Our Health

Archive for జూన్, 2013|Monthly archive page

6 ఆస్త్మా మందుల సైడ్ ఎఫెక్ట్ లు ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 29, 2013 at 11:34 ఉద.

6  ఆస్త్మా మందుల సైడ్ ఎఫెక్ట్ లు ఏమిటి ?

 
క్రితం టపాలో మనం ప్రధానం గా ఆస్త్మా చికిత్స కు వాడే ఇన్హేలర్ మందులు , ఆస్త్మా నివారణకు వాడే ఇన్హేలర్ మందులు ఉంటాయని తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు వాటిని వాడడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ ల గురించి తెలుసుకుందాం ! 
 సామాన్యం గా ఆస్త్మా కు వాడే మందులు ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ లు కలిగించవు , తగిన మోతాదు లో అంటే  డాక్టర్ సలహా ప్రకారం మూడు , నాలుగు సార్లు మాత్రమే తీసుకుంటే. కానీ ఆస్త్మా సూచనలు రాగానే , ఆందోళన పడుతూ , అప్పుడే కాకుండా మిగతా సమయాలలో కూడా తరచు గా ఆ మందులు వాడుతుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్ లు తప్పవు. రిలీవర్ మందులతో , కాస్త చేతులు వణ కడమూ , కండరాలలో నొప్పులు కలగడమూ , లేదా కండరాలు బిగుతుగా అయిన ఫీలింగ్ కలగడమూ జరుగుతుంది. తలనొప్పులు కూడా తరచు గా రావచ్చు. ఈ లక్షణాలు , ఎక్కువ డోసు లలో మందులు తరచూ వేసుకుంటూ ఉంటే కలుగుతుంది. ఈ లక్షణాలు సామాన్యం గా కొద్ది సమయమే ఉంటాయి ( కొన్ని నిమిషాలు మాత్రమే ). ఉపశమనానికి వేసుకునే ప్రి వెంటర్  మందులు  తరచూ వేసుకుంటూ ఉంటే , లేదా ఎక్కువ డోసు లో వేసుకుంటే , నోటిలోనూ , గొంతు లోనూ ,  పూత పూయడం జరుగుతుంది దీనిని ఓరల్ కాండి డియాస్ అని అంటారు ! అంటే ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ కలుగుతుంది. నోటిలోనూ , గొంతులోనూ నొప్పి గా ఉండడమే కాకుండా స్వరం లో కూడా అంటే మాట్లాడే మాట కూడా మార వచ్చు !  ఈ పరిస్థితి ప్రత్యేకించి పాటలు పాడే వారికి  సమస్య గా మార వచ్చు, గళం లో మార్పు వచ్చి !కొందరు ఆస్త్మా వ్యాధి ఉన్న వారికి , స్పెషలిస్టు స్టీరాయిడ్ మందులు తీసుకోమని సలహా ఇవ్వ వచ్చు ! ఈ స్టీరాయిడ్ మందులు , ప్రత్యేకించి నోటిలో వేసుకునే టాబ్లెట్ ల రూపం లో , ఎక్కువ కాలం అంటే నెలలూ , సంవత్సరాలూ కనుక తీసుకుంటూ ఉంటే , కొన్ని ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ లు కలుగుతాయి. 
1. బరువు పెరగడమూ 
2. అధిక రక్త పీడనం కలగడమూ 
3. మధుమేహం వచ్చే రిస్కు ఎక్కువ అవడమూ ,
4. శుక్లాలు అంటే కేటరాక్ట్  రిస్కు ఎక్కువ అవడమూ 
5. గ్లకోమా రిస్కు ఎక్కువ అవడమూ 
6. చర్మం పలుచబడి సులభం గా చర్మం ఎర్ర గా అవడమూ జరుగుతాయి 
7. కండరాలు బలహీన పడడం కూడా గమనించ వచ్చు .
8.ఎముకలు పలుచ బడి , ఆస్టియో పోరోసిస్ కలగడం.
  
సైడ్ ఎఫెక్ట్ లు తగ్గించుకోవడం , లేదా నివారించుకోవడానికి ఏం చేయాలి మరి ?  
ఆస్త్మా వస్తూ ఉంటే  మందులు వాడడం తప్పని సరే కదా ! మరి సైడ్ ఎఫెక్ట్ లు ఎట్లా తగ్గించు కోవడం అంటే
 1. ఆస్త్మా మందులను నిర్ణీత సమయాలలో , నిర్ణీత డోసు లలోనే , స్పెషలిస్ట్ డాక్టర్ సలహా ఖచ్చితం గా పాటిస్తూ , తీసుకుంటూ ఉండాలి.
2. ప్రతి ఇన్హేలర్ మందు నూ , దానిని తీసుకునే విధానం మీద అవగాహన కలిగి ఉండాలి , మందు వాడే ముందే ! ఎందుకంటే సరి అయిన పధ్ధతి లో తీసుకోక పొతే ,శరీరం లోకి ప్రవేశించే మందు పరిమాణం తగ్గి పోయి , ఆస్త్మా లక్షణాలు ఉపశమనం కలగక పోవచ్చు. సరి అయిన పధ్ధతి లో మందు తీసుకోక పోవడం, ఆస్త్మా కంట్రోలు లో లేక పోవడానికి ,  ఒక అతి సాధారణ కారణం , ఈ పరిస్థితి లో మందు ఎక్కువ సార్లు , ఎక్కువ మోతాదు లో తీసుకునే రిస్కు ఏర్పడుతుంది , 
3. ఆస్త్మా ఉన్నవారు స్మోకింగ్ చేయడం పూర్తి గా నిషిద్ధం. ఆస్త్మా ఉన్న వారు స్మోకింగ్ చేయడం , మంటలను, పెట్రోలు పోసి ఆర్పడానికి ప్రయత్నించినట్టే ! 
4. సమతుల్యమైన పోషకాహారాన్ని రోజూ తినడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండడం కూడా  సైడ్ ఎఫెక్ట్ లను చాలా వరకూ తగ్గించడమే కాకుండా , నివారణ కూడా సంభవం ఆవ వచ్చు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

5. ఆస్త్మా చికిత్సా సూత్రాలేంటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 22, 2013 at 10:51 ఉద.

5. ఆస్త్మా  చికిత్సా సూత్రాలేంటి ?

Fig5

ఆస్త్మా  వ్యాధి ఏమిటి , అది ఏ పరిస్థితులలో వస్తుంది , దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి అనే విషయాలు క్రితం టపాలలో తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు ఆస్త్మా వ్యాధి చికిత్స లో మూల సూత్రాలు తెలుసుకుందాం ! వీటిని ప్రత్యేకించి ఆస్త్మా ఉన్న వారే కాకుండా , వారి తలి దండ్రులు , బంధువులు , స్నేహితులు కూడా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే చికిత్స లో వారి సహాయం, సహకారం కూడా ఆస్త్మా ఉన్న వారికి ఏదో ఒక సమయం లో అవసరం ఉండ వచ్చు !  
ఆస్త్మా వ్యాధిలో , మునుపే తెలుసుకున్నట్టు , ఊపిరి తిత్తులలో ఉండే అతి సూక్ష్మ కండరాలు వీటినే బ్రాంకియల్ స్మూత్ మసుల్ అంటారు ఆ కండరాలు బిగుతు గా అవుతాయి  ఆ పరిస్థితిని బ్రాంకో   స్పాసమ్ అంటారు !  అట్లా ఆ కండరాలు బిగుతు గా అవడం వల్ల , ఊపిరి తిత్తులలో గాలి శులభం గా ప్రవేశించ లేక పోవడం , ముఖ్యం  గా గాలి బయటకు వెళ్ళడం కూడా తీవ్రం గా అవరోధం గా ఉండి  ఆస్త్మా ఎటాక్ గా పరిణమిస్తుంది ! పై విషయాలు ఎందుకు తెలుసుకోవాలి ? అంటే ,  చికిత్స లో ప్రధానం గా ఈ బ్రాంకియల్ స్మూత్ మసుల్ ను వ్యాకోచించ పరిచే మందును ఇన్హేలర్ రూపం లో ఇస్తారు !ఈ మందు, ఊపిరితిత్తులలో ఉండే బ్రాంకస్ ను వ్యాకోచ పరుస్తుంది కనుక దీనిని బ్రాంకో డై లేటర్ మందు అని అంటారు ! ( broncho dilator ) వీటికి ఇంకో పేరు, బీటా టూ ఎగోనిస్ట్ మందులు ( beta 2 agonists ) ( ఉదాహరణ కు సాల్ బ్యూ టమాల్ , టె ర్ బ్యూ టలిన్ ఇన్హేలర్ మందులు ). ఆస్త్మా చికిత్స లో ప్రధానం గా రెండు రకాల ఇన్హేలర్ మందులు అవసరమవుతాయి 
1. ఉపశమనానికి వాడే ఇన్హేలర్ లు. వీటినే రిలీవర్ ఇన్హేలర్ లు అని అంటారు.
పైన ఉదహరించిన బ్రాంకో డై లేటర్ ఇన్ హేలర్ లు ఈ కోవ కు చెందినవే !  ఇవి త్వరగా ,ఊపిరితిత్తులలో ఉండే స్మూత్ మసుల్ ను వ్యాకోచింప చేసి , ఆ కండరాల బిగుతును వదులు చేసి , ఆస్త్మా ఉపశమనం కలిగిస్తాయి ! దానితో మళ్ళీ శ్వాస తీసుకోవడం సులువు అవుతుంది. ఈ రకమైన ఇన్హేలర్ మందులను వారానికి  రెండు మూడు సార్ల కంటే ఎక్కువ గా తీసుకో కూడదు ! అట్లా తీసుకునే అవసరం కలిగినప్పుడు , స్పెషలిస్టు ను సంప్రదించడం మంచిది ! ఎందుకంటే , ఆ పరిస్థితి , ఆస్త్మాతీవ్రత ను తెలియ చేస్తుంది ! 
2. నివారణకు వాడే ఇన్హేలర్ లు వీటినే ప్రివెంటివ్ ఇన్హేలర్ లు అని అంటారు . 
ఈ రకమైన ఇన్హేలర్ లు ఆస్త్మా ఎటాక్ ను నివారించడానికి వాడే ఇన్హేలర్లు ! వీటిని , ఆస్త్మా ఎటాక్ లు వారం లో రెండు కన్నా ఎక్కువ గా వస్తే కానీ , ఉదయమే లేవడం ఆస్త్మా తో లేవడం జరుగు తున్నప్పుడు కానీ తీసుకోవాలి ! ఎందుకంటే , ఆస్త్మా లో ఊపిరి తిత్తులు ” వాచి పోయినట్టు ” అవుతాయి. ఆ పరిస్థితి ని ఇన్ ఫ్లమేషన్ అని అంటారు. ఇన్ ఫ్లమేషన్ ఉన్నప్పుడు  ఊపిరితిత్తులలో గాలి సరిగా పోలేక , అది ఆస్త్మాకు దారి తీయ వచ్చు. అందుకని కూడా ఆస్త్మా తరచూ వచ్చే రిస్కు ఉంటుంది ! ఈ రకమైన ఇన్హేలర్ లు తక్షణ నివారణ కు కాకుండా, కాల క్రమేణా, అంటే కొన్ని రోజులలోనో , వారాలలోనో , ఊపిరి తిత్తులలో ఇంఫ్లమేషన్ ను తగ్గించి , తద్వారా ఆస్త్మా వచ్చే రిస్కు ను తగ్గిస్తాయి. సామాన్యం గా ఈ ఇన్హేలర్ లు స్టీరాయిడ్ మందులు ఉన్నవి అయి ఉంటాయి. 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

4. ఆస్త్మా ఎటాక్ ను ఎట్లా గుర్తించాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 21, 2013 at 8:22 సా.

4. ఆస్త్మా  ఎటాక్ ను ఎట్లా గుర్తించాలి ?

ఆస్త్మా లక్షణాలు ప్రధానం గా   శ్వాస తీసుకోవడం కష్టమవుతూ ఉండడం , చాతీ క్రమేణా బిగుతు గా అంటే టైట్ గా అవుతూ ఉండడం , ఇంకా శ్వాస సమయం లో పిల్లి కూతలు , దీనినే వీజ్ అంటారు , రావడం. 
పైన చెప్పిన ఈ మూడు లక్షణాలూ తీవ్రం గా ఉండి , ఈ క్రింది లక్షణాలు వాటికి తోడవుతే , దానిని ఆస్త్మా ఎటాక్ అని అంటారు !
1. ఇన్హేలర్ పని చేయక పోవడమూ 
2. పీల్చిన ఇన్హేలర్ ప్రభావం కొద్ది నిమిషాలే ఉండడమూ 
3. ఆస్త్మా లక్షణాలు తీవ్రం అవడమూ
4. శ్వాస కష్టమవుతూ , నిద్ర కోల్పోవడమూ , భోజనం సరిగా చేయలేక పోవడమూ , కనీసం కొన్ని నిమిషాలైనా మాట్లాడ లేక పోవడమూ ! ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు , ఆస్త్మా వ్యాధి ఉన్న వారు వెంటనే, వారి తలి దండ్రుల కు కానీ , బంధువులకు కానీ , స్నేహితులకు కానీ తెలియ చేసి , అత్యవసర సహాయం పొందాలి ! అశ్రద్ధ చేయక ! అట్లాగే దగ్గర ఉన్న తలిదండ్రులు , తోబుట్టువులు , బంధువులు , లేదా స్నేహితులు – ఎవరైనా సరే , ఆస్త్మా వచ్చిన వారిని ఒక ప్రశాంత ప్రదేశం లో కూర్చో బెట్టి ,వారిని ఆందోళన పడకూడదని , శాంత పరుస్తూ , వారి దగ్గర ఉన్న  ఇన్హేలర్ ఇచ్చి  ఆస్త్మా ఉపశమనానికి ప్రయత్నిస్తూనే , వెంటనే తగిన వైద్య సహాయానికి ప్రయత్నాలు చేయాలి ! కొంత మంది లో ఈ ఆస్త్మా పరిస్థితి ఏర్పడే సూచనలు కొన్ని రోజుల ముందు గానే తెలుస్తాయి !  వారు బ్లూ ఇన్హేలర్ కనుక తీసుకుంటూ ఉంటే , ఆ బ్లూ ఇన్హేలర్ ,సామాన్యం గా తీసుకునే సమయాల కన్నా ఎక్కువ గా తీసుకోవడం జరుగుతుంది ! ( బ్లూ ఇన్హేలర్ అంటే సాల్ బ్యూట మాల్ ఇన్హేలర్ – ఈ ఇన్హేలర్ లతో పాటుగా , మిగతా మందుల విషయాలు కూడా మనం వివరం గా తెలుసుకుందాం ముందు ముందు ! ) 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

3. ఆస్త్మా ను కనుక్కోవడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 20, 2013 at 12:09 సా.

3. ఆస్త్మా ను కనుక్కోవడం ఎట్లా ? 

 
క్రితం టపాలలో ఆస్త్మా అంటే ఏమిటి ? దానికి కారణాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు ఆస్త్మా ను కనుక్కోవడం ఎట్లా గో తెలుసుకుందాం ! ఆస్త్మా  ఊపిరితిత్తుల వ్యాధి కనుక , ఈ పరీక్షలు ప్రధానం గా ఊపిరితిత్తుల మీదే చేయబడతాయి !
సహజం గా మన ఊపిరితిత్తులు, మనం పీల్చే గాలిని లోపల ప్రవేశింప చేసి , మలిన పదార్ధాలు ఉన్న గాలిని బయటకు పంపుతాయి ! ఆస్త్మా వచ్చినపుడు ఈ చర్యలు,నిదానం గా జరగడమే కాకుండా , వంద శాతం జరగ కుండా , తగ్గి పోతూ ఉంటుంది !
స్పైరో మీటర్ పరీక్ష : ఈ పరీక్ష ముఖ్యం గా రెండు రకాల రీడింగ్ లు తీసుకుంటుంది   FEV 1 ( Forced Expiratory Volume in one second ) : అంటే ఒక సెకన్ లో మనము మన ఊపిరితిత్తులనుంచి ఎంత గాలిని బయటకు ఊద గలమో ఆ గాలి పరిమాణం. FVC ( Forced Vital Capacity )  : మొత్తం మనం ఎంత గాలిని బయటకు ఊద గలమో ఆ గాలి పరిమాణం ! ఈ రీడింగులు ఆరోగ్య వంతమైన వారికి ఒక సరాసరి పరిమాణం గా ఉంటుంది. కానీ ఆస్త్మా వచ్చిన వారిలో ఈ పరిమాణం తగ్గుతుంది అందుకే ఈ పరీక్ష లు !
పీక్ ఫ్లో  మీటర్ ( PEF )  : ఈ పరికరం నోటిలో పెట్టుకుని మన ఊపిరి తిత్తులలో ఉన్న గాలిని మనం ఎంత త్వరితం గా బయటకు ఊదగలమో  ఆ సమయాన్ని , పరిమాణాన్ని అంచనా కట్టి  ఆస్త్మా  పరిస్థితిని కూడా నిర్ధారిస్తారు ! ఆస్త్మా వ్యాధి ఉన్న వారు కూడా సామాన్యం గా ఆస్త్మా ఎటాక్ రాని సమయం లో ఊదగలిగే గాలిని , వారికి ఆస్త్మా ఎటాక్ వచ్చిన సమయం లో ఊద లేరు ! ఆ పరిస్థితులను పోల్చి చూసి , వారికి ఆస్త్మా లక్షణాల తీవ్రత ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు !
ఎలర్జీ పరీక్షలు : ఈ పరిక్షలలో , చర్మం మీద ఎలర్జీ కలిగించే సామాన్య పదార్ధాలను కొద్ది పరిమాణం లో ప్రవేశ పెట్టి , చర్మం లో వచ్చే మార్పులను గమనిస్తారు ! ఎలర్జీ కనుక తీవ్రం గా ఉంటే , చర్మం లో మార్పులు కూడా ఎక్కువ గా ఉంటాయి ! 
రక్త పరీక్షలు : సామాన్యం గా ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా , దాని ప్రభావం వల్ల , రక్త కణాలలో కొన్ని నిర్దిష్టమైన మార్పులు వస్తాయి ! ఎందుకంటే , మన రక్త కణాలు కేవలం రక్తం లో ఓల లాడుతూ ఉండవు ! ప్రతి రక్త కణానికీ కొన్ని ప్రత్యేక మైన విధులు ఉంటాయి ! ఆ యా కణాలు ఆయా పనులను నిరంతరం చేస్తూ , శరీరాన్ని ముట్టడి చేసే వివిధ ఇన్ఫెక్షన్ లను ఎదుర్కుంటూ శరీరాన్ని ఆరోగ్యం గా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి ! ఈ ప్రక్రియ లో కొన్ని కణాల సంఖ్య ఎక్కువ అవడమూ , కొన్ని కణాలు తక్కువ అవడమూ జరుగుతూ ఉంటుంది ! అందువలన రక్త పరీక్షలు చేయించుకోవడం రోగ నిర్ధారణకు ఉపయోగ కరం ! 
ఉమ్మి పరీక్ష : ఆస్త్మా వచ్చిన వారి ఉమ్మి లో వివిధ కణాలతో పాటుగా , ఇన్ఫెక్షన్ కారక క్రిములు కూడా కనుక్కోవచ్చు అందుకని ఉమ్మి పరీక్ష కూడా ముఖ్యం. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

2. ఆస్త్మా కారణాలేంటి ?:

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 18, 2013 at 8:22 సా.

2. ఆస్త్మా  కారణాలేంటి ?:

 
ఆస్త్మా  కు ఖచ్చితం గా ఒక కారణం అంటూ ఏమీ లేదు.  జన్యువుల లోపం అంటే జీన్స్ లో లోపాలు ఉండి , ఆ లోపాలకు పరిసర వాతావరణం లో మార్పులు కూడా తోడ వుతే , ఆస్త్మా  పరిస్థితి వస్తుంది. 
1. కుటుంబం లో, ఆస్త్మా వ్యాధి ఉన్న వారికీ , లేదా హే ఫివర్ , లేదా ఎక్జిమా , కొన్ని రకాల ఆహార పదార్ధాలు తింటే పడక పోవడం ఉన్న వారికి కూడా ఈ ఆస్త్మా వ్యాధి వచ్చే అవకాశాలు మెండు. 
2. చిన్న వయసులో, అంటే బాల్యం లో ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ తరచూ వచ్చి బాధ పడిన చిన్నారులు పెద్దయాక వారికి ఆస్త్మా వచ్చే రిస్కు ఎక్కువ గా ఉంటుంది. 
3. శిశువు గర్భం లో తొమ్మిది నెలలూ నిండకుండా నే కనుక జన్మించినా , లేదా 
4. జన్మించిన శిశువు పుట్టగానే ఉండవలసిన బరువు కన్నా తక్కువ గా ఉన్నా కూడా ఆస్త్మా రావచ్చు. 
5. శిశువు, పిండ దశ లో ఉన్నపుడు కానీ , లేదా శిశువు జన్మించాక ,పెరుగుతూ ఉన్నపుడు కానీ , తల్లి గానీ , వారితో వారి ఇంట్లో ఉండే తండ్రి కానీ , స్మోకింగ్ చేస్తూ ఉంటే కూడా ఆస్త్మా  శిశువుకు వచ్చే రిస్కు హెచ్చు గా ఉంటుంది. దీనికి కారణం తెలుసుకోవడం బ్రహ్మ విద్య ఏమీ కాదు కదా ! ఎందుకంటే కనీసం మూడు వేల రకాలైన విష పదార్ధాలు పొగాకు పొగ లో ఉంటాయి !  ఆ విషతుల్య పదార్ధాలు పిండం లో కానీ పెరుగుతున్న శిశువు రక్తం లో కానీ ప్రవేశించితే , పెరుగుదల దశలో ఎక్కువ గా హానికరం గా మారుతాయి శిశువు వివిధ అవయవాల మీద ! దానితో  ఆస్త్మా  రిస్కు ఎక్కువ అవుతుంది ! 
ఆస్త్మా ట్రిగ్గర్ లు ఏమిటి ? 
తుపాకి కి ట్రిగ్గర్ ఉంటుంది. అంటే మీట ఆ మీట లేదా ట్రిగ్గర్ ను ఒకసారి నొక్కి పడితే, తుపాకి పేలుతుంది. అదే విధం గా మన లో వచ్చే వివిధ రోగాలకు ట్రిగ్గర్ లు ఉంటాయి ! అంటే ఆయా ట్రిగ్గర్ లు ఆ యా వ్యాధులను వెంటనే కలిగించ దానికి కారణమవుతాయి !
ఇప్పుడు ఆస్త్మా కు ట్రిగ్గర్ లు ఏమిటో చూద్దాము !
1. వైరస్ లు దాడి చేసి కలిగించే శ్వాస కోశ సంబంధ మైన వ్యాధులు. 
2. వాతావరణం లో ఉండే పుప్పొడి , అంటే పోలెన్ , లేదా ఇంట్లో పెరిగే కుక్కలు , లేదా పిల్లుల  జుట్టు , లేదా పక్షులు ఇంట్లో పెరుగుతూ ఉంటే , లేదా ఇంకా సామాన్యం గా , పక్షుల ఈకలతో చేసిన తలగడ లు పెట్టుకుంటే కూడా ( పిల్లో లు ) ఆస్త్మా ఎటాక్ లు ఎక్కువ అయే రిస్కు ఉంది !  ( కారణం : పైన చెప్పినవన్నీ ఎలర్జీ కలిగించే పదార్ధాలు గా పనిచేసి , ఆస్త్మా  కలిగిస్తాయి ! ) 
3. వాతావరణ కాలుష్యం :  పెట్రోలు , డీ జల్  కాలినపుడు గాలిలో విడుదల అయే వివిధ విష పదార్ధాలు , ( వాటి పొగ లో ఉంటాయి ) ఇంకా సిగరెట్ పొగలో ఉండే విష పదార్ధాలు కూడా ఆస్తమా కలిగిస్తాయి !
4. మందు బిళ్ళలు : సామాన్యం గా వేసుకునే మందు బిళ్ళలు ( యాస్పిరిన్, ఐ బూ ప్రోఫెన్ , ) కూడా ఆస్తమా కారకాలు !
5. తీవ్రమైన భావోద్వేగాలు : విపరీతం గా భావోద్వేగం చెందినపుడు , లేదా నవ్వినపుడు కూడా ఆస్తమా ( ఉన్న వారిలో ) వచ్చే రిస్కు ఉంటుంది. 
6. వ్యాయామం తో కూడా ఆస్తమా రావచ్చు. 
7. శుభ్రమైన గాలీ వెలుతురూ సోకకుండా ఉన్న గదులలో ఎక్కువ సమయం గడిపే వారికి కూడా ఆస్తమా రిస్కు హెచ్చు ! ఎందుకంటే చీకటి గా ఉంది సూర్య రశ్మి సోకని ప్రదేశాలలో ఫంగస్ లు పెరుగుతాయి ! ఈ ఫంగస్ లు చాలా చిన్న పరిమాణం లో ఉండడమే కాకుండా , వాటి స్పోరు లు కూడా అతి చిన్న పరిమాణం లో ఉంది ( అంటే కంటికి కనిపించనంత సూక్ష్మ పరిమాణం లో ఉండి ) పీల్చే గాలి ద్వారా ఊపిరి తిత్తులను చేరుకొని ఆస్తమా కారకం అవుతాయి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ఆస్థమా ఏమిటి.1. ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 16, 2013 at 2:22 సా.

ఆస్థమా  ఏమిటి. 1. ?

 
ఆస్థమా లేక ఆస్త్మా  ఒక ఊపిరి తిత్తులకు సంబంధించిన  దీర్ఘ వ్యాధి !  దీనిని బ్రాంకియల్ ఆస్త్మా అని కూడా అంటారు ! కనీసం రెండు కోట్ల మంది భారతీయులు ఈ ఆస్త్మా వ్యాధి తో సతమతం అవుతున్నారు !   ఇది దీర్ఘ కాల వ్యాధి అయినా కూడా , తరచు గా లక్షణాలు ఉధృతం అవుతూ ఉంటాయి. అప్పుడు ఆ పరిస్థితిని  ఆస్త్మా ఎటాక్ అని అంటారు ! 
ఆస్థమా పరిస్థితి లో ఏమి జరుగుతుంది ? 
పై చిత్రం గమనించండి. మన ఊపిరి తిత్తులు ముక్కు తో మొదలై ఛాతీలో రెండు వైపులా ఊపిరితిత్తులు గా ఏర్పడతాయి.  మనం పీల్చే గాలి ప్రయాణం చేసే రూట్ ను కనుక పరిశీలిస్తే, ముక్కు లోనుంచి , శ్వాస వాహిక లేదా ట్రాకియా ( గాలి గొట్టం ) ద్వారా రెండు బ్రాంకస్ లు రెండు వైపులా విడిపోయి రెండు ఊపిరితిత్తులలోకీ వెళుతుంది. ఒక మహా వృక్షం కనుక కాండము, శాఖలూ , చివరికి ఆకులు గా ఎట్లా విభజించ బడుతుందో , ఊపిరితిత్తులు కూడా అదే విధం గా నిర్మాణం అయి ఉంటాయి !  గమనించ వలసినది , ఈ బ్రాంకస్  లూ , బ్రాంకియోలై  లూ కేవలం  లోహం తో చేసిన గొట్టాల లాగా ఉండవు ! అవి సంకోచం , వ్యాకోచం చెందుతూ ఉంటాయి ! అంటే ఆ గొట్టాల వ్యాసం చిన్నది గానూ పెద్దది గానూ మారుతూ ఉంటుంది !  అంటే ఈ గొట్టాలు రబ్బరు గొట్టాల లాగా సాగుతూ కుంచించుకు పోతూ ఉంటాయి ! దీనికి కారణం , ఈ గొట్టాలలో ఉండే  కండరాల నిర్మాణమే ! అంటే  ఈ గొట్టాలు  నీటి పైపుల లాగా గట్టి గా లేకుండా రబ్బరు గోట్టాలలా సాగుతూ ఉండాలంటే ,ఈ కండరాల వ్యాకోచ సంకోచాలు జరుగుతూ ఉండడమే ! ఈ కండరాలు  అతి సున్నితమైనవి. 
మన దేహం లో కండరాలు ముఖ్యం గా నియంత్రిత కండరాలు, అనియంత్రిత కండరాలు అని రెండు రకాలు గా ఉంటాయి. అంటే మనం మన చేతులు కానీ నాలుక కానీ మనం నిర్ణయించుకుని కదిలిస్తేనే కదులుతాయి కదా ! మన కంట్రోలు లో ఉండడం వల్ల ఈ కండరాల ను నియంత్రిత కండరాలు అంటారు ! 
రెండో రకం కండరాలు గుండె , ఊపిరి తిత్తులలో అమరి ఉన్న కండరాలు : ఈ కండరాలు మన కంట్రోలు లో ఉండవు ! అవి అనియంత్రిత కండరాలు !  ఎందుకంటే , మనం ఆపుదామనుకున్నా , గుండె కండారాలు , కానీ ఊపిరి తిత్తుల కండరాలు కానీ పనిచేయడం  ఆపవు కదా ! 
ఊపిరి తిత్తులలో ఉండే కండరాలు , ఎక్కువ గా సంకోచం చెందడం వలననే ఆస్త్మా లక్షణాలు వస్తాయి !
ముఖ్యం గా మూడు లక్షణాలు : చాతీ బిగుతు గా అవ్వడం, అంటే టైట్ నెస్ , ఊపిరి తీసుకోవడం కష్టం అవుతూ ఉండడం , ఇంకా  పిల్లి కూతలు లాంటి శబ్దాలు రావడం , దీనినే వీజ్ అంటారు !,   కలుగుతాయి !
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

8.సైనస్ హెడేక్ లు ఎట్లా ఉంటాయి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 14, 2013 at 10:58 సా.

8.సైనస్ హెడేక్ లు ఎట్లా ఉంటాయి ?

సైనస్ హెడేక్ లు అంటే ? : . మానవ కపాలం లో కొన్ని  భాగాలలో ఎముకలు పూర్తి గా మందం గా లేకుండా ఉంటాయి. ఉదాహరణకు , ఒక ఇటుక ను తీసుకుంటే , ఆ ఇటుక అంతా  ఏమాత్రం సందు లేకుండా చేయబడి ఉంటుంది కదా ! అట్లాగే ! కానీ సైనస్ లు ఉన్న భాగాలలో , ఎముకలు పైకి మందం గా కనిపించినా కూడా , లోపల చిన్న చిన్న గాలి గదులు గా నిర్మాణం అయి ఉంటాయి ! ఉదాహరణ కు  తేనె తుట్టె లో గాలి గదులు ( తేనె తీయబడిన తరువాత ) నిర్మాణం అయి ఉన్నట్టు !
మరి ఈ సైనస్  లు హెడేక్ కు కారణం ఎట్లా అవుతాయి ?
ఈ విషయం తెలుసుకునే ముందు , ఈ సైనస్ లు ఎక్కడ ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం !  మానవ కపాలం అంటే స్కల్ లో  ముఖ భాగం లో, ఇంకా ఖచ్చితం గా చెప్పాలంటే ఫాల భాగం ( అంటే కనుబొమల మీద ఉన్న భాగం ) లో ఉన్న ఎముకలో రెండు  సైనస్ లు ఉంటాయి ( అంటే రెండు కనుబొమ్మల మీదా రెండు ) వీటిని ఫ్రాన్ ట ల్  సైనస్ లు అని అంటారు ! అట్లాగే ముక్కు లోపల ఉన్న ఎముకకు రెండు వైపులా రెండు సైనస్ లు ఉన్నాయి వీటిని ఎథ మాయిడల్  సైనస్ లు అంటారు ! పై దవడ లు రెండింటి లో ఉండే సైనస్ లను మాగ్జిలరీ సైనస్ లు అంటారు. ఈ మూడు జతల సైనస్ లు,   ముక్కుకు అనుసంధానమై ఉంటాయి ! అంటే వీటికి ముక్కు లోపలి భాగం తో కనెక్షన్ లు ఉంటాయి ! అంటే ముక్కు లోపలి పలుచటి పోర ఈ సైనస్ ల లోపలి భాగాలలో కూడా కప్పబడి ఉంటుంది !  పై చిత్రం లో చూడండి ! 
సామాన్యం గా ముక్కులో ఉండే లేదా వచ్చే ఇన్ఫెక్షన్ లు , ప్రత్యేకించి బాక్టీరియా లు కలిగించే ఇన్ఫెక్షన్లు  ముక్కులో ఉండే పలుచటి పొరను కూడా ఆక్రమిస్తాయి !అంటే ఈ పొర లో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది ! సరి అయిన సమయం లో సరి అయిన చికిత్స జరుగక పొతే , ఈ ఇన్ఫెక్షన్ కాస్తా ముక్కులో ఉండే పొర ద్వారా ఈ సైనస్ లలోకి ప్రవేశిస్తుంది ! ముక్కులో ఉండే ఇన్ఫెక్షన్ ను నిర్మూలించినా కూడా , సైనస్ లలో కూడా దాగి ఉన్న ఇన్ఫెక్షన్ నిర్మూలించ బడక , సైనస్ హెడేక్ లాగా పరిణమిస్తుంది ! ఖచ్చితం గా చెప్పాలంటే , సైనస్ హెడేక్ అంటే సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే తలనొప్పి ! అందుకే ఈ సైనస్ ఇన్ఫెక్షన్ ప్రత్యేకించి , తల వంచినప్పుడు ఎక్కువ గా వస్తుంది ! 
ఈ సైనస్ తలనొప్పి ఎట్లా ఉంటుంది ?
సైనస్ తలనొప్పి ముఖ్యం గా ముఖ భాగం లో వస్తుంది అంటే ఫేస్ లో ఎక్కువ గా వస్తుంది ! ఉదయం నిద్ర లేవగానే ఎక్కువ నొప్పి ఉండి , రోజు గడుస్తున్న కొద్దీ నొప్పి తగ్గు ముఖం పడుతుంది ! తలను అటూ ఇటూ కదిల్చినా , వంచినా , లేదా ఏవైనా బరువులు ఎత్తినా కూడా ఈ సైనస్ నొప్పి ఉధృతం అవుతుంది ! అట్లాగే , ఒక వెచ్చటి ప్రదేశం నుంచి అతి శీతల ప్రదేశం లోకి ప్రవేశించినపుడు కూడా ఈ సైనస్ హెడేక్ ఎక్కువ అవుతుంది ! ఎప్పుడూ ముక్కు కారుతూ ఉండడం కూడా ఒక లక్షణం కావచ్చు సైనస్ తలనొప్పికి ! అంటే జలుబు లక్షణాలు తగ్గినా కూడా కొంత మంది కి చాలా నెలల వరకూ ముక్కు కారుతూ ఉంటుంది ! కొన్ని సమయాలలో పసుపు లేదా ఆకు పచ్చ రంగులో ముక్కు లో ద్రవం ఉంటుంది , ఇట్లా జరిగితే అత్యవసరం గా డాక్టర్ కు చూపించుకోవాలి ! స్పెషలిస్ట్ డాక్టర్ తో ! ఎందుకంటే ,  రంగులో ఉన్న ముక్కు లో ద్రవం ఇన్ఫెక్షన్ తీవ్రత తెలియ చేస్తుంది !  ఆ ఇన్ఫెక్షన్ ను కనుక నిర్మూలించక పొతే, సైనస్ లకు పాకి , సైనస్ ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది ! మైగ్రేన్ హెడేక్ నూ , టెన్షన్ హెడేక్ నూ కూడా సైనస్ హెడేక్ లక్షణాలతో పోల్చ వచ్చు ! కొన్ని సమయాలలో వీటిని ఖచ్చితం గా గుర్తు పట్టడం కష్టం ! 
మరి చికిత్స ఏమిటి ? : 
ముక్కు కారడం తగ్గించడానికి  నేసల్ స్ప్రే లు వాడడం , యాంటీ హిస్టమినిక్ టాబ్లెట్ లు కానీ , స్ప్రే లు కానీ తీసుకోవడం , హ్యుమిడి ఫయర్ అనే పరికరం తో కొద్ది గా తేమ ఉన్న గాలిని పీల్చడం !  చేస్తే సైనస్ హెడేక్ కు ఉపశమనం కలుగుతుంది ! అవసరమైతే , యాంటీ బయాటిక్స్ కూడా వాడాలి ! సగం తీసుకున్నాక మానేయకుండా , కోర్సు పూర్తి చేయాలి ! లేక పొతే , బాక్టీరియా క్రిములు పూర్తి గా నిర్మూలించ బడక , మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ కలిగే రిస్కు ఉంటుంది !  స్పెషలిస్టు సలహా తప్పని సరిగా పాటించాలి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

7. మరి క్లస్టర్ హెడేక్ అంటే, ఏమిటి?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 10, 2013 at 6:19 సా.

7. మరి క్లస్టర్ హెడేక్ అంటే, ఏమిటి?

క్లస్టర్ హెడేక్ : 
ఈ క్లస్టర్ హెడేక్ లు కూడా భయంకరమైన తలనొప్పులు ఇవి సామాన్యం గా తలకు ఒక పక్క గా వస్తూ ఉంటాయి. ముఖ్యం గా ఆ భాగం లో  ఉన్న కంటి గుడ్డు వెనక భాగం లో నొప్పి తీవ్రం గా ఉంటుంది.  ఈ నొప్పులు అకస్మాత్తు గా మొదలవుతాయి. వీటి తీవ్రత మైగ్రేన్ తలనొప్పి కన్నా కూడా తీవ్రం గా ఉంటుంది ! సామాన్యం గా ఈ రకమైన నొప్పులు ఒకటి నుంచి మూడు సార్లు రావచ్చు రోజులో ! కొన్ని సమయాలలో , ఈ నొప్పులు వచ్చిన వారు , నిద్ర లేచేది కూడా ఇట్లాంటి నొప్పితోనే ! పదిహేను నుంచి అరవై నిమిషాలు ఈ నొప్పులు ఉంటాయి. ఇట్లా కొన్ని వారాలూ , నెలలూ కూడా ఈ నొప్పులు బాధించి  ” మీ ఏడుపు మీరు ఏడవండి ” అన్న రీతిగా కొంత విరామం అంటే కొన్ని నెలలు విరామం ఇచ్చాక , మళ్ళీ మీ పని పడతా అన్నట్టుగా ఈ క్లస్టర్ హెడేక్ లు వస్తాయి. ఈ క్లస్టర్ హెడేక్ తీవ్రం గా ఉంటే , చీకాకు పడడమూ , ఏకాగ్రత లోపించ డమూ , ఉంటున్న గది లో కాలు కాలిన పిల్లి లా తిరగడమూ , నొప్పి ఇంకా భరించ లేనంత ఎక్కువ గా ఉంటే , గోడకు తల కొట్టుకోవడమూ , జరుగుతుంది ! 
ఎవరు ఈ క్లస్టర్ హెడేక్ బారిన ఎక్కువ గా పడతారు ? 
ప్రతి వెయ్యి మందిలోనూ ఒక్కరికి కనీసం ఈ రకమైన నొప్పులు వస్తాయి !  ఈ నొప్పులు వచ్చే ప్రతి పదిమంది లోనూ ఎనిమిది మంది పురుషులే ! అందులోనూ ,స్మోకింగ్ చేసే పురుషులే ! ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ , స్మోక్ లో ఉన్న అనేక విష తుల్యమైన పదార్ధాలు , మెదడు లో అతి సున్నితమైన భాగాలను ముట్టడి చేసి ఈ రకమైన నొప్పులకు కారణమవుతుందని భావించడం జరుగుతుంది. ఈ స్మోకింగ్ చేసే పురుషులు మద్యం కూడా తాగుతుంటే , క్లస్టర్ హెడేక్ వచ్చే రిస్కు చాలా ఎక్కువ అవడమే కాకుండా , విరామం ఎక్కువ లేకుండా , తరచు గా ఈ రకమైన నొప్పులు ముట్టడి చేస్తాయి వారిని ! 
చికిత్స ఏమిటి ? : వెంటనే చికిత్స అయితే , సుమా ట్రి ప్టాన్ అనే మందు నోటిలో కానీ , ఇంజెక్షన్ రూపం లో కానీ తీసుకుంటే ఈ నొప్పి తగ్గుముఖం పడుతుంది !ఇంకా ప్రాణవాయువు ను సిలిండర్ లలో తీసుకుని దానిని ఇంటి దగ్గర పీల్చడం వల్ల కూడా ఉపశమనం జరుగుతుంది ! కానీ భారత దేశం లో ప్రజలు , ఈ ప్రాణ వాయువు సిలిండర్ లతో చాలా జాగ్రత్త వహించాలి ! ఎందుకంటే పొరపాటున కూడా సిలిండర్ దగ్గర కనుక అగ్గి పుల్ల వ వెలిగించినా , ( స్మోకింగ్ చేసే వారు ) లేదా కొన్ని సమయాలలో కేవలం లైటు స్విచ్ ఆన్ చేసినా కూడా అందులో ఉన్న నిప్పు రవ్వ సిలిండర్ ను పేల్చ గలదు ! ఈ క్లస్టర్ హెడేక్ నిర్ధారణ కోసం స్పెషలిస్టు ను తప్ప్పని సరిగా సంప్రదించాలి ! కేవలం స్వంత వైద్యాలు చేసుకోకుండా ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

6. నడి వయసులోవచ్చే తలనొప్పికి కారణాలు.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 9, 2013 at 2:31 సా.

6. నడి వయసులోవచ్చే  తలనొప్పికి  కారణాలు. 

 
క్రితం టపాలో చిన్న పిల్లలలో వచ్చే తలనొప్పి కి కారణాల గురించీ , వాటికి వెంటనే చికిత్స యొక్క అవసరం గురించీ తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు నడి వయసులో వచ్చే తలనోప్పులగురించి తెలుసుకుందాం ! 
1. సాధారణ కారణాలు :  పని వత్తిడి వల్లా , లేదా జలుబూ , దగ్గూ , లాంటి సామాన్య కారణాల వల్ల వచ్చే తలనొప్పి ఒకరకం గా ఉంటుంది ! పని వత్తిడి వల్ల వచ్చే తలనొప్పి , జ్వరం తో రాదు. మిగతా కారణాలలో జ్వరం కూడా ఉంటుంది. అంతే కాక వళ్ళు నొప్పులూ , ఆకలి లేక పోవడం కూడా ఉంటాయి !
మలేరియాలో అయితే , ఈ లక్షణాలు ఒక తరహాలో వస్తూ ఉంటాయి. అంటే మలేరియా లో కూడా రకాలు ఉంటాయి ముఖ్యం గా మూడు రకాలు ! ఆ రకాన్ని బట్టి, మొదటి రోజు పై లక్షణాలు ఉంటే , రెండో రోజు విడిచి మళ్ళీ మూడో రోజు పైన చెప్పిన లక్షణాలు ఒక రకమైన మలేరియాలో వస్తాయి ! అట్లాగే మిగతా రకాలలో కూడా రెండు రోజులు విడిచి మూడో రోజూ , నాలుగో రోజూ లక్షణాలు కనిపిస్తాయి ! దీనికి కారణం  మలేరియా సూక్ష్మ క్రిములు  ( ఇవి ప్లాస్మోడియం జాతి కి చెందినవి అని అంటారు ) ఒక నిర్ణీత సమయానికి రక్తం లోకి ఒక్క సారిగా ప్రవేశించడం వల్ల !  అదే కారణం వల్ల  తలనొప్పి కూడా నిరంతరం గా రాకుండా ఈ సమయాలలోనే వస్తూ ఉంటుంది !  ఈ లక్షణాలు గమనించిన వారు , కేవలం  క్రోసిన్ మాత్రలతో ఉపశమనం పొందుదామనుకుంటే పప్పులో కాలేసినట్టే ! వారు వెంటనే మలేరియా మాత్రల కోసం డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవడం ఉత్తమం !
2. పిడుగు లాంటి తలనొప్పి ( దీనిని ఆంగ్లం లో థన్ డ ర్ క్లాప్ హెడేక్ అంటారు ) : ఈ తలనొప్పి తీవ్రం గా ఒక్క సారిగా పిడుగు లా వచ్చి మీద పడుతుంది ! కేవలం కొద్ది సెకన్లు లేదా నిమిషాలలోనే ! అందుకనే ఆ పేరు వచ్చింది !  ముఖ్యం గా మెదడు లో రక్త నాళాలు చిట్లడం వల్ల ఈ రకమైన తలనొప్పి వస్తుంది దీనిని అప్పుడు సబారక్నాయిడ్  హెమరేజ్ అంటారు !  ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యసహాయం అత్యవసరం గా అందించాలి ! కంట్రోలు తప్పిన అధిక రక్త పీడనం కూడా ఈ రకమైన తలనొప్పికి కారణం అవుతుంది !  అప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోక పొతే , ఆ అధిక రక్త పీడనం మెదడు లోని అతి సున్నితమైన రక్తనాళాలను చిట్లింప చేసి , పక్షవాతానికి దారితీస్తుంది ! మెనింజైటిస్: మెదడు పొరలలో వచ్చే ఇన్ఫెక్షన్ కూడా తీవ్రమైన  తలనొప్పి కి కారణం అవవచ్చు. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

5. నిర్లక్ష్యం చేయ కూడని తలనొప్పులు.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our minds on జూన్ 4, 2013 at 10:51 ఉద.

5. నిర్లక్ష్యం చేయ కూడని తలనొప్పులు. 

 
తలనొప్పి సర్వ సాధారాణ మైన లక్షణం కావడం చేత ,  దానిని అశ్రద్ధ చేసి పట్టించుకోకుండా , తమ పనులు ( బాధ ను అనుభవిస్తూ కూడానే ) తాము చేసుకునే వారు చాలా మంది ఉంటారు.వారి అభిప్రాయం కొంత వరకూ యదార్ధమే ! ఎందుకంటే , తలనొప్పి సామాన్యం గా స్వల్పమైన కారణాల వల్ల వస్తుంది ! తాత్కాలికం గానే ఉంటుంది. ఉపశమనం కూడా త్వరిత గతిని ఉంటుంది. కొన్ని తలనొప్పులు ” నిజంగానే తలనొప్పులు ” అవుతాయి. ఆ తలనొప్పులను నిర్లక్ష్యం చేస్తే , కొత్త సమస్యలను కొని తెచ్చుకోవడమే అవుతుంది !వాటి గురించి కొంత తెలుసుకుందాం !
1. చిన్న పిల్లలలో వచ్చే తలనొప్పి : 
a ప్రమోద్ ఆరేళ్ళ వయసు ఉండి , చాలా చురుకు గానూ , తెలివి గానూ  ఉండే బాలుడు. కిండర్ గార్డెన్ నుంచి మారి , ప్రైమరీ స్కూల్ కు వెళ్ళడం మొదలు పెట్టిననాటి నుంచీ , చురుకు తనం తగ్గింది ! తరచూ తలనొప్పి అని చెప్పే వాడు , అమ్మతో , ఇంటికి వచ్చాక ! అమ్మ కొత్త స్కూల్ ఇష్టం లేక అట్లా చెబుతున్నాడనుకుంది !మిగతా లక్షణాలు ఏమీ లేవు !  అట్లా గే బుజ్జగించుతూ , స్కూల్ కు తీసుకు వెళ్తూ ఉండేది !  కానీ ప్రమోద్ తలనొప్పి తగ్గలేదు ! క్లాసులో వెనక లైను లో కూర్చుంటున్నాడు ! బోర్డు మీద రాసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్ప లేక పోతున్నాడు !  దానితో  రిజల్టు బాగా రావాలనే లక్ష్యమే  పెట్టుకుని , ప్రమోదు కు చీవాట్లు పెడుతున్నాడు టీచరు !   కానీ టీచరు కానీ , తల్లి కానీ , లోతుగా పరిశీలించి , సమస్య ను అర్ధం చేసుకోలేక పోయారు ! వెంటనే చిన్న పిల్లల మానసిక నిపుణు రాలి దగ్గరికి తీసుకు వెళ్ళారు !  అన్ని వివరాలూ కూ లంక షం గా పరిశీలించిన తరువాత ఆమె ”  ప్రమోద్ కు ఉన్న సమస్య ప్రధానం గా కంటి చూపు లో అవకతవక లు ఉన్నాయని !  అందుకే , బోర్డు మీద రాసినది చదవలేక పోతున్నాడని ! ఇంట్లో టీవీ చాలా దగ్గరగా చూస్తూ ఉండడం వల్ల దానికే అలవాటు పడి పోయాడని , క్లాసులో చివరి లైను లో కూర్చుని బోర్డు మీద రాసేది చూడడం కష్టం అవుతుందని ! అందుకే తలనొప్పి వస్తుందని ”  కూడా వివరించింది ! తల్లి ప్రమోద్ ను హత్తుకొని, తన పొరపాటు ను అనునయం గా ప్రమోద్ కు చెప్పి కళ్ళ  పరీక్ష చేయించడానికి సిద్ధం అయింది !
ఇక్కడ తల్లి దండ్రులకు పాఠం :  కేవలం తలనొప్పే అయినా చిన్న పిల్లలలో వచ్చే తలనొప్పిని అశ్రద్ధ చేయకూడదు ! 
b. చిన్న పిల్లలలో తక్కువ సమయం లో జ్వరమూ అంటే హై ఫీవర్  , తీవ్రమైన తలనొప్పి వచ్చి , వాంతులు చేసుకోవడమూ , ఏమీ తినక పోవడమూ చేస్తూ ఉంటే కూడా అశ్రద్ధ చేయకూడదు ! ఆ లక్షణాలు , మలేరియా లక్షణాలైనా , మెనింజైటిస్ లాంటి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ లైనా కావచ్చు !   
c. కొన్ని కొన్ని పడని ఆహార పదార్ధాలు మొదటి సారిగా తింటే , లేదా మళ్ళీ , తెలియకుండానే తింటే కూడా, చిన్న పిల్లలలో తీవ్రమైన తలనొప్పి కలగ వచ్చు ! అతి సూక్ష్మ పరిమాణం లో వివిధ చాక్లెట్ లలోనూ , పానీయాలలోనూ కలిపే , కలరెంట్ లు అంటే రంగు రాసాయనాలు ,లేదా రుచిని ఎక్కువ చేసే రసాయనాలు కూడా తలనొప్పి కి కారణం అవ వచ్చు ! 
d. చిన్న పిల్లలు ఆటల్లోనూ అల్లరి చేస్తున్నప్పుడు కూడా క్రింద పడి , తలకు దెబ్బలు తగిలించుకోవడం కూడా సామాన్యమే ! కానీ ఇట్లా తలకు దెబ్బ తగిలాక , తీవ్రంగా తలనొప్పి కలగడమూ , వాంతులు రావడమూ , జరిగితే , ఆ లక్షణాలు , తలదెబ్బ తీవ్రత ను తెలియ చేస్తాయి ! అత్యవసరం గా స్పెషలిస్టు సహాయం తీసుకోవాలి ఆ సమయాలలో , కేవలం తలనొప్పే కదా అని నిర్లక్ష్యం చేయక !
e .చిన్న పిల్లలు ఎక్కువ సమయం ఎండలో తిరిగినా , లేదా ఆడినా కూడా  ఎండ దెబ్బ లేదా వడ దెబ్బ తగిలి తలనొప్పి వస్తుంది, అప్పుడు అత్యవసరం గా ప్రధమ చికిత్స చేయాలి. ఆశ్రద్ధ చేసి పరిస్థితి ని విషమం చేసుకో కూడదు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: