Our Health

Archive for ఫిబ్రవరి 11th, 2012|Daily archive page

పొగాకు కు ఋణం – ప్రాణం పణం – 5 . శ్వాస కోశం లో పొగాకు తెచ్చే మార్పులు:

In Our Health on ఫిబ్రవరి 11, 2012 at 7:09 సా.
పొగాకు కు ఋణం – ప్రాణం పణం –  5 .
శ్వాస కోశం లో పొగాకు తెచ్చే మార్పులు:
 
మనం సహజంగా పీల్చే గాలి లో ఆక్సిజెన్  మన శ్వాస కోశం లో ప్రవేశించి  అందులో ఉన్న అతి సున్నితమైన ప్రత్యేకమయిన కణాల ద్వారా మన రక్తంలో కి ప్రవేశిస్తూంది ( ఈ కణాలను అల్వియోలై  ‘ alveoli ‘ అని పిలుస్తారు )  .
ఆక్సిజెన్ లేక పొతే మనం బతకలేమని మనకందరికీ తెలుసు కదా !.  ఈ భూగోళం  మీద  గాలిలో ఆక్సిజెన్ ఉండబట్టే మనం మన గలుగుతున్నాము.  చంద్ర మండల యాత్ర చేసిన వ్యోమగాములందరూ  ఆక్సిజెన్ ను భూమి మీద నుంచి తీసుకు వెళ్ళారు ఎందుకంటే చంద్ర మండలం మీద ఆక్సిజెన్ లేదు కాబట్టి.
అలాంటి ఎంతో విలువైన, సహజ సిద్ధమైన  ఆక్సిజెన్  ఉన్న గాలిని వదులుకుని  కార్బన్  మోనాక్సైడ్  ఇంకా అనేక విష వాయువులను వెళ్లగక్కే సిగరెట్టు పొగ కు బానిస అయి దానిని పీలుస్తూ , అనేక శ్వాస కోశ  సంబంధమైన జబ్బులను ఆహ్వానిస్తున్నారు మానవులు,  తమ జీవితాల లోకి !!
ఈ ప్రాణాధారమైన ఆక్సిజెన్ పొగాకు పీలుస్తూ వుంటే చాలా తగ్గుతూ ఉంటుంది మన రక్తంలో. అతి సున్నితమైన మన మెదడు లో ఆక్సిజెన్ శాతం  సమ పాళ్ళలో ఉంటే మన మెదడు చక్కగా, చురుకు గా పని చేస్తుంది.
ఇక శ్వాస కోశం లో ఉండే కణాలకు  అతిసన్నని పోగుల లాంటి  అమరికలు  పొగాకు చాలా కాలం పీల్చడం వల్ల పనిచేయడం మానేస్తాయి.  వీటినే సీలియా ‘ celia ‘  అంటారు.  ఈ సీలియా  అనే పోగులు  మన శ్వాస కోశం లో ఉండే అతి సూక్ష్మమైన  ‘ కుంచె లు ‘ అంటే
‘ brushes’  శ్వాస కోశం లో ఉండే అతి సూక్ష్మమైన ఈ కుంచె లు  కల్మషమైన ద్రవ పదార్ధాలను  బయటికి ( గొంతు ద్వారా ) పంపడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ సీలియా అనబడే కుంచెల లాంటి నిర్మాణాలు అతి సూక్ష్మమైనవీ , అతి సున్నితమైనవీ అవటం వల్ల పొగాకు లో ఉండే అనేక విష వాయువులూ, హానికర రసాయన పదార్ధాల తాకిడి కి తట్టుకోలేక పని చేయడం మానేస్తాయి. దీనితో కల్మషం అంతా బయటికి వెళ్ళడం లో జాప్యం జరుగుతుంది.  ఎక్కువ సమయం   శ్వాస కోశం లోనే ఈ కల్మషం ఉండి పోవడం వల్ల, శ్వాస సంబంధ మైన జబ్బులకు
నిలయమవుతాయి  శ్వాస కోశాలు. ఇవి ఆస్థ్మా , ఉబ్బసం,  నుమోనియా , ఉపిరి తిత్తులలో నీరు చేరడం, మొదలైన రూపాలలో బయట పడవచ్చు.
శ్వాస కోశాలు సరిగా పనిచేయడం ఎప్పుడు మానేస్తాయో , అప్పుడు ఆ ప్రభావం గుండె మీద కూడా పడుతుంది.
ఇక గొంతు లో నుంచి పొగ పోవడం వల్ల గొంతు కాన్సర్ కూ,   స్వర పేటిక  కాన్సర్ కూ , అతి సున్నితమైన శ్వాస కోశ కణ జాలం మీద  ఈ  రసాయన పదార్ధాలూ, విష వాయువులూ దీర్ఘ కాల ప్రాతిపదిక మీద చూపే మార్పులు శ్వాస కోశ కాన్సర్ కూ దారి తీస్తున్నాయి.
వచ్చే టపాలో  పొగాకు పీల్చడం ఎన్ని రకాల కాన్సర్ లకు కారణం అవుతుందో  చదవండి.
 
%d bloggers like this: