Our Health

Archive for మే 14th, 2012|Daily archive page

ఏస్ ఇన్హిబిటార్ మందులు హై బీ పీ ని ఎట్లా తగ్గిస్తాయి ? .31.

In Our Health on మే 14, 2012 at 10:34 సా.

ఏస్ ఇన్హిబిటార్ మందులు  హై బీ పీ ని ఎట్లా తగ్గిస్తాయి ? .31. 

మనం క్రితం టపాలో చూశాము. మొదటి దశలో కొత్తగా అధిక రక్త పీడనం కనుక్కొన్నప్పుడు ,  A అంటే ఏస్ ఇన్హిబిటార్ వాడమని సలహా ఇస్తారని.
ఈ ఏస్ ఇన్హిబిటార్  55 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారికి వాడమని సలహా ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఏస్ ఇన్హిబిటార్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాము.
క్రింద పటం గమనించండి. 
మన రక్త నాళాలు నార్మల్ గా  అంటే సాధారణం గా   వెడల్పు అయినప్పుడు ,  అంటే వాటి వ్యాసం పెరిగినప్పుడు  రక్త పీడనం తగ్గుతుంది.  అప్పుడు  వాటి గోడలలో ఉన్న కండరాల కణాలకు యాంజియో టేన్సిన్ అనే రసాయనం అతుక్కుంటుంది.
( మనం చూశాము కదా , మునుపటి టపాలో , మన రక్త నాళాలు లోహం తో చేసిన పంపు ల లా కాక , కండరాల పొరతో చేసిన పంపులని.  రక్త నాళాలలో ఈ కండరాలు ఉబ్బెత్తుగా మనకు సహజం గా కనిపించే  చేతి, కాళ్ళ  కండరాలు గా కాక  పలుచటి పొరలు లాగా అమరి ఉంటాయి. ఉదాహరణ కు  మనం పొడవాంటి బూర అంటే బెలూన్ , ఊదక ముందు అంటే గాలి నింపక ముందు , కుంచించుకు పోయి ఉంటుంది కదా. కానీ అది , దాని లోకి గాలి ఊదినప్పుడు , వ్యాకోచించు తుంది కదా !  అలా వ్యాకోచించడం పలుచటి పొర ద్వారానే అవుతుంది కదా ! అలాగే మన రక్త నాళాలు వ్యాకోచించి ఉన్నప్పుడు , వాటిలో రక్తం ఉన్నా , విశాలం గా ఉండడం తో రక్త పీడనం తగ్గుతుంది )
ఒకసారి యాంజియో టేన్సిన్  అనే జీవ రసాయనం  కండరాల కణాలకు అతుక్కొగానే,  ఆ కండరాలు సంకోచిస్తాయి అంటే బిగుతు గా అయి తద్వారా,  రక్త నాళాల వ్యాసం  తగ్గిస్తాయి. ఇలా వాటి వ్యాసం తగ్గటం వల్ల రక్త పీడనం పెరుగుతుంది.
మనం తీసుకునే ఏస్ ఇన్హిబిటార్ మందు  యాంజియో టేన్సిన్ అనే రసాయన పదార్ధాన్ని తయారు కాకుండా అడ్డుకుంటుంది.(  అందువల్లనే  ఈ మందులకు ACE inhibitors అనే పేరు వచ్చింది. ( A C E అంటే  Angiotensin  Converting Enzyme ) ఆ ఎంజైం ను ఆపి తద్వారా  యాంజియో టేన్సిన్ తయారు కావడం తగ్గించడం వల్ల ఈ మందులకు యాంజియోటేన్సిన్ కన్వర్టింగ్ ఎంజైం ఇంహిబిటర్స్ అని పేరు వచ్చింది ). అలా  యాంజియో టేన్సిన్ అనే రసాయనం తయారు కాక పోవడం వల్ల  లేక దాని తయారీ తగ్గి పోవడం వల్ల  , రక్త నాళాలు వ్యాకోచ స్థితి లోనే ఉండి అధిక రక్త పీడనం తగ్గిస్తాయి.  పైన ఉన్న పటం లో రెండవ చిత్రం లో ACE inhibitors యాంజియో టేన్సిన్ రక్త నాళాల కండరాలకు అతుక్కోకుండా చేయడం వల్ల , రక్త నాళం వ్యాకోచ స్థితి లోనే  ఉండడం గమనించండి.
ఇట్లా  అందరిలోనూ రక్తనాళాల వ్యాకోచ సంకోచ  క్రియలు జరుగుతూ ఉంటాయి. కానీ అందరిలోనూ  అధిక రక్త పీడనం ఉండదు. దానికి కారణం స్పష్టం గా ఇంతవరకూ తెలియదు. కానీ తీవ్రమైన వత్తిడి కూడా ఈ పరిస్థితికి కారణం అవుతుందని కూడా భావించ బడుతున్నది. అంటే మనం నిత్యం వత్తిడి గా ఉంతే  అప్పుడు రక్త    రక్త నాళాలలో  కండరాల పొర ఎక్కువ సంకోచించి , తద్వారా అధిక రక్త పీడనం కలిగించ వచ్చు. అందువల్ల నే  వత్తిడి తగ్గించుకునే , రిలాక్సేషన్ , లేక మెడిటేషన్ , లేక యోగా ప్రక్రియలకు ప్రాముఖ్యం చాలా ఉంది, అధిక రక్త పీడనం కంట్రోలు చేయడం లో.
మరి ఏస్ ఇన్హిబిటార్  రోజూ వేసుకోవాలా ?:
రక్త నాళాలు  సంకోచం , వ్యాకోచాలు రోజూ  జరుపుతుంటాయి కదా !  అందువల్ల రోజూ  ఈ మందు తీసుకోవడం మానకూడదు.
ఇంకో గమనిక : ఈ ఏస్ ఇన్హిబిటార్  మందుల పేర్లన్నీ  ‘ ప్రిల్ ‘ లేక  pril  అనే  చివరి అక్షరాలతో  ఉంటాయి గమనించారా ! అంటే క్యాప్టో ప్రిల్, ఏనాలాప్రిల్, రామిప్రిల్,  లిసినోప్రిల్.. ఆలా !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

హై బీ పీ కి నైస్ ( NICE ) ( ఇంగ్లండు ) వారు ఏ మందులు వాడమంటున్నారు ?.30.

In Our Health on మే 14, 2012 at 9:51 ఉద.

హై బీ పీ కి నైస్ ( NICE ) ( ఇంగ్లండు ) వారు ఏ మందులు వాడమంటున్నారు ?.30.

 
నైస్ అంటే  నేషనల్ ఇన్స్టిట్యూట్  అఫ్ క్లినికల్ ఎక్సేల్లెన్స్ . వీరు అధిక రక్త పీడనం కొత్తగా కనుక్కున్న వారికి మందులతో చికిత్స ఒక పధ్ధతి లో చేయాలని సూచించారు. 
ఆ పధ్ధతి నమూనా పట్టీ క్రింద చూడ వచ్చు మీరు. 
ఈ విషయాలు అందరం ఎందుకు తెలుసుకోవాలి? :
ఎందుకంటే ,  మనం సాధారణంగా చూస్తుంటాము.  అధిక రక్త పీడనానికి , వేరు వేరు మందులు రాస్తుండటం.  అది మనకు చాలా సందేహాలకు మూలం అవుతుంది.  భారత దేశం లో ప్రత్యేకించి , ఏ డాక్టరు కూ , వివరం గా వారు ఇస్తున్న మందుల గురించి వారి పేషంట్లకు చెప్పే  పెషన్సూ అంటే ఓపికా , సమయమూ ఉండదు. కొందరికి సమయం ఉన్నా ,  ఎప్పుడూ , చాలా చాలా బిజీగా ఉన్నట్టు ఉంటారు. అందువల్ల  మొదట ఏ వయసులో  ఏ మందులు  ఇస్తారో ఒక అవగాహన ముందుగా , ఆ మందులు తీసుకునే  మనకు కలిగితే, అప్పుడు , ఆ  మందులు ఇస్తున్న డాక్టరు ను అడిగి అనుమానాలు తీర్చుకోవచ్చు కదా !
 ఈ విషయాలన్నీ మనకు ఎందుకు ముఖ్యం అంటే , సరిగా కంట్రోలు అవని అధిక రక్త పీడనం మన జీవితాలలో సృష్టించే అనారోగ్య తుఫానుల గురించి చాలా వివరం గా మునుపటి టపాలలో తెలుసుకున్నాము కదా ! 
ఇప్పుడు క్రింద  ఉన్న టేబుల్  పటం చూడండి. 
 
 
 
ఈ పటం లో పైన ఉన్న వయసు తరగతులు రెండూ మీకు అర్ధమవుతాయి కదా ! అంటే  వయసు  55  సంవత్సరాల కన్నా తక్కువ వయసు వారు,  అంతకు మించి ఉన్న వారు అని. 
తరువాత  పటం కుడి భాగాన  నాలుగు స్టెప్స్  అంటే నాలుగు  దశలలో మందులు, మార్చి ఇవ్వడం జరుగుతుంది.  ఇక్కడ మీరు గుర్తు ఉంచుకో వలసినది  ఇంగ్లీషు అక్షరాలు , ఏ , సి , ఇంకా డీ  ( A,C,D )
A = ACE inhibitor. లేక ఏస్ ఇన్హిబిటార్ .
C= Calcium channel blocker. లేక క్యాల్సియం చానెల్ బ్లాకర్.
D= Thiazide- type diuretic. లేక తయజైడ్ టైపు డయురెటిక్ .
 
వీటి వివరాలు మనం వచ్చే టపాలో చూద్దాము !. ( మీరు గమనించి ఉంటారు, టపాలు చిన్నవి గా ఉంటున్నాయి కదా ! దానికి కారణం  అనేక పేజీల అర్ధం కాని , లేక అర్ధం చేసుకోలేని  వివరాలు ఇచ్చి మీ రక్త పీడనాన్ని అధికం చేయడం నా ఉద్దేశం ఏ మాత్రం కాదు కనుక !  మీకు సమయం ఉంటే రెండు మూడు సార్లు ఇదే టపా చదివి బాగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి , అనుమానాలు, సందేహాలు ఉంటే తెలియ చేయండి , తప్పకుండా ! )
 
 
 
 
 
 
%d bloggers like this: