3. గురక కు కారణాలు ఏమిటి ?
క్రితం టపాలో మనం మన గొంతులో ఏ మార్పులు గురక కు కారణ మవుతాయో తెలుసుకున్నాం కదా ! మరి ఆ మార్పులు, ఎందుకు కలుగుతాయో తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా ! గురకకు కారణాలు తెలుసుకోవడం ముఖ్యం ఎందుకంటే , గురక ను అశ్రద్ధ చేస్తే , వివిధ రకాల అనారోగ్యాలకు అది దారి తీయవచ్చు !
మరి గురకకు కారణాలు ఏమిటి ?
1. వివిధ రకాల ఎలర్జీ ల వల్ల : వాతావరణం క్రమేణా ఎక్కువ గా కలుషితం అవుతూ ఉండడం తో వివిధ రకాల ఎలర్జన్ లు గాలి లో ఉండి , అవి నాసికా రంధ్రాల ద్వారా లోపలి వెళతాయి ! ఈ రకం గా ఎలర్జన్ లు , చాలా కాలం కనుక ముక్కులో ప్రవేశిస్తూ ఉంటే , మన దేహం లో సహజం గా నే ఉండే రక్షణ చర్యలలో భాగం గా ముక్కు లోపలి భాగాలు , అంటే గొంతు మొదటి భాగాలు , వాయడం జరుగుతుంది. ఆ వాపు ట్రాకియా ద్వారాన్ని చిన్నది గా చేసి గురక కు కారణమవుతుంది.
2. ఊబకాయం వల్ల అంటే ఒబీసిటీ వల్ల : మన దేహం లో చాలా అనర్ధాలకు కారణ మయే ఊబకాయం, గురక కు కూడా కారణ మవుతుంది. సహజం గానే ఊబకాయం ఉన్న వారి దేహం లో చాలా భాగాలలో కొవ్వు పెరుకున్నట్టే , నాలుక చివరా , అంగిటి చివరా ఉన్న కండరాల చుట్టూ కూడా కొవ్వు ఎక్కువ గా పేరుకుంటుంది. దానితో ట్రాకియా ద్వారం చిన్నది గా అయి గురక కు కారణమవుతుంది !
3. స్మోకింగ్ చేస్తుండడం వల్ల : స్మోకింగ్ గురించీ , టొబాకో చేసే హాని గురించీ మనం ఒక డజను టపాలలో వివరం గా తెలుసుకున్నాం కదా ! ( ఓపిక చేసుకుని బాగు ఆర్కైవ్ లలో చూడండి ) మరి స్మోకింగ్ గురకకు కారణం ఎట్లా అవుతుంది అని మీకు అనుమానం వస్తే , గమనించ వలసినది, టొబాకో పొగలో ఉండే అనేక వందల విష పదార్ధాలూ , మాలిన్యాలూ , ఎలర్జన్ ల లా మన దేహం లో పనిచేస్తాయి ( అసలు ఎలర్జీ అంటేనే , మన దేహం లోని కణాలు చూపించే రక్షణ చర్యలే ! ) అందువల్ల కూడా గొంతు లోపలి భాగాలు వాచిపోతాయి ! ఆ వాపు బయటకు కనబడనవసరం లేదు ! ఎందుకంటే టొబాకో పొగ ముక్కుతోటీ , నోటితోటీ కదా పీల్చ బడేది ! అందువల్ల , ఆ పొగ లో ఉండే విష వాయువులు గొంతులోనూ అక్కడి కణాల లోనూ మార్పులు కలిగించి వాపు దీనినే ఇన్ఫ్లమేషన్ అంటారు, ఏర్పడి తద్వారా ట్రాకియా ద్వారం వ్యాసం చిన్నదయి గురకకు కారణం అవుతుంది !
4. మద్యపానం చేయడం వల్ల : మద్య పానం , గొంతులో ఉండే అతి సున్నితమైన కండరాలను అతిగా వ్యాకోచింప చేస్తుంది ! దానితో క్రితం టపాలో ఉన్న చిత్రం లోని రెండవ చిత్రం లో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది , అంటే , నాలుక చివరి కండరాలూ , అంగిటి చివరి కండరాలూ వ్యాకోచించుకుని , ట్రాకియా ద్వారం చిన్నది అయిపోయి గురక వస్తుంది.
5. వివిధ రకాలైన మత్తు కలిగించే మందులు అంటే సెడేటివ్ మందులు. : ఈ మందులన్నీ కూడా గొంతు లో కండరాలను వ్యాకోచింప చేసి, గురకకు కారణ మవుతాయి ! ఈ పరిస్థితి , రోజూ నిద్ర మాత్రలూ, గొంతు నొప్పికీ , దగ్గుకూ , రోజూ మందులు వేసుకునే వారిలో ఎక్కువ గా కనిపిస్తుంది, కేవలం కొన్ని రోజులో , ఒక వారమో ఆ మందులు వేసుకునే వారి కంటే ! ( అంటే కేవలం అవసరం ఉండి కొన్ని రోజులే వాడే వారికన్నా , అది అలవాటు గా చేసుకుని నెలలూ , సంవత్సరాల తరబడి అట్లాంటి మత్తు కలిగించే మందులు వేసుకునే వారిలో ఈ పరిస్థితి తరచు గా కనిపిస్తుంది ! )

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !