21. వందేళ్ళు బతికించే , ”ఒకినావా పథ్యం ” లో ప్రత్యేకత ఏమిటి ?
క్రితం టపాలలో, డయాబెటిస్ వ్యాధి లో ప్రతి దశలోనూ , అంటే మందులు తీసుకుంటున్నా , తీసుకోకున్నా కూడా, పథ్యం చేస్తే ఉండే ఉపయోగాల గురించి చర్చించుకున్నాం కదా ! అల్లోపతీ వైద్యం లో కూడా , ఈ పథ్యం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది ! కాకపొతే , అల్లోపతీ వైద్యం లో మిగతా వైద్య పద్ధతులలో లాగా ,పథ్యం ప్రాముఖ్యత ను రోగులకు వివరించరు ! ప్రత్యేకించి భారత దేశం లో ! పాశ్చాత్య దేశాలలో , ముఖ్యం గా ఇంగ్లండు, ఆస్ట్రేలియా , కెనడా , అమెరికా మొదలైన దేశాలలో , ప్రతి జబ్బు గురించీ , ఆ జబ్బును ఒక వ్యక్తి లో నిర్ధారణ అయిన వెంటనే , ఆ జబ్బు లేదా వ్యాధికి సంబంధించిన అన్ని వివరాలనూ , ఆ వ్యక్తి కి వివరిస్తారు ! ఆ వ్యక్తి , తనకు కొత్తగా నిర్ధారణ అయిన జబ్బు గురించి కూలంక షం గా తెలుసుకోవడానికి తగినంత సమాచారం అందిస్తారు ! ఇంకా సందేహాలుంటే కూడా తీరుస్తారు ! వివిధ కారణాలవల్ల ఆ పని భారత దేశం లో చేయరు ! ఒక గంట ఒక పేషంటు తో ఆ వ్యాధి గురించి ” సుత్తి ” కొట్టి రెండు వందలు తీసుకునే బదులు , కేవలం వారికి అయిదు నిమిషాలలో , మందులు రాసిచ్చి , మిగతా యాభై అయిదు నిమిషాలలో, కనీసం పదకొండు మంది ని చూసి, వారి దగ్గర నుండి , తలా రెండు వందలు తీసుకోవడం ఎక్కువ లాభ దాయకం కదా ! ( నేను కూడా భారత దేశం లో ఉంటే, అదే పని చేసే వాడినేమో ! )
ఇక అసలు విషయానికి వద్దాం !
ఒకినావా ! జపాను దేశానికి దక్షిణాన ఉన్న చిన్న చిన్న ద్వీపాల సముదాయం లో ఒకటి ! ఈ ద్వీపం ప్రత్యేకత ఏమిటి ? ఈ చిన్న ద్వీపం లో ప్రపంచం లో ఎక్కడా లేనంత మంది , వంద ఏళ్లు దాటిన వారు నివసిస్తూ ఉన్నారు ! అంటే , ఈ ద్వీపం లో ఎక్కువ మంది వంద ఏళ్ళు దాటాక కూడా ఆరోగ్యం గా జీవిస్తున్నారు ! దానితో సహజం గానే అనేక మంది శాస్త్రజ్ఞులకు ఉత్సుకత జనించి , ఈ శతాయుషు కు గల కారణాలు పరిశీలిస్తే ,వారికి ఈ క్రింది విషయాలు స్పష్టమయాయి !
1. ఒకినావా వాసుల పథ్యం లో అంటే డైట్ లో , మిగతా జపాను వాసులకంటే ఇరవై శాతం తక్కువ క్యాలరీలు ఉంటాయి !
2. వారి పథ్యం లో ప్రత్యేకించి , యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలం గా ఉంటాయి ! అంటే విటమిన్ లూ , ఖనిజాలూ పుష్కలం గా లభించే సహజ మైన కూరగాయలు ,తాజా కూరగాయలు , పళ్ళు , దుంపలు , ఆకు కూరలూ , తప్పని సరిగా వారి రోజు వారీ వంటలలో , భోజనాలలో ఉండాల్సిందే !
ఈ యాంటీ ఆక్సిడెంట్ లు , మన శరీరం లోని ప్రతి కణాన్నీ , అను నిత్యం శుభ్ర పరుస్తూ ఉంటాయి ! గమనించ వలసినది , మన దేహం లో ఉన్న ప్రతి కణమూ ,సరిగా పని చేయాలంటే , నిత్యం ఆక్సిజన్ సరఫరా తో పాటుగా , వివిధ జీవ రసాయన క్రియల లో ఏర్పడుతుండే వివిధ మాలిన్యాలు కూడా త్వర త్వరగా కణం నుంచి విసర్జన అవుతూ ఉండాలి ! ఆ పనిని కేవలం వ్యాయామం చేయడం తో పాటుగా ( వ్యాయామం తో రక్త ప్రసరణ సరిగా జరిగి , తద్వారా తగినంత ఆక్సిజన్ అంటే ప్రాణ వాయువు ప్రతి కణానికీ అందుతుంది ) తాజా గా , సరిగా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్ లు కూడా అందుతూ ఉండాలి ప్రతి కణానికీ ! ఒకినావా వాసులు ఆపనిని చాలా జాగ్రత్త గా చేస్తున్నారు !
3. ఒకినావా పథ్యం లో తక్కువ కొవ్వు , తక్కువ చెక్కెర ఉంటుంది !
4. ఒకినావా వాసులలో, మాంసాహారం తినే వారు కూడా ఉన్నారు. కానీ వారు ముఖ్యం గా చేపలనూ , మేక మాంసాన్నీ తింటారు. కానీ వండుకున్నమాంసం పళ్ళెం నిండుగా పెట్టుకుని తినరు. వారు కేవలం మాంసాహారాన్ని స్లైసెస్ , అంటే ఉల్లిపాయ పొరల లాగా, మాంసాన్ని పలుచగా కోసిన ముక్కలనే తింటారు ! గుడ్లూ , ఇతర డెయిరీ ఉత్పత్తులను అంటే జున్ను , వెన్న లాంటి ఉత్పత్తులను చాలా తక్కువ గా తింటారు !
5. ఒకినావా పథ్యం లో ధాన్యాలు , పప్పు దినుసులు , కాయగూరలు ఉంటాయి. చేపల లో పుష్కలం గా ఒమేగా కొవ్వులు , దేహానికి ఎంతో మేలు చేసే కొవ్వులు ఉంటాయి ! ఇంకో ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే , మనం సాధారణం గా తినడానికి , ఎంతో ఏవగించు కునే కాకర కాయల తో చేసిన కూరలూ , సలాడ్ లూ,ఒకినావా వాసుల భోజనాలలో తరచూ ఉండాల్సిందే ట ! ( కాకరకాయ లో ఉండే జీవ రసాయనాలు , మన శరీరం లో సహజం గా ఉండే ఇన్సులిన్ ను పోలి ఉండడమే కాకుండా , ఇన్సులిన్ లాగానే , మన శరీరం లోని చెక్కెర ను అంటే గ్లూకోజు ను నియంత్రించడానికి ఎంతగానో తోడ్పడతాయి ! ) మరి తాజా పళ్ళూ ,ఆకు కూరల గురించీ, కాకర కాయల గురించీ , వాటి ఔషధ గుణాల గురించీ , మనకు వేల ఏళ్లకు పూర్వమే ఆయుర్వేద గ్రందాల ద్వారా తెలిసినా కూడా మనం పట్టించుకోము కదా ! మరి ఈ విషయం లో కూడా , ఇతర దేశాల వ్యామోహం లో పడి , ఒకినావా వాసుల ను అనుకరిద్దామా? ! వందేళ్ళకు పైగా జీవిద్దామా ???!!!
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !