6. నడి వయసులోవచ్చే తలనొప్పికి కారణాలు.
క్రితం టపాలో చిన్న పిల్లలలో వచ్చే తలనొప్పి కి కారణాల గురించీ , వాటికి వెంటనే చికిత్స యొక్క అవసరం గురించీ తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు నడి వయసులో వచ్చే తలనోప్పులగురించి తెలుసుకుందాం !
1. సాధారణ కారణాలు : పని వత్తిడి వల్లా , లేదా జలుబూ , దగ్గూ , లాంటి సామాన్య కారణాల వల్ల వచ్చే తలనొప్పి ఒకరకం గా ఉంటుంది ! పని వత్తిడి వల్ల వచ్చే తలనొప్పి , జ్వరం తో రాదు. మిగతా కారణాలలో జ్వరం కూడా ఉంటుంది. అంతే కాక వళ్ళు నొప్పులూ , ఆకలి లేక పోవడం కూడా ఉంటాయి !
మలేరియాలో అయితే , ఈ లక్షణాలు ఒక తరహాలో వస్తూ ఉంటాయి. అంటే మలేరియా లో కూడా రకాలు ఉంటాయి ముఖ్యం గా మూడు రకాలు ! ఆ రకాన్ని బట్టి, మొదటి రోజు పై లక్షణాలు ఉంటే , రెండో రోజు విడిచి మళ్ళీ మూడో రోజు పైన చెప్పిన లక్షణాలు ఒక రకమైన మలేరియాలో వస్తాయి ! అట్లాగే మిగతా రకాలలో కూడా రెండు రోజులు విడిచి మూడో రోజూ , నాలుగో రోజూ లక్షణాలు కనిపిస్తాయి ! దీనికి కారణం మలేరియా సూక్ష్మ క్రిములు ( ఇవి ప్లాస్మోడియం జాతి కి చెందినవి అని అంటారు ) ఒక నిర్ణీత సమయానికి రక్తం లోకి ఒక్క సారిగా ప్రవేశించడం వల్ల ! అదే కారణం వల్ల తలనొప్పి కూడా నిరంతరం గా రాకుండా ఈ సమయాలలోనే వస్తూ ఉంటుంది ! ఈ లక్షణాలు గమనించిన వారు , కేవలం క్రోసిన్ మాత్రలతో ఉపశమనం పొందుదామనుకుంటే పప్పులో కాలేసినట్టే ! వారు వెంటనే మలేరియా మాత్రల కోసం డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవడం ఉత్తమం !
2. పిడుగు లాంటి తలనొప్పి ( దీనిని ఆంగ్లం లో థన్ డ ర్ క్లాప్ హెడేక్ అంటారు ) : ఈ తలనొప్పి తీవ్రం గా ఒక్క సారిగా పిడుగు లా వచ్చి మీద పడుతుంది ! కేవలం కొద్ది సెకన్లు లేదా నిమిషాలలోనే ! అందుకనే ఆ పేరు వచ్చింది ! ముఖ్యం గా మెదడు లో రక్త నాళాలు చిట్లడం వల్ల ఈ రకమైన తలనొప్పి వస్తుంది దీనిని అప్పుడు సబారక్నాయిడ్ హెమరేజ్ అంటారు ! ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యసహాయం అత్యవసరం గా అందించాలి ! కంట్రోలు తప్పిన అధిక రక్త పీడనం కూడా ఈ రకమైన తలనొప్పికి కారణం అవుతుంది ! అప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోక పొతే , ఆ అధిక రక్త పీడనం మెదడు లోని అతి సున్నితమైన రక్తనాళాలను చిట్లింప చేసి , పక్షవాతానికి దారితీస్తుంది ! మెనింజైటిస్: మెదడు పొరలలో వచ్చే ఇన్ఫెక్షన్ కూడా తీవ్రమైన తలనొప్పి కి కారణం అవవచ్చు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !