3. ఆస్త్మా ను కనుక్కోవడం ఎట్లా ?
క్రితం టపాలలో ఆస్త్మా అంటే ఏమిటి ? దానికి కారణాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు ఆస్త్మా ను కనుక్కోవడం ఎట్లా గో తెలుసుకుందాం ! ఆస్త్మా ఊపిరితిత్తుల వ్యాధి కనుక , ఈ పరీక్షలు ప్రధానం గా ఊపిరితిత్తుల మీదే చేయబడతాయి !
సహజం గా మన ఊపిరితిత్తులు, మనం పీల్చే గాలిని లోపల ప్రవేశింప చేసి , మలిన పదార్ధాలు ఉన్న గాలిని బయటకు పంపుతాయి ! ఆస్త్మా వచ్చినపుడు ఈ చర్యలు,నిదానం గా జరగడమే కాకుండా , వంద శాతం జరగ కుండా , తగ్గి పోతూ ఉంటుంది !
స్పైరో మీటర్ పరీక్ష : ఈ పరీక్ష ముఖ్యం గా రెండు రకాల రీడింగ్ లు తీసుకుంటుంది FEV 1 ( Forced Expiratory Volume in one second ) : అంటే ఒక సెకన్ లో మనము మన ఊపిరితిత్తులనుంచి ఎంత గాలిని బయటకు ఊద గలమో ఆ గాలి పరిమాణం. FVC ( Forced Vital Capacity ) : మొత్తం మనం ఎంత గాలిని బయటకు ఊద గలమో ఆ గాలి పరిమాణం ! ఈ రీడింగులు ఆరోగ్య వంతమైన వారికి ఒక సరాసరి పరిమాణం గా ఉంటుంది. కానీ ఆస్త్మా వచ్చిన వారిలో ఈ పరిమాణం తగ్గుతుంది అందుకే ఈ పరీక్ష లు !
పీక్ ఫ్లో మీటర్ ( PEF ) : ఈ పరికరం నోటిలో పెట్టుకుని మన ఊపిరి తిత్తులలో ఉన్న గాలిని మనం ఎంత త్వరితం గా బయటకు ఊదగలమో ఆ సమయాన్ని , పరిమాణాన్ని అంచనా కట్టి ఆస్త్మా పరిస్థితిని కూడా నిర్ధారిస్తారు ! ఆస్త్మా వ్యాధి ఉన్న వారు కూడా సామాన్యం గా ఆస్త్మా ఎటాక్ రాని సమయం లో ఊదగలిగే గాలిని , వారికి ఆస్త్మా ఎటాక్ వచ్చిన సమయం లో ఊద లేరు ! ఆ పరిస్థితులను పోల్చి చూసి , వారికి ఆస్త్మా లక్షణాల తీవ్రత ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు !
ఎలర్జీ పరీక్షలు : ఈ పరిక్షలలో , చర్మం మీద ఎలర్జీ కలిగించే సామాన్య పదార్ధాలను కొద్ది పరిమాణం లో ప్రవేశ పెట్టి , చర్మం లో వచ్చే మార్పులను గమనిస్తారు ! ఎలర్జీ కనుక తీవ్రం గా ఉంటే , చర్మం లో మార్పులు కూడా ఎక్కువ గా ఉంటాయి !
రక్త పరీక్షలు : సామాన్యం గా ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా , దాని ప్రభావం వల్ల , రక్త కణాలలో కొన్ని నిర్దిష్టమైన మార్పులు వస్తాయి ! ఎందుకంటే , మన రక్త కణాలు కేవలం రక్తం లో ఓల లాడుతూ ఉండవు ! ప్రతి రక్త కణానికీ కొన్ని ప్రత్యేక మైన విధులు ఉంటాయి ! ఆ యా కణాలు ఆయా పనులను నిరంతరం చేస్తూ , శరీరాన్ని ముట్టడి చేసే వివిధ ఇన్ఫెక్షన్ లను ఎదుర్కుంటూ శరీరాన్ని ఆరోగ్యం గా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి ! ఈ ప్రక్రియ లో కొన్ని కణాల సంఖ్య ఎక్కువ అవడమూ , కొన్ని కణాలు తక్కువ అవడమూ జరుగుతూ ఉంటుంది ! అందువలన రక్త పరీక్షలు చేయించుకోవడం రోగ నిర్ధారణకు ఉపయోగ కరం !
ఉమ్మి పరీక్ష : ఆస్త్మా వచ్చిన వారి ఉమ్మి లో వివిధ కణాలతో పాటుగా , ఇన్ఫెక్షన్ కారక క్రిములు కూడా కనుక్కోవచ్చు అందుకని ఉమ్మి పరీక్ష కూడా ముఖ్యం.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !