Our Health

Archive for మే 2nd, 2012|Daily archive page

ACS లో ఏ ఏ మార్పులు జరుగుతాయి ?.10.

In Our Health on మే 2, 2012 at 6:58 సా.

ACS లో ఏ ఏ మార్పులు జరుగుతాయి ?.10.

ACS లో జరిగే మార్పులు కొంత వరకు మనం నిన్నటి టపాలో తెలుసుకున్నాము. (  మళ్ళీ నిన్నటి టపాలో పటాన్ని గమనించి మిగతా మార్పులు క్రింద చదువుతూ , అదే పటం లో చూడండి.)
అంటే ఫిక్సెడ్  కరోనరీ అబ్స్త్రక్షన్  వరకూ. ఫిక్సెడ్ కరోనరీ అబ్స్త్రక్షన్ అంటే  ‘ యాంజైనా ‘ అన్న మాట. ఈ పరిస్థితిలో  గుండె కండరాలకు సరఫరా చేసే రక్తం  పూర్తిగా ఆగిపోదు కానీ చాలా తక్కువ గా అందుతుంది.
ఇలా ఫిక్సెడ్ కరోనరీ అబ్స్త్రక్షన్ జరిగిన తరువాత , ఆ ధమని లో మార్పులు రెండు రకాలు గా ఉండవచ్చు. ఒక రకం లో కరోనరీ ధమని ఇంకా , ఇంకా పూడుకు పోయి , సివియర్ ఫిక్సెడ్ కరోనరీ అబ్స్త్రక్షన్ గా మారవచ్చు.
 అంటే ఇక్కడ అబ్స్త్రక్షన్ లేక  రక్తనాళం ‘ పూడుకు పోవడం ‘ తీవ్రం గా ఉంటుందన్న మాట.
ఇక రెండో రకమైన మార్పులలో  ధమని లో ఏర్పడ్డ ప్లేక్ లేక plaque కొద్ది గా  ‘ పెచ్చు ‘ ఊడినట్టు గా అవుతుంది.  ఈ ఉదాహరణ ఊహించుకోండి.  మనమందరం మన బాల్యం లో కనీసం కొన్ని సార్లు అయినా ఆటల్లో కింద పడి పోయినప్పుడు, మన  మోకాలో , మోచేయో  ‘ దోక్కు ‘ పోవడం మన అనుభం లోనిదే కదా ! ఇలా జరిగిన కొన్ని రోజులకు  ఆ దోక్కు పోయిన చోట పెచ్చు, చెక్కు ,  లేక ‘ scab ‘ ఏర్పడుతుంది కదా !  ఈ పెచ్చును మనం పొరపాటున అంటే తొందరగా గాయం మానాలనే ఆత్రుతతో మనమే తీయటానికి ప్రయత్నిచే వాళ్లము కదా! అప్పుడు ఆ పెచ్చు తీయగానే, ఆ ప్రాంతం లో మళ్ళీ కొద్దిగా రక్తం రావడమూ, మళ్ళీ కొత్త ‘ పెచ్చు ‘ లేక scab ఏర్పడడమూ కూడా మన అనుభవం లోనిదే కదా!
అలాగే  ప్లేక్  కూడా ‘ పెచ్చు ‘ లేచినట్టు అవుతుంది. దీనినే ప్లేక్ డిస్రప్ షన్  ( plaque disruption ) అని అంటారు.  ఆ పరిస్థితి లో మళ్ళీ ఆ ప్రదేశం లో రక్తం లోని  ప్రత్యెక రక్త కణాలు , వాటిని ప్లేట్ లెట్స్ ( platelets ) అని పిలుస్తారు ఎందుకంటే అవి చిన్న ప్లేట్ ల లాగా ఉంటాయి అంటే పళ్ళెం  ఆకారం లో ఉంటాయి కనుక, ఈ ప్లేట్ లెట్స్ కొన్ని చేరి  అక్కడ ఏర్పడిన ‘ చిన్న గాయం ‘ ను మళ్ళీ మూసివేసే ప్రయత్నం చేస్తాయి. ఇలా చేయడం  వల్ల, ప్లేట్ లేట్  ల సముదాయం లేక గుంపు ను  త్రాంబస్ లేక ‘thrombus’ అంటారు.
ఈ త్రాంబస్ ఒక సారి ఏర్పడ్డ తరువాత  రెండు పరిణామాలు జరగ వచ్చు.
ఒకటి: మళ్ళీ ఈ త్రాంబస్  మాని పోయి ఒక సున్నితమైన చెక్కు కట్టడం. ఇలా చెక్కు కట్టి నప్పుడు,  అసలే కొంత సన్న బడ్డ ధమని వ్యాసం ఇంకొంత తగ్గి , సివియర్ కరోనరీ అబ్స్త్రక్షన్  లేక severe fixed coronary obstruction గా మారుతుంది. ఇలా జరగటం  తో  క్రానిక్ ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్  అన బడుతుంది అట్లాంటి పరిస్థితి. క్రానిక్ అంటే దీర్ఘ కాలం, ఇస్కీమిక్ అంటే రక్త సరఫరా లేక పోవడం, హార్ట్ డిసీజ్ అంటే గుండె జబ్బు.
ఇక రెండో పరిణామం, ఈ త్రాంబస్ లేక ప్లేట్ లెట్ ల గుంపు మళ్ళీ ఊడి పోయి  అంటే ప్లేక్ దిస్రప్షన్ జరిగి ఆ చోట నుంచి ఇంకా రక్తం వచ్చి, మళ్ళీ త్రాంబస్ ఏర్పడి  ఆ ప్రదేశాన్ని , పూర్తిగా మూసి వేస్తుంది. అప్పుడు ఆ పరిస్థితిని మయోకార్డియల్ ఇంఫార్క్షన్ లేక గుండె పోటు అంటారు. అంటే ఈ పరిస్థితి లో గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులలో ఒకటి సంపూర్ణం గా మూసుకొని పోయి , ఆ ప్రాంతం లో ఉన్న గుండె కండరాలకు రక్తము , అంటే రక్తం లో ఉన్న ప్రాణవాయువు అంటే ఆక్సిజెన్ అందక, పనిచేయడం ఆగుతుంది. (  పైన ఉన్న పటం లో ఈ మార్పులు గమనించండి. అలాగే మిగతా మార్పులు క్రితం టపాలో ఉన్న పటం లో చూసి గమనించండి ) .
ఇలా ఒకసారి  ఏర్పడిన ప్లేక్ రెండో రకం గా ఎందుకు పరిణామం చెంది , plaque disruption లేక ఏర్పడ్డ చోటునుంచి ‘ ఊడిపోతుందో ,  కారణం స్పష్టంగా ఇప్పటి వరకూ మనకు తెలియదు. అధిక రక్త పీడనము, మిగతా రిస్కు ఫాక్తర్లూ కలిసి, ఇలా జరుగుతుందని భావించ బడుతుంది.
మిగతా విషయాలు వచ్చే టపాలో తెలుసుకుందాము !
%d bloggers like this: