సర్వైకల్ క్యాన్సర్.2.కారణాలు:
మునుపటి టపాలో చూశాము, మన జీవ కణాల లోని క్రోమోజోములలో ఉన్న డీ ఎన్యే, మన లో ఉన్న ప్రతి లక్షణాన్ని ఎలా కాపీ చేసి కొత్త కణాలలో ప్రవేశ పెడతాయో, అలాగే కొత్త కణాల సంఖ్యను కూడా ఒక క్రమ పధ్ధతి లో నియంత్రిస్తాయో !
ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కారణాలు తెలుసుకుందాము. ముఖ్య కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ కు డీ ఎన్యే కు ఉన్న సంబంధం ఏమిటో కూడా చూద్దాము.
వైరస్ లు సృష్టి లో ఉండే అత్యంత సూక్ష్మ మైన జీవ పదార్ధాలు. వైరస్ లు బాక్టీరియా కంటే సూక్ష్మం గా ఉంటాయి. అందు వల్లనే, బాక్టీరియా ను మనం పరిశోధన శాల లో ఉండే సూక్ష్మ దర్శిని ద్వారా చూడవచ్చు. కానీ వైరస్ లు కేవలం ఎలెక్ట్రాన్ సూక్ష్మ దర్శిని తో మాత్రమే చూడగలం.
ఎందుకంటే ఎలెక్ట్రాన్ సూక్ష్మ దర్శిని , వైరస్ లను కొన్ని వేల రెట్లు పెద్దవి గా చేసి మన కంటికి చూపిస్తాయి కాబట్టి.
అలాంటి వైరస్ రకాలకు చెందినదే హ్యూమన్ పాపిలోమా వైరస్. ( HPV virus ).
ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనలు , సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన దాదాపు అందరు స్త్రీలలోనూ, ఈ హ్యూమన్ పాపిలోమా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు ఖచ్చితం గా తెలిపాయి.
ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటే HPV వైరస్ లో కనీసం వంద రకాలు ఉన్నాయి. తమ సెక్స్ జీవితాన్ని ( ప్రధానంగా పురుష జననాంగం యోనిలో ప్రవేశించడం ద్వారా పొందే సెక్స్ ) ప్రారంభించిన రెండు సంవత్సరాలలో , సాధారణం గా ప్రతి ముగ్గురిలో ఒక యువతి లేక స్త్రీ కి ఈ HPV వైరస్ ఇన్ఫెక్షన్ సోకుతుంది. కానీ ఈ HPV వైరస్ వంద రకాలుండటం వల్ల కేవలం కొన్ని రకాలు మాత్రమే సర్వైకల్ క్యాన్సర్ కు కారణం అని తెలిసింది.
HPV16, అంటే పదహారవ రకానికి చెందిన హ్యూమన్ పాపిలోమా వైరస్, అన్ని సర్వైకల్ క్యాన్సర్ కేసులలో 50 నుంచి 55 శాతం కేసులకు కారణ భూతమని తెలిసింది.
అలాగే HPV18, అంటే పద్దెనిమిదవ రకానికి చెందిన హ్యూమన్ పాపిలోమా వైరస్ 15 నుంచి 20 శాతం కేసులకు కారణం అనీ , మిగతా కేసులకు ఇంకో పదకొండు రకాలకు చెందిన HPV వైరస్ లు కారణం అనీ ఖచ్చితం గా తెలిసింది.
పైన చెప్పుకున్న ఈ కొన్ని రకాలే, వంద రకాలలో మిగతా 87 రకాల కన్నా ఎక్కువ గా సర్వైకల్ క్యాన్సర్ ను ఎందుకు కలిగిస్తాయి? :
ఈ ఎక్కువ రిస్కు ఉన్న వైరస్ రకాలు శక్తి వంతమైన జన్యు పదార్ధం అంటే డీ ఎన్యే కలిగి ఉంటాయి. ఈ డీ ఎన్యే , సర్విక్స్ లో ఉన్న కణ జాలం లోకి చొచ్చుకు పోతుంది. అంతే కాక , ఈ వైరస్ కు చెందిన డీ ఎన్యే కణం లో ఉన్న( అంటే సర్విక్స్ కణం లో ఉన్న ) డీ ఎన్యే తో జత కడుతుంది. ఇలా జత కట్టడం వల్ల , అప్పటి వరకూ ఒక క్రమ పధ్ధతి లో జరుగుతున్న కణ విభజన హద్దులు , పరిమితులూ ఏవీ లేకుండా, అంటే ఒక నియంత్రణ అంటూ ఏమీ లేకుండా, ఇష్టం వచ్చినట్టు , అసంఖ్యాకమైన కణాల ఉత్పత్తి కి కారణం అవుతుంది. దాని పరిణామం గా సర్విక్స్ మీద ఒక రాచ పుండు అంటే క్యాన్సర్ మొదలై, పెరగటం ప్రారంభిస్తుంది. ( క్రింద పటం లో చూడండి , ఈ విషయాలన్నీ స్పష్టం గా అర్ధమవడం కోసం.)

వచ్చే టపాలో ఇంకొన్ని కారణాలు తెలుసుకుందాము.