Our Health

Archive for మే, 2013|Monthly archive page

ఊరక రాదు, గురక !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 18, 2013 at 11:41 ఉద.

ఊరక రాదు గురక ! 

 
గురక !  దానినే స్నోరింగ్ అంటారు  ఆంగ్లం లో !  చాలా తరచుగా మానవులలో కనిపించే లక్షణం ! 
అన్యోన్య దాంపత్య జీవితాలలో  చీకాకులు చిందించే గురక !
అమూల్యమైన నిద్రను భంగం చేసే గురక !
సతినీ, పతి నీ కూడా  సతమతం చేసే గురక !
సెక్స్ జీవితాన్ని దొంగిలించే గురక !
సజావు గా సాగుతున్న జీవిత నావ లో, 
తుఫాను లు శ్రుష్టించే  గురక !
ఏ వాహనం నడుపుతున్నా ,
ఏ పని చేస్తున్నా ,
ఏకాగ్రత పాడుచేసే గురక !
ప్రమాదాలకు కారణ మయే గురక !
మరి ఈ గురక సంగతి మనకు ఎంత ఎరుక ?
 
వచ్చే టపా నుంచి తెలుసుకుందాం ! 
 
 

26. ప్రత్యేక సందర్భాలలో , డయాబెటిస్ ఉన్న వారు, పథ్యం లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 17, 2013 at 6:41 సా.

26. ప్రత్యేక సందర్భాలలో , డయాబెటిస్ ఉన్న వారు, పథ్యం లో  ఏ  జాగ్రత్తలు తీసుకోవాలి ?

 
క్రితం టపాలలో డయాబెటిస్ నివారణకూ , నియంత్రణ  కూ  కూడా , పథ్యం పాటిస్తే ఉండే ప్రయోజనాల గురించి శాస్త్రీయం గా తెలుసుకున్నాం కదా ! మరి ప్రత్యేక పరిస్థితులలో డయాబెటిస్ ఉన్న వారు పథ్యం ఎట్లా పాటించాలి ?ప్రతి వారి జీవితాలలోనూ , తరచూ అనేక , సాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి !  అవి కుటుంబ పరం గా   గా నూ , సామాజికం గానూ ఉండవచ్చు ! కుటుంబం లో జరిగే వి సామాన్యం గా,  పుట్టిన రోజులు ,  నామకరణాలు, పెళ్ళిళ్ళు , హాలిడేలు , వ్రతాలూ , పూజలూ , పండగలూ  లాంటివన్నీ ! సాంఘికం గా , మీటింగులు , పార్టీలు , పిక్నిక్ లు , మొదలైనవన్నీ ! ఈ రోజుల్లో ప్రతి సందర్భాన్నీ ఒక విందు గా మార్చుకోవడం కూడా ఆనవాయితీ అవుతుంది కదా ! అది ఒకందుకు మంచిదే కదా , అందరూ కలిసి ఆనందం గా సమయం గడప డానికి !  ఆ యా సందర్భాలలో మరి డయాబెటిస్ ఉన్న వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ? 
1. విందులలో ఆహారం , రుచికరం గా ఉండడమే కాకుండా , ఎక్కువ ఐటమ్స్ కూడా చేయడం వల్ల, ఎక్కువ వెరైటీ కూడా ఉంటుంది ! 
2. కానీ,  విందులలో వండే వంటలు, కేవలం మానవుల నాలుకను దృష్టి లో పెట్టుకుని మాత్రమే  వండ బడతాయి కానీ , ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాదు కదా ! అందువల్ల , విందులలో అతిగా తినడం ,కేవలం డయాబెటిస్ ఉన్న వారికే కాకుండా, ఎవరికీ మంచిది కాదు.  
3. కుటుంబం లో జరిగే శుభకార్యాల లో మీకు నచ్చిన విధం గా, ముందే చెప్పి , మీ కోసం వంటలు చేయించుకోవచ్చు ! 
4. అందరితో పాటుగా తిందామని అనుకుంటే , లౌక్యం ప్రదర్శించుతూ ” నాకు కడుపు నిండిపోయింది,  ఇక చాలు” అని, ఎక్కువ గా తిన కుండా తప్పుకోవచ్చు !
5. మీకు విందులలో ఆతిధ్యం ఇచ్చే వారితో ఉన్న పరిచయాలను బట్టి , కొంత క్యాలరీలు కాల్చే పనులు  మీరు చేయవచ్చు, ఆ ప్రదేశాలలో !  ఎందుకంటే,ఇంట్లో కన్నా ఎక్కువే తినడం జరుగుతుంది కనుక , కాస్త ఎక్కువ పని కూడా చేస్తే ,  క్యాలరీలు బర్న్ అవుతాయి, వెంటనే !
6. అప్పటికే మీరు ( షుగరు కంట్రోలు కు )  ఏమైనా టాబ్లెట్స్ కనుక తీసుకుంటూ ఉంటుంటే , అవి ఈ  ప్రత్యేక సందర్భాలలో , అసలే మర్చి పోకూడదు ! ఎందుకంటే , ఎప్పటి కన్నా , ఎక్కువ బ్లడ్ షుగర్ ఉండే రిస్కు ఉంది కనుక ( విందులలో ఎక్కువ గా తినడం వల్ల  ) 
7. ప్రతి విందులో కూడా , డయాబెటిస్ ఉన్న వారు, క్రితం టపా లో సూచించిన విధం గా, వారి  భోజన ప్లేటు లేదా పళ్లాన్ని ఆహార పదార్ధాలతో అమర్చుకోవాలి ! కనీసం ఆ ప్రయత్నం చేయాలి !
8. అట్లా ప్రత్యేక సందర్భాలలో సంభవం కాని పక్షం లో , అక్కడ ఉన్న వంటకాలే మితం గా తినడం , ఎక్కువ గా ఆహూతులతో మాట్లాడుతుండడం చేయాలి ! అప్పుడు నోరు ( తినడం లో కాక !  ) మాట్లాడడం లో బిజీ అయిపోతుంది , అట్లా, తక్కువ తినడం జరుగుతుంది !  సోషల్ మీటింగ్ ను ” సోషల్ ఈటింగ్ పోటీ ”  అని భావించ కూడదు, డయాబెటిస్ ఉన్న వారు ! 
9. డయాబెటిస్ ఉంటే , తక్కువ పరిమాణం లో ఆహారం తరచూ తినడం చేయాలి ,  కడుపు నిండా షుష్టు గా , ఒక్కసారిగా కాక !  
10. మన నాలుకకు రుచే తెలుసు కానీ , ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ తక్కువ గా ఉత్పత్తి అయి ,రక్తం లో చెక్కెర ను కంట్రోలు చేయలేకపోతుందని తెలిసేది మెదడు కే  కదా , ఆ  మెదడు   తో నాలుకను ” కంట్రోలు ” చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ! అట్లా కాక, నాలుకనే  నమ్ముకుంటే , డయాబెటిస్ ఉన్న వారి పరిస్థితి ,” కుక్కతోక పట్టుకుని గోదారి ఈదిన ”  విధం గా ఉంటుంది ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 
 

 

25.డయాబెటిస్ లో, భోజన పళ్ళెం ఎట్లా ఉండాలి ? ( Plate method )

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 16, 2013 at 12:24 సా.

25.డయాబెటిస్ లో భోజన పళ్ళెం ఎట్లా ఉండాలి ? ( Plate method )

క్రితం టపాల లో డయాబెటిస్ లో పథ్యం లో తీసుకోవలసిన ముఖ్య మైన జాగ్రత్తల లో భాగం గా, ‘ లో జీ ఐ ‘ ఆహారం ఏమిటి , కీలక పోషక పదార్ధాలు ఏమిటి ? అనే సంగతుల గురించి తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు   ప్రతి సారీ డయాబెటిస్ ఉన్న వారు , లేదా ‘ డయాబెటిస్ రాకూడదు’  అనుకునే వారు , వారి భోజన విషయాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఎట్లా ఉండాలో తెలుసుకుందాం !  అంతే కాకుండా , ఆ జాగ్రత్తలు శాస్త్రీయం గా, ఎంత వరకూ సమంజసమో కూడా తెలుసుకుందాం ! సాధారణం గా ప్రతి వారి ఆహార వ్యవహారాలు , అనేక మైన పరిస్థితుల మీద ఆధార పడి ఉంటాయి ! వయసు, వారు శాక హారులా లేదా మాంస హారులా ?, వారు నివసించే ప్రదేశం , వారి కులగోత్రాలూ , వారి ఆర్ధిక పరిస్థితులూ , ఇంకా ముఖ్యంగా వారికి వివిధ ఆహార పదార్ధాల మీద ఉండే ప్రీతి , ( దానినే జిహ్వ చాంచల్యం అని కూడా అనవచ్చేమో ! ) , వారు పడే శ్రమా , ఇట్లా అనేక పరిస్థితులు వారి  ఆహార నియమాలను ప్రభావితం చేస్తాయి కదా ! ఇంత వరకూ బానే ఉంది ! కానీ ఒక్క సారిగా డయాబెటిస్ రావడం జరిగితే , ఆ డయాబెటిస్ కు ఈ పరిస్థితుల గురించి ఏమాత్రమూ  పట్టదు ! అంటే, రక్తం లో ఎక్కువ అవుతున్న చెక్కెర !  పై కారణాలు చెప్పి ఎవరూ అనారోగ్యం పాలు అవుదామనుకోరు కదా ! అందువల్ల , డయాబెటిస్ లో ప్రతి సారీ భోజనం చేసే సమయం లో భోజన పళ్ళెం ఈ క్రింది విధం గా అమర్చుకోవాలి ! 
1. మీరు రోజూ భోజనం ఏ పళ్ళెం లో అయితే చేస్తారో , ఆ ప్లేటు ను లేదా పళ్లాన్ని , రెండు సగాలు గా అనుకుని రెండో సగాన్ని మళ్ళీ రెండు సగాలు గా అనుకోండి ! అంటే మీరు కేవలం మీ ఊహ తోటే , మీ ప్లేటు ను మూడు భాగాలు గా విభజించు కుంటున్నారన్న మాట !
2. అందులో మొదటి భాగం అంటే  పళ్ళెం లో అర్ధ భాగం లో ,పిండి పదార్ధాలు ( అంటే ఆలుగడ్డలు , చిలగడ దుంపలు చేమ దుంపలు లాంటి దుంప కూరలు ) కాని ఆకుకూరలనూ , కూరగాయలనూ నింపండి ! ఇవి మీ ఇష్టమైనవి ఏవైనా కావచ్చు ! అంటే  మీ ఇష్టమైన ఆకు కూరలు, కూరగాయలు, చక్కగా ఉడికించినవి ! గమనించ వలసినది,   మీ ఇష్టమైన కూరలు ,దిట్టం గా నూనె వేసి , బాగా మసాలాలు వేసి చేసిన వేపుడు కూరలు , కాకూడదు ! అప్పుడు అవి మీ ఆరోగ్యానికి అనేక రకాలు గా హాని చేస్తాయి ! ( నూనెలు ఎక్కువ గా వాడడం వల్ల కొలెస్టరాలు పెంచే విధం గానూ , మసాలాలు వేయడం వల్ల , కడుపు లో మంటలూ , మసాలాలకు సమానం గా ఉప్పు వేసుకోవడం వల్ల , అధిక రక్త పీడనమూ ! )
బీన్సు , టమాటా , బ్రాకోలీ , బచ్చలి , కాకర కాయ , కాలీ ఫ్లవర్ , ఉల్లి గడ్డలు , కుక్క గొడుగులు , బీర కాయ , పొట్ల కాయ , సొర కాయ , లాంటి ఆకుకూరలూ , కూరగాయలూ ! ఇట్లా సగం ప్లేటు వీటితో నింపి తినడం వల్ల , శరీరానికి రోజూ కావలసిన విటమిన్లూ , ఖనిజాలూ మాత్రమే కాక , పీచు పదార్ధం కూడా పుష్కలం గా లభిస్తుంది దానితో పెద్ద ప్రేగు క్యాన్సర్ కూడా నివారింప బడుతుంది ! సగం ప్లేటు ఇట్లా తిన్నా కూడా , క్యాలరీలు మాత్రం తక్కువ గా ఉండి , చెక్కెర చక్కగా కంట్రోలు లో ఉంటుంది ! మరి డయాబెటిస్ కంట్రోలు కు కావలసినది అదే కదా ! 
మిగతా రెండు భాగాలలో ( అంటే ఈ రెండు భాగాలూ ప్లేటు కు ఇంకో సగం అవుతాయి ! ) ఒక భాగం లో ఉడికించిన ధాన్యాలు అంటే వరి , గోధుమ , రాగులు ,జొన్నలు లాంటి ధాన్యాల అన్నం కానీ , చిరుధాన్యాలు కానీ , లేదా పప్పుదినుసుల తో చేసిన పప్పు కానీ పప్పు చారు కానీ తీసుకోవచ్చు ! ఈ పిండి పదార్ధాలు , అసలు మానేస్తే రోజూ అవసరమయే  క్యాలరీలు ఎట్లా సమకూరుతాయి ? అందువల్ల  వాటిని మానేయకూడదు ! 
ఇక మూడో భాగం లో , మాంస కృత్తులు , వాటితో చేసిన వంటకాలనూ, ఇంకా పాలు , పెరుగునూ ( అన్నీ కాదు ! ) ఉంచుకుని తినడమూ , తాగడమూ చేయాలి ! 
పాలైతే, కొవ్వు తీసేసిన పాలు , లేదా పెరుగు అవుతే రెండు మూడు పెద్ద చెంచాల పెరుగు తీసుకోవచ్చు !
చివరగా , ఒక అరగ్లాసు పళ్ళ రసమో, లేదా మీకు నచ్చిన ఒక పండు ముక్క నో తినవచ్చు ! 
పైన వివరించిన ప్లేటు లో గమనించవలసినది , మనం సాధారణం గా పచ్చడి లోకి ఒక కప్పు అన్నమూ , కూరలోకి ఇంకో కప్పు , పప్పు లోకి ఇంకో కప్పు అట్లా ముద్ద ముద్ద కూ అన్నమూ , నెయ్యీ వేసుకుని తినడం కాకుండా , అన్నం లేదా ధాన్యాలతో చేసిన వంటలు పరిమితం గా ఒక చిన్న భాగం లోనే ఉన్నాయి ప్లేటు లో !  డయాబెటిస్ లో,  అపరిమితమైన అన్నం , అపరిమితమైన సమస్యలు తెస్తుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

24.డయాబెటిస్ లో, రోజూ తినవలసిన కీలక పోషక పదార్ధాలు. ( key nutrients ).

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 15, 2013 at 12:46 సా.

24.డయాబెటిస్ లో రోజూ తినవలసిన కీలక పోషక పదార్ధాలు. ( key nutrients  ).

డయాబెటిస్ లో పథ్యం లో భాగం గా ఇంత వరకూ మనం , కార్బో కౌంటింగ్ , ఇంకా గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి , డయాబెటిస్ చికిత్స లో వాటి ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు డయాబెటిస్ నిర్ధారణ అయినాక , వారి ఆహారం లో రోజూ ఉండవలసిన కీలక పోషక పదార్ధాల గురించి తెలుసుకుందాం ! 
అవి: 1. విటమిన్ బీ 12. 2. ఒమేగా ఫాట్టీ ఆమ్లాలు. 3. కాల్షియం. 4. విటమిన్ D. 5.ఇనుము లేదా ఐరన్. 
పైన ఉదహరించిన కీలక పోషక పదార్ధాలు ఆరోగ్య వంతుల తో పాటుగా , పూర్తి శాకాహారులకు కూడా చాలా కీలకమైనవి ! సామాన్యం గా ఈ పోషక పదార్ధాలు మాంస హారుల ఆహారం లో ఉంటాయి. అందు వల్ల వారు పైన చెప్పిన పోషక పదార్దాలనూ, ఖనిజాలనూ , అదనం గా తీసుకోనవసరం లేదు, టాబ్లెట్ ల రూపం లో కానీ టానిక్ ల రూపం లో కానీ ! కానీ శాక హారులకు ఆ అవసరం ఉంటుంది. ప్రత్యేకించి శాకాహారులు అయి ఉండి , వారికి డయాబెటిస్ కూడా వచ్చి ఉంటే , ఈ కీలక పోషక పదార్ధాలు ఇంకా అవసరం అవుతాయి ! డయాబెటిస్ నియంత్రణ కు వేసుకునే కొన్ని మందులు ( ఉదాహరణ కు: మెట్ ఫార్మిన్ )  కొంత కాలం వాడాక , బీ విటమిన్ లోపం కలిగిస్తాయి శరీరం లో ! ఆ లోపం వల్ల , కాళ్ళూ , చేతులూ తిమ్మిరి గా ఉండడం , స్పర్శ జ్ఞానం మందగించడం, ఉష్ణ శీతలాలు స్పష్టం గా తెలియక , ప్రమాదాలకు లోనవడం కూడా జరుగుతూ ఉంటుంది ! ఈ కీలక పోషక పదార్ధాలు పుష్కలం గా ఉండే ఆహారం ( పాలూ , పళ్ళూ , జున్ను అంటే చీజ్ , పెరుగు , బ్రాకోలీ , తాజా ఆకు కూరలూ , ) తీసుకుంటూ ఉండాలి రోజూ ! ఒమేగా ఫాటీ ఆమ్లాలు ,  పండ్ల లో ఉండే విటమిన్ సీ  లు మన శరీరం లో , ప్రత్యేకించి రక్త నాళాలలో చెడు కొవ్వు పేరుకుని , రక్త నాళాలు పెళుసు గా అవ కుండానూ , అధిక రక్త పీడనం రాకుండా నూ నిరోధిస్తాయి !  విటమిన్ సీ  తో పాటుగా ఇనుము పుష్కలం గా ఉండే ఆకు పచ్చని ఆకు కూరలూ , కూరగాయలూ తింటూ ఉంటే , వాటిలోని ఇనుము సరిగా  శరీరం చేత ” పీల్చ బడుతుంది ” అప్పుడు మనం  ఆహారం లో తీసుకునే ఇనుము వృధా గా పోవడం జరగదు ! విటమిన్ డీ కూడా మన శరీరం లోని ఎముకల బలానికే కాకుండా , డయాబెటిస్ లో చెక్కెర కంట్రోలు కు కూడా ఎంతో ఉపయోగకరమూ , కీలకమూ అయిన విటమిన్ అని ఇటీవల పరిశోధనలు నిర్ధారించాయి ! మన భారత దేశం లో ఉండే వారికి రోజూ పది పదిహేను నిమిషాలు శరీరానికి ఎండ తగిలితే సరిపడినంత డీ ( D ) విటమిన్ లభ్యం అవుతుంది ! ఉచితం గా నే !ఆ పరిస్తితులు లేని ప్రదేశాలలో నివసించే వారు, ఫోర్టి ఫైడ్ పాలు, సీరియల్స్ , కానీ బ్రెడ్తో   కానీ  శరీరానికి ( ఆరోగ్యానికి ) సరిపడేంత డీ విటమిన్ పొంద వచ్చు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

23.డయాబెటిస్ ఉన్న వారు, ” లో జీ ఐ ” ( low glyceamic index ) ఆహారం ఎందుకు తినాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 12, 2013 at 11:13 ఉద.
23. డయాబెటిస్  ఉన్న వారు,  ”  లో జీ ఐ ” ( low glyceamic index ) ఆహారం ఎందుకు తినాలి ?
GI  అంటే గ్లైసీమిక్ ఇండెక్స్ :  ఈ పదము, మనం తినే ఆహారం, మన రక్తం లో షుగరు ను ఏ మాత్రం ఎక్కువ చేస్తుందో తెలియ చేస్తుంది ! 
డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు, వారు తినే ఆహారం వారి రక్తం లో చెక్కెర ను  ఒక్క సారిగా ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఉండాలి ! అందువల్ల వారు GI , లేదా గ్లైసీమిక్ ఇండెక్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి !  GI లేదా జీ ఐ  ఎక్కువ గా ఉన్న ఆహార పదార్ధాలు చాలా త్వరగానూ ఎక్కువ గానూ రక్తం లో చెక్కెర ను ఎక్కువ చేస్తాయి ! GI తక్కువ గా ఉన్నవి , గ్లూకోజు ను నిదానం గా ఎక్కువ చేయడం జరుగుతుంది. అందుకే , GI తక్కువ గా ఉన్న ఆహారం డయాబెటిస్ వ్యాధి కి ఉత్తమం !
ఈ ఎక్కువ తక్కువ GI  ఉన్నట్టు ఎట్లా కనుక్కోవడం ?:  సామాన్యం గా ఈ GI  ని  పంచదార లేదా చెక్కెర ని కానీ , లేదా తెల్ల బ్రెడ్ ను ( అంటే వైట్ బ్రెడ్ )  మనం తింటే ఎంత త్వరగా మన రక్తం లో చెక్కెర ఎక్కువ అవుతుందో , దానితో ఇతర ఆహార పదార్ధాలను పోల్చి చూసి  GI ను లెక్క కడతారు ! 
మరి ఈ GI ను ఏ  ఏ  పరిస్థితులు ప్రభావం చేస్తాయి ?
మనం తినే ఆహారం లో కొవ్వు , ఇంకా పీచు పదార్ధాలు ఎంత ఎక్కువ ఉంటే , వాటి GI  అంత తక్కువ గా ఉంటుంది !  ఉదాహారణకు :  సామాన్యం గా బ్రెడ్ ను బ్రౌన్ బ్రెడ్ అనీ , వైట్ బ్రెడ్ అనీ అమ్ముతూ ఉంటారు !  వాటి పేర్ల లాగానే , తెల్ల బ్రెడ్ లో పీచు పదార్ధం తీసి వేసిన గోదుమ పిండి తో చేసిన బ్రెడ్ , ఇంకా  గోధుమలు యధాతధం గా  పిండి చేసి చేసిన బ్రెడ్ ను బ్రౌన్ బ్రెడ్ అంటారు ! ( హోల్ వీట్ బ్రెడ్ అని కూడా అంటారు ) డయాబెటిస్ ఉన్న వారు, బ్రౌన్ బ్రెడ్ తినడమే శ్రేయస్కరం ! ఎందుకంటే , ఈ బ్రౌన్ బ్రెడ్ లో పీచు పదార్ధం ఎక్కువ గా ఉంటుంది కాబట్టి , అది తింటే , వెంటనే గ్లూకోజు పెరగదు ! అంటే దాని GI తక్కువ అన్న మాట ! తెలుగు వారం , మనం ఎక్కువ గా వరి అన్నం అంటే రైస్ తింటాం కదా , మరి  ఈ వరి అన్నం కూడా బాస్మతి బియ్యం లో జీ ఐ అంటే నిదానం గా గ్లూకోజును పెంచుతుంది ! అందువల్ల మామూలు బియ్యం కంటే బాస్మతి బియ్యం మేలు ! అట్లాగని  తినే బాస్మతి అన్నం పరిమాణం ఎక్కువ చేయకూడదు ! ప్రతి భోజనం లోనూ ,ఒక కప్పు కన్నా ఎక్కువ అన్నం తినడం మంచిది కాదు డయాబెటిస్ ఉన్న వారు. ఎందుకంటే, మిగతా కూరలూ, పప్పూ , పెరుగూ అవన్నీ కలిపి ఎన్ని క్యాలరీలు ఉంటుందో , ఆ క్యాలరీలను నియమితం గా ఉంచుకోవాలి ప్రతి భోజనం లోనూ , ప్రతి రోజూ ! వరి అన్నం తినడం అలవాటు తప్పిన వారు పుల్కాలు తినడం మంచిది ! పుల్కాలు గోధుమ పిండి తో చేసేవి అయినా కేవలం నిప్పుల మీద కానీ , లేదా పెనం మీద ,నూనె వేయకుండా కాల్చడం జరుగుతుంది కనుక  ఆరోగ్యానికీ మంచిది ! ( ప్రతి భోజనం లోనూ , ఒకటి రెండు మాత్రమే అనే విషయం మర్చి పోకూడదు ! ) 
గమనించ వలసినది : కొవ్వు కూడా GI ని తగ్గిస్తుందని , కొవ్వు ఎక్కువ గా ఉన్న ఆహారం తినకూడదు. ఎందుకంటే , కొవ్వు , ఇతర విధాలు గా శరీరానికి హాని చేస్తుంది కనుక ! ఇంకా , బాగా ఎక్కువ సేపు ఉడికించిన ఆహారం కూడా , GI ని ఎక్కువ చేస్తుంది ! డయాబెటిస్ వ్యాధి ఉన్న వారు ఖచ్చితం గా తక్కువ GI  ఉన్న ఆహారాన్నే ఎప్పుడూ తినడం కష్టం. వారు GI తక్కువ గా ఉన్న ఆహారం, ఎక్కువ గానూ , GI ఎ క్కువ గా ఉన్న ఆహారం తక్కువ గానూ తింటూ ఉండాలి రోజూ !  ముఖ్యం గా వారు రోజు వారీ ఆహారం లో క్యాలరీలు నియమితం గా ఉండేట్టు చూసుకోవాలి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

22. డయాబెటిస్ పథ్యం, ముఖ్య సూత్రాలేంటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 11, 2013 at 2:45 సా.

22. డయాబెటిస్ పథ్యం, ముఖ్య  సూత్రాలేంటి ?

డయాబెటిస్ లో, పథ్యం యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని టపాలను ఇప్పటికే రాయడం జరిగింది కదా ! ఇప్పుడు  డయాబెటిస్ నిర్ధారణ అవగానే ,పథ్యం లో పాటించ వలసిన మూల సూత్రాల గురించి తెలుసు కుందాం, వివరం గా !  గమనించ వలసినది , ఈ మూల సూత్రాలన్నీ శాస్త్రీయమైనవి 
కేవలం, ఉబుసు పోక మాట్లాడుకునే విషయాలు కాదు , కాబట్టి , సందేహాలు ఏమైనా ఉంటే తెలుపవచ్చు.
 
డయాబెటిస్ లో పథ్యం చేసే సమయం లో పాటించ వలసిన మూల సూత్రాలు :
1. పిండి పదార్ధాల గణనం , అంటే కార్బో కౌంటింగ్ :
2. గ్లైసీమిక్ ఇండెక్స్ 
3. కీలక పోషక పదార్ధాలు. 
4. రోజూ మీ ప్లేటు ఎట్లా సిద్ధం చేసుకోవాలి ?
5. ప్రత్యెక సందర్భాలలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?
 
1.కార్బో కౌంటింగ్ : మనం తినే ఆహారం లో ప్రధానం గా పిండి పదార్ధాలు , అంటే కార్బోహైడ్రేటు లు , గ్లూకోజు గా మారుతాయి ! అంటే మన రక్తం లో గ్లూకోజు హెచ్చు తగ్గులకు ముఖ్యం గా మనం ఎంత కార్బోహైడ్రేటు లు ప్రతి సారీ తింటున్నామో , దానిని బట్టి ఉంటుంది ! 
మరి ఈ కార్బోహైడ్రేటులు ఏ  ఏ  ఆహార పదార్ధాల లో ఉంటాయి ?:
కూరగాయలలో : ఆలుగడ్డలు లేదా బంగాళా దుంపలు , మొక్కజొన్న లాంటి వి. 
పప్పు దినుసులలో సోయా , కంది పప్పు , శెనగ పప్పు , మినప్పప్పు లాంటి పప్పు ధాన్యాలు. 
ధాన్యాలలో , వరి , గోధుమ , మొదలైనవి. అంటే వాటితో చేసిన అన్నం , చపాతీలు, మరి ఇతర  వంటలు ఏమైనా కూడా ఉదా: పూరీలు , ఉప్మా , లాంటివి కూడా ! 
పళ్ళ లో తీయటి పళ్ళు అన్నీ ! ఉదా: అరటి పండు , పైన్ యాపిల్ , యాపిల్ , ద్రాక్ష , నారింజ మొదలైనవన్నీ కూడా !
పానీయాలలో , కోకా కోలా, పెప్సీ , థమ్సప్ , మాజా లాంటి పానీయాలన్నీ !
ఇక స్వీట్లూ , బిస్కట్లూ ,చాక్లెట్ లూ , ఐస్ క్రీం లూ చెప్పనవసరం లేదు ఎందుకంటే అవన్నీ కూడా చెక్కెర బాగా వేసి చేసినవి కనుక , తిన్న వెంటనే మన రక్తం లో గ్లూకోజు ను చాలా ఎక్కువ చేస్తాయి ! సాధారణం గా ప్రతి సారీ భోజనం లో 45 నుంచి  60 గ్రాముల కార్బో హైడ్రేటు లు ఉండాలి ! ఈ అరవై గ్రాములూ కేవలం తినే అన్నం కానీ , గోధుమ పిండి తో చేసిన చపాతీ మాత్రమే కాక భోజనం లో, కడుపు లోకి వెళ్ళే  మొత్తం కార్బోహైడ్రేటు లు అని అర్ధం అంటే కేవలం అరవై గ్రాముల ఆన్నమే తింటే , మిగతా పప్పు , పెరుగు , స్వీట్ల మాటేంటి ? అవన్నీ కూడా తింటాం కదా ! అప్పుడు వాటిలో ఉండే కార్బోహైడ్రేటులు కూడా కలిసి మొత్తం అరవై గ్రాముల వరకే ఉండాలన్న మాట ! ఈ అరవై గ్రాముల కార్బో హైడ్రేటు లు ఒక సారి భోజనం లో అని గమనించాలి !  వివిధ  ఆహార పదార్ధాలు ఎంతెంత పరిమాణం అరవై గ్రాములు ఉంటాయో , పథ్యం చేసే వారు తప్పని సరిగా తెలుసుకోవాలి ! లేదా ఒక మాదిరి గా తింటూ , రక్త పరీక్షలు తరచూ చేయించు కుంటూ ఉండాలి ! వచ్చే టపాలో గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం ! అప్పుడు మనకు కార్బో హైడ్రేటు లు నియమితం గా ప్రతి భోజనం లో తినాలో తెలుసుకోవడం శులభం అవుతుంది !
( ఈ క్రింద సూచించిన వెబ్ సైట్ లోకి వెళితే ( ఈ అడ్రస్ మీరు ప్రత్యేకం గా టైపు చేసి  వెదకాలి ) మన భారత దేశ వంటకాల కార్బోహైడ్రేటు  పాళ్ళు ఎంత ఉన్నాయో తెలిపే వివరాలు లభ్యం అవుతాయి. )
http://www.nufs.sjsu.edu/pdf/CarbCountSAsians.pdf
 

21. వందేళ్ళు బతికించే , ”ఒకినావా పథ్యం ” లో ప్రత్యేకత ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 10, 2013 at 9:01 సా.

21. వందేళ్ళు బతికించే , ”ఒకినావా పథ్యం ”  లో ప్రత్యేకత ఏమిటి ?

క్రితం టపాలలో, డయాబెటిస్ వ్యాధి లో ప్రతి దశలోనూ , అంటే మందులు తీసుకుంటున్నా , తీసుకోకున్నా కూడా, పథ్యం చేస్తే ఉండే ఉపయోగాల గురించి చర్చించుకున్నాం కదా !  అల్లోపతీ వైద్యం లో కూడా , ఈ పథ్యం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది ! కాకపొతే , అల్లోపతీ వైద్యం లో మిగతా వైద్య పద్ధతులలో లాగా ,పథ్యం ప్రాముఖ్యత ను రోగులకు వివరించరు ! ప్రత్యేకించి భారత దేశం లో ! పాశ్చాత్య దేశాలలో , ముఖ్యం గా ఇంగ్లండు, ఆస్ట్రేలియా , కెనడా , అమెరికా మొదలైన దేశాలలో , ప్రతి జబ్బు గురించీ , ఆ జబ్బును ఒక వ్యక్తి లో నిర్ధారణ అయిన వెంటనే ,  ఆ జబ్బు లేదా వ్యాధికి సంబంధించిన అన్ని వివరాలనూ ,  ఆ వ్యక్తి కి వివరిస్తారు ! ఆ వ్యక్తి , తనకు కొత్తగా నిర్ధారణ అయిన జబ్బు గురించి కూలంక షం గా తెలుసుకోవడానికి తగినంత సమాచారం అందిస్తారు ! ఇంకా సందేహాలుంటే కూడా తీరుస్తారు !  వివిధ కారణాలవల్ల ఆ పని భారత దేశం లో చేయరు !  ఒక గంట ఒక పేషంటు తో  ఆ వ్యాధి గురించి ” సుత్తి ” కొట్టి రెండు వందలు తీసుకునే బదులు , కేవలం  వారికి అయిదు నిమిషాలలో , మందులు రాసిచ్చి ,  మిగతా యాభై అయిదు నిమిషాలలో, కనీసం పదకొండు మంది ని చూసి, వారి దగ్గర నుండి , తలా రెండు వందలు తీసుకోవడం ఎక్కువ లాభ దాయకం కదా ! ( నేను కూడా  భారత దేశం లో ఉంటే,  అదే పని చేసే వాడినేమో ! ) 
ఇక అసలు విషయానికి వద్దాం ! 
ఒకినావా ! జపాను దేశానికి దక్షిణాన ఉన్న చిన్న చిన్న ద్వీపాల సముదాయం లో ఒకటి ! ఈ ద్వీపం ప్రత్యేకత ఏమిటి ?  ఈ చిన్న ద్వీపం లో ప్రపంచం లో ఎక్కడా లేనంత మంది , వంద ఏళ్లు దాటిన వారు నివసిస్తూ ఉన్నారు ! అంటే , ఈ ద్వీపం లో ఎక్కువ మంది వంద ఏళ్ళు దాటాక కూడా ఆరోగ్యం గా జీవిస్తున్నారు ! దానితో సహజం గానే అనేక మంది శాస్త్రజ్ఞులకు ఉత్సుకత జనించి , ఈ శతాయుషు కు గల కారణాలు పరిశీలిస్తే ,వారికి ఈ క్రింది విషయాలు స్పష్టమయాయి ! 
1. ఒకినావా వాసుల పథ్యం లో అంటే డైట్ లో , మిగతా జపాను వాసులకంటే ఇరవై శాతం తక్కువ క్యాలరీలు ఉంటాయి !
2. వారి పథ్యం లో ప్రత్యేకించి ,  యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలం గా  ఉంటాయి ! అంటే విటమిన్ లూ , ఖనిజాలూ పుష్కలం గా లభించే సహజ  మైన కూరగాయలు ,తాజా కూరగాయలు , పళ్ళు , దుంపలు , ఆకు కూరలూ , తప్పని సరిగా వారి రోజు వారీ వంటలలో , భోజనాలలో ఉండాల్సిందే !
ఈ యాంటీ ఆక్సిడెంట్ లు , మన శరీరం లోని ప్రతి కణాన్నీ , అను నిత్యం శుభ్ర పరుస్తూ ఉంటాయి ! గమనించ వలసినది , మన దేహం లో ఉన్న ప్రతి కణమూ ,సరిగా పని చేయాలంటే , నిత్యం ఆక్సిజన్ సరఫరా తో పాటుగా ,  వివిధ జీవ రసాయన క్రియల లో ఏర్పడుతుండే వివిధ మాలిన్యాలు కూడా త్వర త్వరగా కణం నుంచి విసర్జన అవుతూ ఉండాలి !   ఆ పనిని కేవలం  వ్యాయామం చేయడం తో పాటుగా ( వ్యాయామం తో రక్త ప్రసరణ సరిగా జరిగి , తద్వారా తగినంత ఆక్సిజన్ అంటే ప్రాణ వాయువు  ప్రతి కణానికీ అందుతుంది )  తాజా గా , సరిగా పనిచేసే  యాంటీ ఆక్సిడెంట్ లు  కూడా అందుతూ ఉండాలి ప్రతి కణానికీ !  ఒకినావా వాసులు ఆపనిని చాలా జాగ్రత్త గా చేస్తున్నారు ! 
3. ఒకినావా పథ్యం లో తక్కువ కొవ్వు , తక్కువ చెక్కెర  ఉంటుంది ! 
4. ఒకినావా వాసులలో, మాంసాహారం తినే వారు కూడా ఉన్నారు. కానీ వారు  ముఖ్యం గా చేపలనూ , మేక మాంసాన్నీ తింటారు. కానీ   వండుకున్నమాంసం పళ్ళెం నిండుగా పెట్టుకుని తినరు. వారు కేవలం మాంసాహారాన్ని స్లైసెస్ , అంటే ఉల్లిపాయ పొరల లాగా, మాంసాన్ని పలుచగా కోసిన ముక్కలనే తింటారు ! గుడ్లూ , ఇతర డెయిరీ ఉత్పత్తులను అంటే జున్ను , వెన్న లాంటి ఉత్పత్తులను చాలా తక్కువ గా తింటారు ! 
5. ఒకినావా పథ్యం లో  ధాన్యాలు , పప్పు దినుసులు , కాయగూరలు ఉంటాయి. చేపల లో పుష్కలం గా ఒమేగా కొవ్వులు , దేహానికి ఎంతో మేలు చేసే కొవ్వులు ఉంటాయి ! ఇంకో ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే ,  మనం సాధారణం గా  తినడానికి , ఎంతో ఏవగించు కునే కాకర కాయల తో చేసిన కూరలూ , సలాడ్ లూ,ఒకినావా వాసుల భోజనాలలో తరచూ ఉండాల్సిందే ట ! (  కాకరకాయ లో ఉండే  జీవ రసాయనాలు , మన శరీరం లో సహజం గా ఉండే ఇన్సులిన్ ను పోలి ఉండడమే కాకుండా , ఇన్సులిన్ లాగానే , మన శరీరం లోని చెక్కెర ను అంటే గ్లూకోజు ను నియంత్రించడానికి ఎంతగానో తోడ్పడతాయి ! ) మరి తాజా పళ్ళూ ,ఆకు కూరల గురించీ,  కాకర కాయల గురించీ , వాటి ఔషధ గుణాల గురించీ , మనకు వేల ఏళ్లకు పూర్వమే ఆయుర్వేద గ్రందాల ద్వారా  తెలిసినా కూడా మనం పట్టించుకోము కదా ! మరి ఈ విషయం లో కూడా , ఇతర దేశాల వ్యామోహం లో పడి , ఒకినావా వాసుల ను అనుకరిద్దామా? ! వందేళ్ళకు పైగా జీవిద్దామా ???!!!
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

20. డయాబెటిస్ లో పథ్యం , పరమార్ధం !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 9, 2013 at 6:40 సా.

20. డయాబెటిస్ లో పథ్యం , పరమార్ధం !

జిహ్వ కోసం సర్వం  తింటే, అనారోగ్యం అనివార్యం !
జీవం కోసం పథ్యం, అనుకుంటే , ఆరోగ్యం తథ్యం !  
 
క్రితం టపాలలో డయాబెటిస్ లో పథ్యం , యొక్క అవసరమూ , పథ్యం  సహజం గానే ఎంత ప్రభావ శీలం గా రక్తం లో షుగరు, అదే గూకోజు ను నియంత్రణ చేస్తుందో తెలుసుకున్నాం కదా ! డయాబెటిస్ కనుక్కున్న తొలి దశలోనే , ” యుద్ధ ప్రాతిపదిక ” మీద కనుక  మందులు లేకుండా ,  కేవలం పథ్యం , యోగం ,వ్యాయామం తో , గ్లూకోజును రక్తం లో సమపాళ్ల లో ఉండేట్టు నియంత్రించుకోవచ్చు ! 
మరి తినే ఆహారం ఎట్లా ఉండాలి : ? మనం కేవలం  ఒక నిర్ణీత సమయం లో ఆహారం తీసుకోక పొతే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం !  
మనం  తినే ఆహారం , ఉదయం  ఫలహారం అంటే బ్రేక్ ఫాస్ట్ చేయడం , మధ్యాహ్నం భోజనం చేయడం , సాయింత్రం వీలుంటే ఏదైనా టిఫిన్ తినడం మళ్ళీ రాత్రి భోజనం చేయడం సామాన్యం గా చేస్తూ ఉంటాం కదా ! చాలామంది, ఉదయం  స్కూళ్ళ కూ , ఆఫీసులకూ పరిగెత్తే సమయం లో ” తీరిక ” లేక , బ్రేక్ ఫాస్ట్ మిస్ అవుతూ ఉంటారు ! ఇది చాలా పొరపాటు ఎందుకంటే , మనకు పగలు పని చేయడం లేదా చదువుకోవడం , రాత్రి నిద్ర పోవడం లేదా ఆలస్యం గా పడుకోవడం లాంటి కార్యక్రమాలు , చేయడం అలవాటే !  ఈ కార్యక్రమాల మధ్యలో వీలున్నప్పుడు తినడం కూడా చేస్తూ ఉంటాము కదా ! కానీ ఇవన్నీ మన దేహానికి తెలియవు ప్రత్యేకించి , మన కడుపు కు  నిరంతరం అంటే ప్రతి నాలుగు నుంచి ఆరు గంటలకు ఒకసారి కడుపులో ” పడ్డ ” ఆహారం అంతా , జీర్నమయి , చిన్న ప్రేగులలోకీ , పెద్ద ప్రేగులలోకీ జారాల్సిందే కదా ! మరి సాయింత్రమో , రాత్రో భోజనం చేసిన తరువాత మళ్ళీ ఉదయం  బ్రేక్ ఫాస్ట్ మిస్ అయి , మళ్ళీ మద్యాహ్నం వరకూ కడుపు ను ఖాళీ గా ( అంటే ఏ  ఘనాహారమూ తినకుండా ) ఉంచితే ,దాని పర్యవసానాలు తీవ్రం గా దేహం మీద ఉంటాయి !  ఇక్కడ జరుగుతున్నది ,  మధ్యాహ్నం భోజనానికీ, సాయింత్రం టిఫిను కూ మధ్య అయిదారు గంటల విరామం , సాయింత్రం టిఫినుకూ , రాత్రి భోజనానికీ మధ్య ఇంకో మూడు నాలుగు గంటల విరామం ఉంటుంది ! కానీ రాత్రి భోజనానికీ , మళ్ళీ ఉదయం బ్రెక్ ఫాస్ట్ మిస్ అవుతే , మధ్యాహ్నం భోజనానికీ , మధ్య విరామం కనీసం పద్నాలుగు నుంచి పదహారు గంటల విరామం !  అంతంత విరామాలు ,జీర్ణ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయి ! 
అందువల్ల పథ్యం ఎప్పుడూ , మన రోజువారీ క్యాలరీ అవసరాల బట్టి , ఉదయం క్యాలరీలు ఎక్కువ గానూ , మధ్యాహ్నం క్యాలరీలు మధ్యస్తం గానూ , రాత్రి క్యాలరీలు నియమితం గానూ తీసుకోవాలి !  రాత్రి నియమితం గా ,ఎందుకు అంటే , నిద్రలో మనకు అవసరమయే క్యాలరీలు అతి తక్కువ గా ఉంటాయి !  కానీ సామాన్యం గా మనం రాత్రి పూట ‘సుష్టు ” గా ” కడుపు నిండా ” లాగించ డానికే  ఉత్సాహ పడుతుంటాము !  కానీ , డయాబెటిస్ లేక పోయినా కూడా, అట్లా రాత్రి పూట కడుపు నిండా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు ! గమనించవలసినది , ఏ సమయాలలో మనం ఎక్కువ గా శారీరిక శ్రమ చేస్తూ ఉంటామో , ఆ సమయానికి నాలుగు గంటల ముందు గా ఆ క్యాలరీల కు సమానమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి ! ( క్రితం టపాలలో వివరించినట్టు , రాత్రి పూట కనుక, కేవలం భోజనం అయాక నిద్ర పోకుండా , చదువుకునే విద్యార్ధులు , లేదా రతి రాత్రులలో దంపతులూ, సహజం గానే ,  తదనుగుణం గా క్యాలరీలకు సమానమైన ( ఎక్కువ ) ఆహారం తీసుకోవచ్చు ! ) 
ముఖ్యం గా డయాబెటిస్ నిర్ధారణ అయిన వారు,  ఎక్కువ సార్లు , అంటే నాలుగైదు సార్లు , తక్కువ పరిమాణం ( క్యాలరీలూ ) ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

19. డయాబెటిస్ చికిత్సా సూత్రాలు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 7, 2013 at 9:47 సా.

19. డయాబెటిస్ చికిత్సా  సూత్రాలు !

Myth

ఎన్నడూ  మానకు , పథ్యం ,యోగం , వ్యాయామం, 
రెండో దశలో కలుపు, మెట్ ఫార్మిన్ ! 
మూడో దశలో అవసరమేమో, ఇన్సులిన్ !  
ఏకాదశి నాడే  కలగాలి, చెక్కెర పై వ్యామోహం !
ద్వాదశి  నుండి  కొనసాగించు, చికిత్సా దీక్ష , శివోహం ! 
సదా వైద్య సలహా తో  మేలవును, మధుమేహం !  
క్రితం టపాలో చూశాము కదా డయాబెటిస్ యొక్క   చికిత్స మీద  ఉన్న అపోహలూ అపార్ధాలూ !   మరి పైన ఉన్న ‘ పద్యం ”  మళ్ళీ మళ్ళీ చదివితే , చికిత్స  అంటే ఏమిటో గుర్తు ఉంచుకోడానికి వీలుగా  ఉంటుంది ! మొదటి దశ లో అంటే డయాబెటిస్ ను కొత్తగా నిర్ధారించిన వెంటనే , చేయవలసినది ,  పథ్యం , యోగం , వ్యాయామం !
పథ్యం : ఈ పదం చాలా చిన్న గా ఉన్నా ఎంతో అర్ధవంతమైనదీ , అమూల్యమైనదీ  కూడానూ !  ఏ రకమైన ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకునే ఆహారమైనా పథ్యం అనబడుతుంది ! అంటే ఏది పడితే అది, ఎంత పడితే అంత తినకుండా , ప్రత్యేకమైన కూరగాయలు కానీ , ధాన్యాలు , చిరుధాన్యాలు కానీ , లేదా వివిధ పానీయాలు కానీ, చాలా ప్రత్యేకం గా , అంటే ఏరి కోరి , తీసుకుని , వాటిని వండడం లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని , వండడమే కాక , పరిమాణం కూడా నియమితం గా తీసుకుంటే దానిని పథ్యం అంటారు ! 
మరి డయాబెటిస్ లో పథ్యం ఎట్లా ఉండాలి ?:  ముందుగా డయాబెటిస్ ఉన్న వారు, వారి రోజువారీ  క్యాలరీలు ఎన్ని వ్యయం చేస్తున్నారో లెక్క కట్టుకోవాలి ! వారికి ఆ విషయం తెలియక పొతే , తెలిసిన వారి సహాయం తీసుకోవాలి ! ఆ తరువాత , రోజులో వ్యయం అయ్యే క్యాలరీలను షుమారుగా మూడో ,నాలుగో భాగాలు గా , అంటే  మూడు నాలుగు సార్లు మనం రోజూ ఆహారం తీసుకుంటాం కాబట్టి , విభజించుకుని , ఒక్కో భాగం లో ఎన్ని క్యాలరీలు ఉంటాయో , ఆ క్యాలరీల కు సరిపడే ఆహారాన్నే తీసుకోవడానికి మానసికం గా సిద్ధ పడాలి !  గమనించ వలసినది ,  వ్యయం కాని క్యాలరీలు, కొవ్వు రూపం లోనో , లేదా షుగరు రూపం లోనో శరీరం లో అదనం గా ఏర్పడుతూ ,  డయాబెటిస్ కంట్రోలు కు అవరోధం అవుతాయి ! 
యోగం : అంటే యోగా చేయడం : ఇది చికిత్స మధ్య లోకి ఎందుకు వచ్చింది , పానకం లో పుడక లాగా ? అని అనుకుంటారేమో !  యోగా చేయడం వల్ల ,మానసిక వత్తిడి తగ్గుతుంది ! మానసిక వత్తిడి తగ్గితే ,  వత్తిడి  అయినప్పుడు మన శరీరం లో ఏర్పడే హానికరమైన , ప్రత్యేకించి రక్తం లో గ్లూకోజు ను పెంచే ఎడ్రినలిన్ లాంటి హార్మోనులు తగ్గుముఖం పడతాయి !  దానితో రక్తం లో చెక్కెర కూడా కొంత వరకు తగ్గుతుంది ! 
ఇక వ్యాయామం :  దీని ప్రాముఖ్యత ప్రత్యేకం గా చెప్పుకోనవసరం లేదు కదా !  వ్యాయామం కొవ్వును కరిగిస్తుంది, క్యాలరీలను కరిగిస్తుంది ! రక్తం లో ఉన్న గ్లుకోజును  కండరాలలోకి ప్రవేశ పెట్టి , తద్వారా , రక్తం లో గ్లూకోజు ను తగ్గిస్తుంది ! ముఖ్యం గా గమనించ వలసినది ఏమిటంటే , ఈ పథ్యం , యోగం , వ్యాయామం , డయాబెటిస్ నిర్ధారణ అయినప్పటి నుంచీ , జీవితాంతం కొనసాగిస్తూ ఉండాలి ! మందులు , లేదా ఇన్సులిన్ తీసుకోవాల్సి వచ్చినా కూడా ! ఎందుకంటే  పై మూడు పద్ధతులు కూడా , సహజం గానే  గ్లూకోజును తగ్గించే పద్ధతులే కదా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

18. ఇక డయాబెటిస్ చికిత్స సూత్రాలేంటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health on మే 6, 2013 at 9:50 ఉద.

18. ఇక  డయాబెటిస్ చికిత్స సూత్రాలేంటి ?

గత టపాలలో,  వయసు వచ్చిన తరువాత అంటే టైప్ టూ  డయాబెటిస్ , కంట్రోలు లో లేకుండా ఉంటే శరీరం లో కలిగే దుష్పరిణామాలు ఏమిటో , అవి ఎట్లా వస్తాయో కూడా వివరం గా తెలుసుకోవడం జరిగింది కదా ! ఇప్పుడు  డయాబెటిస్ వచ్చినపుడు మొదలుపెట్టే చికిత్సా పద్ధతుల గురించీ , సామాన్యం గా చికిత్సలో జరిగే పొరపాట్ల గురించీ తెలుసుకుందాం ! అవసరమైన పరీక్షలు చేయించు కోవడం వల్ల , డయాబెటిస్ నిర్ధారణ అయిన వారి మనస్తత్వం ఇట్లా ఉంటుంది :
1. ” నేను ఇప్పటి వరకూ ఆరోగ్యం గానే ఉన్నాను కదా ! నాకు డయాబెటిస్ రావడం ఏమిటి ? పరీక్షలలో ఏదో పొర పాటు జరిగి ఉంటుంది ” అనుకునే భావన ! ఇట్లా అనుకునే వారు , శాస్త్రీయం గా పరీక్షలు చేసి ,నిర్ధారణ చేసిన , వారి డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేసి , తమకు తెలియకుండానే వ్యాధిని తీవ్రతరం చేసుకుంటారు ! అంతేకాక, మానసికం గా, వారు  డయాబెటిస్ వ్యాధి గ్రస్తులనే యదార్ధాన్ని ఆమోదించే స్థితిలో ఉండరు !  ఈ సమయం లో వారికి కావలసింది, డయాబెటిస్ గురించి కూలంక షం గా తెలియచేసే వారు , వారు వారి మిత్రులైనా , బంధువులైనా , లేదా ముఖ్యం గా వారి డాక్టర్ అయినా పరవాలేదు ! కావలసినది వారి సందేహాలన్నీ నివృత్తి చేసి , చికిత్స యొక్క ప్రాముఖ్యత ను తెలియ జేయటమే !
2.”  నాకు ట్యాబ్లెట్లు వేసుకునే అలవాటు ఎప్పుడూ లేదు నా జీవితం లో , ఇప్పుడు ఈ వెధవ  ట్యాబ్లెట్లు  అన్నీ వేసుకుని , నా శరీరాన్ని మందుల మయం చేసుకోను ” అనుకునే ఉద్దేశం !ఇట్లా అనుకోవడం కూడా పొరపాటే ! ఎందుకంటే , చీటికీ మాటికీ ట్యాబ్లెట్లు వేసుకోవడం ఎవరికీ మంచిది కాదు, ఎవరికీ ఇష్టం ఉండకూడదు కూడానూ ! కానీ ఒక వ్యాధి నిర్ధారణ అయినప్పుడు , ఆ వ్యాధిలో, ఆ ట్యా బ్లెట్  చక్కగా పని చేస్తున్నట్టు , అనేక వందల పరిశీలనల ద్వారా స్పష్టమయినప్పుడు కూడా , అశ్రద్ధ చేసి , అనుమాన ధోరణి తో మందులు వేసుకోకుండా ఉండడం , కేవలం వారి వ్యాధిని తీవ్రతరం చేసుకోడానికే !
3.”  కాస్త తీపి పదార్ధాలు తినకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది , అప్పుడప్పుడూ అయితే పరవాలేదు ” అనుకుని తమకు తామే కన్సెషన్ లు ఇచ్చుకుందామనే  ” ఉదార ” బుద్ధి ” ఈ రకం గా ఎవరికి వారు , కన్సెషన్ లు ఇచ్చుకుంటూ వారి రోజు వారీ పథ్యం విషయాలలో రిలాక్స్ అవుతూ ఉంటే కూడా వ్యాధి కంట్రోలు లో ఉండదు ! 
4. ” డాక్టర్లు  అందరికీ చెబుతుంటారు , సిగరెట్లు తాగ కూడదనీ , మద్యం ముట్ట కూడదనీ , ఇట్లా అనేకం చెబుతూ ఉంటారు, వారు చెప్పే మాటలను ఖాతరు చేయనవసరం లేదు ఎందుకంటే , మద్యానికీ , సిగరెట్లు తాగడానికీ , మధుమేహానికీ సంబంధం ఏమిటి ? ” అనుకుంటూ , కనీసం ఆ సంబంధం ఏమిటో  తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా , వైద్య సలహాను హాస్యాస్పదం చేస్తూ ఉంటారు !  తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతూ ,వారు క్షోభ పడుతూ , వారి కుటుంబాలకు కూడా ఎంతో ఖేదం కలిగిస్తారు , కేవలం వారి అశ్రద్ధా , నిర్లక్ష్యం వల్ల !  
పైన ఉదహరించిన ఆలోచనా ధోరణులు ఉన్న వారందరికీ ఒకటే సూచన !  డయాబెటిస్ రోగ నిర్ధారణ అయిన వెంటనే , వారు, వారి రక్తం లో షుగరు కంట్రోలు కు అవసరమయే సర్వ ప్రయత్నాలూ ప్రారంభించాలి, ఆ ప్రయత్నాలను కొనసాగించాలి , వారి జీవితాంతం !  ఒక విధం గా , వారికై  వారు , రక్తం లో అధిక షుగరు మీద యుద్ధం ప్రకటించడమే ! ఆ యుద్ధం , వారి జీవితాంతం కొనసాగించాల్సిందే !  యుద్ధం ఒక్క రోజు ఆపినా కూడా , శత్రువు ( అధిక షుగరు ) ది పై చేయి అవుతుంది,శరీరానికి కలగ కూడని అపాయం జరుగుతుంది ! 
వచ్చే టపాలో  చికిత్సా సూత్రాలు ఏమిటో వివరం గా తెలుసుకుందాం !