Our Health

Archive for జనవరి, 2012|Monthly archive page

డిప్రెషన్ ఆత్మకథ – 3. ( నన్ను మీరు ఎట్లా కనుక్కోవాలి ? )

In Our Health on జనవరి 31, 2012 at 2:10 సా.

నన్ను ఎట్లా కనుక్కోవాలి?

మీరు ముఖ్యం గా గుర్తుంచు కోవలసిన విషయం నా తీవ్రత. అంటే severety. ఇది మూడు రకాలు గా ఉంటుంది. Mild, moderate and severe types of depression.
మొదటి దశ లోమనోవ్యాధి తీవ్రత కొద్ది స్థాయి లో ఉండి, మీలో వచ్చే మార్పులు కనిపిస్తాయి. రెండో దశ లో వ్యాధి లక్షణాలు ఇంకొద్దిగా తీవ్రంగా ఉంటాయి. ఇక మూడో దశ లో నేను వారిని ఎక్కువ గా బాధిస్తాను. అంటే నా ఉనికి వల్ల వారు వారి వారి రోజువారీ కార్యక్రమాలు సక్రమంగా చేసుకోలేక పోతారు. ఆటల్లో చదువులో చురుకు గా ఉండే విద్యార్ధులు ముభావంగా, నిరాశాక్తులుగా వారి గదులలో ఒంటరి గా సమయం వెళ్ళబుచ్చుతారు. అత్యంత ఆత్మ న్యూనతా భావం తో క్రుంగి పోతూ , జీవితమూ , జీవించడమూ వ్యర్ధమనుకునే, నిరాశాజనకమయిన, విచక్షణా రహిత మయిన ఆలోచనలు కూడా చేస్తారు. నా మూలంగా నే వారు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారని తెలుసుకోలేక తమనే పదే పదే నిందించుకుంటూ ఉంటారు ఈ మూడో దశలో. దీనికి కారణం వారు విశ్లేషణా శక్తీ, హేతువాద దృష్టీ తాత్కాలికంగా కోల్పోవడం వల్ల!!.
తొలి దశ లో యువతీ యువకులు చదువుల్లో , ఉద్యోగాల్లో వారు క్రితం చూపించిన ప్రతిభ చూపలేక పోతారు. చక్కగా , కలుపుగోలు గా ఉండి చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఉండే వారు కాస్తా వారి ‘ వెలుగు ‘ అంటే ‘ స్పార్క్ ‘ కోల్పోతారు. ఇక ఒంటరిగా ఉండేవాళ్లూ , వసతి గృహలల్లో ( అంటే ‘ Hostels ‘ ) ఉండేవాళ్ళు ఎప్పుడూ తలుపులు వేసుకుని దీర్ఘా లోచనల్లో కాలం గడుపుతారు. వారూ రోజూ అనుభవించే జీవితం లోని సాధారణ ఆనందానుభూతులు ఇక అనుభవించడం మానేస్తారు నా బారిన పడి. అంటే ఒక ప్లేటు ఇడ్లీ తింటేనో , ఒక దోశ తింటేనో, ఒక మంచి పాట వింటే వచ్చే ఆనందం కూడా అనుభవించలేక నిరాసక్తత తో ఉంటారు.
ఇటీవల వారి వారి జీవితాలలలో వచ్చిన ఆకస్మిక మార్పులు, కలత చెందే, లేక కలత పేట్టే విషయాలు, సంఘటనలు జరిగినప్పుడు , నేను ప్రత్యక్షం అవుతాను. చదువుల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోవడం, కొత్త విద్యా కోర్సు లలో చేరడం, ఉద్యోగ ప్రయత్నాలల్లో సఫలీకృతం కాలేక పోవడం, ఇల్లు మారటం, కొత్త ప్రదేశం లో స్థిరపడటానికి ప్రయత్నించడం, ప్రేమ విఫలం అవడం, ఆకస్మిక మరణాలు కుటుంబంలో నో, బంధు మిత్రులల్లో నో సంభవించినప్పుడు, లేక బాగా తెలిసిన వారికి కాన్సర్ వచినట్లు తెలియడమో, ఇలాంటి మార్పులు మీ మీ జీవితాలలలో చోటు చేసుకుంటే మొదటి దశ లో ఉన్న నేను రెండో దశ లోకి మారటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
డిప్రెషన్ చాల సాధారణం గా కనిపించే మానసిక వ్యాధి. ప్రపంచం లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు నా బారిన పడకుండా ఉండరుఎప్పుడో ఒకసారి వారి వారి జీవిత కాలంలో !!
వంశ పారంపర్యంగా జన్యువులల్లో అంటే జీన్స్ లో వచ్చే లోపల వల్ల కొందరు తరచూ నాకు ఆశ్రయం ఇస్తూ ఉంటారు వారికి తెలియకనే. దీర్ఘ కాల వ్యాధులతో బాధ పడుతూన్నవారు కూడా నాకు ఆతిధ్యం ఇచ్చేవారే! కొందరు థైరాయిడ్ గ్రంధి లోపం వల్ల కూడా నాతొ సఫర్ అవుతారు.
పైన వివరించిన విధంగా వ్యాధి లక్షణాలను ప్రతి ఒక్కరూ శ్రద్ధ తో గమనిస్తూ ఉండాలి. నేను మీలో తెచ్చే మార్పులు కూడా గుర్తు పెట్టుకోండి. భార్యా భర్తలు, విద్యార్ధులు, ఉద్యోగస్తులూ ,వృద్ధులు, ఎవరయినా ఈవిషయాలు మనసులో ఉంచుకొని, వారు కానీ వారి స్నేహితులు కానీ, బంధువులు కానీ నాతొ ఎక్కువ కాలం ఉండకుండా తగు జాగ్రత్త లు తీసుకుంటే నా ఆత్మకథ లక్ష్యం నెరవేరుతుంది.
ఇంకో విషయం: విషాదమూ, విచారమూ, దుఖ్హమూ జీవితాల్లో జరిగే సంఘటనలే. కానీ ఆ సంఘటనలతో తీవ్రంగా కలత , ఆందోళన చెంది ఎక్కువ కాలం అంటే మూడు నుంచి ఆరు వారాల పాటు అవే లక్షణాల తో ఉంటె అప్పుడు డిప్రెషన్ గా పరిణామం చెండుతూంది. ముఖ్యం గా ఆ లక్షణాల వల్ల మీ రోజువారీ జీవితాలు , మీరు రోజూ చేసే కార్యక్రమాలూ , కుంటు పడుతూ ఉంటే నేను మీకు దగ్గరవుతున్నట్లు లెఖ్హ!! ఎక్కువ పెస్సిమిస్టిక్ గా అంటే నిరాశావాది గా ఉంటూ ఉండడమూ, జీవితాలను అంతం చేసుకోవాలనే ఆలోచనలూ, పథకాలూ వారి లో నా తీవ్రతను తెలియ చేస్తాయి. ( అంటే మూడో దశ అన్న మాట. ఈ దశ ప్రమాదకరయినది. ఇది గుర్తించిన వెంటనే తగు వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం.)
మొదటి దశ లోనే నా లక్షణాలు మీరయినా , మీ తల్లి తండ్రులయినా, మీ స్నేహితులయినా , మీ డాక్టర్ అయినా గుర్తించడం అతి ముఖ్యమయిన విషయం.
రక్త పరీక్షలు కొంత వరకు ఉపయోగ పడుతాయి. ముఖ్యంగా థైరాయిడ్, అనీమియా అంటే రక్త హీనత మొదలైన జబ్బులను గుర్తించడం కోసం. ఒక వేళ యాంటీ దేప్రేసెంట్ మందులు వాడవలసినప్పుడు ముందు గా జరిపిన పరీక్షా ఫలితాలు పోల్చుకోడానికి ఉపయోగపడుతాయి.( తరువాత ఏవయినా మార్పులు మీ రక్తంలో జరిగితే ).
fMRI scan : ఈ పరీక్ష లో మన మెదడు లో జరిగే మార్పులు కొంత వరకూ తెలుసు కోవచ్చు. కానీ ఈ పరీక్ష ఖ్హర్చు తో కూడినది. సాధారణంగా అవసరం ఉండదు.

తరువాతి టపా లో నాకు ఉద్వాసన ఎట్లా చెప్పాలో తప్పక చదవండి !!

డిప్రెషన్ ఆత్మకథ – 2. ( నేను మీలో తెచ్చే మార్పులు )

In Our Health on జనవరి 29, 2012 at 10:50 సా.

డిప్రెషన్ ఆత్మకథ – 2

నేను మీలో తెచ్చే మార్పులు :

నిద్ర లేమి : మీరు నిద్ర సరిగా పోలేకపోవటం, కలత నిద్ర లూ , ఎప్పుడూ ఉదయమే లేవనివారు కూడా నాలుగు , అయిదు గంటలకే లేవటం, లేక గంటా రెండు గంటలు పడుకొని మెలకువ వచ్చి లేచి మళ్ళీ ఒకటి రెండు గంటలు అయినాక కానీ నిద్ర రాకపోవడం, ఇవన్నీ నేను మీతో ఉన్నప్పుడు జరిగే తొలి మార్పులు. ఇలాంటి మార్పులవల్ల రోజంతా స్తబ్దు గా ఉండటమూ, ఏ పని మీద శ్రద్ధ చూపలేక పోవడం, తరచూ చీకాకు పడుతూ ఉండడం జరుగుతూంటాయి.
కొందరిలో నా వల్ల ఎక్కువగా నిద్ర పోవడం కూడా జరుగుతుంది కానీ సాధారణంగా ఎక్కువ మందిని నేను నిద్ర లేమి తో బాధ పెడతాను. ఈ సహజ నిద్ర లో జరిగే అవకతవకల వల్ల మీరు మీ రోజువారీ పనులు సరిగా చేయలేక టీలూ కాఫీలు ఎక్కువగా తాగటం చేస్తూ ఉంటారు. ఇంకొందరు మద్యం సేవిస్తే ప్రశాంత పడి నిద్రపోతామనుకుని ‘ మందు’ సేవిస్తారు. కానీ ఫలితం చాలా తాత్కాలికం మాత్రమే !!
ఆకలి తగ్గిపోవడం: ఇక ఆకలి క్రమంగా తగ్గుతూ పోతుంది. ఎందుకంటే నేను వారిని తినడం మొదలు పెడతా కదా ! ఈ ఆకలి తగ్గటం వల్ల మంచి రుచికరమయిన వంటలు కూడా రుచించక తినడం మానేస్తారు మీరు. అలాగే పానీయాలు కూడా తాగటం తగ్గిస్తారు మీరు. వీటి వల్ల బలహీన పడటమూ, శక్తి హీనులు అవడమూ , బరువు తగ్గిపోవడమూ జరుగుతాయి.
ఇక నేను తెచ్చే ముఖ్యమయిన మార్పు ఆలోచనా ధోరణి. నిరాశా నిస్పృహలు మీలో ఎక్కువ అవుతుంటాయి . పాజిటివ్ దృక్పధం మారి మీరు నిరాశా వాదులవుతారు.
మీ ఆలోచనలు వెలుగు కాక చీకటి పయినే పయనిస్తూ ఉంటాయి. మీరు వర్తమానం మీదా భవిష్యత్తు మీద నిరాశాజనకంగా ఉంటారు. మీ కోరికలూ మీ పథకాలూ అన్నీ నిరాశాజనకంగా ఉహించి కుమిలిపోతూ ఉంటారు నేను మీతో ఉన్నప్పుడు.అంత క్రితం వరకూ చలాకీ గా చురుకు గా ఉండే వారు నిద్రాణ స్థితి లో తలిదండ్రులకు, తోబుట్టువులకు, బంధువులకు, స్నేహితులకు మొహం చాటు చేసి ఎక్కువ గా ఏకాంతం లో గడుపుతారు. సెల్ లో మాట్లాడటం తగ్గించేస్తారు. మగ వారిలో కామోద్రేకం సన్నగిల్లి రతి సామర్థ్యం తగ్గి పోతుంది. దీనితో వారు ఇంకా కుంగిపోయి నాకు ఇంకా దగ్గర అవుతారు. స్త్రీలలో కూడా కామ కోరికలు తగ్గి ముబావంగా ఉంటారు నా పొందు తో !!.
ఆత్మన్యూనత ఏర్పడి మీరు చేసిన ఏవో కొన్ని సాధారణ పొరపాట్లను కూడా ఎక్కువ గా ఉహించుకొని కలత చెందుతూ ఉంటారు. మీ పరిస్థితి అంతా మీ తప్పిదం వల్లే అని భ్రమ పడుతూ ఉంటారు. నేను మీతో ఉండటం వల్ల నే ఈ మార్పులు వచ్చాయనే సత్యాన్ని మరచి పోతారు.చాలామంది వారికి తెలియకనే కడుపులో నొప్పి అనో, గుండెలో నొప్పి అనో వైద్యుల చుట్టూ తిరుగుతూ విపరీతంగా డబ్బు ఖర్చు చేసి ఆందోళన చెందుతూ ఉంటార్రు, నేను వారిని పట్టుకున్నాననే విషయం గ్రహించక!!! కొందరు విపరీతమయిన నిరాశ చెంది ‘ ఇక లేవకుండా నిద్ర పోవాలనుకుని’ నిద్రమాత్రలు ఎక్కువ మోతాదు లో తీసుకుని ప్రమాదకర స్థితి లో ఆసుపత్రుల పాలవుతారు. కొందరు వారు ఆ స్థితి లో ఉండటానికంతటికీ వారే కారణమని, దానికి పరిష్కారం వారు ఈ ప్రపంచం నుండి ‘ శలవు తీసుకోవడమే ఉత్తమమని’ ఆత్మహత్య కు పాల్పడతారు. ఇటీవల ఆంధ్రదేశంలో , భారత దేశంలో చూస్తూన్న రైతుల ఆత్మహత్యల పరంపర దీనికి ఒక ఉదాహరణ మాత్రమే . అదే నేను చేసే మాయాజాలం!!!

నా ఉనికిని మీలో ఎలా కనుక్కోవాలో వచ్చే టపాలో చదవండి !

డిప్రెషన్ ఆత్మకథ- 1

In Our Health on జనవరి 27, 2012 at 11:03 సా.

డిప్రెషన్ ఆత్మకథ 1 :

నేను మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు :

కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్న విధంగా , నేను మీ దగ్గరికి రావటానికి అనేక కారణాలు:అయితే అన్ని కారణాలూ ఒకరిలోనే ఉండనవసరం లేదు.
బాల్యంలో విషాద పరిస్థితులు అనుభవిస్తే కానీ , హింసాత్మక సంఘటనలు , అత్యాచారాలు జరిగినా , మీ సున్నిత మయిన మనసులను గాయపరచిన సంఘటనలుంటే, నా రాకకు ఆహ్వానం అవుతాయి అవి.
మీకు తీవ్ర వత్తిడి కలిగించే సంఘటనలు జరిగినప్పుడు మీ కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటాను నేను.
మీ జీవితాలలలో ఏ నష్టాలు జరిగినా నేను మీ దగ్గరకు రావటానికి వేచి చూస్తూ ఉంటాను.ఆప్తులను, ప్రియ బంధువులనూ కోల్పోయినప్పుడు, నేను మీకు చేరువ అవుతాను. చదువుల్లో , ప్రేమలో విఫలమయిన వారు, నిరుద్యోగులూ నాకు బాగా ఇష్టం.గుండె జబ్బులున్నవారు కాన్సర్ వ్యాదిగ్రస్తులూ నాకు ప్రియ మిత్రులే! జన్యు లోపం ఉన్నవారు కూడా నా పీడితులే !
మీరు ఒంటరి గా స్నేహితులూ , బంధువులకు దూరంగా జీవితాలు గడుపుతూంటే నా డేగ కన్ను మీ మీద పడక తప్పదు.
ఇక మద్య పాన ప్రియులు సరే సరి! వారు బాధలను మరిచిపోడానికి ‘ మందు ‘ మహా మందు’ అనుకుంటారు. కాని బాధలున్నప్పుడు నేను ఎలాగూ దగ్గరికి చేరు తానుకదా ! ఇక ‘ మందు తీసుకుంటున్న కొద్దీ వారితో నా ‘స్నేహం ‘ బలపడుతూ ఉంటూంది. ఎందుకంటే వారి
రక్తం లో ‘ మందు మోతాదు ‘ ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ డిప్రెషన్ తో సహవాసం ! వారి ఆనందం కాస్తా విషాదం !!!

( వచ్చే టపా లో నా ఆత్మకథ రెండో భాగం చదవండి )

డిప్రెషన్ ఆత్మకథ

In Our Health on జనవరి 25, 2012 at 12:31 ఉద.

డిప్రెషన్ ఆత్మకథ

నా కథ మీరు తప్పకుండా తెలుసుకోవాలి:
నా పేరు డిప్రెషన్ నేను మానవులను పలు విధాలుగా బాధిస్తూ వుంటాను.
సముద్రం లో అల్ప పీడనాలు ఉన్న సమయాలలో నేను ప్రత్యక్షం అయి తుఫాను సృష్టిస్తాను ఆరకమయిన తుఫానులు ఏవిధంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగిస్తాయో నేను ప్రత్యేకంగా మీకు వివరించనవసరం లేదనుకుంటాను. ఆర్ధిక రంగం లో నేను ఉన్నప్పుడు ఆర్ధిక వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తూ ఉంటాను. ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక స్థితి నా గుప్పిట నే వుంది.
ఆంగ్లంలో నన్ను డిప్రెషన్ అంటారు. చాలా తరుచు గా మనుషులలో ఒక మనో వ్యాధి ని నా పేరు తో పిలుస్తూ ఉంటారు.
తెలుగు లో చాలా పేర్లు ఉన్నాయి నాకు. కొందరు ‘ గుబులు’ అని అంటారు. కొందరు ‘ నిస్పృహ’ అంటారు. కొందరు దుక్ఖోద్వేగం అంటారు.
నన్ను తెలుగులో గుబులు అనటమే సరియినదేమో!
నాకు స్థల భేదం లేదు ప్రపంచం లో ఏ ప్రాంతం లో ఉన్నవారినయినా పట్టి పీదిస్తాను. పల్లె లలో ఉండేవారికంటే పట్టణాలలో ఉండేవారిని ఎక్కువగా బాధిస్తా. నాకు వయో భేదం కూడా లేదు. బాల్యం, యవ్వనం, బాలింత, ముదుసలి – మీరు మీ మీ జీవితాలలలో ఏ దశ లో ఉన్నా నేను పట్టించుకోను.
నేను చాల చెడ్డ వాడిని లేక చెడ్డ దానిని అనండి ఎందుకంటే నాకు లింగ భేదం ఏమీ లేదు. ఆడ వారయినా మగ వారయినా , పట్టి పీడి స్తూ ఉంటాను.
నా కధ సంపూర్ణంగా తెలుసుకోవాలి మీరందరూ. ఎందుకంటే నా చెడు గుణాలు అన్నీ మీరు తెలుసుకుంటేనే నన్ను మీ దరి చేరకుండా మీ జీవితాలను మీరు ప్రేమించి, మీ జీవితాలలోని మంచిని, మాధుర్యాలను బాగా చవి చూడ గలరు.
నా కథ అయిదు భాగాలు గా మీకు చెపుతాను. మొదటి భాగం లో నేను మీ వద్దకు ఏ పరిస్థితులలో వస్తానో వివరిస్తాను. రెండో భాగం లో నేను మీతో ఉన్నప్పుడు మీలో వచ్చే మార్పులు తెలియ చేస్తాను. మూడో భాగంలో నా అజ్ఞాత ఉనికిని ఏ విధంగా మీరు కనుక్కోవచ్చో మీకు నేనే చెపుతాను. నాలుగో భాగం లో ఇక నాకు మీరు ఎలా ఉద్వాసన చెప్పాలో సవివరంగా తెలియ చేస్తాను. ఇక ఐదో భాగం లో నన్ను మీ జీవితాలతో ఎప్పుడూ ఆడుకోకుండా ఉండాలంటే మీరు ఏమి చేయాలో ఆ జాగ్రత్తలు మీకు వివరిస్తాను.
మీరు ఇందుకు తగిన ప్రతిఫలంగానా పేరునూ నా ఆత్మకథ నూ మీ జీవితాంతం గుర్తుంచుకోండి. కాని నన్ను మీ దరికి మాత్రం ఎప్పుడూ చేరనీయకండి. మీ విలువయిన జీవితాలను సంపూర్ణంగా అనుభవించండి, ఆనందించండి.
( తరువాతి టపాలో నా కథ మొదటి భాగం )

మన ఆశావాదానికి మూలాలు – 3.

In Our Health on జనవరి 21, 2012 at 12:03 ఉద.
మన ఆశావాదానికి మూలాలు:
గతంలో కనక మన అనుభవం లోకి వచ్చినట్టయితే,  ప్రతికూల పరిస్థితులను పాజిటివ్ గా తీసుకునే గుణం మనలో అలవడుతుంది. ఈ ప్రవ్రుత్తి  కార్టెక్స్ మరియూ ఫ్రంటల్ కార్టెక్స్ కు మధ్య నాడీ అనుసంధానం వలన.
ఈ ఉదాహరణ చూడండి:  ఒక పరిశీలన లో వాలంటీర్లను  కొన్ని ప్రశ్నలు వేయటం జరిగింది.కొన్ని జబ్బులను వారికి చెప్పి ఏ జబ్బు కావాలో ఉహించుకొమ్మని  చాయిస్  ఇస్తే వారు విరిగిన కాలును  ఉహించుకొన్నారు ఎందుకంటే  మిగతా జబ్బులకంటే విరిగిన కాలు అయితే బెడ్ లో పడుకొని టీవీ చూసుకోవచ్చు అని సమాధానం చెప్పారుట. అంటే విరిగిన కాలు బాధాకరమయినప్పటికీ,  మిగతా జబ్బులతో పోల్చి చూసుకొని విరిగిన కాలు పరవాలేదనుకున్నారు.మెదడు లో ఈవిధంగా ఉహించుకున్నప్పుడు,  ముఖ భాగ సింగు లేట్  కార్టెక్స్ ( rACC ) స్త్రయాటం    ( striatum )    కు వచ్చే సిగ్నల్స్ ను  నియంత్రించి  కేవలం పాజిటివ్ సిగ్నల్స్ ను మాత్రమేక్రియాశీలం చేస్తుంది. మన మెదడు లో ఉండే ఇంకో భాగం జాల కేంద్రకం  ( caudate nucleus ) ఈ జాల కేంద్రకం ఒక నాడీ కణాల సముదాయం.  మనం  ఏవయినా మంచి ఉత్సాహకరమయిన వార్తలు  మనం విన్నప్పుడు ఈ జాల కేంద్రకం మెదడు లో మిగతా భాగాలకు  ముందుగా ప్రకటిస్తూంది. ఇలా మనం వినబోయే వార్త తటస్తమయిన ( neutral ) వార్త అయినప్పటికీ, మనం ఈ వార్తను పాజిటివ్ గా ఉహించుకొని క్రియాశీలురమవుతాము ఈ జాల కేంద్రకం యొక్క  ‘ ప్రకటన’ వల్ల!!. అంటే ఈ జాల కేంద్రకం మనలో సరిగా పని చేయకపోతే నిర్ణయాలు తీసుకోవటంలో మందగించి సందిగ్ధం లో పడుతూ ఉంటాము తరచూ.
అమెరికాలో ఒక సర్వే లో  నూటికి పది మంది వంద ఎండ్లకన్నా  ఎక్కువ కాలం జీవించ గలమని చెప్పారుట. కానీ నిజానికి  వెయ్యి మందిలో ఇద్దరు అమెరికన్లు మాత్రమే వంద ఎండ్లకన్నా ఎక్కువ కాలం జీవిస్తూన్నారు. అలాగే ఇంకో ఉదాహరణ: అమెరికా లో వివాహాన్ని రిజిస్టరు  చేసుకునే ఆఫీసు లో వంద కు  ఒక్కరు కూడా  విడాకులు తీసుకునే ప్రసక్తి లేదు అని సమాధానమిచ్చారుట. కానీ నిజానికి ఒక అంచనా ప్రకారం 2008 లో అమెరికా లో నూటికి  నలభయి  మంది విడాకులు తీసుకున్నారుట !!!.
మనలో చాలా ఎక్కువమంది ఆశావాద పక్ష పాతం( optimism bias ) తోనే జీవితం గడుపుతాము. కాల క్రమేణా మన జన్యువులలో ( అంటే genes లో ) వచ్చిన మార్పులే దీనికి కారణం. జీవ పరిణామ సిద్ధాంతం కనుక ఈ ఆశావాద పక్ష పాతానికి వర్తింప చేస్తే,  ఈ ప్రక్రియ మానవ మనుగడ( survival ) కు ఉపయోగ పడుతూంది. ఆశావాదులు ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవిస్తారు.
శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతూన్న కొద్దీ మన మెదడు లో జరిగే క్లిష్టమయిన ఈ జీవ క్రియలు మనకు స్పష్టం గా తెలుస్తూ ఉన్నాయి. ఈ విజ్ఞానం వల్ల మనం యుక్తా యుక్త విచక్షణను అలవరచుకుని  మన జీవితాలలో  ఉండే భ్రమలను, వాస్తవాలను  బేరీజు వేసుకో గలిగి తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకో గలుగుతాము !!!.
( ‘ టైం’  సౌజన్యం తో )

మన ఆశావాదానికి మూలాలు – 1

In Our Health on జనవరి 7, 2012 at 3:48 సా.

మన ఆశావాదానికి మూలాలు

భవిష్యత్తు గతం కన్నా, వర్తమానం కన్నా బాగు గా ఉంటుందని అనుకోవడమే ఆశావాదం. యదార్ధానికి మన పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నా కూడా ఆశాజనకంగా ఊహించు కోవడం అన్న మాట! ఈ విషయం ఇటీవలి పరిశోధనల్లో తెలిసింది. అంటే మానవులు సహజంగా యదార్ధానికంటే ఆశావాదులు గా ఉండటానికే సిద్ధపడతారన్న మాట.
మనం సహజంగా నిరుద్యోగులవడమో, సహచరుల కన్నా ఎక్కువ సాధ్యులవడమో ( achievers ), విడాకులు తీసుకోవడం,  లేక కాన్సర్ రావడమో , ఇలాంటి విషయాల్లో యదార్ధాన్ని తక్కువగా అంచనా  వేస్తామని పరిశోధనల వల్ల విశదమయింది.
చిన్న పిల్లల్లో ఆశావాదం ఎక్కువగా ఉంటుంది. మనం పెరుగుతూన్న కొద్ది ఇది కూడా పెరిగి  అరవై  ఏండ్ల నుంచి తగ్గుతూ వుంటుంది.
ప్రకృతి విపరీతాలు సంభవించినప్పుడు మనం భవిష్యత్తు ను నిరాశాజనకం గా ఊహించుకోవడం జరుగుతుంది. ఈ  పరిణామం ఎక్కువగా  సామూహిక  పరిణామం గా కనిపిస్తూంది
కాని వ్యక్తిగతంగా మనం ఊహకందని విధంగా మన భవిష్యత్తు మీద పాజిటివ్ గా ఆశాజనకం గా ఉంటాము.
ఈ ఆశావాద పక్ష పాతం ( optimism bias ) కొన్ని అవాంచనీయ  పరిణామాలకు దారి తీయ వచ్చు. అతి సాధారణం గా జరిగే సంఘటన మన ఆరోగ్యం పై  మన అశ్రద్ధ  .
 మానవ దేహం ప్రకృతి లో జరిగిన అత్యద్భుతమయిన సంఘటన. మన దేహం లో ప్రతి క్షణమూ అనేక వేల జీవ రసాయన చర్యలు జరుగుతూ వుంటాయి. ఏ భాగం లో ఏ అసమతుల్యం
( imbalance ) జరిగినా  దాని పరిణామాలు మొదట లక్షణాలు ( symptoms ) గా కనిపిస్తాయి. ఈ లక్షణాలు ముందు ముందు  ప్రబలమయే వ్యాధి లక్షణాలన్న మాట.   ( warning signals అనవచ్చు వీటిని ). మనం ఈ తోలి దశల్లో సంభవించే లక్షణాలని మనం నిర్లక్ష్యం చేస్తాము.కొద్దిగా తల నొప్పి గావుంటే పారసిటమాల్  బిళ్ళలు ( paracetamol tablets ) వేసుకుంటే తగ్గిపోతుంది పరవాలేదులే   అనుకుంటాము. ఆ తల నొప్పికి కారణాలు అన్వేషించము ఈ ఆశావాద పక్షపాతం వల్ల.స్టాక్ మార్కెట్ లో డబ్బు పెడతాము రిస్కులు తెలుసుకున్నా కూడా.
ఇక లాభాల మాటకొస్తే  చాల వున్నాయి.
ఆశావాదులు ఎక్కువ ఆనందంగా వుంటారు. కష్టపడి పని చేస్తారు. నిరాశావాదులకంటే ఎక్కువ డబ్బు ఆదా చేస్తారు కూడా! వారి వారి లక్ష్యాలు చేరటానికి కూడా ఆశావాద దృక్పధం బాగా సహకరిస్తుంది.
జ్ఞాన కాల ప్రయాణం ( cognitive time travel ) :
మనం మన భవిష్యత్తు గురించి గొప్పగా ఊహించే ముందు మనం  ఊహాజీవులం కావాలి. సహజసిద్ధంగా మానవులలో ఈ ప్రత్యేకత పరిణామం చెందింది.
ఎక్కడో, ఎప్పుడో మరణం తప్పదనే  నిజం వల్లనే  ఈ జ్ఞాన కాల ప్రయాణం అనే ప్రత్యెక లక్షణాన్ని మనం వృద్ధి చేసుకున్నాము కాలానుగుణం గా.
మన మెదడు లో హిప్పో కాంపస్ అనే ఒక భాగం ఈ ప్రత్యెక లక్షణానికి మూలం. ఈ భాగం ఏ కారణం వల్ల నైనా దెబ్బ తింటే గతం లో జరిగిన సంఘటనల తో పాటు భవిష్యత్తు ను ఊహించుకోవడం కూడా సాధ్యపడదు. ఇక మెదడు ముఖ భాగం ( frontal cortex ) మెదడు లోపల వుండే భాగాలతో జటిల మైన అనుసంధానం జరుపుతూ వుంటుంది. ఈ ఫ్రాన్తల్ కార్తెక్ష్  ఈ అనుసంధానం వల్ల భవిష్యత్తు ను పాజిటివ్ గా ఊహించడం, వాటికి సంబంధించిన పధకాలు ఆలోచించడం మొదలైన క్రియలు చేస్తూ ఉంటాము.
[ మిగతా భాగం తరువాతి టపా లో ]
%d bloggers like this: