14. డయాబెటిస్ లో స్ట్రోకు ( పక్ష వాతం ) రావచ్చా ?:
డయాబెటిస్ వ్యాధి లో వ్యాధి తీవ్రం గా ఉంటే , అంటే , చాలా సంవత్సరాలు గా ఉండి , మందులకు లొంగకుండా మొండికేసిన డయాబెటిస్ లో పక్ష వాతం లేదా స్ట్రోకు వచ్చే అవకాశాలు , డయాబెటిస్ లేని వారి లో స్ట్రోకు , పక్ష వాతం వచ్చే అవకాశాల కంటే ఎక్కువ గా ఉంటాయి ! ఈ అవకాశాలు కనీసం రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ గా ఉంటాయి , డయాబెటిస్ ఉన్న వారిలో ! కానీ తగు జాగ్రత్తలు ఎప్పుడూ తీసుకుంటూ ఆరోగ్యం చూసుకుంటూ ఉంటే , డయాబెటిస్ ఉన్నా కూడా , ఈ అవకాశాలను తగ్గించు కోవచ్చు ! అందుకే కదా ! ఈ వివరాలన్నీ తెలియచేసేది
మరి మీలో పక్ష వాతం , లేదా స్ట్రోకు వచ్చే రిస్కు ఎక్కువ ఉందో లేదో ఎట్లా తెలుసుకోగలరు ?
1. మీ వయసు యాభై అయిదు దాటితే
2. మీరు ఊబకాయం కలిగి ఉంటే అంటే ఒబీసిటీ,
3. మీ కుటుంబం లో ఎవరికైనా పక్ష వాతం వచ్చి ఉంటే,
4. మీరు స్మోకింగ్ చేస్తూ ఉంటే,
5. మీకు హై బీపీ , అధిక రక్త పీడనం ఉంటే
6. మీకు ఇంతకు ముందే మినీస్ట్రోకు లేదా TIA లేదా తాత్కాలిక పక్ష వాతం కనుక వచ్చి ఉన్నట్టయితే,
7. మీకు గుండె జబ్బులు వచ్చి ఉన్నట్టయితే ,
8. మీ కొలెస్ట రాల్ అతలా కుతలం అయి ఉంటే , అంటే HDL తక్కువ గానూ , LDL ఎక్కువ గానూ ఉన్నట్టయితే !,
గమనించండి పైన ఉన్న రిస్కులలో చాలా వరకూ మీ చేతులలో ఉన్నవే అంటే స్వయం కృతా లే ! అంటే వాటి జననం , వాటి కంట్రోలూ పూర్తి గా మీ ఆధీనం లోనే ఉంటాయి !
మరి పక్ష వాత సూచనలు ఏమిటి ?
1. శరీరం లో ఒక పక్క భాగాలన్నీ ఒక్క సారిగా బలహీనం అయి పోతూ ఉండడం లేదా ఉపయోగించ లేక పోవడం !
2. ఆకస్మికం గా మాట్లాడలేక పోవడం లేదా , మాట్లాడ డానికి ప్రయత్నిస్తే తడబడడం !
3. ఆకస్మికం గా కన్ఫ్యూజ్ అవడం , లేదా ఎదుటి వారు చెప్పేవి ఏవీ అర్ధం కాక పోవడం !
4. అకస్మాత్తుగా కళ్ళు తిరగడం , కాళ్ళ మీద స్థిమితం గా నిలవ లేక పోవడం లేదా నడక లో పట్టు కోల్పోవడం !
5. ఒక కంటిలో కానీ రెండు కళ్ళతో కానీ ఆకస్మికం గా చూపు బాగా తగ్గి పోవడం లేదా కోల్పోవడం
6. తీవ్రమైన తలనొప్పి రావడం,
7. ఒక వస్తువు కానీ , వ్యక్తి కానీ రెండు గా కనిపించడం !
పై సూచనలన్నీ ఒక వ్యక్తి లోనే రావు. కొన్ని సూచనలు కొందరి లో రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సూచనలు అందరూ తెలుసుకోవడం ఎందుకు మంచిదంటే ,శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందింది కదా ! అందుకు ! అంటే ఇప్పుడు పై సూచనలు ఎవరిలోనైనా గమనించిన వెంటనే కనుక నిపుణు లతో అంటే స్పెషలిస్టు లతో చికిత్స చేయించు కుంటే , పక్ష వాతాన్ని కూడా చాలా వరకూ నివారించి , చేతులూ కాళ్ళూ పడి పోకుండా నివారించవచ్చు ! అదే ఆధునిక వైద్య విజ్ఞాన మహిమ !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !