్తిడి కలిగించే సంఘటనలు ఉన్నప్పుడు , వాటిని ముందు గానే చర్చించి , ప్రత్యేకమైన సమస్యలు ఏవైనా ఉంటే వాటిని ఎలా అధిగమించాలో కుటుంబంలో చిన్న వారికి వారి పెద్దలూ , లేక తోబుట్టువులూ, బంధువులూ, లేక ప్రియమైన స్నేహితులూ సలహాలు ఇస్తూండడం చాలా ఉపయోగం.
( ఇక్కడ నేను , పరీక్షలూ, ఉద్యోగానికి ఇంటర్వు లూ , ఉద్యోగ బదిలీలు , వివాహాలూ , కొత్త చోటికి వెళ్ళడమూ, కొత్త ఊళ్ళో నివాసమూ , హాస్టల్ లో చేరడమూ , ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈ విషయం వ్రాయడం జరిగింది )
మద్యానికీ అంటే ఆల్కహాలుకూ , డిప్రెషన్ కూ అవినాభావ సంబంధం ఉంది. ప్రత్యేకించి మీ రక్తంలో ఆల్కహాలు కనక ఎప్పుడూ ఉంటే ( అంటే మీరు వ్యసనపరులై ఒక క్రమం లో తాగుతూ ఉంటే. ) అప్పుడు నేను చేరువ అవుతాను. కాబట్టి మీ రక్తంలో ఆల్కహాలు శాతం ఎప్పుడూ అతి తక్కువ లో ఉంచుకోవడం ఉత్తమం. ( అసలు తాగాకపోవడం మరీ ఉత్తమం !!! )
జీవితమంటే పాజిటివ్ దృక్పధం ఉండి, జీవితాన్ని అనుభవిస్తూ, ఆనందం పొందుతూ, ఆరోగ్య కరమైన అలవాట్లూ, చక్కటి సాంఘిక జీవనం చేసే వారంటే నాకు భయం. అందు చేత నేను వారి దగ్గరకు వెళ్ళను. మీరంతా ఆ సమూహము లోనే ఉన్నారని, ఉంటారనే భావిస్తూ ( ఎప్పటికీ ) మీతో శలవు తీసుకుంటాను ఇక. నన్ను మరచిపోరు కదూ !!!
ఇట్లు
ఎప్పటికీ మీకు దూరంగా ఉండాలనుకునే
డిప్రెషన్
( చదువరులు ఈ ఐదు భాగాలల్లో ఏ భాగం మీదనైనా తమ అభిప్రాయాలను కానీ, సలహాలు సందేహాలను కానీ, స్పందనలను కానీ తెలుగులో నైనా , ఆంగ్లం లో నైనా పంప వచ్చు.
వచ్చే టపా ద్వారా కలుసుకుందాము – సుధాకర్ )