Our Health

Archive for మే 24th, 2012|Daily archive page

పాజిటివ్ సైకాలజీ – మన నైపుణ్యం తో అధికానందం. 10.

In మానసికం, Our minds on మే 24, 2012 at 10:36 సా.

పాజిటివ్ సైకాలజీ – మన  నైపుణ్యం తో అధికానందం. 10.

మనకందరికీ , మన వయసు తో పాటు, వివిధ రంగాలలో మన నైపుణ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే  ఆ నైపుణ్యం కేవలం  ఏదో ఒక కోర్స్ చదివి, పరీక్ష వ్రాసి , పరిక్షలో ఉత్తీర్ణత సాధించి తెచ్చుకున్న నిపుణతే  కానవసరం లేదు. 
మన జీవితానుభవం, మన జీవితాలు నేర్పిన పాఠాలతో మనం కూడా నైపుణ్యం సంపాదించ వచ్చు. కొందరు చిన్నప్పటి నుంచీ ఏదో ఒక నిపుణత ను పెంచుకుంటూ ఉంటారు, ఏ గురువూ  అవసరం  లేకుండానే. 
ఇలా నేర్చుకున్న నిపుణత ను మనం, మన నిత్య జీవితం లో అధికానందం పొందడానికి ఉపయోగించు కోవచ్చు. అలాగే ఆ నైపుణ్యాన్ని  మానవ సంబంధాలను పెంచుకోవడానికీ , లేదా ఉన్న వాటిని బలీయం చేసుకోవడానికీ ఉపయోగించ వచ్చు. 
ఉదాహరణ:   రమ,  కారణాంతరాల వల్ల  డిగ్రీ చదువు, మధ్య లో ఆపి పెళ్లి చేసుకుంది. సంతోషం గానూ ఉంది సంసారం తో. పిల్లల బాధ్యత తగ్గింది ఇప్పుడు . కానీ  ఏదో తెలియని వెలితి తన జీవితం లో, ఎక్కువ గా చదువుకోలేదని ఆత్మ న్యూనత ఉండేది. అలాగని మళ్ళీ చదువుకోవాలనీ అనిపించడం లేదు.  ఆ ఫీలింగ్స్  పోవడానికీ , కొంత తీరిక సమయం దొరికినప్పుడల్లా , వంటల మీద  ప్రయోగాలు చేయడం మొదలు పెట్టింది. ఇరుగు పొరుగు స్నేహితురాళ్ళను పిలిచి వారికి తన వంటకాలు రుచి చూడమని పెట్టేది. అలా స్నేహం పెరిగింది వారితో. వారూ , రమను పిలిచి , తాము నేర్చుకున్న , అల్లికలో , బొమ్మలు చేయడమో , చూపించి,  దగ్గరలో ఉన్న చారిటీ సంస్థ కోసం కూడా అప్పుడప్పుడూ , ఉచితం గా తమ సేవలు అందించి, అలా కూడా అధికానందం పొందుతున్నారు. ఇప్పుడు రమలో  ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయి ఆత్మ విశ్వాసం పెరిగింది. దానితో తన  ఆనందం కూడా ! 
ఇంకో ఉదాహరణ :   ఉదయ్ ఒక  ఆఫీసులో కొత్తగా  ఉద్యోగం లో చేరాడు.  కాలేజీ రోజుల్లో బాగా క్రికెట్ ఆడే వాడు. నెల కు ఒకరోజు  తన ఆఫీసు వారితో క్రికెట్ ఆడతాడు. అలా కొత్తగా చేరిన ఆఫీసులో అందరికీ  బాగా పరిచయమయాడు.  అంత వరకూ ముభావం గా ఉండే తోటి ఉద్యోగస్తులు , ఇప్పుడు స్నేహ పూర్వకం గా మాట్లాడుతున్నారు. వారితో కలిసి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆర్గనైజ్ చేయాలని ప్రయత్నాలు మొదలెట్టాడు.  అందరూ ఆ కార్యక్రమం లో పాల్గొని  ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసి చూపించాలని నిబంధన పెట్టాడు.  తోటి ఉద్యోగులు, తామందరూ  పాల్గొనటం అటుంచి, ఎక్కువ ఆనంద పడుతున్నారు.  ఆఫీసులో వాతావరణం , వర్క్ తో పాటు , ఆహ్లాద కరం గా కూడా మారింది అందరికీ !
ఇక్కడ జరుగుతున్నదేమిటంటే , రమ, ఉదయ్ లు తాము సంపాదించిన నైపుణ్యాన్ని నిత్య జీవితం లో ,  నలుగురి  ఆనందం కోసం  ఉపయోగిస్తున్నారు, వారు కూడా ఆనంద పడుతున్నారు. అలా వారికి  పరిచయాలు కూడా పెరుగుతున్నాయి. వారి చుట్టూ ఉన్న వారితోనూ సత్సంబందాలు ఏర్పరుచు కో గలుగుతున్నారు. వారి బలం వారు తెలుసుకుని వారు దేనిలో  ఎక్కువ ప్రతిభ చూపగలరో దానిని తమకు అధికానందమూ , సంతృప్తీ కలిగించే రీతిలో ఉపయోగించు కుంటున్నారు. 
ఇలా ప్రతి ఒక్కరూ , తమకు ఉన్న  ఏ నిపుణత నైనా,  అది ఎంత పరిమితం గా ఉన్నా , దానిని    నిత్య జీవితం లో ఉపయోగించి , తద్వారా, అధికానందం పొందవచ్చు.  తమ సాంఘిక జీవనం లో సత్సంబంధాలు ఏర్పరుచుకోవచ్చు. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 
%d bloggers like this: