Our Health

Archive for జూన్, 2012|Monthly archive page

స్థిత ప్రజ్ఞత ( రిసిలిఎన్స్ or rislience ) అంటే ఏమిటి ? దానిని మనం ఎందుకు అలవరచు కోవాలి ?

In మానసికం, Our minds on జూన్ 20, 2012 at 8:29 సా.

స్థిత ప్రజ్ఞత ( రిసిలిఎన్స్ or rislience ) అంటే ఏమిటి ? దానిని మనం ఎందుకు అలవరచు కోవాలి ? : 

మానవ జీవితం లో కష్ట సుఖాలు ,  జీవితమనే ఒకే బండి కి ఇరు వైపులా ఉన్న చక్రాలలాంటివి. జీవితం సాగుతున్నప్పుడు ఒడు దుడుకులూ , తప్పవు. అట్లాంటప్పుడు ( జీవిత ) గమనం, ఒకింత  భారం గా అనిపించనూ వచ్చు. అట్లాగే ఆనంద డోలలలో తేలిపోతున్నట్టు , జీవిత ప్రయాణం సుఖం గానూ ఉండవచ్చును.  మహా భారతాన్ని తెనిగీకరించిన తిక్కన మహాకవి ఇట్లా అన్నారు ‘ ప్రమోద ఖేదంబులు వచ్చును పర్యాయంబున ! ‘ ఘంట సాల గారి భగవత్ గీత విన్న వారు కూడా స్థిత ప్రజ్ఞత అంటే ఎట్లా శ్రీ కృష్ణుడు నిర్వచించాడో వినే ఉంటారు. కేవలం పురాణాలకో,  వేదాంతా నికో పరిమితమవలేదు ఈ స్థిత ప్రజ్ఞత.  ఆధునిక మానవ జీవితం లో ఈ స్థిత ప్రజ్ఞత యొక్క ప్రాముఖ్యత ఇంకా ఎక్కువ అయింది శాస్త్రీయం గా కూడా అంటే సైంటిఫిక్ గా కూడా ! . అందు వల్ల నే  దీనిని  పాజిటివ్ సైకాలజీ లో ఒక ముఖ్య మైన అంశం గా బోధిస్తారు, చదువుకుంటారు. మరి స్థిత ప్రజ్ఞత అంటే ఏమిటి ? : ఒక్క ముక్క లో చెప్పాలంటే , కష్టాలలో కుంగి పోక , సుఖాలలో పొంగి పోక , సమతుల్యం తో జీవితం( ఆనంద మయంగా ) సాగించడమే ! అంటే కష్ట సమయం లో మనసు కుదుట పరుచుకొని, ధైర్యం గా ఆ కష్టాలను ఎదుర్కొని అధిగమించడం చేయాలి. ఆ సమయం లో నిరాశా నిస్పృహలకు మన జీవితాలలో తావివ్వ కూడదు.
 స్థిత ప్రజ్ఞత కు నిర్వచనం ఏమిటి ? :  జీవితాలలో ప్రతికూల పరిస్థితులను, సమర్ధ వంతం గా అధిగమించి, విజయం పొందే సామర్ధ్యాన్ని  స్థిత ప్రజ్ఞత అంటారు. చాలా మంది, బాల్యం లోనూ , యవ్వనం లోనూ, అనేక కష్టాలను ఓర్చుకొని , విజయులై  సాగి పోతుంటారు జీవితంలో. ఆ కష్టాలు పేదరికము,ఆకలి ,  క్షామము, కుటుంబ కలతలు, లేక పరిసరాలలో యుద్ధాలు కూడా కావచ్చు. కానీ ,  వారు మానసికం గా, వారు అనుభవించిన కష్టాలతో ఎక్కువ బలవంతులూ, శక్తి వంతులు గానూ తయారవుతారు. వారిలో రిసిలిఎన్స్ లేదా స్థిత ప్రజ్ఞత ఎక్కువ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ జరుగుతున్నది , కష్టాలనూ, ప్రతికూల వాతావరణాన్నీ , వారు తమకు అనుకూలం గా మలచుకొని, వాటిని అధిగమించడం. అందువల్లనే, ఆధునిక సైకాలజిస్టు లు, చిన్న వయసునుంచీ , ప్రతికూల పరిస్థితులను మానవులు, ఎదుర్కొని, అధిగమించడమే ఉత్తమమని అభిప్రాయ పడతారు, వాటిని చూసి, పారిపోవడం లేదా ఎవాయిడ్ చేయడం కన్నా !  సాధారణం గా చిన్న పిల్లలకు ఈ రిసిలిఎన్స్ ఎక్కువ గా ఉంటుందని వివిధ పరిశీలనల వల్ల తెలిసింది. అందువల్లనే  వారిని, వారు ఎదుర్కొన్న కష్టాలతో జత చేసి ‘  ప్రాబ్లం చైల్డ్ ‘   అని సంభోదించడం పొరపాటు ‘ అని చాలా మంది సైకాలజిస్ట్ లు అభిప్రాయ పడతారు.  
మరి మన జీవితాలను ఆనందమయం చేసే  ఇంత ముఖ్యమైన లక్షణాన్ని  ఎట్లా పెంపొందించు కొవచ్చో వచ్చే టపాలో తెలుసుకుందాము ! 
 

పీతలతో మెదడుకు మేత !

In మానసికం, Our minds on జూన్ 18, 2012 at 11:40 ఉద.

పీతలతో  మెదడుకు మేత ! 

 ( పైన ఉన్న మొదటి చిత్రం  స్క్విడ్ లు  (  పీత జాతి సముద్ర జంతువులు ) . రెండవ చిత్రం  ప్రోటాను ట్రాన్సిస్టర్ . అందులో చూపించిన ఖైటోసాన్ అనే (  పసుపు పచ్చని , పీతల  కవచాల నుంచి తయారు చేయ బడ్డ  )  పదార్దమే  ప్రోటానులను  ( తద్వారా సిగ్నల్స్ నూ , లేదా సంజ్ఞ లనూ ) మన దేహం లోని కణాలకు పంప  గలదు ). 

మన శరీరం లో అనేక బిలియన్ల  కణాలు ఉన్నాయి కదా ! అట్లాగే మన మెదడు లో కూడా అనేక మిలియన్ల  నాడీ కణాలతో నిర్మించ బడ్డది కదా !  
నిశితం గా గమనించి నట్టయితే మన దేహం లో ఉన్న ప్రతి కణం లోనూ నిరంతరం జరుగుతుండే మార్పులు,  అతి సూక్ష్మ పరిమాణం లో ప్రవహించే విద్యుత్తు వలన. ఉదాహరణకు మన చేతి వెలికి ఒక సూది మొన తగిలింది అనుకోండి. వెంటనే మన మెదడు కు ఎట్లా తెలుస్తుందనుకున్నారు? మన శరీరమంతా వ్యాపించి ఉన్న నాడీ తంత్రులు విద్యుత్తు అంటే  ధన లేక ఋణ విద్యుత్తు ( పాజిటివ్ లేదా నెగెటివ్ చార్జ్  ) కలిగి ఉండడం వల్లనే ! అట్లాగే మన దేహం లో జరిగే ప్రతి చర్యా, అత్యంత సూక్ష్మం గా జరుతున్న ఈ మార్పుల సముదాయమే ! 
మన శరీరం  లో అనేక చర్యలు పాజిటివ్ చార్జ్ , అంటే ధన విద్యుత్తు ఉన్న ప్రోటానుల వల్ల  జరుగుతుంటాయి. ఉదాహరణకు , మనలో ఉన్న ప్రతి కండరం కదలికా  సున్నం అంటే క్యాల్సియం  ( ధన విద్యుత్తు కలిగిన అంటే ప్రోటాను ) అయానుల వల్లనే ! ఆ క్యాల్సియం అయానులు మనలో లేక పొతే మనం మన దేహం లో ఏ కండరాన్నీ కదిలించ లేము. అట్లాగే మన నాలుక మీద ఏదైనా ఆహార పదార్ధం ఏదైనా పెట్టుకోగానే , మనకు ఆ రుచి తెలిసేది , ధన విద్యుత్తు కలిగిన అయానులు ( ప్రోటానులు ) మెదడుకు ఇం పల్స్  ను చేరవేయడం వల్లనే. అంత  దాకా ఎందుకు  ? మనము కళ్ళు తెరవగానే కనపడే చరాచర సృష్టి అంతా కేవలం ధన విద్యుత్తు కలిగిన ( అంటే పాజిటివ్ చార్జ్ ఉన్న ) ప్రోటాను అయానులు మన రెటినా నుండి సంజ్ఞలు ( సిగ్నల్స్  లేదా   ఇం పల్స్ లు అనవచ్చు  )  మెదడు కు చేరవేయడం వల్లనే ! ఇట్లా మన దేహం లో జరిగే అనేక చర్యలు  ధన విద్యుత్తు కలిగిన ఖనిజాలు అంటే క్యాల్సియం, సోడియం , పొటాసియం ( ఈ మూడు ప్రధాన ధన విద్యుత్తు కలిగిన లేదా పాజిటివ్ గా చార్జ్ ఉన్న , అంటే వాటి ప్రోటానుల వలన నే ) అనబడే అయానుల వల్లనే !  
ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావించ వలసి వచ్చిందంటే,  మనం ఆరోగ్యం తో ఉన్నప్పుడు, నిరంతరం జరిగే ఈ జీవ చర్యలు, మన ఆరోగ్యం కుంటు పడ్డప్పుడు,  సరిగా జరగక పోవచ్చు. ఉదాహరణకు : అల్జీమర్స్ డిసీజ్  అనే మతి మరుపు వ్యాధి , వయసు మీద పడుతున్నకొద్దీ , మన మెదడు లోని నాడీ కణాలు ఒక దానితో ఒకటి అను సంధానం సరిగా జరగక వస్తుంది. అనుసంధానం సరిగా జరగక పోవడానికి, అక్కడ ఉండే ధన చార్జ్ అంటే పాజిటివ్ చార్జ్ ఉన్న అయానులు సరిగా సంజ్ఞ లను పంపుకోక పోవడం వల్లనే !   ఇంకో ఉదాహరణ: పార్కిన్సన్ డిసీజ్ అనే కండరాలు గట్టి పడే వ్యాధి ఉంది. ఆ వ్యాధి లో కూడా, ( అనేక కారణాలు ఉన్నప్పటికీ ) మెదడు లో ఈ ధన చార్జ్ లో అంటే పాజిటివ్ చార్జ్ లో అవక తవకలు ఏర్పడతాయి. ఇట్లాంటి పరిస్థితులలో , మన దేహం లోనూ , మెదడు లోనూ ఈ పాజిటివ్ చార్జ్ ల లో మార్పులు తెచ్చి , వ్యాధిని కొంత వరకైనా నియంత్రించ వచ్చు కదా అని శాస్త్రజ్ఞులలో ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనలను అమలు లో పెట్టడానికి ఒక పెద్ద అవరోధం ఏమిటంటే,  పైన చెప్పుకున్నట్టు , మన దేహం ఎక్కువ గా పాజిటివ్ గా చార్జ్ అయి ఉంటుంది. కానీ మనం వాడుతున్న అనేక ఎలెక్ట్రానిక్ పరికరాలు  నెగెటివ్ గా చార్జ్ అయి ఉంటాయి. అందువల్ల మన దేహం లో ఏదైనా సూక్ష్మ ( ఎలెక్ట్రానిక్  ) పరికరాన్ని ప్రవేశ పెట్టి ,  మనకు కావలసిన  మార్పు  , సంబంధించిన కణాలలో తెద్దామనుకున్నా,  ఆ కణాలు అన్నీ  పాజిటివ్ గా చార్జ్ అయి ఉండడం వల్ల ఎలెక్ట్రానిక్ పరికరం తో ‘ మాట్లాడ లేవు ‘ అంటే గుర్తు పట్టలేవు.  అందువల్ల ఈ ప్రయత్నాలన్నీ ఇప్పటి వరకూ విఫలమయ్యాయి. కానీ వాషింగ్ టన్  విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రోలాండి, ఆయన టీం తో కలిసి ఒక సూక్ష్మ పరికరం కనుక్కున్నారు.  దీని పేరే  ప్రోటాన్ ట్రాన్సిస్టర్ ( Rolandi’s device or proton transistor ).
మరి ఈ ప్రోటాన్ ట్రాన్సిస్టర్ కూ పీతలకూ సంబంధం ఏమిటి ? : 
ఈ ప్రొఫెసర్ రోలాండి గారు తాము కనిపెట్టిన  ఈ ట్రాన్సిస్టర్ లో  ఒక పదార్ధాన్ని వాడారు . ఆ పదార్ధం పేరు ‘  ఖైటోసాన్ ‘  ( chitosan ). ఈ పదార్ధము పీతల కవచాల నుంచీ , స్క్విడ్ లు అనబడే సముద్రం లో ఉండే పీతల జాతికి చెందిన జంతువులు – వీటి కవచాల నుండీ వేరు చేసిన చెక్కర వంటి పదార్ధం .  ఈ ఖైటోసాన్ ప్రత్యేకత ఏమిటంటే ,  దీని ద్వారా ప్రోటానులు అంటే పాజిటివ్ గా చార్జ్ అయి ఉన్న అయానులు ఒక చోట నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేస్తాయి. అంటే మన దేహం లో కణాల మధ్య ప్రయాణం చేస్తున్నట్టు. అదే మనకు ( అంటే శాస్త్రజ్ఞులకు ) కావలసినది.  ఇప్పుడు  రోలాండి గారు,  ఈ ప్రోటాను ట్రాన్సిస్టర్ ను వైద్య పరం గా ఎంతగా ఉపయోగించ వచ్చో తేల్చే ప్రయత్నం లో ఉన్నారు.  ఫలితాలు కొంత కాలం పట్ట వచ్చు, కానీ ముఖ్యమైన ప్రోటాను ట్రాన్సిస్టర్ ఆవిష్కరణ జరిగింది కదా ! జార్జియా ఇంస్టి ట్యూట్ అఫ్ టెక్నాలజీ లో జీవ నాడీ కణాల మీద  పని చేస్తున్న బెల్లం కొండ రవి  ఇట్లా అన్నారు ‘ ప్రోటాన్ ట్రాన్సిస్టర్ ల తో  ప్రతి కణం లోని ధన అయానులను (  అంటే పాజిటివ్ అయానులు ) అవసరమైన చోట  కణాల లోకి ఎక్కువగా పంపీ , లేదా అనవసరమైన వాటిని బయటికి లాగి వేసీ , ఈ మార్పులు జరుగుతున్న వ్యాధులకు చికిత్స చేయటం లో కొత్త దారులు ఏర్పరచ వచ్చు ‘ ఒక రకం గా చెప్పాలంటే ఈ ఖైటోసాన్ ఒక నానో ఫైబర్ గా ఏర్పడి ( నాడీ సంబంధ వ్యాదులలో ) తెగి పోయిన లేదా పాడయి పోయిన నాడీ తంత్రుల ను అనుసంధానం చేసి  వాటి మధ్య సంజ్ఞలు , లేదా సిగ్నల్స్  యధా విధి గా ప్రయాణించడానికి  అవకాశం ఏర్పడుతుంది’. 
ఇప్పుడు తెలిసింది కదా   భవిష్యత్తులో , పీతలతో మన మస్తిష్కాలకు మేత ఎట్లా వస్తుందో ! 
( ఈ టపా కూడా తాజా సంచిక  ‘ న్యూ సైంటిస్ట్ ‘ నుంచి  అనువదించ బడింది ). 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ! 
 

మతి పరిభ్రమణం మనకు మంచిదే ! . 1.

In మానసికం, Our minds on జూన్ 17, 2012 at 2:17 సా.

మతి పరిభ్రమణం మనకు మంచిదే ! . 1.

చాలా కాలం నుంచీ మతి పరిభ్రమించడం ఒక జాడ్యం గా భావించ బడుతూ ఉండేది. మనం ఆలోచిస్తున్న సమస్య పైన కేంద్రీకరించడము, అట్లాగే మనకు అనవసరమైన ఆలోచనలను జల్లెడ పట్టి ( అంటే వేరు చేసి ), అసలు సమస్య పైన ధ్యాస పెట్టడం కూడా మంచిదేనని.  ఇక్కడ ఒక విషయం గమనించాలి. మన జ్ఞాపక శక్తి రెండు రకాలు గా పనిచేస్తుంది. అది ఎగ్జిక్యుటివ్  ఫన్క్షనింగ్, అంటే సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, ఇంకా వర్కింగ్ మెమరీ అంటే తాత్కాలిక జ్ఞాపకాలు. ఈ వర్కింగ్ మెమరీ సరిగా పనిచేస్తూ ఉంటే అది ఎగ్జిక్యుటివ్ ఫన్క్షనింగ్ ను నియంత్రించుతూ అంటే కంట్రోలు చేస్తూ ఉంటుంది. ఈ వర్కింగ్ మెమరీ బాగా ఉన్న వారు , సమస్యలను విశ్లేషించి చూడడం లో నైపుణ్యం సాధించినా, వారికి అప్పుడప్పుడూ , మెరుపు లాంటి ఆకస్మిక ఐడియా  లూ , ఆలోచనలూ  అవసరమైన సమస్యలను పరిష్కరించే సమయం లో మాత్రం కొంత తడబడుతూ ఉంటారని పరిశోధనల వల్ల తెలిసింది.
 ‘ Often, the best way to solve a problem is to not focus ‘ అని అంటారు, ఇలినాయిస్ విశ్వవిద్యాలయం లో సైకాలజిస్ట్ , జనిఫర్  వైలీ. ఆమె ఒక ఉదాహరణ ఇచ్చారు. High, book and sour –  ఈ పదాలకు ఇంకో ఏ ఒక్క పదం వాడితే ఇంకో మూడు కొత్త పదాలు అవుతాయి ?  ఈ ప్రశ్న కు మన విశ్లేషణ  ఉపయోగించి పరిష్కరించుదామని అనుకుంటే వీలు పడదు. మనకు తెలిసి ఉంటే, జవాబు, మెరుపు లాగా కనిపిస్తుంది. ( పై ప్రశ్న కు జవాబు note. ఈ పదాన్ని జత చేస్తే మూడు కొత్త పదాలు , high note, note book, sour note , ఏర్పడతాయి కదా ! )  మెంఫిస్ విశ్వవిద్యాలయం లో హోలీ వైట్ ఇంకో పరిశీలన చేశారు. ఆమె  ఒక ఇటుక ను చూపించి, ఆ ఇటుక తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో రాయమని పరీక్ష చేశారు.  ఈ ప్రశ్న శులభ మైనదే ! ఆశ్చర్య మేమిటంటే, ADHD అనే వ్యాధి ఉన్న వారు ( ఈ వ్యాధి ఉన్న వారి లో ఏకాగ్రత అంటే చేస్తున్న పని మీద కేంద్రీకరించడం లోపిస్తుంది.),  వర్కింగ్ మెమరీ ఉపయోగించి విశ్లేషించి సమస్యను  పరిష్కరించ గలిగే వారి కంటే బాగా జవాబు రాయ గలిగారు. ఈ  పరిశోధనల వల్ల మనం మన ఆలోచనలను, చేస్తున్న పని మీద నుంచి అప్పుడప్పుడూ మళ్ళించడం వల్ల మనలో సృజనాత్మక శక్తి పెంపొందు తుంది అనితెలిసింది , అంటే క్రియేటివిటీ పెరుగుతుంది. సృజనాత్మక శక్తి కి ముఖ్య లక్షణం, మనలో మెరుపులా వస్తున్న ఆలోచనలను జోడించడమే. అట్లా జోడించడం, లేదా లంకె వేయడం మనం ఎంత నైపుణ్యం తో చేస్తూ ఉంటే, అంత మనలో క్రియేటివిటీ అంటే సృజనాత్మకత పెరుగుతూ ఉంటుంది. 
మరి ఈ విషయాలన్నీ నిజమేనని మనం ఎట్లా నమ్మ గలము?: 
మాలియా మాసన్, కొలంబియా విశ్వవిద్యాలయం  లో చేసిన పరిశోధనల వల్ల, యదాలాపం గా అంటే చేస్తున్న పని మీద ఫోకస్ అప్పుడప్పుడూ చేయని  వారి  మెదడు ఫంక్షనల్ ఎమ్మారై  ( fMRI ) అనే అతి సున్నితమైన స్కాన్ తో పరిశీలించి చూడడం జరిగింది. ఈ పరిశీలనలలో  ఏకాగ్రత తక్కువ గా ఉన్న వారి మెదడు లో ఉన్న నాడీ తంత్రుల సముదాయం ఒకటి ( constellation of neural regions  )  ఎక్కువ క్రియాశీలం అవుతుండడం  జరిగింది. మానవుల మెదడు లో ఈ  నాడీ తంత్రుల సముదాయం ఇంతవరకూ కనుగొనలేదు. ఈ నాడీ తంత్రుల సముదాయాన్ని డిఫాల్ట్ నెట్ వర్క్ అని పిలుస్తున్నారు. ఈ డి ఫాల్ట్ నెట్ వర్క్  ముఖ్యం గా మన మెదడు లో ఉన్న వివిధ రకాలైన జ్ఞాపకాలను జల్లెడ పట్టి, వాటిని ఒక క్రమం లో అట్టి పెడుతుంది. అంటే మన కంప్యుటర్ లో మనం మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ను సేవ్ చేసుకుంటూ ఉన్నట్టు గా ! స్కూలర్ అనే శాస్త్ర వేత్త ఇంకో విషయం కూడా గమనించడం జరిగింది. ఈ డి ఫాల్ట్ నెట్ వర్క్ కూ ఎగ్జిక్యుటివ్ కంట్రోలు కూ కూడా కనెక్షన్లు  ఉన్నాయని. అంటే మనం , చేస్తున్న పని మీద ధ్యాస తక్కువ చేసుకుని , పగటి కలలు కంటున్నప్పుడు కూడా , ఆ పగటి కలలో అవసరమైన ఐడియా లనూ, ఆలోచనలనూ , ఎగ్జిక్యుటివ్ కంట్రోలు అను సంధానం చేసుకుంటూ ఉంటుంది. 
కానీ లండన్ లో ఉన్న గోల్డ్ స్మిత్ విశ్వవిద్యాలయం కు చెందిన భట్టాచార్య  ‘ పగటి కలలు ‘ కంటున్న ప్రతి వారికీ సృజనాత్మక శక్తి ఉందని అనుకోలేము ‘ అని అంటారు. అదే సమయం లో ఆయన చేసిన పరిశోధనల వల్ల మనం  ఎక్కువ  రిలాక్స్ అయినప్పుడు సృజనాత్మకత కూడా ఎక్కువగా ఉంటుందని విశదమైంది. ఏ పని  అయినా చేసే ముందు కానీ , చేస్తున్న సమయం లో కానీ , మనకు యాంగ్జైటీ  ఉన్నప్పుడు, ఆ పనిని సరిగా చేయలేక పోవడం మన అనుభవం లోనిదే కదా !
మంచి సంగీతం వింటే కానీ, లేదా కామెడీ కార్యక్రమాలు చూస్తూ ఉన్న్నప్పుడు కానీ సృజనాత్మకత ఎక్కువ అవుతుందని కూడా తెలిసింది. అదే హారర్ సినిమాలు చూస్తూ ఉంటే మన సృజనాత్మకత తక్కువ అవుతుంది. ( సమాప్తం ).
అందుకేనేమో పూర్వ భారత అద్యక్షులు అబ్దుల్ కలాం గారు అన్నారు ‘ కలలు కనండి. ఎందుకంటే , గొప్ప వారు కన్న గొప్ప కలలన్నీ నిజమయ్యాయి ‘ అని. 
( ఈ వ్యాసం తాజా సంచిక ‘ న్యూ సైంటిస్ట్ ‘ ముఖ పత్ర శీర్షిక ‘ నుంచి అనువదించ బడ్డది. వివరం గా ఈ వ్యాసం చదవాలనుకుంటే ఈ పత్రిక లో చదవచ్చు కానీ అందులో ఈ వ్యాసం ఆంగ్లం లో ఉంది. ) 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులతో కలుద్దాము ! 

మతి పరిభ్రమణం( drifting ), మనకు మంచిదే !

In మానసికం, Our minds on జూన్ 17, 2012 at 12:03 ఉద.

( when the boss is away ! )

మతి పరిభ్రమణం( drifting )  మనకు మంచిదే ! 

అను నిత్యం, మన మతి పరి పరి విధాల పరిభ్రమిస్తూ ఉంటుంది. అంటే మన ఆలోచనలు, ఒక దాని నుంచి మరొకటికి, లిప్త కాలం లో, అత్యంత వేగం గా ప్రయాణిస్తూ ఉంటాయి.  అట్లాగే , ఒక సమయం లో మనం ఉన్న చోట, ఉండే ఆలోచనలు , మరు క్షణం లో నభొంత రాళాలు చుట్టి వస్తాయి. అంటే పరిభ్రమిస్తాయి. ఒక క్షణం లో మన ఆలోచనలు, మనకు అత్యంత ప్రీతికరమైన, రుచికరమైన వంటల మీదకు మళ్ళుతాయి. ఒక క్షణం లో మన మెదడులో మనకు అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులు మెదలుతుంటారు, కామ పరమైన ఆలోచనలు మనలో రేపుతారు. ఇంకో క్షణ కాలం లో మన ఆలోచనలు చంద్ర మండలం మీదకో, లేదా అంగారకుడి మీదకో వెళ్ళిన వ్యోమ నౌక ( స్పేస్ షటిల్ ) మీదకు వెళ్ళ గలవు.   ఒక శాస్త్రీయ అంచనా ప్రకారం ఇట్లా మనము మన జీవిత కాలం లో కనీసం యాభై శాతం సమయాన్ని, వర్తమాన కాలం నుంచి, నేరుగా మన మెదడు లో ఆలోచనల ప్రపంచం  వైపు మళ్లిస్తామని భావించ బడుతుంది.
ఇట్లా మన ఆలోచనల ప్రపంచం లో మనం విహరించ డాన్ని ప్రముఖ సైకో  ఎనలిస్ట్ , సిగ్మండ్ ఫ్రాయిడ్  ‘ శిశువు దశలో ‘ మనం ఉడడం వల్లనే అంటే మన ఆలోచనలు ‘ బాల్యావస్త ‘ లో ఉండడం గా వర్ణించాడు. మరి కొంత మంది, ఈ లక్షణాలను’  సైకోసిస్ ‘  అనే మనో వ్యాధికి దారి తీయగలదు అని కూడా అభిప్రాయ పడ్డారు.
కానీ తాజా పరిశోధనల వల్ల ఈ మతి పరి భ్రమణం, ఆరోగ్య కరమైన మెదడు లక్షణం అని  స్పష్టం గా తెలిసింది. ( ఇక్కడ చదువరులు ఒక విషయం గమనించాలి. అది మతి చాంచల్యం లేక మతి భ్రమణం కూ మతి ‘ పరిభ్రమణం ‘ కూ ఉన్న తేడా. భ్రమణం అంటే తిరగడం అంటే మన ఆలోచనలు వివిధ విషయాల మీదకు వెళ్లి తిరిగి ‘ మన దగ్గరకు రావు ‘ అంటే మన ఆధీనం లోనుంచి వెళ్లి పోతాయి. కానీ మతి పరిభ్రమణం లో  మన ఆలోచనలు వివిధ వలయాలలో తిరుగుతాయి, చివరకు మన మెదడు మన ఆధీనం లోకి వస్తుంది. అంటే మన ఆలోచనలను మనం నియంత్రించుకో గలమన్న మాట !  ఇంకో విధం గా చెప్పాలంటే మతి చాంచల్యం లేదా మతి భ్రమణం, ఒక మనో వ్యాధిగా పరిగణింప బడుతుంది.కానీ’ మతి పరిభ్రమణం ‘ (ఒక మనో వ్యాధి ) కాదు ).
ఈ మతి పరిభ్రమణం తో మనం, మన భవిష్యత్తు లో మనం చేయబోయే పనుల గురించి ఆలోచించుతూ అందుకు అవసరమయే పధకాలు కూడా వేసుకుంటూ ఉంటామని తెలిసింది. అంతే కాక మనలో  ‘ క్రియేటివ్ రసం ‘ ప్రవహిస్తూ ఉన్నట్టు  తెలిపే లక్షణం అని కూడా విశదమైంది.
మిగతా వివరాలు వచ్చే టపాలో చూద్దాము.

స్వీయ సామర్ధ్యం తో, కాన్ఫిడెన్స్ ను ఎట్లా పెంచుకోవచ్చు ?.8.

In మానసికం, Our minds on జూన్ 16, 2012 at 9:40 ఉద.


స్వీయ సామర్ధ్యం తో కాన్ఫిడెన్స్ ను ఎట్లా పెంచుకోవచ్చు ?.8.

క్రితం టపాలో చూశాము కదా ! స్వీయ సామర్ధ్యం , ఆప్టిమిజం ల కలయికే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనీ , ఆ రెడూ ఎంత మనలో ఎక్కువ అవుతుంటే అంత ఆత్మ గౌరవం కూడా పెరుగుతూ ఉంటుందని.
ఇప్పుడు మనం స్వీయ సామర్ధ్యం అంటే ఏమిటి ? దానిని మనం ఎట్లా అభివృద్ధి చేసుకోవచ్చో తెలుసుకుందాము. 
స్వీయ సామర్ధ్యం :  ఆల్బర్ట్ బండూరా అని ఒక అమెరికన్ సైకాలజిస్ట్ , సామాజిక సైకాలజీ లో అనేక పరిశోధనలు చేశాడు. ఆయన మాటలలో స్వీయ సామర్ధ్యం అంటే మనం, మనం చేపట్టే ఏ పనిలోనైనా విజయ వంత మవుతామనే   అనుకునే  ‘ మన నమ్మకం ‘.  మనం ఆనందమయ జీవితం గడుపుతూ, అభివృద్ధి పధం లో  పయనించడానికి, ఈ స్వీయ సామర్ధ్యాన్ని బాగా అర్ధం చేసుకొని, దానిని, మనలో పెంపొందించుకోవాలి.
  అత్యంత ప్రముఖమైన  బండూరా   ‘ సాంఘిక జ్ఞాన థియరీ ‘( social cognition theory ) లో స్వీయ సామర్ధ్యం కీలకమైన పాత్ర వహిస్తుంది.  మరి ఈ సాంఘిక  జ్ఞాన థియరీ ఏమిటి : సంఘం లో, ఏ పరిస్థితి లో నైనా ,  ప్రతి వ్యక్తి యొక్క ప్రవర్తనా అంటే  బిహావియర్ ఇంకా ప్రతి చర్యా , ఆ వ్యక్తి తన  చుట్టూ ఉన్న వారిలో పరిశీలించిన ప్రవర్తన తో అత్యంత ప్రభావితం అవుతుంది. అంటే మనం నలుగురి తో ఉన్నప్పుడు మన ప్రవర్తన , ఆ మిగతా నలుగురు ప్రవర్తించే తీరు  మీద ఆధార పడి ఉంటుంది. మరి ఇక్కడ స్వీయ సామర్ధ్యం ప్రమేయం ఏమిటి ?అనుకుంటే ,  స్వీయ సామర్ధ్యం ఎక్కువ గా ఉన్న వారు, సంఘం లేదా సమాజం లో తాము ఎదుర్కుంటున్న జటిల లేదా కష్ట పరిస్థితులను,  అధిగమించి తాము విజయవంత మవడానికే ఉత్సాహం చూపిస్తారు.కానీ అదే పరిస్థితిని, స్వీయ సామర్ధ్యం లేని వారు , ఏదో విధం గా దాట వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు తాము చేపట్టిన కార్యాలు, ఎక్కువ కష్టం గా ఉన్నాయని ( అంటే అవి నిజంగా కష్టం గా లేక పోయినా ! ) కూడా తరచూ అనుకుంటూ ఉంటారు.అట్లాగే స్వీయ సామర్ధ్యం ఎక్కువ గా ఉన్న వారు, వారు చేసే పనుల కోసం, ఎక్కువ గా ఉత్తేజం చెందుతూ ఉంటారు. అంటే వారు ఎక్కువ మోటివేట్ అయి ఉంటారు. అట్లాగే స్వీయ సామర్ధ్యం ఎక్కువ గా ఉన్న వారు, పరిస్థితులు తమ కంట్రోలు లేక స్వాధీనం లో నే ఉన్నాయి అని భావిస్తూ ఉంటారు.  కానీ స్వీయ సామర్ధ్యం తక్కువ అయిన వారు, పరిస్థితులు తమ చేయి దాటి పోయినాయనీ ,  దానికి కారణం ‘ విధి వ్రాత ‘ అనీ అనుకుంటూ ఉంటారు. మిగతా ఆరోగ్య విషయాల మీద స్వీయ సామర్ధ్యం ప్రబావం ఏమిటి ? :  స్మోకింగ్ ఆపడం, క్రమం గా వ్యాయామం చేయడం, డైటింగ్ చేయడం,  అలాగే స్త్రీలలో రొమ్ము పరీక్ష చేసుకోవడం లాంటి ఆరోగ్య విషయాలు, సఫలం లేదా విఫలం అవడం కూడా ప్రతి వ్యక్తి కీ ఉన్న స్వీయ సామర్ధ్యాల మీద ఆధార పడి ఉంటాయని వివిధ పరిశోధనల వల్ల తెలిసింది.
మరి మన జీవితాలలో ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్న  స్వీయ సామర్ధ్యాన్ని ఎట్లా పెంచుకోవాలి ?:
1. అనుభవం తో:, అంటే ప్రతికూల పరిస్థితులను ఆశావవహ  దృక్పధం తో ఎదుర్కొంటూ ఉండాలి. దాట వేయడానికి ప్రయత్నించ కూడదు. అలా అధిగమించిన ప్రతి సంఘటనా, స్వీయ సామర్ధ్యాన్ని పెంచి , అది  భవిష్యత్తు లో మరిన్ని విజయాలకు సోపానం అవుతుంది. 
2. ఇతరుల విజయాలతో ప్రేరణ:  ముందు చెప్పుకున్నట్టు , మన ప్రతి చర్యా , సమాజం లో ఇతరుల చర్యలూ , ప్రవర్తన పైన ఆధార పడి ఉంటుంది. అంటే ఇతరుల విజయాలను మనం ఎప్పుడూ పోల్చుకుంటూ ఉంటాము. ‘ వాళ్ళు చేయగా లేనిది, నేను ఎందుకు చేయలేను అనే పోటీ స్వభావం నిరంతరం ఉండాలి. ఇలా విజయవంతమైన ఇతర వ్యక్తులతో పోల్చుకోవడాన్ని ‘  మోడలింగ్  ‘  ( modeling ) అంటారు. మోడల్స్ మనం ప్రతి రోజూ, ప్రతి వ్యాపార ప్రకటన లోనూ చూస్తూ ఉంటాము కదా!ఈ మోడలింగ్, వస్తువుల పట్లా , తమ ఆలోచనల పట్లా ఒక స్థిరమైన అభిప్రాయం లేని వారిని మార్చడానికి ఉపయోగ పడే ఒక శక్తి వంతమైన ‘ సాధనం ‘. అందుకే దీనిని వ్యాపార వేత్తలు అంత విరివి గా( తెలివిగా కూడా ),  తమ ప్రకటనలలో వాడుతూ ఉంటారు. ఉదాహరణకు : తమ అభిమాన హీరో స్మోకింగ్ చేస్తేనో , లేదా ‘ మందు ‘ తీసుకుంటూ ఉంటేనో ఒక ప్రకటనలో కనిపించినా , వారిని అనుకరించడానికి  అత్యుత్సాహం చూపుతారు యువత, ఆ రకమైన మోడలింగ్, తమ ఆరోగ్యాన్నీ , భవిష్యత్తునూ తీవ్రం గా ప్రభావితం చేస్తున్నా లెక్క చేయకుండా !  వ్యాపార ప్రకటనలో మోడలింగ్ , కేవలం, వారు వేసుకునే బట్టలు మనం కూడా అనుకరించాలనీ , లేదా వారు వాడిన వస్తువులను మనం కూడా వాడాలనీ అనుకోవడానికే పరిమితమవుతూ ఉంటుంది. కానీ మనం జీవితం లో అభివృద్ధి పధం లో సాగాలంటే,  విజయులైన వ్యక్తుల సాధననూ , దీక్షనూ , అనుకరిస్తూ , స్వీయ సామర్ధ్యాన్ని పెంచుకుంటూ , కృత నిశ్చయం తో పురోగామించాలి.
3. సామాజిక ప్రోద్బలాలు : అంటే మనం చేయబోయే ప్రతి పనినీ ఇతరులు ( అంటే వారు , తల్లిదండ్రులు అయినా , తోబుట్టువులు అయినా , స్నేహితులు అయినా, లేక ఏ ఇతర శ్రేయోభిలాషులు అయినా ) ప్రోత్సహిస్తే ,లేదా ప్రోత్సహిస్తూ ఉంటే కూడా మన స్వీయ సామర్ధ్యం పెరుగుతూ ఉంటుంది.  అట్లా  మనకు మంచి మాటలు చెప్పి ఎంకరేజ్  చేసిన వారిని గుర్తు పెట్టుకోవడం , మన అనుభవం లోనిదే కదా ! 
తరువాతి టపా లో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

ఆత్మ విశ్వాసం ( కాన్ఫిడెన్స్ ) గురించి, మనం ఏమి తెలుసుకోవాలి ? .7.

In మానసికం, Our minds on జూన్ 15, 2012 at 6:54 సా.


ఆత్మ విశ్వాసం ( కాన్ఫిడెన్స్  )  గురించి మనం ఏమి తెలుసుకోవాలి ? .7.:

ఈ రోజులలో ఏ పత్రిక చూసినా , ఆత్మ విశ్వాసం గురించి పుంఖాను పుంఖాలు గా వ్యాసాలూ , సలహాలూ ప్రచురిస్తూ ఉంటారు. అంతే కాక  ఆత్మ విశ్వాసం పెంచడానికి, అనేక మంది ‘ గురువులు ‘ కూడా వెలిశారు. కాన్ఫిడెన్స్ అనే పదం, ఆటలు , చదువు, బిజినెస్ , కళలు , ఉద్యోగాలు ; ఇట్లా  ఏ రంగం లో చూసినా, తరచుగా ఉపయోగించే పదం.  అంతే కాక , మనం జీవితం లో చేపట్టే ఏ పని కయినా కావలసిన ‘ ముడి పదార్ధం ‘   ‘ కాన్ఫిడెన్స్ , లేదా ఆత్మ విశ్వాసం , మనం ఆశావహం గా , విశ్వాసం తో , మనం చేపట్టిన వివిధ రంగాలలో  సాధించినప్పుడు పొందే అనుభూతి ‘ అని గ్రీకు తత్వ వేత్త సిసిరో అన్నాడు. 
మరి శాస్త్రీయం గా కాన్ఫిడెన్స్ లేదా ఆత్మ విశ్వాసం అంటే ఏమిటి ? : మనం ఈ విధం గా కాన్ఫిడెన్స్ ను  నిత్య జీవితం లో చాలా తరచు గా ఉపయోగించే  ఈ పదం గురించీ , దాని అర్ధం గురించీ అసలు పట్టించుకోము. కానీ కాన్ఫిడెన్స్ అనే పదం, సామాన్యం గా రెండు అర్ధాలను స్ఫురిస్తుంది. ఒకటి : కాన్ఫిడెన్స్ అంటే మనం, మన శక్తి సామర్ధ్యాల మీద ఒక స్థిరమైన అభిప్రాయం కలిగి ఉండడం. రెండు : అంతే కాక మనుషులమీద కానీ, మనం వేసుకునే పధకాల మీద కానీ, లేదా మన భవిష్యత్తు మీద కానీ , మనం ఏర్పరుచు కునే , నమ్మకం ,  విశ్వాసం లేదా  ట్రస్ట్ . అంటే, కేవలం మనం అనుకున్నవి సక్రమం గా జరుగుతాయనీ , అట్లాగే మనం ఇతర వ్యక్తుల మీద ఏర్పరుచుకునే సదభిప్రాయం మాత్రమే కాదు.  కాన్ఫిడెన్స్ అంటే మన శక్తి సామర్ధ్యాల మీద , అట్లాగే మనం, ఇతరుల శక్తి సామర్ధ్యాల మీదా ఏర్పరుచుకునే విశ్వాసం, లేదా ట్రస్ట్. అంటే కాక కాన్ఫిడెన్స్ అనే పదాన్ని, కొన్ని సమయాలలో ( ఉదాహరణ కు ) వ్యాపార రంగం లో, ఆశావహం గా ఉండడానిని కూడా  వాడుతారు. ఇట్లాంటి చాలా అర్ధాలు ఉండడం వల్ల, సైకాలజిస్టులు కాన్ఫిడెన్స్ అనే పదాన్ని తక్కువ గా వాడుతారు.  సెల్ఫ్ ఎస్టీం అంటే ఆత్మ గౌరవం, సెల్ఫ్ ఎఫికేసీ, అంటే స్వీయ సామర్ధ్యం , ఇంకా ఆప్టిమిజం , ఆశావహం అనే పదాలను కాన్ఫిడెన్స్ కు బదులు గా వాడుతారు. ఈ మూడు పదాలు కూడా అర్ధం చేసుకోవడానికి కొంత క్లిష్టమైనవి అయినా, కాన్ఫిడెన్స్ అనే ఒక్క పదం కన్నా విపులం గా వివరించ డానికి ఉపయుక్తం గా ఉంటుంది. అంతే కాక, శాస్త్రీయం గా ఈ పైన చెప్పిన మూడు లక్షణాలనూ కొలవచ్చు కూడా. 
మరి కాన్ఫిడెన్స్ కు ఫార్ములా ఏమిటి ?: శాస్త్రీయం గా చెప్పాలంటే   స్వీయ సామర్ధ్యం , ఇంకా ఆశావహం , అంటే ఆప్టిమిజం ల కలయికే కాన్ఫిడెన్స్.  ( confidence = self efficacy + optimism ). మరి సెల్ఫ్ ఎస్టీం లేదా , ఆత్మ గౌరవం ఏది ఈ ఫార్ములా లో అని అనుకోవచ్చు మీరు. కాన్ఫిడెన్స్ కూ ఆత్మ గౌరవానికీ, అవినాభావ సంబంధం ఉంది. అంటే కాన్ఫిడెన్స్ పెరుగుతున్న కొద్దీ , మనలో ఆత్మ గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది.
మనం వచ్చే టపాలో సెల్ఫ్ ఎస్టీం, లేదా ఆత్మ గౌరవం గురించి తెలుసుకుందాము !

సెల్ఫ్ డి టర్మినేషన్ థియరీ తో మనం ఏమి నేర్చుకోవచ్చు ?. 7.

In మానసికం, Our minds on జూన్ 14, 2012 at 8:13 సా.


సెల్ఫ్  డి టర్మినేషన్ థియరీ తో మనం ఏమి నేర్చుకోవచ్చు ?. 7.

మనం, సహజం గా అనేక కార్యాలలో సరి అయిన ఉత్తేజం పొందడానికి, తద్వారా, ఆ కార్యాలను విజయవంతం చేయడానికీ, నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాము.  సెల్ఫ్  డి టర్మినేషన్ ,  అంటే  కృత   నిశ్చయం  మన ఆలోచనలనూ, అనుభూతులనూ, మన  యాక్షన్,  అంటే మనం చేసే క్రియలనూ  నియంత్రించు కునే లక్షణం. మనలో ఈ సెల్ఫ్  డి టర్మినేషన్  అంటే  కృత   నిశ్చయ  గుణం చిన్న తనం నుంచీ అలవాటు చేసుకోవాలి. దీని వల్ల   మనం చేసే ప్రతి కార్యాన్నీ, మనం  ఒక  GPS లాగా ట్ర్యాక్  చేసుకోవచ్చు ( GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్  సిస్టం, అంటే దీనితో మనం ప్రపంచం లో ఎక్కడ ఉన్నా, స్పష్టం గా కనుక్కోవచ్చు. మనందరికీ తెలిసిందే కదా, దీనిని , మన కార్లలో చాలా సాధారణం గా ఉపయోగిస్తూ ఉంటారని. అదే విధం గా మనం మన  కార్యాలనూ , లక్ష్యాలనూ, గమ్యాలనూ , మన  స్వీయ  నిశ్చయం  అనే చుక్కాని  తో  ఏ సమయం లో నయినా సరి చూసుకుంటూ, అవసరమయిన చోట , మన  డైరెక్షన్ , అంటే దిశ  మార్చుకుంటూ , పురోగమించ వచ్చు ). 
మనం బాల్యం  లో పొందే ఉత్తేజం, కొంత కాలం వరకు బాహ్య పరమైనది. అంటే మన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు , మనల్ని  ఉత్తేజితం చేస్తూ ఉంటారు. క్రమేణా మనం అట్లాంటి బాహ్య ఉత్తెజాలనుంచి మనకై మనం  అంటే ఇంట్రిన్సిక్ ఉత్తేజం పొందడం నేర్చుకుంటాము.  అంటే బాల్యం లో మన నడవడిక, జ్ఞానం , ప్రవర్తన, ఇలాంటి విషయాలలో , నయానా , భయానా చెప్పి  మన లో మంచి మార్గం వైపు దిశానిర్దేశం చేసే తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు బాహ్య ఉత్తేజాన్ని, అంటే మన బయట నుంచి మనలను ఉత్తేజితం చేస్తారు. అంటే దీనిని ఎక్స్టర్నల్ రెగ్యులేషన్  గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మనలో మనం మనం చేసే ప్రతి చర్యనూ, దాని విలువను, ప్రాముఖ్యతనూ గుర్తించి  ఉత్తేజం పొంది, ఆ పనులు చేస్తే అది  ‘మనం  గుర్తించిన నియంత్రణ ‘ అవుతుంది . అట్లా కాక చిన్న తనం లో , తల్లి తండ్రులు చెప్పారనో, లేదా ఉపాధ్యాయులు చెప్పారనో కూడా ( వారు చెప్పిన ) పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా అది క్రమేణా సెల్ఫ్ డి టర్మినేషన్ కు ఉపయోగం అవుతుంది.  
ఉత్తేజం లక్ష్యం ఏమిటి ? : 
మానవులు బాహ్య కారణాల చేత కానీ , అంతర అంటే మన లో వచ్చిన ఇంట్రిన్సిక్ మార్పుల వల్ల నైతే నేమి , ఉత్తేజం పొందితే , ఆ ఉత్తేజం లక్ష్యం, క్రమేణా మనం స్వతంత్రం గా ఆలోచించ గలిగి , కృత నిశ్చయం తో అంటే సెల్ఫ్  డి టర్మినేషన్ తో  , స్వతంత్రం గా నిర్ణయాలు కూడా తీసుకునే స్థితి లో ఉండడం అవాలి. ఆ నిర్ణయాలు, ఆ యా సమయాలలో సరి అయినవి, లాభ దాయకము అయి ఉండాలి. సరి అయిన నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం పిల్లలలో రావాలంటే, వారి చేత నిర్ణయాలు తీసుకునేట్టు ( పెద్దల పర్యవేక్షణ లో ) చేయడం, అలాంటి పరిస్థితులు వారికి కల్పిస్తూ ఉండడం చేస్తూ ఉండాలి. ఆ విధం గా వారు, నిర్ణయాలు తీసుకోవడం లో పరిణితి చెందుతారు.  వివిధ పరిశీలనల వల్ల , చిన్న తనం నుంచీ , కుటుంబ విషయాలలో , సమస్యలలో , పాల్గొని , కొంత వరకైనా తమ అభిప్రాయాలనూ , నిర్ణయాలనూ తెలియ చేస్తూ ఉండే పిల్లలు , చదువు లో కూడా ఎక్కువ గా శ్రద్ధ, ఉత్సాహం చూపి ,  రాణిస్తారని తెలిసింది. ( కానీ సాధారణం గా ఎక్కువ మంది ( భారత దేశం లో ) తల్లి తండ్రులు కుటుంబ సమస్యలు, విషయాలలో, తమ సంతానం ప్రమేయం, తక్కువ గా ఉంచుతారు ! ) 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 
 

మనలో ఉత్తేజం గురించి లేటెస్ట్ ఏమిటి ?.6.

In మానసికం, Our minds on జూన్ 13, 2012 at 7:23 సా.

మనలో ఉత్తేజం గురించి లేటెస్ట్ ఏమిటి ?.6.

క్రితం టపాలలో మన ప్రవర్తన ను అనుసరించి పొందే ఉత్తెజము,  మన ఆలోచన తీరును బట్టి పొందే ఉత్తెజము , ఇంకా మానవతా సైకాలజీ ( అదే మ్యాస్లో వివరించిన పిరమిడ్  )గురించి కొంత తెలుసుకున్నాము కదా!
మానవ మనస్తత్వం గురించి ఇటీవల జరిపిన, జరుపుతున్న , అనేక పరిశోధనలూ , పరిశీలనలూ , సెల్ఫ్ సైకాలజీ,  అంటే మన ఆలోచనలను బట్టి మనం పొందే ఉత్తెజము, దాని ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. మన గురించి మనం అర్ధం చేసుకునే సైకాలజీ చాలా వేగం గా పరిణామం చెందుతుంది. అంతే కాక ఇట్లా మనల్ని మనం అర్ధం చేసుకోవడం లో ఉన్న క్లిష్టత లేదా జటిలత , ప్రస్తుతం , ఒక చాలెంజ్ లాగా తయారయింది.
ఇప్పుడు మానవులను ,కేవలం బాహ్య ప్రేరణలతో, అంటే ఎక్స్టర్నల్ స్తిమ్యులై తో ప్రభావితం చెందే వారిగానే పరిగణింప బడట్లేదు. వారి వ్యక్తి గత లక్ష్యాలూ, వారి శక్తి సామర్ధ్యాలూ, వారి లో ఉన్న పోటీ స్వభావమూ – ఈ లక్షణాలతో ఉత్తేజం పొందుతున్న వారి లాగా పరిగణింప బడుతున్నారు. అంటే వారి స్వంత అవసరాలకోసం, వివిధ రంగాలలో ఇతరులతో పోటీ పడే స్వభావం లాంటి గుణాలు ఎక్కువ ఉత్తేజ కరం అవుతున్నాయి. అత్యంత ప్రముఖమైన ఉత్తెజకం ( అంటే సోర్స్ అఫ్ మోటివేషన్ ),   మనలో నిబిడీకృతమై ఉన్న స్వభావం. అంటే ఇంట్రిన్సిక్ క్వాలిటీ. ఆ స్వభావాన్ని మనం పెంపొందించుకుంటూ ఉండాలి. అంటే ఆ స్వభావాన్ని , ఒక చిన్న, సున్నితమైన మొక్క లాగా భావిస్తూ, దానిని అతి జాగ్రత్త గా పెంచుకోవాలి మనమే. ఆ ‘ స్వభావం ‘ ఎంత బలీయం గా మనలో పెరిగి  ఉంటే, మనం పొందే ఉత్తేజం కూడా అంతే బలం గా పెరిగి మనం అన్ని విధాలా పురోగమించడానికి వీలు గా ఉంటుంది. అంతే కాక ఒక మొక్క కు ఎట్లాగైతే  భూమి మాత్రమె కాక , సూర్యకాంతి , నీరు బయటినుండి ఎట్లా అవసరమో, అదే విధం గా మనం ఉత్తేజం పొందే స్వభావం కూడా మనలోనే ఉత్పన్నం అయేది అయినప్పటికీ,  అది బాహ్య వాతావరణం తో కలిసినప్పుడే బలీయం కాగలదు. ఇంకో విధం గా చెప్పుకోవాలంటే, ఉత్తేజం యొక్క తీవ్రత,  వ్యక్తులు, వారి పరిసర వాతావరణం తో జరిపే ఇంట ర్యాక్షన్  నిర్ణయిస్తుంది. అంటే  మనలో జనించే ఉత్తేజం, బాహ్య వాతావరణం  తో బలీయం గా ప్రభావితం అవుతుంది (  ఇక్కడ, బాహ్య వాతావరణం అంటే కేవలం గాలి, వెలుతురూ కాదు.  మన పరిసరాలలో ఉండే మానవులు, వారి పోటీ తత్వం, వారి శక్తి యుక్తులతో ప్రభావితమైనప్పుడే, మనలో ఉన్న ఉత్తేజం కూడా ‘ కాంతి పుంజమై ‘ మన జీవితాలకు  ఎంతో ‘  వెలుగు ‘ ఇస్తుంది. ). ఈ స్వంత అంటే సెల్ఫ్ సైకాలజీ లో వ్యక్తి గత పురోభివృద్ధి అనే కీలకమైన  అంశం ప్రతి వ్యక్తి కీ ఉంటుంది. ఈ గుణాన్ని ప్రధానం గా ,         సెల్ఫ్ డి టర్మినేషన్ థియరీ ( Self – Determination Theory )  అని అంటారు . డెసి ఇంకా ర్యాన్ ప్రతిపాదించిన ఈ థియరీ లో మానవులు , స్వతంత్రులు గా , పోటీ పడుతూ , ఇతర మానవులతో సంబంధాలు కలిగి ఉండడం, తద్వారా స్వీయ పురోభివృద్ధి చెందడం –  ఈ లక్ష్యాలను సాధించాలంటే, వారు తమ శక్తి యుక్తులన్నీ , విజయావకాశాలు ఎక్కువ గా ఉన్న కార్యాల మీద కేంద్రీకరించడం, అపజయావకాశాలున్న కార్యాలనుంచి తప్పుకోవడం, విజయాలను చూసుకొని అభినందించు కోవడం, అట్లాగే అపజయాలు పొందినప్పుడు, వాటి ద్వారా గుణ  పాఠాలు నేర్చుకోవడం – చేయాలి.  
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !

మెటా మోటివేషన్ అంటే ఏమిటి ?. 5.

In మానసికం, Our minds on జూన్ 12, 2012 at 9:16 సా.

మెటా మోటివేషన్ అంటే ఏమిటి ?. 5.

క్రిందటి టపాలో తెలుసుకున్నాము కదా ! మ్యాస్లో , మానవులలో వివిధ దశలలో , వేటి వల్ల  ఉత్తేజం చెందుతారో !  ఆయన థియరీ లో మోటివేషన్ పిరమిడ్ కూడా చూశాము కదా ! మీ సౌలభ్యం కోసం ఆ పిరమిడ్ ను ఇక్కడ మళ్ళీ పొందు పరచడం జరిగింది.
ఈ పిరమిడ్ లో మొదటి నాలుగు అంచెలలో ఉన్న ఉత్తేజ కారకాలు, బేసిక్ డ్రైవ్ లు అని కానీ లేక బేసిక్ నీడ్స్ అని కానీ అనబడతాయి. అంటే ఇవి ప్రతి మానవులకూ తప్పని సరి అయే ప్రాధమిక అవసరాలు.  వీటినే మ్యాస్లో  D- needs , లేక డెఫిసిట్ నీడ్స్ ( deficit needs or deficit cognitions  ) అని కూడా అన్నాడు. అంటే  మొదటి నాలుగు లెవెల్స్ లో ఉన్నవి లోపించితే, వాటి కోసం, అవి పొందాలనుకొని మనం ఉత్తేజం అంటే మోటివేషన్ తెచ్చుకుంటాము. ఒకసారి వాటిని సాధించిన తరువాత ఆటోమాటిక్ గా మిగతా లెవెల్స్ కు వెళ్ళము. వాటిని సాధించి, సంతృప్తి చెందుతాము. అంటే అందరమూ తరువాతి దశలకు ఉత్తేజం పొందము. అంటే ‘ self actualisation దశకు వెళ్ళము.
peak experiences : అంటే శిఖరానుభూతులు. మ్యాస్లో, మానవులు , ప్రేమలో, ఆనందం లో అత్యున్నత దశకు చేరుకున్న అనుభూతి ని పొంది, తాము ఈ విశాల ప్రపంచం లో ఒకరుగా ఆత్మానందం చెందితే, ఆ పరిస్థితిని పీక్ ఎక్స్ పీరియన్స్  గా  మ్యాస్లో పేర్కొన్నాడు. ఇక్కడ గమనించవలసినది , శిఖరానుభూతులు అంటే కామోచ్చ దశ, లేదా క్లైమాక్స్ కాదు. ఇది మానసికం గా అత్యున్నత ఆనంద అనుభూతి పొందడం. మ్యాస్లో పరిశీలనలలో ‘ మొదటి నాలుగు దశలు దాటి అయిదవ దశ అయిన ‘ self actualisation’  స్థితికి  ఉత్తేజం పొంది, దానిని సాధించిన వారు , ఈ పీక్ ఎక్స్ పీరియన్స్ ను  తరచుగా పొందుతూ ఉంటారని స్పష్టమయింది.
మెటా మోటివేషన్ ( Metamotivation ) : ఇట్లా ప్రాధమిక అవసరాలు అంటే బేసిక్ నీడ్స్ స్థితి, అంటే పిరమిడ్ లో మొదటి నాలుగు దశలూ దాటి ఎవరైతే సెల్ఫ్ యాక్చువ లైజేషన్ స్థితికి చేరుకునే ఉత్తేజం పొందుతారో ఆ ఉత్తేజాన్ని ‘ మెటా మోటివేషన్ ‘ లేదా ‘ meta motivation ‘ అని మ్యాస్లో తెలిపాడు.ఈ మెటా మోటివేషన్ ఉన్నవాళ్ళు, బీ కాగ్నిషన్స్  పొంది ఉంటారు. ( B- cognitions or Being Cognitions ). అట్లాగే వారికి  బీ విలువలు ( అంటే B- values or Being values ) పొంది ఉంటారు.వారిలో , ఈ బీయింగ్ విలువలు ఉంటాయి: నిరాడంబరత, స్వతంత్రత, సంపూర్ణత, అందం ( అంటే వారు అందం గా ఉంటారని అర్ధం కాదు. వారు చేసే పని లో అందం ఉంటుంది. ), మంచితనం, ప్రత్యేకత, హాస్యం, స్పోర్టివ్ మనస్తత్వం, సత్యము, జీవం, న్యాయం.ఇలాంటి విలువలు.  ఇక్కడ గమనించవలసిన, ఆశ్చర్య కరమైన సంగతి ఏమిటంటే,  పైన చెప్పిన మంచి గుణాలను, మ్యాస్లో ‘  బీయింగ్ వాల్యూస్ ‘  అని పేరు పెట్టాడు. అంటే ఆయన దృష్టి లో నిజం గా మానవులు ఈ లక్షణాల కోసం ఉత్తేజం పొందితే, లేదా పొందుతూ ఉంటే , అప్పుడే వారు ‘ ఉంటున్నట్టు ‘ లెక్క ! ( డీ కాగ్ని షన్స్  మాత్రమె ఉన్న వారు లేదా డెఫిసిట్ కాగ్ని షన్స్ కోసం ఉత్తేజం పొందుతున్న వారు , మ్యాస్లో దృష్టి లో ‘ బ్రతుకుతున్నట్టే ‘ లెక్క అయి ఉంటుంది ! ) ఇంకో ఆశ్చర్య కరమైన కో ఇన్సిడెన్స్ ఏమిటంటే, మోక్ష మార్గం పొందడానికి వివిధ మతాలలో ఈ లక్షణాలనే సోపానాలు గా చెబుతూ ఉంటారు. 
( మరి మ్యాస్లో మోటివేషన్ పిరమిడ్ థియరీ  గురించి తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు  ‘ మన ‘ ప్రస్తుత రాజకీయ ‘  నాయకుల ‘  మోటివేషన్ పిరమిడ్ క్రింద చూడండి! ).
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

మనలో ఉత్తేజం గురించి మ్యాస్లో ఏమన్నాడు ?.4.

In మానసికం, Our minds on జూన్ 11, 2012 at 6:50 సా.

 మనలో ఉత్తేజం గురించి  మ్యాస్లో ఏమన్నాడు ?.4.

అమెరికన్ సైకాలజిస్ట్ , అబ్రహం మ్యాస్లో  1943 లో మానవులలో ఉత్తేజం మీద  ఒక థియరీ ప్రచురించాడు. ఆయన మానవులలో ఉత్తేజం కలిగించే కారణాల గురించి విస్తృతం గా పరిశీలనలు చేశాడు. ఆయన తన పరిశీలనల లో  , తమ సమకాలీనులు, అత్యంత ప్రతిభావంతులు అయిన  ఆయిన్ స్టీన్ , ఎలేనార్ రూస్వేల్ట్ , మొదలైన వారిని, అంతే కాకుండా అమెరికన్ కాలేజీలలో చదివే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్ధులు ఒక శాతం మందిని కూడా  క్షుణ్ణం గా పరిశీలించి, తనదైన  మోటివేషన్ థియరీ ని ప్రచురించాడు. దీనినే మ్యాస్లో థియరీ అఫ్ హుమన్ మోటివేషన్ – లేదా మ్యాస్లో  హైరార్కీ అఫ్ నీడ్స్ ‘ అంటారు. మ్యాస్లో ప్రతిపాదించిన ఈ థియరీ ని హ్యుమనిస్టిక్ థియరీ అని కూడా అంటారు. 

మ్యాస్లో హైరార్కీ అఫ్ నీడ్స్ : ఉత్తేజం మీద అత్యంత ప్రముఖమైన థియరీ లలో ఒకటి గా భావింప బడుతున్న, ఆసక్తి కరమైన ,   ఈ మ్యాస్లో హైరార్కీ అఫ్ నీడ్స్ గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి ! 
మ్యాస్లో ప్రకారం, మానవులలో ఉత్తేజం అనేక అంచెలు గా ఉంటుంది. దీనిని మ్యాస్లో  ఒక పిరమిడ్ గా వర్ణించాడు. ఆ పిరమిడ్ లో అడుగు భాగాన, మానవుల బేసిక్ నీడ్స్ అంటే ప్రాధమిక అవసరాలను పొందు పరిచాడు( అంటే నీరు , ఆహారం , నిద్ర లాంటివి ) . ఆ తరువాత , రక్షణ లేక భద్రత, ఆ తరువాత , స్నేహం ,కుటుంబం, ప్రేమ, కామ వాంఛ,  ఒక వ్యక్తికో , ఒక సంఘానికో చెందాలనుకునే కోరిక, ఆ తరువాత సాధించాలనే తపన , సంఘం లో గౌరవం, ఆ తరువాత  పిరమిడ్ కు శిఖర భాగం లో క్రియేటివిటీ , అంటే తాము నేర్చుకున్న కళల లో, విజ్ఞానం లో ,  నైపుణ్యం లో అత్యున్నత శిఖరాలు అధిరోహించడం , తమ పరిమితులు తెలుసుకోవడం , తారతమ్యం లేకుండా ,తోటి  మానవులనందరినీ సమానం గా  భావించడం, ఇలాంటి లక్షణాలు ఉంచాడు . పైన పటం చూడండి.   గమనించ వలసిన విషయం ఏమిటంటే , మానవులు ఈ పిరమిడ్ లో ఒక్కో అవసరమూ సాధిస్తూ , తరువాతి అవసరం కోసం ఉత్తేజం పొందు తున్నారన్న మాట. అంటే ఒకసారి మనకు తినటానికి సరిపడినంత ఆహారం , ఉండడానికి నీడ , అంటే ఇల్లు , సరి అయిన నిద్ర , కామ వాంఛ లో సంతృప్తి – ఇవన్నీ సాధించిన తరువాత, వాటి కోసం ఉత్తేజం సన్న గిల్లుతుంది. అప్పుడు, పిరమిడ్ లో తరువాత ఉన్న , భద్రత , కోసం ఉత్తేజం పొందుతామన్న మాట. ఒకసారి భద్రత సాధిస్తే, ఆ తరువాతి లక్ష్యాన్ని , లేదా గమ్యాన్ని చేరుకోవడానికి ఉత్తేజం పొందుతామన్న మాట !  ఈ పిరమిడ్ లో అత్యున్నత శిఖరం లో ఉన్న లక్ష్యాన్ని self actualisation అంటే మనల్ని మనం అన్ని విధాలుగా సంపూర్ణం గా తెలుసుకోవడం. అంటే మన శక్తి సామర్ధ్యాలను సంపూర్ణం గా బహిర్గతం చేసుకొని వాటి ఫలితాలను కూడా ప్రత్యక్షం గా  చూడ గలగడం. 
మ్యాస్లో చెప్పిన మిగతా ఆసక్తికర విషయాలు వచ్చే టపాలో తెలుసుకుందాము ! 
%d bloggers like this: