Our Health

Archive for మే 12th, 2013|Daily archive page

23.డయాబెటిస్ ఉన్న వారు, ” లో జీ ఐ ” ( low glyceamic index ) ఆహారం ఎందుకు తినాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 12, 2013 at 11:13 ఉద.
23. డయాబెటిస్  ఉన్న వారు,  ”  లో జీ ఐ ” ( low glyceamic index ) ఆహారం ఎందుకు తినాలి ?
GI  అంటే గ్లైసీమిక్ ఇండెక్స్ :  ఈ పదము, మనం తినే ఆహారం, మన రక్తం లో షుగరు ను ఏ మాత్రం ఎక్కువ చేస్తుందో తెలియ చేస్తుంది ! 
డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు, వారు తినే ఆహారం వారి రక్తం లో చెక్కెర ను  ఒక్క సారిగా ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఉండాలి ! అందువల్ల వారు GI , లేదా గ్లైసీమిక్ ఇండెక్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి !  GI లేదా జీ ఐ  ఎక్కువ గా ఉన్న ఆహార పదార్ధాలు చాలా త్వరగానూ ఎక్కువ గానూ రక్తం లో చెక్కెర ను ఎక్కువ చేస్తాయి ! GI తక్కువ గా ఉన్నవి , గ్లూకోజు ను నిదానం గా ఎక్కువ చేయడం జరుగుతుంది. అందుకే , GI తక్కువ గా ఉన్న ఆహారం డయాబెటిస్ వ్యాధి కి ఉత్తమం !
ఈ ఎక్కువ తక్కువ GI  ఉన్నట్టు ఎట్లా కనుక్కోవడం ?:  సామాన్యం గా ఈ GI  ని  పంచదార లేదా చెక్కెర ని కానీ , లేదా తెల్ల బ్రెడ్ ను ( అంటే వైట్ బ్రెడ్ )  మనం తింటే ఎంత త్వరగా మన రక్తం లో చెక్కెర ఎక్కువ అవుతుందో , దానితో ఇతర ఆహార పదార్ధాలను పోల్చి చూసి  GI ను లెక్క కడతారు ! 
మరి ఈ GI ను ఏ  ఏ  పరిస్థితులు ప్రభావం చేస్తాయి ?
మనం తినే ఆహారం లో కొవ్వు , ఇంకా పీచు పదార్ధాలు ఎంత ఎక్కువ ఉంటే , వాటి GI  అంత తక్కువ గా ఉంటుంది !  ఉదాహారణకు :  సామాన్యం గా బ్రెడ్ ను బ్రౌన్ బ్రెడ్ అనీ , వైట్ బ్రెడ్ అనీ అమ్ముతూ ఉంటారు !  వాటి పేర్ల లాగానే , తెల్ల బ్రెడ్ లో పీచు పదార్ధం తీసి వేసిన గోదుమ పిండి తో చేసిన బ్రెడ్ , ఇంకా  గోధుమలు యధాతధం గా  పిండి చేసి చేసిన బ్రెడ్ ను బ్రౌన్ బ్రెడ్ అంటారు ! ( హోల్ వీట్ బ్రెడ్ అని కూడా అంటారు ) డయాబెటిస్ ఉన్న వారు, బ్రౌన్ బ్రెడ్ తినడమే శ్రేయస్కరం ! ఎందుకంటే , ఈ బ్రౌన్ బ్రెడ్ లో పీచు పదార్ధం ఎక్కువ గా ఉంటుంది కాబట్టి , అది తింటే , వెంటనే గ్లూకోజు పెరగదు ! అంటే దాని GI తక్కువ అన్న మాట ! తెలుగు వారం , మనం ఎక్కువ గా వరి అన్నం అంటే రైస్ తింటాం కదా , మరి  ఈ వరి అన్నం కూడా బాస్మతి బియ్యం లో జీ ఐ అంటే నిదానం గా గ్లూకోజును పెంచుతుంది ! అందువల్ల మామూలు బియ్యం కంటే బాస్మతి బియ్యం మేలు ! అట్లాగని  తినే బాస్మతి అన్నం పరిమాణం ఎక్కువ చేయకూడదు ! ప్రతి భోజనం లోనూ ,ఒక కప్పు కన్నా ఎక్కువ అన్నం తినడం మంచిది కాదు డయాబెటిస్ ఉన్న వారు. ఎందుకంటే, మిగతా కూరలూ, పప్పూ , పెరుగూ అవన్నీ కలిపి ఎన్ని క్యాలరీలు ఉంటుందో , ఆ క్యాలరీలను నియమితం గా ఉంచుకోవాలి ప్రతి భోజనం లోనూ , ప్రతి రోజూ ! వరి అన్నం తినడం అలవాటు తప్పిన వారు పుల్కాలు తినడం మంచిది ! పుల్కాలు గోధుమ పిండి తో చేసేవి అయినా కేవలం నిప్పుల మీద కానీ , లేదా పెనం మీద ,నూనె వేయకుండా కాల్చడం జరుగుతుంది కనుక  ఆరోగ్యానికీ మంచిది ! ( ప్రతి భోజనం లోనూ , ఒకటి రెండు మాత్రమే అనే విషయం మర్చి పోకూడదు ! ) 
గమనించ వలసినది : కొవ్వు కూడా GI ని తగ్గిస్తుందని , కొవ్వు ఎక్కువ గా ఉన్న ఆహారం తినకూడదు. ఎందుకంటే , కొవ్వు , ఇతర విధాలు గా శరీరానికి హాని చేస్తుంది కనుక ! ఇంకా , బాగా ఎక్కువ సేపు ఉడికించిన ఆహారం కూడా , GI ని ఎక్కువ చేస్తుంది ! డయాబెటిస్ వ్యాధి ఉన్న వారు ఖచ్చితం గా తక్కువ GI  ఉన్న ఆహారాన్నే ఎప్పుడూ తినడం కష్టం. వారు GI తక్కువ గా ఉన్న ఆహారం, ఎక్కువ గానూ , GI ఎ క్కువ గా ఉన్న ఆహారం తక్కువ గానూ తింటూ ఉండాలి రోజూ !  ముఖ్యం గా వారు రోజు వారీ ఆహారం లో క్యాలరీలు నియమితం గా ఉండేట్టు చూసుకోవాలి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: