నన్ను ఎట్లా వదిలించుకోవాలి?
మానవ దేహంలో గుండె , ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండాలు , లాంటి భాగాల లానే మెదడు కూడా లయ తప్పి ప్రవర్తిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితులల్లో. మా నసిక పరిస్థితి బాగోలేనప్పుడు , దయ్యం పట్టిందనో, సైతాన్ పట్టిందనో, ఎవరో గిట్టని వాళ్ళు చేతబడి చేసారనో, ఈవిధంగా వారిని అనేక విధాలుగా హింసించి మానసికంగానూ , భౌతికంగానూ ఇంకా ఆశక్తులను చెయ్యడం మన దేశంలో సర్వ సాధారణం. అసలు నేనే ఆ దయ్యాన్ని , సైతానును కూడా. కాకపొతే నేను మిగతావారి లా కాకుండా నన్ను మీరు ఎట్లా వదిలించుకోవాలో వివరంగా మీకు చెపుతాను. మీరు సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీదగ్గరకు ఎప్పుడూ రాను కదా ఒకవేళ వచ్చినా ఎక్కువ బాధ పెట్టక పలాయనం చిత్తగిస్తాను.
ఇక చెపుతాను శ్రద్ధగా చదవండి:
మానవులలో నా రాకకు అనేక కారణాలున్నాయి కానీ ఖచ్చితంగా ఈకారణమని ఇప్పటివరకూ చెప్పలేకపోతున్నారు మహా మహులంతా. ఇప్పటివరకూ జరిపిన పరిశోధనలవల్ల బ్రెయిన్ అంటే మెదడు లో చాలా జీవ రసాయన పదార్థాలు ఉంటాయి. అవి మానవులలో రోజూ వచ్చే అనేక భావాలకూ , ( అంటే ఎమోషన్స్ అన్న మాట ) , ఆనందాలకూ , విషాదాలకూ కారణమని కూడా తెలిసింది. నేను మీచెంతకు వచ్చినప్పుడు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ‘ మీకు డిప్రెషన్ వచ్చినప్పుడు ‘ కొన్ని జీవరసాయన పదార్థాలు మెదడులో తక్కువ అవుతూంటాయి అని కూడా పరిశోధనలవల్ల తెలిసింది. కానీ ఆ జీవ రసాయనాలు తక్కువ అవడం వల్ల నేను మీదగ్గరకు వస్తానా లేక నేను వచ్చినందుకు ఆ రసాయనాలు మెదడులో తక్కువ అవుతూన్నాయో ఇంతవరకూ శాస్త్రజ్ఞులకు తెలియలేదు.
నేను నా ఆత్మకథ మూడో భాగంలో వివరించినట్లు మనోవ్యాధి తీవ్రత బట్టి వివిధ రకాలు గా వదిలించుకోవాలి నన్ను. మొదటి దశలోనూ రెండో దశలోనూ కేవలం మానసిక పరివర్తన తేవడం మూలంగా నన్ను వదిలించుకోవచ్చు.
ఇక్కడ రెండు ఉదాహరణలు :
1. ప్రకాష్ మంచి విద్యార్థి గా పేరు తెచ్చుకున్నాడు కాలేజీ లో ఫైనల్ ఇయర్ లో మంచి మార్కులు తెచ్చుకుందామనే లక్ష్యం తో పగలూ రాత్రీ కష్టపడి చదివాడు హాస్టల్ లో . ఫలితాలు అతని అంచనాలను తల్లకిందులు చేస్తూ కేవలం అరవై శాతం మాత్రమే వచ్చాయి మార్కులు. విపరీతంగా ఆత్మన్యూనతా భావంతో తెలిసినవారందరికీ మొహం చూపించటం మాని నిరాసక్తుడు గా ఒంటరిగా సమయం గడుపుతూన్నాడు.
2. సరళ చాలా చురుకైన అమ్మాయి. చక్కగా చదువుకుంటుంది కూడా. ప్రేమలో పడి శేఖర్ లేక పొతే జీవితం లేదనుకునే దశకు వచ్చింది. శేఖర్ అకస్మాత్తుగా తనకు చెప్పకుండా విదేశాలకు వెళ్ళాడని తెలిసి కుమిలి కుమిలి ఏడిచి జీవితం వ్యర్ధం అనుకుని ఒక చీటీ కూడా వ్రాసింది తల్లిదండ్రులకు నిద్ర మందు మాత్రలు తీసుకున్నట్లు.
ప్రకాష్ విషయం లో తన అంచనాలు తల్లక్రిందులవడం వల్ల తట్టుకోలేకపోయాడు. ఒంటరిగా తల్లిదండ్రులకు దూరంగా ఉండడం ఇంకో కారణం. ఇక్కడ వెంటనే చేయవలసినపని వారి తల్లిదండ్రులో, బంధువులో, స్నేహితులో, ప్రకాష్ ఆలోచనా పరిస్థితి నీ అతని బిహావియర్ నూ గమనించి వెంటనే ఇంటికి తీసుకు వెళ్లి , తగు విశ్రాంతి ఇచ్చిన తరువాత అతనిని ఓదార్చి , ధైర్యం చెప్పాలి. తనకు ఉన్న ఎన్నో మంచి మంచి అవకాశాల గురించి తెలియ చెప్పి పాజిటివ్ దృక్పధం లోకి అతని జీవిత ప్రయాణాన్నిచక్కగా మళ్ళించాలి. తిట్టడమూ , చీవాట్లు వేయడమూ, సరిగా చదవలేదు కనకనే మార్కులు రాలేదు ‘ అంటూ పదే పదే విమర్శలు ప్రకాష్ ఇప్పుడున్న పరిస్థితులల్లో అసలు మంచిది కాదు. దీనినే టాకింగ్ థెరపీ అంటారు. ఆ టాకింగ్ థెరపీ వందలూ , వేలూ వదిలించుకుని డాక్టర్ చేతనే చేయించ నవసరం లేదు. ప్రకాష్ కు నమ్మకమయిన, విశ్వాస పాత్రమయిన వారు ఎవరయినా ఆ పని చేయవచ్చు. ఈ దశ లో ప్రకాష్ కు కావలసింది అదే! మందులు కాదు.
ఇక సరళ విషయం: ఇక్కడ కూడా సరళ తల్లిదండ్రులూ, స్నేహితులూ చేయవలసింది చాలా ఉంది. అయితే ముందు గా నిద్రమాత్రల వల్ల ఏమయినా హాని జరగవచ్చు కనుక డాక్టర్ సలహా పొందడం మంచిది తక్షణమే. తరువాత తలితండ్రులు చేయ వలసిన టాకింగ్ థెరపీ చేయాలి.
ముఖ్యం గా గుర్తు ఉంచుకో వలసిన విషయం. సరళ ను వారు ఎంతగా ప్రేమిస్తూన్నారో ఆ విషయం చక్కగా వివరించాలి తప్ప తీవ్రమయిన ఆగ్రహావేశాలకు లోనయి, విపరీతం గా కోప్పడి ‘ వంశ ప్రతిష్ట కు మచ్చ తెచ్చావనో, పరువు తీశావనో అప్రస్తుత విమర్శలు చేసి, కలత చెంది ఉన్న సరళ మనసును ఇంకా ఆందోళన పెట్టడం ఎంత మాత్రమూ సమంజసం కాదు.
టాకింగ్ థెరపీ లో వారికి ప్రస్తుతం ఉన్న, లేక వారిని వేధిస్తూన్న సమస్యల ను గురించి పూర్తి వివరాలను , ఓపికగా, ప్రశాంత వాతావరణం లో కనుక్కొని వాటికి తగిన పరిష్కార మార్గాలను వారికి అర్ధమైన రీతి లో వివరించి కర్తవ్యోన్ముఖులను చేయాలి.
ఇక మూడో దశ లో, యాంటీ దిప్రేస్స్సంట్ మందులు అవసరం అవుతాయి. ఇది డాక్టర్ అంటే మానసిక వైద్య నిపుణిని సలహా తో చేస్తే మంచిది. మందుల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కూడా అప్పుడు గమనించటం సాధ్యమవుతుంది. అత్యవసర పరిస్థితులల్లో హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కూడా అవసరం. ప్రత్యేకించి ఎప్పుడయితే ఆత్మ హత్యా సదృశమైన ఆలోచనలు తీవ్రంగా ఉంటాయో అప్పుడు.
ఎలెక్ట్రో కన్వల్సివ్ థెరపీ ( అంటే ఈ సి టీ ) , ఎలెక్ట్రో మాగ్నటిక్ స్తిములేషన్ థెరపీ ( అంటే ఈ ఎం టీ ) అనే రకాలు కూడా అవసరం అవవచ్చు మూడో దశ లో. కానీ ఈ ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ సలహా తోనే తీసుకోవాలి.
డిప్రెషన్ అంటే నా తీవ్రత ఏ దశలో ఉన్నా కూడా సుఖమయిన నిద్ర, విశ్రాంతి ( అంటే కేవలం భౌతికంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా ), తల్లిదండ్రుల, తోబుట్టువుల లేక స్నేహితుల సహకారం, సహాయం ఎంతో అవసరం. మీరు తగినంత సమయం తీసుకుని మళ్ళీ మామూలు మనుషులయే వరకు మానసిక వత్తిడి ( stressful circumstances, tragic incidents,etc. ) కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండటమూ, ఉంచడమూ, అన్ని విధాలా శ్రేయస్కరం .
వచ్చే టపాలో ముందు జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలో చదవండి !